ముఖపత్రం    
  వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7

రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం)

 

                                             పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

   

చరిత్రకెక్కని చరితార్థులైన మహాకవులలో మహనీయుడైన రావిపాటి త్రిపురాంతకుని రచనలలో తెలుగులో శ్రీ త్రిపురాంతకక్షేత్రాధీశ్వరుని సన్నుతిస్తున్న (1) చాటుప్రబంధమైన త్రిపురాంతకోదాహరణము సంపూర్ణంగానూ, (2) అక్కడి పద్మసరస్సులో శ్రీచక్రమధ్యాన కొలువుతీఱిన అమ్మవారిని అధికరించి ఆయన చెప్పిన అంబికా శతకము నుంచి ఏడు పద్యాలు, (3) రోహిణీవల్లభుడైన చంద్రుని ఉద్దేశించి లలితశృంగారధోరణిలో రచింపబడిన చంద్ర తారావళి నుంచి నాలుగు పద్యాలు, (4) (గ్రంథకర్తృత్వం సందేహాస్పదమైన) మదన విజయము పద్యకావ్యం నుంచి రెండు పద్యాలు – మొత్తం ఈ విధంగా లభించిన నాలుగు కృతులను తెలుగులోనూ; (5) వల్లభరాయల క్రీడాభిరామమును బట్టి తెలిసివస్తున్న ప్రేమాభిరామము – అని ఒక్క కృతిని సంస్కృతంలోనూ సాహిత్యచరిత్రకాథికులు ఇప్పటి వఱకు గుర్తించారు.  ఇవికాక, సంస్కృతంలో (6) ఈనాడు అనుపలబ్ధమైన యాచ ప్రబంధము కూడా ఆయన రచనమే కావచ్చునని నేను గతమాసం (జూన్ సంచిక) సుజనరంజనిలో “రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు” అన్న ఈ వ్యాసం తొలిభాగంలో ప్రతిపాదించాను. ఆ వ్యాసాన్ని ప్రకటించిన తర్వాత యాచ ప్రబంధము యొక్క పూర్వాపరాల విషయమై మఱికొంత పరిశోధించి – 1912లో శ్రీ చిలుకూరి వీరభద్రరావు గారు విజ్ఞానచంద్రికా గ్రంథమాల పక్షాన ప్రకటించిన ఆంధ్రుల చరిత్రము (ద్వితీయభాగం); జటప్రోలు సంస్థానవిద్వాంసులైన శ్రీ వెల్లాల సదాశివశాస్త్రి గారు, అవధానము శేషశాస్త్రులు గారు 1910లో పరిష్కరించి అచ్చువేసిన వెలుగోటి వారి వంశచరిత్రము లేక వేంకటగిరి రాజుల వంశచరిత్రము; శ్రీ వెల్లాల సదాశివశాస్త్రి గారు 1913లో చిలుకూరి వారి రచనకు ఖండనగా ప్రచురించిన ఆంధ్రచరిత్రవిమర్శము: వీరభద్రీయఖండనము; 1939లో నేలటూరి వేంకటరమణయ్య గారు పరిష్కరించిన వెలుగోటి వారి వంశావళి; ఇంకా ఎపిగ్రాఫియా ఇండికా, ఎపిగ్రాఫియా కర్ణాటికా, ఇండియన్ ఏంటిక్వెరీ, సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, ఆంధ్రేతిహాస పరిశోధక మండలి పత్రిక సంపుటాలు; 1922లో అల్లాడి జగన్నాథశాస్త్రి గారు ప్రకటించిన A Family History of Venkatagiri Rajas అన్న గ్రంథాలలోని వివాదాస్పద విషయాలన్నింటినీ సాకల్యంగా పరిశీలించిన తర్వాత – యాచ ప్రబంధము నేను ప్రతిపాదించినట్లు క్రీ.శ. 13-14 శతాబ్దుల నాటి సుప్రసిద్ధ రావిపాటి త్రిపురాంతకుని రచనమే కాని ఆధునికుడైన వేఱొక త్రిపురాంతకుని రచన కాదన్న ఆలోచన మఱింత బలపడిందని విన్నవించుకొంటున్నాను. ఇక త్రిపురాంతకుని కృతులలో పరిశేషించిన - ఈనాటికీ అనుపలబ్ధమైన ప్రేమాభిరామము కావ్యాన్ని అధికరించిన కొన్ని ఆలోచనలను ఈ వ్యాసంలో మీతో పంచుకొంటున్నాను.

ప్రేమాభిరామము :

      త్రిపురాంతకుని ప్రేమాభిరామము గ్రంథం లభింపలేదు. సంస్కృతకవులెవరూ ఆ కృతిని స్మరించినట్లు లేదు. లాక్షణికులు, వ్యాఖ్యాతలు తమ లక్ష్యలక్షణాలలో ఎక్కడా ప్రస్తావింపలేదు. అందువల్ల, ఏతత్స్వరూప-స్వభావాలను గూర్చిన ఇప్పటి విమర్శన లన్నింటికీ వినుకొండ వల్లభరాయలు క్రీడాభిరామములో చెప్పినవి ఒకటి, రెండు విశేషాలు; అందులోని కొన్ని ఆంతరంగికసాక్ష్యాలు మాత్రమే మనకున్న ముఖ్యాధారాలు. ఇవిగాక వేఱే ఆధారాలు లేవు. కొంతమంది పెద్దలు భావించినట్లు క్రీడాభిరామము శ్రీనాథ మహాకవి రచనమా? లేక, కావ్యంలో ప్రగతమైనట్లు అది వినుకొండ వల్లభరాయల రచనమా? అన్న వివాదాన్ని అటుంచి, ఇక్కడ కేవలం రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామము కావ్యాన్ని గుఱించి మాత్రమే చర్చింపబడుతున్నది.

ప్రేమాభిరామము : నామసామంజస్యం

      సంస్కృతాంధ్రాలలో వెలసిన కావ్యాల పేర్లను పరిశీలిస్తే - ప్రేమాభిరామము అన్నది ఒక విలక్షణమైన పేరని అంగీకరింపక తప్పదు. “ప్రేమము చేత అభిరామమైనది” అని అర్థం చెప్పుకొంటే, కావ్యేతివృత్తం సూచితమని స్పష్టం. నాయికానాయకాదుల కంటె, కథాక్రమపరిగతి కంటె ప్రాధాన్యవివక్ష ప్రేమమునకే అని భావం. రత్నావళి, ప్రియదర్శిక (కథానాయిక పేరే నాటకనామం), మహావీర చరితం (నాయకుని పేరే నాటకనామం), మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం (నాయికానాయకులు ఇద్దరి పేర్లను శీర్షికగా నిలపటం), మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, అభిజ్ఞానశాకుంతలం (నాటకవ్యక్తినామంతో ఒకానొక ముఖ్యమైన కథావస్తువు పేరును జోడించటం), స్వప్నవాసవదత్తం, రత్నేశ్వరప్రసాదనం (నాటకవ్యక్తినామంతో ఒకానొక ముఖ్యమైన కథాసన్నివేశం పేరును జోడించటం) వంటి పేర్లలో ఏ ఒక్కదానితోనూ సరిపోలని అపురూపమైన పేరిది.

      ఆలంకారికుల దృష్టిలో ఈ ప్రేమముయొక్క స్వరూపం ఏమిటి? ప్రేమాభిరామము లోని ప్రేమము యొక్క స్వరూపం ఏమిటి? ఆలంకారికుల దృష్టి రెండు విధాలుగా ఉన్నది. గోమాతకు లేగదూడ అంటేనూ, తల్లిదండ్రులకు సంతతి అంటేనూ, పెద్దలకు చిన్నలంటేనూ ఉండే వాత్సల్యాన్ని, ప్రీతిని, అనుబంధాన్ని, ఆత్మీయతను, ప్రేమను రసవదర్థంగా గుర్తించి క్రీ.శ. 7-వ శతాబ్ది నాటికే రుద్రటుడు కావ్యాలంకారంలో దానికి ప్రేయస్సు అనే పేరుతో రసప్రకరణంలో పదవ రసంగా స్థానం కల్పించే ప్రయత్నం చేశాడు. క్రమేణ ఈ ప్రేయస్సు శ్రీకృష్ణభక్తిమార్గంలో ప్రేమభక్తిగా రూపుదిద్దుకొని చైతన్య మహాప్రభువుల నాటికి చిద్విశిష్టమైన రసస్థితికి చేరుకొన్నది. అయితే, ఇది రతివిరహితమైన చిత్తద్రవీకరణశక్తి కలిగిన ఒక మధురావేశం. త్రిపురాంతకుని కథాకల్పనలో గాని, పాత్రమనోధర్మావిష్కరణలో గాని ఈ విధమైన భావవ్యాప్తికి అవకాశం ఏర్పడినట్లు క్రీడాభిరామము చిత్రణను బట్టి ఊహించటానికి వీలుండదు. కనుక త్రిపురాంతకుని దృష్టిపథంలో ప్రేమము అంటే -

      "ఇ"శబ్దవాచ్యో మదనో మాతి యత్ర ప్రకర్షతః

       తత్ప్రేమ త దధిష్ఠానం రతిర్యూనోః పరస్పరమ్"

      అని శారదాతనయుడు భావప్రకాశిక (పు. 78)లో చేసిన నిర్వచనమే ఉన్నదని భావించాలి. తదనుసారం ప్రేమము అంటే “ప్ర = అత్యుత్కర్షతో; ఇ = మన్మథుడు; మ = అతిశయంతో శోభిల్లే తావు” అని అర్థమన్నమాట. ఆ ప్రకారం ప్రేమాభిరామము లౌకికీనామమై “కామాభిరామము” లేదా “మదనాభిరామము”నకు పర్యాయపదం అవుతుంది. అతివేలమూ, కొంత విశృంఖలమూ అయిన శృంగారచిత్రణకు ఈ నామకరణం అర్థప్రకాశకంగానే ఉన్నది.  

ప్రేమాభిరామము నాటకమా? వీథీ రూపకమా? భాణమా?

      ఈ విషయమై విమర్శకుల అభిప్రాయాలను క్రోడీకరించే మునుపు వల్లభరాయల క్రీడాభిరామములోని ఆధారకల్పాలను పరిశీలిద్దాము:

      గీ.    గణన కెక్కిన దశరూపకములయందు

              వివిధ రసభావభావన “వీథి” లెస్స;

              యే కవీంద్రుఁడు రచియించె నీ ప్రబంధ?

              మనుచు మీ రానతిచ్చెద; రైన, వినుఁడు.      (క్రీడా. 1)

       వ.   ఆ మంత్రిశేఖరుండు రావిపాటి త్రిపురాంతకదేవుండను కవీశ్వరుం డొనరించిన ప్రేమాభిరామ నాటకంబు ననుసరించి క్రీడాభిరామం బను రూపకంబు  తెనుంగుబాస రచియించినవాఁడు.        (క్రీడా.33)

       గీ.    ఆతఁ డెంతటివాఁడు? ప్రేమాభిరామ

              మనఁగ నెంతటియది? దాని ననుసరించి,

              “వీథి” యను రూపకము - మది వెఱపు లేక

              తిప్పవిభు వల్లభుం డెట్లు తెనుఁగుఁ జేసె?             (క్రీడా.34)

       ఉ.   నన్నయభట్ట తిక్క కవి

                                  నాయకు లన్నను, హుళక్కి భాస్కరుం

              డన్నను, జిమ్మపూడి యమ

                                  రేశ్వరుఁ డన్నను సత్కవీశ్వరుల్

              నెన్నుదుటం గరాంజలులు

                              నింతురుజే!” యని; రావిపాటి తి

              ప్పన్నయు నంతవాఁడ! తగు

                                  నా యిటు దోసపుమాట లాడఁగన్?       (క్రీడా. 36)

       గ్రంథాంతగద్య. ఇది శ్రీమన్మహామంత్రిశేఖర వినుకొండ తిప్పయామాత్యనందన చందమాంబాగర్భపుణ్యోదయ సుకవిజనవిధేయ వల్లభరాయప్రణీతం బైన క్రీడాభిరామంబను వీథినాటకంబున సర్వంబు నేకాశ్వాసము.   

      ఈ ఉదాహృతుల ప్రకారం వల్లభరాయల క్రీడాభిరామము అన్న ప్రబంధవిశేషం “వీథి నాటక” మని స్పష్టపడుతున్నదే కాని త్రిపురాంతకుని ప్రేమాభిరామము ఎటువంటి రూపకప్రభేదమో నిశ్చయించడానికి వీలులేకుండా ఉన్నది. “ప్రేమాభిరామ నాటకంబు ననుసరించి క్రీడాభిరామం బను రూపకంబు తెనుంగుబాస రచియించినవాఁడు,క్రీడాభిరామం బను వీథినాటకంబున” అన్న నిర్దేశకవాక్యాల మూలాన ప్రేమాభిరామము కూడా వీథీ రూపకమని అనిపించటం సహజమే. యాతాయాత గాతానుగతికమైన దారిలో నడవటం ఇష్టంలేని మహాకవి కనుక అపురూపమైన ఈ ప్రక్రియలో ఒక మహారచనను చేసి తన ప్రతిభను పునారూపించుకోవాలని ఉత్సవించటం కూడా త్రిపురాంతకుని ప్రవృత్తికి అనుగుణంగానే ఉన్నది. వేదం వేంకటరాయశాస్త్రి గారు (మనుమడు), బి.వి. సింగరాచార్య గారు, బాలాంత్రపు నళినీకాంతరావు గారు మొదలైన విమర్శకులు కొందఱు – ఈ ప్రేమాభిరామము మూలం మాటెలా ఉన్నా, క్రీడాభిరామము మాత్రం ఒక వ్యంగ్యానుకరణ (ఫార్స్) రూపకమని భావించారు. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారయితే అసలు  

గణన కెక్కిన దశరూపకములయందు

వివిధ రసభావభావన వీథి లెస్స 

అన్న వల్లభరాయల నిర్వచనమే తప్పని; ఆ నిర్వచనం ధనంజయుని దశరూపకంలోని నిర్వచనానికి అనుగుణంగా లేదని; క్రీడాభిరామము గ్రంథకర్త నిజంగా సకలవిద్యాసనాథుడు, కవిసార్వభౌముడు అయిన శ్రీనాథుడే అయితే అటువంటి లక్షణవిరుద్ధమైన వాక్యాన్ని వ్రాయనే వ్రాయడని; ఒకవేళ శ్రీనాథునంతటి పాండిత్యవైభవం లేని వల్లభరాయలు వ్రాసివుంటే ఆశ్చర్యం లేదని - తమ తెలుగు సాహిత్య చరిత్ర (ద్వితీయభాగం : పు. 277)లో ఇంకా ఇలా వ్రాశారు:

      దశరూపకములందు వీథి లెస్స కాదు. వివిధరసభావభావనాభరితము కాదు. “భాణవత్ రసః సూచ్యస్తు శృంగారః స్పృశేదపి రసాన్తరమ్” అని దశరూపకమునందు వీథీరూపలక్షణము. భాణతుల్యము. శృంగారరసము సూచనీయము. రసాంతరము కూడ స్పర్శనీయము.  భాణము కల్పితధూర్తచరిత్రము. విటైకపాత్రవర్ణనము. కాఁబట్టి రసాంతరము హాస్యము. వీథీభాణములకు భేదము పాత్రసంఖ్య. భాణము ఏకపాత్రప్రయోజ్యము. వీథి ఏకద్విపాత్రప్రయోజ్యము. అది లెస్స అనుట హాస్యాస్పదము.

అని తీవ్రంగా విమర్శించారు. వల్లభరాయలు వీథి లెస్స అని పలికిన పలుకును హాస్యాస్పదంగా పరిగణించారు.

ధనంజయుని దశరూపకంలోని లక్షణం శ్రీరామమూర్తి గారన్నట్లు పూర్తిగా ఆ ప్రకారమే లేకపోయినా, తాత్పర్యం ఇంచుమించుగా అదే. “వీథి”లో కైశికీ వృత్తిని ప్రయోగించాలని; సంధ్యంగాలు, అంకాదికం – అన్నీ భాణమనే రూపకంలో వలెనే ఉంటాయని;  శృంగారరసాన్ని సూచనామాత్రంగా నిర్వహించాలని; వేఱొక రసానికి (లేదా, రసాంతరాలకు – అని వ్యాఖ్యాత ధనికుని అన్వయం) ప్రవేశాన్ని కల్పించి, తత్స్పర్శమాత్రంగా విడిచివేయాలని; అందులో ప్రస్తావన, ఉద్ఘాత్యకము మొదలైన అంగాలు; ఒకటే అంకము; ఒకే పాత్ర ఉంటాయని ధనంజయుని మతం. ఈ విషయసంగ్రహమంతా ఆయన దశరూపకం మూడవ పరిచ్ఛేదంలోని 62, 63 శ్లోకాలలో –

      "వీథీ తు కైశికీవృత్తౌ సన్ధ్యఙ్గాఙ్కైస్తు భాణవత్

       రసః సూచ్యస్తు శృఙ్గారః స్పృశేదపి రసాన్తరమ్.

       యుక్తా ప్రస్తావనాఖ్యాతై రఙ్గై రుద్ఘాత్యకాదిభిః

       ఏవం వీథీ విధాతవ్యా హ్యేకపాత్రప్రయోజితా."

అని ఉంది. భాణ రూపకంలో భారతీవృత్తి ప్రయోక్తవ్యమై ఉండగా వీథీ రూపకంలో కైశికీవృత్తి విధింపబడటానికి కారణం అందులో శృంగారరసంతోపాటు హాస్యానికి కూడా ప్రవేశం ఉండటమేనని క్రీ.శ. 12-వ శతాబ్ది నాటి రామచంద్ర-గుణచంద్రులు తమ నాట్యదర్పణంలో విశదీకరించారు.  

      క్రీస్తుశకం 10-వ శతాబ్ది నాటి ధనంజయుని ఈ “వీథి” లక్షణం ఆసేతుశీతాచలపర్యంతం ఆలంకారికులందఱినీ ప్రభావితం చేసినదని చెప్పవచ్చును. ఆంధ్రదేశపు ఆలంకారికులలో అగ్రశ్రేణికుడైన విద్యానాథుడు క్రీ.శ. 1323నాటి తన ప్రతాపరుద్రీయములో ధనంజయుని మార్గాన్నే అనుసరించి, దశరూపకానికి ధనికుడు రచించిన వ్యాఖ్యలోని వివరణను కలుపుకొంటూ, "యత్ర భాణవదఙ్గానాం క్ఌప్తిస్తు కైశికీ, శృంగారః పరిపూర్ణత్వా త్సూచనీయోతిభూయసా, ఉద్ఘాత్యకాదీన్యఙ్గాని సా వీథీవన్మతా (నాట్య. 53-4)" అని నిర్వచించాడు.  క్రీ.శ. 1386 – 1412 నాటి సర్వజ్ఞసింగభూపాలుడు మాత్రం విశేషంగా కృషిచేసి, తన రసార్ణవసుధాకరములో అప్పటి రంగస్థలప్రదర్శనలలో వచ్చిన మార్పు లన్నింటినీ  

సూచ్యప్రధానశృఙ్గారా ముఖనిర్వహణాన్వితా

ఏకయోజ్యా ద్వియోజ్యా వా కైశికీవృత్తినిర్మితా.

వీథ్యఙ్గసహితైకాఙ్కా వీథీతి కథితా బుధైః

అస్యాం ప్రాయేణ లాస్యాఙ్గదశకం యోజయేన్న వా.

సామాన్యా పరకీయా వా నాయికాత్రానురాగిణీ

వీథ్యఙ్గప్రాయవృత్తిత్వా న్నోచితా కులపాలికా

లక్ష్య మస్యాస్తు విజ్ఞేయం మాధవీవీథికాదికమ్. (3: 271-4)

అని క్రోడీకరించాడు. ఆయన కాలంనాటికి మునుపటి కంటె పాత్రల సంఖ్య పెరిగింది. నాయకుని యందు అనురక్తురాలైన నాయిక సామాన్య కాని, పరకీయ కాని కావచ్చునన్న నియమనం వల్ల కథానిర్మితిలో కొత్తదనానికి అవకాశం ఏర్పడింది. క్రమేణ లాస్యాంగాలలోనూ మార్పు వచ్చినట్లున్నది. సింగభూపాలుడు లక్ష్యానికని పేర్కొన్న మాధవీ వీథి ఆ రోజులలో చాలా ప్రసిద్ధమైనట్లు కనబడుతుంది కాని, లాక్షణికులెవరూ అది ఎవరి రచనమో, దాని స్వరూపమేమిటో వివరించలేదు. ఆ తర్వాత క్రీస్తుశకం 15-వ శతాబ్ది ప్రథమపాదంలో పెదకోమటి వేమభూపాలుడు తన సాహిత్యచింతామణిలో వెనుకటి ధనంజయుని లక్షణాన్నే పునరుద్ధరించి, తదుదాహరణార్థం ఇందులేఖ అనే వీథీరూపకాన్ని పేర్కొన్నాడు.  ఈ ఇందులేఖ మునుపు భోజుడు శృంగారప్రకాశంలోనూ, బహురూపమిశ్రుడు దశరూపక వ్యాఖ్యలోనూ, రామచంద్ర-గుణచంద్రులు నాట్యదర్పణంలోనూ ఉదాహరించినదే కాబట్టి – పూర్వుల అభిప్రాయాలను, శ్లోకపంక్తులను యథాతథంగా గ్రహించటానికి అభ్యంతరంలేని వేమభూపాలుడు ఆ పూర్వోదాహరణల నుంచి స్వీకరించిన ఉదాహరణమే గాని స్వయంగా తానా ఇందులేఖను చూసి ఉంటాడని ఊహించటానికి వీలులేదు. ఏది ఏమైనప్పటికీ, అలభ్యాలైన ఈ రూపకాలను బట్టి ప్రేమాభిరామము యొక్క స్వరూపావస్థను విమర్శించటానికి అవకాశం లేదు. భోజుడు వివరించిన దానిని బట్టి ఇందులేఖా వీథిలో (1) రాజు, (2) విదూషకుడు, (3) ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక స్త్రీ పాత్ర – మొత్తం మూడు పాత్రలుండినట్లు కనబడుతుంది. భోజుడు మాలతిక అని వేఱొక వీథిని కూడా పేర్కొన్నాడు. విశ్వనాథుడు తన సాహిత్యదర్పణంలో మాళవిక అని పేర్కొన్న వీథి అపపాఠం కావచ్చుననని; భోజుడు పేర్కొన్న మాలతికనే విశ్వనాథుడు గ్రహించి ఉంటాడని విమర్శకులు భావించారు. భోజుడు ఉదాహరించిన భాగాలను బట్టి ఈ మాలతిక లోనూ (1) రాజు, (2) విదూషకుడు లేదా నర్మసఖుడు, (3) రాజుపై మఱులుగొన్న ఒక వనిత – అని మొత్తం మూడు పాత్రలే ఉన్నట్లున్నది. అది కొంత శృంగార-హాస్యరసాలు నిండిన రచనమని ఊహించటం సాధ్యమవుతున్నది.

      ఇవిగాక ఆలంకారికులు ప్రస్తావించిన వకుళ వీథిక, కామదత్త మొదలైన రచనల స్వరూపావగాహనకు ఆ కృతులిప్పుడు లేవు. వేమభూపాలుని సాహిత్యచింతామణి అచ్చయితే ప్రచారంలోకి వచ్చి, దానిని గుఱించి మఱిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంటుంది.

      పైని పేర్కొనినవన్నీ త్రిపురాంతకునికి ఆధారకల్పాలైన పూర్వరచనలు కాబట్టి, భావిపరిశీలకులకైనా వీథీరూపకం నేపథ్యానుశీలనకు ఉపకరిస్తాయని ఇంతవఱకు ప్రస్తావించాను.

      ధనంజయుని ప్రభావశీలమైన నిర్వచనాన్ని చూసి ప్రభావితులై ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు “దశరూపకములందు వీథి లెస్స కాదు. వివిధరసభావభావనాభరితము కాదు. వీథి ... లెస్స అనుట హాస్యాస్పదము.” అని విమర్శించారే కాని; క్రీడాభిరామ కర్త వల్లభరాయలు ధనంజయుని మతాన్ని ప్రమాణీకరింపక – తత్పూర్వమే ప్రాజ్ఞప్రతిజ్ఞాతమై, సుష్ఠుప్రచారంలో ఉన్న భరతముని నాట్యశాస్త్రంలో నుంచి ఉదాహరించి ఉంటాడని వారు ఏ మాత్రం ఊహించినా – ఈ అపార్థానికి తావే లేకపోయేది.

      ప్రేక్ష్యప్రబంధాలను వివరిస్తూ భరతముని నాట్యశాస్త్రం దశరూపకాధ్యాయంలో (ఇది ప్రామాణికమైన కాశీ ప్రతిలో 20-వ అధ్యాయం; ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారి తెలుగు అనువాదం తోడి ప్రతిలో 18-వ అధ్యాయం) రెండుమార్లు –  

      వీథీ స్యా దేకాఙ్కా ద్విపాత్రహార్యా త థైకహార్యా వా.          నాట్య.(20-116)

రసై ర్భావైశ్చ సకలై ర్యుక్తా వీథీ ప్రకీర్తితా

ఏకహార్యా ద్విహార్యా వా కర్తవ్యా కవిభి స్సదా

                                                        నాట్య.(20-135)

      అని వీథీలక్షణాన్ని నిర్వచించాడు. ఆయన “రసై ర్భావైశ్చ సకలై ర్యుక్తా వీథీ ప్రకీర్తితా” అన్న మాటనే వల్లభరాయలు, గణన కెక్కిన దశరూపకములయందు, రసై ర్భావైశ్చ సకలై ర్యుక్తా = వివిధరసభావభావన;  వీథీ ప్రకీర్తితా = వీథి లెసస” అని అనువదించుకొన్నాడు. ఆయన రచన భరతుని నాట్యశాస్త్రానికి యథాతథానువాదమని గమనింపక - “హాస్యాస్పదము” అని విమర్శించటం భావ్యం కాదు.

      పైగా, వల్లభరాయలు, ప్రేమాభిరామ నాటకంబు ననుసరించి క్రీడాభిరామం బను రూపకంబు తెనుంగుబాస రచియించ” అనటం వల్ల ఆ “అనుసరణం” శ్రీనాథుడు తన నైషధాంధ్రీకరణంలో శబ్దం బనుసరించి ... మాతృకానుసారంబుగా (8-202) అని చెప్పినటువంటి అనుసరణమైతే – మూలంలోని కథాక్రమమే గాక – అపురూపమైన త్రిపురాంతకుని శిల్పకల్పనతోపాటు ఆయన పదబంధాలూ అనేకం తెలుగులోకి వచ్చి చేరాయని అనుకోవలసి ఉంటుంది.

      ఆచార్య వెల్చేరు నారాయణరావు గారు 2002లో డేవిడ్ షూల్మన్ గారితో కలిసి క్రీడాభిరామానికి చేసిన ఆంగ్లానువాదం A Lover’s Guide to Warangal పీఠికలో - అసలు ప్రేమాభిరామమంటూ నిజంగా ఉండి ఉంటే – ఆ కాలంనాటి ఇతర భాణరూపకాల చిత్రణసామ్యం వల్ల - అదికూడా భాణమై ఉండవచ్చునని ఊహించారు.

      నిజానికి తెలుగు క్రీడాభిరామము లక్షణశాస్త్రంలో చెప్పిన భాణ – వీథీ రూపకాలు రెండింటికీ సరిపోదు. ఆధునికకాలంలో మనకు పరిచితమైన వీథి నాటకమూ కాదు. రచన తీరును బట్టి చూస్తే కొంత శ్రవ్యంగానూ, కొంత దృశ్యంగానూ అగపడుతుంది. ప్రధానపాత్రలు ఓరుగల్లులోని విటులు మంచన శర్మ, టిట్టిభ సెట్టి -  ఇద్దరే అయినప్పటికీ – 1. పదే పదే ప్రసక్తికి వచ్చినవి, 2. అవాంతరంగా సూచితమైనవి అయిన పాత్రలు ముప్ఫైకి పైగానే ఉన్నాయి. ప్రేమాభిరామము కూడా ఆ విధంగానే ఉన్నదేమో చెప్పలేము. అందదుకులుగా ఉన్న క్రీడాభిరామము అవతారికను బట్టి దాని రచన పూర్ణస్వరూపాన్ని ఇదమిత్థంగా నిర్ణయించటం సాధ్యంకాదు. కావ్యంలో అక్కడక్కడ గ్రంథపాతాలు ఉన్నాయి. ముగింపు సరిగా లేదు. ఏతత్కారణాన క్రీడాభిరామమునకు మూలమైన ప్రేమాభిరామము నాటకమో, వీథీ రూపకమో, భాణమో లేక మఱొక రూపమో నిశ్చయించటానికి ఇప్పుడున్న ఆధారాలు చాలవని చెప్పాలి.  

ప్రేమాభిరామము సంస్కృతరచనమా? తెలుగా?

      ప్రేమాభిరామము సంస్కృతరచన కావచ్చునన్న ఆలోచన మనకు వల్లభరాయలు క్రీడాభిరామములో - ప్రేమాభిరామ నాటకంబు ననుసరించి క్రీడాభిరామం బను రూపకంబు తెనుంగుబాస రచియించి” అన్నందువల్ల; వీథి యను రూపకము - మది వెఱపు లేక, తిప్పవిభు వల్లభుం డెట్లు తెనుఁగుఁ జేసె? అన్నందువల్ల - వచ్చినదే కాని, అందుకు ఇతరాధారాలేవీ లేవు. ప్రేమాభిరామము అన్న నాటకాన్ని అనుసరించి వల్లభరాయలు క్రీడాభిరామము అనే “రూపకాన్ని” తెలుగులో రచించాడంటే – ఆ ప్రేమాభిరామము సంస్కృతంలోనే ఉండి ఉండాలి. ప్రేమాభిరామము అనే నాటకము కాక వేఱొక వీథి రూపకం కూడా ఉండి, దానినీ దీనినీ మది వెఱపు లేక నిస్సంకోచంగా వల్లభరాయలు తెలుగుచేశాడేమో తెలియదు.

      అయినా, ప్రేమాభిరామము సంస్కృతరచన కాదేమో? అన్న వికల్పాభిప్రాయానికి అవకాశం లేకపోలేదు.

ప్రేమాభిరామము : తెలుగు పాఠం

      ప్రేమాభిరామానికి క్రీడాభిరామానికంటె పూర్వకాలంలోనో అంతకు తర్వాతనో ఒక తెలుగు అనువాదమో లేక తత్సమాంతర రచనమో వెలసిందా? అన్న ఉత్థాపితప్రశ్నను పరిశీలింపవలసి ఉన్నది. ఒకప్పుడు విదిత విద్వాంసులు, సుప్రసిద్ధసాహితీవిమర్శకులు శ్రీ మేడేపల్లి వేంకటరమణాచార్యులు గారు (1862-1943) పెదపాటి జగన్నాథకవి యొక్క ప్రబంధ రత్నాకరము తంజావూరు ప్రతులలో లేని మూడు – నాలుగు ఆశ్వాసాల అసంపూర్ణ లిఖితప్రతిని సంపాదించి, అందులోని పద్యాలను తమ నోటుబుక్కులో వ్రాసిపెట్టుకొన్నారట. ఆ వ్రాతప్రతిని శ్రీ మేడేపల్లి వారి మనుమరాలి ద్వారా అందుకొన్న ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు చాలాకాలం తర్వాత - 1989లో దానిని పరిష్కరించి, - తమ సాహిత్యసంపద వ్యాససంపుటంలో అందులోని పద్యాలన్నిటినీ - 1) “ప్రబంధరత్నాకరము – తృతీయాశ్వాసము: ప్రత్యంతరవిశేషములు, 2) “ప్రబంధరత్నాకరము – చతుర్థాశ్వాసము: ప్రత్యంతరవిశేషములు” అని రెండు విలువైన వ్యాసాలుగా ప్రకటించారు. ఆ ప్రకటింపబడిన పద్యాల తీరుతెన్నులను చూస్తే అవి సలక్షణంగానూ, ప్రామాణికం గానూ ఉన్నాయి. అవేవో కూటరచనలని; వాటిని శ్రీ మేడేపల్లి వేంకటరమణాచార్యులవారో, మఱెవరో కల్పించి ఉంటారని ఆరోపించటానికి వీలులేకుండా అవి ప్రాక్తనకృతుల వలెనే అన్నివిధాల భావ్యంగా ఉన్నాయి. అందులో త్రిపురారి రచనమైన ప్రేమాభిరామము ప్రసక్తి ఉండటం వల్ల ఇక్కడ చర్చింపవలసి వస్తున్నది.  

      పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరము నుంచి ఆచార్య కొర్లపాటి వారు ప్రకటించిన మొదటి వ్యాసంలో “ప్రబంధరత్నాకరము తృతీయాశ్వాసము లోనివిగా భద్ర దత్త కూచిమార పాంచాలురు : త్రిపురారి ప్రేమాభిరామము” అన్న శీర్షికతో (పు. 270-2 లు) నాలుగు పద్యాలున్నాయి. వాటినిక్కడ పొందుపఱుస్తున్నాను:

భద్ర దత్త కూచిమార పాంచాలురు : త్రిపురారి ప్రేమాభిరామము

       ఉ.  ఇచ్చ యెఱుంగఁ డెట్టి ధన

                           మీఁ డదె యూరక కన్నులార్చి మై

              బచ్చునఁ జూపి కూర్పుమని

                           పట్టిన నెట్టునఁ గూర్పవచ్చుఁ గ

              న్నిచ్చలఁ బాఱి నెమ్మనము

                           లిత్తురె మానినులెల్ల నొల్ల నా

              మెచ్చులు గావు భద్రు వెలి

                           మిన్నక నవ్వులు కప్పుఁ బ్రెవ్వులన్.     1

       ఆ.   ఈఁగి మిగుల నిచ్చు టెఱిఁగి యింపెఱుఁగదు

              తన సుఖంబె కోరి పెనఁగుఁ గాని

              తలిరుబోణి రోయి దత్తకుఁ జేకొను

              టంకమునకుఁ బసిఁడి యందుకొనుట.                 2

       ఉ.   తక్కులుఁ జొక్కు లొల్లములుఁ

                           దాఁపరముల్ నగముల్ విడంబముల్

              మ్రొక్కులు రిత్తవాదములు

                           ముచ్చట లాలము లింద్రజాలముల్

              మక్కువ లాన నడ్డములు

                           మందులు మ్రాఁకులు పువ్వుబోండ్లకున్

              జెక్కులఁ బెట్టు మిండఁ డని

                           చెప్పకు చెప్పకు కూచిమారునిన్.         3

       ఉ.   బాలల నిండుజవ్వనుల

                           ప్రౌఢల లోలలఁ జేరి వారికే

              కేలి భజించునట్లు తమకింపక

                           యింపులు ముంప నేర్చుఁ బాం

              చాలుఁడు బాలుఁ గౌఁగిలికిఁ

                           జల్లని వాఁడగు వాని చందముల్

              మేలని పొందిరేనిఁ బెఱ

                           మిండలకున్ గొఱగారు కామినుల్.        4

             ఇంతకు మునుపు సుజనరంజని జూన్ నెలలోని వ్యాసంలో మనము పెదపాటి జగన్నాథకవి రావిపాటి త్రిపురారి చంద్ర తారావళి నుంచి రెండు పద్యాలను;రావిపాటి త్రిపురాంతకుని చంద్ర తారావళి” నుంచి మఱి రెండు పద్యాలను;రావిపాటి త్రిపురారి అంబికా శతకము” నుంచి ఒక పద్యాన్ని; ఇతర లాక్షణికులు, విమర్శకులు “రావిపాటి త్రిపురాంతకుని అంబికా శతకము” నుంచి తక్కిన ఐదు పద్యాలను ఉదాహరించి ఉండటం వల్ల – ఆ “త్రిపురారి,త్రిపురాంతకుడు” ఇద్దరు వేర్వేఱు కవులు కారని, అవి ఒకే వ్యక్తికి పర్యాయాలని అనుకొన్నాము. అదే నిర్ణయాన్ని ఇక్కడ అనువర్తించితే ఉపరి పద్యాలను బట్టి రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామాన్ని సంస్కృతంలో కాక తెలుగులోనే చెప్పాడని భావింపవలసి ఉంటుంది. ఆ విధంగా ఇది చర్చనీయాంశమైంది.

      ఆచార్య శ్రీరామమూర్తి గారయితే, పైని చూపిన నాలుగు పద్యోదాహరణలను బట్టి - ఈ నూతన త్రిపురారి రచించిన ప్రేమాభిరామము కామశాస్త్రగ్రంథమని; ఇది మనమనుకొంటున్న రూపకమైన త్రిపురాంతకుని ప్రేమాభిరామము కంటె భిన్నమైనదని; ఇందులో వేఱే వివాదానికి ఆస్కారం లేదని నిశ్చయించి - ఈ త్రిపురారి ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పిన అయ్యలరాజు త్రిపురాంతకుడు కావచ్చునేమో! అని ఊహించారు.

      ఇకపోతే, క్రీ.శ. 16-వ శతాబ్ది నాటి మఱింగంటి సింగరాచార్యులు తన అచ్చతెలుగు నిరోష్ఠ్య సీతాకల్యాణములో -   

      గీ.    అనఘ! ప్రేమాభిరామ ధనాభిరామ

              కావ్యములు జాతివార్తలు గడలుకొనఁగ

              ద్విపదలుగఁ జేసితివి కవినృపతులెన్నఁ

              బూని షోడశవత్సరంబులనె మొదల.           (1-18)   

అని వ్రాసికొన్నదానిని బట్టి ఆయన చెప్పిన ప్రేమాభిరామము ద్విపద కావ్యము కాబట్టి మేడేపల్లి వారి ప్రతినుంచి పైని ఉదాహరించిన పద్యాలు అందులోనివి కావటానికి వీలుండదు. సింగరాచార్యులు తాను పునారచించానని చెప్పుకొన్న పై రచనలు రెండింటిలో ధనాభిరామము తెలుగులో నూతనకవి సూరన రచించిన రమణీయమైన పద్యకావ్యం. అవతారికతో కలుపుకొని 111-పద్యాల చిన్ని కృతి. దానికొక మూలం ఉండినదేమో సూరన చెప్పలేదు. స్వతంత్రమైన తెలుగు కావ్యమనే అనిపిస్తున్నది. సింగరాచార్యులు ఆ తెలుగు పద్యకావ్యాన్ని ద్విపద కావ్యంగా పరివర్తించినట్లే - తనయెదుట ఒక తెలుగు ప్రేమాభిరామము ఉండగా దానిని ద్విపద కావ్యంగా పరివర్తించాడో, సంస్కృతంలోని త్రిపురాంతకుని ప్రేమాభిరామమునే సంపాదించి దానిని ద్విపద కావ్యంగా తెలుగుచేశాడో - ఆయన అనువాదం లభిస్తేనే గాని చెప్పలేము.

      అయితే, పైని ఉదాహరించిన తెలుగు ప్రేమాభిరామము పద్యాలను చదివిన వారెవరికైనా – అక్కడ ప్రసక్తమైన విషయం కామశాస్త్రంలోని చతుర్విధవిటుల లక్షణవివరణం కాదని; ఒకానొక విదగ్ధురాలైన వేశ్య 1) భద్రుడు, 2) దత్తకుడు, 3) కూచిమారుడు, 4) పాంచాలుడు అన్న విటులలో ఒక్కొకరికి ఉన్న లోపాలను వివరించి; ఆ లోపాలేవీ లేనివాడై - తనయందు అనురాగాన్ని, ప్రత్యనురాగాన్ని, చేష్టను, ప్రతిచేష్టను చూపగల నేర్పరి, రూపవంతుడు, ధనవంతుడు అయిన విటుని పొందుకోసం ఎదురుచూస్తూ ఉన్న సన్నివేశమని – స్పష్టంగానే బోధపడుతుంది. అందువల్లనే ఆమె,

1.           చెప్పకు చెప్పకు కూచిమారునిన్;

2.              ... ... ... ... ... ... ... ... (పాం, చాలు...)ని చందముల్,

                మేలని పొందిరేనిఁ బెఱమిండలకున్ గొఱగారు కామినుల్.

      వంటి మాటలను చెప్పటం జరిగింది. కేవల కామశాస్త్రలక్షణగ్రంథమైతే ఇటువంటి తిరస్కార-పురస్కార దూషణ-భూషణపూర్వక ప్రసంగానికి ఆస్కారమే ఉండదు. కనుక తెలుగు ప్రేమాభిరామము సిద్ధకావ్యమే కాని కామశాస్త్రలక్షణగ్రంథం కాదన్నమాట.

      వల్లభరాయల క్రీడాభిరామములో ఇటువంటి ప్రసంగానికి అవకాశం ఉన్న స్థలం ఒకటి స్మరదివ్యాగమకోవిదుల్ అన్న 272-వ పద్యం తర్వాత కనబడుతుంది. మంచన శర్మ, టిట్టిభ సెట్టి ఓరుగల్లులోని భైరవాలయం ముందు సాటి విటులతో ఠేమిణీ తీరి, తమ ప్రయాసలన్నీ వేశ్యమాత అడ్డంకి వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతున్నందుకు ఆమెను కొంతసేపు తిట్టుకొని, ఆ తర్వాత వేశ్యవాడకు వెళ్తారు. ఆ 272-వ పద్యం తర్వాత కొంత గ్రంథపాతం ఉన్నది. అక్కడ ఈ పద్యాలుండే అవకాశం ఉన్నది. “స్మరదివ్యాగమకోవిదుల్ మదనశిక్షాతంత్రవిద్యావిదుల్” అన్న పద్యం తర్వాత పెదపాటి జగన్నాథకవి రావిపాటి త్రిపురారి ప్రేమాభిరామమ” నుంచి ఉదాహరించిన నాలుగు పద్యాలూ నిజానికి త్రిపురాంతకుని ప్రేమాభిరామమునకు అనువాదమైన క్రీడాభిరామములోని పద్యాలై ఉండాలి. అంతే కాదు; పై నాలుగు పద్యాల శైలి త్రిపురాంతకుని పద్యాల శైలికంటె వల్లభరాయల పద్యాల శైలికే సన్నిహితంగా ఉన్నది.  

      ఈ ఊహే నిజమైతే – ప్రేమాభిరామమునకు అనువాదమైన వల్లభరాయల క్రీడాభిరామములో పైని పేర్కొన్న నాలుగు పద్యాలనూ చేర్చుకోవచ్చును కాని; ప్రేమాభిరామము అనే కావ్యాన్ని రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలోనూ, తెలుగులోనూ తానే చెప్పి ఉంటాడని విశ్వసించటం భావ్యంగా ఉండదు. ఆచార్య శ్రీరామమూర్తి గారు త్రిపురాంతకుడు అన్న నామసామ్యం వల్ల భావించినట్లు పై అభూతపూర్వమైన కామశాస్త్రగ్రంథం ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని చెప్పిన అయ్యలరాజు త్రిపురాంతకుడు చెప్పినదేమో! అనటం పూర్తిగా నిరాధారమైన ఊహకు నిరాలంబమైన ఉపాధిని కల్పించటమే అవుతుంది.  

      కనుక, రావిపాటి త్రిపురారి రచించిన ప్రేమాభిరామము అనే తెలుగు కావ్యమొకటి ఇప్పటికింకా మృగ్యమనే ఫలితార్థం.

క్రీడాభిరామములో కనుపిస్తున్న ఇతరకావ్యశ్లోకానువాదాలు :

      క్రీడాభిరామము కావ్యం త్రిపురాంతకుని ప్రేమాభిరామమునకు అనువాదమే అయినప్పటికీ అందులో అనేక ఇతరగ్రంథాలలోని శ్లోకాల అనువాదాలు కూడా వచ్చిచేరాయి. వాటిలో 1. పటుఝంఝాపవనోత్తృణాలయముల అన్న 60-వ పద్యమూ (వ్యాసం చివఱను అనుబంధజ్ఞాపికలో దీని పూర్తిపాఠాన్ని చూడవచ్చును); 2. మాఘమాసంబు పులి వలె మలయుచుండ అన్న 262-వ పద్యమూ ప్రాకృత గాథాసప్తశతిలోని గాథలకు సన్నిహితంగా ఉన్న అనువాదాలు. ఆ పద్యాలివి:  

మ. పటుఝంఝాపవనోత్తృణాలయములో భద్రంబునం బట్టె కం

       కటిపై ముచ్చముడింగి నిర్భరవియోగగ్లాని శోషించి యె

       క్కటి నిద్రించుచునున్న వాడవనితన్ గర్జావచఃప్రౌఢిమన్

       దటిదుద్ద్యోతము చూపు నట్టునడురే ధారాధరశ్రేణికిన్.     (ప. 60)

గీ.  మాఘమాసంబు పులి వలె మలయుచుండఁ

       బచ్చడం బమ్ముకొన్నాఁడు పసరమునకు

       ముదిత చన్నులు పొగలేని ముర్మురములు

       చలికి నొఱగోయ కేలుండు సైరికుండు.                  (ప. 262)

      వల్లభరాయలు వీటిని శ్రీనాథుని బాల్యరచన అయిన శాలివాహనసప్తశతి నుంచి స్వీకరించి క్రీడాభిరామములో సన్నివేశోచితమైన తన కల్పనకు అనుగుణంగా మార్చుకొని ఉండవచ్చునని తత్తత్సాహిత్యవిమర్శకులు విశ్వసిస్తున్నారు. అయితే శ్రీనాథుని శాలివాహనసప్తశతిలో ఈ గాథానువాదాలు ఉన్నవో లేవో తెలియకుండా వల్లభరాయలు ఆ గాథలను శాలివాహనసప్తశతి నుంచే గ్రహించాడని నిర్ణయించడం భావ్యమనిపించుకోదు. పై పద్యాలలో మొదటిదైన పటుఝంఝాపవనోత్తృణాలయములో” అన్న 60-వ పద్యానికి మూలమైన ఝంఝావాఉత్తిణ్ణిఅఘరవివర అన్న గాథ ఒక్క ప్రాకృత గాథాసప్తశతిలోనే కాక భోజుని శృంగారప్రకాశం  (యతిరాజస్వామి వారి అసంపూర్ణ ప్రకాశన తర్వాత 1959లో జి.ఆర్. జోయర్ పరిష్కరించి, మైసూరు నుంచి నాలుగు సంపుటాలుగా ప్రకటించిన శృంగారప్రకాశంలో రెండవ సంపుటం: పుట 622; అదే, గాథాసప్తశతిలో 2-60) లోనూ ఉన్నది. “మాఘమాసంబు పులి వలె మలయుచుండఁ” అన్న పద్యానికి మూలమైన “వివికణఇ/విక్కేఇ మాహమాసమ్మి” అన్న సప్తశతిలోని (3:38) గాథ భోజుని శృంగారప్రకాశం (చతుర్థ సంపుటం – పు. 1164) లోనూ; ఆయనదే, సరస్వతీకంఠాభరణం (పు. 575, సంఖ్య. 11) లోనూ; నరేంద్రప్రభ సూరి అలంకారమహోదధి (పు. 98, సంఖ్య. 226) లోనూ; ఇంకా అనేక గ్రంథాలలోనూ ప్రసిద్ధంగా వ్యాఖ్యాతమై ఉన్నది. బహుగ్రంథపరిశీలకుడైన వల్లభరాయలు వీటిలో ఎక్కడి నుంచైనా ఈ గాథలను గ్రహించి తన అనువాదంలో చేర్చుకొని ఉండవచ్చును. శ్రీనాథుని శాలివాహనసప్తశతికి గాని, త్రిపురాంతకుని ప్రేమాభిరామమునకు గాని ఈ పద్యాలతో ఎటువంటి సంబంధమూ లేకపోయి ఉండవచ్చును.

      బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు మఱికొంత కృషిచేసి పెదకోమటి వేమారెడ్డి సాహిత్యచింతామణిలో ఉదాహృతమైన ఒక శ్లోకాన్ని, కేదారభట్టు వృత్తరత్నాకరంలో ఉదాహృతమైన వేఱొక శ్లోకాన్ని క్రీడాభిరామములోని పద్యాలకు మూలమైనవని గుర్తించారు. అవి రెండూ త్రిపురాంతకుని ప్రేమాభిరామము లోనివే కావచ్చునని తమ క్రీడాభిరామము పీఠిక (1988 నాటి పునర్ముద్రణ ప్రతి : పు. 59)లో వ్రాశారు. ఆ శ్లోక-పద్యాలివి:  

      పరారిసందర్శితసన్నివేశౌ, పరుత్పరాభూతపయోజకోశౌ

       ఇహైషమ స్తాళఫలోపమానౌ, స్తనౌ కియంతౌ పురతో భవేతామ్.

-     పెదకోమటి వేమారెడ్డి సాహిత్యచింతామణిలో ఉదాహృతం.

చ.  దొరసెమునందుఁ జుట్టుకొని తోరణకట్టె నురోవిభాగమున్

       నిరుడు పయోజకోశరమణీయతఁ దార్చెను వర్తమానవ

       త్సరమున నొప్పె హేమకలశంబుల బాగున ముందటేటికిం

       గరినిభయాన చన్నుఁగవ కౌఁగిలిపట్టులు గాకయుండునే.   

-     క్రీడాభిరామము (ప. 288)

తరుణం సర్షపశాకం, నవౌదనం పిచ్ఛిలాని చ దధీని

స్వల్పవ్యయేన సున్దరి, గ్రామ్యజనో మృష్ట మశ్నాతి.

-     కేదారభట్టు వృత్తరత్నాకరము (పరిభాషాధ్యాయం 1-11)

గీ.   శీతకాలంబు కడి మాడ సేయఁ గుడుచు

       భాగ్యవంతుండు ఱేపాడి పల్లెపట్లఁ

       గొఱ్ఱ (గ్రొత్త) యోరెంబు నిగురావకూరతోడఁ

       బిచ్ఛిలం బైన నేతితోఁ బెరుగుతోడ.

- క్రీడాభిరామము (ప. 56)

      ఇవి రెండూ త్రిపురాంతకుని ప్రేమాభిరామము లోనివని చెప్పటానికి ఊహే తప్ప ఆమోదయోగ్యమైన ప్రమాణమేదీ లేదు.

       వేటూరి ప్రభాకరశాస్త్రి గారు క్రీడాభిరామములోని వేఱొక పద్యానికి కూడా మూలాన్ని గుర్తించారు కాని, దానిని ఎక్కడి నుంచి స్వీకరించినదీ చెప్పలేదు. ఆ శ్లోక-పద్యాలివి:

      పృథులజఘనభారం మన్ద మాన్దోలయన్తీ

       ప్రచలితకుచకుమ్భా సమ్భ్రమత్కర్ణపూరా

       మృదుచలదలకాన్తా ముగ్ధపుమ్భావలీలా

       మభినయతి హరిద్రాపేషణఛ్ఛద్మనైషా.     

స్రగ్ధర.

      పరిపాటీఖర్వఖర్జూపరతిసమయస

                                  మ్భ్రాన్తసమ్భోగభఙ్గిన్

       దరుణీరత్నంబు హేలాతరళగతి హరి

                                  ద్రారజఃకర్దమంబుం

       గురు లల్లాడంగ వీఁగుంగుచములు గదలం

                                  గొంతు గూర్చుండి నూఱెన్

       గరవల్లీకాచభూషాకలమధురఝణా

                                  త్కారముల్ తోరముల్ గాన్.    క్రీడాభిరామము (ప. 110)

      ఇవన్నీ ఇంతవఱకు విమర్శకులు గుర్తించిన శ్లోకానువాదాలు. ఇవి కాక నేను గుర్తించిన శ్లోకం ఇది:

      విటానాం కేలిపటహం తప్తతామ్రఘటోపమమ్

       దధానం రోమమాలాన్తం స్థూలఖల్వాటకర్పరమ్.  -     క్షేమేంద్రుని సమయమాతృక (1-10)

      “సీ.  కసటువోవఁగఁ దోమి కడిగి బోరగిలంగఁ

                        బెట్టిన తామ్రంపు బిందె వోలె     -     క్రీడాభిరామము (ప. 80)

ఇది వల్లభరాయలు క్షేమేంద్ర కావ్యకోవిదుడని స్పష్టం చేస్తున్నది.

      ఇక చివఱిగా, ఒక సామాన్యస్త్రీజనవర్ణనాపూర్ణమైన ప్రాస్తావిక చాటుపద్యసముదాయానికి “శ్రీనాథుని వీథి నాటకం” అని పేరెందుకు వచ్చింది? రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామమునకు, శ్రీనాథుని ఆ వీథి నాటకానికి, వల్లభరాయల క్రీడాభిరామమునకు గల ఆంతరికసంబంధం ఏమిటి? శ్రీనాథుని వీథి నాటకం లోనూ, వల్లభరాయల క్రీడాభిరామములోనూ ఉన్న పద్యాల సామ్యానికి కారణం ఏమిటి? క్రీడాభిరామము లోని పద్యాల ఆధారంగా వ్రాతప్రతుల నుంచి త్రిపురాంతకుని ప్రేమాభిరామములో కొంత భాగమైనా, కనీసం అనుమానప్రమాణంగా నైనా లభించే అవకాశం ఉన్నదా? అన్న ప్రశ్నలకు సమాధానాన్ని వచ్చే సంచికలో అన్వేషించి, ఇప్పటికే పెద్దదయిన ఈ వ్యాసాన్ని ముగిద్దాము.   

 


 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 






సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech