కథా విహారం

 

- రచన : విహారి     


 

 ’తుమ్మేటి కథల మూలం
సామజిక పరిణామ స్పృహ

 
  కథ మనకి జీవితంలో, జీవిత రహస్యంతో, జీవిత వైచిత్రితో కొంత కొత్త పరిచయం కలగ చెయ్యాలి’ అన్నారు సుప్రసిద్ధకవి.

కష్ట సాధ్యమైన ఈ మూడు ప్రయోజనాలు ఒక్క కథలోనే సాధిస్తూ ఉత్తమ కథలురాస్తున్న ఈ తరం కథకుల్లో తుమ్మేటి రఘోత్తమరెడ్డి ముందు వరుసలో వున్న రచయిత, కథా ప్రయోజనం పట్ల లక్ష్యశుద్దీ, కథా రచనపట్ల చిత్తశుద్ధీ వున్నాయి - తుమ్మేటికి.

రఘోత్తమరెడ్ది కథల్లో రెండు ముఖ్యమైన పాయలు కనిపిస్తాయి. ఒకటి ఉత్తర తెలంగాణా ఉద్యమచిత్రం నేపధ్యంగా సాగినవి. ఇది ప్రజాపోరాటాలు తెచ్చిన పరిస్థితులకు ప్రతిస్పందనలనదగిన కథలు. రెండవ పాయ. వర్తమాన సామాజిక పరిణామ క్రమంలో విచ్ఛిన్నమవుతున్న మానవీయ విలువలు, మానవ సంబంధాల చిత్రణ.

ఈ రెండు తరహా కథల్లోనూ గోచరించే ఒక ప్రత్యేక గుణం - కథా వస్తువుకు సంబంధించిన రచయిత చైతన్యం. చైతన్య స్ఫోరకమైన కథా వస్తువుని రఘోత్తమరెడ్డి నిజాయితీతో, వాస్తవికవితతో, అబ్జక్టివ్ గా పాఠకుల మందుంచుతాడు. ఎక్కడా - కథల్లోని పాత్రలు సిద్ధాంత చర్చల్లోకి దిగవు. ఉద్వేగానికీ లోనుకావు. రచయిత కంఠస్వరంలో అతని ప్రాపంచిక దృక్పథం తెలుస్తూ వుంటుంది. ఆ దృక్పథం నిర్ణయించే కథా లక్ష్యమూ ధ్వనిస్తూ వుంటుంది

రఘోత్తమరెడ్డి కథల్లో ’చావువిందు’,’జాడ’ కథలు మొదటి పాయలోనివి. వ్యవస్థ ఎంత కల్లోలంగా వున్నదో, ఎంత సంక్లిష్టంగా, సమస్యత్మంగా వున్నదో ఈ కథల్లో చిత్రితమైంది.

ఈ రెండు కథలకు సాహితీలోకం బహుశ ప్రశంసల్ని అందించింది.
ఉత్తమ తెలంగాణా సామాజిక జీవితంలో సంఘర్షణ తీవ్రత ’చావు విందు’ కథలో చిత్రితమైంది. నర్సింహరెడ్డి భూముల్లో ఎర్రజెండాలు. కోపంతో ఉరుకు బట్టింది ఆయన భార్య. అసలే భారీ మనిషి. ’అద్దత్తమ్మ మీరెల్లకుండ్లి, మామయ్య వచ్చినంక చూసుకుంటారు’ అని కోడలు చెప్తున్న వినలేదు ఆ వేగంలో రాయి దట్టుకుని ’ముల్లెకట్ట తీర్గు పడ్డది’ ’ఛాతీ నొత్తుందే పిల్ల’ అనే ఆఖరు మాటతో ఆమె పోయింది.

పదకొండు రోజులు తిరిగివై. ఈ రోజు చావు విందు.
నర్సింహరెడ్డికి కళ్లు మండుతున్నాయి. ’కళ్లు మూసుకున్నా అదే దృశ్యం కనిపిస్తోంది. పెయ్యంత కారం రాసుకున్నట్లు మండుతోంది. కోపం బుసబుస పొందుతోంది ఈ జమీనుకోసం తను పడిన గొడవలు సామాన్యమైనవేమీ కావు. అన్నీ గుర్తుకొచ్చాయి. జరిగింది పీడకలో నిజమో ఇంకా తెలియనంతా దిగ్ర్భమలో పడిపోయాడు. మనిషి గడ్డ కట్టుకపోయాడు. ఈ కట్టు ఎక్కడ తెగిపోయిందో ముసలాయనకు తెలియడం లేదు..

విందుకి ఆయన వాళ్లంతా చేరారు. నలుగుతూ నాలుగు మాటలుగా సాగింది సంభాషణ. తాగుతున్నారు, తింటున్నారు నర్సింహరెడ్ది కొడుకు మధుకర్ వాళ్లందరి మాటలూ వింటున్నాడు. వాళ్ళ భేషజం, భయం, మేకపోతు గాంభీర్యం, నిస్సహాయతా - అన్నీ, అంతా - గమనిస్తున్నాడు. అందరిలోనూ జెండాలు పాతిన వాళ్ళమీద కసి, కోపం. ఉద్రేకం, ఆవేశం, తాగినమైకం మనుఘల్ని అటూ’ఇటూ దొర్లిస్తున్నది కూడా.

ముకుందరెడ్డి మనమేమీ చెయ్యలేం, వాళ్ళు దయదలిచి మనకు ఎంతభూమి ఇస్తే అంత. అంతకుమించి ప్రస్తుతానికి మనమేం చెయ్యలేం అన్నాడు. దానిమీదా చర్చ. కడకు నర్సింహారెడ్డికి ఓ పదెకరాలు రావచ్చని తేలింది. అదీ దున్నుకుంటేనే!

ముసలాయన మనసులో తుఫాను. ’ఉన్నట్టుండి ఆయన కళ్ళల్లో నీరు బుస బుస పొగింది. బోరున ఏడ్వసాగిండు. అంతా దిమ్మెర పోయారు. అందరికీ ఊహించని దౌర్భగ్యపు అనుభవమది’.

’మధుకర్ రెడ్డి నిశ్శబ్దంగా నిశ్చలంగా నిలబడి రెండు సిగరెట్లు ఒకదాని తర్వాత ఒకటి కాల్చేశాడు. తన తండ్రి, అక్కడ చేరిన వాళ్ళంతా దాదాపుగా కుప్పకూలి పోయినట్టేనా? ఇంకా అర్థం పర్థం లేని ప్రతిఘటనను కొనసాగిస్తారా? ఏది ఏమైనా వాళ్ళ పద్ధతికి కాలం చెల్లినట్టే......ఔనా! అయితే ఈ గాడుపు దుమారంలో తనెక్కడ నిలబడాలి?".......

ఒక పరిణామం తీరు తెన్నులు తెలుస్తున్నాయి. ఒక భౌతిక వాస్తవం కళ్ళముందు నిలిచి వుంది. మనుఘలు కోల్పోబోతున్న, ’భూమి’ ఆ మనుషుల అహం మీద, అధికారం మీద, ధన ప్రాబల్యంమీద, తరతరాలుగా అనుభవిస్తున్న హక్కుమీద వేసే సమ్మెట దెబ్బ! అదీ కథా బీజం! ఆ మనుఘల బహిరంతర స్వరూప స్వభావాల దృశ్యస్ఫూర్తి. సహజచిత్రీకరణ ’ఇవీ చావు విందు’ కథలో ప్రస్ఫుటమైన ప్రత్యేకతలు. మధుకర్ తరం - గమనం ఎటువైపు? ఇదీ ప్రశ్న! చెప్పకయే చెప్తున్న సమాధానం కథనొక ఔచిత్యాన్నీ, ఔన్నత్యన్నీ కూర్చింది. కథా శిల్పంలో భాసించింది.

’జాడ’ కథ కూడా వాచ్యం కాని వాస్తవంతో మొరుగు లీనిన రచన. ’వాడు’ సుజాత తోబుట్టువు. వాడిని ఆమె తల్లిలా సాకింది. కడుపులో బడబాగ్ని దాచుకుని వాడికోసం భర్త నిరాదరణని భరించింది ఆమె ఎక్కడా ’తిరుగుబాటు’ భార్య కాదు సంవేదనల కీల. ’వాడు’ వెళ్ళిపోయాడు. వాడు తమ్ముడు జైల్లో బందీ. ఇప్పుడు విడుదలయ్యాడు. వాడి ’జాడ’ కోసం ఇల్లు వదిలి అన్వేషణలో బయల్దేరింది. వాడు ఉన్నాడనే రవ్వంత ఆశ సుదీర్ఘ ప్రయాణం చేయిస్తుంది. సుజాతను వెతుక్కుంటూ ఆమె భర్త బయలుదేరాడు. అతనితో తన చర్యలకు ఆత్మ పరీశీలన మొదలవుతుంది. కడకు ’వాడి’ జాడ తెలిసింది. హరిజన వాడలో చాలామంది పొగై వున్నారు. అనేక గొంతులు ఏడుస్తున్నాయి. ముసలి రాజమ్మ ’అయ్యా మా కొడుకు దినాల కచ్చిండ్లానయ్యా’ అని వర్షిస్తూ పొర్లి పొర్లి ఏడుస్తుంది సుజాత భర్తని చూసి. మరికొందరు తమ సమస్త దు:ఖాలకు కారణభూతమైన వాళ్ల నెవరినో ఆగ్రహావేశాలతో శపిస్తున్నారు. తిడుతున్నరు. ఒకరి నొకరు అందులోనే ఓదార్చుకుంటున్నరు."

సమాజాన్ని అస్తవ్యస్తం కావిస్తున్న దారుణాలు, పరిస్థితులు, చిక్కుముడుల కొస అందీ అందనట్లు వుంటుంది. కానీ చదువరులకి గ్రహించేందుకు వీలుగా కనిపిస్తూ వుంటుంది. అదీ కథకుడుగా రఘోత్తమరెడ్డి సాఫల్యం, విజయం. ఉద్యమ నేపథ్యాన్ని కథల్లో శక్తివంతంగా చిత్రించటానికి, రఘోత్తమరెడ్డి ఆ ప్రాంత జనజీవనాన్ని నిశితంగా పరిశీలించటం, ఆ జనం గుండె చప్పుడుని వినగలగటాం - ఎసెట్స్ గా ఉపకరించాయి. పాత్రచిత్రన గురించి చెప్తూ మధురాంతకం రాజారాం అంటారు. "పాత్ర తన చుట్టూరా నెలకొన్న దేశకాల పరిస్థితుల నడుమ ఎబ్బెట్టుగా లేకుండా ఇమిడిపోవాలి" అని. "చావు విందు", ’జాడ’ కథలు చూస్తే, రచయితకి ఈ లక్షణం మీద గల పట్టు అర్థమవుతుంది.

రెండవ పాయలోని కథల్ని రెంటిని చూద్దాం. అవి ’ఉరి’, ’వేటగాడిచూపులు’.
’ఉరి’ బొగ్గు బావిలో మమేకమై పోయిన రామచెంద్రం, నారాయణల కథ, రామచెంద్రంకు ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు మిగిలి వుంది. సింగరేణి పరిస్థితులు బాగాలేవు. అధికారులు అందిన కాడికి మేసిండ్లు. పెద్ద పెద్ద మిషన్లు పరాయి దేశాల నుండి తెప్పించుండు.. కార్మికులకు తమ తర్వాత పిల్లలను పెట్టించుకునే హక్కు ఊడుతుందనే వదంతులు. రామచెంద్రం ఆ గొడవల వల్ల ఉరేసుకుని చనిపోయాడు. నారాయణకి ఇదొక ఆశనిపాతం. చివరకి అది ’ఉరి’ కాదు. హత్య అని తెలుస్తుంది ఒక్క నారాయణకే. నారాయణ కొడుకూ ఆయన ఉద్యోగం కోసం తండ్రిని దిగి పొమ్మంటున్నాడు.....’ఉరి’తాడు కొస మొదలు ఎవరి చేతిలో ఉన్నాయి’ అనే ఆలోచన వచ్చింది నారాయణకు. నారాయణ కొడుకు కోసం రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నాడు. నారాయణకు నిద్రరాదు. కొడుకు ఇంటికి రాడు’ అని ముగుస్తుంది కథ! మంత్రిగారి మీటింగులో ఆందోళన అలజడి....అరుపులు, కేకలు.....పోలీసులు జనాన్ని తరుముతున్నారు. నారాయణ కొడుకు ఏమయినట్టు? అదే శేష ప్రశ్న! రామచెంద్రం ’ఉరి’ నారాయణకీ అనుసరణీయమైన సూచనా? ఇదీ మరో ప్రశ్న! చదువరులు ఎవరికి వారే సమాధానం చెప్పుకోగలరు! ’నారాయణకు నిద్రరాదు. కొడుకు ఇంటికి రాడు!’ అనుకోగానే అర్థమవుతున్నది.

అలాగే ’వేటగాడి చూపులు’ కథలో పెళ్ళి అనే బంధానికి బలయిపోయి, భయవిహ్వలయై, భర్తకు నీడ కాబోతూ, సంప్రదాయమనే ఛాందసాల పళ్ళచక్రంలో ఇరుక్కుని, అత్తవారింటికి తరలిపోతున్న ఒక ముస్లిం యువతి మూగ వేదనని, అద్భుతంగా చిత్రించాడు రచయిత. కథంతా సమీరా అనే పెళ్ళికూతురి స్నేహితురాలి దృక్కోనం నుంచీ నడుస్తుంది.

ఇక తుమ్మేటి రాసిన మరో మంచి కథ ’పసిపిల్ల’ మీద ఎంతో చర్చజరిగింది. తుమ్మేటి పరిశీలనా, జీవన పరిజ్ఞానమూ కలిసి ఆయన కథలనొక తుష్టినీ, పుష్టినీ చేకూర్చాయి.

కథానానికి సంబంధించి రఘోత్తమరెడ్డి ఎలాంటి పటాటోపాలకి పోడు. సరాసరి కథ చెప్పటం మొదలెట్టి, సన్నివేశాల్ని నడిపించి, పాత్రల్ని తమ నడకా, నడవడికా తమవిగా నడవనిచ్చి, కథని తానాశించిన ప్రయోజనం ఒడ్డుకుచేర్చి ముగిస్తాడు. "there must be another way of living that is not futile' అనే conviction అధారంగా బహుశ - తుమ్మేటి కథాంతాన్ని open ended గానే ఉంచటానికి ఇష్టపడుతున్నారనుకుంటాను. పరిష్కారాల కోసం కథని కొనసాగిస్తే, మనుఘల జీవితాలు, మనుగడా మరింత జటిలమై పోతాయి!

తుమ్మేటి వస్తు స్వీకరణకీ, కథా కథన శక్తికీ, కథాత్మక వాస్తవికతకీ, అతని కథలు గీటురాయిలా నిలుస్తాయి. ఈ తరం రచయితల్లో తుమ్మేటిదొక బలమైన కలం!
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)