కవిత్వంలో వ్యకిత్వ వికాసం - 4

-- ద్వా. నా. శాస్త్రి

శ్రీనాథుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఇంతా అంతా కాదు. బోలెడంత ఉంది. అతని వ్యక్తిత్వం, జీవితం నేర్పే గుణపాఠాలు ఎన్నో. బ్రతికితే శ్రీనాథుడిలా బతకాలి - మరణించినా శ్రీనాథుడిలాగే మరణించాలి.

"పనివడి నారికేళ ఫలపాకమునంజవియైన భట్టహ

ర్షుని కవితాను గుంభములు సోమరిపోతులు కొందఱయ్యకౌ

నని కొనియాడనేరదియట్టిద, వేజవరాలు చెక్కుగీ

టిన వసవల్చు బాలకుడు డెందమునంగలగంగ నేర్చునే?"

శ్రీనాథుడు శృంగారనైషధంలో ఈ పద్యం రాశాడు. సంస్కృతంలో భట్టుహర్షుడు నైషధ కావ్యం రాశాడు. అది విద్వదౌషధం వంటిది అన్నారు. 'నారికేళపాకంలా ఉందండి బాబూ' అన్నారు. కొరుకుడు పడదని ఈసడించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాసిందే పై పద్యం. కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కృషి అవసరం. ప్రయత్నం అవసరం. సోమరితనం పనికిరాదు. విశ్వనాథ మరొకసారి ఇలా అన్నారు - "కవిత్వం అర్థం కాదంటారు. అర్థం చేసుకోడానికి నువ్వేం ప్రయత్నం చేశావ్. జువాలజీ అర్థం చేసుకోవాలంటే జువాలజీకి సంబంధించినవన్నీ చదువుతావా? మేథమాటిక్స్ అర్థం చేసుకోవాలంటే ఎంత కృషి చేస్తావ్? మరి కవిత్వం అర్థం చేసుకోవటానికి కృషి అక్కరలేదా?". శ్రీనాథుడు "అర్థం కాదు - కొరకరాని కొయ్య " అనే వారిని చూసి చిరాకు పడిఉంటాడు. కాబట్టి మంచి ఉపమానంతో ఇలా అన్నాడు - "మాంచి వయసులో ఉన్న కన్య చిన్నపిల్లాడి చెక్కు గీటితే ఆ పిల్లాడిలో ఏ భావం ఉంటుంది?". అంటే సరసానికైనా విరసానికైనా ఒక స్థాయి ఉండాలి. లేకపోతే అపాత్రదానంలా, అరసికుని కవిత్వంలా వ్యర్థమై పోతుంది. కాబట్టి ఏమాత్రం అర్థం చేసుకోకుండా స్థాయి లేకుండా విమర్శించేవారు - అదిగో ఆ బాలుని వంటి వారే - అని భావం. ఇది కవిత్వానికే చెప్పినా అన్ని చోట్ల, అన్ని రంగాలకూ వర్తిస్తుది.

శ్రీనాథుడ్ని పండితులు - సంస్కృత పండితులు ఈసడించారు. 'డుమువుల కవి ' అని వెక్కిరించారు. "నీది ఏం భాషయ్యా బాబూ - సంస్కృతమా? తెలుగా?" అన్నారు.

ద్వా.నా.శాస్త్రిగా పేరొందిన ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారు కృష్ణాజిల్లా లింగాల గ్రామంలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టా పొంది తెలుగు భాషా బోధన చేస్తూ 2004లో రీడర్‌గా స్వఛ్ఛంద పదవీ విరమణ చేశారు. విమర్శకుడిగా, కవిగా ఎంతో పేరెన్నికగన్న శాస్త్రిగారు ఎన్నో సత్కారాలు, పురస్కారాలు పొందారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న తెలుగు సాహిత్య కృషికి తనవంతు క్రియాత్మక సహాయాన్ని అందిస్తున్నారు. వీరు తెలుగు ఎం.ఫిల్., పి.హెచ్.డి. ప్రశ్నపత్రాల తయారీలో మరియు పరీక్షకుడిగా విశేషమైన సేవ చేస్తున్నారు.

"ఎవ్వరేమండ్రు గాక నాకేల కొఱత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష"

అని ధైర్యంగా రాశాడు.

"కంటికి నిద్ర వచ్చునే? సుఖంబగునే రతికేళి? ... శత్రువుడొకడు దనంతటివాడు గల్గినన్" అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు.

"డంబు సూపి భూతలంబుపై తిరుగాడు

    కవిమీదగాని నాకవచమేయ

దుష్ప్రయోగంబుల దొరకని చెప్పెడు

    కవి శిరస్సున గాని కాలుచాప

సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు

    కవుల రొమ్ముల గాని కాల్చివిడువ

చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు

    కవినోరు గాని వ్రక్కలుగ తన్న"

అని ఎదిరించి నిలిచాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి గదా అన్న భావం చెప్పక చెప్పాడు.

"బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము"


అని భీమఖండంలో నూతిలో కప్పలవంటి వదరుబోతు పండితులపై కన్నెర్రజేశాడు. అయినా ఎల్లవేళలా ఈ ఆత్మ ప్రత్యయం, ఈ ఠీవీ చెలామణి కాదు. సందర్భాన్ని బట్టి ప్రయత్నించాలి. అందుకే శ్రీనాథుడు ఒక్కొక్కసారి సహనం అవసరమేనంటూ చెప్పిన పద్యమిది -

"నికటముననుండి శ్రుతి నిష్ఠురముగ

నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు

డుడిగి రాయంచ యూరక యుంట లెస్స

సైప రాకున్న నెందేని జనుట యొప్పు"

- కాకులు గోలపెడుతున్నప్పుడు ఓర్పుతో సహించాలి. లేదా వాటినుండి దూరంగా వెళ్ళాలి. అంటే ఆ కాకులతో మనమూ గోలచేస్తే మన స్థాయి పతనమైనట్టే గదా! ఇది మన జీవితంలో చాలా సందర్భాలకి ఉపకరిస్తుంది.

శ్రీనాథుడు భోగి. రసికుడు. ఎన్నో సుఖాలు అనుభవించాడు. అవకాశాలను అనుకూలంగా మలచుకోవడంలో తనకు తానే సాటి. అయినా రాజుల రోజులు ముగిసిన తర్వాత కష్టాల పాల్పడ్డాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడూ, కవిసార్వభౌముడు, ఆగమ జ్ఞాననిధి అయిన శ్రీనాథుడు ఎన్నో బాధలు పడ్డాడు.

"కుల్లాయుంచితి కోక చుట్టుతి మహాకూర్పాసముండొడ్లితిన్

వెల్లులిందిల పిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ

కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడిన్"

అని వాపోయాడు. గతకాలంలో ఎప్పుడూ చేయలేని, ఇష్టపడని పనులు చేశాడు. అలవాటు లేనివన్ని అనుభవించాడు. ఎంతటివాడికైనా కాలం (టైం) బాగుండకపోతే అష్టకష్టాలు తప్పవని అనుభవాలు చెప్తాయి. జొన్నకూడు తిన్నాడు. సన్నన్నం దొరకలేదు. తన పంటపొలాలకు శిస్తు కట్టలేక పోయాడు. శిస్తు కట్టనందుకు కఠినమైన శిక్షలు అనుభవించాడు. వాటిని ఒక పద్యంలో వివరించి మనకి వ్యకిత్వ వికాస తరగతులు నిర్వహించాడు. జీవితం "చక్రార పంక్తి రివ గచ్చతి భాగ్యపంక్తిః"కి నిదర్శనం. ఎప్పుడూ కష్టాలే ఉండవ్. ఎప్పుడూ సుఖాలే ఉండవ్. వెలుగునీడలు సహజాతి సహజం. సుఖాలకి పొంగిపోకూడదు. కష్టాలకు కుంగిపోకూడదు. అదే స్థిత ప్రజ్ఞత్వం. మనం మంచి జరిగితే విర్రవీగి పోతాం. కష్టం లేదా దుఃఖం వస్తే న్యూనతాభావంతో ఇతరులను తిట్టిపోస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. "బాధే సౌఖ్యమనే భావన " రావాలి. సుఖదుఃఖాల్ని స్వాగతించగలవాడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరొకరికి ఆదర్శప్రాయుడూ కాగలడు. శ్రీనాథుడు అటువంటి వ్యక్తిత్వం కలవాడు కాబట్టే ఈ పద్యం వెలువడింది -

"కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా

    పురవీధి నెదురెండ పొగడదండ

సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా

    నగరి వాకిటనుండు నల్లగుండు

వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత

    వియ్యమందెను గదా వెదురు గడియ

ఆంధ్ర నైషధకర్త యంఘ్రి యుగ్మంబున

    తగిలియుండెను గదా నిగళయుగము "

శ్రీనాథుడు ఏడువందల టంకాలా సుంకం చెల్లించక పోవటంవల్ల పై శిక్షలు అనుభవించాడు. కాని అంత కఠినమైన శిక్షలు అనుభవిస్తున్నప్పుడు కోపం రాలేదు - తిట్లు రాలేదు. కష్టాలను 'స్పోర్టివ్'గా తీసుకొనే తత్వం కనిపిస్తుంది. ముళ్ళకాయల దండ మెడలో గుచ్చుకొని బాధిస్తుంటే - "ఈ పొగడ దండ ఎంత అదృష్టవంతురాలు - కవిరాజు కంఠాన్ని కౌగిలించుకొండి. ఈ పెద్ద బండరాయి - ఊరు చివర పడి ఉండేది - ఇప్పుడో, కవిసార్వభౌముని భుజం మీద కులుకుతోంది. వీరభద్రారెడ్డి ఆస్థానకవి చేతిలో ఈ వెదురు గడియ (చేతికి వేసే శిక్ష) వియ్యం అందుకుంటోంది. ఈ సంకెళ్ళు శృంగారనైషధం రాసిన కాలిని అలంకరించాయి" - అంటూ ఒకపక్క బాధపడుతున్నా కవిత్వం చెప్పాడు. ఏడుస్తూ కూర్చోలేదు. 'అదీ వ్యకిత్వ వికాసం అంటే!'.

శ్రీనాథుడు గత భోగాల్ని తలచుకొని దిగులు చెందినా మరణానికి జంక లేదు. ఎంత 'కలేజా' ఉందో పరిశీలించండి:

"కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డి

    రత్నాంబరంబు లేరాయుడిచ్చు?

కైలాసగిరి పంట మైలారు విభుడండే

    దినవెచ్చ మేరాజు దీర్చగలడు?

రంభగూడే దెనుంగు రాయరాహత్తుండు

    కస్తూరికేరాజు ప్రస్తుతించు?

సర్వస్థుడయ్యె విస్సన్న మంత్రి మఱి హేమ

    పత్రన్న మెవ్వని పంక్తి గలదు?"

అంటూ గతవైభవాన్ని నెమరు వేసుకొన్నా - మరణం సమీపిస్తున్నా దిగులు చెందడం కన్న పరిస్థితిని ఎదుర్కొనే స్థైర్యం కలవాడు శ్రీనాథుడు. జీవితం ఒక సవాలు - దాన్ని స్వీకరించాలి అన్నదే శ్రీనాథుడు ఇచ్చే సందేశం. దీనికి ఈ రెండు పాదాలు నిలువెత్తు సాక్ష్యాలు:

"దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి "

-స్వర్గలోకంలో తనకంటే ముందు వెళ్ళిన మహాకవులున్నారు. వాళ్ళ గుండెలు గుభేలుమనేలా - అమ్మో, శ్రీనాథ మహాకవి వస్తున్నాడు అని భయం కలిగేలా - నేను కూడా స్వర్గానికి వెళ్తున్నాను " అని ఠీవీగా పలికాడు. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. దాన్ని స్వీకరించాలి - దానికి గుండె ధైర్యం కావాలి. ఈ విధంగా శ్రీనాథుడి జీవితం, పద్యాలు మనకి కావలిసినంత 'పెర్సనాలిటీ డెవలెప్ మెంట్' ను బోధిస్తాయి.