Sujanaranjani
           
  సారస్వతం  గగనతలము-30  
 

రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు

 

 

ఇప్పటివరకు మనము చర్చించుకున్న చాలా విషయాలు మనకు అయోమయంగానే ఇప్పటికీ గోచరిస్తున్నాయన్నది కాదనలేని నిజం. చాలా సార్లు అటువంటి చర్చలు కాలయాపన కింద కూడ కనిపించే అవకాశములు లేకపోలేదు. అందులో చాలా విషయములను మనము ఖండించకపోయినా మన ఆంతరంగము వాటిని ఖండిస్తోందనో లేక ఒప్పుకోవట్లేదనో చెప్పక తప్పదు. నేటి వైజ్ఞానికయుగంలో ఇటువంటి చర్చలు సోదిగా అనిపించినా ఆశ్చర్యపోనవసరము లేదు.

                మంత్రానికి శక్తి ఉంది అని నమ్మినప్పుడు,  దాని ప్రభావానికి దూరము లేక స్ధానము ఆటంకము కలిగించలేవని నమ్మినప్పుడు, వాస్తులోని ప్రతి సిద్ధాంతము కూడ నిగూఢమయిన స్వరూపమును ధరించి ఉన్నదని నమ్మవచ్చును. కానీ నమ్మకము వేరు తథ్యశోధన వేరు. శోధన తరువాత ఎదురుగా ప్రత్యక్షమైనదే సిద్ధాంతము. సిద్ధాంతమనేదానికి చివరికి సిద్ధించినదని అర్థము.(finally proved). అలా సిద్ధించినదంటే అది విజ్ఞానమే. సిద్ధాంతానికి మరికొన్ని నిర్వచనములు కూడ ఉన్నాయి. వాది ప్రతివాదులలో చర్చానంతరము ఉద్భవించినదే సిద్ధాంతమని ఒక నిర్వచనము. కానీ ప్రత్యక్షగోచరములైన విషయముల సందర్భములో ఇది ముమ్మాటికీ వర్తించదు. అదే కోవకు చెందినవి జ్యోతిషము మరియు దానిలో అంతర్నిహితమైన వాస్తు.

          పూర్వము మనము చర్చించిన ఉదాహరణ వాస్తుకు సంబంధించినది కాబట్టి ప్రస్తుతము దానిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చర్చించుట సమంజసము.

          నేలలోని పొరలు, వివిధ రకములైన పదార్ధములు మరియు వాని లక్షణములు, జలశిరలు, వాని యందలి ప్రవాహము, ఆ ప్రవాహములోని నీటి రంగు, రుచి ఈ విధముగ అనేక విషయములు చర్చించిన ఆచార్యులు వానిని కాకతాళీయముగా పొందారనుకుంటే అది తప్పిదమే అవుతుంది. భూమి పై భాగమునందలి లక్షణములను అనుసరించి భూమిలోపల ఎంత దూరములో ఎటువంటి జలప్రవాహము ఉన్నదో పేర్కొన్న మహర్షివచనములు కొట్టి పారవేయలేమన్నది నిర్వివాదాంశము. ఆ ఆచార్యులే గృహమునందలి గుంటలను గూర్చి వివరించినపుడు  ఆ సందర్భములో కూడ వారి నిశిత పరిశీలనను ప్రయోగించారన్నది సత్యమని చెప్పక తప్పదు.

          నూతిలోని నీరు కలుషితమవుతుందని పేర్కొంటూ నేడు పూర్తిగా వజ్రలేపము చేయుచున్న సెప్టిక్ టేంకులవంటివి పంచమహాభూతముల చక్రభ్రమణానికి ఆటంకంము కలిగిస్తున్నాయి. రాతిపొర, ఇసుకపొరలతో యుక్తమైన భూమియొక్క అంతర్భాగము ఎటువంటి జలాన్నైనా అవలీలగా శుభ్రపరచగలదని తెలుసినవిషయమే. నేటి యుగంలో నీటిని శుభ్రపరచు యంత్రములలో మనము అనుసరిస్తున్న సిద్ధాంతము భూమియందలి పొరల స్థితికి అనుగుణముగానే ఆవిష్కరింపబడినదన్న విషయము సర్వవిదితము.  నివసించడానికి కట్టుకున్న ఇంట్లో మరియు నివసిస్తున్న ఇంటిలోని స్థితిగతులు మాత్రమే ఇంటి యజమానిని ప్రభావితము చేస్తాయి అని మనము నమ్మితే అది సిద్ధాంతానుగుణముగ లేదని అనిపిస్తుంది. ఉదాహరణకు ఇంటి వాస్తు యజమానికి దుర్ఘటనను ఇస్తుందనుకుందాం. ఆ దుర్ఘటన ఇంటిలో జరిగితే మాత్రమే అది వాస్తు వలన జరిగిందని భావించాలా లేక మార్గమధ్యంలో జరిగినది కూడ వాస్తు వలన జరిగిందని మనము అంగీకరించవచ్చా¿ మార్గమధ్యంలో జరిగినది కూడ వాస్తు ప్రభావితమే గనక అయితే మనము ఆలోచించవలసిన విషయముల చిట్టా చాలా పెరిగిపోతుంది.

కట్టిన ఇల్లు ఇంటి యజమానిని సర్వదా మరియు సర్వత్ర వెంటాడుతుంది…….

          పైన పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే యజమాని తను నిర్మించిన ఇంటిలో నివాసము లేకున్ననూ అతను ఆ గృహసంబంధమైన ఫలితములు ఫొందుతున్నాడు అని అనిపిస్తుంది.  నమ్మడానికి లేక అంగీకరించడానికి కొంత ఇబ్బందిగా ఉండే అంశమిది. ఒక స్థాయివరకు ఊహాతీతమిది. ఈ విషయాన్ని అంగీకరించాలి అంటే మనము దయ్యాలు, భూతాలు, పిశాచాలు వంటి అనేకరకములు ఏవైతే కధలలో మనకు కనిపించేవో అవి అన్నీ నిజముగ ఉన్నాయని అంగీకరించాలి. పంచమహాభూతములలో చివరిదైన ఆకాశము వీటంన్నింటికీ నివాసస్థానము. మన చుట్టూ మనను ఆవహించినవి మరియు సమయము కోసము వేచి చూస్తున్నవి కూడ ఇవే. దీనికి పెద్ద ఉదాహరణ మనము పూజ లేక సంధ్యావందనాదులలో సంకల్పానికి ముందు చెప్పే " ఉత్తిష్ఠంతు భూతపిశాచాః" అని మనము ఉచ్చరించే మంత్రమే.

          ఈ మంత్రములో మనము భూత పిశాచాదులను లేవమని, అవి భూమికి భారములని, మరియు వాటి అనుకూలతచే బ్రహ్మకార్యమును ప్రారంభించబోతున్నామని చెబుతున్నాము. పరంపరగా వస్తోంది కాబట్టి మనము ఇలా చెబుతున్నామంటే చెల్లదు. దానికి కారణము మనము ఆచరించే పూజలే. అది షోడశోపచారమైనా సరే లేక చిన్నదైనా సరే. మనము గుడిలో భగవంతునికి నమస్కరించినపుడూ ఇదే వర్తిస్తుంది. గుడిలోకి ప్రవేశిస్తూనే మనము చేసే మొదటి పని ఘంటానాదము. గంట కొట్టనిదే మనము ఎదరికి వెల్లము. ప్రాణప్రతిష్ఠ చేయించుకున్న ఆ భగవంతుని ఆలయములో నలుదిక్కులా ఆవహించియున్న భూతప్రేతాదులను దూరముగా పంపే ప్రయత్నమే ఘంటా నాదము. వాకిలిలో మనము వేసే ముగ్గు కూడ ఆ భూతప్రేతాదులను ఇంటిలోకి రాకుండ నివారించడానికే. ఇక్కడ ఆశ్చర్యపరిచే ఒక అంశం ఉంది. మనము ఆ భూతాదులను మనకు ఆటంకం కల్పించవద్దని మరియు నివాసస్థానములలోకి రావద్దని మాత్రమే ప్రార్థిస్తున్నాము. అంటే వానిని ఏమీ చేయగలిగే సత్తా మనలో లేదని స్పష్టమవుతోంది.

          అనుష్ఠానములలో మనము నిర్మించే సర్వతోభద్రములాంటే వేదులు కూడ ఈ కోవకు చెందినవే. ఈ తతంగములన్నీ పూర్తి చేయకుండ మనము అనుష్ఠానములో ముందుకు వెల్లే అవకాశముండదు. వ్రతాదులలో మండపాదులు మరియు అందు స్థాపనలు లేకుండ షోడశోపచారములు ప్రారంభము కావు. వీటన్నింటి సారాంశము ఒక్కటే. మనము గమనించని తత్త్వమేదో మనని పూర్తిగా శాసిస్తోంది. దానిని మనము వాస్తు లేక జ్యోతిషము లేక పూజలు మొదలగు వాని సహాయముతో మనకు అనుకూలముగ మలచుకొనే ప్రయత్నము చేస్తున్నాము. తపస్సంపన్నులకు అవి దృశ్యములు. మహర్షులు వానిని గమనించగలరు మరియు ఒక స్థితి వరకు శాసించగలరు.

          మనము గమనించలేని, మనము శాసించలేని మరియు మనను ప్రభావితము చేసే ఆ శక్తులు ఆకాశమనే ఐదవ మహాభూతములో అంతర్నిహితములు అని మనము భావించవచ్చు. మిగిలిన మహాభూతములలో వాని ఉనికి లేదని అర్థము కాదు. కానీ మనము నేటివరక పరికించలేకపోయిన మహాభూతము ఇదే. దీనికి నానా రకముల అర్థము మనము చెప్పుకున్ననూ నేటికీ ఇది మన ఊహలకు అందనిదే. మనకు అయోమయంగా తోచే అన్ని విషయాలు ఒక నిశ్చితమైన ఆశయము మరియు భావము కలిగి ఉన్నాయి. వాటి వరకు మనము చేరుకోగలిగిననాడు వైదికసాహిత్యము పేరుకు అనుగుణముగ విజ్ఞాననిధియే అన్న విషయము స్పష్టమవుతుంది.

          మన చుట్టూ శూన్యమనేది లేదు మరియు మనము శూన్యముగా భావించే ఆకాశము విభిన్న తత్త్వములతో కూడియున్నది అన్న విషయముపై మనము రాబోవు సంచికలో చర్చించుకుందాము.

సశేషము………


 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech