Sujanaranjani
           
  సారస్వతం  
   

మహాకవి తెనాలిరామకృష్ణ విరచిత “పాండురంగ మాహాత్మ్యము”- ఒక పామరుడి నీరాజనం.

 

                                                  రచన:  బాలంత్రపు వేంకట రమణ

   కవిప్రశంస
సాధారణంగా కవులకూ, రచయితలకూ తమ రచనలద్వారా కీర్తీ ప్రతిష్ఠలు వస్తాయి. మనుచరిత్రము ద్వారా ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనామాత్యునికి ఎనలేని కీర్తి లభించింది. కానీ, వారి రచనల గురించి పామరజనానికి తెలియకపోయినా అత్యంత ప్రసిద్ధిని పొందిన వారు మహాకవి కాళిదాసు మరియు తెనాలి రామకృష్ణుఁడు.

కాళిదాసు మహాకవి రచించిన కావ్యాలన్నీ సంస్కృతంలోనే ఉండబట్టి ఈ కాలంలొ అవి సంస్కృతపండితులకి మాత్రమే అర్థమౌతాయి. పామరులకి కాళిదాసు రచించిన కుమారసంభవం, మేఘసందేశం, రఘువంశం, అభిజ్ఞానశాకుంతలం మొదలైన మహాకావ్యాలు అవగతం కాకపోయినా, తను కూర్చున్న కొమ్మను నరుక్కున్న వెఱ్రి గొల్లడిగా, మంత్రికుతంత్రం వల్ల రాజకుమర్తెతో వివాహం జరిగి, ఆమె ప్రోద్బలం వల్ల కాళికాదేవి కటాక్షం సంపాదించి మహాకవిగా ఆవిర్భవించడం వగైరా కథలన్నీ యావద్భారతదేశంలో బహుళ ప్రచారాలు.

ఆదే విధంగా మన తెనాలి రామకృష్ణుఁడు. ఆయన రచనలేమిటో, ఆయన ఎంతటి మహాకవో తెలియని అసంఖ్యాకులకి, తరతరాలుగా ఆయన వికటకవిగా హాస్యకథల హీరోగా సుపరిచితుడు. అతని పేరు చెబితేనే ఫక్కుమని నవ్వు వచ్చేటంతటి ఆంధ్రుల అభిమాన హాస్యరస చక్రవర్తి మన తెనాలి రామలింగడు. ఒక్క తెలుగునాటనేకాక, యావద్దక్షిణ భారతదేశంలోకూడా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా, హాస్యచతురుడిగా, సరసుడైన వికటకవిగా, సమస్యాపూరణంలో దిట్టగా, ఎటువంటి జటిలమైన సమస్యనైనా చిటికలో సమర్థవంతంగా పరిష్కరించే మేధావిగా ఆయన ఖ్యాతి చెందారు. ఆయన పేరిట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యాల్లో కూడా ఎన్నో హాస్యకథలు ప్రాచుర్యానికి వచ్చాయి.

అయితే, కవిత్వం దగ్గఱకొచ్చేసరికి, తెలుగు పండితులకీ తెలుగు భాషావేత్తలకీ మాత్రమే ఆయనయొక్క ఉద్దండ పాండిత్యమూ, భాషా పటిమా, పదగుంఫనమూ, భావగంభీర్యమూ, వగైరాలు తెలుస్తాయి. గ్రంథరచన దగ్గఱ కొచ్చేసరికి ఆయన వికటకవిత్వ తత్త్వం మాయమౌతుంది. ఆయన వ్రాసిన పాండురంగ మాహత్మ్యం తెలుగు పంచమహా కావ్యాల్లో ఒకటిగా పండితులచే పరిగణించబడుతోంది.

ముక్కు తిమ్మనగారి “పారిజాతాపహరణము”
అల్లసాని వారి “మనుసంభవము”
శ్రీకృష్ణదేవరాయ విరచితమైన “ఆముక్తమాల్యద”
తెనాలి రామకృష్ణుఁని “పాండురంగ మాహత్మ్యము”
రామరాజభూషణుని “వసుచరిత్రము”
ఈ ఐదు గ్రంథాల్నీ తెలుగులో పంచమహాకావ్యాలుగా పండితులు నిర్ధారించారు. ఈ ఐదు గ్రంథాల్నీ క్షుణ్ణంగా పారాయణం చేసి అర్థం చేసుకొంటే తెలుగు భాష సంపూర్ణంగా వచ్చేస్తుంది అని పెద్దల ఉవాచ.

తెనాలి రామకృష్ణుఁడిగా ప్రసిద్ధికెక్క్కిన ఈ మహాకవి యొక్క అసలు పేరు : గార్లపాటి రామలింగయ్య. జననం క్రీ.శ. 1495. ఊరు తెనాలి. గుంటురు జిల్లా, తెనాలిసమీపంలోని గార్లపాడు వీరి పూర్వీకుల నివాసం. ఎప్పుడో వచ్చితెనాలిలో స్థిరపడ్డారు. ప్రథమశాఖ నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతన్ని కన్న ధన్యజీవులు: తల్లి లక్కమాంబ, తండ్రి రామయ్య.

ఈయన తొలిదశలో శైవుడు. గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు. అతిపిన్న వయసులోనే సంస్కృతాంధ్ర కావ్యాలూ, నాటకాలూ చదివి, అలంకారాలూ, వ్యాకరణం, ఛందస్సు, ఆశుకవిత్వంలో నిష్ణాతుడయ్యాడు. అప్పట్లోనే అతనికి "కుమారభారతి" అనే బిరుదు కూడా వుండేది. శివకవిగా “ఉధ్భటారాధ్య చరిత్రము” అనే శైవకావ్యాని వ్రాశాడు.

బ్రతుకుతెరువుకోసం, రాజాదరణ సంపాదించడానికి తెనాలి నుండి ముందుగా కొండవీటి ఆస్థానానికి, అక్కడినుంచి హంపీలోని రాయలవారి భువనవిజయానికీ చేరుకున్న రామలింగకవి, వైఖాసన సాంప్రదాయ వైష్ణవమతావలంబియై, రామకృష్ణుఁడిగా అవతరించాడు. అతనికి వైష్ణవ దీక్షనొసగిన గురువు శ్రీ భట్టరు చిక్కాచార్యులవారు. అక్కడ “కందర్పకేతు విలాసం" , "హరిలీలా విలాసం” మొదలైన కావ్యాలు వ్రాశాడు.

"ప్రౌఢకవి"గా “పాండురంగమాహత్మ్యం” అనే బృహత్కావ్యాన్ని, అవసానదశలో “శ్రీ ఘటికా చలమాహత్మ్యము” అనే మహాకావ్యాన్నీ రచించాడు. ఈ ఆఖరిగ్రంధానికి అవతారిక వ్రాయకుండానే - అంటే దాన్ని ఎవరికీ అంకితమివ్వకుండానే - 95 ఏళ్ళ సుధీర్గ జీవన యానం తరువాత, పరమ పద సోపానాన్నధిరోహించాడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి పరమశివుని ప్రమధగణాలూ, శ్రీమహావిష్ణువు యొక్క దూతలూ చెరో దివ్య విమానాన్నీ తీసుకువచ్చి వాదులాడుకొని ఉంటారు !

తెనాలి రామలింగని గురించి బహుళ ప్రచారంలో ఉన్న హాస్యకథల జోలికిగానీ, భువనవిజయానికి వచ్చిన వివిధ పండితుల్ని ఆయన తన తెలివితేటలతోనో, కుతంత్రంతోనో (ఉదాహరణకి: తిలకాష్టమహిషబంధనము, మేక-తోక పద్యం వగైరాలు) తికమకపెట్టేసి భువనవిజయం యొక్క పరువు నిలబెట్టిన ఉదంతాలగురించిగానీ నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. కేవలం ఈ మహాకవియొక్క సాహితీ ప్రజ్ఞాపాటవం గురించి ముచ్చటించడమే నా ఉద్దేశం.
అల్లసానివారి అల్లికజిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాడురంగవిజయు పద గుంఫనంబును - అన్నారు పండితులు.

ఈ మహాకవి రచనలలో మూడు గ్రంథాలు మాత్రమే ఇప్పుడు లభ్యాలు. అవి - 1) ఉద్భటారధ్యచరిత్రము, 2) పాండురంగ మాహత్మ్యము, 3) ఘటికాచలమాహత్మ్యము.

“పాండురంగమాహత్మ్యం” కథాసంగ్రహాన్నీ, మచ్చుకు కొన్ని పద్యరత్నాల్నీ జ్ఞాపకం చేసుకుందాం.

మన తెలుఁగు పంచమహాకావ్యాల్లో ఒకటిగా పరిగణించబడిన పాండురంగ మాహత్మ్యం అనే మహాకావ్యాన్ని తెనాలి రామకృష్ణకవీంద్రుడు విరూరి వేదాద్రి మంత్రికి అంకితమిచ్చి అతడ్ని అమరుణ్ణి చేశాడు. ఈ వేదాద్రి మంత్రి పొత్తపినాటి చోడ ప్రభువైన పెద్ద సంగభూపాలుని వద్ధ వ్రాయసకాడు.

ఈ చిగురాకు నీప్రసవ మీపువుఁ దేనియ యెంత యొప్పెడిన్
జూచితిరే యటంచుఁ దనచుట్టు శుకాదులుఁ గొల్వగాఁ గప
ర్థాంచిత చంద్ర గాంగజలమైన శివాహ్వయకల్పశాఖ వే
దాచల మంత్రికీర్తి కలశాబ్దిని వెన్నెలమాడ్కిఁ జూచుతన్

శివుడు తన కృతిభర్తను పాలించు గాక యన్న యాశీర్వచనము. శివుడు కల్పవృక్షము. శుకమహర్షి మొదలైనవారీ కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు. శివుని జుత్తు - జడముడి - చివురాకు. చంద్రుడు పువ్వు. గంగ తేనియ.

ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా
విదితంబైన మహిన్ మహాంధ్ర కవితా విద్యానల ప్రౌఢి నీ
కెదురేరీ? సరసార్థ బొధఘటనాహేల పరిష్కార శా
రద నీరూపము రామకృష్ణకవిచంద్రా! సాంద్ర కీర్తీశ్వరా !

తూర్పు కొండలు, పడమటి కొండలు, దక్షిణసముద్రము, ఉత్తరాన హిమాలయపర్వతం - ఈ నాలుగు ఎల్లల మధ్య గల యావద్భారత దేశంలో మహాంధ్ర కవితా విద్యలో, ఓ రామకృష్ణకవీంద్రా, నీ అంతటి మహాకవి వేరొకరు ఎవరు? ఎవరూ లేరు. సరసమైన అర్థబోధ ఘటించెడి ఒయ్యరపు నగలు గల సరస్వతీ దేవి నీ రూపము! అని విరూరి వేదాద్రి మంత్రి అన్నాడని పాండురంగమాహత్మ్యము అవతారికలో రామకృష్ణకవీంద్రుడు వ్రాసాడు.
కృతి స్వీకరించే సందర్భంలో వేదాద్రి మంత్రి మహాకవికి తాంబూలం ఇచ్చాడు. కవి ఆ తాంబూలాన్ని ఈ రమణీయమైన పద్యంలో వర్ణిస్తున్నాడు.

పలుకుం దొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలు నయ్యింతి చె
క్కులఁ బోలుం దెలనాకులయ్యువిద పల్కుల్వంటి కప్రంపుఁ బ
ల్కులతోఁ గూడిన వీడియంబొసఁగు నాకుం బద్మనాభార్చనా
కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్


పలుకుల తొయ్యలి - సరస్వతీదేవి - పెదవుల (మోవి) కాంతికి సమానమైన (ఎనయౌ) పోకచెక్కలు (బాగాలు) (“మౌళి” కాంతి కెనయౌ - అనే పాఠాంతరం కూడా ఉంది. సర్వశుక్లాం సరస్వతీ అన్నారు; ఆవిడ ఆపాదమస్తకం తెలుపేనట!) ఆ ఇంతి చెక్కులను పోలే పండుతమలపాకులు (తెలనాకులు) (తమలపాకుల్లో కవటాకులెంత భోగమో పండుటాకులు అంతకంటే భోగమట). ఆ యువతి పలుకులవంటి పచ్చకర్పురపు పలుకులతో కూడిన తాంబూలాన్ని ఇచ్చాడు. ఏ చేతులతో అయితే పద్మనాభస్వామిని నిత్యం అర్చిస్తాడో ఆ చేతులతో - కంకణాలు ఝణఝణ ధ్వనులు చేస్తున ఆ హస్తాలతో ఈయనకి తాంబూలం అందించాడట. బంగారపు పళ్ళెరంలో నిండా కాసులు పోసి మధ్యలో తాంబూలం పెట్టి ఇచ్చి ఉంటాడు.

పాండురంగ మాహత్మ్యం - కథా సంగ్రహం

కథారంభంలో శౌనకాది మహామునులు సూతుడ్ని క్షేత్రము, వేల్పు, తీర్థము - ఈ మూడూ సమాన ప్రాధాన్యములుగా కలిగిన క్షేత్రమునుగూర్చి తెలుపమని అడుగుతారు. అప్పుడు సూతుడు "ఈ కథను నేను కృష్ణద్వైపాయనుడు చెప్పగా విన్నాను. దాన్ని విన్నది విన్నట్టుగా మీకు వివరిస్తాను, వినండి" అంటూ ప్రారంభిస్తాడు.

కాశీపుర వర్ణనము

ముందుగా కాశీపుర వర్ణనతో కథ ప్రారంభమౌతుంది.

శీతాహార్య సుతాళినీ వికచ రాజీవంబు విశ్వేశ్వర
జ్యోతిర్లింగ విశుధ్ధ రత్నఖని మోక్షోపాయ దుగ్ధాబ్ధి వే
లాతీరావని దుంఠి నామక గజాలానంబు గంగామృత
స్రోతోనిస్సృతి చంద్రగోళ మన మించుం గాశి శ్రీరాశియై

కాశీపురము "శీతాహార్య సుతాళినీ వికచ రాజీవ"మట. శీతాహార్యుడు అంటే మంచునే భూషణముగా ధరించిన వాడు - హిమవంతుడు. అతడి సుత - పార్వతీ దేవి - అనే ఆడు తుమ్మెద (అళిని) కోసం, వికసించిన తామరపువ్వట (వికచ రాజీవంబు) కాశీ. ఆ నగరం విశ్వేశ్వర జ్యోతిర్లింగమనే విశుధ్ధమైన రత్నం లభించే గనియట. మోక్షసాధనమగు పాలసముద్రానికి కాశీ ఒడ్డట; కాశికాపురి “దుంఠి నామక గజాలానంబు” - దుంఠి అనే పేరుగల గజమునకు (వినాయకునకు) ఆలానము (ఏనుగును బంధించే స్తంభం). ఇంకా కాశీపురి గంగయనే అమృత ప్రవాహం స్రవించే చంద్రగోళమట. ఇంతటి వైభవంతో కాశీ భాగ్యనిలయమై (శ్రీరాశి) ప్రకాశిస్తున్నదట.

కాశీలో మృతి చెందినవారికి - వారెటువంటివారైనా సరే - జన్మరాహిత్యమట. మరణసమయంలో శివుడే స్వయంగా వారికి చెవిలో పంచాక్షరీమంత్రం ఉపదేశిస్తాడట. వారికి కైవల్యప్రాప్తట. వారు శివసారూప్యంచెందుతారట. అంటే శివుని రూపాన్ని పొందుతారన్నమాట. అది ఎలాగో చెబుతున్నాడు కవి.
ఒకనాడుఁ దీర్థోపయోగిగాని శఠుండు నౌఁదల ధరియించు నభ్రగంగ
నాప్రొద్దు పొయిరాఁజనట్టి నిర్పేదయు భోగించు నైశ్వర్యములెనిమిదియుఁ
బుష్కరాక్షుల పొంతఁబోని వర్షవరుండు దేహార్థమునఁ దాల్చుఁ తీగఁ బోఁడి
నాయుధ ప్రభఁగాంచి యలఁగు భీరువుఁ బూను వాఁడి ముమ్మోముల వేఁడి యలుగు
మలిన వర్తనుఁడును సుధాలలితమూర్తి
మించి వర్తించు, మతిలేని మేదకుండు
మౌనివర్యులఁ జదివించు మఱ్ఱి నీడఁ
బంచముఖువీట మేనోసరించెనేని.
ఫంచముఖుడు అంటే శివుడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే ఐదూ శివునిముఖాలు. పంచముఖుని వీట (పురములో) - అంటే కాశిలో - మరణిస్తే (మేనోసరిస్తే) - ఒక్కరోజుకూడా ఏతీర్థమూ సేవించని మూఢుడుకూడా నెత్తిమీద గంగని ధరిస్తాడట. కాశీలొ మరణించగానే శివుడైపోతాడుగా మరి! ఆప్రొద్దు పొయి రాజనట్టి కటిక పేదవాడు కూడా కాశీలో మరణిస్తే అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడట. పుష్కర + అక్షులు - తామరపువ్వువంటి కన్నులుకలవారు - స్త్రీలు; ఏనాడూ స్త్రీల వద్ధకు వెళ్ళని నపుంసకుడు (వర్షవరుడు) కూడా శివునిలాగా అర్థనారీశ్వరుడౌతాడు. ఆయుధముల కాంతిని చూస్తేనే భయపడిపోయే పిరికివాడుకూడా కాశీలో మరణించినంతమాత్రాన వాడియైన మూడు మొనలుగల తీక్ష్ణమగు ఆయుధము (త్రిశూలము)ను చేబూనుతాడట.
చెడునడత గలవాడు కూడా (మలినవర్తనుడు) కాశీలో మరణిస్తే అమృతమువలె స్వచ్ఛమైన దేహముకల చంద్రుని (సుధాలలితమూర్తి) మించి ప్రకాశిస్తాడట. మతిలేని స్థబ్దుడు కూడా కాశీలో మరణిస్తే మఱ్ఱి చెట్టునీడన మౌనివర్యులకే విద్యాబోధ చేస్తాడట. (కైలాసంలో ఒక పురాతనమైన మఱ్ఱిచెట్టు నీడలో పరమశివుడు మునిగణానికి ఆధ్యాత్మికోపన్యాసాలిస్తూ ఉంటాడని ప్రతీతి.)
ఇక కాశీలో ఉన్న వార కాంతల సౌందర్యాని రామకృష్ణుడు ఇలా వర్ణిస్తున్నాడు.
మొలక చీఁకటి జలజల రాల్పఁగా రాదె నెఱులు మించిన వీరి కురులయందు
కెరలించి యమృతంబు గిలకొట్టఁగా రాదె ముద్దుచూపెడి వీరి మోవులందు
పచ్చిబంగారు కుప్పలు చేయఁగా రాదె గబ్బు మీఱిన వీరి గుబ్బలందు
పండు వెన్నెల తేటఁ బరిఢవింపఁగ రాదె నగవు గుల్కెడి వీరి మొగములందు
నౌర! కరవాఁడి చూపుల యౌఘళంబు,
బాపురే! భూరి కటితటీ భారమహిమ
చాఁగు! మదమందగమన లక్షణములనఁగ,
నేరుపుల మింతురప్పురి వారసతులు.
ఆ పురములోని వారసతులు (వేశ్యలు) వాళ్ళ నొక్కులు తిరిగిన (నెఱులు మించిన) శిరోజాల్ని విదిలిస్తే చిమ్మచీకటి జలజలా రాలుతుందిట. అంటే అంత నల్లటి కురులన్నమాట వాళ్ళవి. వాళ్ళ పెదవులనుండి అమృతాన్ని గిలకొట్టవచ్చట. అంటే వాళ్ళ పెదవులనుంచి అమృతం చిప్పిల్లుతూ వుంటుంది. మదించి, నిక్కిన వారి వక్షోజాలనుండి బంగారం కుప్పలు కుప్పలుగా తీయవచ్చట. పండు వెన్నెలలోని ప్రసన్నత నవ్వులొలికే వారి ముఖాలలో వెల్లివిరిస్తుందిట. ఇక మిక్కిలి వాడి అయిన వారి చూపుల తీక్ష్ణత, పెద్దవైన పిరుదుల భారంతో మదించిన ఏనుగులవలె మెల్లనైన వారి నడకల సంగతా? భళీ! ఇక ప్రత్యేకించి చెప్పే పనేముంది? వారవిద్యలలోని నేర్పరితనంలో ఎంతో అతిశయించిన వారట - ఒకరిని మించిన వారు ఒకరట - ఆ పురం లోని వేశ్యకాంతలు.

“సారథి ఛాందసుండు బడిసాగదు చక్రయుగంబు ప్రాత పం
చారపు గుఱ్ఱముల్ రథియు శౌర్యమునం దరమానిసాత్మ వి
స్తారము ఖండఖండములు తానఁట మాసరి” యంచుఁ దత్పురిం
దేరులు నవ్వు శంకరుని తేరిని గేతన కింకిణీ ధ్వనిన్

కాశీపురిలో ఉన్న రథాలు (తేరులు) శంకరుని రథాన్ని చూసి నీవా మాకు సాటి అని అక్షేపిస్తున్నాయిట. త్రిపురాసుర సంహారానికి శంకరుడు వెళ్ళినప్పుడు, భూమి ఆయనకు రథం అయింది, బ్రహ్మ సారథిగా వ్యవహరించాడు, సూర్య చంద్రులు రథానికి చక్రాలయ్యాయి, నాలుగువేదములు ఆ రథానికి గుఱ్ఱాలు.

సారథి బ్రహ్మ ఛాందసుడట! ఈ పదం చాదస్తుడు అనే అర్థంలో వాడతారు. అసలు ఛాందసుడు అంటే వేదపండితుడు అని అర్థం. ఇక రథచక్రాలంటారా - సూర్యచంద్రులు. ఒకటి పెద్దది ఒకటి చిన్నది - రథం నడవదు! గుండ్రంగా తిరుగుతుంది. లేదా ఒకటి ఉన్నప్పుడు మరొకటి ఉండదు. ఎందుకంటే సూర్యుడు పగలు ఉంటే చంద్రుడు రాత్రి ఉంటాడు కదా.

కట్టినవి ప్రాత పంచారపు గుఱ్ఱాలు. అంటే మార్పులేని పాతరీతి నడకలు కలిగినవని అర్థం. వేదాల్ని ప్రాత పంచారపు గుఱ్ఱాలంటారు. ఇక రథి సంగతి చూద్దామా అంటే అతడు శౌర్యంలో అరమానిసి అట. శివుడు అర్థనారీశ్వరుడు కదా! రథం భూమి కదా. ఆత్మ విస్తారము - అంటే రథం యొక్క స్వరూపము. అతుకులు బొతుకులతో కూడి ఉందట. ఖండఖండములు. మరి ఇలాటి లోపాలున్న రథం మాకు సరిసాటా? అని ప్రశ్నిస్తూ ఎగతాళిగా నవ్వుతున్నాయిట కాశీపురిలోని మేటి రథాలు వాటికి కట్టిన జెండాకి ఉన్న మువ్వలు కింకిణీ ధ్వనులు చేస్తుండగా.

కాశీమహాపుణ్యక్షేత్రంలో పవిత్ర గంగానది ఒడ్డున యోగులు నివసించే సిధ్ధాశ్రమంలో అపర సూర్యుడిలా వెలుగొందుతూ అగస్త్యమహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి అనుకూలదాంపత్యం నెరుపుతూ వున్నాడు. కలశసూతియైన (కుండలో పుట్టినవాడునూ) తారకబ్రహ్మవిద్యా రహస్యజ్ఞాత (నరులను సంసారసాగరమునుండి తరింపచేసే తత్త్వ విద్యారహస్యములనెరిగినవాడునూ), చుళుకితాంభోరాశి (తన పుడిసిట్లో - అరచేయిని కొంచెం గుల్లగా వంచితే దాన్ని పుడిసిలి అంటారు - సముద్రాన్ని పట్టి త్రాగినవాడునూ), అయిన అగస్త్య మహర్షి మునిజన సముదాయం సేవలందుకుంటూ వైభవంగా నివసించాడు.
అలా ఆయన కాశిలో పెక్కుకల్పంబులున్నతరువాత, ఒకప్పుడు వింధ్య పర్వతం మేరుపర్వతంపై అసూయ చెంది రోజురోజుకీ పైకి పెరుగుతూ సూర్యచంద్రుల గమనానికి అడ్డుగా నిలిచిందిట. దేవతలూ మునులూ దాని గర్వమణచడానికి అగస్త్యుడే సమర్ధుడని అతన్ని ప్రార్ధించగా, గొప్పవారు పరవిపత్ ప్రతికార తత్పరులు (ఇతరులకు ఆపదలు కలిగించిన వారికి ప్రతీకారము చేయుట యందు మిక్కిలి ఇష్టము కలవారు) కావున, వింధ్య యొక్క గర్వమణచేందుకు కాశీపురిని వదలి భార్యాసమేతుడై బయలుదేరాడు.
గాఢతపోనిధియైన అగస్త్యుని చూచి వింధ్యభూధరము (పర్వతము) పొంకము, బింకము దక్కి (కొల్పోయి) భయకంపితమై కలుగులోనికి చొరబడే కుళీరము (ఎండ్రకాయ) లాగ నేలకి శిరస్సువంచి వినమ్రంగా అణిగిపోయింది. ఆప్పుడు అగస్త్యుడు వింధ్యతో "నేను దక్షిణాపథానికి వెళుతున్నాను, నేను తిరిగి వచ్చేదాకా ఇలాగే వుండ"మని ఆదేశించి, సపత్ని లోపాముద్రతో సహా దక్షిణాపథానికి తరలివెళ్ళి అక్కడే ఉండిపోయాడు. వింధ్యాచలము అలాగే వొదిగి ఉండిపోయిందిట.

ఓ లలితాంగి! ఇందు సుఖముండు మృకండు కణాదగాధి వా
థూలస ముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి ని
ష్కాళగళుండు నిర్యువతిగాత్రుఁడు నిర్నిటలేక్షణుండు ని
ర్వ్యాళ విభూషణుండు నగు నంబర కేశుఁడనంగఁ బెంపుగన్

అగస్త్యుడు లోపాముద్రతో చెబుతున్నాడు. ఓ సుకుమారమైన శరీరము కలదానా! ఇది మతంగమహాముని నివసించే చోటు. ఆయన మృకండుడు, కణాదుడు, గాధి, వాథూలస మొదలైన ఋషులను మించిన చరితము కలవాడు (అతిరిక్త చరితుడు). ఈతడు కంఠమున విషమును ధరించినవాడు కాదు; శరీరంలో నారిని సగభాగంగా ధరించినివాడు కాదు; నుదుట మూడవ కన్ను లేనివాడు; సర్పములని ఆభరణంగా ధరించినవాడు కాదు. ఈ తేడాలు తప్ప అపర కేశవుడు అనదగ్గవాడు !
ఇదే భావాన్ని బహుశః నాలుగు సీసపద్యాల్లో వ్రాయవచ్చు. ఇలా క్లుప్తంగా వ్వ్యక్తం చేయగలగడం ఒక మహా కళ.
వేసవి తాపవర్ణన చూడండి.

పద్మినీ పద్మాత పత్రంబు శిథిల పత్రాగ్రమై రాయంచ యాశ్రయించెఁ
దాలు స్రవత్ఫేన జాలుబుతో ఘోణి పంచల రొంపి గలంచి యాడె
దూరొద్గమద్దావ ధూమ మంబుద బుధ్ధి నెమ్మి లో పొదనుండి నిక్కి చూచె
జఠరస్త జలము నాసానాళమునఁ బీల్చి సామజంబరుప్రక్కఁ జల్లుకొనియె

సరసిపై నీరు సలసల తెరలె విపిన
సకల వీథులు నిర్మృగోఛ్ఛయములయ్యె
మట్టమధ్యాహ్నమిది సుధామథురవాణీ!
యర్హమిచ్చొఁ బథః శ్రమ మపనయింప.
రాజహంస, వేసవికాకకి ఓర్వలేక శిథిలమైన ఱెక్క చివర కలదియై చెరువు (పద్మిని) లో తామరాకు గొడుగు క్రింద (మిగతా చోటుకంటే అక్కడ ఇంకా ఎక్కువ చల్లగా వుంటుందిట) చేరిందిట. దవడ (తాలువు) నుండి జారుతున్న, కారుతున్న (స్రవత్) నురుగు సమూహముతో (ఫేనజాలమ్ముతో) పంది (ఘోణి) సమీపంలో (పంచల) బురదలో (రొంపి) పొర్లి (కలంచి) ఆడిందిట (యాడె). దూరం నుండి లేస్తున్న (దూర + ఉద్గమత్) దావాగ్ని పొగను (దావధూమ) మేఘమనుకొని (అంబుద బుద్ధిన్) నెమిలి (నెమ్మి) - ఎండకు తాళలేక పొదలో ఎక్కడో లోపల దాక్కొని వున్నది, మెడ నిక్కించి చూసిందిట. కడుపులోపలనున్న (జఠరస్త) నీళ్ళను తొండంద్వారా (నాసా నాళమున) బయటకి పీల్చుకొని ఏనుగు తనమీద అటూ ఇటూ చల్లుకుందిట.
సరస్సులో నీళ్ళు సల సల తెరలుతున్నాయి. వీధులన్నీ ఎక్కడా మృగసంచారం కూడా లేకుండా ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నమయింది. ఓ అమృతమయమైన పలుకులు పలికే దానా! ఇక్కడ మన ప్రయాణ బడలిక తీర్చుకుందాము - అని అగస్త్యుడు లోపాముద్రతో అన్నాడు.

"మిట్ట" మధ్యాహ్నాని "మట్ట" మధ్యాహ్నం అని కూడా అనవచ్చని రామకృష్ణుడు తీర్మానించాడు.

కవి తనకత్యంత ప్రీతిపాత్రమైన తుంగభద్రానది నుండి వచ్చే పిల్లతెమ్మెరలెలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు.

పంపాతరంగ రింఖణ
ఝంపా సంపాద్యమాన జలకణరేఖ
సంపాత శీతలానిల
సంపద వొదలించెఁ బరమశైవోత్తంసున్

పంపానది (తుంగభద్ర) లోని అలలయొక్క రింఖణ (పొరలికలతోకూడిన) ఝంపా (దూకుళ్ళచేత) సంపాద్యమాన (పుట్టించబడిన) జలకణరేఖా (నీటి తుంపరల సమూహము) సంపాత (పడుటవలన) శీతల (చల్లనైన) అనిల (గాలియొక్క) సంపద (కలిమి) ఆ పరమ శైవోత్తంసుని (శివభక్తులలో శ్రేష్టుడైన ఆ అగస్త్యమహర్షిని) పొదలించెన్ (సంతోషపెట్టెను).

గంగా సంగమమిచ్చగించునె? మదిన్ గావేరిఁ దేవేరిగా
నంగీకారమొనర్చునే? యమునతోనానందముం బొందునే?
రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా! తుంగభద్రా నదీ!

సముద్రుడు భర్త, నదులన్నీ ఆతని భార్యలు - అని కవిసమయం. తుంగభద్రా నది ఉపనది, అది సముద్రంలో కలవదు. అందుకని కవి చమత్కారంగా తుంగభద్ర అందాన్ని పొగుడుతున్నాడు.

ఓ తుంగభద్రా! ఆ సముద్రుడు నిన్ను చూడలేదు కానీ, చూసి ఉంటే, గంగా, కావేరి యమునాదులతో సుఖించేవాడా ! ఉండేవాడు కాదు. నీ సౌందర్యం అంతగొప్పది! (యమునా నది కూడా ఉపనదే! రామకృష్ణుని యేమరుపాటై ఉంటుంది - ప్రమాదో ధీమతామపి! అన్నారు).

అగస్త్యుడు, లోపాముద్ర మరియూ శిష్యబృందముతో దక్షిణాన తీర్థయాత్రలు చేస్తూ స్వామిమలలో కుమారస్వామిని దర్శించి వేనోళ్ళ స్తుతించాడు. అప్పుడు శరవణుడు (రెల్లుదుబ్బులో జన్మించినవాడు) వింధ్యసంస్థంభయుతుదైన అగస్త్యమునికి గంగ, పెన్న, విపాళ, చంద్రభాగ, శరావతి, వేత్రవతి, బాహుద, క్రిష్ణవేణీ, కావేరి, కపిశ, వంజీర (మంజీర) భవనాశని (సరయూనది), తుంగభద్ర, గౌతమి (గొదావరి) మొదలగు నదీతీర్థముల యొక్క దివ్య చరిత్రలను వినిపించాడు.

అప్పుడు అగస్త్యుడు కుమారస్వామితో "దేవా! వేల్పు, తీర్థము మరియు క్షేత్రము సమాన ప్రాధాన్యతతో ఒకే చోటనున్నట్టి పరమ పుణ్యక్షేత్రమెక్కడ ఉన్నదో తెలుప"మని ప్రార్థించాడు. దానికి కార్తికేయుడు ఎంతో ఆలోచించి తనకి కూడా అటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తోచడంలేదు, మా తండ్రియైన పరమశివుణ్ణి అడుగుదాం, పదండి, అనగా అందరూ కలిసి రజతగిరికి (కైలాసానికి) బయలుదేరి వెళ్ళారు.
కైలాసం చేరిన సుబ్రహ్మణ్య స్వామిని దేవవేశ్యలు (అప్సరసలు) పూజించారట.

స్మరశశి తటిదజ పవమా
న రవి సుధా సలిల మునిజన క్ష్మారిష్టా
సురమృత్యు జ్వలన – జ లగు
సురవేశ్యలు కొలిచిరపుడు సుబ్రహ్మణ్యున్

ఈ చిన్ని పద్యంలో రంభ, ఊర్వసి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, వగైరా సురవేశ్యలు (అప్సరసలు) ఎవరెవరికి పుట్టారో తెలుపుతున్నాడు కవి. వారు పధ్నాలుగు జాతుల సంతానమట. అవి -
స్మర - మన్మథుడు, శశి - చంద్రుడు, తటిత్ - మెరుపు, అజ - బ్రహ్మ, పవమాన - వాయువు, రవి - సూర్యుడు, సుధా - అమృతము, సలిల - నీరు, మునిజన - మహర్షులు, క్ష్మా - భూమి, అరిష్ట - దక్షప్రజాపతి కుమార్తెలలో ఒకతె, ఈమె పదమూడు మంది అప్సరసలను కన్నదట, సుర - దేవతలు, మృత్యు - మృత్యువు, జ్వలన - అగ్ని; - వీరందరికీ - ‘జ’ లు - పుట్టిన వారు.

అదేసమయానికి పార్వతీదేవికి కూడా అదే సందేహం కలిగి పరమేశ్వరుడ్ని అడిగింది : "స్వామీ, క్షేత్రము-తీర్థము-దేవత యీ మూడిటికీ సమానప్రాధాన్యత కల పుణ్యప్రదేశమేదో వివరింప ప్రార్థన" అనగా, ఫరమేష్టి విష్ణుకథలు చెప్పుటయందిష్టము కలవాడై పార్వతికీ, అక్కడికి వచ్చిన కుమారస్వామి, అగస్త్యాదులందరికీ పాండురంగక్షేత్ర మాహత్మ్యం గురించి సవివరంగా, సమర్మంగా వివరించాడు.

శివుడు ముందుగా పండరీపురంలో వెలసిన విట్టలాధీశుడనబడిన శ్రీకృష్ణావతారవిష్ణువును మదిలో తల్చుకున్నాడు.

వెడద కన్నులవాని వేయినామములవాని వ్రేతలవలపించు వెరవువానిఁ
జిప్పఁకూకటివానిఁ జిన్ని నవ్వులవానిఁ జెరివిన మంచి పింఛమువానిఁ
బులుగు తత్తడివానిఁ బొడవుల తుదివానిఁ బొక్కిటి వెలిదమ్ముపూవువానిఁ
మినుకుటూర్పులవానిఁ మిసిమిమేఁతలవానిఁ మెఱుఁగు జామనిచాయమేనివానిఁ
దిస్సమొలవాని, బసిఁగానఁ ద్రిప్పువానిఁ
మురళిగలవాని మువ్వంకమురువువానిఁ
విట్టలాధీశుఁ దలఁచి తద్విపులమహిమ
నొడువుఁ బ్రామఱ్రి క్రీనీడ విడిదిప్రోడ.
విశాలమైన (వెడద) కన్నులు కలవానిని, సహస్రనామములు కలవానిని; గొల్లస్త్రీలను (వ్రేతలన్) ప్రేమింపచేసే ఉపాయము (వెరవు) తెలిసినవానిని, కాకపక్షమని పిలువబడే పిల్ల జుట్టు నుదుటిపై కలవానిని (చిప్పకూకటి వాని), చిఱునవ్వు రాజిల్లెడువానిని, దోపిన (వెరివిన) అందమైన నెమలి పింఛము కలవానిని, పక్షిని (పులుగు) - గరుత్మంతుడిని - వాహనముగా కలవానిని, (తత్తడి అంటే వాహనం; అందుకే శుకవాహనుడైన మన్మధుణ్ణి, చిలుకతత్తడిరౌతు - అంటారు) ; ఉన్నతములకంటే ఉన్నతుడైనవానిని (పొడవుల తుదవాని); నాభియందు (పొక్కిట) తెల్లని (వెలి) తామరపూవు (తమ్మిపూవు) కలవానిని; మినుకు అంటే వేదం; వేదములే ఊర్పులుగ (నిశ్వాసములుగా) కలవానిని; వెన్న (మిసిమి) తినేవానిని (మేతలవాని) - మెరిసే నల్లని చాయగల దేహము కలవానిని; దిగంబరుని (దిస్సమొలవాని); గోగణముని (పసిన్) అడవియందు (కానన్) (మేతకై) త్రిప్పువాని; మురళిగలవాని ; మువ్వంక - మూడు వంకల; మురువు అంటే సౌందర్యం. శ్రీకృష్ణుడు మూడు వంకరలుగా నిలబడడం చేత అందము గూర్చువాడట. అలా నిల్చోనడాన్ని త్రిభంగి అంటారు.

తద్విపుల మహిన్ - ఆ విఠలాధీశుని గొప్ప మహిమను; ప్రామఱ్ఱి క్రీనీడ - ప్రాత మఱ్ఱిచెట్టు నీడలో; విడిది - నివాసముగా కల, ప్రోడ - వివేకి అయిన శివుడు; నుడువున్ - చెప్పును.
తదనంతరం పరమశివుడు ఇలా వివరించాడు.
ఆదికల్పమునందలి పద్ధెనిమిదవ ద్వాపరయుగపు చివరిభాగంలో శ్రీమహావిష్ణువు ఘర్మవీరానది భైమీ నదితో కలిసినిచోట పుండరీకుడనే ఒక పరమభక్తాగ్రేసరునికి ప్రత్యక్షమై ఆతని కోరికమేరకు అక్కడే వెలశాడు. పుడరీకుడు గొప్ప వివేకి, సుగుణసంపన్నుడు, సత్యము, దయ, ఆర్జవము (సూటితనము), శాంతి, దాంతి (బ్రహ్మచర్యము మొదలుగాగల తమఃక్లేశములను తట్టుకొనే స్వభాము) ("దాంతునికైనా వేదాంతుని కైనా - శాంతము లేక సౌఖ్యము లేదు" అన్నాడు త్యాగరాజస్వామి.) అనే గుణములచే వెలుగొందినవాడు. చలిచీమకైనా హాని తలపెట్టడు. ఎన్నడూ మృషాభాషణములు (అబద్ధపు మాటలు) పలుకడు. కలుషవర్తనులున్న దాపులకుకూడా వెళ్ళడు. కలిమికిపొంగిపోడు, లేమికికుంగిపోడు. పరస్త్రీలను కన్నెత్తైనా చూడడు. ఎంతటిఒడిదుడుకులువచ్చినా ఏమాత్రం ధైర్యంవీడడు. ఇతరుల సంపదలనుచూచి అసూయపడడు. ఎంతటి నీచుడినైనా మనసులోకూడా నిందించడు. ఆకలిగొన్నవారికి చాలామందిలా శుష్కప్రియాలు చెప్పి ఊరుకోకుండా తనచేతనైన సహాయం చేస్తాడు. సకలభూతములయందునూ దయలిగి వుంటాడు. వేదమార్గముననుసరించువారిలో ప్రధానుడు. ఎట్టిలోపమూ లేని వేదాంత శాస్త్రవేత్త ఆ పుండరీకుడు. దేవగురువైన బృహస్పతితో సమానుడయిన ఆ బ్రాహ్మణోత్తముడి మనసులో బంగారానికి తావి అలదినట్లు ఎప్పుడూ అంబుజోదర చరణారవింద సతతస్మృతి (విష్ణుపాదపద్మముల నిరంతర స్మృతి) అనే వ్యసనమేనట !

సమాధిలో ఉన్నంతసేపూ అంతర్నయనంతో శ్రీకృష్ణుని మీదే మనస్సును లగ్నంచేసే పుండరీకుడు సమాధినుండి బయటకురాగానే తల్లిదండ్రుల పాదసేవకే అంకితమైపోతాడు. తానే వేయిసేవకులపెట్టయి తన భార్య ఎదురుతిరగని బుద్ధితో సహకరిస్తూ ఉండగా, తన మాతాపితరులకు సకలసేవలూ చేసేవాడు.

ఆపాదమస్తంబు నంటు నూనియగాచి స్వయముగా నుద్వర్తనంబొనర్చు
జలకమార్చు నఖంపచ స్వచ్ఛజలములఁ గడు మెదుగుడులఁ బొదివి
లఘుధౌత వసనపల్లవములు గట్టించు శిరసార్చు మృదులీల సురటి విసరి
చేయూఁత యొసఁగి వేంచేయించు లోనికి ద్వారావతి గలంతిఁ దానె యొసఁగుఁ

దెలుపు సంధ్యా సమాధి విధి ప్రయుక్తి,
నగ్ని వేల్పించు విష్ణుసహస్రనామ
పాఠ మొనరించు తఱిఁదోడుపడు గురునకు,
గవలు వోకుండఁబుత్రుఁడో కలువకంటి.

శివుడు పార్వతితో ఇలా చెబుతున్నాడు:
కలువలవంటి కన్నులుగల ఓ పార్వతీ! పుండరీకుడు తన తండ్రికి తానే స్వయంగా నఖశిఖపర్యంతం నూనెతో అంటి నలుగు (ఉద్వర్తనం) పెడతాడు. గోరువెచ్ఛని (నఖంపచ) స్వచ్ఛమైన నీళ్ళతో జలకమాడిస్తాడు. తదుపరి అతిమెత్తని గుడ్డలతో (కడు మెదు గుడుల) ఒళ్ళుతుడుస్తాడు. తేలికయిన (లఘు) తెల్లని (ధౌత) చిగురుటాకుల్లాటి వలువలు (వసనపల్లవములు) కట్టిస్తాడు. మృదువుగా విసనికర్ర (సురటి) తో వీస్తూ తలతడి ఆరుస్తాడు. చేయూతనిచ్చి లోపలికి తీసుకువెళ్తాడు. చెంబు (ద్వారావతి గలంతి) తానే అందిస్తాడు (ఆచమనం చేసుకోడానికి). తండ్రికి సంధ్య, సమాద్యాది విధులు తానే తెలుపుతాడు. తండ్రిచేత అగ్ని వేల్పించుతాడు. విష్ణుసహస్రనామం పఠించేటప్పుడు వృద్ధుడయిన తండ్రి తడబడి క్రమంతప్పకుండా (కవలుబోకుండా) ఉండేందుకు పుత్రుడైన పుండరీకుడు తోడ్పడేవాడు.

ఇక ఆ పుండరీకుడు విష్ణుపూజలేవిధంగా చేసేవాడంటే -

అభిషేకమొనరించు నాకాశవాహినీ జననకారణ పాద జలరుహునకు
వైచుఁ దోమాలియ వైజయంతీకాంతి వలయిత వక్షఁ కవాటునకును
గౌశేయమర్పించుఁ గాంచనమయ పటీ పల్లవారుణ కటిబంధురునకుఁ
జందనం బలఁదు నీళేందిరా కుచకుంభ సంగికుంకుమ పంకిలాంగునకును
రత్నహారంబు సాతు నిర్యత్నసిద్ధ
కౌస్తుభొదర్చి రభిరామకంధరునకు
ధూపకల్పన మున్నుగా దీపమిచ్చు
దెఱవ! యాతడు త్రైలోక్య దీపకునకు.

ఓ తెఱవా! (ఓ ఇంతీ! ఓ పార్వతీ!) పుండరీకుడు ఆకాశగంగ జననానికి కారణమైన పాద పద్మములుగలవానికి (జలరుహమంటే పద్మము) అభిషేకం చేస్తాడు. వైజయంతి అనే పూమాలయొక్క కాంతిచే ఆవరించబడిన తలుపువంటి రొమ్ముగలవానికి వనమాల (తొమాలియ) వేస్తాడు. చిగురువంటి బంగారు వస్త్రముచే ఎరుపెక్కిన మొలచే చక్కనైనవానికి పట్టువస్త్రాన్ని (కౌశేయము) అర్పిస్తాడు. నీళ (విష్ణుభార్యలలోనొకతె) మరియు ఇందిర (లక్ష్మీదేవియొక్క) కుచ చూచుకముల సాంగత్యముచే (రాపిడిచే) కుంకుమ అంటిన శరీరముకలవానికి మంచిగంధపు (చందనము) పూత పూస్తాడు. కౌస్తుభం లాటి మహామణినే అప్రయత్నంగా సిద్ధించుకొని దాన్ని ధరించిన కారణంగా దాని కాంతి పుంజములచే ఇంపైన మెడగలవానికి రత్నహారాన్ని సమర్పిచును (చాతున్). ముల్లోకాల్నీ వెలుగొందింపచేసే (త్రైలోక్యదీపునకు) ఆ శ్రీమహావిష్ణువునకు ధూపమిస్తాడు పరమభక్తాగ్రేసరుడైన పుండరీకుడు!

తిరువారాధనమొనర్చి విష్ణువుకు అర్పించుటచేత పావనములైన వివిధ ఆహారపదార్ధములను పుండరీకుడు తన తల్లిదండ్రులకు ప్రియముమీరగా కొసరి కొసరి వడ్డించి తినిపించేవాడట ఆ ధన్యచరితుడు.
తల్లిదండ్రులు పరమపదించినపిమ్మట కాశీకివెళ్ళి వారి అస్తికల్ని పరమపవిత్రమైన గంగానదిలో నిమజ్జనంచేసి, గయకి వెళ్ళి అక్కడ వారికి పిండములు పెట్టాడట. పిత్రుదేవతల ఋణమును తీర్చుకొనుటకు అనుకూలవతి అయిన భార్య వలన విశేషజ్ఞానము, అణకువ కలిగిన పుత్రులను కన్నాడు. ఇక ఆయన భార్యాబిడ్డల్ని విడిచి, ఇల్లుమరచి, మదిలో శేషఫణిశయనుడయిన శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంచేసుకొనే అభిలాషతో తపస్సు చేయడం ప్రారంభించాడు.

(మన పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు ఏమి చెప్పినా అన్యాపదేశంగా చెబుతాయి. కవులు ఏదైనా పాత్రగురించి చెప్పినప్పుడు ఆ పాత్ర లక్షణాలన్నిటినీ సమగ్రంగా వివరిస్తారు. అది సన్మార్గుడి పాత్ర అయితే మనం అందరం కూడా అలాగే నడుచుకోవాలి అనిన్నూ, దుర్మర్గుడి పాత్ర ఐతే మనం అలా ఉండకూడదనిన్నీనూ మనకి ఉపదేశాలు. అందుకే కవి పుండరీకుడి పాత్రని సకలసద్గుణాల ప్రోవుగా చిత్రీకరించాడు. తద్వార మనకి ఉపదేశం - అలా నడుచు కోండి - అని.

భాగవతంలో పోతనగారు బాలప్రహ్లాదుడిగుఱించి చెబుతూ "కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృ భావము సేసి మరులువాఁడు" అన్నాడు. అయిదేళ్ళ బాలుడికి స్త్రీల పట్ల వేరే భావనలేముంటాయి గనక? ప్రహ్లాదుడు పెరిగి పెద్దయిన తరవాత కూడా అలాగే ఉన్నాడు, అని మనం గ్రహించాలి. ఆ నీతి మనల్ని పాటించమని అన్యాపదేసంగా మనందరికీ ఉపదేశం! భారతీయుడైనవాడు అలా ఉండాలి - అని.)

పుండరీకుడు చేసిన ఘోరతపస్సుకి నందగోపబాలుని హృదయం వెన్నలా కరిగిపోయిందిట. గోపికలతో రాసక్రీడలో మునిగి తేలుతూన్న రాసవిహారి తన బంగారపుటందియలు ఘల్లుఘల్లున మ్రోగగా పరుగుపరుగున పుండరీకునివద్దకు వచ్చాడట. పుండరీకుడికి ప్రత్యక్షమయిన శ్రీకృష్ణుడి రూపాన్ని ఆపాదమస్తకం అపూర్వంగా దర్శించి అధ్భుతంగా వర్ణించాడు మహాకవి రామకృష్ణుడు.

యతీశ్వరుల హృదయంలో సంచరిస్తున్న గోవర్ధనపర్వతగుహలలో విహరించడం, కొండకొమ్మున నెమలిలా రాధికాహృదయం మీద వాలడం, మేఘాలనుతోలే ఇంద్రుడిలా రంగురంగుల ఆలమందలను మేపడం, పద్మవనంలో హంసలా స్నేహితులతో కేరింతలు కొట్టడం, చంద్రబింబానికి స్వరం నేర్పుతున్నట్టు తెల్లని శంఖాన్ని ఊదడం - ఇలాటి ఆటలన్నీ కట్టిపెట్టి ఆ దేవకీతర్ణకం (కోడెదూడ - బిడ్డ) పుండరీకుడి పర్ణశాలకువచ్చి ప్రత్యక్షం అయింది! ఆ తర్ణకం పాదపద్మాలకు బంగరుటందెలు మ్రోగుతున్నాయి. ఆ మ్రోతని కవి ఇలా ఉత్ప్రేక్షిస్తున్నాడు :

లలిత శిరీష పుష్పమృదులంబులు నీ చరణంబులక్కటా
ఇల ఇది రూక్షమిట్టులలయించుట కాదని ప్రార్థనా మృదూ
క్తులు సెలగంగ వేపొదివి తొల్చదువుల్ తగు విన్నపంబులన్
బలుమఱు జేయుచందమున బంగరుటందియలుగ్గడింపగన్

యదుబాలుని పాదపద్మాలకి బంగారపుటందెలున్నాయి. ఆ అందెలు మ్రోగుతుండగా (ఉగ్గడింపగన్) స్వామి నడచివచ్చారు. తొలిచదువులైన వేదాలు ఆ పాదాలను పొదివిపట్టుకొని (వేదాలు విష్ణుపాదాలవద్దజనించాయట) అడుగడుగుకీ మాటిమాటికీ (పలుమరు) తగిన విన్నపాలు చేస్తున్నట్టు ఉంది ఆ అందెల మ్రోత. "స్వామీ! నీ చరణాలు లలితమైన శిరీషపుష్పాల్లాగా మృదులమైనవి. అయ్యయ్యో, నేల ఇది అతికఠినం (రూక్షం) ('రూక్షం' అనడంలోనే కాఠిన్యమంతా ప్రస్ఫుఠమౌతోంది!) ఇట్లా నీ పాదాలని కష్టపెట్టడం (అలయించుట = అలసిపోయేలాచేయడం) తగదు" - అని ప్రార్థనా మృదు + ఉక్తులతో విన్నపాలు చేస్తున్నట్టు అందెలు మ్రోగుతుండగా స్వామి విచ్చేసాడు.

బాలక్రిష్ణయ్య మొలకి గోళీ సంచులు నాలుగు వ్రేలాడుతున్నాయి. ఆలమందలు గడ్డి మేస్తుంటే ఈయన సోదరుడు బలరాముడితో, ఇంకా మిత్రబృందంతో చెట్టుక్రింద గోళీలాడుకుంటారన్నమాట. అందుకని సంచీలో గోళీలు మొలకి కట్టుకుని సిద్ధంగా ఉంచుకుంటాడుకాబోలు!

మెత్తగ నూఱిన చుట్టుం
గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనా
డొత్తిన హత్తిన చేదుం
తిత్తుల క్రియ దొడల నుడ్డ తిత్తు లు వ్రేలన్

మధుడు - కైటభుడు అనే రాక్షసుల్ని విష్ణుమూర్తి అలనాడు తన చక్రాయుధంతో సంహరించాడు. చుట్టుకత్తి - చుట్టుంగత్తి - గుండ్రటి ఆయుధం - సుదర్శనచక్రం. దాన్ని మెత్తగా నూరి, బాగ పదును పెట్టి ఆ ఇద్దరు రాక్షసుల ఉరు కంఠాలను (బలిసిన మెడలు) ఒత్తేసాడు. ఒత్తడం అంటే చప్పుడు కాకుండా తెగెయ్యడం (మీసాలు వత్తుట, చంపలు వత్తుట అని వాడుక). అలావత్తినప్పుడు వాళ్ళ ఊపిరితిత్తులు స్వామికి హత్తాయి - లభించాయి. చేదడం అంటే తోడడం. గాలిని చేదుకోడానికి ఉపయోగించే తిత్తులు కనుక శ్వాసకోసాల్ని "చేదుంతిత్తులు" అన్నాడు. ఇద్దరివీ చెరో రెండుగా నాలుగు ఊపిరితిత్తులు. ఆ తిత్తులో అన్నట్టుగా నాలుగుసంచులు - బహుశః అటురెండు ఇటు రెండు తొడలమీద వేలాడుతున్నయి. "ఉడ్డ" అంటే నాలుగు. ఉడ్డాముగ్గురు (ఏడుగురు) అనేది రాయలసీమవాడుక.

ఇటనభ మిట భూవలయం
బిట బలిసద్మంబు నుండు నెలవులివి యనన్
బటువులగు వళుల చెలువున
బుట పుటనై యున్న చిన్ని బొజ్జ కదలన్

క్రిష్ణయ్య పరుగున వస్తుంటే నినిగలాడుతున్న (పుటపుటనైయున్న) చిన్ని బొజ్జ కదలాడుతోంది. ఆ చిఱు బొజ్జమీద మూడు మడతల ముడతలు (వళులు) ఉన్నాయి. అవి స్పుఠంగా (పటువుగా) ఉన్నాయి. మూడు అరలకు గుర్తులుగా ఉన్నాయి.
"ఇదిగో ఇక్కడ ఆకాశం (నభము), ఇక్కడ భూగోళం, ఇక్కడ పాతాళం (బలిసద్మం - బలిచక్రవర్తికి నిలయం)" అన్నట్టు ఉన్నాయి. మరి జగత్తులన్నీ ఆయన బొజ్జలోనే ఉన్నాయి కదా! ("ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల" అన్నాడు పోతన.)

బొజ్జదాటి పుండరీకుని చూపులు ఇంకొంచెం పైకి వెళ్ళాయి. విశాలంగా వక్షస్సు కనిపించింది.

తులసికి పచ్చరాకుదురు తోయదవాహన రత్నవేది య
క్కలిమి మెఱుంగు బోడికిని కౌస్తుభ ఘర్మ గభస్తికిన్ నభ
స్తలము ననంగ బొల్చి నిరతంబు కృపావిభవంబునింటి బో
ర్తలుపు దలంపు సేయుచు నురంబు కరంబు పరిస్ఫురింపగన్

స్వామి వక్షస్థలం (ఉరంబు) మిక్కిలి (కరంబు) ప్రకాశిస్తోంది (పరిస్ఫురింపగన్). "కృపావిభవము" అనే ఇంటి బోర్ తలుపుని (ఏక కవాటం) గుర్తు చేస్తూ ప్రకాశిస్తోంది. ఆ కవాటం వెనక్కాల దయాసంపత్తి ఉంది. పచ్చరాయి + కుదురు - పచ్చరాకుదురు. మరకతమణి వేదిక లేక పాదు. తులసీదేవికి విష్ణుమూర్తి వక్షఃస్థలం మరకతవేదిక. మరకతమణులు పొదిగిన తులసికోటలాగా ఉంది అని. నీలమేఘశ్యాముని ఉరము కనుక మరకతమణి వేదికలాగా ఉంది. మెఱుంగుబోడి అంటే విద్యుల్లతవంటి శరీరం కలిగిన స్త్రీ. కలిమి - సంపద. కలిమి మెఱుంగుబోడి - లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఈయన ఉరఃప్రదేశం తోయదవాహన రత్నవేది యట. తోయదం - మేఘము. దాన్ని వాహనంగా కలవాడు - ఇంద్రుడు. తోయదవాహనరత్నం - ఇంద్రనీలమణి ! విష్ణువక్షఃస్తలం లక్ష్మీదేవికి ఇంద్రనీలమణి వేదిక. లక్ష్మీదేవి విష్ణువక్షస్థల నివాసిని కదా.

శ్రీమహావిష్ణువు మెడలో కౌస్తుభహారం ఉంటుందికదా. ఘర్మ గభస్తి - వేడి కిరణాలు (గభస్తులు)కలవాడు - సూర్యుడు. కౌస్తుభం అనే సూర్యుడికి శ్రీహరి ఉరసీమ ఆకాశమట (నభస్తలం). స్వామివారి ఉరస్సీమ నీలంగా వుంటుంది కనుక ఆకాశంతో పోలిక. కౌస్తుభమణికి సూర్యుడితో పోలిక.

ఎల్లవేళలా (నిరతంబు) ఇలా విరాజిల్లుతూ బోర్తలుపుని గుర్తు చేస్తూ (తలంపు సేయుచు) ఉరంబు కరంబు పరిస్ఫురింపగన్ - స్వామి విజయం చేసాడు.

అంత్యానుప్రాసతో పద్యాన్ని ముగించడం పోతనాదుల పద్ధతి. వృత్యనుప్రాసతో చివరిపాదం మ్రోగించడం రామకృష్ణుని పద్ధతి.

లలిత నిజ వామ కరతల
కలిత కనత్కంబు కాంతి కల కల నవ్వన్
గలువల చెలి గిలిగింతల
నలువగు ఱాలన్ బిసాళి నలువ గుఱాలన్

మనోహరమైన తన ఎడమ (వామ) అరచేతిలో (కరతలమున) ధరింపబడి ప్రకాశిస్తున్న (కనత్) పాంచజన్య శంఖ కాంతి (కంబువు - శంఖము) చంద్రకాంతపు మణులనీ, బ్రహ్మదేవుడి హంసలనీ పరిహసిస్తూ ఉండగా (కల కల నవ్వన్) స్వామి విచ్చేసాడు.
కలువలచెలి (చంద్రుడు) పెట్టే గిలిగింతలతో అందగించే (నలువు - అందం, నలువు + అగు = నలువగు - ఒప్పిదమగు) `రాలన్ (రత్నాలని) - అంటే చంద్రకాంతమణులను పరిహసించే తెల్లదనం ఆ శంఖానిది.
నలువ అంటే నాలుగు ముఖాలు కలవాడు - బ్రహ్మ. ఆయన వాహనాలు (గుఱ్రాలు) - హంసలు.
("గుఱ్ఱం" అనే పదాన్ని ఇప్పటికీ "వాహనం" అనే అర్థం సూచించడం కోసం వాడుతూ ఉంటాం. సైకిలో స్కూటరో రెపేరుకొస్తే నా "గుఱ్ఱం మూలబడింది" అంటాం. రామకృష్ణుడు బ్రహ్మదేముడి హంసల్ని పట్టుకొని ఏకంగా గుఱ్ఱాలన్నాడు!) పిసాళి అంటే ప్రకాశించు.

ఇక ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నిగనిగ లాడుతున్న దొండపండులాంటి అధరం. శృంగార భావం మేళవించి చెబుతున్నాడు.

బింకపు వ్రేతల వాతెఱ
మంకెన పూదేనె తేట మానక పైపై
నింకగ నింకగ బల్మఱు
బంకించుట బోలె మోవి బచ్చెన హెచ్చన్

వ్రేత - గోపిక, వాతెఱ - వాయికి తెఱ - నోరు. మోవి - పెదవి, బంకించుట - పులుముట, రుద్దుట, పట్టించుట ; బచ్చెన - కాంతి, నిగారింపు.
బింకమైన వయసులో ఉన్న గోపికలు వాళ్ళ అధరాలు మంకెనపువ్వులు. ఎర్రగా, మృదువుగా మకరందం చిప్పిలుతూ వుంటాయి. అందుకని అధరాలతో పోలిక. వాతెర (నోరు) అనే మంకెనపువ్వులో ఉండే తేనె తేటను (అధరామృతాన్ని) విడిచిపెట్టకుండా తన పెదవికి పైపైకి ఇంకినకొద్దీ ఇంకొంచెం ఇంకేట్టుగా (ఇంకగన్ - ఇంకగన్) చాలాసార్లు (పల్మఱు) పట్టించడంవల్ల స్వామివారి మోవి రంగు మరింత హెచ్చిందిట. అటువంటి అధరాలతో ఆ గోపికాలోలుడు ప్రత్యక్షమయ్యాడని అన్వయం.

ఇక స్వామివారి కన్నుల వర్ణన చూడండి.

తరళమసార సార నిభ తారకముల్ సితపద్మ పత్ర బం
ధురములు, రాధికాహృదయ తోయజకోరక బోధన క్రియా
తరుణ తరార్క రుగ్విలసిత స్ఫుట రక్తిమ సక్త కోణ భా
స్వరము, లసూక్ష్మ పక్ష్మములు, వాలిక కన్నులు చెన్ను మీఱగన్

స్వామివి వాలిక కన్నులు - సోగకన్నులు, అవి చాలా అందంగా (చెన్నుమీఱగన్) ఉన్నాయి. తీర్చిదిద్దినట్టు ఒత్తుగా పెరిగిన రెప్పవెండ్రుకలతో బాగున్నాయి. సూక్ష్మము అంటే సన్నని. అసూక్ష్మము అంటే దానికి వ్యతిరేకము - ఒత్తయిన అని. పక్ష్మములు - రెప్పవెండ్రుకలు.

ఇక కనుగుడ్లు (తారకలు) కాంతిమంతంగా (తరళము) ఉన్నాయి. శ్రేష్టమైన (సార) ఇంద్రనీల మణులతో (మసారము) సాటివచ్చేటట్టు (నిభ) ఉన్నాయి. తరళమైన మసార సారంతో నిభమైన తారకలు కలవి ఆ కన్నులు. తెల్ల తామర రేకుల్లాగా (సిత పద్మ పత్రాల లాగా) రమ్యమైనవి (బంధురములు) ఆ కన్నులు.
తోయము - నీరు. తోయజము - నీటినుంచి పుట్టినది - పద్మం. కోరకము - మొగ్గ. తోయజకోరకము - తామరమొగ్గ. రాధాదేవి అనే తోయజకోరకం - దాన్ని మేల్కొల్పడం (బోధన + క్రియా) వికసింపజెయ్యడం అనే పనికి శ్రీకృష్ణుని చూపులు సూర్యకాంతుల్లా పనిచేస్తాయిట. అంటే స్వామివారి చూపులు సోకగానే రాధిక హృదయం పద్మంలా వికసిస్తుంది.
అర్కుడు - సూర్యుడు. తరుణ తర + అర్కుడు - అప్పుడే ఉదయించిన బాల సూర్యుడు. ఆ కాంతులు ఎర్రగా (రుక్) ఉంటాయి. తరుణ తరార్కుని రుక్ + విలాసం తో ప్రస్ఫుటమైన రక్తిమతో (ఎర్రదనంతో) కూడిన కోణాలు ఉన్నయి ఆ కన్నులకి. నేత్రకోణాలలో (కన్నుకొసలు) ఉదయసూర్యుని రక్తిమ ఉంది. అటువంటి రక్తిమతో సక్తమైన కోణాలతో భాస్వరములవుతున్నయి (ప్రకాశిస్తున్నాయి) ఆ సోగకన్నులు. అవి అందాలొలుకుతుండగా (చెన్ను మీరగా) శ్రీకృష్ణపరమాత్ముడు వేంచేశాడు.
ఇంక ఇప్పుడు సర్వాంగీణంగా సమగ్రంగా స్వామిమూర్తిని మన మనోనేత్రం ముందు నిలుపుతున్నాడు.

దిగ్వాసుండురు పింఛలాంఛిత శిఖోదీర్ణుండు, వర్షాపయో
ముగ్వర్ణుండు, నవాంబుజాహిత లతాముక్తాంగదుండున్, సుధా
రుగ్విస్మేరముఖుం, డనంగ శతజిద్రూపాధికుం, డగ్రభూ
వాగ్వర్గోధ్భవభూమి, శ్రీవిభుడు, శ్రీవత్సాంక వక్షుండునై

దిక్ + వాసుడు - దిక్కులే వాసములుగా కలవాడు. అంటే దిగంబరుడు. మొలకి తీగలుచుట్టుకున్నాడే తప్ప పీతాంబరం కట్టుకోలేదు.
ఉరుపింఛలాంఛిత శిఖోదీర్ణుండు - పెద్దపింఛంతో చిహ్నమైన (లాంఛిత) శిఖతో ప్రకాశిస్తున్నవాడు.
వర్షా పయోముక్ + వర్ణుడు. వర్షాకాలం నాటి మేఘ వర్ణుడు (నీలమేఘశ్యాముడు).
నవాంబుజాహిత లతా ముక్తాంగదుండు. స్వామి ఒకరకం ఆకులతో భుజకీర్తులు (అంగదములు) కట్టుకున్నాడు. ఆముక్తము అంటే అలంకరించుకొనిన. అంబుజ + అహితుడు : పద్మాలకు శత్రువు - చంద్రుడు. నవమినాటి చంద్రలతలు - అర్దచంద్రాకారంగా ఉండే లతలు.
సుధా రుగ్విస్మేరముఖుడు : సుధా రుక్ అంటే అమృతకిరణుడు - చందమామ. అతన్ని పరిహసించే ముఖంకలవాడు - లేదా చందమామ వంటి విస్మేరంతో (చిరునవ్వుతో) విరాజిల్లే ముఖం కలవాడు అని కూడా చెప్పవచ్చు. నవ్వురాజిల్లెడు మోము వాడు - అన్నాడు ఫోతన.
అనంగ శతజిత్ + రూప + అధికుడు. వందమంది మన్మధుల్ని రూపంలో జయించగలిగిన వాడు.
అగ్రభూ+ వాగ్వర్గ + ఉధ్భవ భూమి. అగ్రభూ - అన్నిటికన్న మొదట పుట్టినది. అలాజన్మించిన వాక్-వర్గానికి - వేదాలకి - మాటలసమూహానికి ఇతడు ఉధ్భవుడు - జన్మస్థానం.
శ్రీవిభుడు - లక్ష్మీపతి.
శ్రీవత్సాంక వక్షుండునై - శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద కలవాడు.

అటువంటి శ్రీమహావిష్ణువు పుండరీకునికి దర్శనం అనుగ్రహించాడు.

అలా ప్రత్యక్షమైన స్వామిని ఆపాదమస్తకం చూడ గానే పుండరీకుని మనస్సు హర్షధారావిలం అయిపోయింది. హర్షం అనే వర్షధారలతో ఒక్క క్షణం వ్యాకులం (ఆవిలము) అయిపోయింది. పట్టరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. దానితో అతడు కృత్యవిమూఢుడయ్యాడు. కళ్ళు అప్పగించి చూస్తూ ఆ ఆనందంలో అలా స్థాణువులా ఉండిపోయాడు. లిఖించిన బొమ్మా? శిలాప్రతిమా? విస్మృతి (మరుపు) అనేది రూపం ధరించిందా ? అన్నట్టు చలన విదూరుడై బిగుసుకుపోయాడు పుండరీకుడు.

పరమాత్మ భక్తపరాధీనుడు, పరమ దయాళువు. తానై వచ్చి అనుగ్రహించడమేకాదు, సంభాషణ కూడా తానే మొదలుపెట్టాడు."నిచ్చలు నిచ్చలో బొదలు నీ పితృభక్తికి జ్ఞానశక్తికిన్
మెచ్చితి, నచ్చితిన్ గరము నీయెడ నీ యెడమేల? వేడుకొ
మ్మిచ్చెదన్ జెచ్చెరన్ వలయునీప్సితముల్ శతమేని, దీననే
పొచ్చెము నొచ్చెముం జొరదు భూసురకేసరి! నమ్ము" నావుడున్

"భూసురకేసరీ!" అన్న సంబోధనలోనే స్వామివారు ఇతని తపస్సుకి ఎంత ప్రసన్నులయ్యారో తెలుస్తోంది.
నిత్యమూ (నిచ్చలున్) నీ హృదయంలో (ఇచ్చలో) వృధ్ధి పొందే (పొదలే) నీ పితృభక్తికీ, జ్ఞానశక్తికీ మెచ్చుకున్నాను. ఇక ఆలస్యం ఎందుకు (ఈ ఎడ ఏల)? ఏంకావాలో కోరుకో! వెంటనే (చెచ్చెరన్) ఇచ్చేస్తాను. కావలసిన వరాలు (ఈప్సితాలు); శతమేని - అంటే లెక్కపెట్టి వంద అని కాదు, ఎన్నైనా. అలా కోరుకోవడం వల్ల తపోశక్తికి ఏమైనా భంగంకలుగుతుందనుకుంటున్నావేమో! అటువంటి ఇబ్బంది ఏదీ ఉండదు. దీనివల్ల (దీనన్) ఏన్యూనత (పొచ్చెమున్) ఏలోపమూ (నొచ్చెమున్) రాదు. నామాట నమ్ము! అని అభయం ఇచ్చాడు.

ఆప్పటికి పుండరీకుడిలో చలనం ఏర్పడింది. వెంటనే సాష్టాంగపడ్డాడు.

భస్మోధ్ధూళన పాండురాంగము - రమాప్రాణేశు పాదద్వయిన్
విస్మేరాంబుజగామి హంస మిదినాన్ వే వ్రాల్చుచున్, లేచి "దే
వాస్మాకం శరణం త్వమేవ, గతిరన్యానాస్తి, దుర్వాసనా
పస్మారం హర" యంచు బల్కి మఱియున్ భక్తుండు భక్తి స్పృహన్

విభూతి పులుముకోవడం (భస్మ ఉధ్ధూళన) వల్ల తెల్లగాఉన్న తన శరీరాన్ని (పాండుర + అంగము) పుండరీకుడు భక్తి తన్మయత్వంతో స్వామివారి పాదాలమీద వెంటనే వాల్చేశాడు. వికసించిన పద్మం (విస్మేర + అంబుజ) దగ్గఱకు పయనించే (గామి) హంసము ఇది అన్నట్టు (నాన్) సాష్టాంగపడ్డాడు.

మునీశ్వరుల్లొ హంసలు, పరమహంసలు అనేస్థాయిలున్నాయి. (ఉదా: రామకృష్ణ పరమహంస). పుండరీకుడు ఇప్పుడు హంస స్థితిని పొందాడన్నమాట.
దేవా, అస్మాకం = మాకు, త్వం ఏవ = నీవే, శరణం - దిక్కు. అన్యా = వేరొక, గతిః దిక్కు లేదా మార్గం, న+అస్థిః = లేదు. దుర్వాసనా = దుస్సంసార రూపమైన, అపస్మారం = అపస్మార రోగాన్ని (సంస్కార స్మృతి కోల్పోడం అనే రోగాన్ని) హర = తొలగించు.
ఆవేశం వచ్చినప్పుడు కొందరి భాష మారిపోతుంది. పుండరీకుడిది భక్త్యావేశం. హఠాత్తుగా దేముడు ప్రత్యక్షం అయ్యేసరికి ముందుగా స్తంభీకృతుడయ్యడు, తరువాత తాను అనుదినమూ చేసే పూజాపునస్కారాల్లోని భాష వచ్చేసిందనుకోవాలి.

అటుపైని పుండరీకుడు దశావతారవర్ణనలతో స్వామిని సుంతుష్టుణ్ణి చేసి - స్వామి అక్కడే వెలసేలా దివ్య వరం పొందాడు. స్వామిలో ఐక్యం అయ్యాడు.

నిగమశర్మోపాఖ్యానము.
ఈ నిగమశర్మోపాఖ్యాన్ని రామకృష్నుడు అత్యంత మనోహరంగా తీర్చి దిద్దాడు.
వేదాధ్యయన సంపన్న, శిష్టాచార పరాయణ నిత్యాగ్నిహోత్రులైన పరమోత్తమవంశంలో జనించి, పండితోత్తముడు, సకలజనులచేత, రాజుచేత గౌరవింపబడిన తండ్రి కడుపున పుట్టి, తాను స్వయంగా సకల శాస్త్రాలు, వేద-వేదాంగాలు అభ్యసించి కూడా చెడు సావాసాలు చేసి, భ్రష్టుడై, చోరుడై, జారుడై, విశ్వాసఘాతకుడై అన్ని విధాలా పతనమైఫొయిన పరమ నికృష్టుడు నిగమశర్మ. అంతటి పాపి కూడా పండరీపురంలో మరణించిన ఒక్క భాగ్యంచేత, దివ్య విమానం ఎక్కి వైకుంఠపురం చేరి "కుముదుడు" అనే పేరుతో శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడుగా ఉంటున్నాడట!

ఉహ్వని హోమాగ్ని యూఁద నొల్లఁడుగాని విరహజ్వరార్తితో వెచ్చనూర్చు
సంధ్యకుఁ బ్రార్థనాంజలి ఘటింపఁడుగాని యెరఁగు నీర్ష్యాకషాయితల కర్థి
నాగమవాదంబు లౌఁగాదనఁడుగాని విటవాదములు తీర్చు వేగిలేచి
కంబుభృత్పాదోదకంబు గ్రోలఁడుగాని యౌవతాధర శీధువాని చొక్కుఁ

బుణ్యచిహ్నంబు లపఘనంబున ఘటింప సిగ్గుపడుఁగాని కరనఖశిఖర లసిత
జాతనూత్నక్షతాంకముల్ సమ్మతించు, నారజము మీరి యా దుర్విహార హారి.

నిగమశర్మ హోమాగ్నిని ఊదడట; కానీ విరహమనే జ్వరం యొక్క బాధతో వెచ్చని నిట్టూర్పులూరుస్తాడట. సంధ్యావందనం చేయడట; కానీ ఈర్ష్యాకషాయితలకు (తాను ఇతర స్త్రీల సాంగత్యం చేస్తున్నట్లు తెలుసుకొని ఈర్ష్యతో కళ్ళెర్రచేసే తన ఉంపుడుగత్తెలకు) మాత్రం మక్కువతో (అర్థిన్) నమస్కరిస్తాడట (ఎరగున్). వేద చర్చలలో (ఆగమ వాదంబులన్) ఔను-కాదు అనడు - పాల్గొనడు; కాని పెందలకడనే లేచి (వేగిలేచి) విటవాదములను తీరుస్తాడట (గత రాత్రి విటులకు, విటీజనమునకు ఏర్పడిన కలహాలను తీరుస్తాడన్నమాట). (ప్రత్యేకించి ఇలాంటి కలహాలని తీర్చడానికి ప్రాచీనకాలంలో జారధర్మాసనాలుండేవని వినుకొండ వల్లభరాయని "క్రీఢాభిరామం" వలన తెలుస్తూంది. అవిలేని తావుల్లొ మన నిగమశర్మ లాటి వారే న్యాయమూర్తులు!)
కంబువు (శంఖము) కంబుభృత్పాదోదకంబు - శంఖధారి అయిన విష్ణువు యొక్క పాద తీర్థమును త్రాగడు (గ్రోలడు); కాని యువతీజనం యొక్క అధర (యౌవత అధర) శీధువు (చెఱకురసపు కల్లు) ఆని (త్రాగి) చొక్కున్ - పరవసిస్తాడు.

పుణ్యచిహ్నంబులు - తిరుమణి, తిరుచూర్ణములు మొదలైనవి, అపఘనంబునన్ - శరీరం మీద, ఘటింప (ధరించడానికి) సిగ్గుపడతాడు; కానీ కరనఖ శిఖర లసిత జాత నూత్న క్షతాంకముల - (వారకాంతలు) తమ చేతిగోళ్ళ వాడిమొనలచే చేసే కొత్త (నూత్నంగా, గతరాత్రి చేసిన) గుర్తులను ప్రదర్శించడానికి సమ్మతిస్తాడట. ఆరజము మీరి - ఇంపుమీరగా; ఆ దుర్విహార హారి - చెడునడతకు ఓడిన (తల ఒగ్గిన) ఆ నిగమశర్మ!


దినవెచ్చమునకునై తన మేనఁ గల సొమ్ము కొదుకక బచ్చింటఁ గుదువవైచు
నీఁదు గీచినరీతి నించుకించుక చేరి గిలుబాడుఁ దల్లిపైఁగల పసిండి
తండ్రికి నిడ్డ పత్రములు దొంగిలించిపోయి ఫొయినంతకు నిచ్చి పొరయుఁగొంత
మిండవడ్డికి నోర్చి మృత్యురూపములైన సాహులచే ఋణగ్రాహియగుచు

గుడ్డవృత్తులు, వృత్తులుఁ గొలుచు గుత్త, చేలు గ్రామాంశములు గాదినేలలెల్లఁ
జనవరుల కమ్మఁజూపు నిచ్ఛావిహార, వర్తి వాఁడేమి కానున్నవాఁడో మీఁద.

దినవెచ్చములకు - అంటే రోజువారీ తన చిల్లర ఖర్చుకు, తన ఒంటిమీదనున్న సొమ్ము - నగలను, ఏమాత్రం సందేహించక (కొదుకక) కోమటింట (బచ్చింట) తాకట్టు పెడతాడు. చేరి - మెల్లమెల్లగా తల్లిని) సమీపించి, కొంచెం కొంచెం గా (ఇంచుకించుక) ఈదు గీచిన రీతి (ఈత చెట్టును కల్లు కొరకు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం గీస్తారట) - ఆ విధంగా తల్లి ఒంటిమీద గల బంగారు నగలు, గిలుబాడు - అపహరిస్తాడు.
తండ్రికినిడ్డ - తండ్రికి ఇవ్వబడిన ; తండ్రి దగ్గర ఋణం తీసుకొని ఋణపత్రాలు వ్రాసి ఇచ్చినవారి యొక్క పత్రాలను దొంగిలించి వారివద్దకే తీసుకెళ్ళి వారి పత్రాలు వారికిచ్చేసి ప్రతిఫలంగా ఎంతోకొంత (వారు ఇచ్చినంత) వారినుండి పొరయునట (పొందునట).

ఇక అతనెలా ఋణగ్రస్తమైపోయాడో వివరిస్తున్నాడు.
మిండవడ్డికిన్ - అధిక వడ్డీకి, చక్రవడ్డీకి, ఓర్చి - అంగీకరించి, యములాళ్ళవంటి వడ్డీవ్యాపారులవద్ద అప్పులు చేసి; పూర్వీకులకి వృత్తి పరంగా (పౌరొహిత్యం, యజ్ఞయాగాదులు చెసినందుకు ప్రభువులు మెచ్చి ఇచ్చిన, ఇంకా దానంవల్ల లభించిన భూములు) కొలుచు గుత్త చేలు (కౌలుకిచ్చిన వాటి మీద వచ్చే ఆదాయం); గ్రామాంశములు (తన తండ్రికి భాగం ఉన్న గ్రామస్తుల ఉమ్మడి ఆస్తి) - గాదెలలో ఉన్న ధాన్యం - ఇలాటి ఆస్తులన్నిటినీ ఇచ్ఛా విహారానికి అలవాటుపడ్డ నిగమశర్మ చనవరులకు - చనువున్న పరిచితులకు - అమ్మేసే వాడట. ఏమి కానున్నాడో అతడు భవిష్యత్తులో మరి.

నిగమశర్మ అక్కగారు తమ్ముడు చెడుతిరుగుళ్ళు మరిగి పిత్రార్జితం అంతా తగలేస్తున్నాడని తెలిసి తమ్ముడికి బుద్ధి గరపి సన్మార్గంలో పెడదామని వచ్చింది.

ప్రారంభించిన వేదపాఠమునకున్ బ్రత్యూహమౌనంచునో
యేరా తమ్ముడ! నన్నుఁజూడఁ జనుదే వెన్నాళ్ళనో యుండి చ
క్షూరాజీవ యుగంబు వాఁచె నినుఁ గన్కోకున్కి , మీ బావయున్
నీరాకల్ మదిఁగోరుఁ జంద్రు పొడుపున్ నీరాకరంబుం బలెన్

ఏరా తమ్ముడా! అని పిల్వడం మన సంసారాల్లో ఉండే చనువుని తెలుపుతుంది. మొదలుపెట్టిన వేదపాఠాలకి విఘ్నం (ప్రత్యూహము) కలుగుతుందనా నువ్వు చాలా కాలంగా నన్ను చూడ్డానికి రాలేదు!? (వాడు భ్రష్టు పట్టిపోయాడన్న విషయం తనకి ఇంకా తెలియదని అతడనుకోవాలని). నిన్ను చూడక తామరపువ్వుల్లాంటి నా రెండు కళ్ళూ (చక్షూరజీవయుగంబు) వాచిపోయాయి. ఇక నీ బావగారు కూడా నీ రాక కోసం పున్నమి చంద్రుడి రాక కోసం సముద్రుడు వేచి యున్నట్టు, మదిలో చాలా వేచి చూశారు.
ఏరా తమ్ముడా - నీ కోసం చూసి చూసి కళ్ళు రెండూ వాచాయి - లాటి సామాన్య పదజాలంతో, చక్షూరాజీవయుగంబు; రాక అనే శ్లేష (రాక అంటే రెండర్థాలు; ఒకటి వచ్చుట, రెండు – పూర్ణిమ); సాహిత్య చమత్కారాలు చేశాడు కవి.

నాదు సహోదరుండు సుజనస్తవనీయ నయ ప్రసక్తి బ్ర
హ్మాదుల మెచ్చఁడే నతని యజ్ఞమునం గడుఁ బూజ్యురాలనై
వేదియలంకరింతునని వేవురిలోపల నాడుకొందు నీ
వేదియు లేక సర్వగుణహీనుఁడ వౌట యెఱుంగఁ దమ్ముడా!

ఇక బాహాటంగా మందలించడం మొదలుపెట్టింది. "నేనేమో నా తమ్ముడు సుజనులందరూ మెచ్చుకుంటూ ఉండగా యజ్ఞం చెసి తనని అగ్రస్థానంలో కూర్చోపెట్టి గౌరవిస్తాడని అక్కడ పలుమందికీ సగర్వంగా చెప్పుకుంటూ ఉంటే, నువ్విలాగ ఏమీ లేకుండా గుణహీనుడవౌతా వనుకోలేదురా తమ్ముడా" అని వాపోయింది.

అక్కగారు ఇంత బోధించినా తమ్ముడు పెడచెవిన పెట్టాడు. ఆవిడసొమ్ములతో సహా, ఇల్లంతా ఊడ్చి దోచుకొని ఉడాయించాడు. అతగాడు దొచుకుపోయిన వస్తువుల్ని ఈ చక్కటి పద్యంలో కవి చెబుతున్నాడు.

గోమేథికోపలాంకుర మానితంబులు పుష్యరాగచ్ఛటా పుంఖితములు
వైఢూర్య సంధాన వర్ణనీయంబులు హరినీల కీలనాభ్యంచితములు
కురవింద సందర్భ గురుతరంబులు చతుర్విధ వజ్రదళ సమావేల్లితములు
మహనీయ తర హరిన్మణి పరీతంబులు నకలుష స్థూల మౌక్తిక యుతములు

పద్మరాగ పరీరంభ భాస్వరములు, దంత విద్రుమకృత సముద్గక భృతములు
మాతృభూషలు నత్తికా మండనములు, నిజయువతి దాల్చు సొమ్ములన్నియు హరించి.
గోమేధిక ఉపల (మణుల యొక్క) అంకుర (మొలకలచే) మానితంబులు (కూర్చబడినవి); పుష్యరాగముల చ్ఛటా (గుంపులచేత) పుంఖితములు (పుంఖాను పుంఖలుగా చేయబడినవి); వైఢూర్యముల యొక్క సంధాన (కూర్పుచేత) వర్ణనీయంబులు (పొగడదగినవి); హరినీల (ఇంద్రనీలమణులయొక్క) కీలన (కూర్పుచేత) అభ్యంచితములు (ఒప్పిదమైనట్టివి); కురువింద మణుల; సందర్భ (కూర్పుచేత) గురుతరంబులు (గొప్పవైనట్టివి); రకరకాల వజ్ర దళ (రేకులతో) సమావేల్లితములు (బాగుగా ఆవరించిన ప్రకాశము కలవి); మహనీయతర (గొప్పవైన) హరిన్మణి (పచ్చలచే) పరీతంబులు (పొదగబడినవి); అకలుష (దోషము లేని) స్థూల మౌక్తిక (పెద్ద మంచి ముత్యాలతో; యుతములు (కూడినవి); పద్మరాగ మణులు, పరీరంభ (పొదుగుటచే) భాస్వరములు (వెలుగొందునట్టివి); దంతములతోనూ, విద్రుమ - పగడములతోనూ; కృత (చేయబడిన); సముద్గక (బరిణె లేక, మందసము - పెట్టెలో) భృతములు (ఉంచబడినవి); మాతృభూషలు (తల్లినగలు); అత్తికా మండనములు (అక్క నగలు); నిజ యువతి (తన భార్య) తాల్చు (ధరించు) సొమ్ములు - నగలు ; అన్నియూ అపహరించి -
ఒకనాటి రాత్రి పడుకునే పడకకు కూడా చెప్పకుండా గాఢ తమోనికరము (చిమ్మ చీకట్ల సముదాయమే) తన తోడుగా ఒక్కడే పేరడవిత్రోవ (కారడవి దారి)లో పరిగెత్తుకుంటూ వెళ్ళాడట.

అడవిలో దొంగలు ఇతగాడిని చావబాది, ప్రాణావశిష్టంగా వదిలి అతని సొమ్మంతా దోచుకుపోయారు. ఆ దారిని పోతున్న కాపు ఒకడు దయతలచి అతడ్ని రక్షించి తన ఇంటికి తీసుకువెళ్ళి వైద్యంచేయించి బ్రతికించాడమే కాకుండా సొంత కొడుకులా చూసుకొసాగాడు. ఈ కృతఘ్నుడు ఆ కాపు కోడల్ని లేవదీసుకు పోయి అడవిలో కాపురం పెట్టాడు. కొన్నాళ్ళకు ఆ కాపుస్త్రీ నిస్సంతుగా మరణించింది.

తదుపరి నిగమశర్మ వేరొకచోట రూపాజీవ (అందమే జీవనాధారంగా కలది - పడుపు వృత్తి చేసుకొనేది) అయిన ఒక ప్లవకన్యను (ఛండాలస్త్రీని) పెండ్లియాడాడట. ఆ భార్యద్వారా పిల్లల్ని కూడా కన్నాడట. అడవికి వెళ్ళి వెటాడి మృగాలని చంపి తెచ్చేవాడట. ఆమెతో కలిసి కల్లుకూడా సేవించేవాడట. ఆ ప్రకారం ఆమెతో సంసారం సాగించాడు.

ఒకనాడు అతడు యధాప్రకారం వేటాడి తిరిగి వెళ్ళేసరికి అతని ఇల్లంతా అగ్నికీలలచే ఆక్రమించబడి తగులబడి పోయింది. కల్లు మత్తులో ఉన్న అతని భార్యా పుత్రులు యావత్తూ ఆ మంటలకు ఆహుతి అయినారు.

ఈ కడజాతి నాతి కిహిహీ! మహిదేవుఁడు చిక్కెనంచు నన్
రాకకుఁ బోకకున్ జన పరంపర కెంపగు చూడ్కిఁ జూచి యం
బూకృతమాచరించుటకు బుద్ధి దలంకఁ గలంక ముక్త చం
ద్రాకృతిఁ బొల్చు నీ ముఖమునందమృత స్థితిఁ గాంచి మించుటన్

చనిపోయిన భార్యగురించి నిగమశర్మ దఃఖించిన పద్యం ఇది.
ఇహిహి అనడంలో వెక్కిరింత, నవ్వేవారి ఆక్షేపణ అంతా కనబడుతోంది. జనపరంపర - జన సమూహము. కెంపు అగు చూడ్కి - కెంపులా ఎర్రని చూపులతో - కోపానికి సూచన. అంబూకృతము - ఉమ్మి వేయుట. తలంకన్ - భయపడను. కలంక ముక్త చంద్రాకృతి - మచ్చ వదిలిపెట్టబడిన - మచ్చ లేని - చంద్రుని వలెనున్న నీ మొగమునందమృతముండుట చూచి. ఆ అమృతము అధరామృతము.

అలా దుఃఖించి, దుఃఖించి, నిర్భోజనుడై (భొజనము చేయనివడై) నిరంబుభజనుండునై (నీరుత్రాగనివాడైన) అ కుజనుండు (ఆ దురాత్ముడు) పుండరీ క్షేత్రాన్ని చేరుకున్నాడు.

మిక్కిలి పచేళిమమై (పరిపక్వమైనదై) తనను సమీపిస్తూన్న పూర్వ సంస్కార తపఃఫలము కారణంగా అతడు పాపసమూహములను నాశనం చేసేదైనట్టి సంగమ తీర్థంలో స్నానమాచరించి అక్కడ నరసిం హస్వామిని దర్శించుకున్నాడు.

ఇక నిగమశర్మ సారూప్య మోక్షం పొందే దశ సమీపిస్తూందట. సారూప్యమోక్షం అంటే భక్తుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు యొక్క రూపాన్ని పొందడమన్నమాట. ఎడతెగని ఉపవాసాలతో అతని చెవులు గడియలు (దిబ్బళ్ళు) పడ్డాయట. మేను వణికిందిట. కాలము గడవక అతడు వడిగా చెడి (ఆరోగ్యం క్షీణించి) పుడమిని పడి విగత జీవుడయ్యాడట.

అతి హీనమైన అతన్ని తీసుకెళ్ళడానికి నల్లగాఉన్న దండధరానుచరులు (యమభటులు) వచ్చారట. అదేసమయానికి విష్ణుదూతల సమూహం వచ్చి దివ్య విమానంపై కూర్చుడపెట్టి, విష్ణుసారూప్యం చెందిన నిగమశర్మను వైకుంఠపురానికి తీసుకువెళ్ళారట.

విష్ణుసారూప్యం చెందిన నిగమశర్మ మహద్భాగ్యాన్ని రామకృష్ణకవి ఈ అద్ధ్భుతమైన పద్యంలో వివరిస్తున్నాడు.

ఉత్తాల ఫణిభుగ్గరుత్తాల వృంతానిలాశాంత ఘర్మాంబు వయ్యె మేను
ప్రత్యుగ్ర ముక్తాతపత్త్రీ భవచ్చేష వారితా తపమయ్యె జారు మౌళి
సూత్రవతీశ దోర్వేత్ర దత్తావకాశామరంబయ్యెఁ గటాక్ష విహృతి
భృగు భరద్వాజ ప్రభృతి కృత స్వస్తి వాగ్భర ముఖరములయ్యెఁ బార్శ్వతలము
లరుణ కిరణ సహస్రాభమభ్రగంబు
నగు విమానంబుపై నెక్కి నిగమశర్మ
తీండ్రఁ బుణ్డ్రేక్షు కోదండ్రు తండ్రిఁ బోలి
పరమధామంబునకుఁ బోవు పథమునందు

ఫణి భుక్ - పాములను తినేవాడు - గరుత్మంతుడు. అతనియొక్క; ఉత్తాల - ఎత్తైన, ఉన్నతమైన, గొప్ప. గరుత్ - ఱెక్కలు (అనెడి) తాలవృంత – విసని కఱ్ఱలచేత; అశాంత - మిక్కిలి చల్లగా చేయబడిన చెమటబిందువులు కలది అయినది అతని శరీరము. అంటే గరుత్మంతుడు తన రెక్కలతో ఇతని ఒంటికి పట్టిన చెమట ఆరిపోయేలా విసిరాడట. ఆదిశేషుడు (ప్రత్యుగ్రుడు) తనపడగలను ముత్యాలగొడుగులా పట్టి ఇతనికి ఎండ తగలకుండా చేశాడట. సూత్రవతీదేవి భర్త అయిన విష్వక్సేనుడు (విష్ణువు యొక్క సేనాపతి) విచోపులిస్తున్నాడట. అంటే వింజామర వీస్తున్నాడు. అలా వీస్తున్నప్పుడు ఆ వింజామర కంటి చూపుకి అడ్డం వస్తోంది, తొలగుతోంది. ఆ తొలగినప్పుడల్లా తనని చూడ్డానికి వచ్చిన అసంఖ్యాకమైన దేవతలు కనుచూపుమేరకి (కటాక్షవిహృతి) కనబడుతున్నారట. భృగువు, భరద్వాజుడు మొదలైన సప్తఋషులు ఇరుపక్కలా నిలబడి స్వస్తివచనాలు పలుకుతున్నారట.

అలా వారందరూ సేవిస్తూఉండగా వేయి సూర్యుల కాంతితో ప్రకాశించే దివ్య విమానాన్ని ఎక్కి, నిగమశర్మ చెరకువింటివాని (మన్మథుడి) తండ్రిని (విష్ణుమూర్తిని) పోలి - అనగా విష్ణు సారూప్యం చెంది - దివ్యధామమునకు - పరమపథానికి - వెళ్ళాడట. "పుణ్డ్రేక్షు" అంటే ఎరుపు-నలుపు రంగుకలిగిన కణుపులు ఉన్న చెఱకు, దాన్ని విల్లుగా కలవాడు (కోదండు) మన్మధుడు. అతని తండ్రి అంటే విష్ణువు. అంటే విష్ణు స్వారూప్యం చెందిన నిగమశర్మ పరమధామమునకు చేరుకున్నాడు.

"ఉత్తాల" "గరుత్తాల" అన్న పదాలు రెండూ ప్రాసయతి చెల్లించుకొని యమకముతో కూడి ఆ యమకము "గరుత్ + తాలవృంత" అన్న పద విభాగంతో కూడిన కూర్పు యొక్క చమత్కారం చేత దిగ్భ్రమ కలిగిస్తోంది. ఇది సారూప్య సాలోక్యములోనిది. ఇలా యమకము చేయడం మాత్రం అన్యులకు సాధ్యం కాదు. ఎన్నో చోట్ల రామకృష్ణకవీంద్రుడు చేసిన సమాసాలచేత, ఇలాటి కూర్పులచేత ఆయనతో ఈ విద్యలో పోల్చదగినవాడు దరిదాపుల్లో ఎవరూ లేరని పండితుల ఉవాచ.

తెలుగు భాషని సుసంపన్నం చేసిన మహానుభావుల్లో మహాకవి తెనాలి రామకృష్ణుడు ఒకడని నిస్సందేహంగా, నిర్ద్వందంగా చెప్పవచ్చును.

ఆయుత - నియుతల కథలోనుంచి మచ్చుకి రెండు పద్యాలు చూద్దాము.
వాసోనిగ్రమెన్నరాఁకలియు నీర్వట్టున్ గణింపర్తలల్
మాసెంగా యన రంగముల్ బడలినన్ బాటింపరట్టుండనీ
యా సాయంబుగ నానిశాత్యయముగా నామ్నాయముల్ గ్రోల్చుచో
నాసీన ప్రచలాయితంబయిన లీదాహా వితర్కింపగన్
అగస్త్యమహర్షికి ఇద్దరు శిష్యులున్నారు. వారి పేర్లు: ఆయుతుడు, నియుతుడు. వాళ్ళు వేదాభ్యాసం ఎలా చేసేవారో చెబుతున్నాడు.
వాసస్ అంటే గుడ్డ. వాళ్ళు వేదాలు (ఆమ్నాయంబులు) అధ్యయనం చేసేటప్పుడు లేదా వల్లె వేసేటప్పుడు (గ్రోల్చుచోన్) వాళ్ళకి వొంటిమీద బట్టలు ఎలా వున్నాయో అనే ధ్యాస ఉండేది కాదట - అసలు ఉన్నాయా లేవా అనే స్పృహే ఉండేది కాదు; ఆకలియు, దప్పికయు (నీర్వట్టున్) లెక్క చేసేవారు కారట; జుత్తు బాగా పెరిగిపోయింది (తలల్ మాసెంగా) అనుకోరు - జడలు కట్టేస్తూన్న సరే ; అవయవాలు హూనం అయిపోయినా - అదే పనిగా కూర్చూడం వల్ల - పట్టించుకొనేవారు కారట; ఇవన్నీ అలా ఉండనీ - ఉదయం కూర్చుంటే సాయంకాలం అయ్యేవరకూ (ఆసాయంబుగన్) (ఆబాలగోపాలం, అసేతుహిమాచలం లాగ ఆసాయంబుగన్ అన్నాడు); రాత్రి కూర్చుంటే ఉదయం అయ్యేవరకు (ఆ + నిశః + అత్యయంబుగన్) కనీసం కూర్చుని కునుకిపాట్లు పడడం అనేది కూడా లేదే (అసీన ప్రచలాయితంబు అయినన్ లెదే) అహా చూడగా (వితర్కింపగన్). అంత శ్రద్ధగా చదువుకొనేవారట ఆ ఆయుత నియుతులు.

హుంకారములు లేవె యుప పురందర హఠోత్పాటనంబునకుఁ బాల్పడవుఁ గాక
భ్రూభంగములు లేవె యాభీల వింధ్య గర్వస్తంభనమునకు రావుఁగాక
చులుకాకృతులు లేవె జలరాశి నిశ్శేష శోషణకుఁ జొరవు గాక
జాఠరాగ్నులు లేవె జటితాపి వాతాపి తనుదాహమున నెదుర్కొనవు గాక


నిష్ట నీ మాడ్కి లోక ప్రతిష్ఠ గుఱిఁచి
దుష్టనిగ్రహ శిష్ట సంతుష్టి హేతు
రోషభీషణ రేఖా నిరూఢ గాఢ
లీలఁ గ్రీడించు ప్రోడలు లేరుఁ గాక !

అగస్త్యుడు ఆయుత-నియుతులకోసం తగిన వధువుల్ని కుదర్చడంకోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడి వద్దకే వెళ్ళాడు. బ్రహ్మ అగస్త్యుడికి అగ్రాసనమిచ్చి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆసందర్భంలోనిది ఈ పద్యం.

లోకంలో ఎందరు హుంకరించడం లేదు? అవన్నీ ఇంద్రుడంతటివాణ్ణి పదవీత్యుతుణ్ణి చేసి హఠాత్తుగా క్రింద పడేలా చేస్తాయా? (నూఱు యజ్ఞాలు చేసిన నహుషుడు ఇంద్రపదవిలో ఉండగా శచీదేవిని మోహించి, తదుపరి మహర్షులని అవమానించిన సందర్భంలో అగస్త్యుడు హుంకరించగా - శపించగా - కొండచిలువ అయి భూలోకంలో వచ్చి పడ్డాడు).

చుళుకాకృతి అంటే పుడిసిలి పట్టడం - అంటే అరచేతిలోపట్టేటంతటి జలాన్ని స్వీకరించడం. లోకంలో ఎందరు పుడిసిళ్ళు పట్టడంలేదు? అవన్నీ అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నాయా? (సముద్రంలో దాక్కొన్న కాలకేయులనే రాక్షసుల్ని బయటపడేయడం కోసం, అగస్త్యుడు సప్తసముద్రజలాలన్నిట్నీ పుక్కిట పుడిసిలి పట్టాడని ఐతిహాస్యం).
అందరికీ ఆకలేస్తుంది, కానీ అందరూ అగస్త్యుడిలా వాతాపి లాటి మహా మంత్రశక్తులుకలిగిన రాక్షసుణ్ణి తిని హరాయించుకోగలుగుతారా?
ఇవన్నీ పేర్కొంటూ బ్రహ్మ అగస్త్యుడిని పొగుడుతున్నాడు. "మిత్రావరుణ కుమారా, ఓ అగస్త్యా! ఇలా నీవలె లోకకళ్యాణంకోసం దుష్ట శిక్షణ, శిష్ట సంతుష్టి కోరి రోషభీషణమైన పద్దతిలో క్రీడించే ప్రోడలు - ఇలాటి మహత్కార్యాల్ని క్రీడప్రాయంగా చేయగలిగే నేర్పరులు - లేరు గాక లేరు!

తెనాలిరామకృష్ణ మహాకవి గురించి ఆయన రచించిన కొన్ని ఆణిముత్యాల్లాటి పద్యాల్నీ, కవితా చమత్కారాల్ని మరికొంత మంది తెలుగు భాషాభిమానులతో పంచుకోవడమే ఈ చిరుప్రయత్నం.

"పాండురంగమాహత్మ్యం" అవతారికలో ఆయన ఇలా వ్రాసుకున్నాడు.

నను రామకృష్ణకవి గవి
జన సహకారావళీ వసంతోత్సవ సూ
క్తి నిధి బిలిపించి యర్థా
సనమున గూర్చుండ బనిచి చతురత ననియెన్
"కవులున్ బాఠకులున్ బ్రధానులు అలంకారజ్ఞులున్, ప్రాజ్ఞులున్" కొలువై ఉండగా నిండుసభలో విరూరి వేదాద్రి మంత్రి రామకృష్ణకవిని సగౌరవంగా పిలిపించి అర్థాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ సందర్భంగా "కవిజన సహకారావళీ వసంతోత్సవ సూక్తినిధిని నేను" అని సగర్వంగా చెప్పుకున్నాడు రామకృష్ణుడు. కవిజనులు అనే మామిడితోపునకు వసంతోత్సవం కల్పించే సూక్తులకు నేను నిధిని అన్నాడు.

"సూక్తినిధి" అనే సమాసం నన్నయ్య తరవాత మళ్ళీ ఇక్కడే యథాతథంగా కనిపిస్తుంది. పాఠకహృదయాల్నే కాదు, కవిహృదయాల్ని కూడా ఆనందపరిచి చిగురింపచేసే సూక్తులకు నిధి ఆయన. సూక్తులు అంటే నీతి వాక్యాలు కావు. అలంకారమహితమైన ఉక్తులు. నన్నయ్యదగ్గరా ఇదే అర్థం. పరిపూర్ణ కవితామయోక్తులకు తాను నిధి కనుక కవి జనుల్ని పులకింప జెయ్యగలను అని ధీమాగా ప్రకటించాడు తెనాలి రామకృష్ణుదు. ఆయన కవులకు కవి. కవీనాం కవిః

==:: సమాప్తి ::==

ఓం సర్వేజనాస్సుఖినోభవంతుః

కృతజ్ఞతాభివందనములు

పద్యపఠనం అనే జుంటితేనియ మాధుర్యాన్ని నాకు పరిచయంచేసిన :

- కవిసమ్రాట్ విశ్వనాథ వారికీ (వారి “సాహిత్య సురభి” ద్వారా),

- ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారికీ (తమ “పద్యకవితాపరిచయం” ద్వారా)

- “తెనాలి రామకృష్ణకవి - శాస్త్రీయ పరిశీలన” అనే మహద్గ్రంధాన్ని రచించిన మాననీయులు
శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారికీ -

భక్తిప్రపత్తులతో కృతజ్ఞతాభివందనములు.

 
 
 

పేరు - బాలాంత్రపు వేంకట రమణ

పుట్టిన ఊరు: బాలాంత్రం, రామచంద్రాపురం దగ్గఱ, తూ.గో.జిల్లా.

పెరిగినది: కాకినాడ లో

స్థిరపడినది: హైదరాబాదు లో

ప్రస్తుతం: సానా, యెమెన్ (మధ్య ప్రాచ్య దేశం) లో ఉద్యోగం.

సహధర్మచారిణి : శారద.

మాతృదేవత: లక్ష్మీ నరసమ్మ

పితృ దేవులు: బాలాంత్రపు సూర్యనారాయణ రావు గారు.

ఆస్వాదించే అభిరుచులు: కర్ణాటక సంగీతం వినడం. ప్రాచీన తెలుగు సాహిత్యం చదవడం.

మార్చ్ 2012 లో హ్యూస్టన్ నగరంలో తెలుగు సదస్సు కి ప్రత్యేక అతిథిగా, పత్నీ సమేతంగా, పాల్గొనే అదృష్టం కలిగింది.

అప్పుడే డల్లాస్ లో- నెల నేలా వెన్నెల- కార్యక్రమంలో కూడా భాగం పంచుకొనే భాగ్యం కలిగింది.


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech