రచన: ఓరుగంటి వేణు గోపాల కృష్ణ

జగన్నాధంకి అప్పుడప్పుడు డయరీ వ్రాసే అలవాటుంది. ప్రపంచ సమస్యల గురించీ, పాకిస్తాన్ తీవ్రవాదుల గురించీ, పరుగులెత్తే ధరల గురించీ, ప్రిన్సెస్ డయానా గురించీ పేజీలు వ్రాసే ప్రయత్నం చేయడు. ఆ మాటకొస్తే తన అభిప్రాయాలని పొందికగా వెళ్ళీపుచ్చ గలిగే ప్రఙ కూడా లేదు. ఏదో అప్పుడప్పుడు ఒకటో రెండో వాక్యాలు వార్తలు వ్రాసినట్టు వ్రాసి ప్రక్కన పెడుతూ వుంటాడంతే.

జగన్నాధం కొడుకు వేంకటరమణ కంపూటర్ ఇంజినీరు. ఎదో ఓ మంచి ఉద్యోగం వచ్చిందని జనవరిలో దూరంగా వెళ్ళి పోతున్నాడు. ఇవ్వాళ డిసెంబరు 13. ఆలోచిస్తూవుంటే మనసులో కొంచెం బెంగగా వుంది. ఆలోచనలు ప్రక్కన పెట్టడానికని డయరీ బయటకు తీసి పేజీలు మొదటినుండీ తిరగ వేయసాగాడు.

జనవరి 14: ఇవ్వాళ సంక్రాంతి పండగ. అబ్బాయి రమణకి మంచి సాంప్రదాయమైన సంబంధం చూసి పెళ్ళి చేయాలి. చక్కటి వైదీకుల అమ్మాయి, అంచు పరికిణీ వేసుకుని, బొట్టూకాటుక పెట్టుకుని, పొడుగాటి జడలో బంతిపువ్వులతో సంక్రాంతి లక్ష్మిలా వుండే అమ్మాయిని, వాడిని మమ్మల్నీ కాస్త జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిని, మంచి చదువూ సంస్కారాలున్న కుటుంబంలోనుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోవాలి.

చదువుతుంటే నవ్వు వచ్చింది. తన కోరికలు వాదికి ఆపాదిస్తున్నానా అని. తన పెళ్ళి చూపులప్పుడు, తన భార్య సువర్చల కట్టుకున్న ఎర్రంచు చిలకాకు పచ్చ చీర, అంచు జాకెట్టు, తిరుపతి కొండెక్కే వంపులు దారిలాంటి బారెడంత జడ, జడగంటలతో ఇంకొంచెం వయ్యారంగా వుండడం చూసి తాను గుటక వెయ్యలేక సతమతమవుతుంటే వెంట వచ్చిన దొడ్డమ్మ "ఈ వఢ్ఢాణం బంగారందేనా లేక గిల్టుదా?" అని వాళ్ళని అడిగినప్పుడు తనకెంత సిగ్గు వేసిందో తనకి.

ఫిబ్రవరి 13: ఏదో వేలంటైన్స్ డే అట. అబ్బాయి ఎవరెవరినో కలుస్తున్నాడు. నా పాత అభిప్రాయాలే కానీ, వైదీకులైతేనేం, ఇంకొకరు అయితేనేం? ఎవరో ఒకరు, బ్రాహ్మలయితే చాలు. కాస్త మడీ తడీ తెలుస్తాయి.

మార్చి 16: వీడికేమో అన్నీ స్వతంత్ర్య భావాలు. మేనమామ పోలికలు వచ్చినట్టుగా వున్నాయి. బ్రాహ్మలు కాకపోతే పోయింది. ఏ కులం వాళ్ళైనా పరవాల్లేదు - ఎటొచ్చీ కనీసం కోళ్ళూ పందులూ తినకుండా వుంటే చాలు. శాఖారులైతే వాడికి చక్కటి గుత్తివంకాయ కూరా, టమాటా పప్పు చేసి పెడుతుంది, తనకి కాస్త చారు నీళ్ళైనా పోస్తుంది. ఈ రోజుల్లో అంత కంటే ఎక్కువ ఆశించలేం.

ఏప్రిల్ 22: అబ్బాయికి ఎంతో మంది స్నేహితులు. ఎవరెవరితోనో గంటల కొలదీ ఫోనులో గుసగుసలు. మరి బయటకు వెళ్ళినప్పుడు ఏలాంటి అమ్మాయిలతో తిరుగుతున్నాడో ఏమో తనకు తెలియటంలేదు. కనీసం తెలుగు అమ్మాయి అయితే చాలు. అప్పుడప్పుడు తెలుగులో ఓ వుత్తరం ముక్కైనా వ్రాస్తుంది. "మామగారూ బాగున్నారా?" అనయినా నోరారా పలుకరిస్తుంది. లేకపోతే అదేదో సినిమాలో చూపించి నట్టుగా "మామగాడూ" అనో లేకపోతే అంకుల్ అనో పిలుస్తుంది. నాకా పిచ్చి పిలుపులు ఇష్టంలేదు.

జూన్ 3: ఏమిటో తెలుగే అవ్వాలని కోరుకుంటాము కానీ వీడికి ఎలాంటి ఆలోచనలు వున్నాయో? అన్నీ మనం అనుకున్నట్టుగా అవుతాయి ఏమిటి? కనీసం దక్షిణాది వాళ్ళైతే చాలు. కాస్త మన కట్టుబాట్లూ, సాంప్రదాయం కలుస్తాయి. మహలక్ష్మి అనో, పద్మావతి అనో పేర్లు వుంటాయి. మరీ ఉత్తర హిందుస్థానం వాళ్ళైతే బొత్తిగా భాషా తీరూ అంతా వేరే! వాళ్ళ పేర్లు పింకీ, టింకీ టీనా అని అర్ధం పర్ధం లేకుండా వుంటాయి. కుక్కపిల్లని పిలుస్తున్నామో, కోడలు పిల్లని పిలుస్తున్నామో తెలీకుండా వుంటుంది.

ఆగస్టు 20: అబ్బాయి రమణ ఎవరో ఒక భారతీయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినెవరినైనా చేసుకుంటే బాగుణ్ణు. కనీసం మన దేముళ్ళు రాముడూ, కృష్ణుడూ తెలుస్తారు. అదే ఏ చీపికళ్ళ చీనీ అమ్మాయో, బడ్డు పెదాల ఆఫ్రికన్ అమ్మాయో అయితే బొత్తిగా బాగుండదు. మరి పుట్టే పిల్లలకి, ఇటు మన తెలుగు వాళ్ళ పోలికలూ అటు ఆ పోలికలూ కలిసీ ఎలాంటి వింత పోలికలొస్తాయో చెప్పలేం. అయినా పెళ్ళంటే ఏడు తరాలు చూసి చెయ్యాలంటారు.

అక్టోబరు 19: ఈ మధ్యన వీడు బొత్తిగా విప్లవాత్మక భావాలున్న వాడులా తయారవుతున్నాడు. వాడి నడవడిక ఈ మధ్య బావుండటంలేదు. ప్రతీ దానికీ ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాడు. ఏవో క్లబ్బులూ సొసయిటీలూ అంటూ తిరుగుతున్నాడు. గుళ్ళో సీతారామ కళ్యాణం జరుగుతోంది వెళదాం రారా అంటే టైము లేదంటాడు పైగా.

డిసెంబరు 2: ఈ తరం వారి తీరే చాలా వేరు. పూర్వం వున్న ప్రేమలూ ఆప్యాయతలూ కనిపించటంలేదు. కాస్త దగ్గరలో వుద్యోగం చూసుకోరా అంటే ఎందుకు చెప్పామో అర్ధం కాదు. తనకేమో పోయే వయసే కానీ వచ్చే వయసు కాదు. గబుక్కున ఏదైనా అవసరం వస్తే కబురు చేరడానికైనా అందుబాటులో వుంటాడు అనుకుంటే పట్టించు కోడు. ఎక్కడో సాన్ ఫ్రాన్సిస్కోలో వుద్యోగంట. వెళ్ళీపోతానని వూరికే ఉబలాటం పడిపోతున్నాడు. మహా అక్కడేం వుందో ఈ వూళ్ళో లేనిది. పైగా అంత దూరంలో వుంటే వీడికి నేను సంబంధాలు ఎలా వెదక గలను?

డిసెంబరు 12: వార్తల్లో ఏవేవో వింత విషయాలు చెబుతున్నారు. మనం కనీ వినీ ఎరుగని ఎరుగం. మనుషులకి బొత్తిగా సిగ్గు లేకుండా పోతోంది. పోకడ వెర్రి తలలు వేస్తోంది. కాలం తీరే మారి పోయింది బొత్తిగా. వినడానికే అసహ్యంగా వున్నాయి ఈ వార్తలు.

జగన్నాధం డయిరీ చదవడం ఆపి ఆలోచనల్లో పడ్డాడు. కొద్ది రోజుల్లో వీడు వున్న వూరు, పెరిగిన ఇల్లు వదిలి వెళ్ళీ పోతున్నాడు. మనసులో ఏమిటో ఆందోళనగా వుంది. కాసేపు అయ్యాక పెన్ను తీసి డయరీ తెరిచి వ్రాయడం మొదలు పెట్టాడు....

డిసెంబరు 13: అబ్బాయి రమణ పెళ్ళీ చేసుకునేది కనీసం "అమ్మాయి" అయితే చాలు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)