చిత్ర కవిత్వం

సిలికానాంధ్ర మార్చ్ నెలలో ఉగాది సందర్భంగా నిర్వహించిన "చిత్ర కవిత్వం" కార్యక్రమంలో ప్రేక్షకులకు మూడు చిత్రాలను చూపించి వాటికి తమ కవితా స్పందనను అందించవలసినదిగా కోరింది. అందులో ఒక చిత్రమే ఈ "మన్నుతిన్నానని మిన్నంటిన ఆనందం" తొణికిసలాడ్తున్న ఈ పొన్నారి, సిలికానాంధ్ర క్రియాశీలసభ్యులు, వక్కలంక సూర్య, సుస్మితల చిన్నారి. అనేకమంది ఆశువుగా వెల్లువెత్తిన తమ కవితాస్ఫూర్తికి ఇచ్చిన అక్షరరూపాలే ఈ శీర్షికలో పొందుపరుస్తున్నాం...

హెచ్.సువర్ణ: మట్టిలో ఉండే మాణిక్యాన్ని నేను

తొట్టిలో ఊగే విరిబోణి నేనే

నట్టి ఇంట్లో నవ్వే అలివేణి నేనే

ఇట్టి కవిత రాయించే బాలామణి నేనే

నూతి సుధాకరశర్మ : మన్నుతిన్నట్టి నను జూచి తన్నబోకు!

మాయమర్మాలు లేనట్టి మన్నుమిన్న

మిన్నుజేరెడు దాక ఈ మన్నె గతిగ!

నమ్మతినుచుంటి వెన్నగ నమ్ముమమ్మ!

వి.వి. లక్ష్మి: నేటిబాలికలే రేపటి వెలుగు

శ్రీసర్వజిత్ కావాలి వారికి రక్ష

ఆ భూజాత కావాలి వీరికి ఆదర్శము

ఈ పృథ్వీసుతకు కావాలి శ్రీరామరక్ష

వక్కలంక సూర్య: చూపులో పసితనం

మాటలో చూపేవు

పెదవిపై చిరునవ్వు

కళ్ళతో పలికేవు

కూచిభొట్ల బొధిశ్రీ: దబాదబా మన్ను తింటున్న పాప

చకాచకా వస్తున్నతండ్రిని చూచి

పకపకా నవ్వెను చిలిపి కళ్ళతో

టకటకా ఎగిరిపోయెను తండ్రి కోపము

నందుల వెంకతేస్వరరావు: అందం ఆనందం

పరిపూర్ణం చిరునవ్వుల

దరహాసం కాదు పరిహాసం

అయినా చిరునవ్వు అరనవ్వు

పరిపూర్ణం మనస్సుకు ఆనందం

మునుకుట్ల చంద్రశేఖర్: విరజిల్లుతోంది ఈ చిన్నిపాప అందరికి సంతోషం

వినిపిస్తోంది తన జిలిబిలి నవ్వుల కమ్మని స్వరం

శివ : మన్ను చూసి తన్మయత్వంతో ఆడుతున్న పాప

మరొక పాప ముఖంపై మన్ను చూచి నవ్వెను పకపక

పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం: పసివారి ముసిముసినవ్వులు

అనిపించు విరబూసిన పువ్వులు

ముద్దుచేయాలన్న మువ్వలు

జీవితమనే వెనీలాకాశంలో

దూసికెళ్ళే తారాజువ్వలు

డి. సుధారాణి: నేటి బాలలే రేపటి పౌరురాలు

ఆకతాయితనముగా తిన్న మన్ను

కావాలి ఆ బాలికకు దీవెనలు

సర్వజిత్తు కావాలి ఆ బాలికకు శుభాశీస్సులు

దశిక శ్యామ: తిన్నాడు చిన్ననాడు చిన్నికృష్ణుడు మన్ను

తింటున్నాడు ఈనాడు ఈ బాలకృష్ణుడు మన్ను

నీవు చేయలేని పని నేను చేస్తున్నానంటూ!!!

గర్వంతో నవ్వుతోంది చిన్నారి!

వెక్కిరిస్తోంది తన చాతుర్యం చూపిస్తోంది ఈ పొన్నారి

తంగిరాల మీరాసుబ్రహ్మణం: పాపాయి పుట్టి పండగే తెస్తుంది

పాల నవ్వులతో పుడమి పులకించు

బోర్ల పడిననాడు బొబ్బర్ల పండుగ

అడుగు వేసినపుడు అరిసెల పండుగ

మన్ను తిని నవ్విన చిన్నారి నవ్వు

చిన్నికృష్ణుని బోలు చిలిపినవ్వు

బడికి పంపి పాపను బెంగపడు తల్లి

వడిగ ఎదిగిన కూతుగని పొంగిపోవు

అంతలోనే పెళ్ళాడ వచ్చిన చిన్ని తల్లి

అందాల రాకుమారుడి వెంటవెళ్ళు

అమ్మనాన్నకు వరమే ఆడనుండే పిల్ల

కమ్మని ప్రేమను కలకాలము పంచు

ఉమ : ముద్దుగారే ముద్దుపాప

మన్నుతిన్నా మురిపాలే

అందాలే!!!

ఆ మురిపాల నవ్వు ముందు

నాన్నకోపం

ఎంతసేపు నిలుస్తుంది?

రిత్విక్: బోసినవ్వుల పాపాయి

భావి తరాల బుజ్జాయి

డాలర్ల డాబుతో బేజారైన జీవులకు

నేర్పాలి నేర్పాలి కల్మషంలేని కిలకిలారావాలు

బాలవర్థిని: ముత్యాల పళ్ళు

మెరిసిన కళ్ళు

మల్లెల నవ్వు

మురిపించెను మనస్సు