కొత్త కెరటం : అయోమయమా? ఆత్మవిశ్వాసమా?

-- అనూష కూచిభొట్ల

సుజనరంజని ఆశయాల్లో యువతలో పఠన, రచన ఆసక్తులను పెంపొందించడం; తెలుగు భాషను వారి భావధారలోకి తీసుకువెళ్ళటము ముఖ్యమైనవి. సిలికానాంధ్ర చేపట్టే అనేక భాష - సంస్కృతి సంబంధించిన కార్యక్రమాలతో పిల్లలు, యువకులు విశేషంగా ఆకర్షింపబడటం ఎంతో ఉత్సాహం కలిగిస్తోంది. ఆ ప్రేరణతో యువకులలో తెలుగులో వ్రాసే నేర్పు పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ శీర్షిక ద్వారా అవకాశాన్ని కల్పిస్తున్నాము. మనకు తెలిసిన వివిధ అంశాలను సరికొత్త కోణంలో చూపించగల నేర్పు యువత సొంతం. అందుకు పట్టం కట్టే ప్రయత్నమిది. పిల్లలను యువయను, వారి భావాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

అమెరికా ఖండంలో పుట్టిన దక్షిణ ఆసియా దేశాల పిల్లలను గురించి ఆలోచన రాగానే, మొట్టమొదటగా సాధారణంగా ఎవరికైనా తట్టేది, "ABCD" అన్న పదం. దాని అర్ధం, "American Born Confused Desis" అంటే, "అమెరికాలో పుట్టిన అయోమయ దేశీయులు" అని. కానీ నేను మాత్రం ABCD అంటే "American Born Confident Desis" అని గట్టిగా చెబుతాను.

దక్షిణాసియా పిల్లలని అయోమయం అని అనడానికి కారణం మేము రెండు పెద్ద దేశాల సంస్కృతులను ఒకేసారి అర్ధం చేసుకుంటూ గందరగోళంలో పడిపోతున్నామని అందరూ అనుకోవడం. ఇంట్లో, బయట రెండు ప్రపంచాలుగా ఉండటంతో ఎక్కడ ఎలా సరిగా నడచుకోవాలో తెలియకపోవడం ఒక కారణం అయితే, రెండోది మేము ఎక్కడ సరిగా నప్పుతామో తెలియకపోవడం. ఇక అలాంటి ఆలోచనల్లో టీనేజి దాటుతున్న వాళ్ళు ఉండే పరిస్థితి ఒకటి నేను వివరిస్తాను. అది, 18యేళ్ళు దాటాక పిల్లలు పెద్దవాళ్ళతో ఇంట్లో కలిసి ఉండటమా లేదా అందరు అమెరికను పిల్లల్లాగా స్వతంత్రంగా బ్రతకడమా అన్న ప్రశ్న. దాని గురించి నా అభిప్రాయం చెబుతాను.

అసలు సమస్య ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఇక్కడ పెరిగిన పిల్లలు పైన చెప్పినట్లు రెండు పెద్ద సంస్కృతులను అర్ధం చేసుకోడంలో పడే ఇబ్బందులు. రెండింటినీ బాలెన్సు చేయడం తెలియక, చాలా మంది అమెరికన్ సంస్కృతిలో ఉండే మంచి లక్షణాలను పూర్తిగా తెలుసుకోలేక పోతున్నారు. అంతేగాక, ఒక్కోసారి మన సంస్కృతిలో ఉండే కొన్ని రోత పుట్టే విషయాలు నేర్చుకుంటున్నారు. రెండిట్లోనూ మంచి తీసుకుంటే యే బాధా ఉండదు కదా!

దక్షిణాసియా పిల్లలకు చిన్నతనం నుండే ప్రతిరోజూ సంస్కృతి గురించి, తల్లిదండ్రుల మూలాల (roots) గురించి ఎన్నో విషయాలు నేర్పుతారు. కుటుంబంగా కలిసి ఉండటం గురించి నేర్పుతారు. అమెరికాలో పిల్లలకు 5 యేళ్ళ నుండే స్వతంత్రంగా ఉండటం గురించి, అంటే మనమే మన పనులను స్వంతగా ఎలా చేసుకోవలో (తినడం లాంటి రోజూ చేసే పనులు కూడా) నేర్పుతారు వారి తల్లిదండ్రులు. అందువల్ల స్కూల్లోనూ, కాలేజీలోను ఇంకా అన్నిచోట్లా అమెరికను పిల్లలకి అలానే ఉండటం అలవాటు అవుతుంది. కానీ దక్షిణాసియా పిల్లలకు ఒక కుటుంబంగా పెరగటం నేర్పుతారు. యే పని చేసినా కుటుంబం అంతా కలిసే చేస్తారు. పిల్లల హోంవర్కు చేయడానికి తల్లిదండ్రులే ఎంతో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్ళకు పిల్లలు కలిగినా చాలా విషయాల్లో పూర్తి స్వతంత్రం ఉండదు.

ఇక్కడి పిల్లల దృష్టిలో 18 యేళ్ళు రాగానే వాళ్ళు "పెద్దవాళ్ళు" అయినట్లే. ఆ తరువాత వాళ్ళు చేసే పనులకు కుటుంబానికి ఏమాత్రం బాధ్యత ఉండదు. అలాని కుటుంబం గురించి అస్సలు పట్టించుకోరని కాదు. ఒకళ్ళకొకళ్ళకు సాయం చేసుకుంటునే ఉంటారు. అమెరికన్ పిల్లలకు 18 నిండాక పూర్తిగా స్వేఛ్ఛ ఇచ్చినా వాళ్ళకి బాధ్యతలూ బాగా పెరిగిపోతాయి. వాళ్ళు బతకటానికి వాళ్ళే ఉద్యోగం చేయాలి, ఇంకా కుటుంబంతో కలిసి ఉన్నా స్వంతవాళ్ళకే అద్దె చెల్లించాలి, వాళ్ళ కాలేజి కి వాళ్ళే ఫీజులు కట్టుకోవాలి ఇలా ఎన్నో.

కానీ మన ABCDలు చాలా మంది పెద్దవాళ్ళతో కలిసి ఉండటం వల్ల ఎన్ని లాభాలు పొందుతున్నారో! మన కుటుంబాలే మన కాలేజి ఫీజులు కడతాయి, అద్దె ఇవ్వమని అడగేవాళ్ళుండరు అంతెందుకు మన వంట మనం చేసుకోనక్కరలేదు, మన బట్టలు ఎలా పడేసిన ఉతికిపెడుతుంటారు, "లాండ్రి" గురించి అస్సలు బాధపడక్కరలేదు. ఇక గ్రోసరిలు, పుస్తకాలు, చిన్న చిన్న ఖర్చులూ వేటికీ మనం వెతుక్కోక్కరలేదు. అసలు మన అమ్మలు మనం కాలేజికి వెళ్ళి ఎంత దూరంలో ఉన్నా మనకి తినడానికి చాలా పంపిస్తుంటారు. యే "థాంక్స్ గివింగ్"కో మరెప్పుడోనో ఎవరి కారులోనో పడి పడీ రావక్కర్లేదు. హాయిగా ఎపుడంటే అప్పుడు బెంగ వచ్చినపుడు ఇంటికి వచ్చేయచ్చు. మన పెద్దవాళ్ళు అడిగేది, "బాగా చదువుకో, నాలుగింటికే లే, పిచ్చి పనులు చేయమాకు" (అసలు ఈ మూడు చేయడమే చాలా కష్టం అనుకోండి!!) ఒక్కమాటలో చెప్పాలంటే మనకు మన జీవితం మా అమ్మ చెపినట్ళు "వడ్డించిన విస్తరి", అంటే కావాల్సినవన్నీ రెడీగా ఉన్న కంచం.

అయితే, ఎన్ని ఉన్నా ఒక టీనేజరుకి స్వేఛ్ఛ లేకపోతే ఏమీ లేనట్లే! స్వేఛ్ఛే చాలా ముఖ్యం. నా ఉద్దేశ్యంలో ఆ స్వేఛ్ఛ బాధ్యతలతోనే వస్తుంది. ఎంత రెస్పాన్సిబుల్ గా మనం ఉంటే అంత స్వేఛ్ఛ వస్తుంది. కనుక నాకేం అనిపిస్తుందంటే మనకు కావల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి రెండు ప్రపంచాల్లోనూ మంచిని తీసుకుందాం. మన పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటూ, మనకు కావల్సినట్లుగా ఉండటానికి ప్రయత్నిద్దాం.

కొన్ని విషయాల్లో మనం స్వతంత్రంగా ఆలోచించాలి. ఆ అభిప్రాయాలని మంచిగా అందరూ అర్ధం చేసుకునేలా చెప్పడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడేలా పెరగాలి. జీవితం అంతా ఎన్నో విషయాలు నేర్చుకోడానికి అవకాశాలు ఉంటాయి. మనం అక్కర్లేదనుకున్నా మనం నేర్చుకోక తప్పదు. అనుభవాలు కలగక మానవు. కాకపోతే ప్రతి దానికీ "సరైన సమయం" అనేది ఉంటుంది. మన అమ్మానాన్నలు కూడా పూర్తి స్వేఛ్ఛగా ఉండాలని కోరుకున్నవారే ఒకప్పుడు. మన జీవితానికి ఒక పధ్ధతి ఏర్పాటు చేసి మనలను అమ్మానాన్నా నడిపిస్తూ ఉంటారు. అలా పెరగడంలో మనమూ సరైన సమయంలో రెక్కలొచ్చిన పక్షిలా హాయిగా ఎగరగలుగుతాము. అపుడు మనకాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం పడిపోకుండా. అయితే అది ఖచ్చితంగా 18 యేళ్ళకే అని లేదు.

నిజానికి ఈ పధ్దతి అనేది ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరకంగా ఉంటుంది. ఎప్పుడు మనం అందుకు సిధ్ధం అని మన అమ్మానాన్నలకు అనిపిస్తుందో అప్పుడే మనకు స్వేఛ్ఛ వస్తుంది. కొంతమంది హై స్కూల్ దాటితేనే పిల్లల మీద నమ్మకంగా వదిలిపెడతారు. కొంతమంది మాత్రం అలా వదిలి పెట్టటానికి కష్టపడుతూ ఉంటారు. ముద్దుగా చూసుకునే పిల్లలను వదిలిపెట్టటం కష్టమే కదా!

అయితే ప్రపంచంలో చాల వేల యేళ్ళ నుండి ఉన్న సంస్కృతి కనుకా, మన మూలాలు చాలా గట్టివి కనుకా, ఏర్పాటుచేసిన పధ్ధతులు చాలా ఆలోచించి చేసినవి కనుకా మన అమ్మానాన్నలు మనకూ వాళ్ళు నేర్చుకున్న జీవిత విలువలు పూర్తిగా మనకి వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నాన్ని మనం గౌరవించాలి, ఎందుకంటే అది మన కోసమే కదా! అందుకని మనం చేయాల్సిందల్లా ఒక్కటే. మనం త్వరత్వరగా ఇంటిలో పనులు చేయడంలో, బాధ్యతగా ఉండటంలో ముందు ఉంటే, మనంతట మనం ఆలోచించి, పనులు చేసుకోగలుగుతుంటే ఇక అమ్మనాన్నలూ వాళ్ళంతట వాళ్ళే మనకు స్వేఛ్ఛనిస్తారు. అలా మనం చేయలేకపోతే, హాయిగా వాళ్ళ గారాబంలో పెరుగుతూ వాళ్ళు తరిమేసే దాక ఎంజాయ్ చేయడమే!! ఇందులో యే పధ్దతి మీకు నచ్చితే అది చేసెయ్యండి ఇక...

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు నిండుగా వెలిగే కుటుంబంలో పుట్టింది అనూష. కూచిభొట్ల ఆనంద్, శాంతి గార్ల పుత్రికా రత్నం. అమెరికలో ఉన్నా తనంతట తానుగా అచ్చమైన తెలుగు పిల్లలా పావడా కట్టి గల గలా తిరుగుతుండే అనూష "UC Riverside"లో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. భరత నాట్యం, కూచిపూడి నాట్యాలలో శిక్షణ పొంది గజ్జెకట్టి చేసే నృత్యాలు ఒక వంక, స్నేహితులతో కలిసి కాలేజిల్లో అందరు టినేజి పిల్లల్లానే ఉత్సాహంగా పెరుగుతూ ఒక వంక, మరో పక్క మానేజిమెంట్ శాస్త్రంలో పట్టా కోసం ప్రయత్నిస్తోంది. ఆధునికతకీ, సంప్రదాయానికి మేలు కలయికగా మూర్తీభవించిన ఈ చిన్నారి ఎన్నో విజయాలను సాధించాలని మనస్పూర్తిగా ఆశీర్వదిద్దాం