మూలం: స్టెఫాన్ త్సైక్

రచయిత మాటల్లో: "నేను పదో తరగతి చదివే రోజుల్లో 'విరాట్' చదివాను. నాకు ఎంత నచ్చిందంటే అప్పటినుంచి ఇప్పటి వరకు కనీసం వంద సార్లయినా చదివుంటాను. విరాట్ పాత్ర నా జీవిత దృక్పథం మీద, జీవనవిధానం మీద చాలా ప్రభావం చూపింది. విరాట్ నవలికను చాలామంది చేత చదివించాను. చదివిన వాళ్ళందరిది ఒకటే అభిప్రాయం. సబ్జక్ట్ అద్భుతంగా ఉంది..."

ప్రారంభం:

బుద్ధ భగవానుడు ఈ భూమి మీద అవతరించడానికి కొద్దిరోజుల ముందు వీరవాఘరాజ్యంలో ఒక మహోన్నత వ్యక్తి జన్మించాడు. అతని పేరు విరాట్. గొప్ప యోధుడు. కత్తి యుద్ధంలో అసమాన ప్రతిభాశాలి, గురి తప్పని విలుకాడు, వజ్ర సమానమైన బాహుబలుడు, అంతులేని ధైర్యశాలి. గంభీరమైన విగ్రహం, భీతి ఎరిగని చూపు ఆయనవి. ఆయన నిండు కుండలా తొణకని మనిషి; సత్యనిష్ట గలవాడు; పవిత్రుడు; శాంత స్వభావుడు. ఆయన ఆవేశపడగా, కోపంగా మాట్లాడగా ఎవరు చూడలేదు.

ఆయనకు రాజంటే గౌరవం, భక్తి. విరాట్ పరిచయం ఉన్న వ్యక్తులకు ఆయనంటే పూజ్యభావం. ఆయన ఇంటిముందు నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా గౌరవసూచకంగా తలవంచుకు వెళ్ళేవాళ్ళు. పసిపిల్లలు మెరుస్తున్న ఆయన కళ్ళను చూసి చిరునవ్వులు చిందించే వాళ్ళు. మధ్యవర్తిగా ఆయన చెప్పే తీర్పుల్ని ఆ ప్రాంతవాసులంతా శిరోధార్యంగా భావించేవాళ్ళు.

ఉన్నట్టుండి ఒకరోజు రాజుగారికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. రాజ ప్రతినిధిగా, వీరవాఘ రాజ్యంలో సగభాగాన్ని పరిపాలిస్తున్న రాజుగారి బావమరిదికి రాజ్యం మొత్తాన్ని ఆక్రమించాలన్న అత్యాశ పుట్టింది. రాజుగారి సైన్యంలోని మెరికల్లాంటి యోధులకు లంచాలిచ్చి తనవైపు తిప్పుకున్నాడు. పూజారులను లోబరుచుకున్నాడు. ఆ రాజ్యానికి పవిత్ర రాజచిహ్నంగా ఎన్నో వేల సంవత్సరాలనుంచి రాజసరోవరంలో ఉంటున్న హంసల్ని రాత్రికి రాత్రే పూజారుల ద్వారా తరలించేశాడు. తనకు అందుబాటులో ఉన్న ఏనుగుల్ని సేకరించుకున్నాడు. రాజు పట్ల కోపంగా ఉన్న పర్వతవాసుల్ని చేరదీసి తన సైన్యంలో కలుపుకుని రాజధాని మీదికి దండెత్తాడు.

రాజాజ్ఙ మేరకు కోట ప్రాకారాలపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా నగారాలు మోగించారు. గంటలు కొట్టారు. రాత్రి కాగానే కోటగోడ గోపురాలపై పెద్ద కాగడాలు వెలిగించారు. ఆ మంటలపై చేపల పొలుసులు చల్లారు. పొలుసులు మంటపై పడగానే పసుపు రంగు వెలుతురు వచ్చేది. అది ప్రమాద సంకేతం. కోటకు ప్రమాదం ఏర్పడింది, రండి అని ప్రజలకు పిలుపు. అయితే ప్రజలు ఎక్కువగా రాలేదు. వాళ్ళూ భయపడిపోయారు. కారణం ఏమిటంటే రాజహంసలు దొంగిలింపబడ్డాయన్న విషయం రాజ్యం నలువైపులా తెలిసిపోయింది. సైన్యంలో రాజుగారికి ఎంతో విశ్వాసపాత్రులుగా పేరుపొందిన గజదళాధిపతి, సేనాధిపతి కూడా శత్రువులతో కలిసిపోయారు. దాంతో మిగిలిన కొద్దిమంది సర్దార్లు కూడా లోలోపలే వణికిపోతున్నారు.

నౌకర్లు, బానిసలు మందలు మందలుగా ఉన్నారు తప్ప కోట రక్షణ బాధ్యత అప్పగిద్దామంటే విశ్వాసపాత్రుడైన సర్దార్ ఒక్కడు కూడా కనిపించలేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రాజుగారి వ్యవహారశైలి. ఆయన కఠిన హృదయుడు. చిన్న తప్పులు చేసినా పెద్ద శిక్షలు విధించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సామంతరాజుల నుంచి కప్పం వసూలు చేయడంలో నిర్దయగా వ్యవహరిస్తాడు. అందువల్ల ఆయన ఇలాంటి ఆపద సమయంలో మిత్రుల సాయమర్థించి భంగపడ్డాడు.

ఈ విపత్కర పరిస్థితుల్లో తనను ఆదుకోగల వాళ్ళు ఎవరు? అని ఆలోచిస్తుండగా రాజుగారికి తనపట్ల అచంచల భక్తివిశ్వాసాలుగల విరాట్ గుర్తొచ్చాడు. వెంటనే పల్లకి ఎక్కి విరాట్ ఇంటికి వెళ్ళాడు. రాజుగారు పల్లకి దిగగానే విరాట్ సాష్టాంగ నమస్కారం చేశాడు. కాని విరాట్ ముందు రాజుగారు దీనంగా, యాచకుడిలా కనిపించాడు. తన సైన్యానికి నాయకత్వం వహించి శత్రువును ఎదుర్కోవలసిందిగా కోరాడు. విరాట్ రాజుగారికి ప్రణామం చేసి "మీ ఆజ్ఙ శిరోధార్యం. విద్రోహాగ్నిని అణిచిగాని తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టను" అని ప్రతిజ్ఙ చేశాడు.

వెంటనే విరాట్ తన కొడుకుల్ని, స్వజనుల్ని, బానిసల్ని, మిగిలిన సైనికుల్ని, రాజభక్తుల్ని సమీకరించి శత్రువుపైకి యుద్ధానికి బయలుదేరాడు. అడవిగుండా ప్రయాణించి సూర్యాస్తమయ సమయానికి ఒక నదీతీరానికి చేరుకున్నారు.

సరిగ్గా ఆ నది ఆవలి తీరాన్నే అసంఖ్యాకమైన శత్రుసేన విడిది చేసి ఉంది. తమ సంఖ్యాబలం, వీరాధివీరులైన యోధులు కొందరు తమ సైన్యంలో ఉండడంతో తమకు ఎదురులేదు, విజయం తమదేనన్న ధైర్యంతో ఉన్నారు. అందుకే ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని మరునాటి ఉదయం నదిని దాటి కోటపై దాడి చెయవచ్చనే ఉద్ధేశంతో ఉన్నారు. కొద్దిమంది మాత్రం మరునాడు నదిని దాటడానికి వీలుగా పెద్దపెద్ద చెట్లను నరికి నదిపై వంతెన నిర్మిస్తున్నారు.

ఈవలి తీరానా విరాట్ సైన్యం మకాం వేసింది. విరాట్ ఒక పులిని వేటాడుతూ నదీ తీరాన్నే కొంత దూరం పోయినప్పుడు అక్కడ ఒక రేవు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే వచ్చి సైన్యాన్ని సమాయత్తపరిచాడు. అర్థరాత్రి కాగానే తన సైన్యాన్ని తీసుకొని రేవు దాటి హఠాత్తుగా సేనలపైకి విజృంభించాడు. విరాట్ సైనికులు మండుతున్న కాగడాలతో ఏనుగుల్ని భయపెట్టి చెల్లాచెదురు చేశారు. అర్థరాత్రి వేళ ఏనుగులు గందరగోళంగా పరుగెత్తడంతో నిద్రనుంచి లేచిన శత్రువులు ఎవరి దారిన వాళ్ళు పరుగులు తీశారు.

రాజ్యకాంక్షతో యుద్ధానికి సిద్ధపడ్డ రాజుగారి బావమరిది గుడారంలో ఉన్నాడు. అందరికన్నా ముందుగా విరాట్ ఆ గుడారంలోకి ప్రవేశించాడు. లోపలికి అడుగు పెట్టీపెట్టగానే ఇద్దరిని యమపురికి పంపించాడు. మూడవవాడు ఆయుధం అందుకునే లోపే వాడిని తెగ నరికాడు. ఆ చీకటిలోనే మరో ఇద్దరితో పోరాడి ఒకడి శిరస్సు ఖందించాడు. మరికడిని బల్లెంతో పొడిచి పరలోకానికి పంపాడు. వాళ్ళంతా నిర్జీవులై కుప్పకూలాకా, ఆ గుడారంలోనున్న పవిత్ర రాజచిహ్నాలైన హంసల్ని ఎవరూ దొంగిలించుకు పోకుండా విరాట్ ఆ గుడారం వాకిలి దగ్గరే కాపలా కాశాడు. అయితే ఎవరూ రాలేదు. విజయోత్సాహంతో విరాట్ సైనికులు శత్రువుల్ని తరుముకువెళ్ళారు. కొద్దిసేపటికి ఆ రణగొణ ధ్వని సద్దుమణిగింది. విరాట్ ఖడ్గం చేతబూని, తనతో వచ్చిన యోధుల కోసం నిరీక్షిస్తూ ప్రశాంతంగా గుడారం వాకిలి దగ్గర కూర్చున్నాడు.

కొంతసేపటికి అరుణోదయమయింది. సూర్యుడి నునులేత కిరణాలకు తాడిచెట్ల ఆకులు పసిడి ఎరుపుతో ప్రకాశిస్తున్నాయి. నదిలో వాటి ప్రతిబింబాలు వెలుగుతున్న కాగడాల్లా అగుపిస్తున్నాయి. తూర్పున ఆకాశంపై పెద్ద గాయంలా, రక్తపు ముద్దలా కనిపిస్తున్నాడు సూర్యుడు. సూర్యోదయం కావడంతో విరాట్ అక్కడినుండి లేచి నది వద్దకు వెళ్ళాడు. తన దుస్తుల్ని నదీ తీరాన ఉంచి నీళ్ళలోకి దిగాడు. చేతికి, ఒంటికి అయిన రక్తాన్ని నీళ్ళతో కడుక్కున్నాడు. చేతులు చాపి భగవంతుణ్ణి ప్రార్థించాడు. ప్రభాత సంధ్య ధవళ కాంతిలో ఒడ్డుకు చేరి దుస్తులు ధరించాడు. రాత్రి చీకట్లో జరిగిన యుద్ధంలో ఎవరెవరు చనిపోయిందీ గమనించడానికి విరాట్ గుడారం వద్దకు వెళ్ళాడు.

అక్కడ దృశ్యం బీభత్సంగా ఉంది. శవాలు కళ్ళు తెరుచుకొని ఉన్నాయి. ముఖాలు భయంతో బెదిరిపోయినట్లున్నాయి. రాజుగారి బావమరిది తల ఒకచోట తెగి పడివుంది. మరో పక్కన వీరవాఘ సేనాపతిగా ఉండి శత్రువులతో చేతులు కలిపిన రాజద్రోహి, గుండెల్లో కత్తిపోటుతో చచ్చి పడిఉన్నాడు. విరాట్ ఆ శవాల కళ్ళను మూశాడు. రాత్రి తను చంపిన మిగిలిన వాళ్ళ శవాలను చూడడానికి ముందుకు నడిచాడు. కొన్ని శవాల ముఖాల మీద దుస్తులు పడి వాటిని గుర్తించడం కొంచెం కష్టమయింది. రెండు శవాలను విరాట్ గుర్తించలేక పోయాడు. వాళ్ళు అపరిచితులు. బహుశా వాళ్ళు విద్రోహి బానిసలై ఉండవచ్చు.

ఆ శవాలను చూస్తూ ముందుకు సాగుతున్న విరాట్ చివరన పడిఉన్న శవాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. విరాట్ కళ్ళు మసకలు బారాయి. శరీరం అదుపు తప్పింది. స్పృహ తప్పినంత పనయింది. ఆ శవం తన అన్న బేలంగర్ ది. అతనొక పర్వతరాజు. ఆ విద్రోహికి యుద్ధంలో సాయపడటానికి వచ్చాడు. చీకట్లో అన్నని గుర్తించలేక చంపేశాడు. కొన ఊపిరి ఉన్నాడేమో రక్షించుకుందామని వంగి గుండె కొట్టుకుంటుందేమోనని చూశాడు. కాని అది శాశ్వతంగా ఆగిపోయింది. అతని ప్రాణవాయువులెప్పుడో గాలిలో కలిసిపోయాయి. కాని అతని నల్లని మెరుస్తున్న నేత్రాలు విరాట్ హృదయాన్ని చీలుస్తున్నట్టు చూస్తున్నాయి. విరాట్ అతికష్టం మీద ఊపిరి పీల్చుకోగలిగాడు. నీరసంగా ఆ శవాల మధ్య కూలబడ్డాడు. ఆ శవాల మధ్య తానూ ఒక శవంలా అనిపించిందతనికి. తనను అపరాధిలా, హంతకుడిలా నిలదీస్తున్న తన అన్న చూపులను తట్టుకోలేక తన దృష్టిని మరోవైపుకు మళ్ళించాడు.
(సశేషం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)