Sujanaranjani
           
  కథా భారతి  
  జీవన వేదం
 

రచన : గన్నవరపు నరసింహమూర్తి      

 

"ఇల్లు అద్దెకు ఇవ్వబడును " అన్న బోర్డు చూసి ఆ ఇంటి ముందు నేను భాను ఆగేము. ఇప్పటికి వారం రోజుల నుంచి  ఇద్దరం ఇంటివేటలో ఎన్నో ఇళ్ళు చూసాము. కానీ  ఏ ఇల్లు కుడా మాకు నచ్చలేదు . కొన్ని బాగున్నా లొకాలిటి బాగాలేక వద్దనుకున్నాము. నాకు ఈ వూరి  హై స్కూల్లో  సైన్సు అసిస్టెంట్ గా క్రితం నెలలో పోస్టింగొచ్చింది. అంతకు మునుపు నేను బి. ఈడి. పూర్తికాగానే  ఒక ప్రైవేటు స్చూల్లో టీచర్ గా పని చేసే వాణ్ని.అప్పుడు అక్కడే టీచర్ గా పనిచేస్తున్న భానుతో పరిచయమయి పెళ్లి చేసుకున్నాను. ఆ తరువాత నేను డి. ఎస్సి  లో సెలెక్ట్ అయి ఈ ఊర్లో పోస్టింగ్ రావడంతో ఇక్కడకు వచ్చి జాయిన్ అయ్యాను. భాను కూడా ఆ టీచర్  ఉద్యోగానికి రాజీనామా చేసి నాతో పాటు వచ్చేసింది. మొదట్లో ఇల్లు దొరక్క భానుని వాళ్ళ పుట్టింటికి పంపించాను. పదిహేను రోజుల తరువాత ఒక చిన్న ఇల్లు దొరికితే అందులో సామాన్లు దించి భానుని తీసుకు వచ్చాను. ఎందుకో భానుకి ఆ ఇల్లు నచ్చలేదు. దానికి కారణం అది చిన్న ఇల్లు కావడం. అప్పుడప్పుడు మా అమ్మ వచ్చి రెండేసి నెలలు  ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఇబ్బంది ఎదురౌతుందని ఆమె ఆలోచన. అందుకే  ఈ ఇళ్ళ వేట. 

వారం రోజుల నుంచి ఇద్దరం కళ్ళకు బలపాలు కట్టుకు తిరుగు తున్న ఒక్క మంచి ఇల్లు కూడా కనిపించటం లేదు. గేటు ముందున్న కాలింగ్ బెల్ నొక్కగానే లోపలి నుంచి ఓ ఏ భై ఏళ్ళ వయసున్న ఒకావిడ బయటకు వచ్చి "చెప్పండి ఏమి కావాలి "  అని అడిగింది.
"మేడం ఇల్లు ఖాళీగా వుందని విన్నాం.  అందుకే వచ్చాం" అన్నాను. 
"మేడ  మీద పోర్షను  ఖాళీగానే వుంది  రండి చూద్దురు గాని" అంటూ గేటు తలుపులు తీస్తూ "ఏమండోయ్ ఇంకా పేపర్ చదవడం పూర్తి కాలేదా ఇల్లు చూడటానికి ఎవరో వచ్చారు ఇటు రండి " అంటూ లోపలికి ప్రవేశించింది.  ఆమె మాటలకూ వరండాలో వాలుకూర్చులో కూర్చుని పేపరు పటనంలో మునిగి పోయిన ఆ వ్యక్తి ఒక్క ఉదుటన లేచి "అబ్బే ఎప్పుడో చదివీసేనోయ్ " అంటూ బయటకు వచ్చాడు. చూడటానికి అతను అరవై ఏళ్ళ వ్యక్తి లా ఉన్నా ముఖంలో  హుషారు కనిపిస్తోంది. అతనికి నేను నమస్కారం పెట్టి "నాపేరు భరద్వాజ ఈ మధ్యనే ఇక్కడి హై స్చూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాను. ఈమె నా శ్రీమతి భాను . ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి ఇలా వచ్చాము" అన్నాను. 

నమస్కారం.. మీరు టీచరే నన్న  మాట. రండి ఇల్లు చూద్దురుగని అంటూ మమ్మల్ని మేడ  మీదకు తీసికెళ్ళాడు. ఏ  తలుపులకీ తాళాలు లేకపోవడంతో ఒక్కక్కటి తీస్తూ అన్ని గదులూ చూపించాడు. ఇల్లు విశాలంగా బాగానే ఉంది. రెండు బెడ్ రూములు, హాలు, కిచెన్, దూరంగా టాయిలెట్ ,పక్కనే వాష్ బేసిన్. ముఖ్యంగా ఆ ఇల్లు భాను కి బాగా నచ్చింది. ఇల్లు చూసిన తరువాత కిందకు వచ్చాము. నేను కింద ఉన్న కుర్చీలో కూర్చుంటే భాను ఆవిడతో కలసి లోపలికి వెళ్ళింది. ఇంతలో అతను కుడా వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ "ఇప్పుడు చెప్పండి. ఏ  వూరు మీది?ఎంతమంది   ఉంటారు? " అని అడిగాడు .

మాది ఇక్కడికి నలభయ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరు. మా నాన్న గారు కూడా అక్కడే టీచరుగా  పని చేసి రిటైయ్యి క్రితం సంవత్సరమే అనారోగ్యం తో చనిపోయారు. ఇప్పుడక్కడ మా అమ్మ ఒంటరిగా ఉంటోంది. నేనొక్కడినే కొడుకు కా వడంతో అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ వుంటుంది . మా పెళ్లి క్రితం సంవత్సరమే అయ్యింది. ఇంకా మాకు పిల్లలు లేరు. ప్రస్తుతానికి మేమిద్దరమే ఉంటాం. అన్నాను.

అమ్మగారు వొంటరిగా వుంటున్నారు  అన్నారు, మరి ఆవిడని మీ దగ్గరికే తీసుకువస్తే మంచిది కదా,  ఇంతకీ మా గురించీ చెప్పలేదు కదూ,  నా పేరు వెంకట్రామయ్య , నేను కుడా మీరు పని చేస్తున్న హైస్కూల్లోనే తెలుగు మాస్టారిగా పని చేసి రెండేళ్ళ క్రితం పదవీ విరమణ చేశాను. మా ఇద్దరు  పిల్లలు   అమెరికాలో ఉంటున్నారు, కొడుకు న్యూయార్క్ లోను ,పిల్ల న్యు జెర్సీలో ఏంటో  పిల్లలున్నా  మాది ఒంటరి బ్రతుకే ....అందుకే మీ అమ్మని మీదగ్గరికి  తెచ్చుకోమంటున్నాను.. క్రితం సంవత్సరం దాక పిల్లలొచ్చినప్పుడు ఇబ్బందనీ ఈ ఇంటిని అద్దేకివ్వలేదు. కానీ  ఈ వయసులో ఎదైనా అవసరం పడితే పనికొస్తారని క్రితం సంవత్సరం నుంచే అద్దె కిస్తున్నాము. మీ లాంటి టీచరే మొన్నటి దాక ఆ పోర్షన్ లో అద్దె కుండేవారు. అతగాడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీ చేసివేళ్ళిపోయారు అంటూ చెప్పాడాయన. 

     ఇంతలో భాను ఇంట్లోనుంచి ఇంటావిడితో కలసి బయటకు వచ్చింది.   నేను వెంటనే కుర్చీలోంచి లేస్తూ మాస్టారు  మీ ఇల్లు మాకు నచ్చింది. అద్దె ఎంతో చెబితే ఈ వారం లోనే మేము దిగిపోతాము  అన్నాను.

అద్దె పెద్ద సమస్య కాదులే బాబు, పాత వాళ్ళు  పదిహేనువందలిచ్చేవారు మీరు అంతే ఇవ్వండి, మాకు డబ్బు ముఖ్యం కాదు, ఓ మంచి కుటుంబం మంచి మనుషులు మాకు కావాలి. అంతే. మీ కిష్టం అయితే మంచి ముహూర్తం  చూసుకొని దిగండి అన్నాడాయన .

ఆ తరువాత మరో పది నిముషాలు పిచ్చా పాటి  మాట్లాడి నేను భాను ఇంటికి తిరిగోచ్చాము
.
  అనుకున్నట్లుగానే నాలుగు రోజుల తరువాత ఆ ఇంట్లోకి మారిపోయాము.

   ***                         

ప్రుత్యూషపు  వేళ.  దేవుడి గదిలోంచి గంటల శబ్దం చెవులకి సోకడంతో ఒక్కసారిగా నాకు తెలివొచ్చింది. అప్పటికే భాను లేచి స్నాన పానాదులు ముగించి దేవుని పూజలో మునిగిపోయివుంది. మా పెళ్లి అయిన దగ్గర్నుంచి ఆమెకది అలవాటు. ఎప్పుడు నాలుగు గంటలకే లేచిపోతుంది. మడిగా  స్నానం చేసి పూజాదులు ముగిసిన తరువాతే మిగతా పనులు. అందువల్ల నాక్కూడా త్వరగా లేవడం అలవాటు. కళ్ళు నులుపు కొని లేచి కాలకృత్యాలు తీర్చుకొని మార్నింగ్ వాక్ కి బయలుదేరాను. అప్పటికింకా చీకటి తెరలు తొలగలేదు. 

హేమంతం కావడంతో తెల్లటి మంచు విపరీతంగా కురుస్తోంది. నేను బయటకు వచ్చే సరికి ఇంటావిడ అన్నపూర్ణమ్మ గారు ఇంటిముందర ముగ్గులేస్తోంది. దూరంగా ఆలయం లోంచి ఎమ్మెస్  సుబ్బలక్ష్మి భజగోవిందం మంద్రంగా వీనులకు సోకుతు ఆ ప్రభాత సమయానికి ఒక పవిత్రతని ఆపాదించ  సాగింది. నేను ఆ ముగ్గును దాటుకుంటూ  బయటపడ్డాను . రెండు కిలోమీటర్లు నడిచి వెనక్కి వస్తుంటే దార్లో వెంకట రామయ్య గారు కనపడ్డారు.

ఏమయ్యా నీకు వాకింగ్ అలవాటా? అన్నారు.
అవును మాస్టారు, నాకు చిన్నప్పట్నుంచి  వాకింగ్ అంటే ఇష్టం అన్నాను.
చాలా మంచి అలవాటు, ఎలా వుంది స్కూలు? ఇంతకీ ఈ ఉరు నచ్చిందా?
స్కూలు, ఊరు రెండు  బాగున్నాయి మాస్టారు అది సరే   ..మీ పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారా?"
ప్రతీ సంవత్సరం వస్తామనే వెళ్ళేటప్పుడు చెప్పారు. కానీ అలా జరగటం లేదు, అబ్బాయి సుధాకర్ వెళ్లి నాలుగేళ్ళు కావస్తున్న ఇప్పటిదాకా రాలేదు, ఇకపోతే అమ్మాయి పెళ్ళికి ముందు మా అల్లుడు రవి అసలు అమెరికా వెళ్ళే ఆలోచనే లేదని చెప్పాడు, కానీ   ఆరు నెలల తరువాత అక్కడేదో మంచి ఉద్యోగం వచ్చిందనీ, రెండేళ్ళు పనిచేస్తే బోలెడు డబ్బు సంపాదిన్చావచ్చ  నీ చెప్పి అమ్మాయిని కుడా తనతో తీసుకుపోయాడు. కానీ వాళ్ళు వెళ్లి మూడేళ్ళు దాటిపోయింది, వాళ్ళు కుడా ఇప్పటిదాకా రాలేదు పక్కనే ఉన్న పార్క్ లోకి నడుస్తూ చెప్పాడాయన.

తూర్పు సంజ సింధూర వర్ణం తో వెలుగు రేకల్ని ప్రసరించడానికి ఆయత్తమవుతోంది. అప్పటికే పార్కు అంతా మార్నింగ్ వాకర్స్ తో కళకళ లాడుతోంది.మేమిద్దరం ఒక మూలగా ఉన్న గన్నేరు చెట్టు కింద బెంచి మీద కూర్చున్నాం  .    

మాస్టారు , ఈ వయసులో ఇద్దరు పిల్లలు మీకు దూరంగా ఉండటం బాగా ఇబ్బందే, పోనీ మీ అబ్బాయిని అయినా త్వరగా రమ్మని చెప్పండి. మీక్కొంచెం వెసులుబాటు అవుతుంది. నువ్వు చెప్పింది నిజమే భరద్వాజా, కానీ అమెరికా కి వెళ్ళడం అన్నది పద్మవ్యూహంలోకి ప్రవేశించడం లాంటిది, ఒక్కసారి వెళ్ళినవారు అంత త్వరగా  వెనక్కి రాలేరు, అక్కడి సమస్యలు అటువంటివి, పోనీ రాకపోతే లేదు కనీసం ఉత్తరాలు గానీ ,ఫోన్లో మాట్లాడటం గాని చెయ్యరు. . వేలమైళ్ళ   దూరంలో వృద్ధులు  అయిన తల్లితండ్రులు ఉన్నారని, వాళ్ళకీ వయసులో తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తు తుంటాయన్న ఆలోచన కుడా వాళ్లకి రాకపోవడం ఆశ్చర్యం. ఎప్పుడైనా మేము మాట్లాడటమే తప్ప వాళ్లకి వాళ్ళు మా సమాచారం తెలుసుకోరు. ఇద్దరికిద్దరూ అంతే, అదే మా బాధ. నేను పదవీ విరమణ చేసినప్పుడు ఇద్దరు వస్తామన్నారు, కానీ ఇద్దరు రాలేదు, ఆ రోజు మాత్రం చాలా బాధ వేసింది." అతని మాటల్లో వేదన ధ్వనిస్తోంది. 

మీరేమీ ఈ విషయాన్ని తలచుకొని బాధ పడొద్దు మాస్టారు! ఏమైనా సమస్యలొస్తే మేమంతా లేమా చెప్పండి. ...
పదండి మాస్టారు ఇప్పటికే సమయం బాగా మించి పోయింది.. అంటూ నేను లేవడంతో ఆయన కుడా లేచి నన్ను అనుసరించేరు.

ఆ రోజు నుంచి మా రెండు కుటుంబాల మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. రోజు నేను కూరగాయలకు మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా వాళ్లకి కుడా తెచ్చేవాడిని.  అలాగే రోజు పాలపేకెట్టుకి తెల్లవారి లేచి మాస్టారు గారు వెళ్ళేవారు. నేను ఎలాగు మా పాలకోసం వేల్లవలసిరావడంతో  వాళ్లకి కుడా నేనే తెచ్చేవాడిని. మొదట్లో ఆ దంపతులు కొద్దిగా  మొహమాట పడినా నేను గట్టిగా చెప్పడంతో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవేగాక మాస్టారు గారికి సెల్ ఫోనులో ఎన్నో సమస్యలు వచ్చేవి. అతనికి అందులో అడ్రస్ లు   సేవ్ చెయ్యడం, చార్జింగు ఎప్పుడు ఆపు చెయ్యాలోనన్న విషయం, అలారం పెట్టడం లాంటివి తెలిసేవి కావు, అందుకోసం రోజు నన్ను గాని, భాను ని  గానిపిలిచి సెల్లిచ్చి  వాటిని సెట్ చేయమనేవాళ్ళు.

 అలాగే భానుకి ఇంటావిడ అన్నపూర్ణమ్మ గారితో బాగా స్నేహం కుదిరింది. ఇద్దరు తెల్లవారే లేచి స్నానాలు చేయడం, పూజలనంతరం గుమ్మం ముందు కలిసే ముగ్గులు పెట్టేవారు, ఆ తరువాత ప్రతీ శనివారం దగ్గరలోని వెంకటేశ్వరుడి గుడికి వెళ్ళేవారు. ఇక మేము ఇంట్లో దిగిన వెంటనే వచ్చిన కార్తీకమాసం వాళ్ళ బంధాన్ని మరింత బాల పడేటట్లు చేసింది. తెల్లవారి స్నానాలు ,కార్తీక సోమవారాల్లో ఉపవాసాలు, కార్తీకపురాన పటనం   ఉదయం పూట శివాలయంలో అభిషేకాలు  ...ఇలా వాళ్ళిద్దరికీ క్షణం తీరిక ఉండేది కాదు. అప్పుడప్పుడు నేను, మాస్టారుగారు కలిసి మాఇంట్లో నే భోజనాలు చేసే వాళ్ళం.

ఇలా మా అద్దింటి జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో చిన్న అపశ్రుతి మాస్టారి గారి భార్య బాత్ రూం లో జారిపోవడం అనే సంఘటన ద్వారా దొర్లింది. అదృష్టవశాత్తు తలకయితే దెబ్బ తగల్లేదు గాని కాలు మాత్రం విరిగిపోయింది. హాస్పిటల్ కి తీసికేల్తే కట్టు కట్టి రెండు నెలలు విశ్రాంతి అవసరం అని చెప్పారు డాక్టర్లు. 

ఆ రోజు సాయంత్రం స్కూలు నుంచి రాగానే మాస్టారి దగ్గరికి వెళ్లి అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకున్నాను. అప్పటికే భాను ఆ విడ దగ్గరే ఉంది. ఆ మధ్యాహ్నం భానే వాళ్ళకి మా ఇంట్లోనే వంట వండి తీసుకెళ్ళింది. ముందుగా మాస్టారుగారు మొహమాతపడినా భాను బలవంతం మీద ఒప్పుకున్నారు,  నన్ను చూడగానే మాష్టారు చాలా సంతోశించేరు. నిజంగా మీ దంపతుల సాయం మరచిపోలేమ య్యా, మీరే గానీ లేకపోతే ఈ సమయంలో చాలా ఇబ్బందులు పడే వాళ్ళం. అన్నారాయన.

ఇటువంటి సమయాల్లో ఎవరైనా సహాయం చేస్తారు. అది సరే అమ్మగారికి జరిగిన ప్రమాదం గురించి పిల్లలకు చెప్పారా? కుర్చీలో కూర్చుంటూ అడిగాను.
ఉదయం నుంచీ ఇద్దరకి నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తోంది. అయినా ఇప్పుడు వాళ్లకి రాత్రేమో.రాత్రి మళ్ళీ ట్రై చేస్తాను అన్నాడాయన .
ఓ పని చెయ్యండి.వాళ్ళ నంబర్లు చెప్పండి, నా సెల్లు ద్వారా ట్రై చేస్తాను అనగానే ఆయన పక్కనే ఉన్న చిన్న పుస్తకం తీసి చెప్పాడు. వెంటనే ఆ నంబర్లకి  నేను రింగ్ చెయ్యగానే వాళ్ళ అబ్బాయి  లయిన్లోకి వచ్చాడు.

సుధాకర్ గారు నా పేరు భరద్వాజ నేను ఇండియా  నుంచి మాట్లాడుతున్నాను మీ ఇంట్లో అద్దెకుంటున్నాను నేను. ఈ రోజు ఉదయం మీ అమ్మగారు బాత్ రూంలో పడిపోయారు. మిగతా విషయాలు మీ నాన్నగారితో మాట్లాడండి అంటూ ఆయనకే ఫోను ఇచ్చాను. ఆయన ఫోన్ అందుకొని సుధా నేనురా మీ నాన్నని అవును  మీ అమ్మకే బాత్రూం లో స్నానం చేస్తూ పడిపోయింది.... కాలుకి ఫ్రాక్చర్  అయింది....  కట్టు కట్టారు రెండు నెలలు మంచం దిగకూడదు అన్నారు. మిమ్మల్ని చూడాలంటోందిరా  మీరిద్దరూ వస్తే బాగుంటుంది.  ఈ వయసులో మీరు మా గురించి పట్టించు కోకపోవడం చాలా ఘోరం రా ఈ విషయం చెల్లికి కుడా చెప్పు....ఏంటి సెలవు దొరకదా సరే నీ ఇష్టం వుంటాను అంటూ ఫోన్ కట్ చేసి నాకిచ్చారు.

నేను చెప్ప లేదయ్యా  వాళ్ళు రారనీ శలవులు దొరకవట అవసరం అయితే డబ్బులు పంపుతారట. డబ్బులు ఎందుకయ్యా మాకు అదృష్ట వశాత్తు నాకు పదవీ విరమణ తరువాత పదిహేను లక్షలు వచ్చాయి. పది వేలు పెన్షన్ వస్తోంది కానీ ఈ వయసులో డబ్బు కన్నా పిల్లల ప్రేమ ముఖ్యం మాకు.. వాళ్ళిద్దరూ సంవత్స రానికి ఒక్కసారి వచ్చినా  తృప్తి గా వుంటుంది మాకు లేకపోతె పిల్లలు ఎందుకు చెప్పు? మనం మానవులం.  పశు పక్ష్యాదులం కాము. తల్లి తండ్రుల్ని మరిచిపోవడానికి. కానీ మా వాళ్ళకీ బందాలేవీ అర్ధం కావడం లేదు ఏమి చేస్తాం మా ఖర్మ. అన్నాడాయన విచారంగా .అతను ఆ ఆ మాటలు చెబుతుంటే అతని కళ్ళల్లో సన్నటి తడిని గమనించాను. కొద్ది సేపటి తరువాత మళ్ళీ అతనే చెప్పడం మొదలు పెట్టాడు.

అసలు విషయం నీకు చేప్పలేదయ్య,  మా అబ్బాయి సుధాకర్ అమెరికా వెళ్ళిన సంవత్సరానికి తనతో పాటే వుద్యోగం చేస్తున్న ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్ళాడాడు. ఆ తరువాత మేము పెళ్లి సంబందాలు చూస్తున్నామని చెబితే ఇక తప్పక ఆ విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని విన్న వాళ్ళ అమ్మ రెండు సంవత్సరాలు మనిషి కాలేదు. వాడి సంగతి అలా ఉంచితే అమ్మాయిది ఇంకో సమస్య దానికి మేమే పెళ్లి చేసినా అక్కడికి వెళ్ళిన తరువాత ఇద్దరు గొడవలు పడి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అది ఇంకో అమెరికన్ని పెళ్లి చేసుకుందిట. ఆ విషయం మా వాడి ద్వారా ఈ మధ్యనే మాకు  మాకు తెలిసింది.  అందుకే వాళ్ళిద్దరూ ఇక్కడికి రారు వాళ్లకు ముఖం చెల్లదు. ఎందఱో విద్యార్దులను తీర్చిదిద్దిన నేను మా పిల్లల విషయంలో మాత్రం అపజయం చెందానని చెప్పొచ్చు. ఎం చేస్తాం ఇది మా ప్రారభ్డం అన్నాడాయన.

మాస్టారు అది మీ అపజయం కాదు. ఒక విధంగా సమాజం అలా తయారయింది, అమెరికా చదువులు, ఉద్యోగాలు అంటూ నేటి యువత ఆశల ఎండమావుల వెంట పరిగెడుతోంది. ఇప్పటి యువతరం గమ్యం అమెరికా, డబ్బులు సంపాదించడం. వీళ్ళకి తల్లితండ్రులు, మానవ సంబంధాలు ముఖ్యం కావు. ఎప్పుడు అయితే  మనిషికి డబ్బు మొదటి ప్రాధాన్యం అవుతుందో అప్పుడు మృగంలా మారతాడు.. అంటూ ఆయన్ని ఓదార్చి ఇంటి లోపలి వెళ్లాను. ఆతరువాత అన్నపూర్ణమ్మ గారిని పరామర్శించి నేను భాను ఇంటికి తిరిగి వచ్చేసాము.

    *****  

అన్నపూర్ణమ్మ గారికి ప్రమాదం జరిగి రెండు నెలలు దాటిపోయాయి.ఇప్పుడిప్పుడే ఆమె కోలుకొనీ తన పనులు తాను చేసు కుంటోంది. భాను కుడా ఆమెకి అన్ని పనుల్లో సహాయం చేస్తుండటంతో వాళ్లకి పెద్దగా సమస్యలు రాలేదు.

వాళ్ళు  భావించినట్లు పిల్లలు మాత్రం రాలేదు.  ఈ లోగా వేసవి శలవులు రావడంతో మా వూరు వెళ్లి అమ్మ ని తీసుకొచ్చాను. వేసవి శలవుల్లో ఆమెని కాశీకి తీసికేళ్ళాలని నా ఆలోచన.తనని కాశీ  తీసికెళ్ళమనీ అమ్మ చాలా రోజుల నుంచీ పోరు పెడుతున్నా  నేనే తీరిక లేక ఆ ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఆ విషయం మాస్టారితో చెబితే తాము కుడా వస్తామని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను.వెంటనే మా అయిదుగురికి రిజర్వేషన్ చేయించి వారం రోజుల తరువాత కాశీకి   బయలు దేరాము.

మేము వెళ్ళేరైలు  తెల్లవారి అయిదు గంటలకు. దగ్గరలోని విజయనగరంలో రైల్ ఎక్కాము. అలసట లేకుండా ఉంటుందనీ ఏసీలో రిజర్వేషన్ చేయించాను .ఉదయానికి ఇడ్లీలు,మధ్యాహ్నానికి పులిహోర చేసి పట్టుకుంది భాను. ఎప్పుడు లేనిది వెంకట్రామయ్య గారి దంపతుల ముఖాల్లో ఆనందాన్ని గమనించాను నేను. మర్నాడు సాయంత్రం మేము కాశీకి చేరుకున్నాము. కాశీలో దిగగానే టాక్సీ తీసుకొని ఆంధ్రా సమాజం వారు నడుపుతున్న సత్రానికి బయలుదేరాము.ఆ రోజు పూర్తిగా  విశ్రాంతి తీసుకొని తెల్లవారు తుండగా గంగా నదికి బయలుదేరాము. గ్రీష్మం కావడంతో అక్కడి వాతావరణం వేడిగా వున్నా ప్రత్యూష సమయం కాబట్టి గంగా తీరం చల్లటి గాలులతో ప్రశాంతంగా ఉండటంతో తృప్తిగా గంగలో స్నానం చేసాము . మాస్టారు గారయితే  చిన్నపిల్లాడిలా మొలలోతు నీళ్ళలోకి వెళ్లి గంటసేపు స్నానం చేసారు. భాను, అన్నపూర్ణమ్మగారు మా అమ్మ చేత ఆ పవిత్ర గంగలో స్నానం చేయించేరు.. ఆ తరువాత అందరం కలిసి కాశీ విశ్వనాధున్ని విశాలాక్షిని దర్శించుకోవడానికి ఆలయానికి బయలుదేరాము.

ఆలయంలో ఘంటికలు విరామం లేకుండా మ్రోగుతున్నాయి. దూరంగా ఎక్కడినుంచో లింగాష్టకం మృదు మధురంగా వినిపిస్తూ వీనులకు విందు చేస్తోంది. బ్రహ్మ మురారి సురార్చిత లింగం,
నిర్మల భాసిత శోభిత లింగం" అలా ఆ లింగాష్టకం వినిపిస్తుంటే నేను కుడా నా పెదవులతో దాన్ని ఉచ్చరిస్తూ విశ్వనాధ, విశాలాక్షి లను మనస్పూర్తిగా దర్శనం చేసుకున్నాము. ఆ తరువాత మేమందరం కలిసి అభిషేకం చేయించాము.    

దర్సనానంతరం పడవలో గంగానది మధ్యకి వెళ్లి పిత్రు తర్పణాలు కావించాము.మాస్టారు దంపతులు, మా అమ్మ చేత తమస్వపిండాలను పవిత్ర గంగలో విడిచి పెట్టినాము. అలా తర్పణం చేస్తే వంశానికి మంచిదని పురాణాలు చెబుతున్నాయని మాస్టారు గారు చెప్పారు.


ఆ సమయంలో నాకో సందేహం వచ్చి మాస్టారు కాశీకి  వచ్చి నప్పుడు తమ కిష్టమయిన  వస్తువుని గంగలో విసర్జిస్తే మంచిదనీ, కాకపోతే దాన్ని తరువాత త్యజించాలనీ మా నాన్న గారు చెబుతుండేవారు. ఇది నిజమేనా?" అని అడిగాను.

 "నిజమేనయ్య, మనం దేని మీద ఎక్కువగా మక్కువ చూపిస్తే దానికి బానిసలమై అవి లేనిదే మనం బ్రతకలేనంతబలహీనతకు లోనవుతాము. దానిని అధిగమించడానికే ఈ గంగలో త్యజించడం అని పురాణాల్లో చెప్పబడ్డాయి. ఒక విధంగా ఇది మన మనో నిబ్బరానికి పరీక్ష, అది సరే ఇంతకీ నువ్వు, కోడలు ఏమిటి విసర్జించదలిచారు? అన్నాడాయన ఒడ్డుమీడకు వస్తూ.

అప్పుడు నేను నవ్వుతు నాకు బెండకాయలు బాగా ఇష్టం. అందుకే వాటిని వదిలేడ్డామనుకున్తున్నాను. అంటూ సంచిలో తెచ్చిన బెండకాయల్ని గంగలో విడిచాను. పురోహితుడు మంత్రాలు చదువుతూ వాటిని గంగలో విడిచి పెట్టించాడు. అలాగే భాను కుడా పొట్లకాయలు విడిచి పెట్టింది.
   
ఆ తరువాత మాస్టారు దంపతులతో మీరే వస్తువులను గంగలో విసర్జిన్చాలనుకున్తున్నారు ? అని అడిగాను.

నా ప్రశ్న  వినగానే మాస్టారి గారి ముఖం గంభీరంగా మారిపోయింది. అన్నపూర్ణమ్మగారి కయితే కంట నీరు ప్రత్యక్ష మైనది. కొద్ది క్షణాల మౌనం తరువాత ఆయన చెప్పడం మొదలు పెట్టాడు.

మా ఇద్దరి పిల్లల్ని మేము కంటికి రెప్పల్లా పెంచాము. వాళ్ళ తోడే జీవితమనీ నమ్మాము. వాళ్ళు జీవితాంతం మాకు తోడుగా ఉంటారనీ త్రికరణ శుద్ధిగా నమ్మాము. కానీ అతి సర్వత్ర వర్జియేత్.

..ఆ ప్రేమ ఎక్కువయ్యి ఇప్పుడు చేదుగా అనిపిస్తోంది. వాళ్ళు మమ్మల్ని బాగా మోసం చేసారు. అందుకే అంతగా ఇష్టపడ్డ మా పిల్లల మీద ప్రేమను, మమకారాన్ని ఈ పవిత్ర గంగలో ఈ సుప్రభాత సమయంలో విసర్జిస్తున్నాము. ఒక విధంగా మేము ఈ కాశీకి వచ్చింది ఈ తర్పణ చేయడానికే, ఈ రోజు నుంచీ ఆ ప్రేమ, మమకారాలు మాకు అక్కర్లేదు అంటూ ఇద్దరూ పురోహితుడు మంత్రాలు చదువుతుంటే ఆ గంగా జలాన్ని దోసిళ్ళతో తీసుకొని కళ్ళు మూసుకుంటూ గంగలో విసర్జించారు.

పిదప ఆ దంపతులిద్దరూ గంభీర వదనాలతో దూరంగా వెళ్ళిపోయారు.
వాళ్ళని చూస్తూ నేను, భాను నిశ్చేష్టుల మయ్యాము.


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech