ఆ రోజు ఏమయ్యిందో గాని నాగమణి నిద్రలేస్తూనే వెళ్ళి వాంతి చేసుకుంది.

అది చూసిన ముసలి అత్త మనసులో ఏదో ఆశ తళుక్కుమంది.పరుగున వెళ్ళి కోడల్ని పొదివి పట్టుకుంది ముసలమ్మ.

"ఏమైందే తల్లీ నీకు?రేత్తిరి తిన్న తిండి అరగలేదా ఏమిటి?" అని అప్యాయంగా అడిగింది. "అస్సలు రేత్తిరి కూడు తిన్నదెక్కడ అత్తమ్మా! ఎందుకో నాల్రోజుల్నుండి తిండి సయించడం లేదు.లేచే తలికే మొదలు, ఒల్లమాలిన ఇకారం, తల తినేస్తా ఉంది.నువ్వు పుల్లలేరేటేల నాల్గు సింతకాయలు దొరుకుతాయోమో అట్టుకురా.తినాలనుంది" అంది నాగమణి.

"ఓలమ్మ, ఓలమ్మో! ఎన్నాళ్ళకి అడిగావే సింతకాయ!" ముసలమ్మ తెగ సంబర పడిపోయింది. "నువ్వు నీళ్ళోసుకుని ఎన్నాళ్ళయిందే పిల్లా?"

"రెండు నెలలకి పైనే అయ్యుంటాది. ఇంతకీ ఏటంటావు?"

"ఏటంటానే నా తల్లీ! నువ్వు నెల దప్పావే! నట్టింట పంట పండబోతా ఉందే! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ముత్తేలమ్మ తల్లికి మనపై దయ కలిగినాది! నువ్వు సల్లగా నీళ్ళాడి, నువ్వూ బిడ్డ

నట్టింట సుకంగా మసిలితే ఆ అమ్మతల్లికి కోడి పెట్టను పలారంగా ఇచ్చుకుంటానే. పసుపూ కుంకుమంతో పూజ చేయిస్తా. ఓయమ్మ! ఎన్నాళ్ళకీ సుభోర్త విన్నాను!

ఎన్నాళ్ళకెన్నాళ్ళకి!"పట్టరాని ఆనందంతో అమ్మవారికి మొక్కులు పెట్టుకుని, ఆ చేతులతోనే నాగమణి చెంపలపై మెటికలు విరిచింది ముసలమ్మ.

నాగమణి సిగ్గుపడింది.ఆమె మనసంతా సంతోషమే!వెంటనే ఈ సుభవార్త భర్త చెవిని వెయ్యాలని ఆశపడికంది ఆమె...కాని ఆమె భర్త శాయులుకి నిన్న రాత్రి తాగిన సారా మత్తు ఇంకా దిగినట్లు లేదు.కైపులో పడి దొర్లుతూ ఇంకా అతడు పక్క మీదనుండి లేవనే లేదు.ఉసూరుమంది నాగమణి.

ముసలమ్మ కట్టుకున్న బట్ట సద్దుకొని, పైట కొంగు నడుమున దోపుకుంది. "నాగులూ!నివ్వీయేల పనికి పోబోకే,నానెళ్తాలే.ఎల్లి సుబవార్త సెప్పి, అంకినంత పనిసేసి వత్తాలే.నువ్వు ఇంటికాడ ఉండి, కుసింత గెంజి కాసుకు తాగి గమ్మునుండిపో.నాను వస్తా వస్తా సింతకాయలట్టు కొత్తాలే" అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, తడబడే అడుగులతో నాగమణి పనిచేస్తున్న రాయుడిగారి ఇంటివైపుగా నడక సాగించింది ముసలమ్మ.నాగమణి మొగిణ్ణి నిద్రలేపే ప్రయత్నంలో పడింది.

పెళ్ళయిన చాలా కాలానికి, ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాక ఎట్టకేలకు నాగమణి గర్భవతి అయ్యింది. నవమాసాలు మోసి కొడుకుని కన్నది.వాడికి యశోదమ్మ కొడుకు పేరే, చిన్ని క్రిష్ణుడని పెట్టింది ఆమె. తాగుబోతైన భర్త కుటుంబ విషయాలేమీ పట్టించుకోక బోయినా, ఊళ్ళో ఉన్న పెద్ద భూకామాంధు రాయుడుగారింట్లో పాచిపనీ, పైపనీ చేసి ఆ వచ్చిన దానితో గుట్టుగా సంశారాన్ని నెట్టుకొస్తా, పిల్లాణ్ణి పెంచుకుంటూంది నాగమణి.

తూరుపు తెల్లబారే సరికి లేచి, పిల్లవాడి సంరక్షణంతా చేసి, వాడికి కడుపునిండా పాలు తాగించి, పొత్తి గుడ్డల్లో పడుకోబెట్టి అత్తగారికి అప్పగించి పనికి వెళ్ళిపోతుంది. జీతంలే కాకుండా అంట గిన్నెల్లో మిగిలే అన్నం కూరలు సంవృద్ధిగా ఉండటంతో వాళ్ళ బతుకు బాగానే గడిచిపోతోంది.కొడుకు మీదే పంచ ప్రాణాలు ఉంచుకొని కలిగున్నంతలో వాడినిగారాబంగా పెంచుకుంటోంది.ఆమె చూస్తుండగాననె ఏణ్ణార్థం గడిచిపోయింది.

పక్కింటి సుబ్బులు కూతురు లచ్చిమి పాప క్రిష్టుడి కంటె నాల్గు నెలలు చిన్నది.కాని దాని కప్పుడే మాటా, నడకా - అన్నీ చేతనైపోయాయి. లొడలొడా వాగేస్తూ, గునగునా నడిచేస్తూ అందరికీ ముద్దొచ్చేలా ఉందది.

నాగమణి ఒకరోజు ఇక ఉండబట్టలేక సుబ్బుల్ని అడిగింది."సుబ్బులూ!వస గీని పోసినావంటే లచ్చిమికి? అది ఏకబిగిని వసపిట్టలా లొడలొడా మాటాడేస్తా ఉండి! దాని ఊసులు ఇనుకుంటే శాను, మరి కూడు తినక్కర్లా, కడుపు నిండిపోద్ది" అంది.

"ఏ లేదప్పా! ఒసా, గిసా - అయ్యే నాకు తెలవదు. ఇది ఆడకూతురు గందా, ఓ పిసరు నోటి దురుసు ఎక్కూవ. అదే మొగోడైతే అంతా లోపలి సొయంపాకమే నంట.మాట సురుకు ఉండదంట" కూతురికి ఎక్కడ దృష్టి దోషం తగుల్తుందో నాన్న భయంతో సద్ది చెప్పింది.

"ఓరు సెప్పేరో గాని అది నిజమేననిపిస్తాంది! లచ్చిమి అంత సురుగ్గా ఊసులాడ్తదా, ఈడు సూడు మందు తిన్న పింజేరులా ఎట్టగుంటాడో! అవునులే, ఈడు మొగ్గొడుకు గందా" అంటూ చంకలో ఉన్న కొడుకుని దగ్గరగా హత్తుకుంది నాగమణి.

"నువ్వంత ఇదవ్వమోకు అప్పా!ఈడు బోరగిల పడ్డం, కూకోడం అన్నీ లేటే సేసిండు గందా! ఒయసు మీరాక పుట్టాడు..ఈడు నీకు ఒట్టి అరిపేదోడు.నాల్రోజుల పోతే ఆడే నేరుస్తాడు. నడక, మాటలు కూడా.చేజారు కాక, సూత్తా ఉండు. ఆ మీన ముసల్ది ఆడితో ఏగలేక గోలెత్తి పోతాది" అంది సుబ్బులు నాగమణికి ఓదార్పుగా.

చంకలో ఉన్న కొడుకుని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని వాడి బుగ్గల్ని ముద్దుల్తో ముంచెత్తింది నాగమణి.

"నా సిన్ని కిష్టయ్య గునగునా నడుస్తూ, గలగలా మాటాడితే నాను ఒరద గోదారిలా పొంగి పొంగి పొర్లిగింతలు ఎట్టెయ్యనా!ఒలే సుబ్బులూ! ఆ అదృష్టం శానే నాకు" అంటూ కొడుకుని మరోసారి ముద్దులాడి చంకకి సద్దుకుంది నాగమణి.

తల్లి ముద్దులాడినప్పుడు చక్కిలిగిలికి కిలకిలా నవ్విన క్రిష్టయ్య ఆ తరువాత మళ్ళీ ఏ చలనం లేకుండా, పత్తికాయలాంటి కళ్ళను తిప్పుకొని నాల్గువైపులకీ చూస్తూ స్తబ్దంగా ఉండిపోయాడు తల్లి చంకల్లో.

వయసుకి తగినతీరులో ఉండదు క్రిష్టయ్య - అన్నది చూసిన వాళ్ళందరికిఈ తెలిసిపోతూనే ఉంటుంది.ఏ శతాబ్దానికీ స్పందిచడు.తల్లి పిలిచినా విననట్లే ఊరుకుంటాడు వాడు.ఎప్పుడూ స్తబ్దంగా ఉన్న చోటనే ఉండి, ఏ చురుకూ ప్రదర్శించని కొడుకుని చూస్తుంటే నాగమణికి రోజురోజుకీ గుండెలు బరువెక్కసాగాయి. కాలక్రమంలో నడక చాతనయ్యింది కాని, నాలుగేళ్ళు నిండినా ఇంకా మాట్లాడటం మాత్రం వాడిని తీసుకెళ్ళి పక్క ఊళ్ళో ఉన్న పెద్దాసుపత్రిలో చూపిస్తే బాగుంటుంది - అనుకుంది నాగమణి.

పొరుగూరు వెళ్ళడమంటే మాటలు కాదు.పూర్తిగా ఒక రోజు పని! అందునా ఆసుపత్రికి! మనసులో ఊహ పుట్టగానే సరిగాదు - డబ్బూ దస్కం సరి చూసుకోవాలి, ఆ పైన రాయుడిగారి పనికి ఒక రోజు శలవు వెంకటేశాన్ని సాయమడిగింది.

ఏదో ఒక పనిమీద తరచు పక్కనున్న పట్నానికి వెళ్ళివచ్చే వెంకటేశు ఆసుపత్రిలో అప్పాయింట్‌మెంట్ సంపాదించి తెచ్చాడు.సరిగ్గా వాళ్ళు చెప్పిన సమయానికి కొడుకుని తీసుకుని వెళ్ళింది. ఆసుపత్రికి నాగమణి, వెంకటేశుని తోడుగా తీసుకుని.

అక్కడి దాక్టర్లు క్రిష్టయ్యకు పరీక్షలన్నీ చేసి తేల్చి చెప్పారు - వాడికి లోపం ఉన్నది గొంతులో కాదనీ, చెవులలోననీ పుట్టినప్పటినుండి వాదికి చెవులు సరిగా పని చేయకపోవడం వల్ల వినికిడి లేకపోవడంతో ఏ శబ్దం ఎలా పలకాలో తెలియెక, వాడు మాట్లాడలేకపోతున్నాడని చెప్పారు.వినికిడి మిషన్ కొని,అది వాడి చెవిలో అమర్చితే వాడికి శబ్దాలు వినిపించటంతోపాటుమాటలాడటం తెలుద్తుందనీ, ఎంత తొందరగా ఆ పని జరిగితే అంత మంచిదనీ నొక్కి చెప్పి శలవిచ్చి పంపేశారు డాక్టర్లు.

"ఇదిగో, తమ్ముడూ! ఆ మిసను కొనాలంతే ఎంతవుద్దంట?" దారిలో వెంకటేశుని అడిగింది నాగమణి.

"పదేలు వరకు అవుద్దనుకుంటా నప్పా" అన్నాడు వెంకటేశు.

నడుము విరిగినట్టై అవాక్కైంది నాగమణి.తిండికే అంతంత మాత్రమైన సంపదనలో పదివేలు మిగల్చటం ఎలాగా అన్న ఆలోచనలో పడింది.అసహాయతతో ఆ రోజంతా లోలోన ఏడుస్తూనే ఉంది నాగమణి. భారంగా గడుస్తున్నాయి రోజులు.క్రిష్టుడికి ఇప్పిడు తొమ్మిదో ఏడు జరుగుతుంది.తోటి పిల్లలతో ఆడాలని చూసేవాడు కానీ మూగవాడని వాడినంతా చిన్న చూపు చూసేవారు. ఇంటికి వచ్చి సైగలతో తల్లికి జరిగిందంతా చెప్పి ఏడ్చేవాడు.నాగమణికి అది ఎంతో గుండె కోతగా ఉండేది.

ఒక రోజు రాయుడుగారింటి నుండి సంతోషంగా తిరిగివచ్చింది నాగమణి.వస్తూనే, "సుబ్బులూ! ఒసే సుబ్బులూ" అంటూ గుమ్మంలో నిలబడి పిలిచింది. ఏం జరిగిందో అని కంగారు పడుతూ పరుగున వచ్చింది సుబ్బులు.నాగమణి అమాంతం సుబ్బుల్ని కౌగిలించుకుంది.

"దారి దొరికింది, నా క్రిష్టయ్యకు ఇగ మాటలు వచ్చేస్తాయి" అంది సంబరపడిపోతూ.తడిగా ఉన్న నాగమణి కళ్ళవైపు ఆశ్చర్యంగా చూసింది సుబ్బులు.మంచినీళ్ళు తెచ్చి తాగమని ఇచ్చింది నాగమణికి.

కాసిని నీళ్ళు తాగి తెప్పరిల్లి చెప్పటం మొదలుపెట్టింది నాగమణి - "సుబ్బులూ! మంచి ముక్కలు సెవుతా ఇనుకోయే! దేవుడు నాలాంటోళ్ళ కోసమే ఆటిని రెండింటి నెట్టినాడు గావును!ఇనుకో! మన కడుపులో ఓ కాడ "కిడ్డినీ" లని రెండు తిత్తులు ఉంటాయంట!అయ్యి, ఓటి తీసేసినా పర్లేదంట, మడిసి సావడంట! గేశారం సాలక రెండూ సెడిపోయి నోళ్ళుంటారో, ఆళ్ళకి మనకాడ నున్న రెండింటిలో ఓటి అమ్మేసి డబ్బు గడించొచ్చునంట, తెలుసా! అయ్యి ఏలకి ఏలు ఇలువ సాఎస్తాయంట, ఇడ్డొరంగా లేదూ! రాయుడు గారింట ఇన్నానీ ఊసు" ఆరోజు వెంకటేశు ఒళ్ళు బాగుండక పనికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్న వెంకటేశు కంఠశోషగా నాగమణి మాట్లాడుతున్న మాటలు వినిపించనట్లుంటే విషయమేమిటో సరిగా తెలుసుకోవాలని లేచి వచ్చాడు. అతను బయటకి వచ్చేసరికి నాగమణి అంటోంది - "సుబ్బులూ! నానొక "కిడ్డినీ" అమ్మేశాననుకో, ఆ డబ్బుతో నా క్రిష్టయ్యకి ఇనికిడి మిషను కొనిపెడితే ఆడు మాట్లాడేస్తాడు కదే!" - అలా అంటుంటే ఆమె కళ్ళనుండి ఆనందభాష్పాలు జలజలా రాలాయి.

"అప్పా! ఈ సంగతి నీకెలా ఎరికయ్యెందే!ఆ మద్దెన ఓ పెద్ద మడిసి నన్నట్టుకొని, ఓ "కిడ్డినీ" ఇత్తే పదేలిస్తారని సెప్పేడు.పెద్దాపరేషన్ చేసి దాన్ని బయటకి తీస్తారంట!డబ్బులు సేదు గాదు గాని, ఆపరేషనంటే బయమయ్యింది.ఒగ్గేశా. ఆడు అప్పుడప్పుడు పట్నంలో ఆపడతాడు ఇప్పుడు కూడా"

"ఆపరేషనంటే ఏంటి అబ్బాయా?" నాగమణి ఆశ్చర్యంగా అడిగింది.

"పెద్దడాక్టర్లు వచ్చి, మత్తిచ్చి పొట్టకోసి మన కడుపులో ఉన్న కిడ్డీనీని తెగ్గోసి బయటికి తీసి మళ్ళీ అంతా సరిజేసి కుట్లేస్తారంట. పది, పదేను రోజుల్లో అంతా సద్దుకు పోతాది.మనిసి ప్రేణానికి మాత్తరం ఏ ప్రెమాదం లేదు"

"ఇగశానురా అబ్బాయా! నేను గీని సస్తే నా క్రిష్టున్ని సాకే వారుండరని బయపడ్డా.ఆ పరేసనంటే ఇక నాకేం బయం లేదు, ఆడికి మాటలొస్తే సాలు" "నువ్వు అమ్ముతానన్నావు, సరే మరి కొనే వాళ్ళుండొద్దా?"

"నాకదేం తెల్దు.రాయుడు గారి బందుగుల్లో యారికో అవసరమైతే కిడ్డినీని ఏబై ఏలిచ్చి కొన్నారంత! కొత్త కిడ్డినీ ఎట్టాక సస్తాడన్న మనిసి బతికాడంట! ఆళ్ళు సెప్పుకుంటూటే ఇవరంగా, ఇనుకున్నా.ఎంత సొమ్మో సూడు, మనం జనమంతా కష్టం సేసినా అంత సంపాయించగలమా!

"మనకంత డబ్బు ఇవ్వరప్పా! పొలాన అమ్మిన పంటకి అంత ఇలువ ఉండదు.దళారుల చేతులు మారినపుడే దాని ఇలువ పెరుగుద్ది"

"నీకు తెలిసినోడు ఉన్నాడన్నావు గందా? ఆణ్ణి అడుగు.సచ్చి నీ కడుపున పుడతారా అబ్బాయా! నాకీ సాయం సెయ్యి.నా క్రిష్టుడికి నోట మాత్టొస్తే ఆ పున్నెం నీదే అవుద్ది.కొంచెం బేరం పెంచు నీకు పున్నెముంటుంది.నా కొడుక్కి అబ్బ ఆశ ఏం లేదు.నువ్వే సూసుకోవాల.అంతా నా తలరాత. ఆడి తండ్రికి ఈడు తన కొడుకన్న గేనం కూడా లేదు.ఆడేంటో ఆడి తాగుడేంటో అంతే! మరో ఊసుండదు."

"బాధపడకు అప్పా!అయన్నీ నేసూసుకుంటాలే.నువ్వు గమ్మునుండు" అంటూ నాగమణికి భరోసా ఇచ్చాడు వెంకటేశు.

మనసంతా నిండిన సంతోషంతో కొడుకును వెతుక్కుంటూ వెళ్ళీంది ఆ అమాయకపు తల్లి. తనెంత కష్టపడ్డా ఫరవాలేదు.తన బిడ్డలు చల్లగా ఉండాలని కోరుకునేదే తల్లిప్రేమ!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)