Sujanaranjani
           
  శీర్షికలు  
  సంగీత సౌరభాలు - 7
 

 - రచన: సంగీతాచార్య డా|| వైజర్సు బాలసుబ్రహ్మణ్యం

 
 
 

సంగీత రచనలు చేసిన వాగ్గేయకారులందరూ కూడా పరమభక్తాగ్రేసరులు, బహుభాషా విశారదులు, ధాతు-మాతు రచనా దక్షులు. వీరి రచనలన్నీ భక్తిరసపూరితాలు. రచనా శైలులు వేరైనప్పటికీ వీరందరూ కూడా తమ రచనలను అప్రయత్నంగా, వారి సహజమైన భక్తి భావావేశములలో, తమ ఇష్ట దైవాలను తన్మయత్వంతో ఆరాధిస్తూ చేసినవే. అయినా కూడా, ఈ రచనలన్నీ సుశ్రావ్యంగా, ఛందోబద్ధంగా ఉంటూ, వాగ్గేయకారుని పాండిత్యానికి నిదర్శనంగా ఉంటాయి. 14వ శతాబ్దం తరువాత వచ్చిన రచనలలో లక్షణ గ్రంథాలంటే సంస్కృతంలోనూ, సంగీత రచనలంటే తెలుగులోనూ ఉండాలనేది అలిఖిత శాసనంగా ఉండేది. దీనికి కారణం తెలుగు భాషలోని తీయదనం, పదాలను అచ్చులతో పొడిగించే వీలు ఉండటం, సంగీత సాహిత్య రచనకు తెలుగు భాష ఎంతో అనువుగా ఉండటం.

ఇంతటి గొప్ప భాషలో అద్భుతమైన కీర్తనలను రచించిన మహా వాగ్గేయకారుడు శ్రీ భద్రాచల రామదాసు. రామనామ భక్తిరసాన్ని వెల్లివిరియించే రచనలను దేశీ ఛంద, సంగీత రీతులలో అందించి, భజన, గోష్ఠి గానముల ద్వారా వాటికి ప్రత్యేక శైలిని ఏర్పరచి, వాగ్గేయకారునిగా తనకొక ప్రత్యేకతను పండిత-పామర జనుల హృదయాలలో శాశ్వత స్థానాన్నీసొంతం చేసుకున్నారు ఈ భక్త శిఖామణి. వీరి కీర్తనలు మంచి సాహిత్యానికి, భావౌచిత్యానికి పెట్టింది పేరు. వీరు చేసిన రచనల పూర్తి సంఖ్య తెలియకున్నా, కేవలం శతాధికంగా మాత్రమే లభ్యమవుతున్న వీరి కీర్తనలను పరిశీలిస్తే ఈ రచనలలోని ఛందో విశేషములు మనకు బాగా అవగతమవుతాయి.

వాణ్మయములో గద్యము, పద్యము అని రెండు ముఖ్య భాగములున్నవి. అట్లే, సంగీతంలో కూడా గద్యము, పద్యము అని రెండు ముఖ్య భాగాలున్నాయి. రాగాలాపన గద్య భాగాన్ని పోలి ఉంటే, సంగీత రచన పద్యమును పోలి ఉంటుంది. గద్యానికి కఠినమైన సూత్రబంధములు లేకపోయినా, పద్యంలో మాత్రం ప్రతీ పాదమూ ఒక సూత్రమును అనుసరించి, ఛందో నియమములకు కట్టుబడి ఉంటుంది.

సంగీత రచన తాళబద్ధంగా ఏర్పడినది. సంగీత రచనలన్నింటిలోనూ లక్షణ పూర్వకమైన రాగ భావము, వచన రూపకంగానైనా ఉండవచ్చు. అయితే, సంగీత రచనలలో ఎక్కువగా మనకు గద్య సాహిత్యం కనిపిస్తుంది. ఇందులో యతి, ప్రాసలు తాళంతో కొలువబడతాయి.

