ఉదయం ఆరుగంటల సమయం...బాలభానుడు తన బాధ్యత నెరవేర్చటానికే అన్నట్లు కొండల వెనక దాక్కునే ఆటకు కాస్త విరామం ఇచ్చి

మెల్లగా...అయ్యో ...అప్పుడే తెల్లవారిందా? అనుకుంటూ వస్తున్నాడు..అందర్నీ పలకరించే దిశగా...ప్రకృతిమాత తనకంటూ శాశ్వతమయిన శోయగాన్ని సవరించుకుంటూ సూర్యుని లేలేత కిరణాల ధాటికి నునుసిగ్గులు వెదచల్లుతూ తన సౌందర్యాన్ని మరింతగా పెంచుకుంటోంది.

సృష్టిలో ఇంతగా మధురానుభూతులు కళ్ళముందు మెదులుతున్నప్పటికీ కళ్ళముందు స్వచ్చంగా నవ్వుతున్న పువ్వులు జీవితాన్ని గూర్చి విశదీకరిస్తున్నప్పటికీ శిరీష మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది.ఒక వైపు తెలియెని ఆనందం, మరో వైపు భయం, నిరాశ,జీవితం పట్ల ఉదాసీనత,అన్నీ కలగలిపిన ప్రత్యేక భావమేదో కలచివేస్తుంది.కళ్ళకెదురుగా ప్రతిరోజూ తనని మాత్రమే పలకరించే పక్షి ఉన్నా, రోజూ ఆనందంగా అపురూపంగా చూసుకున్నా, ఈ రోజెందుకో ఆ పక్షి స్వేచ్చను తలుచుకుంటూ అసూయ కలుగుతోంది.ఈ బంధాలు, బాధ్యతలూ అన్నీ మనిషికేనా? వీటికి ఉండవా? సమాజం, మనుషులూ, వారి భావాలు, ఆలోచనలూ,అన్నీ మనసు చుట్టూ నిర్మించుకున్న పరిధిలా? ఏమో...ఎంతగా ప్రయత్నించినా అంతుపట్టడం లేదు.

అంతలో...'హల్లో..పిచ్చీ..!!మళ్ళీ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయావా? అంటూ భారతి పలకరింపుతో శిరీష ఈ లోకంలోకి వచ్చింది.

నవ్వుతూ..ఆ..ట్రాన్స్‌లోకి మాత్రంలోకి మాత్రం కాదు..కొత్త లోకంలోకి...అంది శిరీష.

"కొత్తలోకమా..అదేంటో మాకు చూపిస్తే మేమూ వచ్చేవాళ్ళంగా" అంది ముఖంలోకి తొంగి చూస్తూ భారతి.

"అందుకే మీకు చూపటం లేదు..ఆ లోకం పూర్తిగా నాదే" అంది ఖచ్చితంగా శిరీష.

"అమ్మో...దీనికేదో అయ్యింది...పైగా పైగా దీని ముఖంలో కొత్త ఆభరణం ఒకటి సిగ్గులాంటిది...అవునా? అంది కాస్త ఖంగారుగా...ఓ.కే. ఇక వెళదామా? అడిగింది భారతి.

"వెళదామా? ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగింది శిరీష..

"ఎక్కడికా? బావుంది నువ్వే కదా ఈరోజు మనం కొత్త డిజైన్ చెప్పటానికి మలక్‌పేటకు వెళ్దాం అన్నావు? అంది భారతి.

"అవునవును మరిచిపోయాను వెళదాంలే...ఈ రోజు నాకు మూడ్ లేదు" అంది నిరాసక్తంగా శిరీష.

"అయితే వద్దా..!!!"

"వద్దని కాదు..ఏదో చిరాగ్గావుంది.నేను ఒక ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాను. రేపు వెళదామే...ప్లీజ్.." అని రిక్వస్టింగా అడిగింది శిరీష.

"ఇదెప్పటినుంచి? ఈ ఫోన్‌కాల్‌కోసం ఎదురుచూడటం కొత్తగా ఉందే. ఇంతకీ ఎవరు? ఆ అదృష్టవంతుడు...అది సరే...దీప్తి వాళ్ళు నీమీద నమ్మకంతో ఆపని అప్పగించారు?అయినా నువ్వేకదా నీకు అర్జెంటుగా డబ్బు కావాలన్నావు మరి అది కూడా వద్దా? అడిగింది చిరుకోపంతో...

ఆ విషయం విన్న శిరీష కాస్త అలర్ట్ అయ్యింది.అవును..నేను కదలాలి తప్పనిసరిగా మనీ కోసమయినా అనుకుంటూ..ఓ.కె..ఓ.కె.నేను అరగంటలో తయారయి వస్తాను అంటూ లోపలికి పరుగు తీసింది.

"శిరీషకు తనవాళ్ళంటూ ఎందరో వున్నా తన మనసుకు దగ్గరగా ఎవరూ రాలేక పోయారు. అలాగని దగ్గరగా వున్నవారందరూ దగ్గర అవ్వాలని కాదు. శిరీష మనస్తత్వం మొదట్నుంచీ కొత్తగానే వుండేది.చిన్నతనం నుండి కొన్ని అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు కల్గివున్నా, వాటి కోసం ఎంతగా పోరాడినా, ఏవీ సాధించలేనట్లుగా నిలిచిపోయింది.అయినా ఒక చిరునవ్వుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకుంది.జీవితం అంతా ఒంటరిగా గడపటం అలవాటు చేసుకుంది. 'ఒకరికోసం మరొకరూ అనే పదానికి చాలాసేపు నవ్వుతుంది..అసలు ఆ పదమే ఎక్కడా ఉండదని తన అభిప్రాయం.సృష్టిలో ప్రతి బంధమూ..ప్రతి స్నేహమూ, అన్నీ డబ్బుతోనే ముడిపడి వుంటుందని నమ్మేవారిలో శిరీషదే మొదటి స్థానం. ప్రతిదీ పదిసార్లయినా ఆలోచించడం, బాధ కలిగితే కొన్నిరోజులవరకూ ఎవ్వరితో మాట్లాడకుండా వుండటం జీవన చర్యగా మారిన శిరీషకు ఇది మామూలే..అందుకే తనకున్న కొద్దిమంది స్నేహితులు తన ధోరణికి అలవాటుపడ్డారు. కానీ...ఈ మధ్య తన పద్ధతి కాస్త మారినట్టుగా కనిపిస్తోంది.

తనకూ నవ్వు వస్తోంది.అందరినీ తనుగా పలకరిస్తోంది.అది ఎందుకో అని మాత్రం అందరికీ అర్థం కాకుండా ఉంది.

"పద వెళదాం" అంది హ్యాండ్‌బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ శిరీష.

"ఏయ్ శిరీ...ఒక్కసారి నీ అవతారం చూసుకో" అంది నవ్వుతూ భారతి

"నా అవతారమా? ఏమయింది?" అని తనను తాను గమనించుకొనే సరికి తనకే ఆశ్చర్యమేసింది. కారణం తను ఏమాత్రం ఇష్టపడని డ్రస్ వేసుకోవటం... అదీ తనకు తెలియకుండా..

అయినా గుర్తించి బయటపడకుండా పర్వాలేదు పద అంటూ కదిలే తీరు భారతికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి? దీనిలో ఈ కొత్త మార్పు అనుకుందేమో మెల్లగా దగ్గరికి చేరి...ఎవరా గురుడు? అంది చెవిలో

"సుబ్బారావు" అంది శిరీష అంతకంటే మెల్లగా...

ఫక్కున నవ్వింది భారతి తనకు అందులో నిజం లేదని గ్రహించినట్లు..

"శిరీషకు తెలుసు తన మాట ఎవరూ నమ్మరని...అయినా తనలో తానే నవ్వుకుంది తన పరిస్థితికి జాలిపడుతూ..

"మమ్మీ ....స్కూలు ఫీజు ఇవాళ ఇస్తానన్నావు" అంటూ కూతురి ప్రశ్న.

శిరీష ఇంకేం మాట్లాడలేదు...తెచ్చిన డబ్బు కూతురి చేతిలో పెట్టింది...

థ్యాంకూ మమ్మీ..అంటూ పాప పెట్టిన ముద్దులో ఆత్మీయత లేదు...రేపు టీచరు ఫీజు కట్టని వాళ్ళ లిస్టులో తన పేరు ఉండదన్న ధైర్యం వుంది.ఆ లేత చిరునవ్వులో అమాయకత్వం లేదు.కాని అందర్నీ కట్టి పడేసిన డబ్బు ననాలి...అనుకుని ప్రస్తుతానికి ఊరుకున్నా తెల్లవారితే ఎదురయ్యే ప్రశ్నలకు అవసరాలకు ఏం చెయ్యాలో తెలియని స్థితి...అలా అని మగవాళ్ళు ఊరుకున్నా..ఇవి తప్పవని తెలిసే ఏదో బతకాలని బతకటం లాంటిదేమో అనిపించింది.

శిరీషా..మేము వెళ్ళొస్తాం...జాగ్రత్త సాయత్రం వీలయినంత త్వరగా రఆవటానికి ప్రయత్నిస్తాం అంటూ బయలుదేరుతున్న భర్తను పిల్లల్ని చూసి నవ్వుకుంది ఆఎమనాలో తోచక..అయినా ..అందులోనే ఆనందం వెదుక్కుంది.ఎదురుగా కదలలేని అత్తగారు, కదిలే పరిస్థితుల్లో నేను ఇద్దరం ఒకటే అనిపించింది కాస్సేపు శిరీషకు. బయటపడాలని వున్నా ఏమని అడగాలి? ఎవర్నని అడగాలి? అనుకుంది.అందుకే ఎదురుగా ఉన్న పుస్తకాలే నయం...చేతులోకి తీసుకుంటే వస్తాయి.వద్దు అనుకుంటే ఎక్కడ పడితే అక్కడుంటాయి.రాస్తున్నా ఊరుకుంటాయి...బాగోలేదని చింపేసినా మౌనంగా వూరుకుంటాయి.ఎవరినీ పిలిచి వారికిస్తే వారితో వెళ్ళిపోతాయి.ఎప్పుడూ ఇలా ఎందుకు చేశావని, చేస్తున్నావని అడగవు...అందుకే శిరీషకు పుస్తకం అంటే ప్రాణం.తన సర్వసంలా భావిస్తుంది.

శిరీషా...శిరీషా...

"ఏం పిలుస్తుంటే వినబడదా? అంటూ శ్రీవారి గద్దింపు

శిరీషకు పలకాలని లేదు..ఏదో తెలియని దిగులు ఆవరిస్తోంది..అయినా బలవంతంగా 'ఊ' అని మాత్రం అనగల్గింది.

"అంటే నేనంత పిచ్చివాడిలా కనబడుతున్నానా? ఇవతల ఇంత గట్టిగా పిలుస్తుంటే..వినపడినా ఆ ముక్తసరి సమాధానం ఏమిటో.." నాకు అర్థం అయ్యిందిలే..నిన్ను బయటకు తీసికెళ్ళలేదనేదనేగా ఆ ఏడుపు..ఆంటూ అరిచారు...శ్రీవారు ...ఏదో రహస్యాన్ని చేదించినట్లు....

"ఇదేమయినా కొత్తా...ఏడవటానికి..ఇలా ఎన్నో సంవత్సరాలనుండి మీరు ఇలానే వెళ్తున్నారుగా...అప్పుడు కనపడని ఏడుపు ఇప్పుడెందుకు కనబడుతుండో..అయినా నాకెలాంటి బాధ లేదు..పైగా చాలా సంతోషంగా వుంది..." అంది శిరీష కళ్ళలో నీళ్ళు బయటపడనీకుండా...

"సరేలేవోయ్ మన గొడవలు ఎప్పుడూ ఉండేవే..మనకూ మంచి రోజులు అంటే పాత రోజులు రావాలనే నా ప్రయత్నం అంతా" అన్నారు నవ్వుతూ...

"చాలా సంతోషం" అంది శిరీష ముక్తసరిగా...

"అరె..కోపం వచ్చిందా ? నిన్ను మహారాణిలా చూడాలనే నా తపనంతా ...అంటూన్న ఆ నవ్వులో తెలియని అవసరం కనిపిస్తూంది శిరీషకు..

నాకు మహారాణులపై నమ్మకం లేదు లెండి.ప్రశాంతంగా బ్రతకనీయండి చాలు.

ఇలాంటివి విన్నప్పుడల్లా భయంగా వుంటుంది శిరీషకి.

ఈ రోజూ భయంగానే ఉంది..అయినా బయటపడనీయకుండా ..థ్యాంక్స్ అని మాత్రం అనగల్గింది.

"అయితే శిరీ నా వైపు చూడవా?" అడిగాడు చెయ్యి వేస్తూ...

అదేంలేదు నాకు నిద్ర వస్తుంది విషయం చెప్పండి.నాకు బాగానే వినపడుతుంది అంది శిరీష కాస్త చిరాగ్గానే..విషయం ఇక దాచి ప్రయోజనం లేదని గ్రహించిన శ్రీవారు సరే..నువ్విలా అంటే నేను మాత్రం ఏమనగలను? నాకు ఒక పది వేలు అర్జెంటుగా కావాలి.తెల్లవారేకల్లా ఒక చోట కట్టాలి లేకపోతే గొడవలు అయిపోతాయి.అలాంటివి నీకు నచ్చవని నాకు తెలుసు అందుకే...

"ఊ..అందుకే ఆగిపోయారేం, ఆ నోటితోనే ఏం చెయ్యాలో కూడా చెబితే అయిపోతుందిగా"

"నువ్వలా కోప్పడితే నేనెలా చెప్పను?"

"ఇందాక ఎలా చెప్పారో అలానే చెప్పండి" అంది శిరీష.

"అదే నీ మెడలోని గొలుసు..ఇస్తే..నేనేం అమ్మను శిరీ...ఒట్టి తాకట్టు పెడతా అంతే ఎంత వారంరోజులు తిరిగే సరికల్లా నీకు ఇంతకంటే పెద్ద..."

"వద్దు ఇంతకంటే పెద్దది చేయిస్తా అనకండి.విని విని విసుగొస్తోంది...ఇది మంగళసూత్రాలున్నది మరి రేపు శుక్రవారం..ఎలా ఇవ్వాలి?"

"అయితే ఇప్పుడే ఇచ్చేయ్" అన్నారు వెంటనే

"మరి రేపటికి?"

"నువ్వు మరీను. రేపు తెల్లవారే పసుపుతాడు కట్టుకో..అయినా నీ ఎదురుగా ఇంతలా నేనుంటే ఇక ఆ మంగళసూత్రాలపైన అంత భయం అక్కర్లేదు అన్నాడు పెద్ద జోక్ వేసినట్టు.

శిరీషకు ఇవేం కొత్త కాదు.ఉన్న ఒక్కటీ తీసేస్తే ఇకపై అడగటానికి ఇంకేం ఉండదని గ్రహించిందేమో వెంటనే తీసి ఇచ్చేసింది.

విషయం ఇంత సులువుగా సాల్వ్ అవుతుందని అనుకోలేదేమో. "ఓ..మై..స్వీట్..అంటూ చటుక్కున ముద్దు పెట్టుకున్నారు.

ఆ ముద్దులోను ఆత్మీయత లేదు.భర్తగా అనురాగం లేదు.కేవలం అడిగింది వెంటనే ఇచ్చాననే సంతోషం వుంది.తాను గెల్చాననే గర్వం వుంది.అంతే.

"మమ్మీ..మమ్మీ.."

"ఏ నాయనా చెప్పు.."

"నేను ఈ రోజు కాలేజీకి వెళ్ళటం లేదు ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి సినిమాకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం.."

"ప్లాన్ వేసుకున్నాక ఇక నేను చెప్పేదేమున్నది? ఇప్పుడేం కావాలో చెబితే" అంటూ ఆగింది శిరీష

"నాకు ఎక్కువ అక్కర్లేదు మమ్మీ..జస్ట్ టూ హండ్రెడ్ ...అంతే"

శిరీషకు నవ్వొచ్చింది.ఇక ఏమన్నా మళ్ళీ అనవసరపు వాదన అవుతుంది అనుకుని వేరే ఖర్చులకోసం వుంచిన రెండు వందలూ చేతికిచ్చి పంపించింది.

"హో..థ్యాంక్స్ మమ్మీ" అంటూ కూరలు తరుగుతున్న శిరీషను వెనుకగా వచ్చి ముద్దుపెట్టుకున్నాడు.ఆ ముద్దులోనూ ఆత్మీయత లేదు.ఆడగగానే డబ్బు ఇచ్చిన సంతోషం తప్ప...నాగరిక ప్రపంచంలో పెరుగుతున్న నేటి పరిస్థితులు మనుష్యుల్ని కేవలం మనీ మెషీన్స్‌గా తయారుచేస్తోందనటంలో తప్పులేదు. కానీ..అమ్మ, నాన్న, అక్క, చెల్లి లాంటి బంధాలు కూడా డబ్బుతో ముడి పడుతుంటే స్త్రీకి నిజమయిన ఆత్మీయత ఏదీ? అందరిలా శిరీష కూడా వుంటే బావుండేది కదా!! తనకెందుకు అలాంటి మనసు వుంది? అర్థం కావటం లేదు. ఇలాంటప్పుడే శిరీషను ఒంటరితనం ఆవహిస్తుంది. మనం దేని కోసం పోరాడుతున్నాం అనే సంశయం కలుగుతుంది. నేను ఎందుకు బతకాలి అనే ఆలోచన వస్తుంది..ఇంకెంత కాలం ఈ అబద్ధపు జీవితం అనిపిస్తుంది.

అంతలో "ఏయ్ మొద్దూ... ఈ పక్క కూర మాడిపోతుంటే నీ పరధ్యానం ఎక్కడ? అంటూ పక్కనే వున్న గరిట అందుకొని కలిపింది. అయినా ఇంకేం కూర? మాడి పోయింది. నీకేమయిందే ఈ మధ్య? మరీ రోజురోజుకూ ఇలా మట్టిమనిషిలా తయారవుతున్నావు..శిరీ..ప్రపంచం అంతా నువ్వనుకున్నట్లే వుంటే ఇక ఇన్ని కష్టాలెందుకు? నీకు కొన్నాళ్ళు రెస్ట్ కావాలి..కొన్నాళ్ళు మీవాళ్ళ ఇంటికి వెళితే బావుంటుందేమో...అనిపిస్తుందిరా...అంది దగ్గరకు తీసుకుంటూ భారతి.

ఆ మాత్రపు ఓదార్పుకే కన్నీళ్ళపర్యంతం అయ్యింది శిరీష.

"శిరీషా... ఊరుకో..కానీ నువ్వేంటో నాకు అర్థమయ్యావు.అలాగని అన్నీ చెప్పవు..సరే మద్యాహ్నం నీకు రావాలన్నావు ఆ ఫో్‌న్ వచ్చిందా" అడిగింది నవ్వుతూ.

"రాలేదు..నేను అంటే ఎవరికి నచ్చను అని అర్థం అయ్యింది.నేను ఇక ఎవరినీ నమ్మను...నాకు ఏ ఫో్‌నూ రావక్కర్లేదు."

"అదిగో ఆదే వద్దంది..ఇంతకీ ఆ ఫో్‌న్ ఎవరిదగ్గరినుంచో చెప్పనేలేదు" అంది నవ్వుతూ.

"చెప్పానుగా సుబ్బారావని" అంది నవ్వుతూ.

"జోకులొద్దు.సీరియస్‌గా అడుగుతున్నా..."

"నీకు తెలుసు నేను జోకులు వెయ్యనని" అంది మల్లేఏ అదే సీరియస్‌గా

"శిరీ...ఆర్ యు సీరియస్" అంది ఆశ్చర్యంగా

"యస్ ఎగ్జాట్లీ..నాకు ఈ మధ్యే ఒక మనస్సు పరిచయం అయింది" అంటూ నవ్వింది సన్నగా..

"మనస్సు..ఓహో...చాలా ఇంట్రస్టింగా వుంది..చెప్పు..చెప్పు" అంటూ

"కానీ ఇప్పుడు ఆ మనసు నన్ను పిచ్చిదాన్ననుకుంటూందని..."ఆంది దిగులుగా

"అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు నెగటివ్ థింకింగ్ ఎక్కువయింది" అంది భారతి కోపంగా...

"లేదు భారతీ..నాకు చాలా వరకూ ఆలోచించాకే అర్థమయింది.నాకు ఆత్మీయులు ఉంటారనే నమ్మకం పోయింది.ఒక వేళ లేకున్నా ఇప్పుడు అలా అనుకోవడం తప్పేమో అనిపిస్తుంది" అంది నిరాశగా శిరీష.

"నిజమే శిరీ...మనకు మనసుంటుందని గ్రహించేవారు లేరు.నేను చేసిన ఒక్కపని నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడే నాకూ నమ్మకం కలుగుతోంది.ప్రపంచమంతా ఒకేలా ఉండదని...మన సమస్యలు ఒక్క భర్త మాత్రమే అనుకుంటే పొరపాటే..సమాజంలో ఎన్నో రకాలుగా బాధ పడుతూనే ఉన్నారు" అంది కాస్త నిరాశగా భారతి.

మొదటిసారిగా భారతి కళ్ళల్లో నీళ్ళు...శిరీషకు ఆశ్చర్యం వేసింది.భారతీ....నీవెప్పుడు నా గూర్చే ఆలోచిస్తావు...నీ విషయం ఏంటంటే నవ్వుతూ దాటేస్తావు..ఇంతకీ కిరణ్‌తో నీ జీవితం బావుందా? అంటూ దగ్గరగా వెళ్ళి అడిగింది శిరీష.

భారతి కళ్ళల్లో నీళ్ళు చూసి ఆశ్చర్యపోయింది.ఏమయిందే విషయం చెప్పకుండా నువ్విలా కంటతడి పెడితే నాకేదో కంగారుగా వుంది. ఏమయిందో చెప్పు భారతీ..

"లేదు శిరీ..నేను కలలు కన్న జీవితం రావాలని నేను కోరుకోవడం లేదు, కానీ కనీసం మనిషిగా ఒక విలువనిస్తే చాలని వుంటున్నా కానీ అదే నాకు దొరకటం లేదు" అంది నిరాశగా.

"నువ్వేం బాధ పడకుండా అసలు అందర్నీ కాదనుకొని కిరణ్‌తో వచ్చావు ఆ మాత్రం కృతజ్ఞత లేదా?" అంది శిరీష.

"కృతజ్ఞత ఎందుకు? నా దృష్టిలో ప్రేమ వెనుకే అనుమానం కూడా వుంటుందేమో అనిపిస్తూంది.ఎందుకంటే తనను ప్రేమించినట్లు వేరెవర్నినైనా ప్రేమిస్తుందోనని భయంతో ఉండేవారూ ఉన్నారు.అందుకే ఈ ప్రేమలు నిలబడటం లేదేమోననిపిస్తుంది" అంది ఏడ్వలేక నవ్వుతూ.

"ఎలా భరిస్తున్నావు భారతీ" అడిగింది శిరీష ఆశ్చర్యంగా.

"నీ కంటేనారా..?" అంటూ నవ్వుతున్న తీరును చూస్తుంటే శిరీష కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు.

"శిరీ..ఈ రోజు నువ్వు ఇంట్లో వుండి పడుతున్న వేదన తక్కువే.కానీ ఒక పక్క ఇంట్లోనూ...మరోపక్క బయట ఉద్యోగం పేరిట అన్నో అనుభవిస్తున్న బాధలు ఒకటా..రెండా..దీనికి ముగింపు ఏదో అర్థం కావటం లేదు.ఇలాంటప్పుడే మనకూ ఒక ఆత్మీయత, అభిమానం కావాలనిపిస్తుంది. అవి అయితే ఈ సమాజంలో ఎంత వెదికినా కనిపించవు.దొరికిన దాన్ని గూర్చి ఆలోచించి, జరిగే దానికి వచారించి, మన జీవితకాలాన్ని వృధా చేసుకోవటం కంటే పెద్ద పొరపాటు జీవితంలో మరొకటి వుండదని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఈరోజుల్లో అన్నీ డబ్బుతోనే ముడుపడి ఉన్నాయి.అలాగని డబ్బు సంపాదించి ఈ కృత్రిమమైన అభిమానాన్ని పొందేకంటే ..ఊరుకోవడమే ఉత్తమం. ఇప్పుడు చూడు నువ్వు నిన్నటినుంచి నీ స్నేహితుడెవరో ఫో్‌న్ చేయలేదని ఎంతో బాధ పడుతున్నావు.ఎవరో నాకవసరం లేదు.కానీ చేస్తానని చెయ్యని వ్యక్తుల కోసం నువ్వు బాధ పడటం అవసరమా అనేది నువ్వు ఆలోచించు. మనం ఒక వ్యక్తినుండి ఆశించేది కేవలం డబ్బే అని కొందరనుకున్నా, మనలాంటి వారు కొందరు ఆత్మీయత కూడా కోరుకుంటాము.అంతమాత్రాన ఒక సమయంలో నిన్ను లేకుంటే నన్ను పలకరిస్తాను చెప్పికూడా ఆ సమయానికి మనం గుర్తు రాలేదంటే అలాంటి వారి కోసం ఆలోచించటం అనవసరమ్ని నా అభిప్రాయం...శిరీ...ఒక వైపు డబ్బు, మరో వైపు కీర్తి సమతూకంలో నడుస్తున్న ఈ ప్రపంచంలో నువ్వూ, నేను ఇంకా ఆత్మీయతల వెంట పరుగులు తీస్తుంటే మనల్ని ప్రపంచం వింతగా చూస్తుంది.అలాగని మనం మన జీవిత విధానం మార్చుకోలేము.సరే...ఇంతా ఎందుకుగాని, నువ్వు ముందు అక్కడ్నించి లేవాలి. ముఖం కడుక్కో.మొన్న నువ్వు అప్ప్లై చేసిన ఉద్యోగం మళ్ళీ రిమైండ్ చేయ్యి...ఒక వైపు, చేతిలో మరోవైపు మెదడుకి పని అప్పచెప్పు..కాలంతో పాటు రాజీ పడటమే జీవితం...లే...నువ్వలా ఒంటరిగా వుండటం మంచిది కాదు...ఆంటూ తెలియజేసింది. అన్నీ ఆలోచించిన శిరీష తనకంటూ ఒక జీవితాన్ని ఏర్పరుచుకోవడమే నయం అనుకుందేమో ...చాలా తక్కువ సమయంలో తయారయి భారతి వెంట నడిచింది...బతికున్నంతవరకూ బతకక తప్పదని నిర్ణయించుకుని నిశ్చింతగా .......

శైలజామిత్ర "మనసుకూ..మనసుకూ మధ్య" కథకు విశ్లేషణ:

ధనం మూలం జగత్ అన్నారు పెద్దలు.డబ్బు చుట్టూనే తిరుగుతోంది లోకం.ఆత్మీయతలు అయిన వారిలో కూడా కరువవుతున్నాయని శిరీష ఆశ్చర్యపడటంలో తప్పులేదు.కానీ దాన్ని గురించి మధనపడటం వల్ల మనశ్శాంతి కరువైపోయి బ్రతుకు భారమవుతుందని శిరీషలాంటి వాళ్ళ అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయన్న చేదు నిజం మింగుడుపడక లోలోపల కుమిలిపోతూ నిరాశకి లోనుకావటంవల్ల జీవితం నిస్సారమవుతుంది తప్ప పొందగలిగేదీ ఏదీ ఉండదు.దాని బదులు "ఇది కాలం తెచ్చిన మార్పు, సహజం" అని చిరునవ్వుతో సరిపెట్టుగోగలిగితే మనసులో ప్రశాంతత చోటు చేసుకోగలుగుతుంది.డబ్బుతో ముడిపడని చిన్న చిన్న కోరికలు సైతం కాపురంలో తీరని శిరీషలాంటి స్త్రీలకి ఈ సమాజంలో కొదవేమీ లేదు. భారతి వంటి స్నేహితురాళ్ళిచ్చే మానసికబలమే వారిని డిప్రెషన్‌లోకి పోకుండా తోడ్పడటానికి దోహదపడుతుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.

--తమిరిశ జానకి

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)