సుమతీ శతకం - వ్యక్తిత్వవికాసం

తెలుగులో ఇన్ని నీతిశతకాలు వెలువడినా ఒకరు చెప్పనివి మరొకరు చెప్పటం విశేషం. 'జీవితం అన్నది ఒక ప్రిజంలాంటిది ' అన్నాడు బాలగంగాధర తిలక్ అనే కవి. ఎన్ని యుగాలుగా ఎంతమంది కవులు, తత్వవేత్తలు, రచయితలు ఎన్ని చెప్పినా, ఎంత కాచివడబోసినా జీవితాల్ని గురించి చెప్పవలసింది ఇంకా ఎంతో ఉంటూనే ఉంది. మానవ జీవిత పరిశీలనం అసంపూర్ణం, అసమగ్రంగానే ఉంటుంది. సుమతీ శతకాన్ని బద్దెన రాశాడు. ఇతను 13వ శతాబ్దంవాడు. 'ధారాళమైన నీతులు చెప్తానని ' శపథం చేసి కృతకృత్యుడయ్యాడు.

అధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ

- రాజు లేదా పరిపాలకుడు ఎప్పుడు ప్రజల పక్షమే వహించాలి. వాళ్ళ బాధల్ని, గోడును విని పరిష్కరించటం అతని కర్తవ్యం. ఇవాళ మన పరిపాలకులకి సరిగా అన్వయించే పాదాలివి. "అధికారం అనే రోగం రాగానే, గుడ్డి, చెవిటి పీనుగులాగా తయారవుతాడు. అటువంటి వాద్ని చూడటం కూడా పాపమే" అంటాడు బద్దెన. ఇతను 'ప్రభువు ' అనే వాదం కూడా ఉంది. 'అధికార దాహం' ఎంతటి ప్రమాదకరమైనదో చూస్తూనే ఉన్నాం. ఆ పీఠంపై కూర్చున్నవాడు చెవిటివాడై పోతాడు. గుడ్డివాడై పోతాడు. 'Power corrupts man' అన్నారు కదా! దీనిని తెలుసుకొని పాలిస్తే సమాజాభివృద్ధికి ఢోకా ఉండదు. ప్రజలు సుఖమయ జీవనులవుతారు.

భూతలపతి జారుడు కారాదన్నాడు. తప్పులు తెలుసుకొని సక్రమ మార్గంలో పాలించాలన్నాడు. అందరి కళ్ళు పాలకుని వైపే ఉంటాయి. కాబట్టి బహు జాగరూకుడై, శీలవంతుడై ఉండాలి. ఇదే భావాన్ని 'యథా రాజా తథా ప్రజా'లో చూస్తాం. ప్రభువు ఎలా ఉండాలో చెప్తూ 'ఎప్పుడు తప్పులు వెదకెడువ్' వాడి దగ్గర పని చేయకూడదన్నాడు. రాజు అని అన్నాడు గానీ - మన తండ్రి లేదా భర్త, భార్య, మన బాస్... ఎవరైనా సరే అలా చేసావ్, ఇలా ఎందుకు, అదేమిటీ?... అంటూ ఎప్పుడు నెపం వేస్తుంటారు. అంటే రంధ్రాన్వేషపరులన్న మాట! అటువంటి వాళ్ళా దగ్గర పని చెయ్యటం అంటే నరకమే మరి! 'కొండెములు సెప్పే' వారిని దగ్గరకు చేరనీయవద్దన్నాడు. మనిషికి గల దుర్గుణం ఇదే. కొందరికి కొండెములు చెప్పటమే పని! ఈ విధంగా సుమతీ శతకకారుడు పరిపాలకులు, పరిపాలన, ఉద్యోగం... వంటి వాటిని ఎంత వివరంగా, కనువిప్పు కలిగేలా తెలిపాడోనని ఆశ్చర్యపోతాం!

ప్రతీవాళ్ళకీ చుట్టాలుంటారు. 'బంధుకోటి ' తప్పదు. అయితే బంధువుల స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసుకొని 'ముందుచూపు 'తో మెలగాలి. లేకపోతే తిప్పలు తప్పవు.

ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగ చెఱువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ

- మన దగ్గర డబ్బున్నప్పుడు అందరూ దగ్గరికి చేరతారు. ఇంద్రుడు, చంద్రుడు అని పొగడుతారు. మన మీద 'వాలి ' పోతారు. వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. చుట్టాలు కాకున్నా 'బీరకాయ పీచు ' సంబంధంతో మన ఇంట్లో తిష్ఠ వేస్తారు. ఒకవేళ మన సంపద పోయిన పక్షంలో మన ఇంటి ఛాయలకైనా రారు. మనల్ని తప్పించుకు తిరుగుతారు. ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా లేకపోతే కుటుంబం దీనస్థితిలో పడుతుంది. బద్దెన బంధువులని అన్నాడు గానీ ఈ సూక్తి మిత్రులకీ వర్తిస్తుంది. డబ్బున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నదే సారాంశం.

  • శత్రువుల ఇంట్లో భోజనం చెయ్యకూడదు
  • అప్పు చేసి పప్పుకూడు తినకు
  • ఇతరుల ద్రవ్యం ఉంచుకోకూడదు
  • పరుల మనస్సు బాధ పడేలా మాట్లాడకు
  • ఇతరులు కొడుకును పొగిడినప్పుడే ఆనందించాలి
  • నిష్కారణంగా నవ్వితే నవ్వులపాలు కాక తప్పదు
ఇవన్నీ మనిషి వ్యక్తిత్వాన్ని వికసింపజేసేవే. ఏవి చెయ్యకూడదో, ఏవి చెయ్యాలో తేటతెల్లం చేశాడు బద్దెన.
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ

- ఏ విషయంపై మాట్లాడదలచుకొన్నామో తెలుసుకొని ఆ విషయానికే పరిమితమై మాట్లాడాలి. ఇతర విషయాలు మాట్లాడకూడదు. అంటే అనవసర ప్రసంగం మంచిది కాదు. అలా మాట్లాడితే బాధించినవారం అవుతాం సుమా! అప్పుడు వారేమైనా అంటే మనము బాధపడక తప్పదు. కాబట్టి సందర్భానికి తగిన మాటలే మాట్లాడాలి. లేకపోతే వాళ్ళనీ బాధపెట్టిన వాళ్ళమవుతాం, మనమూ బాధపడతాం. అనవసర విషయాల్లో తలదూర్చకుండా మాట్లాడాలి. ఇదీ బద్దెన సైకాలజీ క్లాస్! (చాలామంది ఎవరికీ బాధ కలిగించకుండా తాను బాధపడకుండా కాలక్షేపంగా 'ఎస్కేపిజం'తో ఉండాలని పై పద్యానికి అర్థం చెప్తారు. అది సరికాదు.)

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ

మానవుని విచిత్ర మనస్తత్వం ఈ పద్యంలో కనబడుతుంది. స్నేహంగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్నీ మంచి గుణాలే, ఒప్పులే కనబడతాయి. తెగ మెచ్చుకుంటాం. అదే స్నేహం చెడిపోతే... అతని ప్రతిపనీ, ప్రతిమాటా చెడ్డదిగానే కనబడుతుంది. అంటే మంచిగా ఉన్నప్పుడు ఒక భావం, విరోధిగా ఉన్నప్పుడు మరొక భావం ఏర్పడుతుంది. దీనిని గ్రహించి కూరిమి గల దినాలలో రహస్యాలన్నింటిని, బలహీనతలన్నింటిని చెప్పెయ్యకూడదు. స్నేహం ఉన్నప్పుడూ, స్నేహం చెడినప్పుడూ ఒకే విధంగా ఉండటమే ఉత్తమ వ్యక్తిత్వం అవుతుందని భావం.

మన మిత్రుడు లేదా మన బంధువు సంపన్నుడుగా ఉంటాడు. మనకంత సంపద ఉండదు. ఈ తారతమ్యానికి దిగులు చెందనవసరం లేదు. మనం కూడా ధనికులం కాలేదే అని మధనపడటం అనవసరం, నిష్ప్రయోజనం. పైగా అతడు మనకేదో చేస్తాడని కూడా ఆశించకూడదు. ఆశపడి భంగపడటం అవివేకం. ఎవరి స్థితిగతులు వారివే. దీనికి బద్దెన మంచి పద్యం చెప్పాడు -

ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
తనవారికెంత గలిగిన
తన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ

- ఈశ్వరునికి కుబేరుడు స్నేహితుడే, దగ్గరివాడే! కుబేరుడు ధనపతి. మరి శివుడో? రోజూ భిక్షాటన చేసుకోవటం లేదూ? కాబట్టి తనవారికెంత డబ్బున్నా తనకి ఉపయోగపడదు. దానికోసం వగపు కూడదు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవీ ఇద్దరూ సోదరీమణులే! ఒకామె సంపన్నురాలు, మరొకామె దరిద్రదేవత! సృష్టిలోనే ఈ తారతమ్యం ఉందని తెలుసుకొని ఉన్నంతలో తృప్తిగా జీవించాలన్నదే తాత్పర్యం.

ఈవిధంగా శతకపద్యాలు మదడుకి మేతనందిస్తాయి. తిన్నని నడతను చూపెడతాయి. ఆత్మావలోకనం చేసుకోమంటాయి. గోరుముద్దలవంటి పద్యాలతో సంస్కారాన్ని పెంపొందింపజేస్తాయి. వ్యక్తిత్వాన్ని చిత్రపడతాయి. అందుకే శతకపద్యాలు సార్వకాలికాలు!!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)