Sujanaranjani
           
  శీర్షికలు  
       తెలుగు తేజోమూర్తులు
 

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.

 
తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

మనోధర్మ సంగీత విద్వాన్ శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి

        

   

సంగీత సాహిత్యాలలో సవ్యసాచి, వక్త, ప్రయోక్త, వాగ్గేయకారుడు, జంత్ర గాత్రజ్ఞులు, శాస్త్రీయ, లలిత, చలన చిత్ర సంగీతములో దిట్ట, మనోధర్మ సంగీత విద్వాన్ శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి గారు. అటు శాస్త్రీయ సంగీతం, ఇటు చలన చిత్ర సంగీత క్షేత్రాలలో తనదైన ముద్రవేశారు. శాస్త్రీయ సంగీత అనుభావాన్ని రంగరించుకుని, సినీ సంగీతానికి మలుచుకుని, ఐదు దశాబ్దాల పాటు సంగీత సేవలు అందిస్తూ వచ్చారు. శాస్త్రి గారు వేద పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి. వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజు హృదయాంతరాళనుంచి పంచరత్న కృతులు ఎలా, ఎందుకు విలువడ్డాయో "త్యాగరాజు హృదయం" లో చాటి చెప్పిన ఘనులు. ఘనరాగ పంచరత్నముల విశ్లేషణం సంగీత లోకానికి అందించారు. అనునిత్యం, పండగలప్పుడు చేసే పూజలు, వాటి విధి విధానాలను, స్తోత్రాలను సామాన్య జనాలు ఉపయోగించుకునేలా "క్యాసెట్", "సిడి" లు రూపొందించారు. ఇవి దేశ, విదేశాలలో లక్షల మంది ఆదరణ పొందాయి. ఇలా తనదైన రీతిలో భక్తి భావాలను చాటుకుంటుకున్న మహానుభావులు శ్రీ అచ్యుతరామ శాస్త్రి గారిని ఉద్దేశించి "వాయులీన వాధ్యాన్ని వశపరచుకున్న ధీశాలి" అని శ్రీ అన్నవరపు రామస్వామి గారు ముక్తాయించారు.  

ప్రముఖ సాహిత్యకారుడు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు "గతం పరిశోధించుకుని, వర్తమానం సమన్వయ పరచి, భవిష్యత్తు నిర్ధారణగా రూపొందించుకోవడం ముఖ్యవిధులు " అని గతంలో సెలవిచ్చారు. ఇది హరి అచ్యుతరామ శాస్త్రి గారి విషయములో అక్షర సత్యం అయ్యింది. ప్రముఖ వాగ్గేయకారుడు, వాగేయకార రత్న శ్రీ హరి నాగభూషణం గారు, వారి శిష్యుడు, కుమారుడు ఐన హరి అచ్యుతరామ శాస్త్రి గారునూ త్యాగరాజు హృదయాంతరాలలోకి వెళ్ళి, సంగీతంలో వారి పాండిత్యం, స్వానుభావం సమన్వయ పరచి, ఘన పంచరత్నాలలో ఉన్న భక్తి, జ్ఞాన, రాగ, లయ, గమక సృతులతో పాటు, నిగూడ, నిషిప్త, అంతరార్ధ, పరమార్ధ స్వరూపాలని విశ్లేసించి, భవితవ్యానికి అందించిన గొప్ప వాగ్గేయకారులు. " సంగీత లోకానికి ఇది గొప్ప ఉపకారం, మంచి కానుక " అని వ్రాశారు సంగీత కళానిధి, విద్వాంశుడు శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి గారు.

తండ్రిని (శ్రీ హరి నాగభూషణం గారిని) పుణికి పుచ్చుకున్నారు అని అభివర్ణించారు మహా మహోపాధ్యాయ శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు. వీరు రచించిన త్యాగరాజ పంచరత్నాలు పుస్తకం చదివితే విదితమవుతుంది.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి. వీరి పూర్వ వంశీకులు శ్రీ త్యాగరాజు గురువులైన శ్రీ శొంఠి వెంకటరమణయ్య గారికి సంగీత గురువులు. ఈ దృక్పథంలో చూస్తే కర్ణాటక సంగీతానికి " హరి " వారు గురూణాం గురులన్న మాట.

శాస్త్రీయ సంగీతంలోని అలంకారాలు, గతులు బాగా నేర్వడంతో వారు ఇవి ముడి సరుకులుగా చేసుకుని చలన చిత్ర సంగీతానికి మలుచుకోగలిగారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ సంగీత క్షేత్ర రంగంలో ముకుటంలేని మహరాజుగా వెలుగొందారు.

శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి గారు ఆంధ్ర రాష్ట్ర, కృష్ణా జిల్లాలోని బందరులో, డిశంబరు 19, 1929 లో హరి నాగభూషణం గారి (అ) ద్వితీయ పుత్రుడిగా జన్మించారు. వృత్తి రీత్యా హరి నాగభూషణం గారు ప్లీడరు. ఐతే, శ్రీ హరి నాగభూషణ శర్మ గారు మహా వాగ్గేకారులు, సంగీత సాహిత్యాలలో సవ్యసాచి. ఈ వాతావరణంలో పెరిగినందున అచ్యుతరామ శాస్త్రి గారికి శాస్త్రీయ సంగీతం అలవోకగా అబ్బింది.

బి ఏ పట్టా సాధించిన తరువాత, ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, తదుపరి చదువు (ఎం ఏ - గణితం కి) స్వస్తి చెప్పారు. శాస్త్రి గారు బి ఏ లో బంగారు పతకం సాదించారట!. గణితం లెక్చరర్ అవ్వాలనుకున్నారు; కానీ అప్పటి ఆర్ధిక పరిస్థితులకు తల ఒగ్గి, స్కూల్ లో గణితం అధ్యాపకుడిగా చేరారు.

అలనాటి సినీ రంగ సుప్రసిద్ధుడు, చిత్తూరు వి నాగయ్య, గురుతుల్యులు, అపర త్యాగరాజుగా ఖ్యాతినొందిన శ్రీ హరి నాగభూషణం గారిని కలవడానికి బందరు వెళ్ళారు. ఆయనకి పక్షవాతం రావడంతో విపరీత పరిస్థితులు, ఆర్ధిక వత్తిడులు ఎదుర్కోవలసి వచ్చింది. వీటిని అర్ధం చేసుకుని పిన్న వయస్కుడైన అచ్యుతరామ శాస్త్రి గారిని మద్రాసు పంపించవలసినధిగా కోరారు. కుటుంబ పోషణాభారం శాస్త్రి గారి మీద పడింది. అలా శాస్త్రి గారి గమ్యం మారింది. చెన్నైలో అలనాటి మేటి సినీ సంస్థలైన విజయా, వాహినిలలో వయొలిన్ (వాయులీన) కళాకారుడిగా కొలువు తీరారు. సంగీతంలో మంచి పట్టు ఉన్నందున, సినీ సంగీతం వెంపు మొగ్గులేకపోయినా అప్పటి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్రమాన్నే అనుసరించారు.

శాస్త్రి గారు సృతి భేదం టెక్నిక్ ని ఆవిష్కరించి, సాంప్రదాయ సంగీతం నుండి సినీ సంగీతానికి అలవోకగా తన నైపుణ్యంతో మలుచుకున్నారు. కొంత డబ్బులోనే గడిపేసి దాదాపు వచ్చిందంతా ఇంటికి (బందరు) పంపించేవారు.

నివాసం చెన్నైలో ఉన్నా, ఆయన మనసంతా బందరు మీదే ఉండేది. తిరిగి బందరు వెళ్ళి పోతే, పిల్లలు చదువులలో ఇబ్బంది పడకండా ఉండటానికి వారిని తెలుగు మాధ్యమం ఉన్న స్కూళ్ళలోనే చేర్పించారట. సొంత గడ్డ, మనుషల మీదా ఆయనకున్న మమకారం అటువంటిది!.

వీరి వివాహం ఆగుస్టు 15, 1956 లో జరిగింది.

ప్రముఖ వాగ్గేకారుడు శ్రీ జి ఎన్ బాలసుబ్రహ్మమణియం (జి ఎన్ బి ) శిష్యరికంలో మరింత ముందుకు సాగాలని ఆయన్ని ఆశ్రయించారు. శాస్త్రి గారు లాల్గుడి జయరామన్ సమకాలికులు; జి ఎన్ బి సాటి అరవం వాడిని (లాల్గుడి జయరామన్ని) చేరదీయంతో సంగీత విధ్వాంశుడు కావాలన్న తపనను విడిచిపెట్టారు. ఏటికి ఎదురీదడం కష్టం అని అనుకుని జి ఎన్ బి వద్ద కర్ణాటక సంగీత విధ్వాంశుడు కావాలన్న స్వప్నం పై ఆశలు వదలుకున్నారు.

ఓ మేటి వయలిన్ కళాకారుడిగా అనేక సినీ రంగ సంగీత దర్శకుల వద్ద పనిచేశారు. వీరిలో అద్దేపల్లి రామారావు, పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరి రాజేశ్వరరావు, ఘంటశాల గార్లు ఉన్నారు.

శ్రీ అచ్యుతరామ శాస్త్రి గారు ఒక ట్రాక్ ఆర్టిస్ట్ గా మంచిగా రాణించారు. సినీ పరిశ్రమలో మంచి పేరు గడించారు. ముకుటంలేని మహరాజుగా వెలిగారు. సినీ నటి భానుమతి గారికి త్యాగరాజ కృతులు (నగుమోము గనరే! ....) నేర్పించారు. అలానే సినీ గాయకురాలు శ్రీమతి జానకి గారికి కూడ త్యాగరాజ కృతులు నేర్పించారు. డెభ్భై ఏళ్ళు వచ్చేవరకూ తన పయనం కొనసాగించారు శాస్త్రి గారు. తరువాత, పిల్లలు ఇక చాలు అనడంతో రిటైర్ అయ్యారు.

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా షో లో, పలుమార్లు జడ్జీగా వ్యవహరించారు శాస్త్రి గారు.

చెన్నై లో నివాసముంటూ వేద, శాస్త్రాల మీద మక్కువతో ఘనాపాటి వద్ద విద్య చెప్పుకున్నారు. సూక్తాలు, అభిషేక విధి విధానాలు నేర్చుకున్నారు. వారి పిల్లలకు కూడా నేర్పించారు.

చిన్మయా మిషన్, స్వామీ దయానంద సరస్వతి శిష్యుడు స్వామి పరమార్ధానంద గారి శిష్యులు, అనువాయులునూ శాస్త్రి గారు ఆధ్యాత్మికంగా చాలా ఎదిగారు అచ్యుతరామ శాస్త్రి గారు. నిరాడంబర జీవన విధానం; పరిణితి చెందిన వ్యక్తిత్వం వీరిది. మహా పండిత వర్ఛస్సు కలిగి ఉన్నవారు; స్నేహశీలి. అది వారి పూర్వజన్మ సుకృతముగా భావించవచ్చు.

తెలుగులో నిత్య పూజలు, రుద్రం, నమకం, చమకం, అష్టోత్తరం, సూక్తాలు, సత్యనారాయణ వ్రతం తదితర క్యాసెట్లు, సీ డీ లు రూపొందించారు. ఇవి సామాన్య జనాలకు అందుబాటులోకి రావండమే కాకుండా, విధి విధానాలతో శాస్త్రయోక్తముగా పూజలు చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఇచ్చాయి. శాస్త్రి గారి ఈ వినూత్న ప్రక్రియ అనూహ్యముగా ఫలించింది. వారికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

సద్గురు శ్రీ త్యాగరాజు పంచరత్నాలు:

త్యాగయ్య కృతులలో ఉన్న భక్తి, జ్ఞాన, వైరాగ్య, రాగ, లయ, గమక శృతి విషయాలతో పాటు, వీటిలోని నిగూఢ నిక్షిప్తార్ధములు, సూక్ష్మాలు అర్ధం చేసుకుని వివరించిన మహావిద్వాంశుడు. ప్రప్రధమ కీర్తన జగదానందకారకా (నాట రాగం) లో సంగీత సాహిత్య స్వరకల్పనా ప్రాధాన్యం సంతరించుకున్నదీ, తదితర విషయాలను తెలిపారు శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి గారు. ఈ రచన వెలుగు చూడానికి శ్రీ కొండపల్లి సీతారామ బాలకృష్ణ శాస్త్రి ఎంతో తోడ్పడ్డారు.

ఈ రచనలో మరొక విశేషం ఉంది. ఉదాహరణకు పంచరత్న కీర్తనలలోని అష్టోత్తర శతాధిక రామ నామావళిని విశ్లేషించి పొందుపరిచారు శ్రీ అచ్యుతరామ శాస్త్రి గారు.

త్యాగరాజ హృదయాన్ని ఆవిష్కరింపచేసే ఒక విలక్షణమైన, సశాస్త్రీయమైన, ప్రామాణికమైన వివరణ అని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారన్నారు. శ్రీ హరి నాగభూషణం గారి భావాలని, మీ సంగీత సాహిత్య పరిజ్ఞానంతో చక్కగా ఆకళించుకుని, ఎంతో ఉపయోగకరమైన రచన చేశారు అని సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు శ్లాఘించారు.

రూపొందించిన క్యాసెట్లు:

శ్రీ శాస్త్రి గారు ఒక కొత్త ఒరవడిని ఆరంభించారు. వీరు రూపొందించిన క్యాసెట్లు సుపెర్ హిట్ అవడంతో వీరికి విశిష్ట ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. దేశ, విదేశాలలో ఉన్న జనాలకి నిత్య పూజలు నిర్వహించుకోవడానికి, స్తోత్రాలు నేర్చుకోవడానికి మిక్కిలిగా ఉపయోగపడ్డాయి. టీ సీరీస్, సంగీత క్యాసెట్ సంస్థలు విడుదల చేశాయి. వీటిలో:

  శ్రీ వెంకటేశ్వర పూజా విధనము
  ఆది శంకరాచర్య బిల్వార్చన స్తోత్రం
  శ్రీ కనక దుర్గ సుప్రభాతం
  శ్రీ ఆంజనేయ సుప్రభాతం
  సర్వ దేవతాష్టకం
  శ్రీ అయ్యప్ప సుప్రభాతం - సహస్ర నామావళి
  రాఘవేంద్ర సుప్రభాతం - స్తోత్రాలు
  శ్యమలా దండకం
  శివ ఆరాధన, స్తోత్రం
  నవగ్రహ సుప్రభాతం, స్తోత్రం
  శివ స్తోత్రం
  సంధ్యా వందనం
  గీతా పారాయణం - సంఖ్యా యోగం
  శ్రీ దత్తత్రేయ సుప్రభాతం - శ్రీ దత్తభావ సుధారస స్తోత్రం
  దుర్గా అష్తోత్తర శత నామావళి

ఎం పీ 3 రికార్డింగులు:

  శ్రీ సుబ్రహ్మణ్య సుప్రభాతం; దైవ ప్రార్ధన
  శివాష్టకం
  లింగాష్టకం
  బ్రమరాంభిక అష్టకం
  లక్ష్మీ అష్టకం
  సద్యోజాత విధాన పూజ
  ప్రపత్తి
  రుద్ర గాయత్రి జపం
  శ్రీ సూర్య అష్టోత్తరం
  గణపతి ధ్యానం
  శ్రీ సూక్తం
  నారయణ సూక్తం
  మేధా సూక్తం
  శ్రీ ఆదిత్య స్తోత్రం
  ఆదిత్య హృదయం
  పంచాంగ రుద్రం
  మంత్ర పుష్పం
  విష్ణు సహస్ర నామావళి
  వినాయక సుప్రభాతం

ఇవి ఆపిల్ ఐ ట్యూన్స్ లో కూడ సౌలభ్యమవుతున్నాయి.

మార్చ్ 25, 2012 నాడు శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి గారు ఊర్ధ్వ లోకాలకి వెళ్ళి పోయారు. భౌతికముగా ఆయన లేకపోయినా వారి గళం, మంత్రాలు దయనేంద్ర జీవిత నిత్య పూజ విధి విధానాలలో అంతర్భాగం అయిపోయాయి. ఇలా ప్రతి ఇంటా ఆయన తారసిల్లుతూనే ఉంటారు.రుద్రం, మహన్యాసం, స్తోత్రాలు, సూక్తాలు, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వినాయక పూజ, ఆదిత్య హృదయం ఇలా వీటన్నిటినీ రూపొందించి భావి తరాలకు అందించి వెళ్ళి పోయారు.

కాని ప్రతి ఇంటా, ఆ దేవుడి కొలువులో, వీరి గళం, మంత్రం మ్రోగుతూనే ఉంటాయి.

శ్రీ గురుభ్యో నమహ!... హరి హి ఓం!....


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech