మా పెళ్ళి పల్లకి

-- రాయప్రోలు మూర్తి, కామేశ్వరి

అతడు

మా పెళ్ళిపల్లకి అన్న శీర్షికకు సుజనరంజనిలో మమ్మల్ని మా పెళ్ళి వేడుక గురించి ఒక వ్యాసం రాయమనటం నిజంగా యాదృఛ్ఛికమే!!! ఎందుకంటే, జూన్ ఆఖరి వారమే మా వివాహ వార్షికోత్సవం జరుపుకున్నాము!!! నేను, మా ఆవిడ ఎలా కలుసుకున్నామో, మా పెళ్ళి ఎలా జరిగిందో మీ అందరితో పంచుకొని, ఈ సంవత్సరం మా వివాహ వార్షికోత్సవం ఒక ప్రత్యేక అనుభూతిగా మిగుల్చుకుంటాము.

అవి నేను అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న రోజులు. నేను ఇండియాలో ఉద్యోగం చేసి, అమెరికాకి చదువుకి వచ్చి, ఇక్కడ ఉద్యోగం సంపాదించాను. అప్పటికే నా స్నేహితులు చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇహ ఆలస్యం చెస్తే నాకు ఒక్క అమ్మాయి కూడా దొరకదేమోనని, పెళ్ళి చేసుకుంటానని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. మా వాళ్ళు తెలిసిన వాళ్ళందిరికి నా ఉద్దేశం గురించి చెప్పి, ఒక మంచి సంబంధం కుదిర్చే ప్రయత్నంలో ఉన్నారు.

నేను ఇండియా వెళ్ళేసరికి సంబంధాలు రావటం మొదలు పెట్టాయి కానీ ఏ ఒక్క సంబంధమూ కుదిరేట్టుగా కనపడలేదు. నా శెలవ అయిపొతోంది. ఒక రోజు మా (దూరపు బంధువు) మామయ్య కాకినాడ నుండి నన్ను కలవడానికి వచ్చాడు. నా గురించి ఇంతకు ముందే తెలుసు కాబట్టి, వాళ్ళ బంధువు ఒక అమ్మాయి సంబంధం తీసుకు వచ్చాడు. పెళ్ళి వారిది బహు సాంప్రదాయమైన కుటుంబమని, అమ్మాయి చాలా మంచిదని, ఎమ్మెస్సి చదువు ఆఖరి దశలొ ఉన్నదని, ఆ అమ్మాయి ఫొటో మరియు జాతకము తీసుకొని వచ్చాడు. వివరాలు విన్న తరువాత నేను, మా కుటుంబ సభ్యులు వాళ్ళని కలవటానికి అంగీకరించాము.

ఆ అమ్మాయి వాళ్ళు జబల్పూరులొ ఉంటున్నారు. వాళ్ళు రావటానికి కనీసం 3 రోజులైనా పడుతుందిట. మేము కబురు పెట్టిన రోజే ఆ అమ్మాయి తండ్రితో కలిసి బయలుదేరి హైదరాబాదులొ ఉన్న వాళ్ళ మేనత్త ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి తండ్రి డిఫెన్సు డిపార్టుమెంటులొ పని చేస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ మమయ్యగారు (మేనత్త భర్త) అర్మీలో బ్రిగేడియర్ జనరల్. నేను మా కుటుంబ సభ్యులు, వాళ్ళని కలవటానికి వెళ్ళేటప్పుడు మా బాబాయి అన్న మాటలు తలచుకొని ఈరోజుకీ నవ్వుకుంటాము. ”ఒరేయ్, అమ్మాయి నాన్న గన్ ఫాక్టరీలో పని చేస్తారుట. వాళ్ళ మామయ్య మిలిటరీలో లాయరుట. జాగ్రత్త!!! ఎక్కువ ఆలోచించకుండా సంబంధం ఒప్పేసుకో – లేకపోతె నీ పని అంతే” – అని అన్నాడు!!! ఫైన తథాస్తు దేవతలు విన్నట్టున్నారు!! ఆ రోజు కలిసాను – సుసర్ల కామేశ్వరిని – మొదటిసారి. పంపించిన ఫొటొలోకన్నా బావుంది. చాలా వయ్యారంగా ఉన్నట్టనిపించింది. తనని కలసి, కాస్సేపు మాట్లాడాను. తను ఎక్కువ మట్లాడ లేదు. నా సంగతులు చెప్పాను. నాకు తను నచ్చినా, నేను తనకి/వాళ్ళకి నచ్చాలి కదా!!! ఆలోచించి ఇద్దరి అభిప్రాయాలు చెప్పాలని నిశ్చయించుకున్నాము. కానీ మర్నాడే, నేను వెళ్ళి తనను మళ్ళీ కలసి మాట్లాడిన తరువాత, నా ఉద్దేశ్యం చెప్పాను - కామేశ్వరి నచ్చిందని. వాళ్ళకి కూడా నేను నచ్చానని తెలిసి చాలా సంతోషించాను. నా శెలవు ఇక పన్నెండు రోజులే ఉంది. ఈలోపల పెళ్ళి ఎలా జరుగుతుందోనని అందరికీ కంగారుగా ఉంది. చూడబోతే మా ఇద్దరికి కళ్యాణ ఘడియ వచ్చినట్టుంది. ఆ మర్నాడే, కామేశ్వరి వాళ్ళ నాన్న గారు మిగతా విషయాలు మాట్లడటానికి వచ్చినప్పుడు, అది మంచి రోజని, వెంటనే సాంప్రదాయ పద్ధతిలొ తాంబూలాలు పుచ్చుకోవటం జరిగింది!!! ముహూర్తం ఒక పది రోజులలొనే!!!

ఆఘమేఘాల మీద పనులు జరగటం మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. పెళ్ళికి రెండురోజుల ముందర, నన్ను పెళ్ళికొడుకును చేసిన రోజు, కామేశ్వరి వాళ్ళ అమ్మగారు, మామ్మగారు, ఇద్దరు చెల్లెళ్ళు జబల్పూరు నుండి వచ్చారు. నేను వాళ్ళకి కొత్త కదా అందుకని ఎక్కువ మాట్లడుతారని అనుకోలేదు. కానీ నా మరదళ్ళు నేను అనుకున్నదానికంటె చాలా చురుకుగా, చలాకీగా, సరదాగా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తనతో, ఒక్క నాలుగు రోజుల్లోనే, నాకు చెల్లెళ్ళు లేని కొరత లేదని అనిపించారు. మా పెళ్ళి హైదరాబాదులొ జహంగిర్ ప్లాజాలో ఘనంగా జరిగింది.

పెళ్ళి మర్నాడు సత్యనారాయణవ్రతం చేసుకొని, ఆ మర్నాడు తిరుపతికి వెళ్ళాము. కామేశ్వరి వాళ్ళ అత్తయ్య ఎండోమెంట్సు డిపార్టుమెంటులో అడిషనల్ కమీషనరు అవటంతో, తక్కువ వ్యవధిలో మాకు ఏడుకొండలవాని దర్శనం జరిగి, శ్రీవారి కళ్యాణం కూడా చాలా బాగా చేయించాము. వెనక్కి వచ్చిన మూడవ రోజె నేను ఒక్కడిని వెనక్కి(అమెరికాకి) రావలసి వచ్చింది (కొంచెం కష్టం అయిందనుకోండి!!!). కామేశ్వరి నాలుగు రోజులు హైదరాబాదులో మా వాళ్ళతొ ఉండి, తన చదువు పూర్తి చెయ్యటానికి జబల్పూరు వెళ్ళింది. అప్పటి రోజుల్లో అమెరికా నుంచి ఇండియాకి మాట్లాడటం చాలా ఖర్చుతో కూడిన పని అవటం వల్ల, కామేశ్వరి వాళ్ళింట్లో ఫోను లేకపోవడంవల్ల, మేమిద్దరం ఒకరి గురించి ఒకరు ఉత్తరాల ద్వారానే తెలుసుకున్నాము. ఆరు నెలల తరువాత చదువు ముగించుకొని, కామేశ్వరి అమెరికాకి వచ్చింది. తనే నాకన్నా ముందు మా రెండో అక్కావాళ్ళింటికి వచ్చి, నన్నే తను వాషింగ్టన్ డీసీలొ రిసీవు చేసుకుంది!!!

ఒక వారం తరువాత మేమిద్దరం కాలిఫోర్నియా వచ్చి మా వైవాహిక జీవితం ప్రారంభించాము. కామేశ్వరి నా జీవితంలో ప్రవేశిస్తే నాకు ఆర్ధికంగా బావుంటుందని జ్యోతిష్కులు చెప్పినది నిజం అవసాగింది. నాకు త్వరలోనె ఒక మంచి ఉద్యోగం వచ్చింది. మేమిద్దరము నాలుగేళ్ళు ప్రాంతీయ తెలుగు సంస్థ కార్యక్రమాలలో పాల్గొని, చాల మంచి స్నేహితులని కలిశాము. 1998 లో మాకు ఒక అబ్బాయి పుట్టాడు – సాకేత్ నామ ధేయం. అదే సంవత్సరం చివర్లో మేము మా మొదటి ఇల్లు కొనుక్కున్నాము (ఇంకొక నలుగురు స్నేహితులతో కలిసి ఇరుగు పొరుగుగా). సాకేత్ చిన్నప్పటినుంచి స్టేజీ మీద పాటలు పాడుతూ, సిలికాను వ్యాలీలొ మన తెలుగు వారందరికి పరిచయమయ్యాడు. బుడుగు వేషంలో సిలికానాంధ్రా కార్యక్రమంలో బాపూ గారిని ఆహ్వానించి అందరి మన్నలను పొందాడు. మేము ముగ్గురం ఇప్పుడు శాన్ హొసే ఎవర్‌గ్రీన్ ఏరియాలో సెటిల్ అయ్యాము.

ఆమె

మేము అప్పుడే దక్షిణ భారతదేశం పర్యటించి ఇంటికి(జబల్పూర్ కి) వచ్చాము. పర్యటన చాలా బాగా జరిగింది కానీ వేసం కాలం కాబట్టి, చాలా అలసిపోయాము. ఆపుడే మా బాబాయిగారు మా నాన్నకి ఫోను చేశారు – ఒక సంబంధం గురించి. నేను ఇంకా పొస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఆది అయ్యే వరకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు నాకు కానీ నా చేతుల్లో ఏముంది?

మా బాబాయి గారితో మాట్లాడిన పిమ్మట, నేను, మా నాన్న కలిసి హైదరాబాదుకి ప్రయాణం కట్టాము – కాబోయే పెళ్ళి కొడుకుని చూడటానికి. మా మామ్మగారు, అమ్మ మరియు నా ఇద్దరు చెల్లెళ్ళూ రాలేదు. నేను, మా నాన్న మా మేనత్త గారింట్లో దిగాము. మరునాడే, ఆ అబ్బాయి కుటుంబ సమేతంగా వస్తున్నాడుట – పెళ్ళి చూపులకి. నాకు ఏదోగా అనిపించింది!!!

అరే, భలే అందగాడేనే, అని మన్సులో అనుకున్నాను. ఆతను నల్లసూటు వేసుకొని,ఎర్ర టై కట్టుకున్నాడు. ఆతనితో పాటు, వాళ్ళ అమ్మగారు, నాన్న గారు, బాబాయి గారు, పెద్దక్క, బావగారు, అతని నాలుగేళ్ళ మేనకోడలు వచ్చారు. వారిది ఒక మంచి ఉమ్మడి కుటుంబమని అనిపించింది. ఇహ ఆ అబ్బాయి అలవాట్లు, ఇష్టాయిష్టాలు, గుణగణాలు తెలుసుకోవాలి...ఆ అబ్బాయి కూడా నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడేమో.. ఆ అబ్బాయే మూర్తి రాయప్రోలు. మేమిద్దరము కాస్సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నాము. అప్పుడు తెలిసింది ఆ అబ్బాయి గురించి. అతను అమెరికాలో సాఫ్టువేరు ఇంజినీరుగా పని చేస్తున్నాడుట. టెక్సాస్ యూనివర్సిటీ లో ఎం.ఎస్. చేశాడుట. ఆ అబ్బాయికి మిఠాయిల్లో వేసిన పచ్చకర్పూరం నచ్చదుట, అతను టీ, కాఫీ తాగడుట (నాకు ఆ రోజుల్లో టీ ముఖ్య ఆహారం!!!). ఆతని రుచుల గురించి తెలుస్తోంది.

వాళ్ళు వెళ్ళిన తరువాత, ఇంట్లో వాళ్ళందరూ ఆ అబ్బాయి “అందగాడే” అని అనుకున్నారు. నేను ఆ అబ్బాయితో ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి, నాకు అంతా అయోమయంగా ఉంది. నేను ఉత్తర భారతదేశంలో ఎక్కువ పెరిగాను కాబట్టి నాకు ఇటువంటి పెళ్ళిచూపుల గురించి ఏమీ తెలియదు. ఒక గంటసేపే మాట్లాడి శేష జీవితమంతా ఎలా గడపాలో అర్ధం కావటం లేదు. ఆ సాయంత్రం ఆ అబ్బాయి నుంచి ఫోను వచ్చింది. అతను మర్నాడు వచ్చి కలుస్తానన్నాడు. అప్పటికి మనసు కొంచెం కుదుటపడ్డది. మర్నాడు మేమిద్దరమూ కలిసి మాట్లాడుకున్న తరువాత, నేను ఆ సాయంత్రం నా అంగీకారం మా నాన్నకి తెలియపరిచాను. పధ్నాల్గవ తారీఖున మా నాన్నకి ఫొను వచ్చింది..వాళ్ళకు నేను కూడా నచ్చానుట!!!! ఆ మర్నాడే తాంబూలాలు పుచ్చుకుందామని అన్నారుట.

మా నాన్న ఇంత త్వరగా అవుతుందనుకోలేదు..మా అమ్మా, చెల్లెళ్ళు కూడా దగ్గర లేరు. మా మేనత్త గారి సహాయంతో నేను హైదరాబాదులోనే షాపింగు చేసుకున్నాను. మేము ఇంటికి ఫోను చేసి శుభవార్త చెప్పాము. ఆందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నా చెల్లెళ్ళు నన్ను ఏడిపించటం మొదలుపెట్టారు. ఫెళ్ళి ఒక పది రొజుల్లోనే!!! ఈలోపల మా నాన్న జబల్పూరుకి వెళ్ళి మా మామ్మగారిని, అమ్మని, చెల్లెళ్ళని తీసుకురావాలి – వెళ్ళి రావటానికే 5–6 రోజులు పడుతుంది. ఎక్కువ వ్యవధి లేదు. నాకు కూడా కంగారుగానే ఉంది…

తాంబూలాలు పుచ్చుకున్న మర్నాడు, నాకు కాబోయే అత్తగారింటికి నేను మొదటి సారి వెళ్ళాను. వాళ్ళింట్లొ ఒక ఐదుగుర్నో, ఆరుగుర్నో కలుస్తాననుకున్నాను. తీరా చూస్తే, నెను వెళ్ళేటప్పటికి ఒక యాభై కళ్ళు నన్ను ఆహ్వానించాయి!!! ఆంతమందిని కలిసి వాళ్ళతో కొంతసేపు గడిపిన తరువాత, నా నిర్ణయానికి నేనే సంతోషించాను.

ఆ తరువాత రెండు మూడు రోజులు, నేను మూర్తితోను, వాళ్ళ పెద్ద అక్కతోను షాపింగు వెళ్ళాను – నా పెళ్ళి నగలు, చీరలు కొనుక్కోవటానికి. మూర్తి శుభలేఖల గురించి కూడా తిరుగుతున్నాడు. పెళ్ళిళ్ళ సమయం కాబట్టి, పెళ్ళి హాలు దొరకటం కూడా కష్టంగా ఉందిట. నాకు మటుకు నేను ఆనందంగా ఉన్నాను..గాలిలో తేలుతూ!!!

జూన్ ఇరవై తారీఖున, మూర్తి వచ్చారు – పెళ్ళి శుభలేఖలు తీసుకొని వచ్చారు. కొన్ని నేను మా స్నేహితులకి, ప్రొఫెసర్లకి కూడా పంపించాను. మూర్తి నాకు (అమెరికా నుంచి) ఒక ప్రత్యేకమైన బహుమతి కూడా తెచ్చారు…

జూన్ 23వ తారీఖున మూర్తిని పెళ్ళికొడుకుని చేసారు. నా చెల్లెళ్ళు, మా అమ్మ, మామ్మగారు కూడా అదే రోజున జబల్పూరు నుండి వచ్చారు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. మా మామ్మగారు కూడా కొన్ని పెళ్ళిపాటలు పాడారు (ఆవిడ 93 యేళ్ళ వరకు అందరి పెళ్ళిళ్ళకి కూడా పాటలు పాడారు – చాలా బాగా పాడేవారు). 24న మేమందరమూ పెళ్ళి హాలుకి వెళ్ళాము. నేను ఆ రోజే చేతులకి, పాదాలకి గోరింటాకు పెట్టించుకున్నాను.

జూన్ 25న, నా పెళ్ళి మూర్తి రాయప్రోలుతో, చాలా వైభవంగా జరిగింది. డాదాపు 800 మంది విచ్చేసి మమ్మల్ని దీవించారు. నన్ను కూడా వాళ్ళింట్లో వ్యక్తిలాగే చూసి, సహృదయంతో అహ్వానించే కుటంబంలోకి వెళ్ళటంకంటే ఏ అమ్మాయికైనా ఇంకేమి కావాలి? ఇది నాకు జీవితంలో మరువలేని అనుభూతి.

మొన్ననే (జూన్ 25న) మా పెళ్ళి రోజు అయింది. మా పెళ్ళి ముచ్చట్లు ఇదే నెలలో మేము ఈ శీర్షికకి వ్రాయటం ఒక ప్రత్యేక బహుమానం. మేమిద్దరము మా ఎనిమిదేళ్ళ కొడుకు, సాకేత్ తొ కలిసి, శాన్ హోసెలో స్థిరపడ్డాము. మా అబ్బాయి తెలుగు ఆటలు, పాటలతో మన సంస్కృతిలొ పెరుగుతున్నాడు.

రాయప్రోలు మూర్తి, కామేశ్వరి

మూర్తి గారు, కామేశ్వరి గారు ఎంతో ఉత్సాహంగా ఉంటూ అందరితోనూ ఎంతో కలివిడిగా ఉండే జంట. వీరు ఎంతో మృదు స్వభావులే కాక భారతీయ సంస్కృతి పట్ల అపారమైన మక్కువ కలవారు. మూర్తి గారు నటులు కూడా. సిలికానాంధ్ర కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తమ చిన్నారిని భారతీయ సంస్కృతి సుగంధాలబ్బేల ఎంతో కృషి చేస్తున్నారు. చిన్నారి సాకేత్ గత రెండేళ్ళుగా సిలికానాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటూన్నాడు. తెలుగులో మాట్లాడటమంటే ఇలా ఉండాలి అని తోటి పిల్లలకి చూపెడుతున్నాడీ బుడుగు.