Sujanaranjani
           
  కబుర్లు  
  వీక్ పాయింట్
          సేనాపతి - చాపేగతి!  
 

- రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి

 
 

ఎంతైనా సేనాపతి సేనాపతే! మెరపు వేగంతో ఊహించని వైపునుంచి దెబ్బమీద దెబ్బతీసి శత్రువును చక్రబంధంలో ఉక్కిరిబిక్కిరి చేసే విద్యలో ఇతరులు ఎంతటివారైనా సేనాధిపతుల ముందు బలాదూరే! భారత సైన్యాధిపతి జనరల్ వి.కె.సింగుగారి తాజా ప్రతాపమే ఇందుకు నిలువెత్తు రుజువు. సాధారణంగా అందరికీ పుట్టిన తేది ఒకటే ఉంటుంది. సింగుగారికి మాత్రం రెండు! సైన్యంలో చేరి, ప్రమోషన్లు కొట్టేందుకు ఒకదానినీ, రిటైర్మెంటును ఏడాది పొడిగించుకోవటానికేమో రెండోదానినీ ఆయన సవ్యసాచిలా ప్రయోగించగలడు. ఆ విన్యాసం కుదరదు పొమ్మనేసరికి తనకు జీతమిచ్చే సర్కారుమీద సేనాపతి అలిగి, కోర్టుకెక్కాడు. అక్కడా చుక్కెదురయ్యేసరికి తోకముడిచి, ఇంకో రెణ్నెల్లలో కుర్చీ ఖాళీ చెయ్యటానికి మానసికంగా సిద్ధపడ్డాడు. ఈలోపు ఊరకే కూచుంటే ఊరా పేరా? అదనంగా ఇంకో ఏడు తాను సుఖంగా కొలువులో చేరగిలబడకుండా అడ్డుకున్న దుష్టులనూ, తనను ఇన్ని దశాబ్దాలపాటు తేరగా పోషించిన దొరతనాన్నీ, ఇంతదాకా తన చేతికింద నడుస్తున్న సైన్యాన్నీ, దాన్ని నమ్ముకున్న దేశాన్నీ, ప్రపంచంలో దాని ప్రతిష్ఠనూ అంత తేలిగ్గా వదిలేస్తే ఎలా? అందుకే సింగ్‌జీ యమా బిజీ అయిపోయారు. రెండేళ్లకింద భారత సైన్యాధిపతి అయింది మొదలుకుని రెండో పుట్టిన తేదీ ఆధారంగా పదవీ కాలాన్ని ఏడాది పొడిగించుకోవడమనే అతిముఖ్య జాతీయ భద్రతా సమస్య మీద ఏక దీక్షగా దృష్టి లగ్నం చేసినట్టే... ఆ ప్రయత్నం బెడిసింది లగాయతు - తనకు సహకరించని వారిని వీలయిన మేరకు సతాయించడమనే అతిపవిత్ర తక్షణ కర్తవ్యం మీద మిలిటరీ ప్రజ్ఞనంతటినీ కేంద్రీకరించి బాంబు తరవాత బాంబు వరసపెట్టి పేల్చేస్తున్నాడు. అదీ ఎంత ఒడుపుగా? రిటైరైన ఆర్మీ ఆఫీసరెవడో ఏణ్నర్థం కింద తన దగ్గరికి వచ్చి, ఫలానా ట్రక్కుల బేరానికి సరే అంటే 14 కోట్ల రూపాయల లంచం ఇప్పిస్తానన్నాడని ఒక పత్రిక చెవిలో ఊదాడు. దానిమీద మరునాడు పార్లమెంటులో పెద్ద దుమారం లేచి దేశమంతటా గోలగోల అవుతూండగానే ప్రధానమంత్రికి సింగ్‌జీ రెండువారాల కింద రాసిన జాబుకు హఠాత్తుగా రెక్కలొచ్చి ఏదో పత్రికలో వాలింది. సింగ్‌గారి సమర్థ నిర్వాహకంలో తరిస్తున్న ఆర్మీలో వాడుతున్న ఆయుధాల డొల్ల; సైనికవనరుల నాణ్యత నాసి అన్నది అందులోని శుభవార్త! మళ్లీ దానిమీద పార్లమెంటులో నానా గత్తర అవుతూండగానే సేనాపతిగారు తన తర్వాత కొంతకాలానికి తన కుర్చీలో కూచోబోయే ఒకానొక సైన్యాధికారి మీద అప్పుడెప్పుడో ఎవరో పార్టీలీడరు ద్వారా తనకందిన అవినీతి ఆరోపణ దుమ్ము దులిపి దానిమీదికి సిబిఐని ఉసికొలిపాడు. మూడు నాలుగురోజుల్లోనే ఇన్ని సంచలనాలు సృష్టించినవాడు పోనుపోను ఇంకెన్ని భూకంపాలు పుట్టించి, గిట్టనివారిని ఇంకెంత చీల్చిచెండాడుతాడో చూడాలి. అన్నట్టు జనరల్ విజయకుమార్‌సింగ్‌గారు మహా నిగర్వి. కంటికి కునుకు లేకుండా ఎంత కష్టపడి ఎంతలేసి వీరవిహారం చేసినా అందులో తన ప్రమేయం ఏమీలేదు; తనకు ఏదీ తెలియదు అని సవినయంగా చెప్పుకునే సత్పురుషుడాయన. ఔనేమో. అంత సున్నితమైన రహస్య వర్తమానాన్ని లీకు చేయటం దేశద్రోహమని, సేనాపతిగారే రంకెలు వేస్తున్నారు కాబట్టి నిజంగా ఆయనకు ఏ పాపం తెలియదేమో! ప్రధాని మన్‌మోహన్‌సింగుగారే సదరు జాబును పత్రికలకు రవాణా చేసే పుణ్యం మూటకట్టుకున్నారేమో! లేదా - రక్షణమంత్రి ఆంటోనీయే దానిని వాసనపట్టి సేనాపతిని ఇబ్బంది పెట్టడానికి దాన్ని లీకు చేశాడేమో! అలా కూడా జరగవచ్చని మాటవరసకు ఒప్పుకుందాం. అయినా ఒక డౌటు. సైన్యానికి ఉన్న యుద్ధ ట్యాంకులకు అతిముఖ్యమైన మందుగుండు సామగ్రి నిండుకున్నదనీ, శత్రువుల ట్యాంకులతో పోరాడటానికి అవి ఎంత మాత్రమూ పనికిరావనీ, వాటికి ఉన్న విమాన రక్షణ వ్యవస్థలో 97 శాతం ఈ కాలానికి పనికిరానంత పురాతనమైనదనీ, పదాతిదళాలకూ, ప్రత్యేకదళాలకూ కీలకమైన ఆయుధాలు కరవయ్యాయనీ సేనాపతిగారికి సుప్రీంకోర్టులో తన కేసు పోయాకే హఠాత్తుగా తెలిసిందా? ఆయన పైరవీల బిజీలో ఆయన ఉన్నప్పటికీ ఇంతకుముందూ ఆయన దృష్టికి వచ్చాయా? వచ్చాయని అనుకుంటే... తాను అధిపతిగా ఉన్న సైనికబలగాలకు ఉన్నవి పేలని టాంకులు; గుండ్లు లేని తుపాకులు; కాలం చెల్లిన రక్షణ వనరులు; ఆయుధాలే లేని పదాతి దళాలు అని తెలిసీ ఆయనకు తిండి ఎలా సయించింది? నిద్ర ఎలా పట్టింది? నాగరిక సమాజానికి నమ్మశక్యంకాని, శత్రుదేశాలు పగలబడి నవ్వే ఈ దారుణదుర్గతిని ప్రభుత్వానికి వివరించడానికి, అత్యవసర చర్యలు జరిగేట్టు చేయడానికి ఆయనగారు చేసిందేమిటి? చేతిలో అధికారం ఉన్నంతకాలమూ నిదరోయి పోతూపోతూ ప్రధానమంత్రి మొగాన వీడుకోలు కానుకగా బట్ట కాల్చి పైన వేయటం బాధ్యతగల పెద్దమనిషి చేయాల్సిన పనేనా? అదీగాక - సైన్యానికి ఉన్నవే పనికిరాని ఆయుధాలు అని తెలిసి కూడా - ఎవడో దళారీ తన దగ్గరికి వచ్చి పధ్నాలుగు కోట్లు ఇస్తా ఈ నాసిరకం వాహనాలను కాస్త కొనిపించమని బేరంపెడితే సేనాపతిగారు ఎలా సహించాడు? ఏణ్నర్థంపాటు ఉలకక పలకక ఎందుకు ఊరుకున్నాడు? తీరికూర్చుని ఇప్పుడు గాలిలోకి వదిలిన కబురే నిజమైతే ఆ దళారిని అప్పుడే అక్కడే ఎందుకు అదుపుచెయ్యలేదు? ఆ మాట ఇప్పుడు అడిగితే - ‘అతడేమంటున్నాడో నాకు అర్థం కాలేదు. దాని అంతరార్థం నేను గ్రహించలేక షాకయ్యాను. అదే సంగతి రక్షణమంత్రికి చెప్పి ఊరుకున్నాను’- అంటాడా? నేరుగా తన దగ్గరికే ఒక దళారీ వచ్చి కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపితే సైన్యాధిపతి అయినవాడు స్పందించాల్సిన తీరు ఇదేనా? ఆయన మట్టిబుర్రకు అప్పుడు అర్థంకానిది పోగాలం వచ్చేసరికి ఇప్పుడు ఎలా అర్థమైంది? ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేయిస్తానని రక్షణమంత్రి అన్నా- వద్దులెండి; ఈ సంగతి ఇంతటితో వదిలేద్దాం అని సేనాపతి ఎలా అనగలిగాడు? అన్ని వైపులా శత్రువులు పొంచి ఉన్న కాలంలో అసలే పేలలేని టాంకులతో, బొమ్మ తుపాకులతో కాలక్షేపం చేస్తున్న సైనిక బలగాలకు నాసిరకం వాహనాలను అంటగట్టాలని ప్రయత్నించడం సేనాధిపతి దృష్టిలో తేలిగ్గా తీసివేయాల్సిన చిన్న విషయమా? నీకు ముందున్న సేనాపతులూ లంచాలు తిన్నారు; నీ తరవాత వచ్చే వాళ్లూ లంచాలు తింటారు అని ఎవడో దళారీ మరియు మాజీ సైన్యాధికారి తనకు చెప్పాడని ఈయనగారు ఇప్పుడు పనిగట్టుకుని లీకు చెయ్యటం తన ముందు, వెనక ఉన్న సైన్యాధికారులందరినీ లంచగొండులుగా చూపెట్టే కుత్సితమా? ఇటువంటి నిక్షేపరాయుళ్లు సైన్యాధిపతులైతే దేశానికి, సైన్యానికి ఒనగూడే రక్షణ ఏలాంటిది


 
     
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech