Sujanaranjani
           
  కథా భారతి  
 

కథా విహారం

మధ్యతరగతి కన్నీటి లిపి - వి.రాజారామమోహనరావు కథలు

 

                                                                           రచన : విహారి

 

వి.రాజారామమోహనరావు కథ చిరిగిన తెరచాప - వరద కథతో కథాప్రియుల్ని అలరించి, కథావిమర్శకులకి నచ్చి, కథాప్రపంచంలో తనకొక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వి.రాజారామమోహనరావు ఎన్నో మంచి కథల్ని రాశారు. పదిహేను,పదహారు బహుమతులూ గెల్చుకున్నారు. కొన్నికథలు ఇతర భాషల్లోకి అనువాదము అయినాయి.

రాజారామమోహనరావు కథల్లో చాలా మంచి కథ చిరిగిన తెరచాప. నిడివి దృష్ట్యా చిన్న కథ ఇది.

సమాజజీవనంలో ఉన్న వైవిధ్యం, సహజంగా కథా వస్తు వైవిధ్యంలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా మధ్య తరగతి జీవితాల బాధావ్యధలూ మంచి కథలుగా రూపుదాల్చాయి. ఈ కోవలోని కథ చిరిగిన తెరచాప.

సత్యం ఒక మధ్యతరగతి గుమస్తా. అతని జీతం రోజు కథ యిది. పేడే అంటే వర్రీడే! చేతిలో పడే నాలుగురాళ్ళకీ నలభై రకాల ఖర్చులు ఎదురు చూస్తూనే ఉంటాయి.

ఇంటికి వచ్చి భార్య తెచ్చిన సరకుల లిస్టు చూశాడు సత్యం చిరాకు, విసుగు, అసహనం, కోపం, చాతకానితనం అన్నీ తన్నుకొస్తాయి. కరువైపోతున్న జీవితావసరాల మీద. కర్రపెట్టెలమీద... నోట్లు లెక్కపెట్టె వేళ్ళమీద... వడ్డీల తోడేళ్ళ మీద, బొర్రబొజ్జలమీద... తెల్లకాగితం పాములమీద.. చివరికి తన బతుకు మీద... అక్కసు!

బతుకు పీలికలన్నీ కగలసి, వాటంతటవే అతుక్కుపోయి కళ్ళముందు తెల్లటి తెరచాపలా కదుల్తున్నట్టయింది సత్యానికి. రాత్రులు గుడ్డివెలుగులో పడుకున్న తన పక్కనుంచీ తెరచాపలా లేచి నిలబడే భార్య జానకి గుర్తుకొచ్చింది.

మూడు నెలల్నించి భార్య అడుగుతున్నది అస్తమానం గుర్తుకొస్తునే ఉంది. కాని దాన్ని ఈనెలా తీర్చలేకపోయాడు. ఆమె అడుగుతున్నది చవకలో వచ్చే ఒక చిన్న లోపావడా. ఇప్పుడు ఉన్న రెండూ చిరిగిపోయి ఇబ్బంది పెడుతున్నై. అదీ అవస్థ.

పోనీ లెండి. ఏం చేస్తాం. పైనెల యిద్దురు గాని. మరీ అంత సర్ధుకోలేనిది కాదుగా! అంది. సత్యం తన్ అసమర్థతకి తాను చాలా సిగ్గుపడుతున్నాడు. భర్త అసహాయతని అర్థం చేసుకున్న ఆమెకీ మనస్సు చివుక్కుమంది.

ఇద్దరికీ బాధగా వుంది. ఓదార్పు కావాలనుకుంది.
ఇద్దరూ దగ్గరగా చేరారు. తాత్కాలికంగా తమ భాధను మరచిపోయారు. ఇదీకథ.

సత్యం, అతని భార్య జానకి - వీరిద్దరి అంతస్తత్వం చాలా శుచిగా ఇలా ఆవిష్కరించగలగటం ఎంతో రచనా నైశిత్యం వున్న రచయితకి గానీ సాధ్యం కాదు. అసలు కథావస్తువునే ఏమాత్రం ఏమఱుపాటు వహించినా ’ఏ’ సర్టిఫికెట్ స్టోరిగా తయారై ప్రమాదంలో పడే అవకాశం ఉన్న అంశం. కథని చాలా వొడుపూ, వాటంతో కూర్చుకొచ్చారు రచయిత. భార్యభర్తల నవ్వే కళ్ళనీ, ఏడ్చే పెదవులనీ ఫోటో తీసి చూపకుండానే వారి అనుభవ చైతన్యాన్ని పాఠకుడు అందుకోగలిగేటట్లు సంఘటనల్ని కూర్చుకొచ్చారు. ఇదీ కథాశిల్పం అంటే!

బతుకులోని భయంకర నిజాలకి ప్రతినిధిలా కనబడుతోంది లైటు చుట్టూ ఉన్న చీకటి చల్లగా, మంచు తడసిన పువ్వుల్లా ఉన్నట్టనిపించింది.

మనసులో ఏదో తెలియని యిరుకు... యిబ్బంది.... వంటి వాక్యాలతో తనదైన శైలి, నైపుణ్యంతో కథనానికి వొక నిండుతనం సమకూర్చారు రచయిత.

సామాజిక భాద్యతలో భాగంగా తాను మంచి కథలు రాస్తూ, ఆ కథల ద్వారా పాఠకుడికి ఓర్పునీ, నేర్పునీ, నేర్పించే శక్తిమంతమైన కలం రాజారామమోహనరావుది. కథావస్తువు. శైలీ, శిల్పం అన్నీ అందంగా అమరిన గొప్ప కథ ’చిరిగిన తెరచాప’. మద్యతరగతి బతుక్కి ధ్వని మంతమైన శీర్షిక!


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech