Sujanaranjani
           
  కథా భారతి  
 

అంతర్ముఖం - ౩వ భాగం

 

                                                                           రచన :  యండమూరి వీరేంద్రనాథ్

 

నేను కళ్ళు తెరవడం అందరికన్నా మొట్టమొదట చూసింది నా పెద్దకొడుకు.
అప్పుడే వాడు వంగి నా కాళ్ళకి దణ్ణం పెట్టబోతున్నాడు.
కనురెప్పల కదలికని గమనించి ఉంటాడు. అలాగే నిశ్చేశ్టుడై వంగి ఉండిపోయాడు. వాడి కళ్ళలో అన్నిటికన్నా ముందు నేను చూసిన భావం..
భయం..
అవును భయం.
ముర్ఛ రాబోయేముందు మనిషిలా బిగదీసుకుపోయి నిలబడ్డాడు.
నా మొహం పక్కనే కూర్చుని ఏడుస్తూన్న అమ్ములు ఏడుపు ఆపుచేసింది.
నేను తలతిప్పి నెమ్మదిగా నా కూతురివైపు చూడటానికి ప్రయత్నించాను. నా శరీరం నాకు సహకరించదని గుర్తొచ్చింది. గుడ్లు తిప్పి వీలైనంత కనుకొనల్లోంచి చూసాను.

పాడెమీద పడివున్న శవం, శరీరం ఏమాత్రం కదల్చకుండా ఫ్రాంకెన్ స్టెయిన్ లా కనుగుడ్లు మాత్రం కదిపి చూడటం అత్యంత భయంకరంగా ఆమెకి కనిపించి ఉంటుంది. కెవ్వున అరవసాగింది. ఎవరో వచ్చి చప్పున ఆమెని దూరంగా లాగారు.

నా మరణానికి ముందు నన్ను పరామర్శించడానికి వచ్చి, ఆనకట్టని పరిశీలించినట్టు చూసిన ఇంజనీర్లలో ఒకరు, నా దూరపు బంధువు, కాస్త ధైర్యస్తుడిలా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి నన్ను పరీక్షగా చూసి, ఈయన చావలేదు. బతికే ఉన్నాడు. అని బిగ్గరగా అరిచాడు.

కట్లు విప్పండి అరుస్తున్నాడెవరో..
ఆ తరువాత విషయాలు తొందర తొందరగా జరిగిపోయాయి.
బట్టలు మార్చి, తిరిగి నన్ను తీసుకొచ్చి పక్కమీద పడుకోబెట్టారు. నన్ను అలా పడుకోబెట్టగానే నేను చేసిన మొదటిపని కప్పుమీద సాలెపురుగుని చూడటం. పాత మిత్రుడుని పరామర్శించినట్టు అది కాస్త కదిలింది

గంట తర్వాత పత్రికా విలేఖర్లు వచ్చారు. రెండు మూడు గంటల పాటు హడావుడి. ఫోటోలు తీసారు. నా పెద్దకొడుకు ఓపిగ్గా అందరికీ సమాధానాలు చెబుతున్నాడు.

ఆ మరుసటి రోజు పేపర్లో బాక్స్ ఐటమ్ లు ప్రముఖంగా వచ్చాయి. చచ్చి బ్రతికిన మనిషి.. మృత్యువుని పరామర్శించిన మృత్యుంజయుడు.. యముడితో ఏడుగంటలు.. వగైరా హెడ్డింగులు పెట్టారు. ఒక కమ్యూనిస్టు పత్రిక మాత్రం ఈ వ్యవహారన్నంతా ఏకిపారేస్తూ ఎడిటోరియల్ వ్రాసింది. కోమాకీ చావుకీ తేడా తెలియని మా ఫామిలీ డాక్టర్ ని, డాక్టర్ పట్టా చింపెయ్యమని సలహా ఇచ్చింది.

పాపం డాక్టర్ బిక్కమొహం వేసుకుని నన్ను తిరిగి పరీక్ష చేయడం ప్రారంభించాడు. జరిగినదంతా చెప్పి, మీదేం తప్పులేదని ఓదార్చుదామనుకున్నాను. కానీ నా నాలుక ఇంకా పనిచేయడం ప్రారంభించలేదు.

నన్ను ఇంజనీర్ లు పరీక్ష చేసి ఇద్దర్లో రెండో ఆయన కాస్త జ్యోతిష్యం చెప్పగలరు. వాస్తులో కూడా ప్రవేశమున్నట్టుంది. ఆయుర్వేదం మందులు అవీ ఇస్తూ ఉంటాడట. ఆయన నా దగ్గరకొచ్చి ప్రాణం పోయిన తర్వాత మీకు దేవుడు కనబడ్డాడా? అని అడిగాడు.

ఇంతకాలానికి నాకేం జరిగిందో సరిగ్గా గ్రహించగలిగిన వ్యక్తి ఒక్కడు కనబడినందుకు సంతోషంగా కళ్ళు ఆడించాను. అయితే ఆ విషయం పట్ల ఆయన అంత ఉత్సాహం చూపించలేదు. దగ్గిరగా వంగి రహస్యంగా, మీలోకి దేముడి అంశవచ్చి చేరిందని ప్రచారం చేస్తాను. జనం తండోపతండాలుగా వచ్చి కానుకలు సమర్పించుకుని కోరికలు కోరతారు. వచ్చినదాంట్లో ఫిఫ్టీ - ఫిఫ్టీ. ఎలా ఉంది నా ప్రపోజలు. అన్నాడు.

నాకిష్టం లేదన్నట్లు కనురెప్పలు అల్లాడించాను. ఆయన నిరాశగా వెళ్ళిపోయాడు. కానీ మరుసటిరోజు తిరిగివచ్చి, నిన్న నువ్వు సౌంజ్ఞల ద్వారా చెప్పింది నాకు అర్ధం కాలేదు. నువ్వు మాట్లాడలేదన్నదే కదా నీ బాథ! నువ్వు ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. అంతానేను చూసుకుంటాను. ఒకసారి కళ్ళు మూసుకుంటే అవును.. రెండుసార్లు కనురెప్పలాడిస్తే కాదు.. అలా తోచిన సమాధానాలు చెప్పు. ఈ కోరికలు తీర్చుకోవడం కోసం వచ్చిన భక్తులంత మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. అన్నాడు.

నేను కళ్ళు కదల్చకుండా నిశ్చలంగా ఉండిపోయాను. ఆయన ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. నేను నిశ్చలంగా బిగుసుకుపోవడానికి వేరే కారణం ఉంది. ఆయన చెప్పిన మాటల్లో ఉన్న నిజం.

నేను కదల్లేను.
చేతులు కదల్చలేను
కళ్ళు తప్ప మరేమీ కదల్చలేను..

యథాతథంగా నీ జీవితం ప్రారంభించు.. అంటూ దేముడు నన్ను భూలోకానికి పంపిస్తూ.. ఇంకేమయినా వరాలు కావాలా? అని అడిగినప్పుడు చాలు స్వామీ.. అని నేనెంత తప్పుచేశానో ఇప్పుడు అర్ధమై నా మనసు ఫ్రీజ్ అయిపోయింది. స్వామీ నా ఊహ నిజమేనా? అంటూ నా ఆత్మ ఎలుగెత్తి అరిచింది.

నిజమేనన్నట్లు దేవదూతలా గాలిలో ఎగురుకుంటూ వచ్చి నా ముక్కుమీద వాలింది ఈగ.

నాకు భరించలేనంత దుఃఖం కలిగింది.
వేల లక్షల సంవత్సరాలు నేనిలాగే అచేతనుడనై శవంలా పడి ఉండాలన్న ఆలోచనతో కంట నీరు కారింది. ఎండి చారికలు మిగిల్చింది.

.. .
కొద్ది రోజులకి నా వాళ్ళకినేను అలవాటు అయిపోయాను. హడావుడి తగ్గింది.
నా శరీరం అలాగే శుష్కించి ఉంది. డాక్టరు అప్పుడప్పుడు ఆక్సిజన్ పెడుతున్నాడు. ఆ సమయంలో మాత్రం ఇంట్లో కాస్త హడావుడి ఉంటుంది. నేను కాస్త కోలుకోగానే మామూలే. నాకు మరణం లేదని వాళ్ళకి చెప్పలేను.

ఇంట్లో బంధువులందరూ వెళ్ళిపోయారు.
నేనూ, నా గదిలో సాలెపురుగు, నా ముక్కుమీద ఈగ మాత్రం మిగిలాం.
ఎంతకాలం ఇలా? ఏం చెయ్యను నెను?
ఈ మధనతో నేను బాధపడుతుండగా ఆ రోజు ఓ దారుణమైన ఘటన జరిగింది.
ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్ములు లోపల ఎక్కడో పని చేస్తూంది.
అకస్మాత్తుగా నాకు ఎగశ్వాస ప్రారంభమైంది. విలవిలలాడిపోయాను. శరీరాన్ని కదిల్చే శక్తి కండరాలకు లేక, బాధని శరీరం అనిభవించాల్సి వస్తే...అదంతా కళ్ళలో ప్రతిబింబిస్తుందనుకుంటాను. నా కళ్ళు వికృతంగా తయారవడం నాకు తెలుస్తూనే ఉంది.

ఏదో పనిమీద లోపలికి వచ్చిన అమ్ములు నా పరిస్థితి చూసి నిశ్చేష్టురాలైంది. గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత డాక్టరు, ఆఫీసు నుంచి పెద్దకొడుకూ వచ్చారు.
ఆ అ ర.. గం...ట..సేపూ నేనొక్కడ్నే గదిలో ఉన్నాను.
డాక్టర్ అమ్ములుతో అలా పరిస్థితి విషమించినపుడు ఫలానా మందు గొంతులో పొయ్యమని చెప్పాను కదమ్మా.. అన్నాడు.. నేను పక్క మీద చేరినప్పటినుంచీ నన్ను అమ్ములు స్పృశించలేదు. నా కూతురు మనసు చాలా సున్నితం. అందుకే నా గదిలోకి కూడా వచ్చేది కాదు.
డాక్టర్ తిడుతుంటే అమ్ములు జవాబు చెప్పకుండా మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. వెళుతూ వెళ్తూ నా వైపొకసారి చూసి వెళ్ళింది.
ఆ చూపు..
అణచి పెట్టబడిన సత్యం ఒక్కసారిగా పఠేలున పగిలినట్టు నా మనసుకి తగిలి నా అంతర్ చక్షువు రెప్పలు తెరుచుకుంది.
నేనంటె అమ్ములుకి భయం.
నేనంటే నా కూతురికి అ...స...హ్యం..!!
ఏవగింపు!!

నా నోటి చివరనుంచి కారె తడిని, నా కంటి చివర్లలో అట్టలు కట్టిన తెల్లదనాన్ని చూడలేదు. కలలు కనాల్సిన వయసులో నా ముండు కూర్చుంటే నా కూతురికి తన వృద్ధాప్యం కంటి ముందు కనపడుతుంది.
దానికి సున్నితత్వం అని పేరుపెట్టుకుని ఇంతకాలం అందరూ ఆత్మ వంచన చేసుకున్నాం.

* * *
మరో నెలరోజులు గడిచాక ఒకనాడు నా మిగతా ఇద్దరు కొడుకులు అకస్మాత్తుగా ఊడిపడ్డారు. అంతకుముందు రాత్రి నేను చాలా హడావుడి చేస్తేపాపం డాక్టరు చాలా కష్టపడ్డాడు. రాత్రంతా మెలకువగానే ఉన్నాడు. నాకు మరణం లేదు.. అని అతడికి ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. నాకు ఆక్సిజన్ పెట్టాడు. పొద్దున్నకి కాస్త నెమ్మదించింది.

నా ముగ్గురు కొడుకులు పెరట్లో సమావేశం అయ్యారు.
ఎంతకాలం ఇలా ఉండాలో తెలియడంలేదు. ఆ ప్రాణం ఉండదు, పోదు.. అంటున్నాడు నా పెద్దకొడుకు.
రోగమంటూ ఏమీ లేదు.. వృధ్దాప్యం అంతే..
అసలేమిటట రోగం? రెండో కోడలు అడుగుతోంది.
కండరాల వ్యాధి ఏమో.. చూస్తుంటే ఏ క్షణమైనా చచ్చేట్టూ ఉంటాడు..చావడు.. నిష్టూరంగా అంటూంది.
నా పె...ద్ద...కో...డ...లు.

ఏకులసాహెబు వింటినారిని కొట్టగానే ఝంకార శబ్దంతో దూది ఎలా ఎగురుతుందో అలా నా మనసు పెచ్చులు పెచ్చులుగా ఎగిరింది. కంట్ నీటి చుక్కలు పరామర్శించడం ఎప్పుడో మానేసాయి. నా మిత్రుడైన సాలెపురుగుని బల్లి తినేసింది. నా శత్రువైన ఈగ కూడా నామీద విరక్తి పెంచుకుని వెళ్ళిపోయింది.

ముగ్గురం ఆయన్ని తలో నాలుగునెలలు ఉంచుకుందాం. అందుకే మిమ్మల్ని పిలిపించాను. అన్నాడు నా పెద్ద కొడుకు.
నాకెలా కుదురుతుంది.. అన్నయ్యా.. నేనూ..కళ్యాణీ ఆఫీసుకి వెళ్ళీపోతే ఎవరు చూసుకుంటారు??
నాకు అసలు కుదర్దు. దానికి ఆరోనెల..అంటున్నాడు నా మూడో కొడుకు.
న పెద్దకోడలి కంఠం అప్పుదు బిగ్గరగా వినిపించింది. మూరు మా బాధ అర్ధం చేసుకోరేం. ఆయనకంటూ స్పెషల్ గా ఒక గది ఎల్లకాలం ఉంచలేం. పిల్లలు ఇల్లంతా తిరగడానికి వీల్లేకపోయె. రాత్రి ఒంటిగంటకి కంగారుచేస్తే ఇక తెల్లవార్లూ నిద్ర ఉండదు. ఒకటి రెండు రోజులంటె పర్లేదు. నేనూ మనిషినే. మాకూ కొన్ని కోరికలుంటాయి. ఈ వయసులో కూడా ఒక అచ్చటా ముచ్చటా లేదు. నాకు చావాలనిపిస్తోంది. అంది.

ఆమె మాటల్లో అసత్యమేమీ లేదు.
కానీ సత్యం.. ఎప్పుడూ మనసుని సంతోషపెట్టాలని కూడా లేదు. నా మనోనేత్రం నిశ్శబ్దంగా ఒక నిట్టూర్పుని హృదయపు చెక్కిలిమీదకు జార్చింది. ఎంతో కష్టపడి అమ్ములు పెళ్ళికి దాచిన డబ్బు సగం అయిపోయింది. మనం మంచి సంబంధం అనుకున్నవాళ్ళు అడిగిన కట్నం మాత్రం మిగిలింది. ఈయన ఇలా ఇంకొక నెలరోజులు పక్క మీద ఉంటే అదికూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి.

శుష్కించిన ఒక ముసలి శరీరాన్ని బ్రతికించి ఉంచడం కోసం పండంటి పిల్ల జీవితాన్ని నాశనం చేయమనడం భావ్యం కాదు. ఆ మాట పైకి చెప్పగల ధైర్యం నైతికానికి లెదు. కానీ నైతికం వేరు వాస్తవం వేరు.

నా రెండో కొడుకు అంటున్నాడు. అయినా ఆ కుర్రాడు అమ్ముల్ని ప్రేమించి మరీ పెద్దవాళ్ళని ఒప్పించాడుగా, కట్నం దేనికట?
దేనిదారి దానిదే?
ఆయన ప్రాణాలు రేపో మాపో పోతాయని పెళ్ళి వాయిదాలు వేస్తూ వచ్చాం. ఇంకెంతకాలం ఆగమంటారని వాళ్ళు తొందర పెడుతున్నారు.
పెళ్ళి చేసేద్దాం! ఆయన కూడా కూతురి పెళ్ళి కళ్ళారా చూసుకుంటారు.
ఆ డబ్బు పెళ్ళికి అయిపోతే ఆయన వైద్యానికి నా దగ్గర డబ్బు లేదు.
అసలా డబ్బు నువ్వు సగం ఖర్చు పెట్టేవని తెలిస్తేనే ఆయన గుండె ఆగిపోతుంది. నా రెండో కొడుకు ఓదార్పుగా అన్నాడు. చిత్రమేమిటంటే, ఆ డబ్బులన్నీ నే..ను కష్టపడి సంపాదించినవే.

సరే.. అదంతా దేనికిగానీ, మేము ఆయన్ని ఎంతకాలం ఇంకా చూసుకోవాలో మీరిద్ద్రూ ఆలోచించి చెప్పండి.. అన్నాడు నా పెద్ద కొడుకు. మాటలు ఆగిపోయాయి.
నాకప్పుడు ఆ చరాచర సృష్టి లయకారుడి మాటలు గుర్తుకొచ్చాయి.
ప్రేమ అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు. ఎప్పుడయితే నీలో కేవలం తీసుకోవడం ప్రారంభమయిందో, అప్పుడు అవతలివారికి నీపట్ల ప్రేమ నశిస్తుంది. అప్పుడు కూడా బంధాలు ఉండవచ్చు. కానీ అవి కృతజ్ఞత వలన కర్తవ్యం వలనో ఏర్పడిన బంధాలు! అవసరంవలనో, అమాయకత్వం వలనో ఏర్పడిన ప్రేమ, కొంతకాలానికి కర్తవ్యమై, మరి కొంతకాలానికి నిర్లిప్తతకీ, విముఖత్వానికీ దారితీస్తుంది. అది ప్రేమకాదు.. మాయ.

పెళ్ళయిన కొన్ని సంవత్సరాలకి భర్తలు బయట ప్రపంచంలో ఎక్కువకాలం గడపడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తారో, భార్యలు పిల్లల పెంపకానికి తమ ఏకైక ప్రపంచం ఎందుకు చేసుకుంటారో నాకు అర్ధమైంది.
నా గదిలోకి నెమ్మదిగా చీకటి ప్రవేశించింది.
చీకటిని చూస్తే నాకు భయం.
రాత్రి అయ్యేకొద్దీ ఒంటరితనం పాములా పాక్కుంటూ వస్తుంది.
నా గదిలో గడియారం కూడా ఆగిపోయింది.
పన్నెండు దాటి ఉంటుంది.
ఈ వృధ్ద్దాప్యం అనేది ఎంత భయంకరమైనది!
వృద్ధాప్యం వల్ల కంటిమిదకు నిద్రరాదు. ప్రపంచం అంతా గాఢనిద్రలో ఉంటుంది. నిద్రపట్టదు. రాత్రి ఏ రెండింటికో కంటిమీద కాస్త కునుకు. అంతే. అప్పటివరకూ...అన్ని సుదీర్ఘమైన గంటలు... అలాగే ఒంటరిక్గా పడుకుని, పైకప్పు కేసి చూస్తూ దాహమేసినా నీళ్ళు అందించేవారులేక తెచ్చుకునే ఓపిక లేక, ఓపిక ఉన్నా, విరిగిన కళ్ళజోడు కనబడక అలాగే నాల్గు గోడలమధ్య అప్పుడప్పుడు దగ్గుతూ.. ఆ దగ్గుపక్కవారికి నిద్రా భంగం కలిగిస్తుందన్న భయంతో.. భయంతో..భయంతో..భయంతో బ్రతుకు చివరి ఛాప్టర్ అంతా ఎవరెప్పుడు విసుక్కుంటారో అన్న సందిగ్ధంతో విసుక్కున్నా తిరిగి ఏమీ అనలేని అసక్తతో దుఃఖమొచ్చినా తడిలేని కళ్ళతో బరువైన మనసుతో తేలికపడుతున్న శరీరంతో వృద్ధాప్యం... చావుకి సామీప్యం.
నేనలాగే పడుకుని వున్నాను.

మరో గంట గడిచాక గుమ్మం దగ్గిర చప్పుడైతే కళ్ళు విప్పిచూశాను.
అమ్ములు లోపలికి వస్తోంది.
అంత అర్ధరాత్రి నా రెండో కూతురు మనసు కొమ్ముల్లో ఏ ఆప్యాయతా కుసుమాలు వికసించి ఆమెను రప్పించాయో అని సంభ్రమంతో చూసాను.
ఆమె చేతిలో చిన్న ఉద్ధరిణి ఉంది. నా దగ్గరిగా వచ్చి, అందులో తులసితీర్ధాన్ని నా పెదవుల మధ్య పొసింది. నాకు అర్ధం కాలేదు. నేనే ఆ అయోమయంలో ఉండగానే ఆమె నిశ్సబ్దంగా వెనుతిరిగింది. ఆ తిరగటంలో (అ) ప్రయత్నంగానే ఆమె చెయ్యి తగిలి నా ప్రాణవాయువు ట్యూబు తొలగిపోయింది.

ఆమె దాన్ని సరిచెయ్యలేదు. బయటకు నడిచింది.
గాలిలో వ్రేలాడుతూన్న ఆ రబ్బరు గొట్టంవైపు విభ్రాంతుడినై చూస్తుండిపోయాను.

నేను విబ్రాంతుడినైంది నా కుతురు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు కాదు. చంపేముందు తులసితీర్ధం పోయాలన్నంత ప్రేమ ఆమె మనసులో ఇంకా మిగిలినందుకు.
 

 
(సశేషం..)

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech