సుజననీయం  
 

 

తాజ్ మహల్ షాజహాన్ కట్టిచిందేనా? నిష్కర్ష(ఎనిమిదవ భాగం)                                                        

 

                                                            రచన : రావు తల్లాప్రగడ

 
 

 

బేబీ తాజమహలు

గత ఏడు అధ్యాయాలలో జరిపిన విశ్లేషణలో తాజమహలుని షాజహాను కట్టించి వుండక పోవచ్చని, అది ఒక శివాలయమై వుండడానికి ఆస్కారము ఎక్కువ అని గుర్తించాము. ఐతే ఈ విశ్లేషణ సరిగ్గా ముగియాలి అంటే, రెండు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి. మొదటిది .. తాజమహలు అన్నది రాజపుత్రులదే అనడానికి తగిన ఆధారం చూపించాల్సి ఉంటుంది. రెండవది....  ఇది నిజంగా షాజహానుకన్నా చాలా పాత శివాలయమే అయ్యి వుంటే ఆ ఆలయ ప్రస్తావనలు ఎక్కడైనా ఒక శిలాశాసనాలలో కానీ గ్రంధంలో కానీ చూపించగలగాలి. ఇప్పటిదాకా ఈ విశ్లేషణకి కావలసినవన్నీ చూపించాము కానీ, ఇక్కడ వస్తుంది అసలైన  చిక్కు.

మన దురదృష్ఠవశాత్తు హిందువులకు  చరిత్ర వ్రాసుకునే అలవాటు మొదటి నుంచీ లేదు. ఎప్పుడైనా, ఏ కవి యైనా, తన భక్తి పారవశ్యంలో తన దేవుడి పైన ఏమైనా ఒక పాటనో పద్యాన్నో వ్రాసుకుంటే, అందులో దొరికేవే దాదాపుగా మనకు ఉన్న చారిత్రాత్మక ఆధారాలును సాక్షాలును. దానితో పాటు కవిత్వంలో సాధారణంగా వాడే అతిశయోక్తి, ఉత్ప్రేక్ష, ఉపమాన అలంకారాల వలన సత్యాసత్యనిరూపణ క్లిష్టమవుతుంది. అలా అని తిరుపతి వేంకటేశ్వరుడికి అన్నమయ్యలాగా, ఉజ్జయని మహాకాలునికి కాళిదాసులాగా అన్ని ఆలయాలకు ఒక్కో కవి ఉన్నా బాగుండేది.  అలాంటి కవులు, కవిత్వాల భాగ్యం అందరు దేవుళ్ళకీ ఆలయాలకీ దక్కలేదు. మనకు దొరికే భారత చరిత్ర మొత్తం దాదాపుగా పాశ్చాత్య పర్యాటకులు వ్రాసుకున్న పుస్తకాల నుంచి, స్థానిక శిలాశాసనాల నుంచీ, కవులు వ్రాసుకున్న కావ్యాల నుంచీ, పెద్దల నోట వినబడే కథనాల నుంచీ (అంటే నోటి మాటలు, నమ్మకాలు) వచ్చినదే.

అందువలన కొన్ని నిజాలను మనం కేవలం పుస్తకాల నుంచే కాక, జనపధం నుంచీ కూడా సేకరించాల్సి వుంటుంది. మన ప్రాచీనులు చాలా విషయాలను గ్రంథస్థము చేసి వుండకపోవచ్చు; ఒకవేళ ఏ కవి యైనా గ్రంథస్థము చేసినా, ఆ పురాతన గ్రంథము మనదాకా చేరి వుండకపోవచ్చు. దానికి కారణలు ఏమైనా వుండవచ్చు; అనేకం వుండవచ్చు. కనుక ఈ తేజోమహాలయము స్థానిక కథనాన్ని కూడా ఒక సారి పరిశీలిద్దాము.

తేజోమహాలయం :

తాజమహలుని షాజహాను కన్నా ముందు కాలంలో తేజోమహాలయం అని పిలుచుకునేవారనే వాదనని మనం ఇంతకు ముందు ఎన్నో సార్లే వినివుంటాము.  దీని ప్రకారము ఆగ్రాలో షాజహాను కన్నా కొన్ని శతాబ్దాల ముందటే తేజోమహాలయమనే ఒక గుడి ఉండేదని; అందులో అగ్రేశ్వరుడు అనబడే శివుని పూజించేవారని; ఆ అగ్రేశ్వరుని వలన ఆ నగరం "అగ్రా" అయ్యిందని, ఒక స్థానిక కథనం వినబడుతూ వుంటుంది. ఐతే ఈ కథనాన్ని ప్రాచీనులెవరూ  గ్రంథస్థము చేసినట్టుగా ఎక్కడా కనబడదు.

ఈ స్థానిక కథనం ప్రకారం, అలనాటి ఆగ్రాపురవాసులు (ప్రాచీనులు) ఆగ్రాలోని అగ్రేశ్వరునితో పాటుగా ఆగ్రాకి నలుమూలలా వున్న మరో నాలుగు శివాలయాలను దర్శించుకునే వారట. బల్కేశ్వరాలయము, పృత్వీనాథాలయము, మనోకామేశ్వరాలయము, రాజరాజేశ్వరాలయము అనబడే ఈ నాలుగు శివాలయాలు నేటికి కూడా కనబడతాయి. కానీ,  మధ్యలో ఉండాల్సిన తేజోమహాలయం (అగ్రేశ్వరుడు) మాత్రం కనబడదు. నేటి తాజమహలులోనే  ఆ అగ్రేశ్వరుడు వుండేవాడన్నది వాదనలోని నమ్మకం. అగ్రేశ్వరుని గుడిని" తేజోమహాలయము" అని పిలుచుకునేవారని, ఇది కూడా ఒక జ్యోతిర్లింగమేననీ, అగ్రేశ్వరుని పేరు మూలంగానే ఊరు పేరు "అగ్రా" గా ( లేక మహాభారత కాలంలో అగ్రబాన్ గా)" పిలువబడేదని, కాలక్రమేణా అది "ఆగ్రా" గా మారిందని నమ్మకము.

అగ్ర నగరమైన, లేక అలనాటి రాజధానియైన ఆగ్రానగరం, ఒకనాటి రాజపుత్రుల రాజధాని.   షాజహానుకి తాజమహలు కట్టడ సముదాయాన్ని కట్టబెట్టిన రాజాజయసింగు(రాజపుత్రుడు) ఆగ్రాలో ఎన్నో భవనాలకు అధిపతి అని, ఆగ్రానగరాన్ని జయసింగపురం అని కూడా పిలిచేవారని  అంటారు. నేడు ఆ పేరుతప్ప జయసింగు భవనాలేమీ కనిపించవు. అక్కడ  ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి, తాజమహలు, ఆగ్రాకోట, మసీదు తప్ప చెప్పుకోదగ్గ భవనాలేమీ లేక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంతేకాదు, ఒకవేళ ఈ భవనాలే రాజసింగుల వారి అలనాటి భవనాలేమో అన్న అనుమానాన్ని కూడా కలిగిస్తుంటాయి. అంతేకాదు ఆగ్రాలోని ఎర్రకోట, అక్బరుకన్నా అనేక శతాబ్దాల ముందుదని, అందరికీ తెలిసినా దాన్ని అక్బరే కట్టించాడనటము; అలాగే మహాభారత కాలం నుంచీ ఉన్న ఆగ్రా నగరాన్ని ఇబ్రహీం లోఢీయే నిర్మించాడని అనడము; చరిత్రను పక్కదోవ పట్టించడానికి మోగలాయులు చేసిన అనేక తప్పిదాలలో కొన్ని మాత్రమే ఆగ్రాలోని ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి, తాజమహలు వంటి భవనాలు అన్నీ కూడా ఒకనాటి రాజాజయసింగు వంశీకుల భవనాలే అని స్థానికుల నమ్మకము.

డిల్లీలోని హుమాయున్ సమాధి లోని కొంత ప్రాంతాన్ని నాటికి కూడా జయపూరు సంస్థానభూమిగా నాటికి కూడా పిలుస్తారట. హుమాయున్ సమాధి కూడా ఒకనాటి హైందవ ఆలయమే అని, డిల్లీలోని ఎర్రకోట కూడా ఒకనాటి రాజపుత్రుల భవనమే అని అనేకుల వాదనలతో పాటూ అనేక ఋజువులు కూడా మనకు నాడు దొరుకుతున్నాయి. అలాగే ఆగ్రాలోని తాజమహలు కూడా జయపూరు రాజపుత్రుల నుండీ (షాజహానుకి సమకాలీకుడైన రాజాజయసింగు నుంచీ) స్వాధీనపరచుకున్నట్టుగా సాక్షాత్తూ బాదూషానామానే  చెబుతోంది.   వీటన్నిటి బట్టి తాజమహలు నిర్మాణానికీ రాజపుత్రులకీ సంబంధం వుంది అని మనం అభిప్రాయపడటంలో తప్పు లేదు. కానీ రాజపుత్రులే కట్టారు అనడానికి ఒక నిర్ద్వంద్వమైన గంథస్థమైన ఆధారము మాత్రము మనకు దొరకలేదు. పరిస్థితిలో ఆధారము లేదు కదా అని కొట్టిపారేయనూ లేము, మొగలు కట్టడమే అని నిర్థారించనూ లేము.

కానీ తాజమహలే తేజోమహాలయము అని అనడానికి ఒక నిర్ద్వంద్వమైన గంథస్థమైన ఆధారము మాత్రము మనకు దొరకలేదు. ఇన్ని ఆధారాలు దొరికాక, ఈ ఒక్క ఆధారము దొరక లేదు కదా అని కొట్టిపారేయనూ లేము, అవునని నిర్థారించనూ లేము. ఈ గంథస్థమైన ఆధారాల విషయంలో మనకు దొరికిన ఆధారాలన్నీ పి.ఎన్.ఓక్ ప్రతిపాదించినవే. ఈ ఆధారాలన్నీ వివాదాస్పదమైనవే అయినా, అన్నిటి పైనా అనేక విమర్శలు కురుస్తూనే వున్నా, వారు చెప్పినవి కూడా ఒకసారి పరిశీలిద్దాము.

తేజోమహాలయము గురించి పి.ఎన్.ఓక్ ఉదహరించిన ఋజువులలో ముఖ్యమైనది, లక్నో మ్యూజియంలో ఉన్న " బాటేశ్వర్ శిలాశాసనము".  దీనినే "ముంజ్ బాటేశ్వర శిలాశాసనము " అని కూడా పిలుస్తారు. దీని పైన  ఉన్న 34 సంస్కృత శ్లోకాలలో ముఖ్యంగా  25, 26, 34 శ్లోకాలు గమనించ వలసినవి. ఆ శ్లోకాలు ఇలా వుంటాయి.

"ప్రసాదో వైష్ణవస్తేన నిర్ణిమితోతవహన్ హరి /

ముర్ధన్ ఆస్ప్రిశతి యో నిత్యం పదమశైవ మధ్యమం // (25)

(ఒక పాలరాతి మందిరాన్ని శ్రీమహవిష్ణువుకై నిర్మించి, రాజు ఆయన పాదాలకు నమస్కరించాడు)

 

అకార్యచ్చ స్ఫటికావదాతమసావిదం మందిరమిందుమౌలెః/

జాతుయస్మిన్నిబ్స్నసదేవః కైలాస్వసయచకర చెతః // (26)

(ఆ రాజు మరొక పాలరాతి మందిరాన్ని నిర్మించి, చంద్రునే ఆభరణంగా తలపైన ధరించిన, శివునికి సమర్పించాడు)

 

పక్ష త్ర్యక్షముఖాదిత్య సంఖ్యె విక్రమవత్సరె /

ఆశ్విన శుక్ల పంచమ్యాం  బాసరే వాసవె శితు // (34)

(నేడు, 1212 విక్రమశక ము, ఆశ్వీయుజ శుక్లపంచమి, ఆదివారం నాడు శాశనం వేయబడింది)"

 

ఆగ్రాకి దగ్గిరలో, యమునానది తీరాన 70 కిలోమీటర్ల (చాలా మంది 4 కిలోమీటర్ల  దూరం అని తప్పుగా తమతమ విశ్లేషణలలో చెబుతారు) దూరంలో ఉన్న బాటేశ్వర్ అనబడే ఊరిలో, ఈ  శాసనం దొరికింది. అందుకే దీనికి బాటేశ్వర్ శాసనము అని పేరు వచ్చింది. జనరల్ కన్నింగ్‌హామ్ 19వ శతాబ్దిలో  ఇక్కడ జరిపిన తవ్వకాలలో ఈ శాసనము బయట పడింది.

ghate

బాటేశ్వర్

101 ఆలయాలతో విలసిల్లిన ఈ బాటేశ్వర్ ని ఒక ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ఊరినే జైనుల 22వ తీర్థనకారుడైన నేమినాథ భగవానుని జన్మస్థానంగా గుర్తిస్తారు. బాటేశ్వర్ తీర్థయాత్రను అతిపవిత్రమైనదిగా శైవులు భావిస్తారు. ఇక్కడ యమునానది కట్ట పైన వున్న 101 ఆలయాలను రాజా బదన్ సింగ్ బదూరియా నిర్మించాడని అంటారు. ఇక్కడ భూతేశ్వరనాథుని మందిరంతో పాటుగా భీమేశ్వరాలయం,  నర్మదేశ్వరాలయం, రామేశ్వరాలయం, మోతేశ్వరాలయం, జాగేశ్వరాలయం, పంచముఖేశ్వరాలయం, పాతాళేశ్వరాలయం, గౌరీశంకరాలయం, నేమినాథ జైన మందిరం మున్నగునవి మొత్తం 101 ఆలయాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి బాటేశ్వర్ అన్న పేరు అక్కడ వున్న భూతేశ్వరుని ఆలయము పేరు మూలంగా ఏర్పడింది.

గ్రానైటు శిలాశాసనము గురించి వివరాలు డి.జె.కాలె వ్రాసిన "ఖర్జూర్వాహక్ అర్థాత్ వర్తమాన్ ఖజురహ" లో ( పుస్తకము 1933లో వ్రాయగా 1967లో ప్రచురించబడింది) కనిపిస్తుంది. అలాగే ఆర్కిలాజికల్ సర్వె ఆఫ్ ఇండియా వారి "ఎపిగ్రాఫియా ఇండికా-వాల్యూం - 1" లోనూ కనిపిస్తుంది. కాలే గారి పుస్తకం ఖజరహో గురించే అయినా, బాటేశ్వర్ శాసనం కూడా (13 ఇన్స్క్రిప్షన్) ఇందులో ప్రస్తావింపబడింది. ఇందులో పైన చూపిన సంస్కృత మూలముతో పాటూ, హిందీ తర్జుమా కూడా ప్రచురించారు. శాసనం బాటేశ్వరులోనే దొరికింది అని కూడా పుస్తకంలో చెప్పబడింది.

పురవాస్తుపరిశోధకుడైన డి.జె. కాలె తన  పుస్తకంలో వ్రాసినదాని ప్రకారం "ముంజ్ బాటేశ్వర్ శాసనాన్ని చంద్రాత్రేయ వంశీకుడైన రాజా పరమార్దిదేవుడు విక్రమశకము 1212, ఆశ్వీయుజ శుక్లపంచమి నాడు (అనగా క్రీ.. 1156లో) వేయించాడు. ఇతడు కట్టించిన రెండు సుందరమైన పాలరాతి మందిరాలలో మొదటిది విష్ణువుకు, తరువాతది శివునికి కట్టించాడు."  

పి.ఎన్.ఓక్  వాదన ప్రకారము, బాటేశ్వర్ లో దొరికిన ఈ శిలాశాసనమే అగ్రేశ్వరుని ఉనికి ఒక ముఖ్య అధారము. వీరి కథనం ప్రకారం, "ఆ శిలాశాసనంలో చెప్పబడిన రెండు ఆలయాలూ (విష్ణ్వాలము, శివాలయము) తరువాతి కాలంలో మహమ్మదీయ ఆక్రమణలలో అపవిత్రం చేయబడ్డాయి. ఈ దురాక్రమణ జరుగుతున్న కాలంలో, బహుశా దూరదృష్టి కలిగిన ఎవరో వ్యక్తి, ఈ శాసనాన్ని ఆగ్రా నుంచీ దూరముగా తీసుకెళ్ళి బాటేశ్వర్ లో పాతిపెట్టి, అలా భావితరాలకై భద్రపరచి వుండవచ్చును".

అదే నిజమైతే, అలా అపవిత్రం చేయబడిన ఆ రెండు ఆలయాలు పూజలకు పనికి రానివై పోవడం వల్ల, అవి కేవలం రాజభవనాలుగా వినియోగానికి నియమింపబడి వుండవచ్చును. అందుకే బాదుషానామాలో అబ్దుల్ హమీద్ లాహోరీ, కూడా వీటిని మందిరాలు అనకుండా (తాజమహలు అని కూడా అనలేదు) రాజా జయసింగు వారి రాజభవనాలనే వ్యాఖ్యానించాడు, అని మనం అనుకోవచ్చును. ఐతే ఇప్పటిదాకా మనం ఒక్క ఆలయము (తాజమహలు) గురించేగా మాట్లాడుకునేది? ఇప్పుడు రెండు ఆలయాలు అంటారేమిటి. ఐతే రెండవ విష్ణువు ఆలయమేది?

7212d1204644150-the-lesser-known-tajs-itmad-ud-daulahs-tomb

ఆగ్రాలో ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి (ఇత్మద్ ఉద్-దౌలాహ్ కా మఖ్బరా)

ఆగ్రాలో ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి ప్రవేశ మార్గము

మరొక సుప్రసిద్ధ పురవాస్తుపరిశోధకుడైన అర్.సి.మజుందార్ ప్రకారం, " చంద్రాత్రేయ మహారాజే చందేల్ మహారాజు, పరమార్దిదేవుడు. ఇతడు బుండేల్ఖండ్ రాజ్యాన్ని పరిపాలించేవాడు. శాసనంలో చెప్పబడినట్లు, ఈనాడు ఆగ్రాలో రెండు సుందరమైన పాలరాతి కట్టడాలు కనబడుతున్నాయి. మొదటిది, నూర్జహాన్ తండ్రియైన " ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి" రెండవది షాజహాను భార్యయైన అర్జుమండ్ భాను (ముంతాజు) సమాధి. దానినే నేడు తాజమహల్ అని పిలుచుకుంటున్నాము". రెండు కట్టడాలు శిలాశాసనంలో వర్ణించినట్టే చక్కటి పాలరాతితో, నదీతీరాన తీర్థస్థలమందిరాలుగా నిర్మింపబడ్డాయి. ఒకే రకమైన శిల్పనైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆలయవాస్తులకు సరిగ్గా సరిపోతూ నేటికి కూడా సజీవంగా నిలిచి కనిపిస్తున్నాయి. బాటేశ్వర్ శాసనం వీటి గురించే చెబుతున్నట్లయితే, వీటిలో మొదటిది విష్ణ్వాలయం, రెండవది (తాజమహలు) శివాలయం అని తెలుస్తున్నది.

ఇంత వరకు నిజమైతే మనం మిగితాది తేలికగా అర్థం చేసుకోవచ్చు. రెండు ఆలయాలూ మహమ్మదీయ దాడులలో అపవిత్రం చేయబడి, కొల్లగొట్టబడి, తొలుత భవనాలుగా మారి, చివరికి సమాధులుగా మారాయి, అని మనం ఊహించుకోవచ్చును. రెండు ఆలయాలూ (నేడు రెండు సమాధులే) అద్భుతమైన ఉద్యానవనాలతో, ఎత్తైన ప్రహరీ గోడలతో, ఎంతో అందంగా నిర్మింపబడ్డాయని చెప్పడానికి పైన చూపించిన ఫొటోల సాక్షం చాలు. ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి తాజమహల్ కన్నా ముందే కట్టబడింది అని మొగలు చరిత్ర కూడా ఒప్పుకుంటుంది. బాటేశ్వర్ శాసనం కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. విష్ణువు గుడిని (నేటి ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి) ముందుగా కట్టి, అదే నైపుణ్యతను మెరుగుపరచి, శివుని గుడిని (నేటి తాజమహలు) మరింత భారీగా కట్టినట్టు ఆ నిర్మాణశైలే చెప్పకచెబుతూ దర్శనమిస్తుంది. అందుకే ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధిని "బేబీ తాజమహలు" అని కూడా స్థానికులు వ్యవహరిస్తారు.

ఈ రెండు భవనాలలోనూ అనేక రత్నమాణిక్యాలను వాడి అనేక చిత్రాలను డిజైన్లను (pietra dura in-lay work లాగా) కూర్చినట్టుగా తెలుస్తోంది. ఎన్ని రత్నాలు పోయాయో ఎన్ని మిగిలాయో తెలియదు కాని,  "అర్.నాథ్" గారి "తాజమహల్" పరిశోధనా గ్రంధంలో ఈ రెండు భవనాలలోనూ రవ్వలు, కెంపులు, మాణిక్యాలు, నీలాలు, పచ్చలు వంటివి మొత్తం 28 రకాల దివ్యరత్నాలను వాడారనీ వ్రాసారు.

ఇత్మద్ ఉద్-దౌలాహ్ సమాధి

"The great mosques of Ajmir, Delhi,Kanauj, Dhar, and Ahmadabad, are merely reconstructed temples of the Hindus and Jains"

-- Fergussion--

" All these peculiarities are found in a more marked degree at Palitana than at almost any other known place, and, fortunately for the student of the style, extending over a considerable period of time. Some of the temples may be as old as the 11 th century, but the Moslim invaders of I4th and i5th centuries made sad havoc of all the older shrines, and we have only fragments of a few of them."   ....  

-- Fergussion--

హిందూమందిరాలను మహమ్మదీయసమాధులుగాను, భవనాలుగాను, శిధిలాలుగాను మార్చడమన్నది ఆగ్రాలోనే కాదు, సమస్తభారతావనిలో లెక్కలేనన్ని ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మొగలాయులు తాము కట్టించినట్టుగా ప్రకటించుకున్న ప్రతి భవనాన్ని, సమాధిని, మసీదుని సూక్ష్మంగా పరిశీలించి చూస్తే  అవి దాదాపుగా మార్పులుచేర్పులు చేయబడ్డ హైందవ ఆలయాలే అని తేల్చవచ్చు ఐతే మన విశ్లేషణ తాజమహలు వరకే పరిమితం కాబట్టి మిగితావి విశ్లేషణలో చర్చించడం లేదు.

ఐతే ఈ బాటేశ్వర్ శాసనం బాటేశ్వర్ లో దొరికింది కనుక, అది బాటేశ్వరుకి చెందినదే (తాజమహలుకు చెందినది కాదు) అని మనం వాదించవచ్చు. తాజమహలుకు చెందిన శాసనం దొరికితే తాజమహలులో దొరకాలి గానీ బాటేశ్వరులో ఎందుకు దొరికింది, అన్నదే ఈ వాదనలోని సారాంశం. నిజానికి ఇటువంటి వాదనలో ఎంతో బలము కనిపిస్తుంది. అయినా ప్రయత్నిస్తే సమాధానం ఇలా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు బాటేశ్వర్ శాసనాన్ని లక్నో మ్యూజియంలోకి తరలించారు. కనుక నేడు అది బాటేశ్వర్ లో కూడా కాదు, లక్నోలోనే కనబడుతుంది. అంత మాత్రం చేత ఇది లక్నోకి చెందినది అని ఎవ్వరూ అనడంలేదే? ఆ శాసనాన్ని భద్రపరచడానికి మ్యూజియానికి తరలించారు అని ఒప్పుకుంటున్నప్పుడు, .... .... తాజమహలు శాసనాన్ని అలనాటి మహమ్మదీయ దాడులనుంచీ తప్పించదలచి ఎవరో ఒక మహనీయుడు, బాటేశ్వర్లో భద్రపరచి చరిత్రకి అందజేసాడని ఎందుకు అనుకోకూడదు? ఒక పక్క తాజమహలుని కొల్లగొడుతూ ఉంటే, ఏది మిగులుతుందో, ఎలా మిగులుతుందో, తెలియని పరిస్థితిలో, కనీసం ఈ శాసనాన్ని రక్షిస్తే భావితరాలకి కొంత చరిత్ర తెలుస్తుందని; ఎవరో సదుద్దేశంతో ఈ శాసనాన్ని దగ్గిరలోనున్న బాటేశ్వరుకి తరలించి దాచిపెట్టించాడని ఎందుకు అనుకోకూడదు? ఈ శాసనానికి బాటేశ్వరులోని ఆలయాలకీ కాన్నా ఆగ్రాలోని ఆలయాలతోనే సంబంధం గట్టిగా కనిపిస్తున్నట్టు వుండటంచేత పి.ఎన్.ఓక్  వాదనలో కొంత బలం వుందేమో అనిపిస్తోంది.

కానీ ఈ శాసనములో ఎక్కడా తాజమహలు అని కానీ, ఆగ్రా అని కాని లేకపోవడం చేత, ఆ వాదనపై అనుమానం కూడా కలుగుతోంది. అలాగే ఈ శాసనము ఆగ్రా నుంచీ బాటేశ్వరుకి తరలించబడిందని ఖచ్చితంగానూ ఋజువు చేయలేము. ఈ వాదనలో కావలసిన ఋజువులు లేక పోయినా, మన ప్రశ్నలన్నిటికీ సామాధానాలను సరిగ్గా సరిపోయేటట్టు ఇస్తోంది. కనుక ఈ వాదనని మనం ప్రస్తుతానికి ఖచ్చితంగా నమ్మలేకున్నా, దీని ద్వారా భావిపరిశోధకులకు ఒక చక్కటి హైపోతెసిస్సు వస్తోంది. ఈ మార్గంలో మరింత అన్వేషణ కొనసాగించడానికి స్ఫూర్తినిస్తోంది.

పోనీ పి.ఎన్.ఓక్  ఉదహరించిన మిగితా పుస్తకాలలోని తాజమహలు పైన ప్రస్తావనలు కూడా ఎలా వున్నాయో చూద్దాము.

 • పర్షియన్ కవి సల్మాన్ ప్రకారము, 10వ శతాబ్దివాడైన, మహమ్మద్ ఘజనీ ఆగ్రా కోటలని రాజా జయపాలుని దగ్గిరనుంచీ గెలుచుకున్నాడు. అప్పుడు మహమ్మద్ ఘజనీ, ఆ కోటలలో ఒకటైన తాజమహలులో నివసించాడు అని పి.ఎన్.ఓక్ అభిప్రాయపడ్డారు.  
 • విన్సెంట్ స్మిత్ వ్రాసిన అక్బర్ థి గ్రేట్ మొగల్ లోని 9 పేజీలొ - ఆగ్రాలోని గార్డెన్ పాలస్ లో బాబర్  మరణించాడు - అని వ్రాసాడు గార్డెన్ పాలస్ అంటే అది తాజమహలే అనీ, బాబర్ దగ్గిర నుంచీ షాజహాను దాకా అందరు మొగలు చక్రవర్తులు తాజమహలులో నివసించి వుంటారని ఓక గారు అభిప్రాయపడ్డారు. అదే నిజమైతే, కొందరు మాన్సింగ్ రాజా మాన్సింగు, జయసింగుల అతిదులుగా, కొందరు తాజమహలునే ఆక్రమించుకున్న యజమానులుగా, ఎలాగో అలాగ అందరు మొగలు చక్రవర్తులూ తాజమహలులో నివసించడానికి ఆరాటపడినట్టుగా తెలుస్తోంది. పుస్తకంలో బాబర్ చక్రవర్తి అవసానదశలోని రోజుల గురించి విన్సెంట్ స్మిత్  ప్రస్తావించాడు. పుస్తకం లోని వర్ణనను బట్టి మే 10, 1526 నుంచీ డిసెంబర్ 26, 1530 దాకా (అంటే షాజహాను కన్నా చాల ముందు కాలంలో) తాజమహల్ భవన సముదాయంలోనే బాబర్ నివసించినట్టుగా పి.ఎన్.ఓక్  ఊహించారు
 • అంతే కాదు జులై 11, 1526 నాడు బాబర్ ఇక్కడ ఒక పెద్ద విందును ఏర్పాటుచేసినట్టు కూడా తెలుస్తుంది.
 • ఆలాగే బాబర్ కుమార్తె యైన గుల్బదన్ బేగం భవనాన్ని తన   "హుమాయినామా" లో చాలా విస్తారంగా వర్ణించినట్టు తెలుస్తోంది. ఆమె భవనాన్ని ఒక నిగూఢమైన  భవనం అని కూడా  వర్ణించిందట. వర్ణనలన్నీ కూడా తాజమహలు వర్ణనలే అని పి.ఎన్.ఓక్  అభిప్రాయపడ్డారు.
 • హెన్రీ జార్జి కీన్ (H. G. Keene, 1825-1915)  వ్రాసిన హాండుబుక్కులో ఇలా వ్రాసాడు, "1558లో అక్బర్ మొట్టమొదటి సారిగా ఆగ్రాకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు సుల్తానుపూర్, ఖావాసుపూర్ అనబడి పిలువబడుతున్న ప్రాంతములో విడిదిచేసి, తరువాత బాదల్గర్ కోటకి మఖాము మార్చాడు."  ఖావాస్ అన్న పదానికి అర్థం "రాజపుత్రరాజులకు పుట్టిన పిల్లలు" అని అర్థం కనుక, ఖవాసుపూర్ అన్నది రాజభవనం పక్కనే వుండివుండాలి. తాజమహలు కట్టడ సముదాయంలోనే ఒక పక్కనే ఖవాసుపూర్ కనబడుతోంది కనుక, తాజమహలు రాజపుత్రుల రాజభవనమే అని నిర్థారణ అవుతోంది అని పి.ఎన్.ఓక్  అభిప్రాయపడ్డారు.
 • అలాగే అక్బరు (షాజహనుకి తాత) తాజమహలు కట్టడసముదాయంలోనే ఇప్పుడు మనం గెస్టుహౌసు అని పిలుచుకుంటున్న భవనంలో నివసించాడని కూడా కీన్సు హాండు బుక్కు ద్వారా తెలుస్తోంది అని పి.ఎన్.ఓక్  అభిప్రాయపడ్డారు.  

ఈ పుస్తక ప్రస్తావనలను కూడా కొట్టిపారేయలేము కానీ, ఇవి కూడా వివాదాస్పదమైన ఆధారాలే. ఖచ్చితమైన ప్రస్తావనలు కావు. ఇక అవి ప్రక్కనపెట్టి, మనంతట మనంగా చదివితే, మనం ఈ క్రింది విషయాలను తెలుసుకోవచ్చు.

 • ఆగ్రాను పాలించే రాజపుత్రులను ఓడించి ఆ నగరాన్ని బాబరు ఆక్రమించుకున్నాడని చరిత్ర చెబుతోంది. అలా ఫతేపూర్ సిక్రీ, ఆగ్రాలలోని రాజభవనాలు అన్ని బాబరు ఆధీనంలోకి వచ్చాయి. ప్రతిరోజూ ఏదో ఒక యుద్ధం చేస్తునే వున్న హుమాయూన్ సైన్యాలు షెర్ ష చేతిలో ఓడిపోయాయి. ఆ పరాజయంతో కొన్ని భవనాలు మళ్ళీ రాజపుత్రుల చేతిలోకి వచ్చాయి. అలా ఈ భవనాలు ఒక్కోసారి రాజపుత్రుల ఆధీనంలోను, ఒక్కోసారి మహమ్మదీయుల ఆధీనంలోను మారుతూ వస్తూ వుండేవి. అలా షాజహాను కాలం నాటికి, రాజాజయసింగ ఆధీనంలోకి వచ్చింది తాజమహలు. చివరికి షాజహాను దానిని స్వాధీనపరచుకుని సమాధిగా మార్చుకుని వుండివుంటాడు. బాబర్ కూడా తన పుస్తకంలో, ఈ భవనాన్ని ఇబ్రహీం లోఢీ ఆక్రమించిన భవనంగా, అందులో అష్టభుజాకార స్థానం ఉన్నట్టుగా, దానికి నలుదిక్కులా దీపపుస్తంభాలు ఉన్నట్టుగా వ్రాసుకున్నాడు. ఈ వర్ణన షాజహాన్ కాలం కన్నా కనీసం 100 సంవత్సరాల ముందు నాటిది. ఆ నాటికి మొగలాయుల కట్టడాలలో ఇంకా మినారులు ఉండేవి కావు అన్న విషయం ఇక్కడ గమనించ వలసినది.  ఆ నాటికే తాజమహలులో మినారులు ఉన్నాయి. అంటే అవి మినారులు కావు, అవి దీపస్తంభాలే అని స్పష్ఠం అవుతోంది.

