Sujanaranjani
           
  సారస్వతం  
 

                                                          రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ

 

శకుంతల (పద్యకావ్యం) - 7                     

   


సారథికి స్యందనమ్మును చక్కనిచ్చి
ఆశ్రమద్వారముఖమున నడుగు మోపి
బాహువదరగ శంకించి పలికెనిట్లు
మనసు లోలోన ప్రశ్నలు మసలుచిండ             26


వ్యాఖ్యానం : దుష్యంతుడు తన రథసారథికి రథాన్ని అప్పగించి, కణ్వుని ఆశ్రమంలోని ముఖద్వారంలోకి అడుగు పెట్టాడు. ఆ సమయంలో అతని కుడి భుజం అదిరింది. అలా తన కుడి భుజం అదరడాన్ని తలచుకొని దాని పరిణామం 
ఎలా ఉంటుందో అని సందేహిస్తూ తన మనస్సులో కలుగుతున్న భావాలు ఎన్నో ప్రశ్నల రూపంలో వెంటాడుతుండగా ఇలా  తన భావాన్ని వ్యక్తం చేశాడు.

శమగుణసంహితంబయిన సన్మునివాటికలోన నా భుజం
బమరుట విస్ఫురద్గతుల నాత్మ వివేచనమూలమయ్యెడిన్ 
ప్రమద లభించునన్న నుడి భావ్యము గాదిట భావిసూచనం 
బు మహిమ నిట్లు తోచునని పూర్ణత నమ్మెద నిశ్చితాత్మతన్.             27 వ్యాఖ్యానం: ఈ కణ్వాశ్రమం శమగుణంతో అలరారే సన్మునులు నివసించే చోటు ఇలాంటి చోట నా కుడి భుజం అదరడం వల్ల నాలో సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కుడి భుజం అదిరితే కన్య లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ ఆశ్రమంలో నాకు కన్య ఎలా లభిస్తుంది?. ఇది ఎంతమాత్రం భావ్యం కాని విషయం. ఎందుకంటే ఆశ్రమంలో ప్రేమకు యోగ్యలైన కన్యలు ఉండరు కదా! ఐతే శాస్త్రం అసత్యం కాదు గనుక నాకు రాబోయే రోజులలో కన్యాలాభం కలుగుతుందనే విషయాన్ని ఈ సంఘటన సూచిస్తోందని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను.

వినయసమన్వితంబయిన వేషము పథ్యము మౌనివాటికన్ 
కనుక నృపోచితంబయిన కాంచనరాజితరత్నమాలికల్ 
సునిశిత శస్త్రజాలములు జోలెను నింపి రథమ్ము నుంచుచున్ 
కనెద పవిత్రధర్మ వరకర్మకలాపుల మౌని వర్యులన్                 28


వ్యాఖ్యానం: ఇది మహర్షి అయిన కణ్వుని ఆశ్రమం. కనుక ఇక్కడ వినయంతో కూడిన వేషంతో సంచరించడమే సరి అయినది. అందువల్ల నేను ధరించిన బంగారు ఆభరణాలనూ, రత్నహారాలనూ, కఠినమైన అస్త్రశస్త్రాలనూ ఒక జోలెలో నింపి, వాటిని రథలో భద్రపరచి, ఆ తరువాతనే ధర్మకర్మలను ఆచరించే పవిత్రులైన మునివర్యులను దర్శించడానికి ఆశ్రమంలోనికి వెళ్తాను.

అనుచు శస్త్రాస్త్ర కవచము లమిత మూల్య 
రత్నమణికిరీటాదుల ప్రబలరక్ష 
చోదకాన్విత రథమున సునిహితముగ
నుంచి యాశ్రమవాటిక గాంచి నడువ .                29


వ్యాఖ్యానం: ఇలా మనసులో అనుకొన్న ఆ దుష్యంతుడు వెంటనే తాను ధరించిన రాజోచితమైన ఆభరణాలనూ, అస్త్రశస్త్రాలనూ, ఒక జోలెలో నింపి వాటిని రథంలో భద్రపరచి ఒంటరిగానే ఆశ్రమంలోనికి అదుగుమోపాడు. 

దవ్వున మౌనికన్యకల తన్మయ కేళులు నర్మగర్భమై
మువ్వల సవ్వడుల్వలె సమోహనమై వినిపించు పల్కులున్ 
మవ్వపు కైతలై తరుణమానసనిర్ఝరిణీప్రవాహముల్
రివ్వున నింగిపైకెగస్యు రీతిన వింపడ మోహనాత్ముడై            30


వ్యాఖ్యానం: అలా దుష్యంతుడు కణ్వుని ఆశ్రమంలోకి ప్రవేశించగానే, దూరంగా మునికన్యల ఆటపాటలూ, వారి నర్మగర్భ సంభాషణలూ  మువ్వల సవ్వడుల వలె మనోహరంగా వినిపించ సాగాయి. ఆ మాటలూ, పాటలూ వన్నె దేరిన కవితలవలె,మానససరోవరంలో ప్రభవించిన ప్రసన్న ప్రవాహాలు ఆకాశంలోనికి ఎగిరినట్లు అనుభూతిని కలిగిస్తూ ఉండగా ముగ్ధుడైపోయాడు.

దక్షిణభాగమందు గల తద్వనవాటిక దూరి చాటునన్ 
వృక్షలతా నికుంజమున విచ్చిన కన్నులతోడ నిల్చి తా
వీక్షణజేసె రాజముని విశ్వవిలాసతనూలతాత్మలై
వృక్షలతాళి మూలముల బ్రీతిగ దంపెడి మౌనికన్యలన్              31


వ్యాఖ్యానం: ఆ కణ్వాశ్రమంలోని వనవాటికలో దక్షిణ భాగంలోనికి  దుష్యంతుడు ప్రవేశించాడు. అక్కడ ఒక చెట్టు చాటున నిలబడి, చెట్లూ, తీగల నడుమ ఉన్న ఆ మునికన్యలను విరిసిన కన్నులతో చూశాడు. ఆ మునికన్యల శరీరలావణ్యాలను చూసి, ఆశ్చర్యం చెందాడు. అప్పుడు ఆ మునికన్యలు ఎంతో ప్రేమతో చెట్లకూ,తీగలకూ నీళ్ళు పోస్తూ ఆనందిస్తున్నారు. 

అప్పుడచ్చెరువందుచు నవని విభుడు
నవనిలో కానరానట్టి అందములను 
అతివలందున సృష్టించె నాత్మభువుడు
వాని నైపుణ్యతకు నమోవాకమనుచు                    32


వ్యాఖ్యానం: అప్పుడు ఆ దుష్యంతుడు లోకంలో ఎక్కడా కనరాని గొప్ప అందాలను తమలో దాచుకున్న ఆ మునికన్యలను చూసి, అది బ్రహ్మదేవుని సృష్టి రహస్యమే అని భావించి, బ్రహ్మదేవుని సృష్టిరచనా నైపుణ్యానికి జోహారులు అంటూ నమస్కరించాడు.


అఖిలశుద్ధాంతములయందు నవని లేరు
ఈదృశాలేఖ్య వపువిలాసేక్ష్యలెందు
అప్రకృతికప్రపోషితోద్యానలతలు
వనలతలకమ్ర రుచులకు పాడి యగునె?                  33


వ్యాఖ్యానం: ఇలాంటి అతిశయలావణ్యమణులు ఈ భూమండలంలోనే లేరు. దేవతాస్త్రీలలోని అపురూప సౌందర్యం వీరిలో అలరారుతోంది. వీరు వనంలో ప్రకృతిసహజంగా పెరిగిన తీగల వంటి వారు. రాజభవనాలలో ఉండే స్త్రీలు కృత్రిమవనాలలోని తీగల వంటి వారు. కృత్రిమ వన లతలు ఎన్నటికీ వనలతలతో సాటి రాలేరుగదా! 


-(సశేషం)    
 


 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech