మంత్రానికి శక్తి ఉందా?

--ప్రఖ్య మధు బాబు

మంత్రం ఒక శబ్దం. మౌనంగా మనోవల్మీకంలో జరిగే మంత్రజపాలకి చింతకాయలు రాలుతాయా? ఈ ఆధునిక యుగంలో,బిజీలో, గజిబిజీలో మనోభావాలకి తావెక్కడ అనిపిస్తుంది! కానీ ఆశ్చర్యమేమిటంటే ఒకపక్కన మన భారతీయ సంస్కృతి గురించి మనమే యోచిస్తుంటే ఇంకో పక్క ప్రపంచమంతటా రోజురోజుకి వెలుస్తున్న యోగ ధ్యాన కేంద్రాలు, వాటినిండా ఎందరో దేశ విదేశాల వారు మన అష్టాంగ మార్గాన్ని, ఆసనాలని, మంత్ర సాధనలని నేర్చుకుంటున్నారు. ఈ రంగాలలో బహుశా మనకన్నా వారే పురోగమిస్తున్నారేమో అనిపిస్తుంది. Art of living, Transcendental Meditation, ఇంకా ఎన్నో విశేషమైన పద్ధతులు ప్రపంచ వ్యాప్తమవుతున్నాయి.

మంత్రాలని గురించి మనం మాట్లాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలించాలి. మనం ఈ రోజు పాల సీసా నించి ప్లాస్మా టీవీ దాకా వాడుతున్నాం, ఆనందిస్తున్నాం. అందుకు మూలం రసాయనశాస్త్రంలో (Chemistry) మనం సాధించిన ప్రగతి అని అందరికీ తెలుసు. విచిత్రమేమిటంటే రసాయనశాస్త్రం ఒకప్పుడు రసవాదంతో (Alchemy) మొదలైంది. లోహాలని బంగారంగా మార్చాలన్న మానవ తపన తన చుట్టూవున్న మూలకాలని, లోహ సం యోగ ధర్మాలని అధ్యయనం జరిగేలా చేసింది, బంగారం చేయలేక పోయినా అదే ఈ రోజు బంగారం కన్నా విలువైన వైజ్ఞానిక ప్రగతిని ఇచ్చింది, మానవాళిని ఖండాంతర, గోళాంతర గతిలో తీసుకు వెడుతోంది. అందుకే అనిపిస్తుంది ఏ శాస్త్రాన్ని, విజ్ఞాన రంగాన్ని తక్కువ అంచనా వేయలేము అని.

మంత్రం మనోనిర్మితం.మనస్సుకి ఇంత శక్తి వుందా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా పెన్ను పక్కన పెట్టుకుని మర్చిపోయే మనుషులు హిప్నటైజ్ చేయబడ్డపుడు ఎంతో కాలం క్రితం జరిగిన చిన్న చిన్న సంఘటనలని జ్ఞాపకం చేసుకోగలగడం, పూస గుచ్చినట్లు చెప్పగలగడం పైగా మంచు గడ్డల మీద మంచం మీద పడుకున్నట్లు పడుకోగలగడం ఇవన్నీ మనసుకి సహజంగా వుండే మహాశక్తికి అతిచిన్న మచ్చు తునకలు. మనిషి అంతరంగంలో ఆ మేధస్సులో (Subconscious) ఎన్ని రహస్యాలున్నాయో అనిపిస్తుంది. మనలో దాగిన ఈ శక్తి కనీసం 5% ఐనా మనం వాడుతున్నమా అనిపిస్తుంది. Math Bee,Spelling Bee లాంటి వాటిలో చిన్నారుల ప్రతిభ చూస్తే వారి మేధస్సుకి వారికే కాదు ఒక్కొసారి మానవ జీవితాన్ని, తెలివిని ఇచ్చిన ఆ దేవుడికి కూడా నమస్కరించాలనిపిస్తుంది.

ఒకప్పుడు భూమి గుండ్రంగా వుంది అంటే నవ్వారు. అది ఇప్పుడు శాస్త్రమైంది. యోగం, ధ్యానం పాతచింతకాయ్ పచ్చడి అనుకున్నాం. ఇప్పుడు వాటిని అందరూ శాస్త్రీయంగా భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే ప్రపంచ చరిత్రను మార్చిన అనేకమంది శాస్త్రవేత్తలు., వేదాంతులు, సాధకులు, యోగులు కూడా. ఫ్లాటో నించి నీల్స్ బోర్ దాకా అధిభౌతిక తత్వం కనిపిస్తూనే వుంది.

మనస్తత్వ శాస్త్రంతో పరిచయం వున్న చాలా మందికి ఫ్రాయిడ్ తెలుసు. ఫ్రాయిడ్ కి సమకాలికుడైన ఒక మహా మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్. మతాన్ని,దేవుడిని శాస్త్ర దృక్పధంలోంచి చూపిన ఒక మహానుభావుడు. ఆయన శ్రీ చక్రాన్ని,మంత్ర ఉపాసకుల మండలాలని గురించి యధాతధంగా ఇలా అన్నారు

"Things reaching so far back into human history (like yantras and mandalaas) naturally touch upon the deepest layers of the unconsciousness, and can have a powerful effect on it. Even when our conscious language proves itself to be quite impotent such things can not be thought up but must grow again from the forgotten depths..(from book: Word and Image on Carl Jung"

(మండలం, యంత్రం లాంటివి మానవ చరిత్రలో భాగంగా వున్న సహజ భావాలు.ఇవి మనోప్రవృత్తిలో ఏకమై మన తరతరాలుగా వస్తున్న ఆలోచనా పరంపరలో భాగం. వీటి శక్తి,ప్రభావం అపరిమితం. మన వాడుక భాషకూడా వీటిని వివరించడంలో విఫలమవుతుంది. ఎందుకంటే, వీటిని మనం కల్పించలేం, మళ్ళీ మనం మనావాళిగా మరిచిపోయిన,మస్తిష్కంలో దాగిన ఆ నిక్షిప్త రహస్యాలని మళ్ళీ వెలికి తీసి వృద్ధి చేసుకోవడం తప్ప.. స్వేచ్చానువాదం).

అంతేకాదు మంత్రాన్ని, తరతరాలుగా మానవ పురోగమనంతో బాటు వస్తున్న సం స్కృతి చిహ్నంగాను, అతీతమైన ఓ సృష్టి శక్తి మనిషికిచ్చిన చిన్న సంతకం అని కూడ చెప్పుకో వచ్చు. లోకకల్యాణమే ఆశయంగా పెట్టుకున్న, తపస్సుకే జీవితాన్ని అంకితం చేసిన ఏ యోగికో ఆ మంత్రాన్ని ప్రకృతి మాత అందిస్తే దాన్ని మనం మంత్రం అంటున్నాం, ఆయన్ని మంత్రద్రష్ట అంటున్నాం.అటువంటి మంత్రాలని నిరంతరం ఉపాసించడం ద్వారా అనేకమంది సాధకులు యోగులయ్యారని,లోకోపకారానికి తమ తపస్సుని వినియోగించారని పురాణ ఇతిహాసాలు, వేదాలు చెపుతున్నాయి.అన్ని సంవత్సరాల కృషిని,విజ్ఞాన సంపదని కేవలం ఒక మామూలు విషయంగా చూడలేము కదా!

"Let noble thoughts come from all directions" అంది ఋగ్వేదం.