- ట్రావెల్స్ ఇన్ ఇండియా - హండ్రెడ్ ఇయర్స్ ఎగో

 • అలాగే "ట్రావెల్స్ ఇన్ ఇండియా - హండ్రెడ్ ఇయర్స్ ఎగో" అన్నపుస్తకం వ్రాసిన ఆంగ్లేయుడైన థామస్ ట్విన్నింగ్ 1794లో ఇలా వ్రాసాడు.  "ఇక్కడ చేసిన రాతి కూర్పు (మొసాయిక్) అత్యద్భుతమైనది ఎందుకంటే, నేడు భారతదేశంలో ఎక్కడా కళ, నైపుణ్యత ఎవరికీ తెలియదు. చెక్కుళ్లలో వాడిన రత్నాలు  ఎక్కడ దొరుకుతాయో, అవి ఎక్కడనుంచీ తెచ్చారో కూడా తెలియదు".  థామస్ ట్విన్నింగ్  రాళ్ళకోసం ఎంతగానో పరిశోధించానని వ్రాసాడు. ఆయన కొన్నవి ఏవీ జాతికి కాని, నాణ్యతకు కాని చెందినవి కావు, అని నిర్థారించాడు. పుస్తకం వ్రాసినప్పటికి షాజహాను పోయి 100 ఏళ్ళే అయ్యింది. షాజహానే తాజమహలుని కట్టించి వుంటే, ఇంకా ప్రజల మనస్సులలో, శిల్పుల నైపుణ్యంలో, కళ పరవళ్ళు తొక్కుతూనే వుండాల్సిన కాలం అది. అప్పట్లో థామస్ లాగా, అందరూ ఎక్కడెక్కడినుంచో వచ్చి ఆ తాజమహలుని దర్శించుకుని, సెబాస్ అని మెచ్చుకుంటున్న రోజులవి. తాజమహలుకి ఒక యాత్రాస్థలిగా స్థిరపడి అమితంగా ప్రాచుర్యం పొందుతున్న రోజులవి. అంటే ఆ శిల్పుల కుటుంబాలకు ఆ కళని మర్చిపోయే సమస్యే రాదు. పేరు వస్తుందంటే ఇంకా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు గానీ, నాకెందుకులే అని మర్చిపోరు. మర్చిపోయినా కనీసం ఆ రాళ్ళని ఎక్కడనుంచీ సేకరించాలో కూడా తెలియదు అని మాత్రం ఎవ్వరూ చెప్పరు. అలా చెప్పారు అంటే, థామస్ చెప్పినట్టుగా నిజంగా ఆ కళ ఎంతో పూర్వకాలానిదన్న మాట. షాజహాను కన్నా చాలాచాలా పాతకాలానిదన్న మాట!
 • ముందు అధ్యాయాలలో చెప్పుకున్నట్లు అబ్దుల్ హమీద్ లాహోరీ వ్రాసిన బాదుషానామాలో తాజమహలు అన్నది ఒక మహాభవనమని; దానికి ఆకాశాన్ని తాకేటంతటి మహా గోపురముందని; అది రాజా మాన్సింగుల వారిదని (రాజపుత్రుడు); అది ఇప్పుడు రాజా జయసింగు ఆధీనంలో ఉన్నదని; దానిని షాజహాను స్వాధీనపరచుకుని ముంతాజు సమాధిగా చేసుకున్నాడని; చాలా స్పష్ఠంగా వ్రాసాడు. అంతే కాదు తాను ప్రభువులు నియమించిన ఆస్థాన చరిత్రకారుడనని కూడా తెలియపరుచుకున్నాడు. విషయాలన్ని మహమ్మదీయ విశ్లేషకులు సైతం అంగీకరించినవే.
 • షాజహాను తాను పాలించిన 30 సంవత్సరాలలో 48 యుద్ధాలు చేసాడట. ఆయన  కాలం -- రాజ్యంలో శాంతి అన్నదే లేని కాలం. ఎందరో విప్లవకారులను కూడా ఎదుర్కొనవలసి వచ్చిన రోజులవి. ఆయన పాలిస్తున్న కాలంలోనే అతని బిడ్డలే ఎదురు తిరిగి, వారిలో వారు యుద్ధాలు కూడా చేసుకున్న రోజులవి. అందులో ఒకడైన ఔరంగజేబు షాజహానునే ఖైదీగా ఉంచాడు. షాజహానుని ఖైదు చేసినా ప్రజలు అభ్యంతర పడినట్టు, మొగలు చరిత్రలో కూడా ఎక్కడా కనిపించదు. అంటే ప్రజలకి షాజహాను పైన ఉన్న గౌరవాన్ని ఊహించుకోవచ్చు. అసలు ఎప్పుడూ మనస్సుకి ప్రశాంతతే లేని షాజహానుకి, ఇటువంటి మహాభవనాన్ని నిర్మించే ఆలోచన కానీ, సమయం కాని ఉండే ఆస్కారమే లేదు. పైగా ఎప్పుడూ యుద్ధాల మద్య సతమతమైన షాజహాన్ నిర్మాణాన్ని చాలా దగ్గిర వుండి కట్టించాడు అని చరిత్ర చెప్పడంలో సత్యం ఎంత వుంది?

ఇలా ఈ ప్రస్తావనలను పరిశీలిస్తే సమాధానం అంత ఖచ్చితంగా రాదు కానీ, తాజమహలు షాజహాను కన్నా చాలా పాత కట్టడమేననీ. తాజమహలుని షాజహాను కట్టించలేదు అని దాదాపుగా తెలుస్తున్నది. ఇది శివాలయం అని అనడానికి కావలసినన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి అని ముందు అధ్యాయాలలో విస్త్రుతంగా పరిశీలించాము.

తాజమహలుని షాజహాను కట్టలేదు అని అనుకుంటే, మరి షాజహాను చేసిన పని ఏమిటి?  మిగితా అందరు మొగలు చక్రవర్తుల లాగా తాజమహలు కట్టడ సముదాయాన్ని చూసి, షాజహాను కూడా చాలా మోహించి స్వాధీనపరచుకున్నాడు. యుద్ధాలే ఒక వ్యసనంగా చేసుకున్న మహమ్మదీయ చక్రవరులు చేసిన అనేక యుద్ధాలలో, దాడులలో కొన్నిసార్లు వారు ఓడిపోయినప్పుడు, కొన్ని ప్రాంతాలు, భవనాలు అప్పుడప్పుడు హిందువుల ఆధీనంలోకి మారుతూ వుండేవి. మరొక యుద్ధంలో వాటిని వారు మళ్ళీ గెలుచుకుంటూ వుండేవారు. ఇలా ఇన్ని చేతులు మారిన తాజమహలు ఆలయంగా పనికిరాదు కనుక, హిందువుల చేతికి వచ్చినా దాన్ని రాజభవనంగా మాత్రమే వాడుకోవడం మొదలు పెట్టారు. అలా రాజభవనంగా మిగిలిన తాజమహలును, రాజాజయసింగు వద్ద నుంచీ షాజహాను స్వాధీన పరచుకున్నాడన్న సంగతి సాక్షాత్తూ బాదూషానామా ద్వారానే తెలుస్తోంది. కాకపోతే ఆ తాజమహలు యాజమాన్యం తన తరువాత కూడా తనది గానే మిగిలిపోవాలన్న పేరాశతో, దాన్ని ఒక మందిరంగానో భవనంగానో మిగల్చ కూడదు అనుకున్నాడు షాజహాను. అందుకే దానిని తన భార్య సమాధిగా భావితరాలకు ప్రకటించాలని ప్రయత్నించాడు..

కోరికతో స్వాధీనపరచుకున్న తాజమహలులోని అమూల్య సంపదను కొల్లగొట్టి, తన ఖజానాకు తరలించి, తనకు ఉపయోగము లేని గదులను, అంతస్తులను మూయించి వేసాడు. తాజమహలును ఒక మహమ్మదీయ కట్టడంలాగా కనిపించేటట్టు చేయడానికి కావలసిన మార్పులు, చేర్పులు, మరమ్మత్తులూ చేయించాడు. కనపడినంత వరకూ హిందూ చిహ్నాలు అనిపించిన వాటినన్నింటినీ  పీకించి, ఖురాను వ్రాతల ఫలకాలను అంటించాడు. కానీ కొన్ని హిందూచిహ్నాలు మాత్రం పొరపాటునో, లేక ఏమరపాటునో మిగిలిపోవడం వల్ల, నాడు మనకు అనేక సాక్షాలతో దొరికిపోయి, ఒక ముద్దాయిగా  మన ముందు నిలబడ్డాడు.

షాజహాను తాజమహలు పైన ఖర్చుపెట్టిన డబ్బు చాలా తక్కెవే అని రెండవ అధ్యాయంలో చదువుకున్నాము. అనేక లక్షల సొమ్మును తాజమహలులో దోచుకున్నా, కనీసం ఆ సొమ్ముని సైతం మరమత్తులపైన ఖర్చుపెట్టడానికి షాజహాను ఇష్టపడలేదట. అజీదుద్దీను ప్రచురించిన విక్టోరియా ప్రెస్సు వారి "గైడు టూ ఆగ్రా" అన్న పుస్తకంలో ఇలా వుంటుంది, "తాజమహలు కట్టడంలో పనిచేసిన కార్మికులందరూ వెట్టిచాకిరీ చేసిన వారే. అక్కడ 17 సంవత్సరాల పాటూ పనిచేసిన 20వేల మంది పనివాళ్ళకి డబ్బు ఇవ్వలేదు సరికదా, వారికి ఇచ్చే తిండిపై కూడా కోత విధించారు.  అలా విచక్షణ లేకుండా ప్రవర్తించిన మొగలు అధికారులపై, పనివారు తిరుగుబాటు చేయవలసి వచ్చింది తిరుగుబాటుపై కోపించిన షాజహాను, కూలీల చేతులను నరికించివేసాడు. ఇక వారు జీవితంలో ఎప్పుడూ పని చేయకుండా వుండే విధంగా ఈ శిక్ష విధించాడు." అలాగే  మాల్వీ మోయినుద్దీన్ అహమ్మద్ కూడా కూలీలు అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కోన్నాడట.

షాజహాను ఇలా కూలీల చేతులను నరికించాడని తెలుస్తున్నది. కానీ జనబాహుళ్యంలోకి ప్రవేశపెట్టిన కథ వేరే విధంగా వినిపిస్తుంది.  "తాజమహలు వంటి మహత్తర కట్టడం ప్రపంచంలో మరొకటి రాకుండా చేయాలని, కట్టిన కూలీల చేతులని నరికించేసాడని", జనం చేత చెప్పించడం మొదలు పెట్టాడు షాజహాను. చేతులు కూడా పోగొట్టుకున్న ఆ కూలీలు తమతమ నోళ్ళు మూసేసుకుని, కథని విని సహించడం తప్ప, మారు చెప్పలేని పరిస్థితిలో మిగిలారు.  

నిజంగా తాజమహలు వంటి మహాకళాసృష్టినే చేసినవాడు ఎవ్వడైనా, నిజంగా కళని అంతగా అభిమానించే కళాతృష్ణవున్న వాడెవ్వడైనా, కళాకారులని గౌరవించకపోయినా -- కనీసం, అలా కళాకారులని మాత్రం  హింసించలేడు. కానీ తాను తాజమహలుని కట్టించనవాడు కాడు కనుక, ఒక్క సద్గుణము కూడా లేని వాడు కనుక, అలా షాజహాను ఈ క్రూరత్వానికి దిగగలిగాడు, ఒక సామాన్య దోపిడీదారుని స్థాయిలో ప్రవర్తించాడు అని తెలుస్తున్నది.  ఇంత అరాచకం చేయించిన రాజు మహనీయుడేలా అవుతాడు అని ఎవ్వరూ ప్రశ్నించకపోవడం ఆశ్చర్యకరం. అంతే కాదు, "షాజహాను కూలీల చేతులు నరికించేసాడట" అని మనం గొప్పగా చెప్పుకోవడము మరీ విడ్డూరము! జరిగిన కథ నిజంగా ఏమయ్యి వుండి వుంటుంది, అని మనం ప్రశ్నించకపోవడం మరీ అన్యాయము. ఇంత క్రూరుడు నిజంగా తన భార్యను ఎలా ప్రేమించగలడు, అని మనం అడగడం లేదు సరికదా, కట్టడం అతడే కట్టించాడని నమ్మడం కూడా మొదలు పెట్టాము. అంతటి మహాలయాన్ని కూడా ఇలా సమాధిగా గౌరవించడము మొదలు పెట్టాము!

ఇప్పటి దాకా చేసిన విశ్లేషణ బట్టి, మనకు తాజమహలు అన్నది మొగలాయిల కట్టడం కాదు అని తేలుతున్నది. ఇది షాజహాను కాలం కన్నా ముందు నుంచే ఉన్నటువంటి హైందవకట్టడము అని తెలుస్తున్నది. కనుక ఇది సమాధీ కాదు, మసీదూ కాదు. ఇది ఒక శివాలయంగానే కట్టబడింది అని దొరికిన ఆధారాలబట్టి, ఏడు భాగాల విశ్లేషణలో తెలుసుకున్నాము. ఐతే నిర్మాణంలో జైనులనిర్మాణశైలి ప్రభావం కూడా ఉన్నదని తెలుసుకున్నాము. జైనప్రభావం రాజపుత్రుల కట్టడాలన్నిటిలోనూ కనిపిస్తుంది కనుక, ఆలయం కట్టించినవారు రాజపుత్రులయ్యి వుండవచ్చు.

క్లుప్తంగా ఈ ఏడు అధ్యాయాలలో పరిశీలించిన తాజమహల్ చరిత్రను ఇలా చెప్పుకోవచ్చు

 1. చంద్రాత్రేయ మహారాజు తాజమహలుని తేజోమహాలయముగా క్రీ.. 1156లో (వి.శ. 1212 లో) నిర్మించాడు అన్నది మన అనుమానం (ఈ అనుమానాన్ని ఇంకా నిర్ధారించుకోవాల్సిన అవసరం వుంది. దీనిని తరువాతి అధ్యాయంలో చర్చించుకుందాము).
 2. అంటే తాజమహలు షాజహానుకన్నా దాదాపు 500 ఏళ్ళ పాతది. కార్బన్ డేటింగు టెస్టు కూడా ఇదే అనుమానాన్ని బలపరుస్తున్నది. తరువాత అనేక మహమ్మదీయ దాడులలో బలియై దోచుకోబడ్డ ఈ ఆలయం అపవిత్రం కాబడి, చివరికి శిధిలమవగా, అందులో పూజలు నిలిపివేయ బడ్డాయి.
 3. తరువాత అనతి కాలంలో, రాజా మాన్సింగ్ వంశీకులు దానిని స్వాధీనపరుచుకుని, తరువాతి తరాల వారికి, (చివరికి రాజాజయసింగు) రాజభవనంగా అందజేసారు. రాజాజయసింగు తేజోమహాలయాన్ని ఒక పూర్వీకుల పవిత్రమైన కట్టడంగా గుర్తించి, భావించి, అతి మన్నగా చూసుకుంటూ, దానిని ఒక ప్రత్యేక రాజభవనంగా వాడుకోవడానికి నియమించాడు.
 4. భవనాన్ని బాబరు దగ్గర నుంచీ అందరు మొగలాయులూ తమ అవసరానికి ఉపయోగించుకుంటూ వచ్చారు.
 5. షాజహాను మాత్రం భవనాన్ని తనకే సొంతమవ్వాలన్న దుర్భుద్దితో, దానిని రాజాజయసింగు దగ్గిరనుంచీ వశపరచుకుని, అందులో మిగిలినవన్నీ దోచుకుని, మరమ్మత్తులు చేయించి, ఒక సమాధిగా మార్చుకున్నాడు.
 6. భవననిర్మాణశైలికి కూడా తానే రూపకల్పన చేసిన ప్రజ్ఞునిగా, చరిత్రలో గుర్తింపు పొందాలనే దురాశతో, ఒక ప్రేమ కథను సృష్టించుకుని, చరిత్రనే తిరగవ్రాయడానికి ప్రయత్నించాడు. తాజమహలుని తాను కట్టించిన భవనంగా చలామణీలోకి తెచ్చుకున్నాడు.
 7. ఆలా ఒక శివాలయమే, శిధిలమై, భవనమై, చివరికి సమాధియై మారుతూ వచ్చింది.  ఆలా తేజోమహాలయము కాస్తా కాలక్రమేణా తాజమహలుగా మారి, నేడు మనకు దర్శనమిస్తోంది.
 8. నేడు ప్రపంచపు వింతలలో ఒకటిగా నిలిచి, షాజహాను ప్రేమచిహ్నమనే పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి పొందుతోంది!

ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలన్నట్లు, షాజహానుకి తాజమహలుని ఆక్రమించడం వల్ల అనేక లాభాలు వచ్చాయి. (1) ప్రపంచంలోనే అతి గొప్పదైన రాజపుత్రుల భవనాన్ని, తద్వారా వారి ఉన్నతమైన హోదాని పొందగలిగాడు.  (2) తన భార్య పేరిట ఓక దివ్యమైన సమాధిని కట్టించిన సంతృప్తిని పొందాడు. (3) తాజమహలు మీద తాను ఖర్చు పెట్టిన దానికన్నా అందులో నుంచీ కొల్లగొట్టిన సొమ్మే (అనేకరకాల దివ్యరత్నమణిమాణిక్యాలు, బంగారు రైలింగులు, వెండి ద్వారాలు, మున్నగునవి) అధికమవ్వడం చేత, మొత్తానికి, దురాక్రమణ మంచి లాభసాటిదే అయ్యివుంటుంది. (4) అన్నిటికన్నా అతడిని ఒక అమర  ప్రేమికుడుగా చరిత్రలో నిలబెట్టింది.

--- --- ---

మనకు నేర్పిన చరిత్ర తప్పేమో అని మనం గుర్తిస్తే చాలు,   విశ్లేషణ ఆశించిన ఫలితాన్ని పొందినట్లే. తాజమహలుని ఇప్పుడు ఒక ఆలయంగా మార్చుకోవాలని కాదు ఈ పరిశోధన ఆశయం. దీనిని ఒక మతపరమైన చర్చగా మార్చాలని అంతకంటే కాదు. తాజమహలుని ఇకపైన కూడా ముంతాజు సమాధిగానే మిగుల్చుకుందాము. కాకపోతే జరిగిన విషయాన్ని సరిగ్గా గుర్తించి, భావితరాలకు నిజాన్ని అందించగలిగితే చాలు. అది ఒకనాటి శివాలయ కట్టడం అని, హిందువుల వాస్తు అని, ధైర్యంగా, నిర్భయంగా నిజాన్ని చరిత్రలో ప్రకటించుకోగలిగితే చాలు. సెక్యులరిజం పేరిట చరిత్రను తప్పుగా వ్రాసునే విధానాన్ని విడనాడగలిగితే చాలు. చరిత్రలో అన్ని మతాలవారు తప్పులు ఒప్పులు చేసారు, చేస్తారు. కనుక ఒక మతస్తులని తప్పు పట్టడం మన ఉద్దేశం కాదు. కాకూడదు. జరిగిన విషయాన్ని యదాతధంగా తెలుపటమే చరిత్రకున్న ముఖ్యకర్తవ్యము. మన వారసత్వశైలిని, సంపదను, జ్ఞానాన్ని, సంప్రదాయాన్ని, సరిగ్గా గుర్తించి, గౌరవించి, జీవించడమే మన ఆశయం   కావాలి. స్యూడో సెక్యులరిజానికి ఉద్వాసన చెప్పి, సత్యానికి పెద్దపీఠ వేయాలి.

ఈ విశ్లేషణతో ఏకీభవించినా, లేదా కొత్త విషయాలు తెలిసినా, తప్పక తెలియ పరచండి.  ఒక వేళ ఇంత విశ్లేషణ జరిపిన తరువాత కూడా, పైన చూపించిన ఈ కట్టడము... ఇంకా షాజహానే కట్టించాడని అనిపించినా కూడా, తప్పక తెలియజేయండి. అందరి అభిప్రాయాలను తప్పక గౌరవిద్దాము. కలిసి నేర్చుకుందాము !

సహనా వవతు | సహనౌ భునక్తు | సహ వీర్యఙ్ కరవా-వహై | తేజస్వి-నావ-ధీత-మస్తు-మావిద్-విషావహై ||

ఓం శాంతి(శ్) శాంతి(శ్) శాంతిః ||

ఈ ఎనిమిది అధ్యాయాలతో తాజమహలు విశ్లేషణ ముగిసింది. మిగిలింది వ్యాస పరంపర ఉపసంహారమే. అది వచ్చే భాగంలో. (సశేషం)

మీ

రావు తల్లాప్రగడ

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 


Sujanaranjani