Sujanaranjani
           
  అన్నమయ్య కీర్తనలు    
 

                                                             రచన : జి.బి.శంకర్ రావు

  ఎవ్వరెవ్వరివాడొ

ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుడు చూడ
ఎవ్వరికి నేమౌనో యీ జీవుడు

ఎందరికి గొడుకుగాడీ జీవుడు వెనక
కెందరికి దోబుట్టడీ జీవుడు
ఎందరిని భ్రమయించండీ జీవుడు,దుఃఖ
మెందరికి గావింపడీ జీవుడు

ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు, వెనక్
కెక్కడో తనజన్మ మీ జీవుడు
ఎక్కడి చుట్టము తనకు నీ జీవుడు ఎప్పు
డెక్కడికినేగునో యీ జీవుడు

ఎన్నడును జేటులే నీ జీవుడు వెనక
కెన్ని తనువులు మోవడీ జీవుడు
ఎన్నగల తిరువేంకటేశు మాయలదగిలి
యెన్ని పదవుల బొందడీ జీవుడు

 ఈ ప్రపంచంలోని పరమాత్ముని మాయా విలాసం! మన జీవితం ఒక నాటకం! నాటకంలోని పాత్రల్ నిడివి ఎంత స్వల్పమో, ఈ అనంత కాలగమనంలో మన్ జన్మలూ అంతే! ఈ జనన, మరణ చక్రంలో తిరుగాడే జీవుడు ఎంతో మందికి పుత్రుడు, భర్త, తండ్రి, తాత పాత్రలను పోషిస్తాడు. ఎంతోమందితో స్నేహం, వైరం చేస్తాడు. ఎంతో మందికి మంచి చెడు చేస్తాడు. ఎంతో పుణ్యం, పాపం చేస్తాడు, ఎన్నో సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. చివరికి ఎవరికి చెందనివాడవుతాడు. తన కర్మలను పుణ్యపాపాలతో దహనం చేసుకున్న తరువాత చివరికి పరమాత్మ సాన్నిధ్యం చేరుకుంటాడు. అదే శాశ్వత స్థితి! ఆ స్థితిని చేరుకునే వరకూ ఈ జీవుడు తిరువేంకటేశ్వరుని మాయలో చిక్కుకుని ఇన్ని వేషాలు వేస్తాడు. అని అంటున్నాడు అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో!

చేటు = నాశనము;
తనువు ; శరీరము;


ఏ కులజుడేమి

ఏ కులజుడేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడే హరినెఱిగినవాడు

పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ తత్పరుడు కాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులు తానేయని భావించువాడు

నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు
కర్మమార్గములు గడవని వాడే
మర్మమై హరిభక్తి మఱవని వాడు

జగతిపై హితముగా చరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ తెలిసినవాడే
తగిలి వేంకటేశు దాసుడయినవాడు
 

 భగవంతునికి కులగోత్రాలు లేవి. అలాగే భక్తునికి కూడ! అనంత కాలగమనాన్ని పరికిస్తే, భగవంతుడు అన్ని కులాలలోనూ అవతరించాడు! అలాగే అన్ని కులాలలోనూ మహా భక్తులు ఉదయించారు. ఆత్మార్పణ భక్తి కలవాడు ఏ కులానికి చెందినా, వాడే సర్వాంతర్యామియైన, భగవంతుని, భగవత్త్వాన్ని తెలిసినవాడవుతాడు! సత్య సంధత (ఋజు ప్రవర్తన) కలిగియుండి ఇతరులను నిందించని వాడు, జీవులపై ప్రేమ కలవాడు, పరోపకార బుద్ధి కలిగిన వాడు, ఆత్మ నియంత్రణ శక్తి కలవాడు, ఇతరులకు శ్రేయస్సును కలిగించువాడు, ద్వేషభావం మనసున లేనివాడు.. ఇలా సద్గుణాలను తనలో పొదుగుకుని, హరిభక్తిని అన్ని వేళలా కలిగి ఉండేవాడు ఏ కులానికి చెందినా, మతానికి చెందినా, జాతికి చెందినా అతడు మహనీయుడు! అట్టివాడే శ్రీ వేంకటేశ్వరుని కృపకు పాత్రుడౌతాడు.
 

భూతదయానిధి - సకల ప్రాణుల పట్ల దయగలవాడు;
పరగిన = ప్రవర్తిల్లు


 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech