భాగవత పద్యం - పర్యావరణం

పురాణ గ్రంధాల్లో పద్యాల నిండా మతం, భక్తి, పూజలు తప్ప నిత్య జీవితానికి ఉపయోగపడే విషయాలేవీ లేవని కొంతమంది అభిప్రాయం. అందుకే పద్యాలు పాత కాలానివనీ అవి ఇప్పుడు పనికి రావని భావించి పిల్లలకు పద్యాలు నేర్పే విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు.

నిజానికి మన పురాణాలు 'పురా అపి నవీనాలు'. అవి ఎంత పాతవో అంత కొత్తవి.ఏ కాలానికైనా పనికివచ్చే ధర్మాలు, ఆదర్శాలు వాటిలో ఉంటాయి.ఈ కాలంలో పచ్చదనం, పరిశుభ్రం అంటూ మొక్కలు పెంచడం గురించి వృక్షాల వల్ల ఉపయోగాల గురించి ఊదరగొట్టేస్తున్నారు.మొక్కలు పెంచడాన్ని గురించి ప్రచారం చేయడానికి సభ పెడుతున్నారు. ఆ సభా వేదిక నిర్మాణం కోసం అక్కడ ఉన్న చెట్లు కొట్టేస్తున్నారు.సరే. అది వేరే విషయం.

తెలుగు వారందరికీ నిత్య పఠన గ్రంధంగా ఉన్న బమ్మెర పోతనగారి భాగవతంలో వృక్షాల ప్రాధాన్యం గురించి ఎంత మంచి పద్యం ఉందో చూడండి.బృందావనంలో గోపకులు గోవుల్ని మేపుతూ అలసిపోయి దట్టంగా ఉన్న చెట్ల నీడలకి చేరతారు.ఆ సందర్భంలో ప్రముఖ గోపకులు బలరామకృష్ణులనుద్దేశించి చెప్పిన పద్యం ఇది.

"అపకారంబులు సేయవెవ్వరికి, నేకాంతంబు నందుండు, నా

తప శీతానిల వర్ష కారకములై, త్వగ్గంధ నిర్యాసభ

స్మపలా శాగ్ర మరంద మూల కుసుమ చ్ఛాయా ఫలశ్రేణి చే

నుపకారంబులు సేయునెల్లరకు నీ యుర్వీజముల్ గంటిరే?"

 1. చెట్లు ఎవరికీ అపకారం చేయవట. ఈ యుగంలో ఇదే గొప్ప లక్షణమన్నమాట. ఉపకారం చెయ్యటం మాట దేవుడెరుగు.అపకారం చెయ్యకుండా ఉంటే అదే పదివేలు.
 2. చెట్లు ఏకాంతంగా ఉండగలుగుతాయట.అందువల్ల ఇవి మనుషులకు ఆదర్శం.ఒంటరితనాన్ని ఇష్టపడాలి.అస్తమానం ఎవరో ఒకరు కూడా ఉంటే గాని తోచదనటం, అలా కూడా ఉన్నవాళ్ళని br />ఆత్మస్తుతి, పరనిందలతో సుత్తికొట్టి చంపడం మంచి లక్షణం కాదన్న మాట.ఏకామతంగా ఉండగలిగినప్పుడే మనం ఎవ్వరమో ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది.కాస్సేపు కళ్ళు మూసుకుని ఆ పని చేస్తే ఎప్పుడో అప్పుడు కాసింతైనా మనశ్శాంతి లభించే అవకాశం ఉంది.
 3. చెట్లు ఎండ నుంచి రక్షిస్తాయట
 4. చలిగాలి నుంచి రక్షిస్తాయట.మఱ్రిచెట్టు వంటి వాటి నెడలు వేసవి కాలంలో చల్లగానూ, శీతాకాలంలో వెచ్చగానూ ఉంటాయని శాస్త్రం.
 5. వర్షంలో తడిసిపోకుండా దట్టమైన చెట్ల నీడలు కాపాడతాయి."చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెట్టు నీడకై పరిగెడుతుంటే..." అనే చలనచిత్ర గీతం మనకి తెలిసిందే.
 6. చెట్లపై తోలు వస్త్రాలకు తాళ్ళకు వాడతారు (త్వక్)
 7. వాటి సుగంధం గాలిని ఆరోగ్యకరంగా చేస్తుంది (గంధ)
 8. వాటి జిగురు ఎంతో ఉపయోగిస్తుంది (నిర్యాస)
 9. వాటి బూడిద వైద్యంలో ఉపయోగిస్తారు (భస్మ)
 10. వాటి ఆకులు పచ్చదనంతో పర్యావరణం మొత్తం ప్రాణవాయుమయం అవుతుంది(పలాశ)
 11. వాటి చిగుళ్ళు కూరల్లో, పచ్చళ్ళలో వాడతారు (అగ్ర)
 12. పూవులలో తేనె ఉపయోగం మందుల్లో ఎంతో ఉంది(మరంద)
 13. వాటి వేళ్ళు ఆహారంగాను, వైద్యంలోనూ ఉపయోగిస్తాయి (మూల)
 14. పువ్వులు పూజకి ప్రశస్తం, శిరోధార్యం (కుసుమ)
 15. వాటి నీడ తాపోపశమనం (ఛాయా)
 16. వాటి ఫలాలు మనకి పుష్టికరమైన ఆహారం (ఫలశ్రేణి)

ఈ విధంగా 16 రకాల ఉపకారాలు చేస్తున్నాయనే విషయాన్ని పోతన్న ఒకే ఒక్క పద్యంలో కేవలం నాలుగు పంక్తుల్లో తెలియజేసాడు.ఇంత చక్కని పద్యాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టకపోవటం వల్ల ఎంత కోల్పోతున్నాం? ఆలోచించండి. ఈ ఒక్క పద్యాన్ని కంఠస్తం చేయిస్తే విద్యార్థి స్వయంగా వృక్షాల గురించి స్వీయ వివరణతో 16 పేజీల వ్యాసం రాయగలుగుతాడు.అది మంచిదా? చెట్ల మీద వ్యాసం కోసం గైడు చదివి అందులో వాళ్ళు రాసిన వాక్యాలన్నీ బలవంతంగా కఠస్తం చేసి అది పరీక్షలో గుర్తు రాక, మార్కులు సంపాదించుకోలేక మూర్ఖుడిలా మిగిలి పోవడం మంచిదా? మీరే ఆలోచించండి.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)