Sujanaranjani
           
  శీర్షికలు  
       శ్రీ శనీశ్వర శతకం-9

        

 

- రచన : అక్కిరాజు సుందర రామకృష్ణ

 

71,

నీదగు, ‘కోణదృష్టి పడనీయకుము నా పయి కాలదేహ! నా

వేదన బాపు భారమును వేగమ దీర్పగ నీకు దక్క, బ్ర

హ్మాదుల కేని లేదనుచు అచ్చపు బత్తి వచించినాడ, నా

వాదన స్వరమున్ మొదటి పద్యము నందునె - శ్రీ శనీశ్వరా!

72.

భారము నీదె ప్రోవనన్బధ్రు’! యమాగ్రజా! కృష్ణ! పింగళా!

సౌరి! యటంచు భక్తి నిను సన్నుతి జేయుచు కాన్కలిచ్చెదన్

క్షీరములోన తేల్చెదవొ? నీరము నందున నన్ను ముందెనో?

ఆరతులిత్తు నీకివియఆరభిపాడుచు - శ్రీ శనీశ్వరా!

73.

అంబుజ గర్భురాణి సకలాగమవంద్య పురాణి సాక్షి; హే

రంబుడు నాగ వక్త్రుడగు రాజిలు శర్వుని పుత్రు సాక్షి నీ

లాంబరి; రాగమొక్కటియ అన్ని విధాల సమంజసంబు , నీ

డంబును ఆలపింప గురుడా నిజమిద్దిర - శ్రీ శనీశ్వరా!

74.

పాడెద పెక్కురాగముల ప్రస్తుతి సల్పుచు నిన్ను దేవ! సే

నాడగలాడ నీదయిన ఆకృతి వేసము గట్టి నేర్పునన్!

నీడగ నిల్వరా దయను నేమముతో నిను గొల్చువాడ; నీ

వాడను, చిత్త శాంతినిడి భాసిల జేయర - శ్రీ శనీశ్వరా!

75.

భారతదేశ సంస్కృతి అభాసయిపోయెను; సిగ్గుచేటగున్

ఆ రయ నేతి బీరయది; అర్ధము పర్ధము లేని వైఖరిన్

మారెను సర్వరంగములు; మచ్చునకేనియు నీతి గాన్; మె

వ్వారికి భీతి లేదు పరిపాలకులందున - శ్రీ శనీశ్వరా -

76.

నీ సరి లేరు వేరెవరు నిక్క మ టంచును విశ్వమందు, సే

బాసులు గొన్న భారతము భ్రష్టును బట్టె కనంగ నిట్లహో

గాసిలి కుందుచుండె, కలి కాల మహత్వము నిక్కమెన్న, నా

కాసయు వీగె భావి అలరారు నటంచును - శ్రీ శనీశ్వరా;

77.

నేరము లెన్నొ సల్పి పలు నీతులు పల్కుట లవ్వి సర్వ సా

ధారణమయ్యెలే ధనమధాంధుల కిప్పటి నాయకాళికిన్

వారిని వీరు తిట్టుటలు పచ్చిగ వీరిని వారు తిట్టుటల్

భారత రాజకీయముల ప్రస్తుత వైఖరి - శ్రీ శనీశ్వరా

78

అమయొ నిజంబు నేడిది మహాశయ; ఊసరవెల్లులెన్న, మా

ప్రియతమ నాయకాగ్రగణ్యులు పెద్దల కంటెను సర్వ రీతులన్

నయము తలంచి చూడ; విను నా వచనంబులు కొంతమంది క

ప్రియములు సుంత ఘాటుగను వింతగ దోచుర - శ్రీ శనీశ్వరా

79.

పదవులు గావలెన్ మరియు పైసలు గావలె; పెక్కులైన సం

పదలవి గావలెన్; పడుపు భామల వెచ్చని కౌగిలింతలున్

అధరములానుటల్ సుఖములన్నియు గావలె; మా ప్రజాళివౌ

వ్యధలవి దక్క నేతలకు! వహ్వరె! సిగ్గగు - శ్రీ శనీశ్వరా!

80.

కోట్లకు కోట్లు మ్రింగి ప్రజకున్ శఠగోపము పెట్టి - చాల, యి

క్కట్లకు లోను జేసి నరకంబున కూలగ ద్రోయ నేతకే

ఓట్లను వేయ నీచ గుణులన్న వరాల ధరిత్రిమాది; నీ

వెట్లు వచించినన్ తొణక రింతయు మా ప్రజ - శ్రీ శనీశ్వరా!

 

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech