పేరులో ఏముంది?

'ఆ! పేరైదేనేమి? పేరులో ఏముంది?' అని ఇన్ని రోజులు షేక్స్ పియర్ చెప్పిన 'What is in a name?' సూక్తిని గట్టిగా నమ్ముతుండేవాణ్ణి. కాని ఈ మధ్యన జరిగిన సంఘటనలను చూస్తుంటే ఆ కొటేషన్ అన్ని సందర్భాల్లో ఉపయోగించలేమోమని అనిపిస్తోంది. నాకు ఎదురైన అనుభావాల్ని చెప్పాలంటే...

ఆరోజు ఉదయం సీరియస్ గా పని చేసుకొంటుంటే హడావుడిగా వచ్చాడు జేమ్స్. అతని అసహనానికి కారణం ఏంటబ్బా అనుకొంటుంటే, 'ఐ నీడ్ యువర్ హెల్ప్' అంటే 'ష్యూర్ ' అన్నాను. 'కొద్ది నిమిషాల క్రితం మనం ఫొనులో మీటింగ్ అటెండ్ అయ్యామే... అందులో మనం కొత్తగా ఎంగేజ్ చేసిన కన్సల్టింగ్ టీం లోని మెంబర్... అతని పేరేంటీ... రాం... అతనికి ఈమేయిల్ పంపిద్దామనుకొంటే... అతని పేరు ఎక్కడా ఔట్ లుక్ లో కనిపించటం లేదు. ఫస్ట్ నేం తో, లాస్ట్ నేం తో అన్నివిధాలా వెతికాను. కాని లాభం లేదు. కాస్తా వెదికిపెట్టి చెప్పవూ...' అంటూ అభ్యర్థించి వెళ్ళిపోయాడు.

నేను అదేపని మళ్ళీ చేశాను. అతనిపేరు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళనీ, వీళ్ళానీ ఆరా తీస్తే తెలిసింది, అతని మొదటి పేరు సీతారాంచంద్రరావు అని, అతని ఇంటిపేరు చక్కిలాల అనీన్నీ, అతని నిక్ నేం రాం అనీనీన్నీ. అద్గదీ సంగంతీ, మొదటిపేరులో మధ్యలోనున్న రెండక్షారాలతో వెదికితే దొరకలేదన్న మాట.

ఈ విషయం తెలుసుకొని జ్ఙానోదయమైన జేమ్స్ 'ఇండియన్ నేమ్స్ పెద్దగానే ఉంటాయనుకొంటే, ఇలా మధ్యలో నున్న అక్షరాలను తుంచి నిక్ నేం చేసుకుంటారని ఇప్పుడే తెలిసింది. చాలా ఆశ్చర్యం.' అంటూ కొద్దిగా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు.

'మధ్యలో నున్న ఏవో రెండక్షరాలని తీసుకొని నిక్ నేం చేసుకోరు. దానికి ఓ పద్ధతుంది. అసలు సీతారాంచంద్రరావు పేరు రాం ఎలా అయ్యిందంటే...' అంటూ వివరించబోయాను. కాని ఇలాంటి విషయాలకి పూర్తిగా న్యాయం చెయ్యలేను కాబట్టి అసహాయంగా సుందర్రావు దిక్కు చూసాను 'సుందర్రావు, ఇక నీవే దిక్కు ' అంటూ వాపోతూ.

ఎప్పుడు తనకు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడు మన నామాలలోని విశిష్ఠతని వివరిద్దామా అని వీరావేశంతో పొంగిపోతున్న సుందర్రావు ఒక ఊపందుకున్నాడు. అసలు 'సీత ' , 'రామ ' అనేవి రెండు వేర్వేరు పేర్లని, తెలుగుభాషా వ్యాకరణం మూలానా 'సీతారాం' అనే కొత్త పేరు ఏర్పడిందనీ, దీనేనే 'ఉభయ పదార్థ ప్రాధాన్యం'గల 'ద్వంద సమాసం' అంటారని చెప్పుకొచ్చాడు.
'ఓ! యువర్ గ్రామర్ ఈజ్ టూ కాంప్లికేటెడ్!!' అని ఈ మాటు చాలా ఆశ్చర్యబోయాడు జేమ్స్.
'దొరికిందిరా పిట్ట ' అనుకుంటూ ఓ మెట్టు పైకిపోతూ 'అసలు ఇంతకంటే క్లిష్టతరమైన పేర్లు ఉంటాయి. ఉదాహరణకు 'సీతారాంచంద్రప్రసాద్ ' అనే పేరు 'బహుపద ద్వంద ' సమాసం వల్ల ఏర్పడిందని, అప్పుడు ఆ పేరున్న మనిషి తన పొట్టిపేరును 'సీత ' అనిగానీ, 'రాం' అనిగానీ, లేకుంటే 'చంద్ర ', మరీ లేకుంటే 'ప్రసాద్ ' అనిగానీ పెట్టుకోవచ్చనీ ఉటంకించాడు సుందర్రావు.

ఇది విని ఈ తడవ మరింత ఆశ్చర్యపోయాడు జేమ్స్. ఆ మరింత ఆశ్చర్యం నుండి తేరుకొని 'ఓ! నౌ ఇ రెమెంబర్. ఇంతకుముందు నాకు ఒకతను తెలుసు. అతని పేరు పరమేశ్వర్. కాని అతని నిక్ నేం ఈశ్వర్. అదీ ఇలాంటి బాపతేనన్న మాట...' అంటూ చెప్పుకొస్తున్న జేమ్స్ ని వారిస్తూ, 'అది సరి కాదు. పరమేశ్వర్ సమాసం వల్ల ఏర్పడింది కాదని, అది అకారామునకు ఇ, ఉ, ఋ, లు పరమగునపుడు క్రమంగా ఏ, ఓ, ఆర్ లు ఏర్పడతాయని, దీన్నే గుణసంధి అంటారు.' అని ఇంకో తెలుగు వ్యాకరణ విశేషాన్ని వివరించాడు సుందర్రావు.

ఈ సారేమో మరింత బోల్డు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ కళ్ళు తేలేశాడు జేమ్స్. పాపం, తెలుగు పేర్ల జోలికి అనవసరంగా వచ్చి కష్టాల్లో పడ్డాడు జీవి.

అన్నట్టు తెలుగు పేర్లు వీళ్ళకే కాకుండా అమెరికా వచ్చే తెలుగు వాళ్ళకి కూడా కష్టాలు తెచ్చి పెడతాయ్. ఎలా అంటే కొద్ది నెల్ల క్రితం మా ఆఫీసుకు ఓ తెలుగబ్బాయ్ వచ్చాడు. వచ్చిన కొన్ని వారాలు క్రమం తప్పకుండా లంచ్ బాక్స్ లో పచ్చడన్నమే తీసుకొచ్చుకొనే వాడు. వండుకోవడం రాదేమో, లేక ఇక్కడ కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో తెలియదేమోనని అనుమానం వచ్చి ఆరా తీసాను. 'తీగ లేగితే డొంకంతా బయట పడ్డట్టు ' నా చిన్న సందేహానికి పెద్ద విషాద గాథే చెప్పాడు.

తను వాళ్ళ కుటుంబంలో అటు ఏడు తరాల్లో ఒక్కగానొక్క మగ పిల్లాడుగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి పూజ చేసుకొంటే పుట్టాడని, అందువల్ల సూర్య దేవ ఆరాధ్యులైన తండ్రి వంశం, చంద్ర దేవ ఆరాధ్యులైన తల్లి వంశం, అన్నవరం స్వామి పేరు కలిసొచ్చేటట్టు 'సూర్యచంద్రసత్యనారాయణవరప్రసాద్ ' అని పేరు పెట్టారని చెప్పాడు. మరి ఆ పేరును ఒకే పొడ వు పేరుగా 'సూర్యచంద్రసత్యనారాయణవరప్రసాద్ ' అని, లేక వీలుకొద్ది విడగొడుతూ 'సూర్య చంద్ర సత్య నారాయణ వర ప్రసాద్ ' అనిగానీ, ఇంకా కాకుంటే ఎక్కడ వీలైతే అక్కడ విరుస్తూ, లేక అతికించుకుంటూ పరివిధాలుగా పేరు రాసుకునే స్వేచ్చ లభిస్తుంది. కాని అక్కడే వచ్చింది చిక్కు. ఆ పేరు అతను చదువుకొన్న సర్టిఫికేట్లలో ఒక విధంగా ('సూర్యచంద్ర సత్యనారాయణ వరప్రసాద్ '), అమెరికాకు వచ్చే కంపెనీ ఇన్విటేషన్ లెటర్లో ఇంకో విధంగా ('సూర్యచంద్ర యెస్ ఎన్ వి ప్రసాద్ '), చెన్నై ఎంబసీలో మరో విధంగా ('సూర్య సీ') ఇలా లార్వా దశా నుండి సీతాకోకచిలుక రూపాంతరం చెందినట్టు ఆ పేరు బహురూపాలు పొందింది. 'చంద్ర ' కాస్తా అంతకుముందు లేని మిడిల్ ఇనీషియల్ 'సీ' గా మధ్యంతరంగా పుట్టుకొచ్చింది.

అమెరికా తీరా వచ్చి సోషల్ సెక్యూరిటీ నెంబర్ కొరకు అప్లయ్ చేస్తే, 'ఇంద్రునివా, మరి నువు చంద్రునివా' అన్న పాట చందానా, నీ ఫస్ట్ నేం 'సూర్యనా' లేక 'సూర్యచంద్రనా' తేల్చుకోవాలి, నీ అసలు ఐడెంటిటీ ఏమిటో తేల్చుకోటానికి FBIకి ఎంక్వయిరీకి పంపించాలి అంటూ సోషల్ ఇవ్వలేదు. సోషల్ వచ్చేంతవరకు జీతం రాదు. అందువల్ల అష్టకష్టాలు పడుతూ అలా పస్తులున్నాడు కొన్నిరోజులు ఆ 'సూర్య సీ' జీవి.
'మీ పేర్లు ఇంత పెద్దగా ఎందుకుంటాయి. ఏదన్నా జ్యోతిష్యం ప్రకారం ఇన్ని అక్షరాలని లెక్క ఉండాలా?' అని ఆడిగింది ఓ సారి లిండా.
'అలా అని నేను ఎక్కడా ఇంతకు ముందు చదువ లేదు. తల్లితండ్రులు పేరు ద్వారా ఎలాంటి అర్థం చెప్పుకోవాలనుకుంటారో పిల్లలకి అలాంటి పేరు పడతారు.' అని నేనన్నాను.
'వ్వాట్! మీ పేర్లకి అర్థాలుంటాయా?' అని మహా ఆశ్చర్యపోయింది లిండా.

ఇదే అదననుకొని సుందర్రావు 'పేర్లు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, తత్సమ తద్భవాలు, ఉపమాన ఉపమేయ అలంకారాల వల్ల నామవాచక రూపాంతరాలు ' మొదలై న వాటి గురించి ఓ క్లాస్ పీకబోతుంటే నేనే ఎవ్వరికి తెలియకుండా అతన్ని గిల్లి వారించాను.

ఇదిలా ఉంటే ఇక తమిళ తంబిల పెర్లతో వచ్చే చిక్కులు అనీఇన్నీ కావు. తమిళ సాంప్రదాయం ప్రకారం తండ్రి ఫస్ట్ నేం కొడుకులకు లాస్ట్ నేం గా వస్తుంది. కాబట్టి ఒకసారి ఇద్దరు ఉద్యోగులు 'శ్రీనివాసన్ యోగనాథన్ ', 'యోగనాథన్ శ్రీనివాసన్ ' పేర్లతో ఇండియా ఆఫీసులో జాయిన్ అయ్యారు. అలాగే వాళ్ళు 'యోగా' అన్నా, 'శ్రీనీ' అన్నా ఎలా పిలిచినా 'ఓ' అని పలికే వాళ్ళు.

అక్కడే వచ్చాయి ఎక్కడలేని కష్టాలు. కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్లు పప్పులో కాలేసి ఫస్ట్ నేం ని, లాస్ట్ నేం ని తారుమార్చారు. దాంతో ఈ మెయిల్లో వాళ్ళను వెదకటం కష్టమైపోయి, ఈ మెయిల్ రాసేటప్పుడు ఎలా అడ్రస్ చేయాలో తెలియక మూడు చెరువుల నీళ్ళు తాగేవాళ్ళు.
'ఎదేమైనా మీరు అదృష్టవంతులు. అర్థవంతమైన పేరు పెట్టుకోడానికి చాలా పేర్లు ఉన్నాయి ' అని ఏకగ్రీవంగా అమోదించారు జేమ్స్ మరియు లిండా.

అమెరికా వాళ్ళు ఇలా మన పేర్లను చూసి ఆశ్చర్యపోతుంటే, పేర్లకి అర్థాలున్నాయని ఈర్ష్య పడుతుంటే, మన తెలుగు సినిమాల పరిస్థితి వేరే విధంగా ఉంది. ఎందుకంటే, నిన్ననో, మొన్ననో వెబ్ లో తెలుగు సినిమా వార్తలు చదువుతుంటే, ఓ కొత్త సినిమా షూటింగ్ మొదలయ్యిందట. ఆ సినిమా పేరు '!?'ట. చాలా చాలా ఆలోచించి ఆ పేరు పెట్టారట దర్శకుడు. ఎందుకయ్యా అంటే ఆ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకునికి అంతా 'ఆశ్చర్యకరంగాను, ప్రశ్నార్థకంగాను ' పరమ సస్పెన్స్ గా ఉంటుందట. అలాగే ఇంకో వార్తలో 'జులాయి వెధవ ' అనే పేరుతో ఇంకో సినిమా రిజిస్టర్ చేసాడట ఓ నిర్మాత. మరి నిర్మాతకు ఎవరి మీదనైనా కోపంతో ఈ పేరు పెట్టి 'తిట్టుతున్నాడో, శాపనార్థం పెడుతున్నాడో' అనుకుంటే నూటికి నూరుపాళ్ళు తప్పే. నా అంచనా ప్రకారం ఆ సినిమాలో హీరోయిన్ హీరోమీద ప్రేమ పుట్టినప్పుడు 'జులాయి వెధవ ' అని శృంగారంగా తిడుతుందేమో.

ఇప్పుడు ఇలా 'పోరంబోకు ', 'జులాయి వెధవ ' అని సినిమాలు వస్తున్నాయి గాని ఇంతకుముందు ఈ పదాలు పరమ తిట్లుగా పరిగణింపబడేవి. ఈ పేర్లతో తిట్టబడ్డవాదు సిగ్గుతో కుంచించుకు పోయి తల ఎక్కడ దాచుకోవాలా అని సతమతమయ్యేవాడు.

అవన్నీ ఇప్పుడు ఎందుకుగాని, మరి ఈ సినిమా '!?' అమెరికాలో విడుదల అవుతే, నేను ఖర్మకాలి చూస్తే, అ తరువాత జేమ్స్ లేక లిండా 'వ్వాట్ డిడ్ యూ డూ ఆన్ వీకెండ్?' అని అడిగితే ఈ సినిమా పేరు ఏంచెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నేను 'Exclamaation mark, Question mark' సినిమా చూసా అని నోటితో చెప్పాలా, లేక '!?' అని రాసి చూపాలా అని మథన పడుతున్నాను. ఎందుకటే 'ఇంత కల్చర్ ఉన్న మీకు సినిమా పేర్లు కరువయ్యాయా' అని నవ్వుతారేమోనని, తుస్సుమని గాలి పోతుందేమోనని భయం.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)