కవి పండితుడు

సీ:// పండిత బడితలు పడకుండ చూడుమ, కవితముదితను తాకక నిలుపుమ!
రసహృదయులుకాని రసహీన పండితవిశ్లేషణంబుల వీనులొద్దు!
యాచ్చాదిత విధిత యందచందాలనా పరులముంగటనొద్దు పరచకయ్య!
రచనలు నాకు పుత్రికలు కారా? యొక్కడైనను విజ్ఞుడు వానినొసగు!

తే.గీ:// విద్య వొలువలే వొలచేటి విటుల మద్య
నా రచనలేవియు నిలుపనంచు నాకు
వ్రాయి నుదుటన, నుదుటందు వ్రాయి, నుదుట
వ్రాయి! వినయవిద్యాధరా రామచంద్ర!

ఒక సారి ఎప్పుడో కాళిదాసు (ఇలాగే నేను బాధ పడ్డట్లే), నా రచనలన్ని సహృదయుల కళ్ళమాత్రమే పడేటట్లుగా నా నుదిటి పైన వ్రాయి, నుదిటి పైన వ్రాయి, నుదిటి పైన వ్రాయి అని అమ్మవారిముందు వాపోయాడట. ఇలాగే బమ్మెర పోతన కూడా తనకవిత్వం మంచి రసహృదయం ఉన్నవారే చదవాలని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడని కథలు ఉన్నాయి. పెద్ద పెద్ద పండితులుగా పేరుగాంచినవారు, లేక తామే పెద్ద పండితులమని విర్రవీగేవారు, వెరసి ప్రతివాడూ ఇంకొకడి రచనలమీద వ్యాఖ్యలు చేయడమే వారి మనో వేదనలకు ముఖ్య కారణాలు అయ్యాయి. కవిత్వాన్ని ఆస్వాదించ దలిచేవారు రచనాసందర్భాన్నీ, హాస్యప్రయోగాలనీ, కవిహృదయాన్ని అర్థం చేసుకోవడనికి ప్రయత్నించాలిగానీ, మిడిమిడి జ్ఞానంతోగానీ, లేక వారి విమర్శనాచాతుర్యాన్ని ప్రదర్శించడానికి గానీ వ్యాఖ్యానాలు చేస్తే కవుల దుస్తితి ఇలాగే ఉంటుంది మరి. అలాగే "ఇలా రాస్తే ఎవరినో కించపరచడం అవుతుందనిగానీ"," మా సొంత అభిమతాలతో, అభిప్రాయాలతో కలవడంలేదని" గానీ, "ఇది తప్పు", "ఇది అసమజసం" అని పలకడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.

ఇలాగే ఇంకొక కథలో సాక్షాత్తు పరమేశ్వరప్రణీతమైన పద్యాన్ని రాజుగారికి చూపించి ఒక బహుమానము పొందగోరి ఓ పేదబ్రహ్మాణుడు రాజసభకి వెళ్ళాదు. అక్కడ మహాపండితుడైన నత్కీరుడు ఆ పద్యంలో వాడిన అలంకారాలనూ, సమయాలనూ, వ్యాకరణాన్ని తప్పుపట్టి శివుడిని ఆతడి భక్తుడను అవమానించి పంపిస్తాడు (శ్రీకాళహస్తీస్వర మహత్యం, దూర్జటి)

ఉ:// 'తప్పిది చెప్పరాదు, కవితాసమయంబున కొప్పు గాదు, నీ
విప్పగిదిన్ రచింపదగునే?' యన విప్రుడు చిన్నవోయి, 'నా
కప్పరమేశ్వరుండు వసుధాపుపై రచియించి ఇచ్చినా
డొప్పును దప్పు నేనెఱుగ నుత్తములార!' యటంచు గ్రమ్మఱన్


అదివిన్న శివుడు తానేవచ్చి స్వయంగా తన పద్యంలో తప్పులేదని చెప్ప ప్రయత్నించాడు. నేనే శివుడని అనికూడా తెలుపగోరి, మూడవకన్నును చూపిస్తాడు.
కం:// తలచుట్టువాఱ గన్నులు
గలిగిన బద్యంబు దప్పు గాదన వశమే
వలదిచ్చట నీ మాయా
విలసనములు పనికిరావు విడువు మటన్నన్

"నీవు శివుడైతే నాకేమిటి, నీ తలచుట్టూ కన్నులు ఉన్నా నాకు భయంలేదు. నీ అలంకారం తప్పు, నీ సమయం తప్పు" అంటూ తన పాండిత్యప్రకర్ష చూపి పద్యలాలిత్యాన్నీ, అసలు విషయాన్ని విస్మరించాడు నత్కీరుడు. ఆ నత్కీరుడు చెప్పినవి కొంత సమంజసమైనా ఆతడి పొగరు అణచానికి శివుడు అతడికి కుష్టిరోగంవచ్చేలా శపించవలసి వచ్చింది. ఆ తరువాత నత్కీరుడు తనతప్పు తెలుసుకొని మహాశివభక్తుడై కాళహస్తి స్థలపురాణంలో ప్రముఖ పాత్రను సంపాదించుకున్నాడు. శివుడు కాబట్టి అట్టి పండితుడితోత్తముడినుంచీ తప్పించుకోగలిగాడు, మరి సామాన్యమానవ కవుల సంగతేమిటి. వారినెవ్వరు వ్రాయనిస్తారు?

మనిషికి వాక్స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, దానికన్నా కవికి భావ స్వాతంత్ర్యం మరీ ముఖ్యం. నిరంకుశులముందు సహజ సాహిత్యపరిపక్వత, విస్తరణ అసంభవం. నచ్చితే ఆనందించాలి, నచ్చకపోతే నచ్చినది మరొకటి చదువుకోవాలి. అంతేగానీ కొందరి నిర్విరామ విమర్శే వారి జీవనోపాధి అయ్యి, అలా PhDలు సంపాదించుకోవడం మనం దుగుమతిచేసుకొన్న ఆధునిక దౌర్భాగ్యం. పద్యం రాయడం ఇలాగే ఉండాలి, దాని ఛందస్సులో మార్పులు తేరాదు, భాషలో అభివృద్ధి రావాలంటే మరిచిపోయిన సంస్కృతభాషనే వాడాలి అనే మన ఛాందస పండితుల విమర్శలు తట్టుకోలేకే శ్రీ శ్రీ "పద్యం నడ్డి విరగ్గొడతా" అని అనవలసి వచ్చింది. ఆయనకి పద్యం వ్రాయటం చేతకాకకాదు, దానిలో నూతన శైలిని కాంక్షించటమే ఆయన చేసిన పెద్ద తప్పు. అలాగే శ్రీనాదుడు సంస్కృతం తగ్గించి అప్పటిలోని తెలుగుమాటలు ప్రయోగించాడని "డుమువుల కవి" అని హేళనచేసినవారు కూడా మన ఛాందస పండితులే. ఇప్పుడు పైన ఉదహరించిన కవులందరూ శివుడిలాగ శపించలేకపోయినా, యధాశక్తి ఎంతో కృషిచేసి తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోగలిగినవారు కనుక, తరువాత వారివారి ప్రయోగాలలోకి వెళ్ళగలిగారు. వారికి ఎలాగో పేరు వచ్చేసిందికనుక వారిని ఇక అనే సాహసం ఏ పండితుడూ ముందుముందు చేయలేకపోవచ్చు. కానీ ఎందరో కవులు మన పండితుల ధాటికి తట్టుకోలేక చరిత్రలోకనుమరుగయ్యారు అంటే అతిశయోక్తికాదు.

నిజానికి ప్రతి కవీలోనూ ఒక పండితుడుంటాడు. అలాగే చాలా మంది పండితులలో కూడా కవులుకూడా ఉంటారు. వారివారి ప్రత్యేక సందర్భావసారలనుబట్టి వారి పాత్ర మారుతూ ఉంటుంది. రెండూ చాలా భాధ్యతాయుతమైన పాత్రలే. కానీ కవి భాధ్యత, ఆవేశం వేరు. వాటికి హద్దులు నిర్మించరాదు. పండితుడు తన చేతిలో ఉన్న విశ్లేషణా శక్తితో కవిని నొప్పించడంవల్ల తన భాధ్యతను ఉల్లంగించినవాడవుతాడు. విశ్లేషణలు కవి చెప్పకచెప్పిన మంచి విషయాలను బయటకుతీయాలికానీ, కవులుద్దేశించని తప్పుడు విపరీతార్థాలను వెలికి తీయడంకాదు. ఒక రచనలో చమత్కారప్రయోగం జరిగితే వీలైతే (sense of humor ఉంటే)నవ్వుకోగలగాలిగానీ దాన్ని రకరకాలకటకాలముందుంచి పరీక్షలు జరిపి దానిలో ద్వందార్ధాలనూ లేక చమత్కారధ్వంశానికో తోడ్పడితే ఆ విమర్శలూ, విశ్లేషణలే ఎంతమాత్రం శ్లాఘనీయం కాలేవు.

సమస్త సాంఘీకజీవనమూ మనం నిర్మించుకున్న కృత్రిమ శక్తికేంద్రాలపై ("The centers of Powers" ) ఆధారపడిఉంటుంది. ఇవి ఏవీ దేవుడిచ్చినవికావు. కొందరి స్వప్రయోజనసిద్ధికోసం వారు నిర్దేశించిన శక్తికూటాలు. ఈ కేంద్రాలు ముఖ్యంగా మూడు కోవలలోకి వస్తాయని విజ్ఞుల అభిప్రాయం. (1)రాజనీతిక సంబంధిత కేంద్రం(political power-or authority) (2) అర్థిక సంబంధిత కేంద్రం (money power - or ability buy)(3) మాధ్యమ సంబంధిత కేంద్రం (power of press-or control of media). ఈ మూడు కేంద్రాలనీ స్వాధీనపరచుకున్నవాడికి భూమి పైన తిరుగులేదు. కనుక వీటిని అందరికీ పంచి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అనేకమంది అనేక ఉపాయాలను ఆలోచించారు. మొదటి కేంద్రాన్ని ప్రజాస్వామ్యం (Democracy) అనే ప్రయోగంతో నిర్మూలించలేకపోయినా కొంత అదుపులోనికి తీసుకురాగలిగాము. రెండవదాన్ని సోషలిజం పేరుతో కొందరు అదుపుచేయ ప్రయత్నించారు. మూడవది అతి క్లిష్టమైనది. ఇది సామాన్యంగా పండితులవశమైయుంటుంది. అందుకని ఈ శక్తి కేంద్రాన్ని అంతతేలికగా పంచనీయరు. కానీ ఈమధ్యనే సాంకేతిక రంగం అభివృద్ధి చెంది అంతర్జాలాన్ని (Internetని) సృష్టించింది. ఈ అంతర్జాలంతో ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లు వ్రాసుకోవచ్చును. ఇలా బ్లాగులు డిస్కషన్ రూములు ఏర్పడ్డాయి. అంతర్జాలపత్రికలలో పేజీలకు కరువులేదు, ఎన్ని పేజీలైనా, ఎన్ని భావాలైనా ప్రకటించుకోవచ్చు. అంటే ఇది ఒక నిజమైన పత్రికా స్వాతంత్ర్యసమరానికి నాంది పలికిందన్నమాట.

సులువుగా ఇంత స్వాతంత్ర్యం వచ్చేసి దానిని ఆస్వాదించేవారిని చూస్తే సామాన్యంగా కొందరికి కన్నుకుట్టక మానదు. అందుచేత వారు మళ్ళీ కొన్ని ఆంక్షలను ప్రవేశపెట్టదలుస్తారు. మా వెబ్బుసైటులో లేక పత్రికలో ప్రచురించాలంటే మీరు ఇలాగే వ్రాయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటూ తమ అధికారాన్ని సృష్టించుకుంటారు. అలాగే ప్రభుత్వాలు కూడా (ప్రజాస్వామ్యమైనా కాకపోయినా) తమ తమ ఉద్దేశాలకూ, ఉపయోగాలకు అనువుగాలేని పత్రికలను అణిచివేయటానికి ప్రయత్నిస్తాయి. ఇది ఒక సాధారణ ఆటవికధర్మం. ఎవరి ఊహాత్మకదృష్టినుంచీ వారే సమజసం కావొచ్చు. కానీ ఒక మంచి సమాజానికి మనం రూపుదిద్దాలనుకుంటే అన్నిటిలోనూ స్వాతంత్ర్యం ముఖ్యం. అంటే రాజనీతిక,ఆర్థిక, రచనా స్వాతంత్ర్యాలన్నమాట. అంటే స్వేఛ్ఛామాధ్యమ ప్రయోగానికి అవకాశం ఏర్పడాలి. ఇది ఒక ప్రజాస్వామ్యమో లేక ఇంకొక సమగ్రనిరంకుశత్వమో తేలేనిది.

అలాంటి స్వాతంత్ర్య లక్షణాన్నీ, లక్ష్యాన్నీ సుజనరంజని కోరుకుంటోంది. ఇందులోని రచనలూ, భావాలూ, సిలికానాంధ్రకు సంబంధించినవి కావు. అలాగే మా విశ్లేష్ణావిచక్షణలతో వాటికి రూపకల్పనలూ చేయడంలేదు. ఈ పత్రిక అన్ని రకాల భావాలకూ ఒక వేదిక మాత్రమే. భావనియంత్రణ మా ద్యేయంకాదు, ఆదర్శంకాదు, అవసరం అంతకన్నాకాదు. కాకూడదు కూడా!

**** **** ****

మన పూర్వీకులు సాహిత్యాన్ని రెండురకాలుగా విభజించారట. మొదటిది వైదీకం అనీ, రెండవది లౌకికం అని. వైదీక సాహిత్యంలో వైదిక మంత్ర సాంప్రదాయ సంబంధిత సాహిత్యాలు ఉంటే, లౌకిక సాహిత్యంలో పురాణాలు, ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రం, దర్శనాలు, అలంకారశాస్త్రం, తంత్రశాస్త్రం, కావ్యాలు మున్నగునవీ, అలాగే కావ్యాలలో సందేశకావ్యాలు, స్తోత్రకావ్యాలు, నీతికావ్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుని మన వాజ్మయాలు రూపుదిద్దుకున్నాయిట. ఈ సంపద ఒక్కరోజు వచ్చినదో లేదా ఏ ఒక్కరో వ్రాసిపడేసినవో కావు. ఇది తరతరాల సాంస్కృతిక సౌరభ భరిత సాంప్రదాయక మిసిమిసహిత అపురూప సందర్శనం. ఇది మన ఆస్తి, మనమే వారసులం. ఈ ఆస్తిని నాస్తిచేసినా పెంపొందించినా రేపటితరాలవారిముందు బాధ్యత మనదే అవుతుంది, అవ్వాలి.

కానీ ఆంగ్లమాధ్యమాశక్తిపరులైన మనసగటు భారతీయ పాఠకులకు కనీసం ఇంత సాహిత్య సంపద ఉందనికూడా నేడు తెలియకపోవచ్చు. అలాగే మరికొందరికి పాశ్చాత్యసాహిత్యం ముందు మనవాటిగురించి తెలుసుకోవడంకూడా చిన్నతనంగా అనిపించొచ్చు. ఇంకొందరికి తెలుసుకోవలనే ఆశక్తి ఉన్నా వాటిని అర్థంచేసుకునే శక్తి లేదు. చిన్నచూపున్నవారిని వారి పాపానికి వారినివదిలేద్దామనుకున్నా, ఆశక్తియున్న కొద్దిమందినైనా ఆదరించి తగిన రీతిలో ఆంశాలను విశదీకరిస్తే ఆ ఆశక్తే ఒక మహా శక్తయ్యి సాహిత్య ప్రభాస యుక్తిని అదే ప్రసాదిస్తుంది.

మనగ్రంధాలు చాలావరకు సంస్కృతంలో ఉన్నాయి. నేడు తెలుగే సరిగా రాని విద్యార్థులకి తగిన సంస్కారం ఉన్నా సంస్కృతకావ్యపఠనం అంత సామాన్యంకాదు. అలాగే చాలా తెలుగు కావ్యాల్లో, ప్రబంధసాహిత్యంలో వాడిన పదజాలం ఈనాటిదికాదు. వాటిని అర్థంచేసుకుని ఆస్వాదించడానికి చాలా పాండిత్యంకావాలి.

ఇటువంటి అన్ని అడ్డుగోడలనూ దాటి, ఔత్సాహిక కావ్యాధ్యయనాశక్తిపరులకి దగ్గిరగా, ఒక సామాన్యునికి సైతం అర్థమయ్యేరీతిలో కావ్యాలను సంక్షిప్తరీతిలో తర్జుమాచేస్తూ, కేవలం అవసరమైన చోట తగిన విశ్లేషనలను అందిస్తూ, ప్రాచీన కావ్యసాహిత్యాన్ని అందరికీ పంచిపెట్టాలన్న మా సంకల్పం ఈ నెలనుండీ ఒక రూపు దిద్దుకోబోతోంది. మువ్వలసుబ్బరామయ్యగారు ఇక నెలనెలా మనకు వ్యావహారికభాషలో "ప్రాచీన కావ్య సందర్శనం"లో కొన్ని కావ్యాలను మనముందుకి తెస్తున్నారు.

ఈ కొత్త సంవత్సరంలో ఇటువంటి అనేక విన్నూత్న శీర్షికలూ, సరికొత్త వెబ్ డిజైన్ తోపాటూ మీముందుకు తీసుకువస్తున్నాము. రాబోయే మూడు నెలలలో మీరు అనేక క్రొత్త మార్పులను చూడబోతున్నారు. వీటిని మీరు ఎప్పటిలాగే ఆస్వాదిస్తూ ఆదరిస్తారని తలుస్తూ

నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ అందరికీ తెలుపుకుంటూ, రాబోయే సంవత్సరం మీ అందరిలోనూ క్రొత్త సాహిత్య సౌరభాన్ని వెదజల్లాలని కోరుకుంటూ

మీ

తలాప్రగడ


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)