గ్రహబలం - మంత్రదేవతానుగ్రహ బలం

మానవ జీవిత నిర్మాణానికి మౌలిక తత్వాన్ని గ్రహాలు నిర్దేశిస్తాయని శాస్త్రాలు చెపుతున్నాయి. గ్రహ సంచారానికి ప్రకృతిలో మార్పులకి సంబంధం వున్నట్లు మనకి పౌర్ణిమ లేక అమావాస్యలలో సముద్రపు ఆటు పోటులు, మనుషుల భావోద్రేకాలలో కలిగే మార్పులు ఇలాంటివెన్నో మనకి మౌనంగా చెపుతున్నాయి. ప్రతిరోజు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు సృష్టి రహస్యాలనేకాక జీవిత రహస్యాలనికూడా దాచుకుని వున్నాయని అనేక మంది నమ్ముతున్నారు. 'గ్రహం ' అంటే 'ప్లానెట్ ' అని ఆంగ్లంలో మనం అనుకున్నా అది నిజంకాదు. జ్యోతిశ్శాస్త్రంలో గ్రహాలుగా చెప్పబడే సూర్యుడు నక్ష్మత్రం, చంద్రుడు ఉపగ్రహం, రాహు - కేతువులు ఛాయా గ్రహాలు అంటే అసలు లేనే లేవు. ఆనిటికన్నా విచిత్రం మనం నివసించే భూమిని జ్యోతిశ్శాస్త్రంలో గ్రహంగా ప్రత్యేకంగా చెప్పనేలేదు. మరి జ్యోతిశ్శాస్త్రం గ్రహాలని ఇలా నిర్వచించిందేమిటి?

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

అసలు రహస్యం ఏమిటంటే జ్యోతిశ్శాస్త్రంకూడా శకున శాస్త్రంలా, సాపేక్ష సిద్ధాంతంలా రిలెటివ్ గా పనిచేస్తుంది. భూమినించి కనిపించే ఖగోళాలని గ్రహాలుగా, అంటే కొన్ని లక్షణాలను గ్రహించిన శక్తులుగా నిర్వచించారు. భూమి స్థితిని లగ్నంగా పరిగణిస్తారు. భూస్థితినించి అంటే లగ్నం నించి గ్రహాల సంచారాన్ని గణించి దాన్ని విశ్లేషించి మానవ జీవితానికి అన్వయించే శాస్త్రంగా జ్యోతిశ్శాస్త్రం మనందరికీ తెలుసు.

ఒక్కొక్క గ్రహస్థితికి ఒక్కొక్క విశిష్టత వుంటుంది అని జ్యోతిశ్శాస్త్రం చెపుతోంది. రవి చంద్రులు కలిసి ఒక రాసిలొ వుంటే అమావాస్యగాను, ఎదురెదురు రాశులలో వుంటే పౌర్ణమి అవుతుంది. ఆవిధంగా ఏర్పడ్డ పక్షాలు, మాసాలు, సంవత్సరాలు అనాదినించి మనం పాటిస్తున్నాం. ఒక్కొక్క విశేషమైన గ్రహ సంపుటి వల్ల ఒక్కో పర్వదినంకూడా వస్తోంది. మంత్ర శాస్త్రం సాధకులకి, ఉపాసకులకి, సామాన్యులకి కూడా ఈ విశేష దినాలని ఏ రోజు ఏ మంత్రం చేస్తే మంచిదో తెలిపింది. వీటిలో ఆసక్తి కరమైన రహస్యాలెన్నో వున్నాయని పురాణాలు కూడా చెపుతున్నాయి. శుక్రవారం లక్ష్మీ పూజ మంచిది అని అనేకమంది ఆరోజు వ్రతాలని, అర్చనలని, అభిషేకాలని చేస్తారు. శుక్రుడు స్త్రీ దేవతా ఉపాసనకి, కుటుంబ సౌఖ్యానికి వృద్ధికి అధిపతి. మంగళవారానికి కుజుడు అధిపతి. కుజునికి కుమారస్వామి అధిష్టాన దేవత కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే మంచిదని మంత్ర శాస్త్రం చెపుతోంది. ఆరోజు కుమార స్వామి మంత్రం చేయటం వల్ల కుజ దోషాలు తొలగుతాయి. సమస్యలు, ౠణాలు పూర్తిగా వెళ్ళిపోతాయి. భూమి, స్థిరాస్తులు, లాభాలు కలుగుతాయి. ఆవిధంగా తిధులు కూడా విశిష్టతని కలిగి వున్నాయి. అమావాస్య నాడు కాళి ఉపాసనని, పౌర్ణమి నాడు లలితా సాధనని చేయడంలో రహస్యం ఇదే. అతి విశేషము, శ్రేష్టము అయిన పంచదశి మంత్రాన్ని పౌర్నమి నాడు కాని పంచమి నాడు కాని ఉపదేశం పొందడం మంచిదని మంత్రశాస్త్రం చెపుతోంది.

కర్మ సిద్ధాంతం న్యూటన్ మూడో సూత్రంలా పనిచేస్తుంది. చేసే ప్రతి కర్మకి తదనుగుణమైన ప్రతిక్రియని, ఫలితాన్ని ప్రకృతి ప్రసాదిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో కర్మల ద్వారా వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నాం. దీనిపైన కర్మాధిదేవతలైన కాలం, వ్యోమం, గ్రహాలు, ఇంకా ఉపదేవతలు ఉన్నారని శాస్త్రాలు చెపుతున్నాయి. 'విధి ' మనకి ఇక్కడినించే నిర్వహించబడుతుంది. ఆ పై తలంలో 'విధి ' ని మార్చగలిగే శక్తులు, అంటే దేవతలు వసిస్తున్నారు. మనం గ్రహాలని కాని, లేక ఆ పై తలంలోని దేవతలని కాని ఆరాధించి, అనుగ్రహం పొంది బాధలనించి విముక్తి పొందవచ్చునని కర్మ విపాకం నించి అన్ని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే మనం నవగ్రహాల అనుగ్రహాన్ని పూజ ద్వారా, దానాల ద్వారా లేక రత్నధారణ వల్లనైనా పొందవచ్చు, కామ్య సిద్ధిని సంతొషాన్ని పొందవచ్చు. ఇంకో మార్గం - ఏకంగా మూల దేవతలనే ఉపాసించి కాలతీతమైన, గ్రహాతీతమైన సిద్ధ శక్తిని, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొంద వచ్చును. ఇంకొందరు కాలజ్ఞాన మంత్రాన్ని ఉపాసించి లేక కాల సర్ప మంత్రాన్ని ఉపాసించి కాలానుగ్రహం పొంది కర్మవిపాకాన్ని సాధించి ప్రగతిని సాధిస్తారు.

గురుచరిత్రలో ఒక కధ వుంది. దత్తాత్రేయుల వారు ఒకామెను 'సుమంగళీ భవ ' అని ఆశీర్వదిస్తారు. కొద్ది సమయం ముందే నిర్జీవులైన ఆమె భర్త వెంటనే నిద్రలేచినట్లు సజీవులౌతారు. దత్తాత్రేయుల అనుగ్రహపాత్రులైన ఆ భక్తులు సంతసిస్తారు. కానీ అక్కడేవున్న ఒక శిష్యుడు దత్తాత్రేయులని అడుగుతాడు, ' స్వామీ ఆ జీవునికి ఆయుర్దాయం పూర్తయింది కదా మరి తమరు ఎక్కడినించి ఏ విధంగా ఆ కర్మని , విధిని మార్చారు? ' అని. అందుకు సమాధానంగా దత్తాత్రేయులు ' అది నేను రానున్న జన్మనించి తెచ్చాను, అది ఈ జన్మలో అతికి అతనికి జీవితాన్ని ఆ భక్తురాలికి ఆనందాన్ని ప్రసాదించాను ' అని సెలవిచ్చారు. అందుకని అనిపిస్తుంది - విధిని నిర్వహించేవి గ్రహాలైతే, వాటిని నిర్వహించే దేవతులున్నారు. ఆ దేవతాసాధనని మంత్రోపాసన ద్వారా చేయటం వల్ల విధినికూడా జయించి, గ్రహాల దుష్ప్రభావాలనించి బయటపడి ప్రతి నూతన సంవత్సరాన్ని మనకి, చుట్టూ వున్న సంఘానికి తరతరాల ప్రగతిని అందించి ఆనందమయంగా చేయవచ్చు అని. కన్న దేశానికి, ఉన్న దేశానికి కూడా గర్వకారణంగా మారే మంచి సంకల్పాన్ని దానికితోడు సిద్ధిని కలగాలని కోరుకుందాం. అందుకు నడుం కడదాం.

మంత్రాలు శక్తి వంతమైతే జాతకంలో వుండే దోషాలు మంత్రాల వల్ల పోగొట్టుకో వచ్చా? కుజ దోషంలాంటివి నిజంగా వున్నయా? వుంటే వాటిప్రభావం ఎలా పోగొట్టుకోవాలి? సర్పదోషాల సంగతి, సంతానంకోసం చేసే నివృత్తులు ఏంటి? ఇవన్ని వచ్చే సంచికలలో చూద్దాం.

శ్రీ గురుభ్యో నమః

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)