రాయలసీమ జానపద కళారూపాలు- జానపద నృత్యం - వ్యష్టి నృత్యాలు

డా. జోగధేను స్వరూప కృష్ణ గారు కడప జిల్ల ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీడరు. వీరు జానపద కళల గూర్చి విశేషమైన పరిశోధన చేసి కనుమరుగువుతున్న మన జన పథాలలోని కళలను వెలికితీసి ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా సుజనరంజని ద్వారా ప్రపంచవ్యాప్త తెలుగువారికి తమ అసలైన సంపదను గురించి తెలియజెప్పే ఊహతో పతినెలా తమ పరిశోధనాత్మక వ్యాసాలను సుజనరంజని ద్వరా అందిస్తున్నారు. అమూల్యమైన విశేషాలు ప్రతినెలా మీకోసం...


తెలుగు వారి జానపద కళారూపాలను గురించి మాట్లాడడం అంటే తెలుగు ప్రజల సంస్కృతిని తెలుసుకోవడమే. జానపద కళలు ఒక జాతి జీవన విధానాన్ని, జాతి ఎదుగుదల పరిణామాన్ని తెలుపుతాయి. అందువల్ల జానపద కళలను పరిశీలించడం అంతే ఒక జాతిని గురించి పరిశీలించడం అని అర్ఠం. ఒకప్పుడు తెలుగు నేల డప్పు శబ్ధాలతో, గంగిరెద్దుల మువ్వల సవ్వడితో, బుడబుక్కలవాండ్ల డుబుక్ డుబుక్కులతో, పులకించి పోయేది. ఆ వాతావరణమే వేరు. తోలుబొమ్మలాట, చెక్కభజన, పండరి భజన, కులుకు భజన, కోలాటం, చెంచునాటకం, ఎడ్ల పందాలు ఇలా ఆ నాటి పల్లె సీమలు కళకళ లాడేవి. ఇప్పుడు ఆ స్థితి లేదు. కారణం టీ.వీ., సినిమా కళలకు గొడ్డలిపెట్టయ్యాయి. కొన్ని కళారూపాలు కనుమరుగయ్యాయి. కొందరు కళాకారులు భిక్షుక వృత్తి చేస్తూ బతుకుల్ని భారంగ ఈడుస్తున్నారు. అందువల్లనే జానపద కళలను మరుగునపడకుండ , కనుమరుగవకుండ కాపాడుకోవలసిన భాధ్యత అందరి మీదా , తెలుగు వారందరి మీదా వుంది. ఈ దృష్టితోనే రాయలసీమ జానపద కళారూపాలను గురించి పరిశీలిస్తున్నప్పుడు రాయలసీమలోని అపారమైన కళాసంపద , దాన్ని సృస్టించిన జానపదుల జీవన విధానంలోని ప్రత్యేకతలు అనేకం బయటపడతాయి.

కళలకు కాణాచి రాయలసీమ. రాయలేలిన ఈ సీమలో ఒకప్పుడు ముత్యాల జల్లు కురిసింది. కావ్యాల జల్లు విరిసింది. ఇది గతించిన కథ. ఇప్పుడు రాయలసీమ కరవు కోరల్లొ చిక్కుకుంది. ఆకలి మంటల్లో ఇక్కడి ప్రజలు అల్లాడుతున్నా ఇక్కడి నల్లరాతి బండలు తప్పెట శబ్ధాలను,తోలుబొమ్మల గానాలను, చెక్కల శబ్ధాలను వినిపిస్తునే వున్నాయి. నాడు రత్నాలకు కొదువ లేనట్లే నేడు జానపద కళా రత్నాలకు కొదువ లేదు.

రాయలసీమలోని జానపద కళారూపాలను క్రింది విధంగ విభజించవచ్చు.

  1. జానపద సంగీతం గాత్ర, , వాద్య సంగీతం
  2. జానపద నాట్యం వ్యష్టి (ఒక్కరు), సమష్టి (సమూహం)
  3. జానపద ప్రదర్శన కళలు వీధి నాటకాలు, బుట్టబొమ్మలు, తోలుబొమ్మలాట, యక్షగానం, గంగిరెద్దులాట , పగటివేషాలు వంటివి.

జానపద నృత్యాలు రెండు విధాలుగా విభజించాము. వ్యష్టి అంటే ఒక్కరే చేసేవి. వీటిల్లో పులివేషం, నామాలసింగని నృత్యం, జ్యోతి నృత్యం ప్రసిద్దమైనవి.

పులివేషం

జానపదుడి ప్రకృతి అనుకరణకు పులివేషం నిదర్శనం. జానపదుడు ప్రకృతి లోని అనేక అంశాలను అనుకరించాడు. ఈ అనుకరణలో భాగంగా పులివేషం వేసుకొని పులిలా నాట్యం చేస్తూ తిరిగాడు. డప్పు శభ్దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ లయాత్మకంగా నాట్యం చెయ్యడం ఇందులో చూడవచ్చు. రాయలసీమలో చాలా ప్రాంతాల్లొ పులివేషం ప్రదర్సింపబడుతుంది. దసరా, మొహర్రం పండుగ దినాల్లో పులివేషం ప్రదర్శనలతో పల్లె పులకించి పోతుంది. జగ్జగ్జగ్గినక్క, జగ్గినకన్ జగ్గినకన్ జగ్గినకన్ అనే డప్పు శభ్దం వినిపించని పల్లె ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒకడు పులిలా వేషం వేసుకొని క్రింద ఉన్న నిమ్మకాయనో లేదా బెల్లం ముక్కనో తింటానికి ప్రయత్నిస్తాడు. చుట్టూ చేరిన గుంపు కేకలు పెడుతుండగ మొత్తం ఆట రసవత్తరంగా ఉంటుంది.

రాయలసీమలో అనతపురం జిల్లాలో ఉరవకొండ, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లొ, చిత్తూర్ జిల్లాలోను పులివేషం ప్రదర్శనలు కనిపిస్తాయి.

వ్యష్టి నృత్యం నామాలసింగడు

జానపద నృత్యాలలో కాలగర్భంలో కలిసిపోయినది నామాలసింగని నృత్యం. ఆధునిక సామాజిక నేపధ్యంలో జానపదుడు సృష్టించుకున్న నామాలసింగని నృత్యంలోని సింగడు ఆధునిక రాబిన్ హుడ్ అని చెప్పవచ్చు. సింగడు వ్యక్తి . అతని ఇంటి పేరు నామాల. ఇతడు దారి దోపిడీ దొంగ. తాను దోచుకున్న సొమ్ము లోనుంచి పేదలకు ఇచ్చేవాడని, కరవు కాలంలో పేదలకు సహాయం చేయడం చేత అందరికీ అప్తుడయ్యడని చెపుతారు.

ఇంకొక కథ ప్రకరం నామాలగుండు అన్నది పెద్ద రాతిగుండు. దాని క్రింద ఒక సాధువు శివ పూజ చేసేవాడని , సాధువు అనుమతితో సింగడు ఒక్కో గ్రామాన్ని కొల్లగొట్టేవాడని, తిరిగి వచ్చి గుండు మీద ఒక నామం పెట్టేవాడని, అతని ఆగడాలు భరించలేక ప్రజలు అతనిని పోలీసులకు పట్టించారని చెపుతారు. పల్లెల్లో రాతి గుండ్లు ఎత్తే పందెం ఉంటుంది. దాని కోసం వచ్చిన సింగడు పోలీసులకు దొరికిపోయాడు. అతనికి సంకెళ్ళు వేసి గ్రామంలో ఊరేగించి తరువాత ఊరి తీశారని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. ఇప్పటికి పులివెందుల - కదిరి రహదారిలో నామాలగుండు ఉంది. దానిపై నామాలు ఉన్నయి. ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం రోజున నామాలసింగని వేషం వేస్తారు.

వేషం: ముఖం మీద యెర్రటి , తెల్లని బొట్టులు పెట్టుకుని, తలకు రుమాల చుట్టుకుని , వేపమండలు చెక్కుకుని రెండు చేతుల్లో రెండు పిడిబాకులు పట్టుకొని ఉంటాడు. పిడి బాకుల చివర నిమ్మకాయలు ఉంటాయి. రెండు చేతులకు ఇనుప గొలుసులతో తాళం వేస్తారు. నడుముకు యెర్రటి గుడ్డ కట్టుకొని, కాళ్ళకు గజ్జెలుంటయి. ఇద్దరు వ్యక్తులు తాల్లతో కట్టీ పట్టుకొని ఉంటే డప్పుకు అనుగుణంగ చిందులు వేస్తాడు.

వాద్యం: ఈ నృత్యంలో తప్పెట వాడతారు. తప్పెట గుండ్రని చర్మ వాద్యం. మాదిగలు దీనిని వాయిస్తారు. జగ్నకన్, జగ్ జగ్ జగ్నకన్ అనే శభ్ధాలకు అనుకూలంగ అడుగులు వెయ్యడం గమనించవచ్చు.

రాయలసీమలో ప్రత్యేకంగ కడప , అనంతపురం జిల్లాల్లో మొహరం పండుగ, పీర్ల పండుల దినాలలో ఈ వేషం వేయడం గమనించవచ్చు.

జ్యోతి నృత్యం

జానపద నృత్యాల్లో ఇది కూడ వ్యష్టి నృత్యమే. కానీ ఇది కులపరమైనది. కేవలం తొగట వీర క్షత్రియులు జ్యోతి నృత్యం చేస్తారు. చేనేత తెగకు సంబంధించిన తొగటవీర క్షత్రియులు చౌడెశ్వరీదేవిని ఆరాధిస్తూ ఈ నృత్యం చేస్తారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా నందవరంలో వెలసిన చౌడెశ్వరీదేవి వీరి ఆరాధ్య దైవం.

చౌడమ్మను గురించి అనేక కథలున్నాయి. ఈమె ఓంకార బిందు స్వరూపిణి. రాక్షస సం హారానికి పుష్పండజుడు అనే రాజుకు చౌడెశ్వరిగ జన్మించి 360 మంది వీర క్షత్రియులను హోమం నుండి సృష్టించింది. వీరే తొగట వీర క్షత్రియులు. వీరు ఈమెను గురించి పద్య, గద్య, ఖడ్గ రూపంలో స్తుతిస్తారు. జ్యోతి తయారు చేయడం

జ్యోతి చేయడానికి ముందు రతి వేస్తారు. రతి అంటే ముగ్గు వేయడం. తరువాత గోధుమ పిండి, బెల్లం కలిపి ముద్ద చేసి 2 మీటర్ల పంచె జ్యోతిగ చేస్తారు. ఆ జ్యోతిని నెయ్యిలో తడుపుతారు. ముద్దలో జ్యోతిని ఉంచి చుట్టు అలంకరణ చేస్తారు. జ్యోతి నెత్తి మీద ఉంచుకొని చౌడెశ్వరిని గురించి భక్తి పూర్వకంగ పాటలు పాడుతు రాత్రి అంతా ఉరేగుతారు.

వేషధారణ జ్యోతిని ఎత్తుకొనేవాళ్ళు నడుముకు యెర్రటి గుడ్డ చుట్టుకొని ఉంటారు. పంచె చుట్టుకొని ఉంటారు. పైన అంగీ ఉండదు. మెడలో హారాలు వేసుకొంటారు. తాళాలు, డప్పు, కంజీర వాద్యాలు వాయిస్తారు.

జ్యోతి థ్యం ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థన ఉంటుంది. తరువాత అమ్మవారిని గురించి పాటలు పాడతారు. ప్రార్థన పాట

పార్వతి పుత్రుడు పరమేశ్వరుని చూడ
ఎలుక వాహనమెక్కి వెల్లె తన వేడ్క
అమరంగ బెనకయ్య ఆత్మలో తలచేరు
సంతోషమున కల్గు సకల జనులకును
హర హర మిమ్ముదలకు వారుని పుత్రుండు
సకల విద్యల గురువు స్వామి గననాత
నేలి విద్యల గురువు గననాత

జ్యోతులను సుమారు రాత్రి 2 గంటల ప్రాంతంలో యెత్తుతారు. రాత్రంతా తిరిగి అమ్మవారిని ఊరేగించి చివరకు అమ్మవారికి బలులు ఇస్తారు.అమ్మవారిని ఊరేగించటాన్ని మెరవణి అంటారు. ఖడ్గాలు : చౌడేశ్వరి దేవి షక్తిని కీర్తించె పద్యాలనే ఖడ్గాలు అంటారు. ఖడ్గాలు చెప్పడం చాలా బాగుంటుంది. మధ్యలో పదాలు ఆగినప్పుడల్ల పక్కనున్నవారు భళి, భళి అంటుంటారు.

రాయలసీమలో కర్నూలు జిల్లా నందవరంలో సుమారుగ 400 జ్యోతులు ఆడతాయి. ఆనంతపురం జిల్లా లోని ఉరవకొండ, ధర్మవరం ప్రాంతాల్లో చేనేతలు ఎక్కువగా ఉండడం చేత ఇక్కడ జ్యోతులు ఎక్కువ. కడప జిల్లలో ప్రొద్దటుర్, జమ్మలమడుగు, దొమ్మర నంద్యల, వేపరాల, మోరగుడి ప్రాంతాల్లో జ్యోతులెత్తుతారు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)