అమెరికా సందర్శనం - బండారు శ్రీనివాస రావు బండారు శ్రీనివాసరావు గారు తెలుగువారికందరికీ సుపరిచితులే- ఆకాశవాణి లో AIR-హైదరాబాద్, మాస్కో లలో వార్తలు చదువుతూ,దూరదర్సన్లో ప్రోగ్రాం డైరెక్టర్ గా చేస్తూ, ఒక ప్రముఖ జర్నలిస్టుగా పేరుతెచ్చుకుని, అనేక వార్తాసంబంధిత కార్యక్రమాలను వారు నడిపారు. ప్రతినేలా వారిని సుజనరంజనికి ఒక శీర్షిక వ్రాయమని అడిగితే వారు అంగీకరించారు. త్వరలో వారి సహకారంతో ఒక సరిక్రొత్త శీర్షిక మీముందుకు తేబోతున్నాము. ప్రస్తుతం వారి అమెరికా సందర్శన అనుభవాలను, అమెరికాకి క్రొత్తగా వస్తున్న పేరెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే విధంగా వ్రాసారు. అది అందరికీ ఉపయోగపడుతుందని మీ ముందుకు తెస్తున్నాం.

నేను హైస్కూల్లో చదుతున్న రోజుల్లో ప్రముఖనటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు అమెరికా సందర్శించి- "నేను చూసిన అమెరికా" అని పుస్తకం రాశారు. అది చదివి ఆ పుస్తకానికి అలా పేరు ఎందుకు పెట్టారా అని నేను అనుకునేవాదిని. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు అమెరికాలో అయిదు మాసాలు ఉండి వచ్చిన తర్వాత అర్థమయ్యింది. అమెరికా సువిశాల దేశం. టూరిష్టుగా వచ్చిన వాళ్ళేకాదు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వుంటూ వచ్చిన వాళ్ళు సయితం ఈ దేశాన్ని పూర్తిగా చూడటం అన్నది కుదరని పని. అందుకే చూసిన మేరకే అమెరికాని అర్థంచేసుకుని అక్షరబద్దం చేసేందుకే ఈ ప్రయత్నం.

అమెరికా వెళ్ళడం అన్నది మనదేశంలో చాలామందికి తీరని కల. ఎందుకంటే వీసా నిబంధనలు అంత కఠినతరం. డబ్బున్నవాళ్ళు కూడా - మరో మరో విదేశానికి వెళ్ళివచ్చినంత సులభంగా అమెరికా వెళ్ళలేరు. ఓ పుష్కరం క్రితం ఆకాశవాణి పుణ్యమా అని మాస్కోలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసి వచ్చాను. అప్పట్లో ప్రపంచదేశాల్లో అమెరికాకు పోటీగా నిలబడిన మరో ఏకైక అధికార ధృవం సోవియట్ యూనియన్. అనేక దశాబ్దాల తరబడి అప్రతిహాతంగా సాగిన మొట్టమొదటి కమ్యూనిష్ట్ ప్రభుత్వం అంతిమ ఘడియలు చూడగలిగే అరుదయిన అవకాశం లభించిన నేను - "మార్పు చూసిన కళ్ళు" అనే పేరుతో ఆనాటి అనుభవాలను గ్రంధస్తం చేయాలనుకున్నాను. కానీ తీరని కోరికగానే మిగిలిపోయింది. పోతే ... ఇప్పుడు మా పెద్దబ్బాయి సందీప్ - అమెరికా చూసే అవకాశాన్ని కల్పించి, సోవియట్ రష్యా- అమెరికాలు రెండింటినీ చూసిన హైదరాబాదు జర్నలిష్టులు కొద్దిమందిలో నన్ను చేర్చాడు. నాకు తెలిసి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఐ. వెంకటరావుగారు- ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రెటరీ జెనరల్ కె. శ్రీనివాస రెడ్డి గారు కూడా ఈ రెండు దేశాలను చూసినవారిలో ఉన్నారు. మిత్రుడు మాగంటి కోటేశ్వరరావుగారి పూనికతో ఎలాంటి టెన్షను పడకుండా లభించిన పది సంవత్సరాల వీసాలతో నేను, మా ఆవిడ నిర్మల - హైదరాబాదులో 2003 సెప్టెంబరు ఆరో తేదీ శనివారం మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరి కౌలలంపూర్ మీదుగా సుమారు 30 గంటలు ప్రయాణంచేసి తిరిగి అదే రోజు అంటే శనివారం నాడే అమెరికాలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటైన లాస్ ఏంజిలెస్ చేరుకున్నాము. భూమండలానికి ఆవలివైపున్న దేశానికి చేరడంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పు ఫలితం ఇది.

9-11

'క్రీస్తుపూర్వ - క్రిస్తు తర్వాతా మాదిరిగానే 'అమెరికా' 9-11 పూర్వం, 9-11 తర్వాత, అన్నట్టుగా తయారయింది. ఈ దేశంలో తేదీలు రాసేటప్పుడు - ముందు నెల - తర్వాత తేదీ - ఆ తర్వాత సంవత్సరం పేర్కొంటారు. ఇక్కడ 9 అంటే సెప్టెంబర్- 11 అంటే తేదీ. సెప్టెంబర్ 11 వ తేదీని ఇప్పుడంతా ఒక దేశభక్తుల దినంగా పాటిస్తున్నారు. న్యూయార్క్ నగరానికి - ఇంకా చెప్పాలంటే మొత్తం అమెరికాకే చిహ్నం అనతగ్గ - ప్రపంచ వాణిద్య సంస్థ జంట భవనాలను టెర్రరిష్టులు విమానంతో ఢీకొట్టి కుప్పకూల్చివేసిన రోజది. యావత్ ప్రపంచానికి పెద్దన్న మాదిరిగా వ్యవహరిస్తూ తమ అధికారానికి, భద్రతా వ్యవస్థకూ ఎదురులేదని, ఏళ్లతరబడి పెంచి పోషించుకున్న అమెరికన్ల ఆత్మవిశాసానికి తూట్లు పడ్డ దుర్దినం అది. ఆ రోజునుంచి అమెరికాలో పరిస్తితులు చాలా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరగనున్నదోనన్న అభద్రతా భావం అధికారవర్గాలలోనేకాక - సామాన్య జనంలో కూడా పెరిగిపోయింది. వ్యక్తిగత స్వాతంత్ర్యానికి పెద్దపీట వేసే ఈదేశంలో - తొలిసారిగా అమెరికన్లు - కట్టు దిట్టమైన భద్రతాచర్యలకు తలవంచుతున్నారు.

అమెరికా గడ్డమీద - లాస్ ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రమంలో మొదటిసారి కాలు మోపినప్పుడు ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. మనదేశంలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి సర్వసాధారణం. వెనుకటి రోజుల్లో మనలాంటి దేశాల్లో ఈ రకమైన భద్రతా చర్యలు చూసిన అమెరికన్లు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారేమో తెలియదు.

ఎందుకిలా జరిగింది?

లాస్ ఏంజిలిస్ విమానాశ్రయం అతిపెద్దది. ప్రతినిముషం ఏదో ఒక విమానం ఏదో ఒక దేశం నుంచి వచ్చి ఇక్కడ వాలుతుంది. వందలాది మంది ప్రయాణికులు తమ పాస్ పోర్ట్ లపై వీసా స్టాంపు వేయించునేందుకు పెద్ద పెద్ద క్యూలలో నిలబడి ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. అనేక గంటలపాటు ప్రయాణం చేసివచ్చి - ఇమిగ్రేషన్ అధికారుల అనుమానపు చూపుల్ని ఎదుర్కొంటూ - ఆలస్యం అయ్యినకొద్దీ కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోతుందేమో అని భయపడుతూ వీసా ప్రోసెసింగ్ పనులు పూర్తికాగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. బ్యాగేజ్ చెకింగ్ మరోప్రయాస. స్టెయిన్లెస్ టంగ్ క్లీనర్లు కూడా భద్రతా అధికారుల డేగకన్నులనుంచీ తప్పించుకోలేవు. క్యూలో వున్నప్పుడు ప్రయాణీకుడికీ- మరో ప్రయాణీకుడికీ మధ్య ఎడం ఉండాలి. బూట్లు, సాక్సు తీసి అధికారుల కళ్ళేదుటే ప్లాస్టిక్ ట్రేల్లో ఉంచాలి. ఆడ ప్రయాణికుల పరీస్థితి మరీ ఘోరం. వాళ్లని ప్రత్యేక ఎంక్లోజర్ లో వుంచి ఆపాదమస్తకం పరీక్షిస్తారు.పాదాల గుర్తులు వున్న ప్రదేశంలో మాత్రమే కాళ్ళు వుంచి నిలబడాలి. సహజంగా స్వేఛ్ఛా ప్రియులైన అమెరికన్లు - మరింత సహజంగానే - మానసికంగా వ్యాకుల పడుతున్నారు. అంతర్లీనంగా వున్న ఈ వేదన వారి మొహాల్లో కానవస్తూనే వుంది. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్న వారిని వేధిస్తూనే వుంది.

**** **** *****

రోలాండ్ వేథా వేవాకో - ట్రిబ్యూన్ హెరాల్డ్ లో సీనియర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో ఎక్సరే యంత్రాల వాడకం ప్రయాణికుల ప్రైవసీని హరించడమే కాగలదని ఒక వ్యాసంలో ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ఆ వ్యాసం కొన్ని భాగాలకు స్వేఛ్ఛానువాదం.

"ఎక్సరే కాళ్ళు సూపర్ మాన్ కి మాత్రమే ఉంటాయని ఇన్నాళ్ళూ భావిస్తూ వచ్చాను. సెప్టెంబర్ 11, 2001 తర్వాత ఆవిర్భవించిన ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ ఏజన్సీ అధికారులకు ఇలాంటి ఎక్సరే కళ్ళు ఇప్పుడు చాలా అవసరంగా కనిపిస్తున్నాయి. విమానం ఎక్కేఆడా-మగా ప్రతి పాసింజర్ దుస్తుల్ని చీల్చుకుని వారిని నఖశిఖ పర్యంత నగ్నంగా సోదాచేసేందుకు 'బ్యాక్ స్కాటర్ ' ఎక్సరే యంత్రాలను వాడాలనుకుంటున్నారు. దుస్తుల్లోపల ఏవైనా ప్రమాదకరమైన ఆయుధాలు కలిగి వున్నారా లేదో తెలుసుకోవడం కోసం ఒక్కొక్కటి రెండు లక్షల డాలర్లు ఖరీదు చేసే ఈ యంత్రాలను కొనుగోలు చేసే పనిలో వున్నారు. ప్రస్తుతం ఈ విధులను స్వయంగా నిర్వర్తిస్తున్న స్క్రీనింగ్ సిబ్బంది, ప్రయాణికుల శరీరంలోని ప్రైవేటు పార్టులను అభ్యంతరకరమైన్ రీతిలో తాకుతున్నారని విమర్శలు కొల్లలుగా వస్తున్నాయి. ఈ యంత్రాలను వాడితే ఈ అభ్యంతరకర భౌతిక శోధన చాలా వరకు తగ్గిపోగలదని ఏజెన్సీ అధికారులు భావిస్తున్నారు. అయితే సెక్యూరిటీ పేరుతో నిర్వహించే ఈ సోదాలు పౌరుల ప్రైవసీని పూర్తిగా హరిస్తున్నాయి. మామూలు జలుబుకు ఇంతవరకూ సరయిన మందు కనుక్కోలేని శాస్త్రవేత్తలు - మనుషుల దుస్తులగుండా నగ్నంగా చూడగల ఇలాంటి బ్యాక్స్కాటర్ ఎక్సరే యంత్రాలను మాత్రం మహా ఉత్సాహంగా కనుక్కుంటారు. టెర్రరిస్టుల వల్ల ప్రమాదాలు నిజమేకానీ ఇలాంటి సెక్యూరిటీ చర్యలు ఉగ్రవాదానికి పరిష్కారం కాదు. ప్రభుత్వం గట్టిగా పూనుకుని ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. ఉగ్రవాదులను ఏరిపారేయాలి. అప్పుడు భద్రత గురించి బెంగవుండదు. అంతేకాదు పరిస్థుతుల్ని అడ్డంపెట్టుకుని పౌరుల ప్రైవెసీని హరించాలని చూసే ప్రభుత్వ భద్రతావ్యవస్థల ఉబలాటానికి కూడా కళ్ళెం పడుతుంది. అంతేకానీ - ఎయిర్ పోర్టుల్లో ఇలాంటి ఎక్సరే యంత్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను మొండిగా ఆచరణలో పెడితే చాలామంది జనం విమానాలు ఎక్కడమే మానుకుంటారు. "

**** **** *****

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇక్కడి అధికారగణంలో ఎలాంటి డాబు-దర్పం కనిపించవు. కఠినంగా వున్నటు కానవస్తారేగానీ మాటల్లో మర్యాద ఉట్టిపడుతూవుంటుంది. విధి నిర్వహణని నియమబద్ధంగా పాటిస్తారు. అందువల్ల భద్రతా ఏర్పాట్లలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వ్యక్తిగత సోదాల కారణంగా మనస్సు చివుక్కుమంటుందేమో కానీ అహం దెబ్బతినదు.

తొలిపరిచయం

లాస్ ఏంజిలిస్ నుండీ సియాటల్ వెళ్ళడానికి మరో విమాన ఎక్కాలి. దానికి రెండుగంటలకు పైగా వ్యవధివుంది. లాస్ ఏంజిలిస్ చేరగానే ఫోను చేయడానికి డబ్బులో అవసరంలేని ఫోనునెంబర్ సందీప్ ఇచ్చాడు. దాని ద్వారా కబురు అందించడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నా పాట్లు గమనించిన ఓ అమెరికన్ మహిళ చొరవతీసుకుని తనసెల్ ఫోన్ ద్వారా సియాటల్ లోని సందీప్ కి సమాచారం అందించింది. అమెరికన్లతో నా తొలిపరిచయం ఇలా సుహృద్భావంగా జరగటం ఎంతో సంతోషం అనిపించింది. సియాటల్ వెళ్ళే విమానం ఎక్కేముందు కూడా మా బ్యాగేజీని క్షుణ్ణంగా పరీక్షించారు. ఊరగాయ పచ్చళను గురించి ఒకటికి రెండుసార్లు ప్రశ్నించారు. చివరికి సామానంతా మా కళ్ళముందరే సూట్కేసుల్లో జాగ్రత్తగా సర్దిమాకందించారు. ఇంటికి చేరిన తర్వాత -సూట్ కేసులు తెరిచి చూస్తే- సామాన్లపైన - ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఎడ్మినిస్టేషన్ వారి నోటిసు కనిపించింది. అందులో ఇలా వుంది.

**** **** *****

బ్యాగేజ్ తనిఖీ నోటీసు

'మీకూ - మీ తోటి ప్రయాణీకులకు భద్రత కల్పించే చర్యల్లో భాగంగా మీ బ్యాగేజిని మేము క్షుణ్ణంగా తనిఖీ చేశము. ఇందుకు ఎంపిక చేసిన బ్యాగేజీల్లో మీది కూడావుంది. నిషేదిత సామాగ్రి ఏమయినా వుందేమో తెలుసుకోవడంకోసం మీ బ్యాగేజీని తెరిచి చూశం. తాళాలు వేసి ఉన్నందువల్ల - గత్యంతరం లేని స్థితిలో వాటిని పగులగొట్టవలసి వచ్చింది. క్షంతవ్యులం. అయితే నిబంధనల మేరకే ఈ పని చేశాము. అందువల్ల- బ్యాగేజీకి ఏదయినా నష్టం జరిగినా - దానికి మాపూచీ లేదు. మీరు మరోసారి విమాన ప్రయాణం చేసినప్పుడు ఇలాంటి అనుభవం పునరావృతం కాకుండా వుండాలంటే - బ్యాగేజిని ఎలా ప్యాక్ చేసుకోవాలో మీకు ముందే తెలిసివుంటే మంచిది. www.tsa.gov వెబ్ సైట్ లో ఈ వివరాలు లభిస్తాయి. 866-289-9673 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయండి. లేదా TSA-contactcenter@dhs.gov అనే ఈ మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు.
సరైన భద్రత సమయాన్ని ఆదా చేస్తుంది

**** **** *****

సియాటల్

ఎట్టకేలకు సియాటల్ వెళ్ళే విమానం ఎక్కాం. సుమారు రెండుగంటల ప్రయాణం.సియాటల్ గురుంచి నాకు తెలిసింది చాలా తక్కువ. మైక్రోసాఫ్ట్ ప్రధానకార్యాలయం అక్కడ వుందని తెలుసు. ఆంధ్రజ్యోతిలో లోగడ పనిచేసిన నామిత్రుడు రామానాయుడు ఆపత్రిక తరఫున సియాటల్ వెళ్ళి వచ్చాడు. ఎప్పుడూ వానలు పడుతుంటాయని చెప్పాడు. మేము సియాటల్ వెళ్ళే సరికి వాతావరణంబాగానే వుంది. సందీప్ తన స్నేహితుడు అనూప్ తో కలిసి రెండుకార్లు తీసుకుని ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. భద్రతా ఏర్పాట్లు ఎంత కఠినంగా వున్నా - విజిటర్లని లగేజి కలెక్టుచేసుకునే ప్రాంతం వరకూ అనుమతిస్తూనేవున్నారు. మా మనుమరాలు నఖి కూడా ఎయిర్ పోర్టుకి వచ్చింది. అందరం కలసి కారు పార్కింగ్ కు వెళ్ళాము. అదో పలు అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తులో రెండుమూడువందల కార్లవరకూ పార్కింగ్ చేసుకోవడానికి వీలుంది. మేము లిఫ్ట్ లో ఏడో అంతస్తు వెళ్ళి కార్లలో లగేజీ వేసుకుని గంట ప్రయాణం తర్వాత బెల్ వ్యూ లోని సందీప్ అపార్ట్ మెంట్ కి చేరాము.

గీతల నడుమ జీవితం

నేను ముందు అనుకున్నట్లు సియాటల్ చిన్న నగరంకాదు. హైదరాబాదుకి రెండుమూడు రెట్లు పెద్దది. అనేక కొండలమీద నిర్మితమైన నగరం. విశాలమైన రహదారులపై కార్లు గంటకి వందకిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఈ రోడ్లను చూస్తుంటే అమెరికన్లను గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తువస్తోంది. సుఖప్రదమైన జీవితం గడపటం వారి లక్ష్యం. జీవితం సజావుగా సాగడానికి కొన్ని నియమనిబంధనలను ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు సర్కారు అజమాయషీ కంటే-వ్యక్తిగతంగా పౌరులు కట్టుబడి వ్యవహరించడంవల్లనే అవి విజయవంతం అయ్యాయని చెప్పవచ్చు. అమెరికాలో మీకు నచ్చిన విషయం ఏమిటంటే నిస్సంశయంగా రహదారులు అని నేను జవాబిస్తాను. మనలో చాలామందిమి టీవీ గేమ్స్ చూసివుంటాము. రోడ్లపై గీతలనడుమ ఎదురుగా వస్తున్న వాహానాలను తప్పించుకుంటూ కారు నడపాలి. గీతలకు అవలగా ఏ మాత్రం జరిగినా ప్రమాదం జరుగుతుంది. అలాగే అమెరికాలోకూడా నిర్దిష్టమైన వేగంతో గీతలనడుమన కారు నడుపుకుంటూ వెళితే చాలు. ఎలాంటి ప్రమాదమూ వుండదు. వాహనాలు వెళ్ళడానికి, రావడనికి వెర్వేరు రహదారులుంటాయి. ఒక్కోమార్గంలో మూడు, నాలుగు వరుసల్లో వాహనాలు వెళుతుంటాయి. హారన్ మోగించే ప్రసక్తే లేదు. ఓవర్ టేక్ చేయాలంటే ఖాళీగా వున్న మరో వరుసలోకి వెళ్ళి -వేగంగా దాటి మనవరసలోకి రావాలి. రోడ్డు ఎడమవైపు వరుసని కార్ పూల్ లేన్ అంటారు. ఆ వరుసలో బస్సులు లేదా కారు డ్రైవరుతో పాటూ మరోప్రయాణికుడు విధిగావుండితీరాలి. ఆలైనులో వెళ్ళే వాహనాలు తక్కువగా వుంటాయి. కనుక వేగంగా వెళ్ళటానికి వీలుంటుంది. రోడ్లమీద వాహనాల రద్దీ తగ్గించడానికి ఈ నిబంధన ఏర్పాటుచేసారని చెప్పుకుంటారు. అక్కడ ప్రతివారికీ కారు వుంటుంది కనుక ఇద్దరు కల్సివెడితే రెండవ కారు తీయనక్కరలేదు కాబట్టి రద్దీ తగ్గుతుందంటారు. కార్ పూల్ వరుస కాకుండా వేరే వరసల్లో వాహనాల రద్దీ ఎక్కువగా వుండి చాలా సార్లు ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. నిజానికి ఆ వరుసల్లో వెళ్ళె కార్లలో ఒకే వ్యక్తి ప్రయాణిస్తుంటాడు. అయినా సరే కార్ పూల్ వరుసలోకి రావాడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడు. చేశాడా జరిమానాలు భారీగా వుంటాయి. జరిమానా భయంకన్నా నిబంధన పాటించాలన్న నిబద్దతే వారినలా చేయిస్తుంది. నాలుగు రోడ్లకూడలిలో ఏర్పాటుచేసిన సెన్సర్ వ్యవస్థకూడా ఎంతో బాగుంది. ఇక్కడ్ ట్రాఫిక్ దీపాలు 24గంటలు నిరంతరం పనిచేస్తాయి. వాహనాల రద్దీ తక్కువగావుండే అర్థరాత్రి సమయాల్లో ఈ సెన్సర్లు ఉపయోగపడతాయి. ఎదుటివైపు నుంచి వాహనాలు రాకపోయినా ఎర్ర దీపం కారణంగా కారు నిల్పాల్సిన అవసరం లేకుండా రోడ్లక్రింద అమర్చిన ఈ సెన్సర్లు - కారు ముందు టైర్లు తాకగానే -గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేస్తాయి.

వినియోగదారుడే సుప్రీం

అమెరికాలో ఏదీ ఉచితంకాదు. ప్రతి వస్తువుకూ- ప్రతి సర్వీసుకూ ధరచెల్లించవలసిందే. ఇక్కడ అన్నీ ప్రైవేటు పరం. పోటీ తత్వం ఎక్కువ. వినియోగదారుని ఆకర్షించడానికి అన్నిరకాల మార్గాలనూ అన్వేషిస్తుంటారు. ఈ ప్రైవేటుపోటీ మనవైపులాగానే అనారోగ్యంగా అనిపించినా నాణ్యతకు సంబంధించి మాత్రం ఎలాంటి రాజీ వుండదు. ఇక్కడ వినియోగదారుడే సుప్రీం. ఏ వస్తువయినా ఎంత ఖరీదు పెట్టికోన్నా నచ్చకపోతే మూడునెలల తర్వాతకూడా ఎలాంటి కారణంచూపించకుండా వాపసు చేసి మొత్తం డబ్బు వెనక్కు తీసుకునే సౌలభ్యంవుంది. ఇందుకోసం అన్నిషాపులలోనూ కష్టమర్ సర్వీస్ సెంటర్లుంటాయి. ఎలాంటిప్రశ్నలు వేయకుండా క్షణాలలో వస్తువుని తిరిగితీసుకుని అణాపైసలతో (డాలర్లు సెంట్లతో సహా అన్నమాట)డబ్బు తిరిగి చెల్లిస్తారు. వ్యాపారం అంతా నమ్మకం మీద జరిగిపోతూవుంటుంది. పైకి ఇలా కనిపించినా లోలోపల ఓ మతలబువుంది. ఈ దేశంలో లావాదేవీలన్నీ పేపరుకరెన్సీ మీద జరిగిపోతుంటాయి. అంటే క్రెడిట్ కార్డుల ద్వారా అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికీ సోషల్ సెక్యూరిటీ నెంబరువుంటుంది. అమెరికన్ల జీవితం యావత్తూ ఈ నెంబరు మీదే ఆధారపడి వుంది. ఇన్స్యూరెన్స్, బ్యాంక్ ఖాతాలు, డ్రైవింగ్ లైసెన్స్, రెంట్, కరెంట్ బిల్లులు అన్నీ ఈ నెంబరు ఆధారంగానే వుంటాయి. ఎక్కడ ఏ తభవతు వచ్చినా మొత్తం గల్లంతే. అందుకే లావాదేవీలన్నీ నిరాటకంగా - ఎలాంటి ఇబ్బందులు లేకుండా ' నమ్మకంగా ' జరిగిపోతుంటాయి.

హద్దులు కలిగిన స్వేచ్చ

ఈ దేశంలో స్వేచ్చకు అర్థం స్వేచ్చను పరిహరించడం కాదు. అమెరికన్లు ఇతరుల వ్యవహారాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోరు. అలాగని బావిలో కప్పల్లా ఉండిపోరు. తెలియని వాళ్ళని సయితం చెరునవ్వుతో పలకరిస్తారు. మందహాసమే వారి విజయరహస్యం అనిపిస్తుంది.

(సశేషం- మళ్ళీ తరువాతి సంచికలో)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)