ధారావాహికలు - రామ నామ రుచి
శ్రీరాముని ఔదార్యం
- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం

(గత సంచిక తరువాయి)

తే.గీ. అంత, ఊహించ లేనంత వింత జరిగె,
నీ వెఱిగినచో నిద్దాని నిందజేయ
నొల్ల వీ అర్చకుని, గాన తెల్లముగను
వినుము భక్తులయెడ రామవిభుని కృపను.

కం. ప్రాణావశిష్టులగు నా
గాణేయ గుణులను బ్రోవగను రఘురాముం
డేణీలోచన సీతను
రాణన్ వీక్షించి, పల్కె రహి వారలతో.

శా. "భక్తాగ్రేసరులార! యెంతగనొ క్షుద్బాధార్తులైగూడ వి
ధ్యుక్త స్ఫూర్తిని నిర్విరామముగ నెన్నో యేండ్లు సేవించి రా
సక్తిన్ మమ్ము విశిష్ట పూజలను నిస్స్వార్థ ప్రతోషాత్ములై,
యుక్తంబౌ నిక మీరు కష్ట పడబోకుండంగ జీవింపగన్.

తే.గీ. అర్చకస్వామి! నీవు, నీ ఆబిడయును
మాయెడ నమిత భక్త్యభిమాన కీర్త
న స్మరణ దాస్య సఖ్య వందనలతోడ
సేవచేసితి రిన్నాళ్ళు చేవమీఱ.

మ. కలికాలంబున నిట్టి భక్తవరులన్ కాంచంగ సాధ్యంబె! మీ
తులలేనట్టి ప్రశస్త సేవలకు సంతోషించి మీ కష్టముల్
తొలగంగా మదినెంచి నా భ్రుకుటిపై తోరంబుగా నున్న ఈ
తిలకంబున్ బహుమాన మిచ్చెదను ప్రీతిన్ గొండు దీనిన్ తగన్.

చం. అమల మనోజ్ఞ సుందర మహారుచి మండిత దివ్యకాంచన
స్థమిది మహోర్థ్వపుండ్రము, విచారహరంబు, నిధాన సన్నిభ
ప్రమిత పురాతనంబు, ఘన వజ్ర సమూహ సమాహిత స్ఫురద్
ప్రమదము, భాగ్యదాయకము, ప్రాభవ యోగ్యము, నిత్యపూజ్యమున్.

తే.గీ. దీని గొని మీరు తగు దూరదేశ మేగి,
అమ్మగా వచ్చు లక్షల సొమ్ము తోడ
చిన్న వ్యాపార మొకదాని నెన్నుకొనుచు
కష్టపడని జీవితమును గడుపు కొనుడు.

కం. నా కృప మీ వ్యాపారము
వీక దినదిన ప్రవృద్ధ విస్తృతమై, మీ
రేకంబుగ లాభంబులు
కోకొల్లలుగా గణించుకొందురు ప్రీతిన్."

దీని గొని మీరు తగు దూరదేశ మేగి,
అమ్మగా వచ్చు లక్షల సొమ్ము తోడ
చిన్న వ్యాపార మొకదాని నెన్నుకొనుచు
కష్టపడని జీవితమును గడుపు కొనుడు.

మత్తకోకిల: రామచంద్రుని వాక్కు వీనుల రమ్య రీతిని సోకగా
భామతోడను బ్రాహ్మణుండు విభావ వేల్లిత మానసా
రామమండిత తన్మయత్వ తరంగ సంహతి సంపదన్
రామనామము పెక్కుమాఱులు రక్తితో జపియించుచున్.

కం. ఉన్మాదులట్లు గెంతుచు
సన్మాన పురస్సరముగ సాష్టాంగముతో
నున్మనమున మ్రొక్కుచు తమ
జన్మలు ధన్యము లటంచు సంతోషముతో.

కం. మత్తిలి యాడిరి - పాడిరి
మత్తేభేంద్ర వరదుని సుమధురస్వనులై
హత్తిన బత్తిని తగు న
త్యుత్తమ వృత్తంబులు కవితోల్లాసముతో.

కం. "రామా! నీ కంఠరవము
మా మానసమందు విందు మానుగ జేసెన్,
స్వామీ! మా సేవలు గొని
ఏమాఱక మమ్ము బ్రోవు మిక్ష్వాకుపతీ!

తోటకము: రమణీయ ఘనస్వన రామ విభూ!
కమనీయ ముఖాంబుజ కంబుగళా!
ప్రమదమ్మున కొల్తుము భావమునన్
సమకూర్చుము మాకిక శాంతి మదిన్.

భుజంగ ప్రయాతం :
నమస్తే ప్రభో రామనాథ! నమస్తే
ప్రమోద ప్రదాతా! ప్రపద్యే ప్రభో రా
మమూర్తీ! క్షమధ్వం! క్షమధ్వం! భజేహం
నమో దేవ దేవా! ప్రణామంబు లయ్యా!

భుజంగ ప్రయాత మాలిక :
యతీంద్రుల్, సుపర్వుల్, మహాధీథితుల్ భ
క్తితో నిన్ను పూజించి, కీర్తించి, ప్రార్థిం
చి, తాపించి, శోధించి, చింతించియున్ గా
ని, తోపించగాలేక నీదివ్య రూప
బు తుష్టిన్ గనంబోరు - మోహంబుతోడం
కృతార్థత్వ యోగంబు కించిత్తునైనన్
ప్రతీత్యాత్ములై పొందు భాగ్యంబుకై తా
ప్రతీక్షింతురే గాని ప్రత్యక్ష మీక్షిం
చి తాదాత్మ్యతన్ జెంది సేవింపగా లే
రతిక్లిష్టమయ్యా నియంత్రింప నీ లీ
ల! తర్కింపగా మా కలంఘ్యంబు! సీతా
సతీ వల్లభా! రామచంద్ర ప్రభూ! దు
ర్గతిన్ మ్రగ్గు మాబోటి కాలాంధకార
జ్ఞతా మూర్ఖులన్ బ్రోచి శాసింపగా ప్రే
మతో మాకు నీ దివ్యమౌ వాక్కు విన్పిం
చి తాదాత్మ్య మిప్పించి శ్రీమీఱు స్మేర
స్మితాంభోజ వక్త్రంబు చెన్నొందగా చూ
పితే! శ్రీపతీ! ఎంత పెంపారు ఈవో!
నితాతంబుగా దేవ! నీ దాస్య మిమ్మా!
నతుల్ సేతుమయ్యా! ఘనశ్యామ వర్ణా!

పంచచామరం : ఇదేమి భాగ్యమో తలంప - హీనులైన మా యెడన్
వదాన్యుడైన రామచంద్ర పార్థివుండు ప్రేముడిన్
ముదావయమ్ముగాగ పొల్చి - పుండ్ర మిత్తు మీకు కొం
డు, దీన మీ దరిద్ర మెల్ల డొంకిపోవు నంచనెన్."

చం. అని మదిలో దలంచి పరమాత్ముడు రాముని తోడ వార లి
ట్లని రతివేల యాతన నిరాశ నిరాదరణ వ్యథార్తులున్
బొనరగ, "ఏలనయ్య మము పూర్వ విధిన్ తమచెంతనుండి మీ
అనుపమ సేవచేసికొన కౌలకు పంపగ బూనినారలున్.

కం. మా సేవలు నచ్చనిచో
శాసింపుడు మీరు మమ్ము - సరియగు రీతిన్
దాసులమై చేతుము మా
శ్వాసలు నిలిచెడు వఱకు పవళ్ళున్ ఱేలున్.

ఉ. అంతియగాని మమ్ము తమ ఆలయమందున నుండకుండ ఏ
పొంతకొ పొండటంచు వెలిబుచ్చగ నొప్పునె, రామసేవ నా
వంతయు సేయకుండ మనువారమె! మే మెపుడైన సొమ్ముకై
చింతిలినారమే! కలత జెందితమే మును తిండికోసమై!

కం. ధనమేలను - మా మనువును
తనువును నీ కంకితంబు, తవ నామ సుధా
ధుని తనియించును మము తి
న్నను తినకుండినను గాని నలువుగ రామా!

ఉ. ఐనను కొంతబాధ మనమందున నుండు - కృశించుచున్నదే
హాన త్వదీయ పూజనల నచ్చిక లేక తెగించి చేయగా
పూనుట సాధ్యమా యనుచు - పూర్తిగ గుఱ్ఱము గ్రుడ్డిదైన గా
నీ నడయాడు కోసరము నిండుగ గ్రాసము కోరదే భువిన్.

ఉ. కన్నుల పండువయ్యెడిది కాంచన భూషణ సంయుతుండవౌ
నిన్నొక నాడు కాంచగను, నేడు నిరస్త పరిష్కృతుండుగా
విన్నన చూడ మా మదులు వ్రీలె - నివాళులు, ధూప దీపముల్
పన్నుపడంగ బోనియెడ పాయక మానునె మాకు ప్రాణముల్.

తే.గీ. అమ్మవారి పూజకు కుంకుమమ్ము, భక్త
తతులకు సరిపడగ ప్రసాదముల కొఱకు,
ఇంచుకంత మముల బ్రదికించు కొనగ
సరిప డు సరుకు చేకూర చాలు మాకు.

తే.గీ. అంతటివె మాకు రెండు పేరాశ లుండు,
బ్రతికి నన్నాళ్ళు సతతంబు రామసేవ,
తనువులు కృశించి బాధించె కనుక నింక
కొలది కాలము లోన వైకుంఠ పథము."

తే.గీ. "అటులనే" యని దీవించి అర్చకులను
పంపి రామచంద్రుండు నా వదన తలము
ప్రీతి వీక్షించె; నేనంత పెలుచ లేచి
స్వామి మనసులో గల అభిప్రాయమెఱిగి.

తే.గీ. ప్రభువు దరిజేరి కేల్మోడ్చి ప్రణతి జేసి,
వదనతలమందు పుండ్రాన వజ్రమొకటి
నా నిశిత నఖ ద్వయి తోడ నలగకుండ
పఱకి దరినున్న పట్టణం బరిగి యచట.

సీ. నా భక్తుని కలలోనను నేను కానిపిం
చి, ఉపల మిచ్చుచు చెప్పినాడ,
"రామాపురమున శ్రీరాముని గుడిని పూ
జారియౌ వేంకటాచారి నొకని
రామ కార్యార్థివై ఏమాఱ కుండంగ
శీఘ్రంబుగా జేరి చెప్పు మిటుల:
’దేవుని సేవకు, తృప్తిగా మీరలు
బ్రదుక సరిపడు సంభారములను

 

 

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)