Sujanaranjani
           
  కబుర్లు  
  సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 19
          వారసులొచ్చారు జాగ్రత్త!  
 

- రచన : సత్యం మందపాటి

 
 

రోజూలాగానే ఆరోజు కూడా ముందుగా తెడ్డెం తేగరాజు వచ్చి చుట్ట వెలిగించి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు రచ్చబండ మీద. ఇంకొంచెంసేపట్లో ఎడ్డెం ఎంకటేసర్లు కూడా బీడీ పొగ పీలుస్తూ వచ్చి, తేగరాజు పక్కనే కూర్చుని 'లేటయిపోయిందోయ్' అన్నాడు.
‘సరే ఇది రోజూ చెప్పేదే కదా! అయినా ఊసుపోలు కబుర్లకి ఆలస్యమంటూ ఏమీ వుండదులే! ఊఁ.. ఏమిటి విశేషాలు’ అడిగాడు తేగరాజు.

‘ఏంలేదు. మొన్న ఒక సినిమా వచ్చింది. దాంట్లో తాత తండ్రి కొడుకు ముగ్గురూ వున్నారు. నటించారు అనకుండా ఉన్నారు అని ఎందుకు అంటున్నానంటే తాతకి తప్ప మిగతా ఇద్దరికీ నటన శూన్యం. అసలు వాళ్లకి సరిగ్గా తెలుగు మాట్లాడటమే రాదు. అలాగే ఈనాటి మన సినిమాల్లో నటుల కొడుకులూ, దర్శకుల కొడుకులూ, నిర్మాతల కొడుకులూ నటనలో ఏమాత్రం కౌశల్యం లేకపోయినా నటులు.. నటులు అనకూడదేమో, తారలు అయిపోతున్నారు. అలాగే తమ్ముళ్ళ యుగం కూడా వచ్చేసింది. అలాగే దర్శకులు. అక్కడా వారసత్వమే. అందుకే మన సినిమాలు అర్ధంపర్ధం లేకుండా అలా అఘోరిస్తున్నాయి’ అన్నాడు ఎడ్డెం ఎంకటేసర్లు.
‘అలా అంటే నేను ఒప్పుకోను. ఏమిటది.. జీన్స్ అనో ఏదో అంటారే.. అది వంశపారంపర్యంగా వచ్చి వాళ్ళల్లో నటనా చాతుర్యాన్ని బయటకి తెస్తున్నదేమో!’ అన్నాడు తెడ్డెం తేగరాజు.
‘జీన్సా, టీ షర్టా... అదేమీ కాదు. ఈనాటి హీరోల్లో ఏ ఒక్కడి ముఖం మీదయినా రెండు నిమిషాలు కెమెరా పెట్టి ముఖకవళికలతో నటించమంటే, నటించేవాడు వున్నాడంటావా?’ అడిగాడు ఎడ్డెం.
‘ఈనాటి జనానికి నటన అఖ్కర్లేదయ్యా. మంచి హుషారుగా డాన్సులు, ఫైటింగులూ చేయగలిగితే చాలు. ముఖం బాగుండక పోయినా అందంగా చూపించటానికి మేకప్ మేన్, కేమరామన్ వుండనే వున్నారు. నటన ఎవరికి కావాలయ్యా? అలా వారసులు వస్తున్నదే నిజమయితే, మరి హీరోయిన్లలో వారసులు రావటం లేదేం?’ అన్నాడు తెడ్డెం.
‘దేవుడి పూజతో కాకుండా బొడ్డు పూజతో మొదలయే ఈనాటి సినిమాల్లో కొంచెం శృంగారం పాళ్ళు ఎక్కువ. శృంగారం అంటే శరీరాన్ని ఆరేసుకోవటం, పారేసుకోవటం. వాళ్ళ కూతుళ్ళ చేత ఆ ఆరబోత చేయించలేక, తెలుగు రాకపోయినా ఉత్తరదేశాన్నించి అలాటి అమాంబాపతు పిల్లల్ని తెస్తున్నారు. ఈమధ్య ఒక సినిమా దర్శకుడు చెప్పాడు. సునీత, శిల్ప లాటివారు తెలుగు డబ్బింగ్ చెబుతున్నా, కనీసం వీళ్ళు పెదిమలు కదపాలి కదా, అదీ చేయలేక అవస్థలు పడుతుంటే, విసుగొచ్చి వన్ టూ త్రీ, వన్ టూ త్రీ అనవమ్మా అని చెప్పాట్ట. మా అమ్మ చచ్చిపోయింది అని హీరో అంటే, ఈ అమ్మాయి ఇంగ్లీషు సంఖ్యాశాస్త్రంలో అనర్గళంగా వన్ టూ త్రీ, వన్ టూ త్రీ అని అంకెలు చెప్పేస్తుంటే, ఆ అమ్మాయికి కానీ, హీరోకి కానీ ముఖంలో భావాలెలా వస్తాయి చెప్పు?’
‘మరి సంగీత దర్శకులలో వారసులు రావటం లేదేం? అన్నాడు తెడ్డెం.
‘నటనలో అయితే ఎవరూ పట్టించుకోరు కానీ సంగీతంలాటి కళారంగాల్లో రాణించాలంటే ప్రావీణ్యం వుండాలి. అలా వున్నవాళ్ళు వస్తూనే వున్నారు కానీ తక్కువ. ఆ నైపుణ్యం వున్నవాళ్ళు వారసత్వం వున్నా లేకపోయినా పైకి వస్తారు కదా!’ అన్నాడు ఎడ్డెం ఎంకటేసర్లు.
‘నువ్వేదో తెలుగు సినిమారంగంలోనే అలా వుందనుకుంటున్నావా? తమిళంలోనూ, హిందీలోనూ అన్ని భాషల్లోనూ వుంది. పృధ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రణధీర్ కపూర్నించీ ఈనాటి దాకా ఇలా కపూర్ వారసత్వం వస్తూనే వుంది. అప్పటి నించీ ఇప్పటి దాకా వారసుల్లో సత్తా వున్నవాళ్ళు అక్కడక్కడా వస్తున్నా, సత్తుగాళ్ళే ఎక్కువ’ అన్నాడు తెడ్డెం.
ఎడ్డెం ఎంకటేసర్లు నవ్వాడు. ‘నేను ఒక్క తెలుగుసినిమాల్లోనే అలావుందని అనటం లేదు. చాల చోట్ల అంతే. కాకపొతే మన టాలీవుడ్లో బాగా ఎక్కువ. ఒక నటుడికి కొడుకు పుట్టగానే, తెలుగు సినిమాకి ఒక హీరో పుట్టినట్టుగా వుందిప్పుడు. ఆ తండ్రి నటుడి అభిమానులూ, ఆ అభిమానుల కొడుకులూ, ఆ బుల్లి కొడుకుని పూలల్లో పెట్టి, పెంచి, పెద్ద చేసి ఇంకో హీరోగా చేసి, చూసి, తమ అభిమానం నిలుపుకుంటున్నారు. సినిమా లనేమిటిలే... చాల రంగాల్లో ఇంతే. ఒక వ్యాపారవేత్తకి పుట్టే కొడుకు, కావలసిన చదువూ సంస్కారం వ్యాపారదక్షత లేకపోయినా భవిష్యత్తులో ఇంకా పెద్ద వ్యాపారవేత్త క్రింద లెఖ్క. ఒక క్రికెట్ ప్లేయర్ కొడుకు దేశానికి క్రికెట్ ఆడటానికి పుట్టగానే పరిమళిస్తాడు’ అన్నాడు ఎడ్డెం.
‘అయితే ఏమిటంటా! ఒక పారిశ్రామికవేత్త తన డబ్బుఖర్చుపెట్టి పెట్టిన కంపెనీకి తన కొడుకుని వారసుడిగా చేస్తున్నాడు. అది బాగా నడిస్తే వాళ్ళిద్దరూ డబ్బు చేసుకుంటారు లేదా దివాలా తీస్తారు. నీకు నాకూ ఏమిటి నష్టం?’ అన్నాడు తెడ్డెం.
‘మనకి కాకపోయినా, ఆ కంపెనీలో పనిచేస్తూ ఉదరపోషణ చేసుకుంటున్న సామాన్య ప్రజానీకం ఉద్యోగాలు పోయి అష్టకష్టాలు పడటం మనం చూస్తున్నాం కదూ, దాని గురించి అలోచించవద్దూ! సినిమాల్లో కూడా తండ్రి బలవంతం మీద అతని కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసిన నిర్మాతలు మట్టికొట్టుకు పోతున్నారు. అందుకే కొంతమంది తండ్రులు, నిర్మాతలు దొరక్క వాళ్ళ పిల్లల్ని పెట్టుకుని వాళ్లే సినిమాలు తీస్తున్నారు. అలాగే కానీలే.. వరుసగా దెబ్బలు తిని దివాలా తీస్తుంటే, వాళ్లకి ఏనాటికైనా తెలిసివస్తుంది’ అన్నాడు ఎడ్డెం ఎంకటేసర్లు.
‘మరి ఈ వారసత్వాలు రాజకీయ నాయకుల్లో లేవంటావా?’ అడిగాడు తెడ్డెం.
పెద్దగా నవ్వాడు ఎడ్డెం. ‘భలే అడిగావయ్యా ఏమీ తెలియనట్టు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటిరోజే ఈ రాజకీయ వారసత్వాలకి ఆరంభం జరిగింది. నెహ్రూ, అయన కూతురు ఇందిరాగాంధీ, ఆవిడ కొడుకు రాజీవ్ గాంధీ, పరోక్షంగా ఆయన భార్య సోనియా ఆ వారసత్వం అందుకుంటే, ఆవిడ పిల్లలు రాహుల్, ప్రియాంకా దాన్ని కొనసాగించటానికి సిద్ధమవుతున్నారు. మధ్యే మధ్యే ఇందిరా గాంధీ పెద్ద కోడలు మనేకా గాంధీ, ఆవిడ కొడుకు కూడా, రాజకీయాల్లో తామూ వున్నాననిపిస్తున్నారు’ అన్నాడు.
తెడ్డెం అన్నాడు. ‘అది ఈనాటిది కాదయ్యా. రామాయణ, భారతాల కాలం నించీ వుంది. అనగనగా ఒక
రాజు. ఆ రాజు పోగానే, యవరాజు మహారాజు అయిపోయేవాడు. వాళ్ళ రాజ్యాలూ, వాళ్ళ వారసత్వాలు! మధ్య మనదేం పోయింది!’
‘మన రాజుల్లో ఆ వారసత్వం రాజరికాల్లో పెద్దగా రక్తపాతం లేకుండా కొనసాగింది. కానీ మొగలాయీలు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నాక బాబర్నించీ ఔరంగాజీబ్ దాకా ఎంతోమంది స్వంత తండ్రిని చంపి రాజ్యాన్ని చేజిక్కించుకోవటం మనకి నేర్పారు. అది ఆనాడే కాక ఈనాడూ రాజకీయాల్లో జరగటం చూస్తూనే వున్నాం. దగ్గరకు తీసి పైకి తెచ్చిన అల్లుడు, మామని నానాయాతన పెట్టి, ఆయన చావుకి పరోక్షంగా కారణం అయి, నాయకుడవటం కూడా చూశాం కదా!’ అన్నాడు ఎడ్డెం.
‘ఆయనకి గుండెపోటు వచ్చి అయన పొతే, అల్లుడిని తప్పు పడతావేమిటి?’ అని మందలించాడు తెడ్డెం.
‘నా పాయంటేమిటంటే, రాజకీయాల్లో వారసత్వాలు హింసలతో కూడా ముడిపడి ఇంకా కొనసాగుతున్నా యని’ ఎడ్డెం.
‘అమెరికాలో పెద్ద బుష్ కొడుకు, చిన్న బుష్ ప్రెసిడెంట్ కాలేదూ. అక్కడా వారసత్వాలు వున్నాయంటావా?’
‘లేవు. జాన్ కెన్నెడీ కుటుంబంలో రాబర్ట్ కెన్నెడీ, ఎడ్వర్డ్ కెన్నెడీ ముందుకు వచ్చినా ఒక పరిధి దాటి పైకి రాలేకపోయారు. మొదటిసారిగా ఇదే వినటం, ప్రెసిడెంట్ కొడుకు ప్రెసిడెంట్ అవటం. చిన్న బుష్ తన చేతకాని తనంతో ఎన్నడూ కనీవినీ ఎరుగనంత ప్రమాణంలో ప్రపంచ ఆర్ద్ధిక సంక్షోభానికి కారకుడయాడు. ఉద్యోగాలు పోతుంటే జనానికీ తెలిసివచ్చింది. అక్కడ కావలసింది కార్యనిర్వాహక చాతుర్యం. సమర్ధత. వారసత్వాలు, చుట్టరికాలు కాదు’ అన్నాడు ఎడ్డెం.
‘ఇక్కడా ఇందిరా గాంధీకి, రాజీవ్, సోనియాలకి ఆ చాతుర్యం లేదంటావా?’ అడిగాడు తెడ్డెం.
‘లేదని నేను అనను. చాల వుంది. కానీ వాళ్ళు దాన్ని వాడింది స్వంత ప్రయోజనాల కోసం. ఈమధ్య స్విడ్జర్లాండ్ బాంకులు బయటపెట్టిన చిట్టాలు చూశాం కదా. ఇక నేను వేరే చెప్పటం ఎందుకు’ అన్నాడు ఎడ్డెం.
‘వాళ్ళనొక్కళ్ళనే అనటం ఎందుకు. ఎంతమందిని చూడటం లేదు.. నువ్వన్నదీ నిజమేలే. మన పెరట్లోనే మన రాజకీయ నాయకుల కొడుకులు ప్రజల సొమ్ముని కోట్లల్లో దోచుకోలేదూ! కానీ నాకు ఒక విషయం మాత్రం అంతుపట్టటంలేదయ్యా. ఇలా జనాన్ని ఈ కొడుకులు దోచుకుంటుంటే ప్రజలు, ముఖ్యంగా చదువుకున్న ప్రజలు ఎందుకు చూస్తూ వూరుకున్నారంటావ్!’ అన్నాడు తెడ్డెం తేగరాజు.
‘ముందుకు వెడుతున్న దేశాల్లోలా, మన దేశంలో చదువుకున్న వాళ్ళు తక్కువ. అయినా చదువుకీ దీనికీ సాపత్యం లేదయ్యా. ఇక్కడ కావాల్సింది దేశాభిమానం. మంచి కోసం మార్పు తేవాలనే తపన. అది చదువు కోని వాళ్ళల్లోనే ఎక్కువగా వుంది. అదీకాక ఈనాటి జనానికి వారానికి రెండు మూడు బూతు సినిమాలూ, హింసాత్మక సినిమాలూ చూపించేసి, వరసగా క్రికెట్ ఆటలు పెట్టేస్తుంటే, ఇవన్నీ ఆలోచించే సమయమే కనపడదు’ అని ఎడ్డెం ఎంకటేసర్లు అంటుంటే, తెడ్డెం తెగరాజుకి నచ్చినట్టుగా లేదు.
లేచి భుజాన తువ్వాల వేసుకుని, ‘నేను చెప్పలే.. ఎప్పుడూ అన్నీ నీకే తెలిసినట్టు ఏదేదో చెబుతుంటావు.
నీతో వాదన ఎందుకు కానీ, ఆకలేస్తుంది. మన ఇళ్ళకి పోదాం పద. బాగా చీకటి పడింది కూడాను’ అని ఇంటి వేపు బయల్దేరాడు.
‘నీ సిగదరగా.. నేనూ వస్తున్నా వుండవయ్యా.. ‘ అంటూ తనూ లేచాడు ఎడ్డెం ఎంకటేసర్లు.
 


 

 
 
నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech