జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.. హిమవర్ష, అనూష లానే తల్లిదండ్రుల ప్రోద్బలం మీద తనకు ఇష్టం లేని చదువుచదువుకుంటూంటుంది. ఇంటికొచ్చిన అనూషను స్నేహితురాళ్ళు హిమవర్ష, మధుమిత కలుస్తారు. మాటల్లో మధుమిత వాళ్ళిద్దరినీ సాంత్వన పరుస్తూ తమ కష్టాల్లోనే జీవితపు విలువలు నేర్చుకోవడమెలాగో చెబుతుంది.

మరో వైపు రామ్మూర్తి అనే ఒక ప్రతిభావంతుడైన శ్రీచరిత కాలేజ్ లెక్చరర్ సునందా కాలేజిలో జేరాడని శ్రీచరిత ఓనరు ఇంటికి పిలిచి బెదిరిస్తాడు. అయినా రామ్మూర్తి లొంగడు. ఇలా ఉండగా సుందరం అనే లెక్చరర్ ఇంటింటికీ తిరుగుతూ తాను పనిచేసే కాలేజికి ప్రచారం చేస్తుంటాడు. శ్రీచరిత, సునంద కాలేజీల మధ్య పేరు గొప్పల కోసం అంతర్యుద్ధం మొదలౌతుంది. హిమ వర్ష స్నేహితురాలు క్షితిజకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూ ఆమెను కృంగదీస్తుంటాయి. ఆ పని చేయించింది ఆమె క్లాస్‌మేట్ తల్లి అయిన ఓ ఆడ కానిస్టేబుల్ అని తెలుస్తుంది.

కాలేజిలో వత్తిడి, ఇంట్లో వాళ్ళ పోరు భరించలేక అనూష రూమ్మేట్, కల్పన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పిల్ల మరణానికి తాము బాధ్యులు కాదంటు యాజమాన్యం తప్పించుకోజూస్తుంది. అనూష ఆ ఘోరాన్ని దిగమింగుకోలేక ఉంటుంది. కల్పన ఆత్మహత్య కాలేజిని, పిల్లలను, యాజమాన్యాన్నీ కుదిపేస్తుంది. వాడిగా చర్చలూ ప్రారంభమవుతాయి. అనూష దిగమింగుకోలెకౌంటే హఠాత్తుగా కల్పన కనిపిస్తుంది.

13 వ భాగం

అనూషకు కల్పన చనిపోయిన విషయం చప్పున గుర్తొచ్చి తల విదిలించి మరలా చూసింది. ఎవ్వరూ లేరక్కడ. ఎంతటి విభ్రమ అనుకుంది. నిజంగానే భ్రమ పడిందా? కానీ అక్కడెవరో నిలబడి స్పష్టంగా తన పేరు పిలిచారు. తను కల్పనలానే ఉంది. కల్పన పోలికలున్న మరో అమ్మాయిని చూసి కల్పన అనుకుందా? అలా అనుకున్నా ఆ అమ్మాయి అక్కడ ఉండాలిగా, అదృశ్యమైపోయినట్లు మరలా కనపడలేదేం?

చాలా వింతగా అనిపించింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు దయ్యలౌతారనే నమ్మకం నిజమేనేమో... తనకు కంపించింది అటువంటి కల్పనా? సహజంగా దయ్యాలు రాత్రి పూట కదా కనిపిస్తాయంటారు... మరి ఇంత మంది మనుషులు తిరిగే చోట వెల్తురులో కల్పన ఎలా కనిపించింది. అంతా భ్రమ... రాత్రి కల్పన గురించి ఆలోచిస్తూ పడుకుంది. అందుకే అలా అనిపించి ఉంటుంది.

అమ్మ ఫోన్లో మాట్లాడిన విషయాలు గుర్తోచ్చయి. ఎన్నిసార్లు మాట్లాడినా 'ఎలా ఉన్నవే' అని ఒక్కసారి కూడా అడగదు. 'ఎలా చదువుతున్నావు? ఎన్ని మార్కులొచ్చాయి? యంసెట్లో ర్యాంకు తెచ్చుకుని మా పరువు నెలబెడ్తావు కదా' ఇవే మాటలు.. మార్చి మార్చి.. పదాల్లోనె తేడా.. భావం ఒకటే. ఆరోగ్యం ఎలా ఉందో, మానిసికంగా ఎంత హింస పడ్తుందో, సమూహాల్లో ఉన్నా ఎంతటి ఒంటరితనాన్ని అనుభవిస్తుందోలాంటి ఆలోచనలే చేయదు. ఎప్పుడూ చదువు.. మార్కులు... తమ్ముడెలా భరిస్తున్నాడో? వాణ్ణి ఐఐటి కోచింగ్ అని ఎలా బాఢ పెడ్తుందో...

ఇవన్ని తల్చుకోగానే అనూషకు నిస్త్రాణ అనిపించింది. రాత్రి భోజనాలప్పుడు కూడా చాలా నిరాసక్తంగానే తింది. స్టడీ అవర్ అయ్యాక రూంలో చదువుకోడానికి కూచుంది. పదకొండున్నరకల్లా మిగతా రూమ్మేట్లు పడుకున్నరు. కెమిస్ట్రి కష్టంగా ఉంది. ఎన్నిసార్లు చదివినా గుర్తుండటం లేదు. అర్థమైతే కదా గుర్తుండటానికి?

మెల్లగా ఎవరో నవ్వినట్లనిపించింది. అనూష తలయెత్తి మంచాల వైపు చూసింది. అందరూ నిద్ర పోతున్నారు. మరలా భ్రమ.. లేదా ఎవరైనా నిద్ర పోతున్నట్లు నటిస్తూ తనని ఆట పట్టిస్తున్నారా? అనూషకు నవ్వొచ్చింది. దగ్గర పడ్తోన్న పరీక్షల వత్తిడి, యంసెట్ బత్తిడి, తల్లిదండ్రుల వత్తిడి.. ఇన్ని వత్తిళ్ళలో ఆట పట్టించాలన్న ఆలోచనలు బతికి బట్టకడ్తాయా?

మరలా నవ్వరెవరో... ఈ సారి మరీ సమీపంగా.. అనూష ఉలిక్కిపడి చూసింది. తన పక్కనే కూచుని నవ్వుతోంది కల్పన. అనూష కళ్ళు నులుముకుని చూసింది. కల్పనే.. భ్రమ కాదు.. నిజంగానే..

"ఏం చదువుతున్నావు?" కల్పన మాట్లాడింది.

"కెమెస్ట్రీ" అప్రయత్నంగానే సమాధానం చెప్పింది.

"ఎందుకు?"

"మార్కుల కోసం"

"నా మాట విను. చదవకు. ఎందుకు మార్కులు? ఎందుకీ చదువులు? మనల్ని చంపడానికే మన అమ్మానాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళారు తెలుసా? నేను చూడు ఎలా చనిపోయానో... చదవకు."

"అమ్మో, చదవాలి. లేకపోతే యంసెట్లో ర్యాంకు రాదు. ర్యాంకు రాకపోతే మా అమ్మ వురేసుకుని చచ్చిపోతానంది"

"ఎవ్వరూ చావరు. మనల్ని చంపుతారంతే. నా మాట విను. చదవకు"

"నేను చదవాలి. తప్పదు"

"నాక్కోపం వస్తుంది. వెంటనే పుస్తకం మూసేయ్. లేదా నిన్ను... నిన్ను.."

"ఏం చేస్తావ్? చంపుతావా? ఏమైనా చేసుకో. నేను చదవాలి. చదవాలి చదవాలి" పెద్దగా అరిచింది అనూష.

నిద్ర పోతున్న వాళ్ళలో ముగ్గురు అమ్మాయిలు మేల్కోని ఆశ్చర్యంగా చూసారు.

"కల్పన... ఇదిగో నా పక్కన. చదవొద్దంటోంది. చెప్తే అర్థం చేసుకోదేం" అంది అనూష.

వాళ్ళు భయం భయంగా ఆమె వైపు చూశారు.

"మీరైనా చెప్పండి. చదవకపోతే టిచర్లు అవమానిస్తారని తనకు తెలుసు కదా." అని తన పక్కన చూస్తూ "అసలెందుకొచ్చావు? వెళ్ళిపో" అంది అనూష.

"నెనెందుకెళ్తాను? ఇది నా రూం. ఇక్కడే ఉండి నిన్ను చదవనివ్వకుండా చేస్తా" అంది కల్పన.

"నీ వల్ల కాదు" అంది పెద్దగా అనూష.

మిగతా అమ్మయిలంతా లేచి కూచున్నారు.

వాళ్ళ్లో కొద్దిగా ధైర్యమున్న అమ్మాయి వెళ్ళి అనూషని బలంగా కుదుపుతూ " అనూషా .. అనూషా" అని పిలిచింది.

"ఎందుకలా అరుస్తావు? నేను మేల్కొనే ఉన్నాను" చిరాగ్గా అంది అనూష.

"ఎవరితో మాట్లాడ్తున్నావు?"

"ఇదిగో ఇక్కడే ఉందిగా కల్పన... దాంతో మాట్లాడ్తున్నా"

"ఎవ్వరూ లేరక్కడ. కల్పన చనిపోయింది. పీడకలేమైనా వచ్చిందా?"

"నిద్ర పోతేగా కల రావడానికి ... కల్పన ఇదిగో ... నాపక్కనే ఉందిగా.. మీకు కనిపించటం లేదా?" ఆశ్చర్యంగా అడిగింది అనూష.

మిగతా అందరు భయంతో ముడుచుకుపోయి రాత్రంతా జాగారం చేశారు.

ఆ హాస్టల్ గదిలో కల్పన దయ్యమై తిరుగుతోందని.. అనూషకు రాత్రి కనిపించిందని...

మాట్లాడిందని మరునాడుదయానికల్లా వార్త హాస్టలంతా దావానంలా పాకింది.

* * * * * * * * * * *

రమణారావు ఉదయం నాలుగున్నరకే లేచి ఎప్పటికి మల్లే కోడుకుని లేపాడు.

ఐదున్నరకల్లా నల్లకుంటలోని శాస్త్రి కోచింగ్ సెంటర్ దగ్గర దింపి రావాలి.

అనిరుధ్ కి మరికాస్సేపు పడుకోవాలని ఉంది. నిద్ర చాలటం లేదీ మధ్య. విసుగ్గా ఉంటోంది.

క్లాసులో కూచుంటే కళ్ళు వాటంతటవే వాలిపోతున్నాయి.

"లేరా, ఈ రోజు పరీక్ష కూడా ఉంది. లేటయితే లోపలలికి రానివ్వరు" అన్నాడు రమణారావు.

పరీక్ష గుర్తుకు రాగానే భయంతో లేచి కుచున్నాడు అనిరుధ్. అవ్వునునిజమే. ఈ రోజు ఫిజిక్స్ పరీక్ష ఉంది. నిన్న జరిగిన మేథమేటిక్స్ పరీక్షలో అన్ని తప్పులు రాశాడు. నూటికి పాతిక మార్కులొస్తే గొప్ప. ఈ రోజు ఫిజిక్స్ కూడా అంతంత మాత్రమే చదివాడు. పోయిన్నెల వచ్చిన ఇరవై రెండు, పదహారు, ఇరవై నాలుగు మార్కులు చూసి వాళ్ళమ్మ, నాన్న చేసిన రచ్చంతా గుర్తొచ్చి కాళ్ళలో వణుకు పుట్టీమిది.

"ఈ మార్కులు పాతిక్క? అంతే అయి ఉంటుంది. లెక్కల్లో ఇరవై రెండు, ఫిజిక్స్లో పదహారు, కెమిస్ట్రీలో ఇరువై నాలుగు... చాలా బాగా వచ్చయి" అంది పోయిన్నెలలో వాళ్ళమ్మ.

"ఏది చూడని" అని రమణారావు లాక్కుని నిశితంగా చూచి "నీ బొంద, అవి నూటికి మన వాడికొచ్చిన మార్కులు" అన్న్నడు.

అంతే. హీరోషిమా నాగసాకి మీద ఆటం బాంబు పడ్డప్పుడు కూడా అంత రభస రాద్ధంతం జరిగి ఉండదు.

అమ్మ వాణ్ని చెడామాడా తిట్టింది. కడుపుకి అన్నమే తింటున్నావా అంది. నువ్వు పెట్టేది అన్నం కాదా అని అడుగుదామనుకొని కూడా భయంతో నోరు మెదపలేదు అనిరుధ్. నీకు సిగ్గులేదా అంది. మనిషివేనా అంది. నా కడుపున చెడబుట్టవు కదరా అంది. ఆ తర్వాత పెద్దగా ఏడ్చింది. శోకాలు పెట్టింది. మధ్య మధ్య లో "కోడుకుని సరిగ్గ పట్టించుకోని నువ్వూ ఓ తండ్రివేనా" అంటు నాన్నని కూడా తిట్టింది.

వాడి నాన్న ఆ మాటలకు రెచ్చిపోయాడు. అనిరుధ్ ని పట్టుకుని దబా దబా నాలుగు బాదాడు. నీకు చదువొద్దు బర్రె గొడ్లు కాసుకో అన్నడు. నీ మొహం నాకు చూపించకు ఫో అన్నడు. ఈసారి అలాంటి మార్కులొస్తే నీ చర్మం వలిచేస్తానన్నాడు.