ఒక పద్య వాక్యాన్ని పాదం అని అంటారు. సంగీతంలో పాదం అనగా ఒక వరుస. ఇది తాళము యొక్క ఆవర్తములలో కొలువబడుచున్నది. ఆదితాళ రచనలలో ఒక పాదం ఒకటి లేక రెండు ఆవర్తములలో ఉంటే రూపక, త్రిపుట, చాపు తాళములలో ఒక పాదం నాలుగు లేక ఎనిమిది ఆవర్తములలో ఉంటుంది. ఒక రచనలో ఒక పాదము యొక్క పొడవు స్థిరంగా ఉంటుంది. సాధారణంగా పల్లవి ఒక పాదము, అనుపల్లవి రెండు పాదములు, చరణము రెండు లేక నాలుగు పాదములు ఉంటాయి. అయితే, రామదాసు రచనలను గమనిస్తే ఇవి కీర్తనలు కనుక పల్లవి, బహు చరణములు ఉన్న రచనలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి లేక రెండు పాదాలుంటే, చరణాలు రెండు లేక నాలుగు పాదాలుండే రచనలు ఎక్కువ.

ఉదా: 1.

ప :పలుకే బంగారమాయెనా కోదండపాణి

1. చ : పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి

4. చ : ఎంత వేడిన గాని సుంతైన దయరాదు
పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి

5 చ : శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గావ
కరుణించు భద్రాచల వర రామదాస పోష

ఉదా : 2

ప : అంతా రామమయం ఈ జగమంతా రామమయం

1. చ: అంతరంగమున నాత్మారాముడ -
నంతరూపముల వింతలు సలుపగ
సోమసూర్య్లులును సురలు తారలును
ఆమహాంబుధులు అవనీజనంబులు

3 చ ; అష్ట దిక్కులును ఆదిశేషుడును
అష్ట వసువులును అరిషడ్వర్గము
ధీరుడు భద్రాద్రి రామదాసుని
కోరికలొసగెడు తారక నామము

పల్లవి, అనుపల్లవి, చరణాలు ఉన్న రచనలలో పల్లవి, అనుపల్లవులు రెండు పాదాలుంటే, చరణాలు రెండు లేక నాలుగు పాదాలు ఉన్నాయి.

ఉదా 1 :

ప : తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా

అ.పః మీరిన కాలుని దూతల పాలిటి
మృత్యువు యని నమ్ముకయున్న

6 చ : ధర్మము తప్పక భద్రాద్రీశుని
తన మదిలో నమ్ముకయున్న
మర్మము తెలిసిన రామదాసు హృ
న్మందిరము నే యన్న

ఉదా 2 :

ప : ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన
నీ మాయ తెలియ వశమా!

అ.ప : కామారి వినుత గుణధామా కువలయ దళ
శ్యామ నను గన్న తండ్రీ రామ

3 చ : నరుడనుచు నరులు తమ దొరవనుచు యాదవులు
వరుడనుచు గోప సతులు
కరివరద భద్రాద్రి నిలయ రామదాసనుత
పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

పల్లవి, చరణములు సమానమైన పొడవు కలిగిన రచనలు కూడా ఉన్నాయి.

ఉదా 1 :

ప : కమలనయన వాసుదేవ కరివరద మాంపాహి
అమల మృదుల నళినవదన అచ్యుత ముదందేహి

1 చ : జారచోర మేరుధీర సాధుజన మందార
పార రహిత ఘోర కలుష భవజలది గంభీర

2 చ : నారదాది గానలోల నందగోప బాల
వారిజాసనానుకూల మానిత గుణశీల

3 చ : కామజనక శ్యామ సుందర కనకాంబర ధరణా
రామదాస వందిత శ్రీ రాజీవాద్భుత చరణ

ఉదా 2 :

ప : ఎంతపని చేసితివి రామా
నిన్నేమందునే సార్వభౌమ (రామ)
పంతమా నా మీద పరమపావన నామ
సంతోషముడిపితివి సకల సద్గుణధామ

1 చ : నిన్నె దైవంబనుచు నమ్మి
తిన్నగా దుఃఖముల జిమ్మి (రామ)
కన్న దినమని నెమ్మి నిన్ను సేవింపగా
నన్నిట్లు నట్టేట ముంచుటెరుగక పోతి

3 చ : భద్రాద్రి వాసుడే మనుపు
మమ్ము కరుణాసముద్రయో శ్రీరామ
భద్రనుత కరుణాసముద్రయో శ్రీరామ
భద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితిని

రామదాసు కీర్తనలోని ఛందో విశేషములు:

సంగీత ఛందస్సులో మనం సాధారణంగా గమనించే విషయములు - ప్రాస, యతి, పదఛ్ఛేదము, యమకము.

1. ప్రాస : ప్రాస మూడు విధ లు : (1) ద్వితీయాక్షర ప్రాస (2) అంత్యప్రాస (3) అను ప్రాస

ద్వితీయాక్షర ప్రాస :
ఒక పాదము నందు రెండవ అక్షరము ప్రాసాక్షరము. దీనినే జీవాక్షరమని అందురు. ఇట్లు రెండవ అక్షరము ప్రాసతోనుండుట ద్వితీయాక్షర ప్రాస అనబడును. దీనికి ఆదిప్రాస అని కూడా పేరు.

ఒక రచన యొక్క పల్లవి, అనుపల్లవులకు ఒక రకమైన ద్వితీయాక్షర ప్రాస, చరణములోని పాదములకు వేరొక ద్వితీయాక్షర ప్రాస కూడ ఉండవచ్చును. ద్వితీయాక్షర ప్రాసలో ఒకే అక్షరం కానీ, దాని వర్గాక్షరం కానీ రావచ్చును. అంటే - క,చ,ట,త,ప లకు గ,జ,డ,ద,బ లు రావచ్చును. ప్రాసాక్షరము హల్లుగానే ఉంటుంది కాని అచ్చుగా ఉండదు.

ఉదా 1.

ప : ఉ్నాడో లేడో భద్రాద్రియందు
్నాడో లేడో

అ.ప : ఉ్నాడో లేడో ఆపన్న రక్షకుడు
్నాళ్ళు వేడిన కన్నులకగపడడు

3 చ : చాుగను భద్రాచల రామదాసుతో
మాలాడుటకు నాటకధరుడు

ఉదా 2 :

ప : ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమ రామ
నా రమా భవసాగరమీదను నళినదళేక్షణ రామ

1 చ : శ్రీ ఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామ

2 చ : వావనుత రామదాస పోషక వందనమయోధ్య రామ
దాసార్చిత మాకభయమసొంగవె దాశరధీ రఘురామ

అంత్యప్రాస:

ప్రతి పాదము చివరను ఒకే రకముగ అంతము కలది అంత్యప్రాసము.
తెలుగు రచనలకంటే, సంస్కృత రచనలలో అంత్యప్రాసలు ఎక్కువగా కనిపిస్తాయి.
 

ఉదా 1 :
ప : దీనదౌయాళో దీనదయాళో
దీనదయాళో పరదేవదయాళో

1 చ : కనకాంబరధర ఘనశ్యామ దయాళో
సనకాది మునిజన వినుత దయాళో

5 చ : ఆగమ రక్షిత అమిత దయాళో
భోగిశయన పరమపురుష దయాళో

6 చ : వర భద్రాద్రి నివాస దయాళో
అర్చిత శ్రీ రామదాస దయాళో

ఉదా 2 :
ప : రాముని వారమూ మాకేమి విచారము
అ. ప : స్వామీ నీదే భారమూ దాశరధే జీవాధారము

చ : ఆ మహిమ విన్నారము భద్రాద్రిని కనుగొన్నారము
రామదాసులమైనారము మది రంజిల్లుచున్నారము

ఉదా 3 :

ప : ఆన బెట్టితిని ఆయాసపడవద్దు..
చ: తామసింపక యిత్తరి నను కృపచూడు రామచంద్రా
తడయక నీ తల్లితండ్రుల యానతీరు


అనుప్రాస:

ఒకే రకమగు పదమో, అక్షరమో తరచుగా ప్రతి పాదములోనూ వచ్చినచో దానిని అనుప్రాస అంటారు.

ఉదా 1.

ప : రామా దయజూడవే భద్రాచల ధామా నను బ్రోవవే సీతా

2 చ : రాజీవ దళలోచనా భక్త పరాధీన భవ మోచన
రాజ రాజ కుల రాజ రాజార్చిత రాజిత వైభవ రాజాలలామ

2. యతి :

యతి రెండు విధములు - యతి, ప్రాస యతి

యతి : పాదములో మొదటి అక్షరము యతి అనబడును. ఇది కొన్ని కృతులలో కొంత విశ్రాంతి తరువాత కూడ రావచ్చును. యతి అక్షరము హల్లుగా కానీ, అచ్చుగా కానీ ఉండవచ్చును. రచనను వినుటకు ఇంపుగా చేయుటమే యతి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యతి పాదమును పూర్తిగా విభజించునదిగాను, సగముగా విభజించునదిగాను ఉండవచ్చును. ఇది తాళము యొక్క పొడవుపైన ఆధారపడు ఉంటుంది.

ఉదా : 1. ప : టు బోతివో రామ - టు బ్రోతివో రామ
ఉదా 2 : ప : రఘువీరా యని నే పిలిచిన - హో యనరాదా

ప్రాసయతి :
ప్రాసయతి అన్నది యతి యందలి ఒక రకము. యతి అక్షరము లోపించినపుడు ఆ స్థానములో ప్రాస అక్షరము ఉండును. పాదములోని రెండవ అక్షరము, విశ్రాంతి తరువాతి రెండవ అక్షరము ఒకటిగా ఉన్నచో దానిని ప్రాసయతి అని అంటారు. ఇటుల పాదము రెండుగా చీలిననూ రెండు వేరువేరుగా కనపడును. సాధారణంగా, ఒక పాదము రెండావర్తములకంటే ఎక్కువగా విస్తరించినపుడే ఇటువంటి ప్రాసయతి వచ్చును. ప్రాసయతి ఉన్నచోట యతి ఉండకపోవచ్చును. మొదటి పాదంలో ప్రాసయతి దీర్ఘంగా ఉన్నయెడల అన్ని పాదాలలో దీర్ఘంగానే ఉండాలి.

ఉదా 1 :
ప : ఏటికి దయరాదురా నాపై నీ - కేటికి దయరాదురా ఓ రామ
అ. ప : ఏటికి దయరాదియేటి కర్మమోగాని - మాటిమాటికి వేదనేటికి నాపై

ఉదా 2. ప : అమ్మ నను బ్రోవవే రఘురాముని - కమ్మ నను గావవే మా
చ : అమ్మ నను బ్రోవవే సమ్మ్తితోడ మా - యమ్మవనుచు నినునెమ్మది గొలిచెద

3. పదచ్ఛేదము :
కొన్ని రచనలో ఛందస్సు అనుసరించుట కొరకు కొన్ని పదములను చీల్చవలసి వచ్చును. అనగా, ఒక పదము యొక్క చివరి భాగము తరువాతి ఆవర్త ఆరంభమున పాడవలసి యుండును. ఇటువంటి ఛేదమునకు పదఛ్ఛేదము అని పేరు. ఇది సంగీత రచనలలో సాహిత్యములోని పదములను ఆవర్తములను సరిగ్గా పంచుటకై, తద్వారా వినుటకు ఇంపుగా నుండుట కొరకు అనుసరించబడును.

ఉదా 1 : ప : కరుణించు దైవలలామ అహో పరమ పావననామ పట్టాభిరామా

1 చ : అన్నవస్త్రములిత్తుమనుచు దొర
లన్నారు
మనిచెదమనుచు ఆయు
రన్నం
ప్రయఛ్ఛతియనుచు నూర
కున్నాను
నీవే మాకున్నావనుచు

4. యమకము :
యమకము అనగా ఒకే పదమును పలుమార్లు వివిధ అర్ధములలో వచ్చునట్లు వాడుట

ఉదా 1
ప : ఏల దయరాదో రామయ్య - ఏల దయరాదో రామయ్య నీకు

1 చ : బ్రహ్మ గూర్చెగదే అహో పర
బ్రహ్మ కావగదే రామ
బ్రహ్మ జనక భవ బ్రహ్మేంద్రాదులు
బ్రహ్మానందముపాలైనారట

ఈ విధమైన ఛందో నియముములతో కూడి రసానుభూతిని కలిగించే విధంగా ఉండే రామదాస కీర్తనలకు సార్ధక్యము, సాయుధ్యమూ లభించి పండిత, పామర రంజకంగా ఉండి నాలుగు వందల ఏళ్లకు పైగా చెరిగిపోని కీర్తితో, తరగని భక్తితో భజన గోష్టులయందు, శాస్త్రీయ సంగీత రంగమందు అజరామరమై భాసిల్లుతున్నాయి.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech