జ్వలించిన శిల

-- తురగా జానకీరాణి

"ఆ చివర టేబుల్ చూడు, అక్కడ కూర్చున్న మనిషి నాకు ఎంతో బాగా తెలుసు" అన్నాడు మహేంద్ర.

"ఔను. ఈ మధ్యనే కనిపిస్తున్నాడు ఈ హోటల్లో. మోటార్ డీలర్ అనుకుంటాను. కారు దిగుతోంటే చూశాను. దర్జాగా ఉన్నాడు సుమా!" అన్నాడు మిత్రుడు..

"తెలుగువాడు కాదు, అరవ పయ్యన్. పేరు గౌతం" అన్నాడు మహేంద్ర అటువైపే చూస్తూ..

గౌతం కార్ డీలరు. అతని భార్య అహల్య బ్యాంకులో ఆఫీసరు. ఐదారేళ్ళ క్రితం వాళ్ళు హైదరాబాదులోనే ఉండేవారు. అహల్య తెలుగు వనిత. గౌతం అందగాడు, డబ్బున్నవాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. మహేంద్రకు ఎలా పరిచయం అంటే ఇతగాడు ఎంతో విలాసవంతంగా ఉంటాడు. సంగీత, సాహిత్య, లలిత కళాప్రియుడు. ప్రతి సభకు, కచ్చేరీకి వెళతాడు. వీలున్నచోట స్టేజి ఎక్కి, కార్యక్రమంలో తనూ భాగంగా ఆర్భాటంగా తిరుగుతాడు. అవకాశం ఉంటే ఉపన్యసిస్తాడు. అహల్య వాళ్ళాయన గౌతంకి ఒక్కోరోజు షోరూంలో సాయంత్రం పొద్దుపోయేదాక పని ఉంటూండేది. అహల్యకీ సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకాల వంటివి చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో చాలావాటిలో పాల్గొనేది కూడా. సాయంత్రం ఏదో ఒక సభకి వెళ్ళడం ఆరంభించింది.

ఒకనాడొక సాహిత్య గోష్టికి వెళ్ళింది. అది కవి సమ్మేళనం. చాలా కాలం మదరాసులో ఉండి, తెలుగుకి ముఖం వాచినట్లు ఆద్యంతం ఆ కార్యక్రమంలో లీనమైపోయింది. బయటకి వచ్చేసరికి యింకా గౌతం కానీ, కారు కానీ రాలేదని చూసింది. గేటు దగ్గర నిలబడినప్పుడు మహేంద్ర స్కూటరు మీద వచ్చాడు. జనం చాలావరకు వెళ్ళిపోయారు. ఆరోజు మహేంద్ర స్టేజి మీద ఉండి సన్మాన కార్యక్రమంలో హడావిడిగా తిరగడం అహల్య చూసింది. అంచేత అతనిని గుర్తుపట్టింది. అతను స్కూటరు ఆపి , 'నమస్తే' అంటూ పరిచయం చేసుకున్నాడు.

అతని కంఠస్వరం, ఉఛ్ఛారణ, ధీమాగా, హుందాగా తిరిగిన తీరు అహల్యకు బాగానే తోచాయి. "ఏమిటి ఇక్కడ నిలబడ్డారు? ఆటో కోసమా?" అని పలకరించాడు. అహల్య మొహమాటంగా నవ్వి, "మావారు వస్తానన్నారు" అన్నది. "ఫోన్ చేసి కనుక్కోనా, నంబరు చెప్పండి" అన్నాడు మహేంద్ర జేబులోంచి సెల్ ఫోన్ తీస్తూ. "వద్దండీ. నా దగ్గర సెల్ ఉన్నది. చేస్తాను" అన్నది.

అతను స్కూటరుని స్టాండ్ వేసి పక్కన పెట్టి "మీకీ ప్రోగ్రాం నచ్చిందా?" అంటూ మాట కలిపాడు. ఆనాటి కవులూ, వారు చదివిన కవితలూ, వాటిల్లో నిరాశలు మొదలైన విషయాలు కొంతసేపు మాట్లాడుకున్నారు. అదేవారంలో ఉన్న ఇంకొక కార్యక్రమానికి ఆహ్వానం ఇచ్చాడు మహేంద్ర. అది పుస్తకావిష్కరణ సభ. ఈలోగా గౌతం వచ్చాడు. అతణ్ణి క్లుప్తంగా పరిచయం చేసింది. కారు కదిలేదాక ఆగి మహేంద్ర స్కూటరు ఎక్కాడు.

ఆవిధంగా తొలి పరిచయం జరిగింది. తరువాత సంగీతం, సాహిత్యం, నృత్య కార్యక్రమాలకి అహల్య తఱచుగా వెళ్ళడం ఆరంభించింది. తనేదో క్రొత్త ప్రపంచంలోకి వెడుతున్నట్లు సంతోషం. గౌతంకీ ఆమె అట్లా వెళ్ళడం బాగానే ఉంది. కారు షోరూంలో అతని బాధ్యత ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడూ పని వత్తిడి. సాయంకాలం తనకోసం ఎదురుచూస్తూ ఒక్కతే కూచోకుండా, తన కాలక్షేపం తను చూసుకుంటోంది. కార్యక్రమం త్వరగా అయిపోయి, గౌతంకి పని లేటు అయ్యేటట్లుంటే ఒకటి రెండు సార్లు మహేంద్ర ఆమెను ఇంట్లో దింపాడు కూడా.

అహల్య భావుకురాలు. పెళ్ళయి నాలుగేళ్ళవుతున్నా, ముఫ్ఫై ఏళ్ళు దాటుతున్నా, చిగురుటాకులా ఆమె మనసు రెపరెపలాడుతుంటుంది. ఆకాశంలోని మబ్బుతునకలు ఆకారాలు మారిపోతుంటే రెప్ప ఆర్పకుండా చూస్తుంది. ఆ మార్పులకి విస్మయపడిపోతుంటుంది. వాటి వెనుక నీలినగరపు శోభలు ఏవో ఉన్నాయన్నటు భ్రమగా చూస్తూ ఉంటుంది. మల్లెల మత్తువాసన గుండే నిండా నింపుకుంటుంది. భాషకాని భాషవాడైన పురుషుడు తన భర్తతో ఇవి వివరంగా చెప్పలేకపోతుంటుంది. విశ్రాంతిలేని అతని జీవితంలో యీ భావుకతకి చోటు లేదనిపిస్తూంటుంది.

ఒకవిధంగా ఈ వెలితిని మహేంద్ర పూర్తి చేస్తూవచ్చాడు. అహల్య అందమైన, డబ్బున్న ఆఫీసరు. యువదశలో ఆమె మనస్సు చలిస్తున్న సంగతి ఆమె అరమోడ్పు కనులలో తెలిసిపోతుంటుంది. శృంగారం కాని ఒక ప్రణయం తన మాటలలో అతను చవి చూపిస్తున్నాడు. ఒక రాత్రివేళ అహల్యకి నిద్ర మెలకువ వస్తుంది. అలసిన గౌతం నిద్రపోతుంటాడు. కిటికీలోంచి చూస్తే చెట్ల ఆకులమీద వెన్నెల తళుక్కుమంటుంటే చూస్తుంది. చిరుగాలికే తలలూపి, గింగుర్లు తిరిగిపోతున్న చిన్న మొక్కలను చూస్తే, కవితల లాంటి ఉత్తరం ఒకటి వ్రాసి చదవమని మహేంద్రకు ఇస్తుంది.

ఆమె అయోమయపు అలోచనలు, చేష్టలలో ఒక సురభిళసుమాన్ని పసికట్టేయగల వ్యక్తి మహేంద్ర. ఈ ఉత్తరాలు దాచలేక, పారవేయలేక తన ఆఫీసులో ఒక సొరుగులో పడేసి ఉంచాడు. ప్రేమలేఖలు కాని లేఖలలో ఒక హద్దు వున్నా, దూకేసిన ఒక అంచు కూడా ఉంది. మూడో మనిషి చదివితే ఏదో ఒక అనుబంధం ఉందనుకునే ఆస్కారం ఉంది.

ఒక యేడాదిలోనే అహల్యకి మళ్ళీ చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అయింది. గౌతం కూడా ఒక నెలలోనే బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు. మహేంద్రతో వెళ్ళొస్తానని చెప్పింది అహల్య. "ఉత్తరాలు వ్రాస్తూ ఉండండి." అన్నాడు మహేంద్ర. "చెప్పే కబుర్లు కనిపించినపుడు వ్రాస్తాను" అన్నది.

*************

ఇదంతా జరిగి నాలుగేళ్ళయింది. నాలుగేళ్ళలో ఏవో ఆశలు చూసుకుని మహేంద్ర ఉద్యోగం మానేశాడు. దానితో తాడూ బొంగరంలేని జీవితమైంది. సంస్కృతి అని, భాష అని, సంగీతం, నృత్యం, సినీ విభావరి అంటూ సాంస్కృతిక వ్యాపారంలోకి దిగిపోయాడు ఎవరికో ఒకరికి సన్మానం తలపెట్టడం, దానికోసం ఎవరినో ఎరవేసి యాభైవేలో, లక్షో విరాళం దండుకోవడం, సగం ఖర్చుతో కార్యక్రమం పూర్తిచేసి మిగతాది ఇతరులతో కలిసి పంచుకోవడం అలవాటైంది. చిన్న ప్రయత్నాల్లో విజయం పొందాక, పెద్ద కార్యక్రమాలకు దిగాడు. బొంబాయి, ఢిల్లీ, చెన్నై కళాకారులను పిలిపించి, అమెరికా తెలుగువారిని పట్టుకుని చిలవలు పలవలుగా ప్రోగ్రాములు ఏర్పాటు చేయసాగాడు. కొంతకాలం బాగనే సాగింది.

ఇతని ధోరణి బాగా అర్ధమైపోయి, కొందరు వెనక్కి తగ్గారు. కొన్ని కార్యక్రమాలు బెడిసికొట్టాయి. బహిరంగంగా పత్రికల్లో విమర్శించారు. విశ్వసనీయత కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు.

వీటన్నిటి పర్యవసానంగా డబ్బు చిక్కులు ఎక్కువ కాసాగాయి. ఎక్కడినుంచో పుట్టించి, మరోచోట సర్దుబాటుచేసే వ్యూహం ఆలోచిస్తున్నాడు. అదీ రెండు మూడు లక్షల్లో.

అటువంటి సమయంలో హోటల్లో ఆ వేపు వరసలో కూచున్న గౌతమిని గురించి మహేంద్ర మిత్రునితో అన్న మాటలవి. 'అతను నాకు బాగా తెలుసూ అని.

"ఐతే పద, వెళ్ళి మాటలు కలుపుదాం ఎప్పుడో పనికిరాకపోతాడా?" అన్నాడు


"వద్దు వద్దు, నాకు వేరే ప్లాను ఉంది. ఏదీ, బిల్లు ఇచ్చాడా?" అని జేబులో చెయ్యి పెట్టాడు మహేంద్ర. "నేను తీసుకున్నాలేగానీ, నీ ఆలోచనలు పసిగట్టటం నాబోటి సామాన్య్దికి సాధ్యమా? ఆ రసవత్తరమైన ఉత్తరాలు నీదగ్గర ఉన్నాయా?" అని అడిగాడు. లేచి బయటకు నడుస్తుంటే అడిగిన యీ ప్రశ్న మహేంద్ర వినిపించుకోలేదని గ్రహించి ఊరుకున్నాడు. గౌతం తమవైపు చూడకుండానే ఇద్దరూ బయటకి వెళ్ళి మిత్రుడి స్కూటరు ఎక్కారు.

అహల్య హైదరాబాదులోనే ఉందని తెలుసుకున్నాడు మహేంద్ర. ఆమెను చూడాలని మనసు పీకింది. బ్యాంకుకి వెళ్ళి ఆమె రూము ముందున బోర్డ్ పరికించాడు. "పెద్ద పోస్ట్!" అనుకుని, తన పేరు చీటీ మీద రాసి ఇచ్చాడు. మరో ఇద్దరు విజిటర్సు తన కంటే ముందు వచ్చినవాళ్ళు ఉన్నారు. వాళ్ళొక పది నిముషాల్లో వెళ్ళిపోయారు. బెల్లు మోగింది. అటెండరు మహేంద్రను లోపలికి పంపి, స్ప్రింగు డోరు మెల్లగా మూసి, బయటకు వెళ్ళాడు. ఆ రూములోని చల్లదనానికి, ఖరీదైన ఫర్నిచరు వైభవానికి అరక్షణం ముగ్ధుడైనాడు మహేంద్ర.

"హాయ్!" అంటే 'హాయ్' అనుకున్నారు. నమస్కారాలు విసిరారు.

"అహల్యా, నువ్వు మళ్ళీ ఇక్కడకు రావడం చాలా బాగుంది." అన్నాడు మహేంద్ర. ఏకవచనం విని కనీ కనపడనట్లు కళ్ళెత్తింది అహల్య. చేతిలో ఫైలు తిరగేస్తూ, "చెప్పండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు"? అంటూ కుశల ప్రశ్నలు వేసింది.

"సంస్కృతి, వికాసం అంటూ చేస్తున్న పనులన్నీ విసుగెత్తించాయి. ప్రస్తుతం విరామం. నువ్వెలా ఉన్నావు? పిల్లలా?" అని అడిగాడు. ఆమెలో ఏమి మార్పు వచ్చిందా అని పరిశీలిస్తూ.

"ఒక అబ్బాయి. ఏదైనా పని మీద వచ్చారా?" అన్నది. తన పని మాత్రం మానకుండా చూస్తూ కాగితాలు ఈ ట్రేలోంచి ఆ ట్రేలోకి పడేస్తోంది. సంతకాలు పెడుతోంది.

"ఏమీ లేదు. ఊరికే దర్శనం చేసుకుందామని" అన్నాడు. అ మాటలో చనువు నింపేస్తూ.

"అట్లాగా?" అని మళ్ళీ కాగితాల పరిశీలనలో పడింది. కాస్సేపు ఆ ధోరణి చూశాక "నువ్వు చాలా మారిపోయావు" అన్నాడు మహేంద్ర.

ఆమె కొంచెం సీరియస్‌గా "నువ్వు అని ఏకవచనం లోకి దిగిపోయారేంటి?" అన్నది. మహేంద్ర ఆశ్చర్యపడిపోతూ "అదేమిటి అహల్యా, నేను ఆమాత్రం దగ్గరి వాడిని కానా? " అన్నాడు.

"కాదు అనే అనుకుంటున్నాను. మీరు వచ్చినపని యింతకీ చెప్పారు కాదు" అంటూ బజ్జర్ నొక్కింది. దర్జా అయిన వేషంలో ఉన్న ఒక ప్యూన్ వచ్చి రెండు గ్లాసుల్లో నీళ్ళు నింపి ఒకటి మహేంద్ర ముందుంచాడు. ట్రేలోంచి ఫైల్సు తీసుకుని వెళ్ళాడు.

మహేంద్ర ఎంతో తెలివిగా, సులువుగా వ్యవహరించగలననుకున్నాడు కానీ అది అంత తేలిక కాదనిపించింది. "సరే నీ దగ్గర విషయం దాచడం దేనికి గానీ నాకో రెండు లక్షలు పర్సనల్ లోన్ కావాలి" అన్నాడు.

"దానికేముంది? ఫారాలు తీసుకుని అప్లయ్ చేయండి" అన్నది అహల్య.

"ఊరికే అప్లికేషను పడేస్తే పని జరుగుతుందని నమ్మకం లేదు. నువ్వు గట్టిగా పూనుకుంటే గానీ పనికాదు అని నా అభిప్రాయం" అన్నాడు మహేంద్ర. అహల్య పాములా పడగ విప్పబోతోందన్న భావం కలిగింది అతనికెందుకో.

"అలా ఎందుకు అనుకుంటారు? ఇది ఒక జాతీయ బ్యాంకు. రూల్సు ప్రకారం అప్పులు ఇవ్వడం, తిరిగి వసూలు చేసుకోవడం మా కార్యక్రమల్లో చాలా ముఖ్యమైనవి" అన్నది.

"సరేలే, రూల్సు, చింతకాయలు అంటే నీ దగ్గరకు రావడం దేనికి? ఏదో పాతస్నేహాన్ని బట్టి, అట్లాంటివన్నీ పెద్ద పట్టించుకోకుండా నా దరఖాస్తు చూస్తావని వచ్చాను" అన్నాడు నిశితంగా చూస్తూ.

"అలా చేస్తే మా ఉద్యోగాలకు ముప్పు" అన్నది. బిగ్గరగా నవ్వి, తన లౌక్యం, గడుసుదనం చాటుకుంటూ "ఆ సంగతులన్నీ నాకు తెలియదా? అది సరే గానీ, మన పాత స్నేహం గురించి ప్రస్తావించినా, నీలో చలనం లేదేం?" అన్నాడు. ఫోన్ మోగింది.

"మహేంద్ర గారూ, నాకిది పని టైము" అంటూ ఫోన్ అందుకుంది. ఈ మాటకు టక్కున వెనక్కు తిరిగి లేచి, స్ప్రింగు డోర్ బలంగా లాగి వదిలి బయటకు వచ్చాడు.

ఆ తర్వాత రెండు రోజుల్లో దరఖాస్తు ఫారాలు తీసికొని, రెండు లక్షలు పర్సనల్ లోన్‌కి దరఖాస్తు తయారుచేశాడు. షూరిటీగా కొద్దిపాటి ఆస్తి, బాగా పరపతి ఉన్న ఒక మిత్రుడిని చూపించాడు. బ్యాంకిలోని ఉద్యోగులు చెప్పడం వలన తెలిసింది ఏమిటంటే, అది సరిపోదని. "కానీ మేడం గారిని కలవండి ఒకసారి" అన్నాడు సూచాయగా. మర్నాడు కాగితాలు సెక్షనులో ఇచ్చేశాడు.

తన దగ్గర ఒక కవరులో, అహల్య తనకు వ్రాసిన ఏడెనిమిది ఉత్తరాలున్నాయి. అవి తీసుకుని బయలుదేరాడు. అహల్య దగ్గర విజిటర్సు మామూలుగానే వున్నారు. అయినా చీటీ చూడగానే తనని పిలిచినట్లుంది. చనువుగా కుశల ప్రశ్నలు వేసి, "నా ఫైలు నీ దగ్గరకు వచ్చిందటగా" అన్నాడు.

ఆమె ఎడం పక్కన ట్రేలోంచి ఒక ఫైలు తీసింది. ఎదురుగా పెట్టుకుని గబగబా కాగితాలు తిరగేసింది. ఆ పని ఆమె నిశితంగా చూస్తూ చేస్తోందని గమనించాడు మహేంద్ర. తన బ్యాగులోంచి అహల్య తనకు వ్రాసిన ఉత్తరాలు కాని, ప్రకృతి, ప్రణయం కలగలిసిన కాగితాల మీది రాతలు బయటకి తీశాడు.

"ఈవేళ సంతకం పెట్టేస్తావా?" అన్నాడు. ఆమె ఎక్కువ కదలకుండానే తలకొంచెం పక్కకు వంచింది. అది అవుననో, కాదనో గమనించకుండా, "ఎంతలే, రెండు లక్షలే!" అన్నాడు. కొంచెం ఆగి, "ఇదుగో, ఈ కవరు చూశావా?" అన్నాడు. ఆమె చూసింది.

ఉత్తరాలు బయటికి తీసి తమాషాగా నవ్వుతూ "చాలా హాట్ గానే వ్రాశావు. అప్పటి నీ మూడ్ అట్లా ఉందనుకుంటాను." అన్నాడు. అమె ముఖం జేవురించింది. టేబిలు మీద ఉన్న నీళ్ళు కొద్దిగా తాగింది. "కొంచెం నాటకీయంగా అనుకోకపోతే, నా ఫైలు మీద నీ సంతకానికీ, యీ ఉత్తరాలకీ లింకు పెడదామనుకుంటున్నాను" అన్నాడు మహేంద్ర.

అహల్య సర్దుకుని కూచుని చేయి చాపింది కవరు కోసం. ఆమె ఎదురుగా ఉన్నది తన ఫైలే అని గుర్తించాడు. "మీ ఆయనకు తెలుగు వచ్చా?" అన్నాడు. ఆమె ఈ ప్రశ్నను బ్లాక్‌మెయిలుగా అర్ధం చేసుకోవాలని అతని అంచనా. ఆమె ఊపిరి గట్టిగా వదిలి "ఆ.. నేను నేర్పించాను" అన్నది.

"నా దగ్గర ఇంతకాలం ఈ వేడివేడి రచనలు ఉంచడం వల్ల లాభం ఉన్నదన్నమాట" అని బిగ్గరగ నవ్వాడు. చేతిలో ఉన్న పెన్ను నిదానంగా తిప్పుతోంది అహల్య. "మరి యిచ్చేయండి ఆ ఉత్తరాలు నాకు" అన్నది.

"ఇస్తే, మరి ఒప్పందమేనా?"

అహల్య నవ్వింది. "మరి - అంతేగా?" అన్నది. అతను ఇవ్వబోతున్నాడు. ఆమె గబుక్కున తీసుకుని, టేబిల్ సొరుగులో పడేసుకుంది.

"అబ్బో, భలే స్పీడు" అన్నాడతను. "ఊ.." అన్నది అహల్య.

"రేపు మధ్యాహ్నం వరకు చెక్కు తయారైపోతుందా అహల్యా?" అన్నాడతను. ఆమె చిరునవ్వు నవ్వింది. బెల్లు మోగించింది. ఇంక తన ఇంటర్వ్యూ పూర్తయిందని అర్ధమయింది మహేంద్రకి.

"థాంక్యూ అహల్యా! నా దగ్గర పాము పిల్లల్లా పడి ఉన్న యీ ఉత్తరాలు అక్కరకు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటికైనా అడదానికీ, ప్రేమలేఖలకీ, కాపురాలకీ సంబంధం ఉంటుందని నాకు తెలుసు. నీకు చిన్న 'గిఫ్ట్'. అంతే" అన్నాడు. ముఖాన లేని చెమటను తుడుచుకుమ్న్నాడు.

తనకి అంత మంచి జరుగుతున్నందుకు ఉద్వేగ పడిపోతూ "థాంక్యూ" అని చేయి చాచాడు. ఆమె నమస్కారం పెట్టింది.

ఆ తర్వాత శనివారం, ఆదివారం వచ్చాయి. సోమవారం పన్నెండు దాటాక బ్యాంకిలో సెక్షనుకి వెళ్ళాడు. "సార్! నా చెక్కు ఎప్పుడు వస్తుంది? నా సేవింగ్సు అక్కౌంటులో జమ అయిపోతుందా? నేను ఏవైనా సంతకాలు పెట్టాలా?" అన్నాడు. ఆ విషయమంతా తనకి ఎంతో బాగా తెలుసునన్నట్లు పోజు పెట్టకపోతే, స్టాఫ్ తనని దబాయించేస్తారని అతని అభిప్రాయం.

అసిస్టెంటు ఫైలు తీస్తుంటే, "అదుగో, అదే నా ఫైల్." అన్నాడు మహేంద్ర. కాగితాలు గుర్తు పట్టేస్తూ.

ఆ కుర్రాడు కాగితాలు తిరగేసి "శాంక్షను కాలేదు గదా సార్!" అన్నాడు.

"శాంక్షను కాలేదా?" అన్నాడు మహేంద్ర తెల్ల ముఖం వేసి. నీరసం అతని మాటలో.

"ఔను. షూరిటీల ఇన్‌కం సరిపోదు" అన్నాడు, అసిస్టెంట్.

"మరి ఎట్లాగ? వెళ్ళి అహల్య మేడంని అడగమంటారా?"

"మేడం లేరు కదండీ? ఒక నెల లీవు. ఆ తర్వాత బొంబాయికి ప్రమోషను మీద వెళ్ళిపోతారు" అని చెప్పాడతను.

మహేంద్ర గింజుకుంటున్నాడు. ఏమీ పాలు పోలేదు. "అహల్య ఎంత కిలాడి!" అనుకున్నాడు. తను భయంకరంగా ఓడిపోయాడు. ఎదురు గోడ వంక చూస్తూ అరనిముషం కూచున్నాడు. అసిస్టెంటు తన పని తాను చేసుకుంటున్నాడు.

"జ్వలించిన శిల" కథకు విశ్లేషణ

నిలువెల్లా విషపూరితమై, ఇతరులకి, అందులోనూ స్త్రీలకి చెరుపు చెయ్యాలనీ, అవకాశం దొరికితే వారిని బ్లాక్‌మెయిల్ చేయాలనీ చూసే 'మహేంద్ర ' లాంటి పురుష పుంగవులున్న సమాజం మనది. అటువంటివారి నుంచి తెలివిగా తప్పించుకుని బయటపడింది అహల్య. ఆమె ఒక బ్యాంక్ ఆఫీసరు. భర్త గౌతం డబ్బున్నవాడు, తమిళుడు. ఆమెకున్న సంగీత సాహిత్యాల పట్ల అభిమానాన్ని ఆసరాగా చేసుకుని, వారి మధ్య చీడపురుగులా చేరి తనకు అనుకూలంగా మలచుకున్నడు. ఆమెచుట్టూ ఉచ్చు బిగించాననుకుని ఖంగుతిన్నాడు. స్త్రీ అంటే ఆటబొమ్మ అనుకునే పురుషపుంగవులకి కొదువలేదు సమాజంలో. అటువంటివారికి బుధ్ధి చెప్పే కథ ఇది. ఎక్కడ స్త్రీలని గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారని అంటారు. కనీసం మనసున్న మనిషిగా అయినా "స్త్రీ"ని చూడటం అలవర్చుకోకపోతే "పురుషుడు" ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని నా ఉద్దేశ్యం. పరపురుషుల్ని తేలికగా నమ్మేసే విధంగా స్త్రీలుకూడా ఉండకూడదు. తాము చిక్కుల్లోపడే సందర్భాలు ఏరకంగా ఉంటాయో తెలుసుకుని అర్ధం చేసుకుని మసలుకోవడం మంచిది.

- తమిరిశ జానకి