అనిరుధ్ కి అవన్నీ గుర్తొచ్చి మరింత కంగారు పెరిగింది. పోయిన్నెల వచ్చిన మార్కుల్తో పోలిస్తే ఈ నెల మరీ తక్కువొస్తాయనిపిస్టొంది. అవి చూసి అమ్మానాన్న ప్రళయకాల రుద్రుల్లా మారి, తాండవం చేసి, తన వోంటిమీద వాతలు తేలేలా కొట్టి.. ఆ వూహకే హుండె దడదడలాడ్తోంది.

స్కూటర్ వెనక కూచున్నాడన్న మాటేగానీ వాడి ఆలోచనలు పరిపరివిధాల పోతున్నయి. శాస్త్రి కోచింగ్ సెంటర్ బైట దింపి "పరీక్ష బాగా రాయి. సెవెంటీ టు ఎయిటి పర్శెంట్ కి తక్కువ రాకూడదు. తెల్సిందా" అన్నాడు రమణారవు. సరేనన్నట్లు తలూపాడు. నాన్న వెళ్ళిపోయేవరకు అక్కడే నిలబడ్డాడు.

వాడికి లోపలికెళ్ళి పరీక్ష రాయాలని లెదు. మార్కులు తక్కువొచ్చినా అమ్మ నాన్న తిడ్తారు. పరీక్ష రాయలేదన్న తిడ్తారు. వాడికేం చేయాలో అర్థం కావటం లేదు. ప్యాంటు జేబుని తడుముకున్నాడు. నిన్న రాత్రి నాన పర్సులోంచి కొట్టేసిన వంద రూపాయల నోటు చేతికి తగిలింది. వాడికి ధైర్యం వచ్చింది. వాడు వెనక్కి తిరిగి కాచిగూడ రైల్వే స్టేషన్ వైపుకి వేగంగా నడిచాడు.

* * * * * * * * * * *

ఏడున్నరకు కొడుకుని తీసుకెళ్ళటానికి కోచింగ్ సెంటర్ బైట్ ఎదురుచూస్తూ నిలబడ్డాడు రమణారావు. పిల్ల గుంపులు గుంపులుగా బైటికొస్తున్నారు. పదిహేను నిముషాల్లో పిల్లందరూ వెళ్ళిపోయారు. అతనికి కంగారు మొదలైంది. అనిరుధ్ ఏమైనాడు? మామూలగా అయితే ఈ పాటికి వచ్చేయాలే. పరీక్ష బాగా రాయలేదా? లోపలెక్కడైనా ఏడుస్తూ కూచున్నాడా?

రమణారావు లోపలికెళ్ళీ చూశాడు. గదులన్నీ ఖాళిగా ఉన్నాయి. శాస్త్రిగారు కనిపిస్తే నమస్కారం చేసి 'మా అబ్బయి కోసం చూస్తున్నాను సార్" అన్నడు.

"అసలు నేనే అడగాలనుకున్నాను. ఈ రోజు మీవాడు రాలేదం" అన్నడాయన.

ఆ మాటలుకు శ్వాస ఆగిపోయినంత పనైందతనికి. "రాకపోవడమేమేమిటి? ఉదయం ఐదున్నరకు దింపి వెళ్ళీంది నేనేగా" అన్నడు.

"అలాగా. పరీక్ష హాల్లోకైతే రాలేదు. ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళాడేమో ఎంక్వయిరి చేయండి" అన్నాడతను.

తొమ్మిదయినా అనిరుధ్ జాడ లేదు. వాళ్ళమ్మ శోకాలు పెట్టీ ఏడుస్తోంది అతని స్నేహితులందర్నీ వాకబు చేశారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. స్కూటర్ మీద నల్లకూంట చుట్టుపక్కలంతా వెదికి వచ్చడు. పదిదాటింది. వాడి కబురు లేదు.

పదిన్నరకు పోలీస్ స్టేషన్ కెళ్ళి మిస్సింగ్ కేస్ బుక్ చేశాడు రమణారావు. అనిరుధ్ ఫోటోల్ని వాళ్ళకిచ్చి యింటికొచ్చాడు. అతనికంతా అయొమయంగా ఉంది. సెంటర్ బైట వదిలేసి వచ్చిన కోడుకు ఏలా మాయమయ్యడు? ఎవరైనా కిడ్నాప్ చేసారా? మరేమైనా ప్రమాదం జరిగిందా? అలాగైతే పోలీసులకు తెలియాలిగా? కిడ్నాప్ అయితే ఎవరు చేసి ఉంటారు? తన శత్రువులా? ఎవరా శత్రువులు?

అతనికి ఆలోచనల్తో పిచ్చి పట్టేలా ఉంది. అనిరుధ్ వాళ్ళమ్మ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది.

* * * * * * * * * * *
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)