కాళిదాసు "కుమారసంభవం" : మొదటి భాగం

మువ్వల సుబరామయ్యగారు విజయవాడలో జయంతి పబ్లికేషన్స్ అధినేత. గత మూడు దశాబ్దాలుగా వారు వివిధ ప్రాచీన గ్రంధాలను ముద్రించి, ఎన్నోగ్రంధాలకు తెలుగులోకి అనువాదాలు చేయించి అమితమైన సాహితీ సేవలను అందించారు. యువ, మిసిమి, రచన, ఆంధ్ర జ్యోతి, వంటి అనేక పత్రికలలో వారి వ్యాసాలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. వారికున్న ఈ ప్రాచీన సాహిత్య పరిజ్ఞాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఈ సాహిత్యాలను పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో అందించమన్న మా అభ్యర్థనకు వారుచేసిన రూపకల్పనే ఈ శీర్షికే, "ప్రాచీన సాహిత్య దర్శనం"గా వెలుగొందగలదు. ప్రతినెలా వారు ఒక ప్రాచీన కావ్యాన్ని తీసుకొని దానిని సరళతరమైన భాషలో అందించడమేకాకుండా అవసరమైన వ్యాఖ్యలను కూడా జతపరుస్తారు.


“కాళిదాసు శివభక్తుడు కాబట్టి శివపార్వతుల కధనం తీసికుని మహాకావ్యంగా రచించాడు. కుమారసంభవ కధ శివపద్యపురాణాలనుంచి కాళిదాసు తీసుకున్నాడని అంటారు. కావ్యం ప్రారంభంలో హిమాలయ వర్ణన, మూడవ సర్గలోని వసంతఋతువు వర్ణన, నాల్గవ సర్గలోని రతీ విలాపం, అయిదవ సర్గలోని శివపార్వతుల సంవాదం కవియొక్క ప్రతిభాజనిత సన్నివేశాలు. కుమారసంభవంలో పదిహేడు సర్గలున్నాయి. వీటిలో మొదటి ఎనిముది సర్గలే కాళిదాసు రచించాడని, మిగిలినవి ఎవరో అతని శైలిని అనుకరిస్తూ రచించి చేర్చారని ఒక అభిప్రాయంవుంది. మల్లినాధుడు ఎనిమిది సర్గలకు మాత్రమే వ్యాఖ్యానం వ్రాయటం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తుంది. శైలి, భాష, అలంకార రచన అన్నీ కాళిదాసు రచనను పోలి ఉండగా తొమ్మిదినుంచి పదిహేడు సర్గలవరకు కాళిదాసు వ్రాయలేదనటం సమంజసంకాదని, మరోకవి ఎంత అనుకరించినా అనుకరణ అనుకరణలాగానే మిగిలిపోతుందిగాని ముమ్మూర్తులా అలాఉండదని, పదిహేడు సర్గలూ కాళిదాసురచనేనని విశ్వసించేవారు అంటారు. మల్లినాధుడు చివరి తొమ్మిది సర్గలకు వ్యాఖ్యానం వ్రాయలేదని, దానికి కారణం మరేదైనా అయిఉంటుందని వారి అభిప్రాయం. మల్లినాధుడికి పూర్వం అరుణగిరినాధుడు రఘువంశంలో ఎనిమిది సర్గలకే వ్యాఖ్యానం వ్రాసాడు కాబట్టి అక్కడరాని అనుమానం ఇక్కడ రావడానికి వీల్లేదు. “

హిమవంతుడు మేరుపర్వతానికి ప్రాణస్నేహితుడు. మర్యాద తెలిసినవాడు. అతను మేనక అనే కన్యను శాస్త్రవిధిన పెండ్లాడాడు. ఆమె పితృదేవతల మానస పుత్రిక. మునీశ్వరులకుసైతం పూజ్యురాలు. కుల, శీల, సౌందర్యాలలో హిమవంతుడికి తగినది.

హిమవంతుడు, మేనకాదేవీ స్వర్గసుఖాలను అనుభవిస్తూ వచ్చారు. కొన్నాళ్ళకు మేనక గర్భవతి అయ్యింది. ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు మైనాకుడు. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఆ రెక్కలను వ్రక్కలించడానికై ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే మైనాకుడు సముద్రములో చొరబడి ఆ దెబ్బనుండి తప్పించుకున్నాడు. సముద్రుడికి స్నేహితుడై, నాగకన్యలకు నాయకుడై సముద్రంలోనే ఉంటున్నాడు.

ఇలా ఉండగా కైలాసంలో ఒక కధ జరిగింది. శివుడి మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షప్రజాపతి కుమార్తె. మహా సాద్వి. తండ్రి తన భర్తకు చేసిన అవమానాన్ని సహించలేక దాక్షాయణి యోగాగ్నిలో తనువు త్యజించింది. తిరిగి మేనకాదేవి గర్భవసాన పుట్టాలని సంకల్పించుకున్నది.

ఇక్కడ మేనక, హిమవంతుని వలన మంచి సంతానం పొందాలని ఎన్నెన్నో పూజలు, వ్రతాలూ చేస్తున్నది. ఆమె పూజఫలంగా సతీదేవి జన్మించింది. ఆ అమ్మాయి పేరు పార్వతి.

నెలవంక పొడిచి రోజుపోజుకూ కొత్తకొత్త కళలతో ఎలా వృద్ది పొందుతుందో అలా పార్వతి వినూత్న రూపలావణ్యాలతో పెరిగి పెద్దదవుతూ వచ్చింది. తల్లితండ్రులకూ, బంధుమితృలకూ, అందరికీ అల్లరుముద్దుగావుంటూ వచ్చింది. పర్వతరాజు పుత్రిక కనుక ఆమెకు పార్వతి అని పేరు పెట్టినప్పటికీ, తపస్సును మానిపించడానికై ఆమెతో "ఓ అమ్మాయీ! వద్దు!" అని పలికినందున ఆమెకు ఉమ అనే పేరు వచ్చింది.

పార్వతి బాల్యం అందరికి కన్నుల పండగ చేసింది. ఆమె తన తోటి చెలికత్తెలతో కూడి ఆకాశగంగా తీరాన ఇసుక బయళ్ళలో అరుగులు కడుతూ ఆడుతూ ఉండేది. బంతులాడేది. బొమ్మలపెళ్ళిళ్ళు చేసేది. పార్వతికి చదువు నేర్చుకునే వయస్సు వచ్చింది. అయితే ఆమెకు ఎవరూ విద్య నేర్పలేదు. పూర్వజన్మలో పరమోత్కృష్టమైన ఉపదేశమూ, శిక్షా పొందినది కాబట్టి, శరత్కాలం రాగానే గంగానదికి హంసల గుంపు చేరినట్లు, పార్వతికి సకల విద్యలూ వాటంతట అవే వచ్చాయి.

వయసురాగానే పార్వతికి కొత్త వన్నెలు వచ్చాయి. సూర్యకిరణాలకు వికసించిన తామర పువ్వులాగా శోభిల్లింది ఆమె. బ్రహ్మదేవుడు లోకంలోని అందమంతా ఒక చోట రాశిపోసి చూడాలన్న కోరికతో అందచందాలన్నీ గుదికూర్చి పార్వతిని సృష్టించాడు.

ఇలా ఉండగా త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకనాడు యాధృచ్చికంగా హిమవంతుడి దగ్గరకు వచ్చి, కన్యగా ఉన్న పార్వతిని చూచి, 'ఆహా! ఈ కన్య తన సేవ చేత శివుని అర్ధదేహాన్ని హరిస్తుంది సుమా. ఈమెను చేపట్టిన శివుడు మరెవరినీ చేపట్టలేడు' అని పలికాడు.

నారదుడి మాటలు విన్న హిమవంతుడు తన కుమార్తెను శివుడికే ఇచ్చి పెండ్లి చేయాలనుకున్నాడు. అయితే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. పార్వతిని తనకిచ్చి పెండ్లిచేయమని శివుడు స్వయంగా అడగలేక మౌనముద్ర వహించి వున్నాడు. మరి శివుడు పార్వతిని చేపట్టేటట్లు చేసే సామర్ధ్యం హిమవంతుడికి లేదు.

దక్షుడి మీద కోపంతో సతీదేవి తనువు చాలించినది మొదలు శంకరుడు విరక్తుడై హిమవత్పర్వతం మీదనే నిరంతరం తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసే వారందరికీ ఇంద్రపదవి మొదలు ఏది కావాలంటే అది స్వయంగా ఇచ్చే మహానుభావుడు శివుడు. అలాంటివాడు ఇప్పుడు ఏ కారణంతోనో ఏమో హిమవత్పర్వతంపై ఒకచోట అగ్ని ప్రజ్వలింపజేసి తనే తపస్సు చేస్తున్నాడు.

తన అభీష్టం నెరవేరడానికి ఇదే మంచిసమయమని గ్రహించిన హిమవంతుడు శంకరుని స్వయంగా అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు. పార్వతిని ఆయన శుశ్రూషకై నియోగించాడు. పార్వతికి తోడుగా జయ, విజయలనే ఇద్దరు చెలికత్తెలని కూడా ఉంచాడు. నిజానికి పార్వతిచేత సేవలందుకోవడం వలన తన తపోనిష్టకు భంగం కలుగుతుందని శివుడికి తెలిసినా ఆమె శుశ్రూషకి ఒప్పుకున్నాడు. ఎందుకంటే మనస్సు చెదరటానికి కారణాలు ఉన్నా కూడా ఎవరి మనస్సయితే చెదరకుండా ఉంటుందో వారే ధీరులు. ఆ విషయం లోకానికి చాటాలనుకున్నాడు కాబోలు శివుడు.

పార్వతి అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుడికి సేవలు చేస్తూ వచ్చింది. ఇలా శ్రమ పడడంవల్ల సుకుమారి అయిన ఆ అమ్మాయికి అలసట కలగక పోలేదు. అయితే శివ శిరస్సున గల చల్లని చంద్రకిరణాలు ఆమె అలసటను తీరుస్తూవచ్చాయి.

ఇలా పార్వతి శివుడికి పరిచర్యలు చేస్తున్న సమయంలో తారకాసురుడనేవాడు దేవతలని పీడిస్తున్నాడు. వాడి బాధలు పడలేక దేవతలంతా ఇంద్రుని నాయకత్వాన బ్రహ్మ దగ్గరకి పోయి మొర పెట్టుకున్నారు. తమ కష్టాలు తీర్చమని వేడుకున్నారు. బృహస్పతి చేతులు జోడించి బ్రహ్మ దేవునితో 'దేవా! ఏదో లోకాచారాన్ని అనుసరించి మమ్మల్ని అడుగుతున్నావు కాని, సర్వాంతర్యామివైన నీకు ఈ విషయం తెలియకుండా ఉన్నదా! దేవ దేవా! తారకుడనే రాక్షసుడు నీ వలన వరాలు పొంది గర్వించాడు. తోకచుక్కలా లోకాలన్నిటికీ కీడు చేస్తున్నాడు. ఆ తారకుడిని సంహరించడానికి మాకొక నాయకుడు కావాలి. ఎటువంటి సేనాపతిని ముందుంచుకొని ఇంద్రుడు దేవతా సైన్యంతో పోరాడితే తారకాసురుణ్ణి జయిస్తాడో అటువంటి సేనానాయకుడిని సృష్టించవలసినదిగా నిన్ను ప్రార్ధిస్తున్నాము' అని మొరపెట్టుకున్నారు.

'ఓ దేవతలారా! మీ కోర్కె సిద్ధిస్తుంది. కాని మీరు కొంతకాలం ఓర్చుకుని ఉండాలి. మీరు కోరిన సేనానాయకుణ్ణి నేను స్వయంగా సృష్టించను. తారకుడికి వరాలిచ్చి అంతటి ఆధిక్యతను సమకూర్చిన నేనే వాణ్ణి నాశనం చేయటం న్యాయంకాదు. శివుడి వీర్యం వల్ల పుట్టినవాడు తప్ప మరెవరూ నిన్ను ఓడించలేరని నేను వాడికి వరం ప్రసాదించాను. లోకాలన్ని దహించేటట్లున్న వాడి తపస్సును ఈ వరంతోనే చల్లార్చాను. కనుక తారకుడు శివుని కుమారుని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావడు.

శివుని మహిమను నేనే కనిపెట్టలేక పోయాను. విష్ణుమూర్తి కూడా కనుక్కోలేక పోయాడు. అందుచేత మీ కార్యం నెరవేరడానికి నేనొక ఉపాయం చెబుతాను. ఆ ప్రకారం చేయండి. పరమశివుడు సతీదేవి వియోగం తరువాత విరక్తుడై ఇప్పుడు యోగ సమాధిలో ఉనాడు. సతీదేవి కూడా పార్వతి అనే పేరుతో ఇప్పుడు హిమవంతుని కుమార్తెగా జన్మించి ఉంది. మీరు వెళ్ళి పార్వతి సౌందర్యంతో శివుని మనస్సుని ఆకర్షింపచేయండి. శివుని వీర్యం భరించ సమర్ధులైన వారు లోకంలో ఇద్దరే ఉన్నారు. ఒకరు పార్వతి. మరొకరు శివుని మూర్తి భేదంగా ఉంటున్న జలము. ఆ శంకరుని కుమారుడు మీకు సేనానాయకుడై యుద్ధంలో తారకాసురుని సంహరిస్తాడు. అప్పుడు మీరు సమస్త స్వర్గలోక సుఖాలని అనుభవిస్తారు' అని అంతర్ధానమైనాడు. దేవతలుకూడా తిరిగి తమతమ స్థానువులకు వెళ్ళిపోయారు.

ఇంద్రుడు ఆలోచించి, శివుని చిత్తాన్ని చలింపజేయగలిగినవాడు మన్మధుడే అని నిశ్చయించుకుని మన్మధుణ్ణి తలుచుకున్నాడు. మన్మధుడు రాగానే విషయమంతా వివరించి 'దేవతల కార్యం నెరవేర్చడానికి సంసిద్దుడవుకా. ఇది నీ ఒక్కడివల్లే అవుతుంది' అని దేవేంద్రుడు బోధించాడు.

ఈ ప్రయత్నంలో ఏమవుతుందోనని భయపడుతున్న చెలికాడు వసంతుడు, రతీదేవి వెంటరాగా, ప్రాణం పోయినా సరే ఈ కార్యం సాధించి తీరుతానని నిశ్చయించుకున్న మన్మధుడు అక్కడినుంచి బయలుదేరి మంచుకొండపైనున్న శివుని ఆశ్రమానికి వెళ్ళాడు. మన్మధుడికి గర్వకారణంగా ఉంటున్న వసంతుడు అక్కడ నిజస్వరూపం ధరించి విచ్ఛలవిడిగా సంచరించ సాగాడు. వసంత శోభ వెల్లివిరియడంతో తపోవనంలో సమాధి నిష్టాగరిష్టులై ఉన్న తాపసుల ఏకాగ్రతకు భంగం కలిగింది. ఎంతటివారినైనా మోహంలో ముంచి వేసే అలాంటి వసంతశోభ వెల్లివిరిసిన సమయంలో పరమశివుడు అప్సరసల గానం విన్నాడు. అయినా చలించ లేదు. శివుడు సమాధి నిష్టుడై ఉన్న లతాగృహద్వారం దగ్గర నందికేశ్వరుడు కావలి కాస్తున్నాడు. నందికేశ్వరుడి కంట పడకుండా అతని చూపులనుండి తొలగి, శివుడు సమాధి నిష్టలో ఉన్న స్థలానికి చేరుకున్నాడు మన్మధుడు. ముక్కంటిని చూసాడు.

శంకరుడు దేవదారు చెట్టు అరుగు మీద పులితోలు పరుచుకుని కూర్చుని తపస్సమాధిలో మునిగి ఉన్నాడు. వీరాసనం వేసుకోవడంవల్ల దేహంలో పై సగభాగం నిశ్చలంగా ఉంది. రెండు భుజాలు కృంగి ఉన్నాయి. ఒడిలో వల్లకిల మూయకున్న ఆయని రెండు చేతులూ బాగా వికసించిన తామర పువ్వుల్లా శోభిల్లుతున్నాయి.

మహేశ్వరుని తలపై జడలన్నీ ఒక పాముతో ఎత్తి కట్టబడి ఉన్నాయి. రెండు పేటలుగా ఉన్న అక్షమాల చేతికి వేలాడు తున్నది. జింక చర్మము పైన ఉత్తరీయంగా ధరించాడు. శంకరుని గళమందలి నలుపు జింక చర్మముపై పడి దానిని మరింత నల్లగా చేస్తున్నది.

ఆయన కళ్ళు నిశ్చలములు, తీక్షణములు అయిన నల్లటి గ్రుడ్లతో వెలుగుతున్నాయి. ఆ విధంగా అధోముఖంగా ప్రసరిస్తున్న కిరణములుగల తన మూడు కళ్ళతో దృష్టిని నాసాగ్రమున ఉంచాడాయన.

శివుడు తన దేహములోని ప్రాణాపానాది వాయువులన్నీ బంధించినవాడై గాలిలేని చోట కదలకుండా వున్న దీపంలా ప్రకాశిస్తునాడు. ఆయన లోపలి తేజస్సుయొక్క జ్వాల బ్రహ్మరుధ్రాన్ని ఛేధించుకుని, దాని పైన ఉన్న బ్రహ్మ కపాలం కన్ను బెజ్జం గుండా పైకి లేస్తున్నాయి. ఆ జ్వాల మూలంగానే తామరతూటి దారం కంటే కోమలమైన ఆయన జడలోని చంద్రరేఖ శోభ మాసిపోతున్నది.

ఆ పరమశివుడు తన మనస్సును నవరంధ్రాలగుండా ఎటూ పోనీయక యోగం చేత స్వాధీన పరచుకుని తన హృదయకమలంలో ప్రతిష్టింప చేసుకున్నాడు. ఆ పరమాత్మను ఆయన తనలోనే సాక్షాత్కరించుకున్నాడు. కనీసం మనస్సు చేతనైనా సరే ఎవరూ ఎదుర్కోలేరు ఆయన్ను.

అలాంటి త్రినేత్రుని దగ్గరగా ఉండి చూడగానే మన్మధుడు భయంతో కంపించిపోయాడు. అతనికి తెలియకుండానే చేతిలోని విల్లూ, బాణమూ జారిపోయాయి.

అప్పుడు చెలికత్తెలైన ఇద్దరు వనదేవతలను వెంట పెట్టుకుని పార్వతీ దేవి అక్కడికు వచ్చింది. శక్తి యావత్తూ కోల్పోయిన మన్మధుణ్ణి కేవలం తన శరీర లావణ్యం చేతనే తిరిగి మహాబలవంతునిగా చేసేటట్టు కనిపించిందామె. పార్వతీ దేవి సూర్య కిరణాలతో సంతప్తమైన మందాకినీ తామర గింజల తావళాన్ని తపస్సంపన్నుడగు శివునికి తన ఎర్రని చేతితో కానుకగా సమర్పించింది. అప్పుడు మన్మధుదు తన సమ్మోహనాస్త్రాన్ని ధనుస్సున సంధించాడు. ఆ సమయంలో ఎన్నడూ చలించని శివుడు ఇందుకు చలించాడు. దొండపండు వంటి అధరోష్టము గల పార్వతి ముఖబింబాన్ని తన మూడుకన్నులతో ఒక్కమాటుగా దృష్టి నిలిపి చూసాడు. తాను సహజంగా జితేంద్రియుడు కావటం వల్ల ఇంద్రియ వికారాన్ని అణుచుకున్నాడు. తన చిత్తం ఇలా చలించడానికి కారణం ఏమిటా అని నలువైపులా పరికించి చూచాడు.

ఎడమ కాలుని ముందుకు వంచి, మండలాకారంగా తన సుందరమైన విల్లును వంచి, కుడికంటి కొన వరకు విల్లు నారిని లాగి, పిడికిలి బిగించి, బాణం వేయడానికి సిద్దంగా ఉన్న మన్మధుణ్ణి శివుడు చూచాడు. పరమశివుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ముల్లోకాలు దద్దరిల్లినవి. దేవతలు ఆకాశం నుండి పెద్దపెట్టున మొరపెట్టుకున్నారు. కాని అంతలోనే ఆ ముక్కంటి కంటి మంటకు మన్మధుడు కాలి భస్మమై పోయాడు.

మన్మధుడు భార్య రతీదేవి దుఃఖం ఆపుకోలేక మూర్ఛపోయింది. స్త్రీల సాన్నిధ్యం కూడ తపస్సుకు ప్రతికూల మైనదేనని, ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక తన ప్రమధ గణాలతో భూతపతి అంతర్ధానమైనాడు.

తన తండ్రి కోరిక వ్యర్ధం కావడం, తన సౌందర్యం నిష్ఫలమై పోవటం పార్వతీ దేవి గ్రహించింది. పైగా చెలికత్తెల ఎదుటే తనికీ అవమానం జరగటం వల్ల మనస్సంతా వికలం కాగా, ఎటూ తోచక చివరికి ఇంటివైపు మళ్ళింది. వెంటనే హిమవంతుడు అక్కడికి వచ్చాడు. రుద్రుని కోపం వల్ల భయంతో కళ్ళు మూతలు పడి ఉన్న తన కుమార్తెను చేతులమీద ఎత్తుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

రతీదేవి కొంతసేపటికి మూర్ఛనుంచి తేరుకున్నది. ఆమె కళ్ళు భర్త కొసం అంతట వెదికాయి. పురుషాకారంలో ఉన్న బూడిద మాత్రం ఆమె కంటపడింది. ఆ భస్మ రాశి తన భర్తదే అని గ్రహించింది. ఆమెకు దుఖం ఆగలేదు. నేలమీద పడి పొర్లుతూ పెద్ద పెట్టున ఏడవ సాగింది. అనేక విధాల విలపించింది. ఆమెను ఓదార్చడానికై వసంతుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వసంతుని చూచి రతీదేవి గోడుగోడున దుఃఖించ సాగింది. రతీదేవి తన దుఃఖాన్ని వసంతునితో వెళ్ళబోసుకుని, అగ్నిలో దేహత్యాగం చేయడానికి నిశ్చయించుకుంది.

అప్పుడు ఆకాశవాణి ఆమెను ఓదారుస్తూ 'ఓ రతీదేవీ! నీ భర్త మరల త్వరలోనే నీకు లభిస్తాడు. నీ భర్త మన్మధుడు ఒకానొక పురాకృత కర్మ వలన అగ్నిలో మిడత వలె శివుని నేత్రజ్వాలలో దగ్ధమై పోయాడు. దీనికి కారణం చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు మన్మధుడు బ్రహ్మకు తన కుమార్తె అయిన సరస్వతి మీదనే కామం పుట్టించాడు. అందుకుగాను బ్రహ్మ అతనిని శపించాడు. ఆ శాపం కారణంగానే కాముడిప్పుడు ఇలా కాలి పోయాడు. శాపం వలన మన్మధుడికి కీడు మూడితే సృష్టి నిలిచి పోతుందని భయపడి ధర్ముడనే ప్రజాపతి బ్రహ్మను వేడుకున్నాడు. శివుడు ఎప్పుడైతే పార్వతి తపస్సుకి వశుడై ఆమెను వివాహమాడి ఆనందిస్తాడో అప్పుడు మరల మన్మధుడు తన దేహం పొందుతాడని బ్రహ్మ శాపవిముక్తి ప్రసాదించాడు. నీవు విచారించకు నీకు మరల మంచిరోజులు వస్తాయి' అని పలికింది.

ఈ పలుకులు విన్న రతీదేవి, వసంతులకు ధైర్యం వచ్చింది. వసంతుడు హితవచనాలు చెప్పి ఓదార్చాడు. భర్తకు ఎప్పుడు శాపవిముక్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నది రతీదేవి.

తను చూస్తుండగానె శివుడు మన్మధుడిని భస్మం చేయడం, తన కోరిక నెరవేరక పోవడం తలచుకుని ఎంతో విచార పడింది పార్వతి. శివుడు చిత్తాన్ని ఆకర్షించని తన పాడు సౌందర్యం దేనికని నిందించుకున్నది. కఠోరమైన తపస్సు చేత శివుని మనస్సు ఆకట్టుకోగల సౌందర్యాన్ని సంపాదించాలని పార్వతి నిశ్చయించుకుంది. ఒక శిఖరంపై తపస్సు ప్రారంభించింది. గౌరి తపస్సు చేయడం వలన తరువాత ఆ శిఖరానికి గౌరీశిఖరమనే పేరు లోకంలో ప్రసిద్దిలోకి వచ్చింది.

ఉమాదేవి కఠోర నియమాలతో సుకుమారమైన తన దేహాన్ని రాత్రింబవళ్ళు కృశింపజేస్తూ, చెప్పనలవి కాని క్లేశాన్ని భరిస్తూ, మహర్షులు కూడా సాధించలేని గొప్ప తపస్సును సాధించింది. అంతట ఒక బ్రహ్మ చారి ఆ శిఖరానికి వచ్చాడు. అతిథులను సత్కరించడమంటే ఎంతో ఇష్టం గల పార్వతి ఆ బ్రహ్మచారికి ఎదురు వెళ్ళి సకలవిధ గౌరవ మర్యాదలతో తీసుకు వచ్చి పూజించింది. వారిరువురికీ అన్ని విషయాలలోనూ సమ్మనత్వమే ఉన్నది. అయినప్పటికీ స్థిరచిత్తులు విశేషమైన వ్యక్తులయందు ఎక్కువ గౌరవం చూపుదురు.

ఆ బ్రహ్మచారి పార్వతీ దేవి అతిథి మర్యాదలు అందుకున్నాడు. కొంతసేపు అలసట తీర్చుకున్నట్లు నటించి 'ఓ పార్వతీ! నీవు ఇలా ఎంతకాలం బాధపడతావు? నేనూ బ్రహ్మచర్యాశ్రమంలో తపస్సు చేసిన వాడనే. నేను ఆర్జించిన తపస్సులో సగభాగం నీకిస్తాను. దాంతోనైనా నీ కోరిక నెరవేర్చుకో. చెప్పు. నీవు కోరిన ఆ వరుడెవ్వరు?' అని అడిగాడు.

బ్రాహ్మణ బ్రహ్మచారి ఆత్మీయునివలె తన లోగుట్టు తెలుసుకొనటానికి ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగా, విని పార్వతి సిగ్గుతో తల వంచుకున్నది. తన మనసులో మాట అతనికి చెప్పలేక పోయింది. పక్క నున్న చెలికత్తెతో నీవు చెప్పమన్నట్లు కాటుక లేని కనులతో సైగ చేసింది.

అప్పుడామె చెలికత్తె బ్రహ్మచారిని చూచి 'మహాత్మా! ఈమె పినాకపాణిని పతిగా కోరుతున్నది. వేరే మార్గం తోచక తండ్రి అనుమతితో ఈ తపస్సు మొదలు పెట్టింది. రోజురోజుకు కృశించిపోతున్న ఈమెను చూడలేక పోతున్నాము. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలియడంలేదు' అంది. 'ఈ విషయం నిజమా?' అని పార్వతీ దేవిని అడిగాడు బ్రహ్మచారి.

'వేదవేత్తలలో శ్రేష్టుడైన ఓ మహాత్మా! నా సఖి చెప్పినది సత్యం. అందరాని పండ్లను ఆశించినట్లు నేను శివుని కోరుకున్నాను. నా కోర్కె నెరవేరడానికి మరో మార్గం కనిపించక ఈ తపస్సు సాధనంగా చేసుకున్నాను' అని పలికింది.

(సశేషం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)