ఫ్రణవమే సృష్టికి మూల శబ్దమట. "సృష్టి ఆదిలో శబ్దము పుట్టెను" అని బైబిలు కూడా చెబుతోంది.అంతెందుకు మన జీవితంలో ప్రతి కోణం పదాలతో నిండి వుంది. "బాగున్నరా" అనడానికి "బడుద్ధాయి" అనడానికి ఎంతో తేడా వుంది. మనం శబ్దాన్ని విన్నపుడు మనకి అది మనసులో శక్తిగా, దృశ్యంగా రూపం కనిపిస్తుంది. అందుకే గాయత్రి మంత్రాన్ని జపించినపుడు ఆ తేజో రూపశక్తిని బుద్దిని ప్రదీప్తం చెయ్యమని ప్రార్ధిస్తారు. దేవతలని పూజించాలన్నా, ఆవాహన చేయాలన్నా, దర్శించాలన్నా అది కేవలం మంత్రాల వల్లే సాధ్యం అనడానికి అందరికి తెలిసిన ఎన్నో కధలున్నయి. మంత్రాన్ని జపిస్తూ పునరావృతం చేయటం వల్ల మంత్రం సిద్ధించి దేవత అనుగ్రహిస్తుందిట. ఒక రామ మంత్రం బోయ వాణ్ణి వాల్మీకిగా మార్చింది. ఒక కాళీ మంత్రం తెనాలి రామలింగడిని తయారు చేసింది. మంత్రాలు వేదాలలో, పురాణ ఇతిహాసాలలో అస్త్రాలుగా, అమృతతుల్యమైన మహా శక్తులుగా కీర్తింప బడ్డాయి.

అనేక లక్షల సార్లు జపించబడ్డ మంత్రము శక్తిగా, ఆరాధించే దేవత రూపంగా మారుతుంది. పలు మార్లు అయస్కాంతానికి తాకించిన ఇనుప ముక్క అయస్కాంతంగా ఎలా మారుతుందో అలాగే సాధకుని సూక్ష్మ దేహం, ధ్యాన మండలం దేవతాశక్తి క్షేత్రంగా మంత్ర జపం వల్ల మారతాయి. క్రమంగా కన్నులు రెండూ మూసి తదేక దృష్టితో చెసిన మంత్ర జపం వల్ల మూడో కన్ను తెరుచుకుని జ్ఞానాన్ని, కొందరికి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది అని మంత్రశాస్త్రవేత్తలు చెపుతున్నరు. మంత్ర సాధన చేసేవారు అప్పుడప్పుడు ధ్యానంలొ మెరుపులని, దృశ్యాలని అనుభూతి చెందుతారుట. సాధన చెయ్యగా చెయ్యగా చివరికి ఆరాధించే దేవుడు లేక దేవతకి దగ్గరై, సాధకునికి దేవతకి మధ్య ఒక సమతాస్థితి ఏర్పడుతుంది. కొందరు దీక్షాబద్ధులై నిరంతర సాధన వల్ల ఆ దేవత తాలూకు శక్తిని పొంది, కార్య సాధకులుగా, సిద్ధులుగా, జీవన్ముక్తులుగా, పరాముక్తులుగా అవుతారు.

“మననాత్ త్రాయతే ఇతి మంత్రః” అని మంత్రాన్ని నిర్వచించారు ఋషులు. మననం చెయటం వల్ల రక్షించేది మంత్రము అని అర్ధము.జపం వల్ల, మనసులొ పునరావృతం చేయటం వల్ల మంత్రం శక్తి వంతమై సాధకునికి కవచంగా, కల్పతరువుగా అవుతుంది.

వైఖరి,మధ్యమ, పశ్యంతి అని మూడు విధాలుగా మంత్ర జపం చెయ్య వచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. వైఖరి అంటే గట్టిగా జపం చెయ్యడం. ఇది అంత శక్తివంతం కాదు. మధ్యమ అంటే రహస్యంగా పెదవుల కదలికతో మత్రం వుందేలా జపం చేయడం. ఇది వైఖరి కన్నా మంచి పద్ధతి. ఆఖరిది పశ్యంతి - పూర్తిగా మనసులో చేసే ధ్యానం. అన్నిటికన్నా మంచి పద్ధతి. ఇందులో సాధకులు కేవలం మనసులోనే జపం చేస్తారు. ఈ పద్ధతి జపాన్ని తపస్సుగా, సాధకుడిని యోగిగా మారుస్తుంది. అందుకే కొందరు సాధకుల, స్వాముల సమీపంలో మంచి శాంతం, వారిలో తేజస్సు అనుభూతి చెందుతాము.మంచి సాధన చేసేవారు మరింత ఆనందంగా తయారవుతూ అందరిని ఒకేలా భగవత్స్వరూపంగా ప్రేమగా చూడగలరు.

ఆరాధించే దేవతా స్వరూపాన్ని బట్టి ఆయా తత్వం సాధకుడిని ప్రభావితం చేస్తుంది, అతనిలో ప్రవేశిస్తుంది. కృష్ణుడిని పూజిస్తే కృష్ణతత్వము, కాళిని పూజిస్తే కాళిశక్తి వస్తాయి. అంటే దాని అర్ధం మనిషి కాళి అవుతాడని కాదు, సాధకుని సూక్ష్మ దేహం చుట్టూ కాళిశక్తి వలయం ఏర్పడి అతన్ని అనుగ్రహిస్తూ వుంటుంది. ఎక్కడో కొందరు మహానుభావులకి ఇంకా కొన్ని అపురూపమైన అనుభవాలు కలుగుతాయి. రామకృష్ణ పరమహంస ఆంజనేయ ఉపాసన చేస్తుంటే చిన్న తోక వచ్చిందట. సర్వాంతర్యామి పరబ్రహ్మ స్వరూపాన్ని 'నేను 'గా,సర్వ-ఆత్మగా ఉపాసించే రమణ మహర్షుల వారికి పక్కనే వున్న గడ్డిపై ఎవరో నడుస్తుంటే మహర్షులవారికి నొప్పి కలిగేదట.ప్రసిద్ధులైన అనేకమంది కవులు, పండితులు ఉపాసనల మూలంగా శక్తిని పొందినవారే. మనలొ చాలమందికి పరిచితులైన ఒక మహాత్మునికి అమ్మవారు అనుగ్రహించగా ఆకాశమునుండి అద్భుతంగా ఒక దేవి విగ్రహం ప్రత్యక్షమైందిట. ఆ విగ్రహం ఇప్పటికీ గుంటూరులో వుంది.

కీ||శే|| అద్దంకి కృష్ణమూర్తిగారు మంత్రశక్తితో ఎన్నో చిత్రాలు చూపించేవారు. గాలిలోంచి వస్తువులు సృష్టించడం,దేవుడికి నైవేద్యం పెడితే ప్రసాదం పళ్ళెంతో సహా మాయమవడం లాంటి ఎన్నో సంఘటనలు చూడడం జరిగింది. 'ఆటోబయోగ్రఫి ఆఫ్ ఎ యోగి ' (ఒక యోగి ఆత్మకధ) గ్రంధంలో సాధన గురించి, సిద్ధిని గురించి,భగవదనుగ్రహాన్ని గురించి ఎన్నో విశేషాలు శ్రీ పరమహంస యోగానంద వివరించారు. సూక్షంగా చెప్పాలంటే మంత్రం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక పాస్ వర్డ్ లాంటిది.మంత్రం దేవతాశక్తికి తాళంచెవి లాంటిది. మంత్రం దివ్యలోకాలకి 'యూ ఆర్ ఎల్ '(web URL) లాంటిది. మంత్రం నిక్షిప్తమైన రహస్యం లాంటిది. మంత్రం సాధకునికి దేవతకి మధ్య వంతెనగా శక్తిని, భక్తిని అందచేస్తుంటుంది అని గురువులంటున్నారు. జపించిన ప్రతిసారి సాధకుని తపన, కష్టం, సాధన స్థితి అన్నీ దేవతకి మంత్రం ద్వారా అందచేయబడతాయి. మామూలు పూజకన్న త్వరగా మంత్రం పై లోకాలకి ప్రయాణం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.అందుకే గాయత్రి మంత్రం 'తత్ సవితుర్ వరేణ్యం 'అంటుంది. అంటే 'ఆ సూర్యుడిని అర్ధిస్తున్నాం ' అని అర్ధం. ఏ సూర్యుడిని అని ప్రశ్నిస్తే 'ఏ సూర్యుడయితే భూ లోక, భువర్లోక, సువర్లోకాలలో సంచరిస్తున్నాడో - ఆ సూర్యుడన్న మాట '.

ప్రతి మంత్రానికి అర్ధం వుండాలని నియమం ఏమీ లేదు.ఊన్నా ఆ అర్ధం మన మామూలు అర్ధాలలో ఇమడాలని లేదు. ఉదాహరణకి ఒక లక్ష్మీ మంత్రాన్ని చూస్తే,'హ్రీం శ్రీం మహా లక్ష్మియై స్వాహా ' - ఈ మంత్రము ఓం తో ప్రారంభమవలేదు, నమః అని తుదిలోను లేదు. హ్రీం కి ఎన్నో అర్ధాలున్నాయి. హ్రీం అనేది మాయా బీజం. (అంటే మాయమవుతామని కాదు)మాయ బీజం కావటం చేత, ఈ మంత్రం చేయువారికి సర్వ వ్యాపకమైన శ్రీం లభిస్తుంది. అంటే కేవలం పైసలలో వుండే డబ్బు కాకుండా, ఏ లక్ష్మి శ్రీసూక్తంలో విశెషంగా కీర్తించబడిందో అది లభిస్తుంది.

'ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః '

మంత్రమును ఏకాగ్రతతో చేయడం అవసరం అని అందరు అంటారు. నిజమే, కాని అంత తీవ్రమైన ఏకాగ్రత కుదరకపోయినా సాధనలో ప్రగతిని సాధించవచ్చు. మన మంత్రాన్ని మనమే వినడం ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవచ్చును. కొందరు సాధకులు ఏ దేవతని ఉపాసిస్తున్నరో ఆ దేవతని ఎదురుగా వున్నట్లు ఊహించుకుని సాధన చేయడంవల్ల భక్తితో, శ్రద్ధగా మరింత ముందుకి వెడతారు.

మంత్రాలు బీజాక్షరాల సముదాయం. 'బీజాక్షరాలు ' అంటే విత్తనాల లాంటివి అన్నమాట.బీజాక్షరాలు కూడ విత్తనాల లాగే ధ్యానభూమికలలో వుంచడం వల్ల మహావృక్షాల్లా పెరిగి అనుగ్రహం కలుగచేస్తాయి. గోల్ఫ్ ఆడేవారికి క్లబ్ ఎలాగో, మంత్ర జపానికి మాల అలా అవసరం. రుద్రాక్షమాలని జ్ఞానానికి, మనోశక్తికి, సిద్ధశక్తులకి వినియోగిస్తారు. తులసి మాలని ఆరోగ్యానికి, శాస్త్రజ్ఞానానికి, నిర్మలత్వానికి వుపయోగించవచ్చును. ఎర్రచందనం మాలతో కామ్యసిద్ధి, తామరపూస మాలతో జపం చెస్తే లక్ష్మి ప్రసన్నత కలుగుతాయని మంత్ర మహోదధి, మేరు తంత్రము, రుద్రయామళము వంటి గ్రంధాలు చెబుతున్నాయి. ఆవిధంగా మాల కేవలం జపం లెక్కించటానికే కాక మంత్రసిద్ధిలో కూడా ఉపయోగిస్తుంది.

ఇలా మంత్రసాధనలని చేసి ఈ ఆధునిక యుగంలోనూ అతీంద్రియ శక్తులను సాధించవచ్చునని అనేక గ్రంధాలే కాక నిజమైన జ్ఞానాన్ని, నిర్మలమైన ధ్యానాన్ని నమ్మిన గురువులు సూచిస్తున్నారు. ఐతే అంత గొప్ప స్థితులకి నేను వెళ్ళగనా? గురువులు ఖరీదై, సత్-గురువులు కరువైన ఈరోజుల్లో, ఎక్కడో ప్రాచీనమైన ఈ శాస్త్రాలని నేను అర్ధం చేసుకోగలనా? ఎప్పుడో వచ్చే స్వర్గం కాదు ఇక్కడే ఈ నేలపై నా జీవితాన్ని గురించి మన శాస్త్రాలు ఏమంటున్నాయ్? ఇవన్నీ వచ్చే సంచికలలో చర్చించ ప్రయత్నిద్దాం.

శ్రీ గురుభ్యో నమః