ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు జనవరి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య (పుల్లెల శ్యామసుందర్ గారు ఇచ్చిన ప్రశ్న)

"ఆ.వె// చెట్టునెక్కె నేమి చేయలేక"

క్రొత్త సంవత్సరంలో, సమస్యలకి మీరిచ్చే పూరణలతోపాటూ, మీరు వ్రాసిన వేరే అందమైన పద్యాలనూకూడా పంపండి. ఏ ఛందస్సులో ఉన్నా ఫరవాలేదు. అందరూ మీ పద్యాలను చదవాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ శీర్షికను మరింత జనరంజకంగా చేయటానికి మీ సలహాలను కూడా పంపండి.

క్రిత మాసం సమస్య “పుట్టినరోజది తనదని పుట్టెడు ఏడ్చా!”

ఈ సమస్యకు వచ్చిన పూరణలు మాకు అందినవారిగా ఇలా వున్నాయి.

పూరణ - భోగ పప్పు

కం:// వట్టిగ చాకిరి చేయుచు
పట్టెడు మెతుకులు దొరకని బడుగుల ను తలన్
పెట్టెడు దాతలు లేరని
పుట్టినరోజది తనదని పుట్టెడు ఏడ్చా


పూరణ - మాజేటి సుమలత
కం://వట్టిగ మాటలు ఆడుచు
గట్టిగ ఏదియు తలచక గడుపుచు నుంటే
ఇట్టుల పరయము నిండెను
పుట్టిన రొజది తనదని పుట్టెదు ఎద్చా

పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే
కం.// నెట్టాలి రోజులిక, సిగ
రెట్టు వదిలెదనని మార్గరెట్టుకు చెప్పా,
పుట్టిన రోజుకు గిఫ్టని!
పుట్టిన రోజది తనదని పుట్టెడు ఏడ్చా


పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే
పొట్టది పెరిగెను తలపై
జుట్టది రాలెను మొగమున
సొట్టలు వచ్చెన్
నిట్టూర్చి అరువదొకటొవ
పుట్టిన రోజది తనదని
పుట్టెడు ఏడ్చెన్


పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే
కం:// గిట్టదు నామొఖమామెకు!
తిట్టని తిట్టును వదలక తిట్టుచు, ఇంకా
పుట్టిన రోజిది పొమ్మనె!
పుట్టినరోజది తనదని పుట్టెడు ఏడ్చా!


పూరణ - భాస్కర శర్మ, సిడ్ని, ఆస్ట్రేలియా
కవిత:// కొనలేను నీకేమి నే పేదవాడ్ని
ఎనలేని నా ప్రేమ విలువ తెలుసా?
ప్రేమించడంతప్ప నాకేమి తెలుసు!
నా ఆస్తి నా ప్రేమ, నా వారసత్వం!
ఆ ప్రేమ నీకిస్తె వెలకట్ట చూస్తావ్!
తెలిసింది వెలచూసి నువు మాటలాడ్తావ్!
నువు పుట్టినీరోజు నీకేమి ఇస్తా?
పుట్టినరోజది తనదని పుట్టెడు ఏడ్చా!


పూరణ - శిరీష్ కూమార్, హ్య్దరబాద్
కం://పుట్టిన రోజున అన్నకు
చుట్టములిచ్చు బహుమతుల జూచి మురిసి తా
పట్టపు రాజై వెలగగ
పుట్టినరోజది తనదని పుట్టెడు ఏడ్చా!

భక్త హనుమ

సందర్భం: అశోకవనంలో హనుమతుడు చేస్తున్న అల్లరిని ఆపటానికి రావణుడు తన సేనలను పంపవలసి వచ్చింది. వారి అవలీలగా ఢీకొని ఓడించగల సామర్ధ్యం ఉన్నవాడైనా, రావణుడికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో హనుమతుడు వారికి దొరికి పొతాడు.

సీ:// రవరవ ధ్వనుల రయము వనముదాట, రావణాసుని మది రగల సాగె!
రవణ రావణ వడి రావడు పడుచుండ, రడ్డున రద్దీలు రద్దు చేయు
రాయసంబది తానె ఆయసంబగుచుండ, వాయునందుడ పట్టి కాయ మనుచు,
రాలుగాయతనంబు రాల్చి రమ్మని తన రాణువనంపెను రదము కొరికి!

తే.గీ.// సేనలోడింప కనునెర్ర సెరలు చాలు!
సెగ్గెమొకటి కావలెనయ్య సిగ్గు యేల?
సేగిపోవునెల్లని తానే సిక్కి పోయె,
రాయబార భారంబున! రామచంద్ర!


ప్రతిపథార్ధం:

రవరవ = కోపము తెప్పించెడి మోత
ధ్వనుల = ధ్వనులకు సంబంధించిన
రయము = వేగము
వనముదాట = అడవిదాటగా
రావణాసుని మది = రావణాసురిడి మనస్సు
రగల సాగె!= రగిలిపోయింది!
రవణ = అందమైన
రావణ వడి = రావణాసురుడి వేగం లేక క్షాత్రము
రావడు పడుచుండ= స్తంభించిపోతుంటే
రడ్డున = రాజ్యంలో
రద్దీలు = అల్లరులను
రద్దు చేయు= ఆపగలిగినటువంటి
రాయసంబది = రాజసము
తానె ఆయసంబగుచుండ= కూడా తానే ఆయసపడుతూ ఉండగా,
వాయునందుడ పట్టి = పవనపుత్రుడు హనుమంతుడను పట్టుకొని
కాయ మనుచు= ఆపమని అనుచూ,
రాలుగాయతనంబు = తుంటరితనాన్ని (హనుమంతుడి కోతి చేష్టలను)
రాల్చి రమ్మని = అదుపులోకి తీసుకొని రమ్మని
తన రాణువనంపెను = తన సేనను పంపెను (రావణుడు)
రదము కొరికి= పన్ను కొరికి (కోపంతో పన్ను కొరికి)

సేనలోడింప = (ఆ రావణుడి) సేనలని ఓడించడానికి
కనునెర్ర = కనునందు ఎర్రటి
సెరలు చాలు= కళ్ళలోని జీరలు చాలు (అంటే కనులెర్ర చేస్తే చాలు, వారు ఓడిపోతారు)
సెగ్గెమొకటి = ఒక అపవాదు లేక నింద
కావలెనయ్య = కావాలి (పట్టుపడటానికి)
సిగ్గు యేల?= (కావలని దొరుకి పోతుంటే) సిగ్గు ఎందులకు?
సేగిపోవునెల్లని = (చేసినదంతా) అంతా వ్యర్థమైపోతుందని (పట్టుబడక పోతే)
తానే సిక్కి పోయె,= తనకు తానే చిక్కిపోయాడు
రాయబార భారంబున! = రాయభారపు భాధ్యతనందు (తనకుతానే అది వేసుకున్న హనుమ)
రామచంద్ర!= రామచంద్రుడా!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)