కవితా స్రవంతి
శ్రీ అరవిందుల దుర్గా స్తోత్రం
-వెంపటి హేమ

అవతరించుము భారతావని

అమ్మరో మా మొరలు వినుమా,
నీదు సుతులము కావు కరుణను

శక్తి దాయిని శాంభవీ!

నీవు పంపగ భువికి వస్తిమ

నీదు పదములె కొలుచు చుంటిని
దుష్ట శిక్షణను శిష్ట రక్షణము

చేయ తలచినవారమై -

కార్య సాధన మాకు లక్ష్యము,

నీ వెనువెంట నడచి వచ్చెడి
నీదు బిడ్డలమయిన మాకై

ఇలను ఉద్భవ మొందవా?

 

సింహ వాహని, త్రిశూలధారి,

త్రిభువనచారి, విజయ ప్రదాయి,
అంబ ! మంగళప్రదమగు నీదు

దర్శనముకై వేడితిన్ -

శక్తి ప్రేమలు నీకు సహజము,

నీ విక్రమ రూప మతి రౌద్రము
ధూర్త వినాశమొనర్చుమమ్మ

జ్ఞాన సముచిత మూర్తివై!

 

 

నీదు పనుపున భువిని జనించి,

భరతమాతను దాస్య శృంఖల

విముక్తసేయ దీక్ష పూనితి -

నీదు కృపకై వేడితిన్.

 

 

అఖండశక్తి, మనోధైర్యము,

బలము, వీరము లొసగి మమ్ముల
శక్తి యుతులుగ చేసి దీవెన

లొసగు కోరిక తీరగన్ -

 

నీదు ఆశీస్సులను పొందగ

జ్ఞానులమగుచు, మంచి నడతను
కలిగి, సన్మార్గమున నిరతము

చరింతుమమ్మ భక్తితో -

 

భారతాత్మత్యంత ఉదాత్త

యౌను తలంచి చూడ నిమ్మహి,
అట్టి భారతి వంచితయగుచు

కాంతి హీనగ మారనా?

ఉదయ భానుని కిరణ జాలము

సోక, తిమిరము పటాపంచలై

పోవు, నీ తేజమావరింప

తొలగు అజ్ఞానమెల్లన్ !

మేము బిడ్డల మగుట నీదౌ

కృపామృతమ్ము త్రాగి బ్రతుకుచు,

ఇమ్మహోన్నత లక్ష్య సాధన

సేయ తలచితి మమ్మరో.

 

మా హృదయముల నావరించిన

అల్ప బుద్ధియు, భీతి, దురాశ,
లాభపరతయు పరిహరించుచు

కావు మమ్ముల కాళిరో!

అసుర సంహారిణీ, జననీ !

వైరి మూకల నశింపజేసి,
మమ్ము నిర్దాక్షిణ్య దృక్కుల

నిష్కళంకుల జేయుమా !

నేడు భారత భూమి దుర్గుణ

సమన్వితమై హీన దశలో
మునిగిపోవుచు దిక్కు తోచక

క్రాలుచున్నది కావవే !


కాళి, కపాలి, నగ్న దేవీ!

మా హృదయములు విశాలమవ్వ
మాకు సహకారమిచ్చి, మాదగు

ఉద్యమోన్నతి కోరుమా -

 

అనుగ్రహింపవదయనుమమ్ముల

మాదు సంకల్పముకు నిజమౌ
స్ఫూర్తి నీయవె జనని దుర్గా,

మహాశక్తీ, మాతరో !

మానవజాతి పునర్జీవన

మొందగావలె నన్న, నిద్రించు
ప్రజ్ఞల లేపగ మాకు చాలిన

బుద్ధి కుశలత నీయవే !

సుజనులౌ సత్ప్రవర్తకులకు,

సత్య, విద్యా సమన్వితులకు
నియమ, నిష్ఠా గరిష్ఠులకును

ప్రేరణొసగుమ ప్రీతితో!

తొలుత జననీ, తొలగ జేయుము

అంతరంగపు శత్రు కోటిని,
ఆపై మమ్మావరించియున్న

బాహ్య వైరుల దునుముమా!

భువిని కాపాడు యోగ శక్తీ !

మానవజాతి పునర్నవముగ
చేయ సాక్షాత్కరించు మమ్మా

ఇమ్మహిలోన ఈశ్వరీ! !

 

బుద్ధి సూక్ష్మత, భక్తి, శ్రద్ధయు,

నియమ, నిష్టాగరిష్టతలును,
సత్య విజ్ఞానముల మమ్ముల

ప్రభావితులను చేయుమా.

ధీర, ఉదాత్త భారతీయుల

మమ్ము, ప్రేమైక్యతలతోడుత
సకల యోగ్యతలతో వెలార్చి,

తీర్చి దిద్దుము ప్రేమతో.

పవిత్ర వనాంతరాల యందున,

మహోన్నత పర్వత శిఖరాల,
నదీ తీరాలయందు వసింప

మాకు వరమ్ము నీయవా ?

 

నీ చరణ సన్నిధిని మాదౌ

నిత్య ప్రార్ధన మిదియె సుమ్మీ,
అనుగ్రహముతో అవతరించుము

భువిని మాకై మాతరో !

నీదు శక్తిని మా కొసంగుచు

మమ్ము నీవుగ మలచుకొమ్మా -
సర్వ పాపము లాహరించగ

ప్రవర్తింతుము నీవలే....

 

మా హృదయముల శక్తి నింపుమ,

మేము నీ పని కుపకరించగ
నీదు ఖడ్గమగుదుము మాతా!

దురిత మెల్లను దునుమగా !

ఒకపరినీవు మా దరికిరా,

ప్రేమ బంధము తోడ బందిగ
చేసి నిరతము నిన్ను మాలో

నిలిపి కొలుతుము భక్తితో-

 

నిన్ను మా ప్రాణయుత శరీర

వర్తి చేసుకు మేము మసలగ,
నీ వెపుడు మా వెంట నుంటూ

అనుగ్రహించుము మమ్ములన్!

నీదు కృపాణముతో జగాన

పాప కర్ముల నశింపజేసి
మాకు సారధి వగుచు దారిని

చూపు మమ్మా ప్రేమతో!

 

నీదగు తేజముతో వెలిగే

దీప మొకటి వెలిగించి చూడు,
మాకు నీపై నున్న భక్తికి

నీవె ప్రేరణ పార్వతీ !

మేము చేసెడి పనుల నన్నిట,

మాదు ప్రజ్ఞయు, బలము, సర్వము
సమీకరించి నీకు అర్పణ

చేసి తరింతు మమ్మరో!

శౌర్య పరాక్రమ ఛోదితమగు

దారి చూపుము మాకు శీఘ్రమె;
మేము నీ అనుయాయులమె కద,

మాకు సర్వము నీవెగా !

 

అవతరించుము అవని మాకై,
భరత భూమిని అనుగ్ర హించగ
ఇదే మా ప్రార్ధనము సుమ్మీ,

అవధరించుము అమ్మరో !

 

(ఇది స్వేచ్చానువాదం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)