Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  అంతర్జాలంలో ఆంగ్ల చేప
 

రచన:  కూచిభొట్ల శాంతి

 
 

వారంతా .. భాషాహితులు
అందుకే..అక్షరం పొల్లు పోయినా అర్ధం మారిపోతుందని
అక్షరాలా వల్లెవేయించేవారు
భాష స్పష్టత కోసం చెవుల్లో ఇళ్ళుకట్టిపోరేవారు
ముద్రారాక్షసాలని సహించని నిరంకుశత్వంతో ఉండేవారు.
అక్షర లక్షలతో, గండపెండేరాలతో సత్కరింపబడి
భాషా సుసంపన్న యుగంలో మైలురాళ్ళుగా
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

క్రమేణా..
సాహితీ సాగరానికి వలస వచ్చిన ‘ఆంగ్లచేప’
పరాన్న భుక్కులాగా (పేరాసైట్), బంగారు తీగలాగ (చెట్లు)
‘దొరతనం’తో మెల్లిమెల్లిగా మొత్తంగా ఆక్రమించుకుంది
నిగూఢంగా నిక్షిప్తమైన భాషావ్యామోహం ‘దిశ’ను మార్చి
పరభాషా వ్యామోహం ‘దశ’ మార్చింది.

వీరంతా..పరభాషాహితులు
అందుకే అక్షరం పొల్లుపోనీయకుండా నేర్చేసుకుని
స్పెల్లింగుల పేరుతో వల్లెవేస్తూ కొమ్ముకాచారు
అర్ధంతరంగా ‘ఆంగ్లచేప’ని అందలం ఎక్కించి
అర్ధరహితంగా బానిసలై, అస్తిత్వం కోల్పోయి
త్రిశంకు స్వర్గానికి నిచ్చన మెట్లుగా
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

కాని..ఇప్పుడు
అక్షరం కంటే పెన్నీ (penny) లకీ, అణాపైసలకీ విలువనిచ్చి
భాషకంటే భావానికీ, భావంకంటే బద్ధకానికీ పెద్దపీట వేసి
భాషని మధించి, వేధించి భావాన్ని కుదించి,
ప్రజా సౌకర్యార్ధం
దుష్టసమాసాలతో భ్రష్టభాషా వైభోగానికి పీఠం వేసి
కొత్త కొత్త కోడ్ (code) లలో పదాలు సృష్టించి
దుష్ట భాషా విజ్ఞానానికి పట్టం కట్టి కొమ్ముకాస్తున్నారు
భాషా వైభవానికి తుప్పు పట్టించిన యుగంలో
మైలు రాళ్ళుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు
అందుకే వీరంతా భాషాహతులు

అంతర్జాలంలో చాటింగ్ (chating) టెక్ట్సింగ్ (texting)
ఎరలకి చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ
చిక్కి శల్యమవుతున్నది ఆంగ్లచేప
e భాషా విజ్ఞానం నేర్పిస్తున్న
‘భాషాహత బ్రహ్మ’లకు ఆనాటి వారంతా (భాషాహితులు)
బావురుమంటూ నమస్కరిస్తున్నారు.

కానీ...
అపుడూ, ఇపుడూ కష్టపడి క్లిష్టసమాసాలనే ఉపయోగిస్తున్నారు
ఇప్పుడు దీన్ని మాత్రం ‘భాషా విధ్వంసం అని పిలుస్తున్నారు అంతే (తేడా)!!


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 





సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech