Sujanaranjani
           
  శీర్షికలు  
  పద్యం - హృద్యం
 

  నిర్వహణ : తల్లాప్రగడ రావు     

 

"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు జులై 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము


ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ  మాసం సమస్యలు 

 ఆ.వె.|| ఓటు యన్న అదొక ఓటమి సుమి!

వర్ణన : గరుత్మంతుని వేగాన్ని వర్ణించండి  (స్వేచ్ఛావృత్తంలో)

క్రితమాసం సమస్యలు  

తే.గీ.|| జైలులకు కూడ తాహత్తు చాలదోయి!

దత్తపది: "అభిమానము, అవమానము, అసమానము, కొలమానము" అన్న పదాలు వాడుతూ నేటి సామాజికపరిస్థితులను వర్ణించండి (స్వేచ్ఛావృత్తంలో)

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి. 

మొదటి పూరణ - గండికోట  విశ్వనాధం హైదరాబాద్,   

తే.గీ. || "పంట భూములు లాక్కొని గెంట లేదు

అస్మదీయుల పెంపుకై అమ్మ లేదు

దొంగ కంపెనీ ఖాతాల బెంగ లేదు

గనుల దోచి దాచగ ధన కాంక్ష లేదు

చెడు జి. . లపై చేవ్రాలు చేయ లేదు

చిక్కు లెక్క జిమ్మిక్కుల చిక్క లేదు

తీరు మారని యువనేత తెల్వి లేదు

తారగా రాస లీలల తిరుగ లేదు

మద్య ముడుపుల అవినీతి మచ్చ లేదు

స్కాములందు పేరొంద యే స్కీము లేదు

గళము విప్పిన నిగళాల కేళి అయిన"

జైలులకు కూడ తాహత్తు చాల దోయి.

 

. పాలకులందునన్ దురభిమానము వర్ధిల భ్రష్ట దుష్ట  దు

ష్పాలన నిర్ణయంబు లసమానము దుర్భర దుస్సహంబులై

పాలిత రైతుజాతి కవమానము గూర్చెను వారి భూములన్

పాలసులౌచు దోచ కొలమానము లేని విధాన సాధనన్

              ( పాలసులౌచు=దుర్జనులౌచు )        
 

రెండవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం          

తే.గీ.|| నేరము చేయువారిని చోరతతిని

చక్కదిద్ద విదింతురు జైలు శిక్ష

సంఘవిద్రోహులను నేడు సంస్కరింప

జైలులకు కూడ తాహత్తు చాలదోయి

 

ఉ. మంచి పెంచునట్టి అభిమానము మానవులందు మృగ్యమై

మంచిన చేయబోయి అవమాన పాల కుందుచుండగ ఈ

మంచి దినాలు వచ్చి అసమానము లెల్లెడ తొలగకున్న ఏ

మంచు వచింప నౌను కొలమానము నేటి సమాజమందునన్

 

మూడవ పూరణ - -యం.వి.సి. రావు, బెంగళూరు

 సీ//అసమానమంతట  నధిక మౌటనుకదా -

 యన్యోన్య వైరంబు లధికమాయె

కులప్రాతి పదికలె కొలమానమైకదా

 యవకాశములు పోయె నర్హులకును

అర్థ సంపాదనే యన్ని తానైకదా

 యభిమాన మడుగంటె నాత్మలందు

అవమానములు పొంది యబల లేడ్వగగదా

మానవత్వంబులు మంట గలిసె

ఆ.వె//యిట్టి కర్మభూమి యిక మాకు వలదంచు

విసుగు జెందినారు విజ్ఞులంత

ధర్మ స్థాపన జేసి దరిజేర్చు ప్రాజ్ఞండు 

యవతరించు కొరకు నాశపడరె

 

తే. గీ.|| గనులరాబడి కొందరు గాలి కొదల

సెజ్జు  మ్రింగిరి కొందరు సేవయనగ

చేష్ట లుడిగిన దొంగలు చెరను జేర

జైలులకుకూడ తాహత్తు చాలదోయి.

 

నాల్గవ పూరణ- నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ 

 తే .గీ .|| కోట్లు కానుక  లీయగ కొండ నెక్కి

దైవ దర్శన నెపమున దాచి దోచి

భక్తి మీరగ  కొలువగ ముక్తి కొఱకు

జైలులకు కూడ తాహత్తు చాల దోయి  !

 

కం.|| అభిమానమె కొలమానము

అభిమత మేలేదు   జనుల నభి నందించన్ !

ఆభియోగ పుటవమానము

నభమును దాటించు యశము నస మానముగన్ ! 

ఐదవ పూరణ- డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా

సీ.|| మంచిపాలననివ్వ మనచేత ఎన్నికై - అవినీతి మరిగిన అధమనేత

అవినీతి నేతలకనువగు జీవోలు - కల్పించి ఇచ్చెడు కార్యదర్శి

కష్టడీ ముద్దాయి కాసులకాసించి - బెయిలిచ్చి విడిపించు 'పీడ జడ్జి

సెజ్జు పేరిట మంచి సేద్యపు భూమినే - బెదిరించి దోచెడు పెద్దరౌడి 

 

తే. మంత్రు లధికార్ల వ్యాపార్ల మాయగాండ్ల

దారిదోపిడి-నల్లబజారు పీడ

అణచి శిక్షింప బూనిన ఆధునికపు

జైలులకు కూడ తాహత్తు చాలదోయి

 

ఆరవ పూరణ - ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నయి 

 

తే.గీ.|| దేశ మ౦దవినీతి అ౦దలము నెక్కె,

కోర్టు ల౦దు కోకొల్లల కేసులయ్యె!

తీర్పులన్ని సమయమున తేల్చి నపుడు,

జైలులకు కూడ తాహత్తు చాలదోయి!

 

తే.గీ.|| కాసుతో అభిమానము కలిసి యు౦డు,

ధర్మమునకవమానము ద౦డిగు౦డు,

చేవ అసమానమై యు౦డి, చేయ లేడు,

మ౦చి యను కొలమానము, మాయ మయ్యె!   

ఏడవ పూరణ-  రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా

 

తే.గీ.||స్పెషలు నేతలకుండేటి సెల్సు వేరు!

పుణ్యమూర్తులకిచ్చేటి పోక వేరు!

బీద బిక్కిని మాత్రము బాదనేల?

జైలులకు కూడ తాహత్తు చాలదోయి ! 

ఎనిమిదవ పూరణ - పోచంపల్లి  ఉమ

కవిత|| కాటిక క౦టితో, కాస౦త బొట్టుతో స్త్రీల కా౦చ కలిగెనొకనాడు అభిమానము

ఆ అ౦దచ౦దాలు క౦టికానక నేడు కలిగెనొకి౦త వారి కవమానము

వేషభూషలతోడ కళాశాలకు బోవ తలతురా అతివను అసమానము

బిగుతు వలువల తోడ బిరబిరా తిరిగిన పరిగణి౦తురు నేడు కొలమానము 

తొమ్మిదవ పూరణ - సుబ్రమణ్యం  బత్తల, రోచెస్టర్ హిల్స్ , మిచిగన్

కవిత|| రాజకీయ మందు    రాణించ  వలెనన్న

మానాభి  మానముల  మాట  మరచి

అవమానముల  కేనాడు  ఆగ్రహించ కను 

పదవి  నున్న  వారి  పాదాల  నంటి

అవసరమ్మును  బట్టి  అసమాన  దీక్షతో

కొలుచు  నట్టి  గుణమె  కొలమానమై  నిలచు

పాఠకులనుంచీ మరిన్ని మంచి పద్యాలు

కాలనాధభట్టవీరభద్రశాస్త్రి, విజయవాడ  (శ్రీకృష్ణతత్వం (అనురక్తి))

అష్ట భార్యలు, పదహారువేల సతులు

ఇంతమందితోడ యెట్లు శౌరి

మెలగుచుండెననుచు కలిగె సందేహము

నారదముని దాని నరయగోరె

ద్వారకనగరాన నారదముని, కోట

నంత తిరిగి తిరిగి వింతనొందె

ఎటకుబోయిచూడ అటవాసుదేవుడు

సరసమాడుచుండె సతిని గూడి

వక్కచోట నతడు వయ్యారి భామతో

ముచ్చటించుచుండె మురియుచుండె

ఇంకొకదరి మరొక యింతి పాటలు పాడ

తన్మయత్వమొంది తాండవించె

ఇట్లు నారదుండు ఎందెందు చూచిన

అందుకృష్ణుడమిత హావ భావ

చేష్టల నలరించె చేడియల నమిత

ప్రేమతోడ వారు ప్రీతిజెంద

అతడనంతుడరయ  ఆనంద రూపుడు

జగతి ప్రేమమూర్తి సర్వులకును,

భక్త జనుల హృది నివాసుడు, వెయ్యేల

ప్రకృతి అణువణువున బరగువాడు

(స్వీయవిరచిత నిర్వచనభాగవత ఆటవెలది పద్యగాధావళినుండి సేకరణ)

వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం (వాగ్గేయకారులు  శారదామాతకు సమర్పించిన ఆభరణములు)

జడ అల్లి జడకుచ్చు జయదేవుడమరింప - తీర్థ నారాయణ తీర్థమిడియె

వజ్రంపు ముక్కెర వరపురదరుడియ - రయ్నహారములు క్షేత్రయ్య ఒసగె

పట్టుచీరను ముత్తుస్వామి అర్పింప జ- ల్తారు రైకనొసంగ అన్నమయ్య

రత్న కిరీటము రామదాస్ ఒసగ ము-త్యాల హారములిచ్చే శ్యామశాస్త్రి

తే,గీ.|| రత్న సింహాసనము త్యాగరాజు కూర్ప - స్వర్ణకంకణములు నిచ్చె స్వాతి ప్రభువు

స్వరభూషణాలంకృత శారదాంబ - ఇలను సంగీత వాణియై వెలయు గాక! 

ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం.(శివ తాండవం)- భుజంగప్రయాత వృత్తమాలిక:

భుజంగంబులే హారముల్ భూతసంఘం  

బు జంగంబులున్ పంచ భూతంబులున్ పై

తృజాలంబులున్ నాట్యబృందంబులై శై

లజార్ధంబుతో  నీవు  లంఘింపగా

ర్ధజైవాత్రకుం డాడ ధింధిక్క ధింధి

క్క జాళ్వాల మద్దెళ్ళు కంపింపగన్ వి

ష్ణుజా ధారలన్ ధాత్రి శోబిల్ల; జేజే

లజుండున్ ఘనశ్యామలాంగుండు సప్త

ర్షి జంభారి సంఘంబు సేవింప నంద

శు జోహారు భృంగీశు స్తోత్రంబు స్కంధే

శు జేజేలు విఘ్నేశు శుండాల సౌస్వ

ర్య జాత్యంపు  ఘీంకార మాకాశ సీమం

దు జృంభింప సంసార దుఃఖఘ్న! శ్రీశై

జామాత! నీ నాట్య లాస్యంబు శ్రీశై

లజా మాత క్రీగంట లక్షించుచో  అం

గజానంద  శృంగార కంజాక్షి యయ్యెన్;

ప్రజాక్షేమ మోదంబు  ప్రాప్తించె - భూమా

  జంజాటముల్ మాన్పి ధర్తింపుమో దే

! జోబిళ్ళు సేతున్! శివా! కృత్తివాసా!  

అజస్రంబు నీ నామ మానంద కందం

బు  జన్మంబు ధన్యంబు పూర్ణంబు  గాగా

సజావై మనో నేత్ర సంయోగమౌ  

ట్లు జోజో వరంబిమ్ము లోకేశ! ఈశా!

అజేయా! మహేశా! మహా దేవ దేవా!

 

స్రగ్విణీ గర్భిత భుజంగప్రయాత వృత్తం:

నమో దేవ దేవా! ఘనా దీనబంధూ!

మమున్ కావ రావా! సమగ్ర ప్రభావా!

తమిశ్రా వినాశా! సదా శాంతి దాతా!

సమజ్ఞా వదాన్యా! అసాధ్య ప్రదానా

( ఖండిక రచయిత విరచిత "రసస్రువు" కావ్యము లోనిది.)

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
  

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech