Sujanaranjani
           
  శీర్షికలు  
       ఎందరో మహానుభావులు

         పప్పు వెంకన్న

 

 - రచన : తనికెళ్ళ భరణి    

 

పప్పులో నెయ్యేసి కలిపితే

ఘుమఘుమలాడుతూ డుపు నిండుతుంది!

కానీ పప్పు కడుపు నింపేది కాదు

మనసు నింపేది...

(నేతి ఇంటి పేరు గల వారు గొప్ప సంగీత విద్వాంసులు. ఉదాహరణకు:శ్రీ నేతి శ్రీ రామ్ శర్మ గారు...)

19 శతాబ్దపువిజయనగర సంస్థానంలో సంగీత విద్వాంసుడిగా ఒక వెలుగు వెలిగిన "పప్పు వెంకన్న" వైణికుడే కాక అద్భుతమైన గాయకుడు!

విజయ నగర సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడగా ఉండటమంటే అదో పూర్వ జన్మ సుకృతం

అటు సంపద... ఇటు విద్యా...

లక్ష్మీ సరస్వతుల ఏకాకృతి...  

తమ హయాంలో కళాకారుడన్నవాడెవడూ ఆర్ధికపరమైన ఇబ్బందులు పడరాదని శ్రీ శ్రీ శ్రీ ఆనందగజపతుల వారి హుకుం!

ఇంతకన్నా యోగం ఏవుంటుండి కళాకారుడికైనా!

ఎంత విద్వతున్నా.. ఆదరించేవారు లేక...కుటుంబాన్ని పోషించుకోలేక అష్ట దరిద్రాల్నీ అనుభవించి అనామకులుగా అంతరించిపోయిన వారెంత మంది లేరు..

కానీ ఆనందగజపతుల సంస్థానంలో కళాకారులు..

ఇల్లు వాకిలి - పొలం - తోట - పాడి - పంట.. కనక వస్తు వాహనాలు...సమస్త సౌకర్యాలూ - సౌఖ్యాలతో కళకళ్ళాడుతూ ఉండేవారు.

అదిగో పప్పు వెంకన్న గారు!

తెల్లారగట్టే స్నానం.. సంధ్యా ముగించుకునీ..

గున్నమామిడి చెట్టు కిందున్న చప్టా మీద కూర్చొని తంబూరా మీటుతూ ఆలాపన మొదలెట్టారు.

అదో గంధర్వగానం...

వాకిట్లో ముగ్గేస్తున్న వాళ్ళావిడా..... అలాగే బుగ్గ మీద వేళ్ళెట్టుకుని వింటోంది.

పెరట్లో గోమాత నెమరేయడం మానేసింది.

అల్లనేరేడు చెట్టు మీద ఉడతా...

మామిడి కొమ్మ మీద చిలక పళ్ళు కొట్టడం మానేసాయ్...

సీతాకోక చిలుకొచ్చి తంబుర మీద వాలింది.

భ్రమరాలు... పూలల్లో తేనె తాగాలా.. గానంలో తేనె తాగాలా అన్న సందిగ్ఢంలో పడ్డాయ్...

ఊయల్లో పసిపిల్లవాడు..... వటపత్ర శాయిలాగ.

నోట్లో వెలెట్టుకుని... పప్పు వెంకన్న గారి గాన మాధుర్యాన్ని కళ్ళు మూసుకుని జుర్రుతున్నాడు.

వెంకన్న గారి గానం ఆగింది.

అంతా ఎవళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయారు.

ప్రకృతిని పులకింపచేసే తీపి ఆయన కంఠంలో ఉంది.

అందుకే హరికథ పితామహ ఆదిభట్ల నారాయణ దాసు లాటివారు ఇలా అన్నారు.

"పప్పు వెంకన్న వేయి కోయిలలు మ్రోగునట్లొక

మైలు వినపడునట్టి గానముతో-దివ్య శరీరముతో

నధికామోదమిచ్చువాడు" అని మెచ్చుకొని ... ఇంకనూ ఇలా అన్నారు.

జున్ను దిన్నట్లు - పువ్వుల సోన మాడ్చి

నీటిపై జిల్ల పెంకులు దాటు పొల్కి

ఒక పారు పారుల మొదగి వచ్చినయట్లు

తన మెయిల పెట్టనరకినట్లు

ఒకమారు మేల్పటా న్డది తిప్పినయట్లు

కొలనందు జలకేళి సలిపినట్లు

ఒకపరి నను ముద్దు తరియ యట్టుల

చేదెతో బూలను చేదినట్లు

పప్పు వెంకన్న నీ పాట వెన్నముద్ద

లేసినట్టుల - జువ్వల నెగచినట్లు

సన్న చెంబేరి జాజులు జల్లినట్లు

చిన్ని పూదేనె పై బయి చిందినట్లు

అని జాన తెలుగులో వేన్నోళ్ళ కొనియాడారు.

అప్పట్లో మదరాసు ఆంధ్రసభ వారు.. వివిధ ప్రాంతాలనుండి సంగీత విద్వాంసులను, రాజ పోషకుల్ని పిలిచి సంగీత సభల్ని పెట్టించేవారు.

సరే సభ మొదలైంది...

పప్పు వెంకన్న కేవలం శ్రోతగా వెళ్ళారు...

తీరా.... పాడాల్సిన గాయకుడు రాలేదు.

పావు గంటైంది... అరగంటైంది.... గంటయ్యింది...

నిర్వాహకుల గుండెల్లో రైళ్ళు... సభలో కలకలం

నిర్వాహకులు ఎవరన్నా పాడి సభని రంజింపచెయ్యాల్సిందిగా అభ్యర్థించారు...

లేచాడు పప్పు వెంకన్న...

తను విజయనగర ఆస్థాన విద్వాంసుడు.

రాజావారి అనుమతి లేకుండా పాడటం దోషం.. సంప్రదాయం కాదు!

కానీ ఇక్కడ సభ అభాసుపాలయ్యేలా ఉంది.

కళాకారుడిగా సభా గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత ఉంది.

సరే, మనసులో తను నమ్మిన దైవాన్ని స్మరించుకొని

గొంతు సవరించి గానం ఆరంభించారు!

ఆంధ్ర మహాసభలో - అమృతవర్షిణి....

"ఝుం" అంటోంది తుంబురనాదం...

తకతకిట... తకతకిట... అంటోంది మృదంగం.

దం..దం..దండం.. దం అంటోది మోర్సింగ్

రాగధార ఆరంభమైంది!

ఆకాశంబుననుండి ... శంభుని శిరంబుదుండి... అన్నట్లు

బొట్టుగా... బొట్టుగా... ఆరంభమైన మకరంద ధారలో ములిగి మూర్చనలు పోతున్నారు శ్రోతలు.

ఇక పప్పు వెంకన్న తన్మయులై పాడేస్తున్నారు.

ఇంతలో హాలులోకి ఆనందగజపతి మహారాజు వారు....

ఆయన మిత్రులైన మహారాజా శ్రుంభూపతి గారు...

అడుగుపెట్టారు.

పాడుతున్న పప్పు వెంకన్న గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.

పాట ఆగిపోయింది!!!

సహకారవాద్యాలు మోగుతున్నాయ్...

తన ఆవర్తనం...జరుగుతోంది.

ఆనందగజపతి మహారాజు పప్పు వెంకన్నని గమనించాడు.

కానీ ఏమీ మాట్లాడలేదు..

మైసూరు మహారాజా వారు మాత్రం అర్థనిమీలిత నేత్రుడై ఆనందపరవశుడైయున్నాడు.

పప్పు వెంకన్న పాట పున: ప్రారంభించారు.

మళ్ళీ మొదలైంది గంగాఝురి!!!

శ్రుంభూపతి గారిని మ్తిపోయింది...ఏవిటీ గంధర్వగానం...!

తను ఎన్నెన్ని సభల్లో ఎంతమంది సంగీతాన్ని విన్లేదు...

కొత్తగాయకుడెవరు? కాదు గంధర్వుడెవడు...?

కార్యక్రమం అయిపోయింది.

మహారాజులిద్దరూ వేదికమీదకి వచ్చారు.

శ్రుభూపతి గారు సభ్కులను ఉద్దేశించి...

"మే మా ఎరుకలో ఎన్నడూ ఇంత మధుర... మంజుల... మోహన గానాన్ని రుచిచూచి ఎరుగం....

అందుకే గాయకుడిని రత్నాల పతకంతో సన్మానిస్తున్నాం"

అనగానే సభ దద్దరిల్లిపోయింది.

రత్నాల హారాన్ని స్వీకరించిన పప్పు వెంకన్న సన్మానానికి సమాధానం చెప్తూ...

"రసజ్ఞ్నులారా! నేను శ్రీశ్రీశ్రీ ఆనంద గజపతి వారి ఆస్థాన విద్వాంసుణ్ణి... కారణాంతరాలవల్ల...

సమయానికి ఇక్కడ విద్వాంసుడు రాకపోవడం వల్ల... సభారంజనం చేద్దామన్న సదుద్దేశంతో గానం ఆరంభించాను.

ఆస్థాన నియమం ఉల్లంఘించి ఆనంద గజపతుల వారి అనుజ్ఞ్న లేకుండా పాడినందుకు రాజావార్ని క్షమించవల్సిందిగా వేడుకుంటున్నాను".

అనగానే... ఆనందగజపతుల వారు ముందుకొచ్చి...

"కళాకారుడు నిరంశకుడు... స్వేచ్చాజీవి... ఆయన ఎవరికీ లోబడి బతకాల్సిన అవసరం లేదు! మీవంటి కళాకారులకు ఆంధ్ర మహాసభలో మేమే

ప్రత్యేకమైన సభ ఏర్పాటు చెయ్యాల్సింది! అంచేత తప్పు మాది...మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని పప్పు వెంకన్న గారిని వేడుకుంటున్నాను".

అని వెంకన్నను గాఢంగా ఆలింగనం చేసుకున్నారు.

సభాసదులందరి కళ్ళలోనూ తడి!

శృంభూపతి కళ్ళు చెమచాయ్!

పప్పు వెంకన్న కళ్ళల్లోంచి జలజల ముత్యాలు రాలాయి!


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech