Sujanaranjani
           
  సారస్వతం  
   

సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (14వ భాగం)

 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil               

   

19 .రజ్జుసర్పభ్రాంతి న్యాయం—

రజ్జు=త్రాడు,సర్ప=పాము,భ్రాంతి=బ్రమ. అనగా చీకటిలో తాడుని చూసి పాము అనుకొనిఅని బ్రమించడం(భయపడటం)అని భావం. ఇట్టిదే మృగతృష్ణ న్యాయం ఎడారిలో ఎండమావులని చూసి నీళ్ళు అనుకొని బ్రమపడటం. పై రెండు న్యాయాలు ఒక్క లాంటివే.ఈ రజ్జుసర్పభ్రాంతి న్యాయాన్నే,  సర్పరజ్జు న్యాయం అనికూడా అనవచ్చు.దీనిని గూర్చి ఉపనిషత్తులు బ్రహ్మసత్యం జగన్మిధ్య అని బాగా వివరించాయి.ఆది శంకరులు కూడా అదేచేప్పారు. చీకటిలో వంకరగా పడిఉన్నత్రాడును చూసి పాము ఆని భ్రమించిన అవివేకి ముందుకు వెళ్ళడానికి భయపడతాడు. కాని వివేకవంతుడు బాగా దానిని పరిశీలించి,సత్యం తెలుసుకొని ముందుకు పోతాడు. అదే బ్రహ్మసత్యంజగన్మిథ్యఅంటే. ఒక రోజు శంకరాచార్యుల వారిని శిష్యుడు ఇలా ప్రశ్నిస్తాడు. స్వామీ! ఈ జగత్తు ఇంత విభిన్నంగా కంటికి కనబడుతుంటే, బ్రహ్మసత్యం జగన్మిధ్య అని ఎలాచెప్పగలుగుతున్నారు? అని. అపుడు శంకరులు ఏమి మాటాడక ఆశిష్యుడిని వెంట పెట్టుకొని చీకటిలో వెళ్తూ ఉంటారు. కొంతదూరం వెళ్ళాక మ్మోపాము అని అరుస్తాడు,ఆశిష్యుడు. అపుడు వేరోక శిష్యునిచేత కాగడా తెప్పించి ఆ వెలుగులో అక్కడున్నదానిని చూపెడతారు. అది పాముకాదు తాడు అనితేలుసుకొంటాడు మొదటి శిష్యుడు. అపుడు ఆదిశంకరులు శిష్యునితో ఇలా అంటారు?నాయనా తాడుని చూసి పాముఅనుకోన్నావు కారణం ఏమిటి? చీకటి అనిజవాబు. చీకటి అజ్ఞానం అన్నమాట. మరి పాముకాదు తాడు అని ఎప్పుడు తెలిసింది? వెలుగులో అని జవాబు. వెలుగు జ్ఞానానికి గుర్తు. కనుక జ్ఞానం పొందిన వారికి రజ్జుసర్ప భ్రాంతితొలగి “బ్రహ్మసత్యం,జగన్మిధ్య”అనే సత్యం అవగతమవుతుంది.” అని వివరిస్తారు. ఇది ఈన్యాయానికి మంచి ఉదాహరణ.

ముందుగా బలిజేపల్లివారి, సత్య హరిశ్చంద్ర నాటకం”లోని పద్యం ద్వారా దీనిని ఇంకా వివరిస్తాను.
మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రానంబుండునందాక నెం
తో యల్లాడిన యీ శరీరమిపుడిందుం గట్టెలం గాలుచో
నా ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు రక్షింపగాన్ (పద్యభావం సులభం.)
జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించగానే శ్రీమంతం అని గొప్పపండుగాచేస్తారు.పుట్టేక నామకరణం,అన్నప్రాసనం,అక్షరాభ్యాసం,విద్య,వివాహం.ఇలా ఎన్నోసంస్కారాలు చేస్తారు,ఆపై ఈ దేహాన్ని చక్కగా పెంచి పోషించడం,అనేక కోరికలు తీర్చుకోవడం,తను,తన కుటుంబం బాగా ఉండాలని,పరి,పరి విధాల ధనం సంపాదించి,చాలా చాలా బాగున్నాము అనుకొంటూ బ్రతకడం,చివరకు గతించడం.ఇది ఒక చక్రభ్రమణం.ఇది ఒక మాయామేయజగం.అని తెలుసుకోలేక పై పద్యంలో చెప్పినట్లు దారా పుత్రులకోసం ఎన్నోకుట్రలు,ఎన్నో కుతంత్రాలు,ఎన్నో మోసాలు,చేసి ధన సంపాదనే లక్ష్యంగా మనిషి జీవిస్తున్నాడని అందరికి తెలుసు. తెలిసి కూడా “తాడుని చూసి పాముఅనుకొని” భ్రమించి దూరంగా ఉండిపోయి సత్యం తెలుసుకోలేక “పునరపి జననం,పునరపి మరణం,పునరపి జననీ జఠరే శయనం”అని ఆదిశంకరులు అన్నట్లు పశువులగా,పక్షులుగా,మృగాలుగా,క్రిమి,కీటకాలుగా,మరల,మరల “జాయంతేచ,మ్రియంతేచ”అన్నట్లు, జన్మిస్తూ,మరణిస్తూ ఉంటాడు తప్ప,జన్మ రాహిత్యం కోరుకోడు.వివిధ జన్మల తరువాత, చివరకు జీవి తాను చేసుకొన్నకర్మఫలితంగా ఉత్తమమైన మానవ జన్మ పొందుతాడు. ఆహార,నిద్రా,భయ,మైధునాలు జంతువులకి మనుషులకి సమానమే అయినా,యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం మనిషికి అదనంగా ఉన్నగుణం. అది దేవుడు ఇచ్చిన వరం. దానిని సద్వినియోగ పరచుకొని మెలగడం ధర్మం.అలాకాకుండా “మృగతృష్ణన్యాయం”లా కోరికలనే ఎండమవులవెంట పరుగెత్తి( నీళ్ళులభించక)అలసి,సొలసి అధోగతి పాలు కాకుండా, తత్వాన్నిగుర్తించి,నిజాన్ని తెలుసుకొని జగత్తుమాయఅని,అది అనిత్యంఅని, బ్రహ్మమొక్కటే శాశ్వతమని గ్రహించడమే జన్మ సాఫల్యతకు,జన్మ రాహిత్యానికి నిదర్శనమని “రజ్జుసర్పభ్రాంతిన్యాయం”ద్వారా ఉపనిషత్తులు బోధిస్తాయి. ఇక్కడ మనం ఒకసారి ప్రకృతి తత్వాలని పరిశీలిద్దాం.

మనకి ఆధార భూతమైనది భూమి. ఇది ప్రశాంతంగా ఉండి, మనల్నిరక్షిస్తూఉంటుంది. కాని అదేభూమి భూకంపాల రూపంలో శిక్షిస్తుందికూడా. రెండవది జలం. జలపాతాలు,నదులు,సరస్సులు,సముద్రాలు ఆహా!ఎంత అద్భుతమైనవి.

కాని అవే జలాలు వరదలు,ఉప్పెనలు,సుడిగుండాలు,సునామీల రూపంలో ఎంతనష్టాన్నికలిగిస్తాయో అందరికి తెలిసిందే. ఇక నిప్పు.అగ్ని అనేకరూపాల్లో మనకి సహాయ పడుతూనే ఉంది. అదేఅగ్ని ప్రమాదాల రూపంలో కారుచిచ్చుగా,అగ్నిపర్వతాలుగా,గృహదహనాలుగా,అపకారం చేయడంలో ఎంతమాత్రం వెనుకాడదు. వాయువు-“లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా”అని పాడుకొంటూ చల్లని పిల్లతేమ్మెరలో,మలయ మారుతంలో విహరిస్తూ ఉంటే అబ్బ!ఆ ఆనందమే ఆనందం. కాని అదేగాలి సుడిగాలిగామారి, ఊళ్ళకి ఊళ్లనే నాశనం చేసేస్తుంది.(అప్రస్తుతమైనా ఇక్కడ గాలికి అగ్నికి గల సంబంధాన్నికొంచంతెలుసుకొందాం. సుభాషితకారుడు చెప్పిన ఈ ఉదాహరణలో మానవసంబంధాల తీరు చాల అద్భుతంగా ఉంటుంది.చూడండి—“మనంఅన్నివిధాలా బలంగా ఉన్నపుడే మనకి మిత్రులు సహకరిస్తారు.మనం కొంచం బలహీన పడితే, ఆ మిత్రులే సహాయం చేయరు సరికదా అపకారం కూడా చేస్తారు ఎట్లనగా –అగ్ని కారుచిచ్చురూపంలో అడవిని దహించేటపుడు,వాయువు సహకరిస్తాడు. అదే అగ్ని చిన్న దీపం రూపంలో ఉంటే అదేవాయువు ఆర్పి వేస్తాడు.)ప్రస్తుతానికి వద్దాం. ఐదవది ఆకాశం.అంతటా ఉండి మనకి సహకరిస్తుంది. అదే ఆకాశం ఉరుములు,పిడుగులు కురిపించి మనల్ని భయ భ్రాంతులను చేస్తుంది. పరస్పర విరుద్ద భావాలతో ఎందుకు ఈ పంచభూతాలు ఇలా ప్రవర్తిస్తున్నాయి? వీటిని ఇలా నడిపించేదిఎవరు? ఇక మనిషిలోకుడా మంచిచెడులు,సుఖదుఃఖాలు,కోపతాపాలు మొదలైన ద్వంద్వ ప్రవృత్తులు,అనేక విధాలైన తారతమ్యాలు ఉండటానికి కారణంఈ పంచాభూతాలే. మనశరీరం కూడా పంచభూత తత్వాలతో కూడినదే.ఎలా?చర్మం భూమికి చిహ్నం.నీరు మన ఒంట్లో నీరుఉంది,నిప్పుఒంట్లో వేడి ఉంది,గాలి ఉచ్చ్వాశ నిశ్వాసాలు,ఆకాశానికి శబ్దంచిహ్నం.’శబ్దగుణకంఆకాశం’అని లక్షణం. (గుండెకొట్టుకోవడం శబ్దం ) వీటితోనేకదా శరీరం చైతన్య వంతంగా ఉండేది.మరి వీటిలో ప్రాణమనే ఆ చైతన్యాన్నిప్రవేశపెట్టింది ఎవరు? ఇంక శరీర భాగాలని చూడండి—పాదాలనుండి మోకాలి వరకుఉన్న భాగం భూమికి చిహ్నం.పాదాలు భూమిపైనేకదా ఉంటాయి. మోకాళ్ళనుంచి ఉదర(కడుపు)భాగం జలానికిగుర్తు.మలమూత్ర విసర్జన స్థానాలు అక్కడే కదా ఉన్నాయి. ఉదరభాగం నుంచి మెడ వరకుగలభాగం ఆగ్నిని సూచిస్తుంది.ఆహారాన్ని పచనంచేసే ఆగ్ని వైశ్వానర రూపంలో అక్కడేఉంటుంది. వాయుస్థానం మెడనుండి శిరస్సు వరకు.గాలిని పీల్చేముక్కు,నోరు అక్కడేకదాఉన్నాయి. సహస్రార చక్రంఉండే శిరస్సు ఆకాశానికి ప్రతీక. మరణానంతరం కపాలమోక్షం జరిగి జీవం పయనించేది అక్కడే.ఇలా పంచ భూతాత్మకమైన శరీరంలోని భాగాలని నడిపించేది ఎవరు?ప్రాణం అంటే ఏది?ఆత్మస్వరూపం ఏది? దానిని మనం ఎలాతెలుసుకోవాలి?

(వచ్చేనెలలోతెలుసుకొందాం) 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech