Sujanaranjani
           
  కథా భారతి  
   

తొలి పొద్దు.          

 

                                                               రచన:   కోసూరి ఉమాభారతి

 

భర్త నిరాదరణ సహించలేక, గడప దాట నిశ్చయించిన ఓ నిస్సహాయ, నాటి తరం మహిళ అంతర్మధనమే  కథనం......

     

పాలు తాగేసి అమ్మమ్మతో  కథలు  చెప్పించుకొని, బొమ్మలతో కాసేపు ఆడుకొన్నాను.  అమ్మ జంతికలు చేయిస్తుందివెళ్లి వంటింట్లో అమ్మ దగ్గర కూర్చున్నాను.  "ఏరా  స్కూలు  లేకపోతే  తోచడం లేదారోజాని  పిలుచుకొని  తోటలో ఆడుకోండిపనయ్యాక నేనొచ్చి పిలుస్తాలే," అంది అమ్మ. రోజా మా  పక్కింటి  స్నేహితురాలు.  ఉషారుగా ఆటలు, బొమ్మలు తీసుకొని, రోజానేను తోటలో ఆడుతూ చాలా సేపు ఉండిపోయాము.  చీకటి పడుతుండగా,"బంతీ, ముద్దబంతీ అమ్మా! భానుమతీ," అంటూ అమ్మ తోటంతా తిరుగుతోంది, నా కోసం.   ముద్దు పిలుపు నా కెంతో ఇష్టం.  అమ్మలా  పిలవగానే  నా మనస్సున ఎంతో ఆనందం.  వెళ్లి  వెనకనుండి అమ్మని  గట్టిగా  చేతులతో చుట్టేసాను. "ఏరా, ఎంత సేపు పిలవాలి నిన్ను? పద త్వరగా భోజనం చేసి పడుకుందువుగాని.  నాన్న రేపు చీకటితో  వస్తారు,  నీకోసం  బొమ్మలు  బట్టలు తెస్తున్నారు.  అప్పుడు లేవాలిగా,"  అంటూ నా చేయందుకొని ఇంట్లోకి దారి తీసింది అమ్మ. రేపు వస్తానుఅనేసి  రోజా  వెళ్ళిపోయింది.   

తెల్లారితే  నా పుట్టిన రోజు పండుగ. అందరినీ  ఆహ్వానించారు.  పందిరి  వేయించారు. పాటకచేరి పెద్దవాళ్ళకి పట్నం నుండి  గారడీల వాళ్ళు  పిల్ల వాళ్లకి, వస్తున్నారట.  అమ్మ చెప్పింది.  అమ్మ, నేనుఅమ్మమ్మ  భోజనం ముగించి  పెందరాళే నిదరోయాము.  తెల్లారుతూనే  నాన్న వచ్చారు.  నిజంగానే  మామూలు  కంటే  నాకు మరిన్ని బొమ్మలు, డ్రెస్సులు చాక్లెట్లు  తెచ్చారు.  మతాబులు  కూడా బోలెడన్ని తెచ్చారు,  దీపావళి  పండుగ కూడానట ఎల్లుండి.  అందుకే  మాకు  ఒక  వారం  రోజులు స్కూలు  లేదు.  పండుగ  సెలవలు. 

నా  ఏడేళ్ళ  పుట్టినరోజు  ఆర్భాటంగా  జరిపించారు.  స్నేహితులతో  దినమంతా ఆటలుగారడీ వాళ్ళ వింతలు,  చాలా ఉత్సాహంగా గడిచింది నాకు.

 పెద్దవాళ్ళ  ముద్దు మురిపాలతో దీవెనలతో  ముగిసింది  సందడి.  అలిసిపోయిపట్టు  పరికిణీ పూల జడతోనే  అమ్మ  దగ్గర  పడుకుండిపోయాను.   

తెల్లారుతూనే  నాన్న ఊరెళ్ళి  పోయారు ఎప్పటిలా.  అమ్మొచ్చి నన్ను  ముద్దులాడినిదుర లేపిమొహం  కడిగించి, వేడి పాలగ్లాసు అందించింది.  పందిరి మంచం మీద కూర్చుని  పాలు  తాగుతున్న నాకు,  బీరువా నుండి అమ్మ ఒక బంగారు రంగు కాగితపు  సంచీ  తీసిచ్చింది.  గబా గబా విప్పి చూసాను.  చక్కని చెక్క బొమ్మ.  అందంగా రంగులద్ది,  చీర కట్టి ఉంది.  మంచి  సువాసన వస్తుంది.  "నీ కోసమే  ప్రేత్యేకంగా  తెప్పించాను, మైసూర్ నుండి.

చందనపు బొమ్మ. బాగుందా?" అంటూ నన్ను వొళ్లోకి  తీసుకొంది అమ్మ.   తరువాత  ఇద్దరమూ కలిసి ఆ  బొమ్మకి  'చేమంతి'  అని  పేరు కూడా పెట్టాము. ఆ రోజు నుంచి  నాకు  ఎంతో  ఇష్టమయిన బొమ్మ చందనపు  'చేమంతి'.   ఇంతలో,  "కళ్యాణీ భానుమతి కి దిష్టి తిప్పేసెయ్యాలిరాత్రి  అలాగే నిద్రపోయింది. దాన్ని  తీసుకొని  ఇటు రామ్మా," అమ్మమ్మ పెరటి లోంచి బిగ్గరగా పిలిచింది.  నన్నెత్తుకొని  అటుగా నడిచింది అమ్మ.  

 తరువాతి వారం అమ్మకి  చాలా జ్వరం వచ్చింది.  మూడు  రోజులైనా  తగ్గలేదు.  నన్ను ఇక అమ్మ దగ్గరకి  వెళ్ళనివ్వలేదు.  అమ్మని పట్టణాస్పత్రిలో చేర్చారు.  మళ్లీ  వారానికి అమ్మకి   బాగా  జబ్బు  చేసిందట.  నేను అమ్మ గురించి అడిగినప్పుడల్లా,  ఇదిగో ఇవాళ వస్తుందని  రోజు,  కాదని  మరో రోజు  అనేవారు.  ఏరోజు  కారోజు అమ్మకి  ఇష్టమైన  పరికిణీ  వేసుకొనిఎదురు  చూసేదాన్ని.  ఒక్కోసారి  ఏడ్చి  గొడవ  చేసినాన్న  వచ్చాకఅమ్మ  గురించి ఏమి చెబుతారో విని గానిఅన్నం తినేదాన్ని కాదు.  అమ్మకి తలలో రక్తం గడ్డ కట్టిందట.  ఆ రోజు పొద్దున్న అమ్మమ్మ చాల దిగులుగా ఉంది.  అమ్మకి అస్సలు బాగోలేదట.  అమ్మ వస్తుందా లేదా, అమ్మమ్మా పద  మనమే వెళదాం అమ్మ దగ్గరికి అంటూ  ప్రతి రోజూ అమ్మమ్మతో  గొడవ పడేదాన్ని.  స్కూలుకి   ఆలస్యంగా వెళ్ళేదాన్ని.   అలా మరో  వారం  గడిచింది.

 ** 

ఆ  రోజు  స్కూలు నుండి వచ్చేప్పటికి, వరండాలో నాన్న ఎవరికో  ఫోన్లో  చెబుతున్నారు, ఆపెరేషన్ చేసేలోగానే రక్తనాళం చిట్లడం వల్ల డాక్టర్ ఏమీ చేయలేక పోయాడట.  నన్ను చూసి, నా దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి, దగ్గరికి తీసుకుని  ఇంట్లోకి తీసుకెళ్ళారు నాన్న. లోపల  హాల్లో అమ్మ పడుకొనుంది, తెల్ల  దుప్పటి కప్పుకొనుంది, కళ్ళు మూసుకొనుంది.  అమ్మమ్మ,  ఇంకొందరు దూరంగా  కూర్చుని ఉన్నారు.  అమ్మమ్మ  ఏడుస్తుంది. నేను  అమ్మ  దగ్గరగా వెళుతుంటే, అమ్మమ్మ  వచ్చి నన్ను  ఎత్తుకొని  పక్కకి తీసుకెళ్ళింది.  నేను బిగ్గరగా  ఏడవడం మొదలెట్టాను.  "మీ అమ్మ నిన్నునన్ను వదలి  వెళ్ళిపోయిందే  తల్లీ, పాడు  విషజ్వరంతో  ఎన్నాళ్ళో  అల్లాడిపోయింది,  ఆ దేవుడుకి మనపై దయలేకుండా పోయిందమ్మా," అంటూ అమ్మమ్మ వెక్కి వెక్కి తానూ ఏడ్చింది.  కన్నీళ్లు  కలవరింపుల  నడుమ,  అమ్మమ్మా, ఆయమ్మల  పాలనలో,  అరుదైన  నాన్న లాలనలో ఎలాగో  ఒదిగాను,  పెరిగాను,  పెద్దయ్యాను. 

**

        అమ్మమ్మతో వారానికి రెండు రోజులు గుడికిభగవద్గీత పారాయణంఆద్యాత్మిక  చింతనలకి వెళుతుండే దాన్ని.  ఎన్ని చేసినా నాకు అమ్మలేకపోవడం  తీరని  లోటయిపోయింది.  ఆ దిగులూ  బెంగా  కష్టమయిపోయింది.  ఆ  దు:ఖాన్ని, లోటునీ  కప్పి పుచ్చుకుంటూ,  నాకు  నేనే ధైర్యం చెప్పుకుంటూ ఆ వెలితిని ఓ  బలంగా మార్చుకొని  నిబ్బరంగానే  ఉండేదాన్ని.  నేనెంతగానో  ప్రేమించిన  అమ్మ, నాకు  దూరమౌతుందని ఎన్నడూ అనుకోలేదు.  అందుకే, ఇంక  ఏ  బాధైనానొప్పైనా అమ్మ  పోయినప్పటి  బాధ  కన్నా  తక్కువేఅని అనుకొన్నాను.  దేనికీ  చెలించక  పోవడం   అలవర్చు కుంటున్నాను.

 ఎందుకేఅలా మొద్దులా ఉంటావు తల నిండా తెలివేగా, మాట్లాడ్డం నేర్చుకోమ్మా, అలా ముంగిలా  ఉంటే నిన్ను నోరు లేని  పిరికనుకుంటారు ,” 

అనేది  అమ్మమ్మ  తల  దువ్వి  జడేసినప్పుడల్లా.  ఇద్దరమూ  నవ్వుకొనే  వాళ్లము స్కూల్లో  పిల్లల  గురించి టీచెర్ల  గురించి  ఆమెకి  కథలు  చెప్పేదాన్ని రొజూ  కాసేపు.  నాకు  అమ్మ  గుర్తుగా  ‘చేమంతి’,  అమ్మిచ్చిన  చివరి కానుక అమ్మ  చిహ్నమే.  ఎప్పుడూ  వెంటే  ఉంచుకొనేదాన్ని.   

ఎక్కువగా ఎవరితో  మాట్లాడే దాన్ని కాదు.  అమ్మమ్మ తోనే  చనువుగా  ఉండేదాన్ని.   నాన్న ఎక్కువగా  పట్టణం  లోనే గడిపేవారు.  మాకు మాత్రం  దేనికీ  తక్కువ చేయలేదు.  అన్నీ అమర్చేవారు నాన్న.  ఇంటి నిండా పనివాళ్ళు, వంట మనిషి, తోట మాలి. నేను పెద్దవుతున్నా నాకంటూ ఓ ఆయమ్మని కూడా ఉంచేశారు.  నాన్న ఏనాడూ నాతో ఆప్యాయంగా మాట్లాడలేదు,  అమ్మ పోయాక మా మధ్య మాటలు మరీ తగ్గిపోయాయి.  అందరి  నాన్నలు ఇల్లానే    అంటీ  ముట్టనట్టు ఉంటారా? అని అనుమానమొచ్చేది. కాని మా స్నేహితుల నాన్నలు వాళ్ళ అమ్మాయిలతో చాల  ప్రేమగా సన్నిహితంగానే  ఉండడం గమనించాను.  అమ్మమ్మని అడిగాను కూడా.  "కొందరి తీరు లేమ్మా మీ నాన్న ఎప్పుడూ  అలాగే  ఉన్నారులే, అర్ధం చేసుకొని మసులుకోవాలి," అని  ఊరుకొంది.  మనస్సుని  సముదాయించిఉండీ  లేనట్టుగా ఉన్న నాన్నకివదిలి  వెళ్లిపోయిన  అమ్మకి  కూడా సరిపోయినంత  బలాన్ని,  ప్రేమని నేనే నా  అంతరాల్లో నింపుకొన్నాను.  

ఆ  రోజు  ఊరినుంచి వచ్చిన  నాన్న, నన్ను అమ్మమ్మని పిలిచి, "చూడండీ, నేను కమల అనే ఆవిడని  పెళ్లాడబోతున్నాను.  ఆవిడ నా పార్టనర్ చెల్లెలు.  వచ్చే వారం పెళ్లి.  పదిహేను  రోజుల్లో ఇక్కడే  కాపురానికి  వస్తుంది.  పెళ్లి తిరుపతిలో.    మీరు కూడా తిరుపతికి  బయలుదేరాలి ," అంటూ కొన్ని వివరాలిచ్చి "ఈ లోగా ఏమన్నా అవసరాలుంటే  పట్టణానికి వెళ్లి  అన్నీ తెచ్చుకోండి," అని  మాకు  చెప్పి మరో  గంటలో  వెళ్ళిపోయారు.  నాకప్పుడు పద్నాలుగేళ్ళు.  పెళ్ళికి  రెండు రోజులు నేను, అమ్మమ్మ తిరుపతి వెళ్లి వచ్చేసాము.  ఆ తరువాత పది  రోజులకి కొ త్తమ్మ  కాపురానికి వచ్చింది. 

అప్పుడప్పుడు అమ్మమ్మ  చిరాకు పడేది.  అన్నిటా  కమలమ్మ  పెత్తనం ఎక్కువయ్యిందని. 

** 

అలా మరో రెండేళ్ళు జరిగాయి.  వయస్సు పై బడి అమ్మమ్మ ఆరోగ్యం  మెల్లగా క్షీణించ సాగింది.   నేనే ఎక్కువగా ఆమెని   అంటి  పెట్టు కొని ఉండేదాన్ని.   అమ్మమ్మ  నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో విషయాలు చెప్పేది.  "ఎప్పుడూ నువ్వు ఓపిగ్గా హుందాగా ఉండాలి సుమా!,  నేనున్నా లేకపోయినా, నాన్న  నీ  పెళ్లిచేయ  నిర్ణయిస్తే  ఒప్పుకో, నీకు  తరగని  ఆస్తి, అమ్మ  పెట్టిపోయిన వంద  తులాల  బంగారం వందెకరాల  మాగాణి, అన్నీ ఉన్నాయి.  జీవితంలో ఎటువంటి పరిస్థితుల కైనా తట్టుకొని ముందుకు  పొవాలే  తల్లీ,"  అనేది నాతో.  నా పదిహేడవ  పుట్టినరోజు  తెల్లారేనా చేయి తన చేతిలోకి తీసుకొనిభగవద్గీత  చదవమని,  కళ్ళు మూసుకొని  పడుకున్న అమ్మమ్మమళ్లీ  కళ్ళు  తెరవనే  లేదు. అమ్మమ్మా  దూరమయ్యె, ఒంటరి తనమూ పెరిగేనాకున్న ఒక్కగానొక్క  దిక్కు  అమ్మమ్మ, ఆవిడా లేకుండా పోయింది.  మనస్సు అగాధంలా అయిపొయింది.  నా  చుట్టూ నా కోసం  పని వాళ్ళుఆయమ్మ  ఉన్నా నాకు  శూన్యమయి పోయింది  ఇంట.  

నాకు పద్దెనిమిది  వసంతాలు  నిండగానేకాలేజి చదువు అవ్వకుండానే నాన్న నాకు పెళ్లి నిశ్చయించారు.   పెళ్లి కొడుకు మాకు బంధువులేనట.   మోహన్ రాజ్ ఆయన పేరు.  జామిందారీ  కుటుంబమట.  ఆయన్ని అందరు  ‘కుర్ర జమిందార్’  అని పిలిచేవాళ్ళు.  నా వివాహం ఆగస్ట్ 15 న మావూరి అమ్మవారి ఆలయంలో   జరిపించాలని నిశ్చయించారు.  నాన్నకి  దేశభక్తి  మెండు.  ప్రతి  ఏడు ఆగస్ట్ 15 న తప్పకుండా  పెద్దెత్తున స్వాతంత్ర  దినోత్సవ  సంబరాలు  జరిపించి,  ఊరంతా  భోజనాలు పెట్టి,  పిల్లలకి బహుమతులు  పంచేవారు.  హైదరాబాద్ నుండి రాజకీయ నాయకులు, కళాకారులు  కూడా వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం పరిపాటే.   కాకపోతేఅది 1957 వ సంవత్సరంఆగస్ట్ 15 కావడంతో 10వ స్వాతంత్ర  దినోత్సవ  వేడుకలగానే కాక, దినం పెళ్లి ముహూర్తం  కలిసి  రావడంతో నాన్నకి  మరింత  ప్రేత్యేకత  సంతరించుకొంది.  రెట్టింపు ఉత్సాహంతో  సన్నాహాలు  చేయించారు  నాన్న.  పెళ్లి  వైభవంగా చేసారు.

**

 అత్తవారింట  అడుగు  పెట్టాను.  కొన్నాళ్ళు కొత్త  మురిపెంగా  సాగింది  నా  కాపురం.  ఏడాది అవుతూనే, రాను రాను తెరపి లేని బాధ్యతలు, భర్తగారి వ్యసనాల  అస్తవ్యస్తాలతో  విసిగి  వేసారసాగింది  మా  దాంపత్యజీవనం.  నా భర్తది కూడానాన్న తీరే.  నాన్న లాగానే అంటీ ముట్టనట్టుగా ప్రవర్తన.  ప్రేమగా, స్నేహంగా ఆప్యాయంగా ఉండరు.  భార్య, పిల్లలు ఇటువంటి వారి జీవితాలకి అలంకార ప్రాయాలు మాత్రమే.  అసలైన అనురాగాలు, భాధ్యతలు వీరికి  ఏమాత్రం తెలియవనిపిస్తుంది.  ఏమైనా  నా  జామిందార్  భర్తకి అన్ని వ్యసనాలు ఉన్నాయి.  వారసత్వపు ఆస్థులు, అవసరాలకి మించిన డబ్బు, చుట్టూ ఆడ,మగ స్నేహితులు, నెలకి వారం రోజులైనా వాళ్ళతో యాత్రలు, తిరగడాలు.  ఆయన   జీవన శైలిలో,  నేనసలు ఇమడలేక పోయాను.   

ఏమీ  చేయలేని పరిస్థితా నాది?  జామిందార్ల  కుటుంబ  విషయాలు  ఏవీ  బయటకు పొక్కవని స్త్రీలు  భర్తల  కనుసన్నలలో  మెలుగుతారనికొందరు భర్తలు ఒకోసారి ఇద్దరు  భార్యలతో  సంసారం  వెలగబెట్టేవారనీవారి  ఆడవారు  ఎదురీది  మనలేరనీ,  ఎన్నోసార్లు  అమ్మమ్మ మాటల్లోచెప్పేది.  నాకు గుర్తున్న వరకూ నాన్న మాత్రం  వారానికి  రెండు  రోజులు ఠ౦చనగా  ఇంటికి  రావడం వస్తూ అమ్మకు  నాకు  కానుకలు పువ్వులు మిఠాయిలుతేవడం ఉన్న రెండు  రోజులు ఇతర  వ్యవహారాలు  లేకుండా, మాతో  ప్రశాంతంగానే  గడపడం చేసేవారు.  అమ్మ  పోయాక  కూడా  నాన్న  అలాగే సాగించేవారు,  నాతో  ముక్తసరిగానే  పొడిపొడిగా  కాస్త  మాట్లాడి విషయాలు వాకబు చేసి,  తోటలకి,  పొలాలకి గుడికి  కూడా అమ్మమ్మని,  నన్ను  వెంటబెట్టుకొని తిరిగేవారు. అంతే గాని, ఇలా నా  భర్తకులా  ఎప్పుడూ  ఇంటనే  వెంట  ఉండే స్నేహితులు, వారితో  జలసాలు నేనెన్నడూ  చూడలేదు. 

** 

పెళ్ళైన  రెండేళ్ళకి,  నాకు   జీవితంలోకి  సంతోషమంటూ  వచ్చింది,  పండంటి  నా బాబు  రాకతోనే.   నా  శూన్యం  వెలుగైపోయింది.  

మాతృత్వంలోని  తీయదనం  తెలిసొచ్చింది.  నా బాబు మురిపాల  ఆనందాలతో  గడిపేస్తున్నాను  కాలమంతా.  అయినా ఓ ప్రక్క, నిత్యం నన్ను కలవర పెట్టేది,  మేడిపండయిన నా కాపురం.  తీరని వ్యధతో అహర్నిశలూ నిరాశలతో గడిపేదాన్ని గుబులుగా ఉండేది.  ఈ  జీవతం  ఇలాగే  గడిచేనా?,

నా  గాయపడే  మనసుకెన్నడూ  ఆలంభన  చిక్కిన ధాకలాల్లేవు,”  అని వాపోయాను.    

బాబుకి  అయిదేళ్ళు నిండుతూనే, ఇంట మరో  భార్యకి  చోటిచ్చారు నా భర్త.  అసలు మగవారి నైజం ఏమిటి? జామిందారీ  జీవన విధానమే ఇదని సరిపెట్టుకోలేక పోయాను.  బాబుకి తప్ప నా అక్కరేలేని  ఆ  ఇంట సొలసిన  జీవితమిక  అలుసయ పోయింది.  ఇక అక్కడ  నాకు  మనశ్శాంతి  లేదు మనుగడా  లేదు.  నా జీవనాన్ని  ఇంట ఎలా సాగించేదితల మునకలయ్యేలా  ఆలోచించాను.   చిన్నతనంలోనా  సొంత  తండ్రి  వాత్సల్యం లోపించినామిన్ను విరిగి  మీద పడలేదు.  పెళ్ళైన  తరువాత,  భర్త  నిరాదరణ  వల్ల మనస్సు  విరిగి,  బతుకు భారమైందే  తప్ప  ఊపిరి  ఆగిపోలేదు.  కాని, నా ఉనికే లేనట్టు మరో స్త్రీని  భార్యగా  ఇంట నుంచడం  మాత్రం  జీర్ణించుకోలేక  పోయాను.  ఈ చేష్టతో  నా  భర్త  నా స్వాభిమానం పైనే  గట్టి  దెబ్బతీసి  నన్ను కించపరచి,  అవమానించాడు.  క్రుంగిపోయాను.  ఇటువంటి  అవమానానికి  గురైన  ఎందరో ్త్రీల  సహనానికి నిర్వచనమేమిటి  అని  అర్ధం కాలేదు.  నేను మాత్రం, ఇంకా అక్కడే ఆ ఇంటనే  జీవచ్చవంలా,  ఉంటే  నన్ను  నేను  అగౌరవపరుచుకోవడమే అవుతుంది.   

పొంతన లేని  బతుకు  సరి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.  నన్ను, నా వ్యక్తిత్వాన్ని  తీర్చి దిద్దిన   అమ్మమ్మకి మనసులోనే క్షమార్పణ చెప్పాను.  నేను  భర్త నుండి  వీడాలనేనా  భర్త  వద్ద  నిర్భయంగా  నోరు  విప్పాను.  అనిశ్చత  నుండి విముక్తి  కోరాను.  నా  భర్త  ఆశ్చర్య పోయాడు.  అంతటి తెగింపు,  ధైర్యం నాలో ఉన్నాయని  నా  జామిందర్  భర్త  ఊహించలేదు.  నాన్నకీ  విషయం  తెలిసినా  నన్ను పలికరించలేదు.  పైగా నాకు ఇంకా  రావల్సిన  మామిడి  తోట  దస్తావేజులు  పంపారు.   

 నేను  ఆశ్చర్య పోలేదు.  "నీ  ఆస్థులు నీ కున్నాయి," అన్నటుగా ఉంది నాన్న  వైఖరి.  నాకు ఎక్కడ లేని మనోనిబ్బరం, మొండి ధైర్యం వచ్చేసింది. 

నాకు  ప్రేమంటే  తెలిపిన  అమ్మ, అమ్మమ్మ లేరు.  భర్తకి  నాపై  ఆశక్తి,  అనురాగం  లేవని  తెలిసి  పోయింది.  పైగా  ఇంట్లో  మరో భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు.  నేనో   గోడ  మీద  బల్లి  లాగానో కాలి  కింది  చెప్పు  లాగానో  ఎలా  మనుగడ  సాగించ గలను?  ఏమీ  ఫరవాలేదు  అనుకొన్నాను.  ఆలోచించే  కదా  నిశ్చయం  చేసుకొన్నది.  ఎన్నడూ లేని  ప్రశాంతత  తోచింది.  ' నేను  అబలని  కానుఅని  నిర్ధారించుకొన్నాను.  నా  కోసంనా బాబు కోసం  ఆత్మస్థైర్యంతో  జీవితం  సాగిస్తాను.                                                        

నా  బాబుని, మనసున్న మగవాడిగా తీర్చి దిద్దుతాను,  మానవ  సంభందాలుబాంధవ్యాల విలువలు వాడికి తెలియ జెపుతాను.  తల్లినిభార్యని  ప్రేమించి  గౌరవించే  సాత్వికత  వాడిలో  నిలుపుతాను  అని  ఆలోచించుకుంటూ నిదరోతున్న బాబు  వైపు చూస్తూనేనూ కళ్ళు  మూసుకున్నాను. 

నాలో  నేను నవ్వుకున్నాను.  మాటలు  రాని  బొమ్మ  'చేమంతి మాత్రం ఎప్పుడూ నా వెంటే ఉంటుంది.  అమ్మ చిహ్నం  'చేమంతి'.  నాలో ఎక్కడ లేని ధైరం వచ్చింది.  దిగులు  అనిపించలేదు.  నేను, నా బాబు, బతుకు బాటలో సాగిపోతాము.  కలిమి, బలిమిచెలిమినై  నేనుండగా, వారసత్వపు జమిందారీ 

అండగా దూసుకుపోతాడు నా బాబు మెండుగా!  తెల్లారుతూనే,  రేపటి ఉదయం నా కొత్త  జీవితానికి, ‘తొలిపొద్దు అవుతుంది అనుకుంటూ హాయిగా నిదరోయాను. 


 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech