Sujanaranjani
           
  కబుర్లు  
  వీక్ పాయింట్
      నమో!... అమ్మో!!  
 

- రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి

 
 

న.మో.!
ఆ పేరు చెబితే చాలామంది ‘నమో’ అంటున్నారు
ఇంకా చాలామంది అమ్మో అంటున్నారు.
ఇంతకీ సి.ఎం మోడి పి.ఎం. అవుతాడా లేదా?
పై రెండు వర్గాల్లో పోను పోను దేని సంఖ్య ఎక్కువన్న దాన్నిబట్టి!
దశాబ్దానికి పైబడి ముఖ్యమంత్రిగా ఉండటం అబ్బురంకాదు. మునుపు జ్యోతిబసు, నవీన్‌పట్నాయక్, షీలా దీక్షిత్‌లుకూడా వరసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా మోగించారు. మరి నరేంద్రమోడి ప్రత్యేకత ఏమిటి?
వెనకటివాళ్లు కుదురుగా రాష్ట్రాన్ని ఏలే ఉద్దేశంతో మూడో తూరి ఎన్నికలు గెలిచారు. మోడిగారు రాష్ట్రాన్ని ఒగ్గేసి దేశానికి ప్రధాని కావాలని ఆశించే రాష్ట్ర ఎన్నికల బరిలోకి దిగాడు. దిగడమే కాదు... మొత్తం మీద బ్రహ్మాండంగానే నెగ్గాడు. దాంతో మా చెడ్డ చిక్కు వచ్చి పడింది.
ఎగస్పార్టీ వాళ్లకా? కాదు. సొంతపార్టీ పెద్ద ఘటాలకే!
తమది ‘తేడాగల పార్టీ’ అని గర్వంగా చెప్పుకునే భా.జ.పా.లో ఎక్కడెక్కడి కాడరుకూ మోడి దిగ్విజయంతో ప్రాణాలు లేచొచ్చాయి. పార్టీని నడిపిస్తారనుకోబడే లీడర్లకేమో ప్రాణాలు కడబట్టాయి.
భాజపా అండ్ కో రాజ్యాధికారం కోల్పోయి ఇది తొమ్మిదో ఏడు. మధ్యలో వచ్చిన జనరల్ ఎలక్షన్లలో మరోసారి మాడు పగిలిందేతప్ప వారిపట్ల జనం ‘మూడు’ మారలేదు. ఇంకో ఏణ్నర్థంలో రాక మానని ఎన్నికల్లోనూ పరువు నిలిచి పవరు దక్కే ఆశలేదు. ఎలాగైనా గెలిచితీరాలన్న దమ్ముగాని, గెలవగలమన్న ధీమాగాని నేతాశ్రీలకు సున్న.
2014లో మేమూ గెలవం; కాంగ్రెసూ గెలవదు; గుర్తు తెలియని మూడోపక్షం వారెవరో అధికారం అందుకుంటారు అని ముసలి అద్వానీ చాలా రోజుల కిందటే కాలజ్ఞానం ప్రకటించాడు. తొంభయ్యోపడి దగ్గరపడ్డా ఆశ చావని తనకు ఎలాగూ అందని కిరీటం పార్టీలో ఇంకెవరికీ దక్కరాదన్న అక్కసుతోనే పెద్దాయన ‘్భవిష్యవాణి’ని వినిపించి ఉండవచ్చు.
కాని- ముది మదితప్పిన అలాంటి ముదుసళ్లతో ఉట్టికట్టుకు ఊరేగటానికి పార్టీ కార్యకర్తలూ, బిజెపిని అభిమానించే హిందూవాదులూ సిద్ధంగా లేరు. మన్‌మోహన్ సర్కారు పీకలదాకా అవినీతి రొంపిలో కూరుకుపోయి, తన అసమర్థతను, అయోగ్యతను ఎన్ని విధాలా నిరూపించుకుంటున్నా... ప్రత్యామ్నాయంపై ప్రజలను దృష్టి సారించనివ్వకుండా తన అసమర్థతను, అయోగ్యతను కాంగ్రెస్‌తో వేయి విధాలా పోటీలుపడి వేనోళ్ల చాటుకుంటున్న బిజెపి ఇప్పుడున్న స్థితిలో భవిష్యత్తుగురించి హిందూ పరివారంలో ఎవరికీ భ్రమలు లేవు. దమ్మున్న నాయకుడిగా ఉన్నంతలో నదురుగా కనిపిస్తున్న నరేంద్రమోడి వస్తే పరిస్థితి మారి దశ తిరగవచ్చని హిందూ స్కంధావారంలో అత్యధిక సంఖ్యాకులకు గంపెడాశ. ఎటొచ్చీ- పార్టీకి దశ తిరుగుతుందా లేక తమ కథ అడ్డం తిరుగుతుందా అనే పెద్ద కమలాలకు గొప్ప డౌటు.
దానికీ కారణం లేకపోలేదు. మోడీ అనేవాడు గండరగండడు. అతడు కోరినట్టు ఇతరులు నడవాల్సిందే తప్ప మిగతావారి ఇష్టాన్నిబట్టి తన పద్ధతిని మార్చుకోడు. అతడు పట్టిన కుందేటికి మూడేకాళ్లు. ఆ సంగతి పార్టీపెద్దల మెడలు వంచి, తనకు గిట్టని సంజయ్‌జోషికి జాతీయ కార్యవర్గం సహా పార్టీలోని పదవులన్నింటినీ పంతంపట్టి ఊడగొట్టించినప్పుడే అర్థమైంది. ఒకప్పుడు ప్రాణమిత్రుడైన సంజయ్ జోషితో వ్యవహారం చెడ్డాక, బూతు సి.డి.ని బనాయించి బద్నామ్ చేయించింది నరేంద్రుల వారేనన్న అనుమానాలున్నాయి. పార్టీ బాసు నితిన్ గడ్కరీని గోల్‌మాల్ కేసుల్లో ఇరికించటం వెనక మోడీ హస్తం ఉన్నదని ఎం.జి.వైద్య అంతటి ఆరెస్సెస్ పెద్దాయనే ఆ మధ్య బహిరంగంగా బ్లాగాడు. గుజరాత్‌కు పరిమితమై ఉండగానే అంతలా తడాఖా చూపించిన సజ్జనుడు ఏకంగా ఢిల్లీకే పీఠంమార్చి, మొత్తం పార్టీకి ఏడుగడ అయి కూచుంటే తనకు సరిపడని వారికి ఇంకెన్ని చుక్కలు చూపిస్తాడోనని హిట్‌లిస్టులో ఉంటామనుకునేవారికి గుండెదడ. కాని- ఆ సంగతి ఎవరూ బాహాటంగా చెప్పరు. ఎందుకంటే లాబీయింగులు నడపగలరు, ముఠాలు కట్టగలరు, చెవులు కొరకగలరు, చాటున మంత్రాంగం చేయగలరే తప్ప వారిలో ఏ ఒక్కరూ ప్రజాబలంలో, జనాకర్షణశక్తిలో మోడీ ముందు నిలవలేరు.
సమర్థుడైన పరిపాలకుడిగా, అభివృద్ధి దార్శనికుడిగా అవినీతి అంటని ఆదర్శవాదిగా పేరు తెచ్చుకుని ప్రధాని కాదగినవాడని బిజెపికి, హిందుత్వానికి సంబంధించని వారికి కూడా నమ్మకం కలిగించగలిగిన నరేంద్రమోడిని నెత్తికెత్తుకోవడంవల్ల కలిగే లాభం ఎక్కువా? ముస్లింలను ద్వేషించే హిందూ మతోన్మాదిగా, గోధ్రా అనంతర మత కల్లోలంలో వందల ప్రాణాలు బలిగొన్న రాక్షసుడిగా ఒక వర్గం మేధావులు, మీడియా చెరగని ముద్రవేసిన మోడిని ముందు నిలపటంవల్ల వాటిల్లే నష్టం ఎక్కువా? మోడిమీద అభిమానంతో హిందూవాదులు అతడి వెనుక సంఘటితం కావటంవల్ల మెజారిటీ ఓటు బ్యాంకును పట్టుకుని జాక్‌పాటు కొడతామా? దేశంలో మోడిని ద్వేషించే పార్టీలు, వర్గాలు, వ్యక్తులు, సంస్థలు అతడికి వ్యతిరేకంగా మోహరించటంవల్ల, సొంత పార్టీలోనే అతడిని అనుమానించే పలుకుబడిగల వర్గాల సహాయనిరాకరణవల్ల ఉన్న బలం ఊడ్చుకుపోతుందా? జిన్నా గోరీకిమొక్కి ముస్లింల మెహర్బానీకోసం అద్వానీ ఇత్యాదులు పడిన కష్టమంతా మోడీదెబ్బకి వ్యర్థమవుతుందా? మహాసౌమ్యుడు వాజపేయ సారథ్యంలోనే లోక్‌సభలో బి.జె.పి బలం ఏనాడూ రెండు నూర్లకు చేరక మిత్ర నక్షత్రకులతో నానాయాతన పడ్డ ఎన్.డి.ఏ.కి కరకు తీవ్రవాదిగా ముద్రపడ్డ మోడి నాయకుడైతే సంకీర్ణం కలిసొచ్చేనా... అనేవి కమలం కాంపును సతాయిస్తున్న శంకలు.
తమాషా ఏమిటంటే... మోడీ మహావీరుడని హిందూవాదులూ, మహాక్రూరుడని వేరేవర్గాలూ చొక్కాలు చించుకుంటూ ఎంత హోరాహోరీగా వాదులాడుతున్నా నిజానికి నరేంద్రమోడీ ఇందులో ఏదీ కాడు. 2002 అల్లర్లదరిమిలా అతడినో హిందూ జిహాదీలా సోకాల్డ్ సెక్యులర్ మేధావి వర్గాలు, మీడియా విరగబడి చిత్రించిన మాట యథార్థం. కాని గోధ్రా తరవాత ఈ పదేళ్ళలో హిందూత్వానికి, హిందువుల హక్కులకు సంబంధించి, మత పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా వారు పడుతున్న అగచాట్లు, చవిచూస్తున్న వివక్షకు సంబంధించి, నరేంద్రమోడి దృఢంగా స్ఫుటంగా గళమెత్తి తీవ్రంగా పోరాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి అంటే బుర్రగోక్కోవలసిందే. సమర్ధపాలకుడు మాత్రమే కాదు... మోడీ వాస్తవానికి వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు ఆప్తుడు.... పెట్టుబడిదారులకు ప్రియమిత్రుడు కూడా. కాబట్టే అమెరికాకూ, అమెరికన్ మీడియాకూ మోడీ ఈ మధ్య తెగ ముద్దొచ్చేస్తున్నాడు. అన్నట్టు- 2014లో ప్రధాని పోస్టుకు పోటీదారు మోడీయేనని మొట్టమొదట కనిపెట్టిందికూడా అమెరికా ప్రభుత్వపు థింక్‌టాంకే!
 

 
 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech