ముఖపత్రం    
  వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 13

సంస్కృతాంధ్రాలో గరుడ పురాణము : కొన్ని కొత్త వెలుగులు

 

 పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

 

         

చిరంతనమైన భారతీయగవేషణకు స్వతఃస్రోతోరూపమైనది పురాణం. మానవాస్తిత్వపు బహుపురాతనయుగాల ప్రాక్చారిత్రిక విశ్వేతిహాసాన్ని అంతఃప్రేరణతో అన్వీక్షించిన మహానుభావుల అనుభవసారం ఆ విశాల వాక్ క్రతుకలాపంలో కథితకథంతగా వెలసి విలసిల్లింది. ఐహిక దృష్టిసీమతో జీవపరిణామాన్ని పరిశీలించి, నాగరికతా సంస్కృతుల క్రమికవికాసాన్ని శ్రుతిస్ఫోటవైఖరిగా దైవీకరించి, వేదోపబృంహితమైన తత్త్వాన్ని వర్ణాశ్రమనిరపేక్షంగా సామాన్యుని చెంతకు అభ్యుపగమింపజేసిన వాఙ్మయరాశి పురాణం. మానవుని బుద్ధిమత్తకు, చరాచరసమస్తజీవజాలంలో అతనికి గల ప్రాగ్రియతకు, శీలౌన్నత్యంతో అతడు సాధింపదగిన పరమోన్నతస్థితికీ నైజ వజ్రసూచిక పురాణం. ఆస్తికులు జీవవిచారం, బ్రహ్మవిచారం, ఆత్మవిచారం చేయగోరితే పురాణరాశిని మించిన ఆశ్రయార్థం మఱొకటి లేదు. ఆస్తిక్యభావన లేనివారికి సైతం చరిత్ర పునాదిపై వెలసి పురావృత్త కతా విశేషాలుగా రూపొందిన ఉదంతాల అంతరార్థాన్ని తెలుసుకొనగోరితే – బహుముఖీన పురాణోదితమే అందుకు ఆశ్రయణీయం. ఇంద్రియానుభవం చేత బోధగమ్యమైనది మాత్రమే వాస్తవమని, ఇంద్రీయాతీతమై పరా విషయకమైన (trans-subjective) ప్రతి ఆదర్శమూ అవాస్తవమని నమ్మే భౌతికవాదులు సైతం ప్రకృతిశక్తుల నుంచి బాహిరిల్లిన ఈ జగత్తులో సర్వం విషయసాపేకాశం కాదని; ఆధ్యాత్మిక సత్యాల మూలాన సంకేతింపబడుతున్న పారమార్థికత కేవలానుభవనీయమని ఈ విదిత వేద్యాంశసారంగా గుర్తింపగలుగుతారు. ఏతత్సాధననిమిత్తమైన సామగ్రి – పురాణవాఙ్మయం.

        గరుడ పురాణం ఒక్క ముఖంనుంచి – ఏకముఖవినిస్స్రుతంగా వెలువడిన రచన కాదు. వక్తృభేదం విషయభిన్నతకు, గ్రంథవిస్తృతికి కారణమై ఉండవచ్చును. మోహానిర్వంచితురాలైన తల్లిని నాగదాస్యం నుంచి విడిపించిన మాతృవిధేయుని చూసి ముగ్ధుడై శ్రీమహావిష్ణువు ఆయనను తనకు వాహనంగా చేసుకొని అమృతత్వాన్ని ప్రసాదిస్తాడు. తన లీలాకృత్యాలను, మహిమాయతనాన్ని అర్థం చేసుకోవటానికి అనువైన గాథాప్రబంధాన్ని చెప్పమని ఆదేశిస్తాడు. “తవ నామ్నా లోకే ఖ్యాతిం గమిష్యతి” అని గరుడునికి వక్తృత్వగౌరవాన్ని ప్రకల్పిస్తాడు. గరుత్మన్ముఖాన రుద్రుడు, ఆయన నుండి నారదుడు, తన్మూలాన వ్యాసుడు, వ్యాసముఖాన సూతుడు, ఆయన ద్వారా నైమిశారణ్యంళో శౌనకాది ఋషులు – ఇదీ శ్రోతృభూమిక. ఆ విధంగా “గారుడోక్తం గారుడం హి” – గరుడుడు మొదలుపెట్టగా,ఇతి సూతముఖోదీర్ణం సర్వశాస్త్రార్థమణ్డనీం, వైష్ణవీం వాక్సుధాం పీత్వా” అందరూ తృప్తులై కర్తవ్యోన్ముఖులౌతారు.  

        అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం కొంత చిన్నది. విష్ణు భాగవత నారదీయ పాద్మ వారాహాదుల వలె సాత్త్వికలక్షణోపేతం. వైష్ణవధర్మప్రతిబోధక మైనప్పటికీ ఇందులో అన్యదేవతానిర్వాదం ఏ కోశాన లేదు. అపరకర్మాచరణంలోని అంతరార్థాన్ని ఇంత సిద్ధాంతశిరోమణిగా కరతలామలకం చేసిన గ్రంథదీపిక భారతీయవాఙ్మయంలో మఱొకటి లేదు. తక్కిన పురాణాలతో పోలిస్తే, కొంత అద్వైతశాస్త్రం పట్ల మొగ్గు కనబడుతుంది. అయితే, తర్కకర్కశమైన సారవిచారాని కంటె స్నిగ్ధసుభగమైన సుహృద్భావం ఇందులో ఉన్నది. అందుకే కాబోలు, పద్మ పురాణం,మజ్జా తు గారుడం ప్రోక్తం – ఏవమేవాభవద్విష్ణుః పురాణావయవో హరిః” అని నిర్దేశించింది. పౌరాణికోదితంలోని ఆంతరంగికస్నిగ్ధతే ఇందుకు కారణం.  

 

ముద్రణీయ పాఠ్యాంశవివేకం

          తక్కిన పురాణాల వలెనే గరుడ పురాణాన్నీ పరిష్కరించటం పెద్ద సమస్యే. ముద్రితప్రతులు ఈ సమస్యను మఱింత క్లేశకరం కావించాయి. గ్రంథాలయాలలో రసికమోహన చట్టోపాధ్యాయ (1885), జీవానంద విద్యాసాగర (1890), పంచానన తర్కరత్న (1890) ముద్రితాలు లభిస్తున్నాయి. 1908లో మన్మథనాథ దత్తు గారి ఆంగ్లానువాదం దీని ప్రాచుర్యానికి దోహదం చేసినా, పరిష్కరణ సమస్యను పరిష్కరించలేకపోయింది. 1906లో బొంబాయినుంచి వేంకటేశ్వర స్టీమ్ ప్రెస్సు వారి గొలుసుకట్టు గుజిలీ ప్రతి వెలువడింది. గత శతాబ్దిలో లాహోరునుంచి వెలువడిన లితోగ్రాఫు ప్రతిని 1968లో చౌఖాంబా వారు పునర్ముద్రించారు. 1963లో రామతేజ పాండేయ, 1964లో రామశంకర భట్టాచార్యలు వేర్వేఱుగా కాశీనుంచి వెలువరించిన ప్రతులే ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. సుప్రసిద్ధమైన “పురాణ” సంస్థ వారు కాశీనుంచి ప్రకటించిన సుపరిష్కృత సానువాద గరుడ పురాణం ప్రతులు 1960లలో ప్రచారంలో ఉండి, ఇప్పుడు దొరకటంలేదు. గోరఖ్ పూరులోని గీతా ప్రెస్సు వారిది హిందీ తాత్పర్యసమేతం ఒకటున్నది. దాక్షిణాత్యప్రతులతో వీటికి సంవాదం లేదు.   

          మొత్తం మీద, చౌఖాంబా వారివి, వంగదేశపువి ఔత్తరాహ శాఖ ప్రతులు. వేంకటేశ్వర ప్రెస్సు వారి ప్రతి దాక్షిణాత్య శాఖకు సన్నిహితం. పూర్వార్ధంలో కొంత పోలిక ఉన్నా, ఉత్తర ఖండంలో (బ్రహ్మఖండంలో మఱీను) పాఠభేదాలు చాలా ఎక్కువ. కేరళదేశపు ప్రతులలో అధ్యాయ సంఖ్య అధికంగా ఉన్నది. 1883లో దొరైసామి మూప్పనార్ తమిళ అనువాదసమేతంగా అచ్చువేసిన సంస్కృత మూలం తమిళదేశంలో అచ్చయిన ప్రతులన్నింటికీ ఆధారం. తెలుగు లిపిలో ముద్రింపబడిన ప్రతులు 1880 నుంచి లఘుతాత్పర్యమేతంగా లభిస్తున్నాయి. కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారు పరిష్కరించిన పాఠం వీటన్నిటిలో మేల్తరమైనది. వీరి పాఠంలో – ఆంధ్రత్వాభిమానం వల్ల కాబోలును, వేరెక్కడా లేని తిరుమల క్షేత్రవర్ణనం, ద్వైతులకు అభిమానపాత్రమైన “అచిన్త్యవీర్యై ర్ద్విరూపః” వంటి శ్లోకాల అధికపాఠాలు బ్రహ్మఖండంలో ఉన్నాయి. విష్ణుధర్మోత్తర పురాణం, రామాయణం, మహాభారతములలోని శ్లోకాలు కొన్ని వీరి పాఠంలోకి వచ్చి చేరాయి.     

గరుడ పురాణం దేశమంతటా ప్రశస్తికెక్కి ధర్మశాస్త్రవేత్తలు సంప్రతించి తీరవలసిన ప్రామాణికగ్రంథంగా రూఢికెక్కిన తర్వాత శ్రుతి స్మృతి పురాణాలలోని అనేక భాగాలు ఇందులోకి ప్రవేశించాయి. ఈ హేతూద్ధారం వల్లనే గరుడ పురాణం తుదిరూపు క్రీస్తుశకం తొమ్మిదవ శతాబ్ది నాటికి ఒక తీరుకు వచ్చి ఉండాలని పురాణవాఙ్మయంపై విశేషకృషి చేసిన డా. ఆర్. సి. హజ్రా భావించారు. ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే, యాజ్ఞవల్క్య స్మృతిలోని ఆచార, బ్రహ్మచారి ప్రకరణాల నుంచి; వివాహ వర్ణ జాతి వివేకా గృహస్థధర్మ స్నాతకధర్మ భక్ష్యాభక్ష్య ద్రవ్య శ్రాద్ధ గణపతికల్ప గృహశాంతి ప్రాయశ్చిత్త వానప్రస్థధర్మ యతిధర్మ అశౌచ ఆపద్ధర్మ-కర్మ ప్రకరణాల నుంచి వందలకొద్దీ శ్లోకాలు, శ్లోకభాగాలు గరుడ పురాణం లోనికి వచ్చి చేరాయి. గదాధర రాజగురుని గదాధర పద్ధతి, హేమాద్రి చతుర్వర్గచింతామణి, గోవిందానందుని వర్షక్రియాకౌముది, ఆయనదే శ్రాద్ధక్రియాకౌముది, రఘునందనుని స్మృతితత్త్వం, కమలాకరభట్టు నిర్ణయసింధువు, రూపగోస్వామి హరిభక్తిరసామృతసింధువు, హరి భాస్కరుని పద్యామృత తరంగిణి, భోజరాజు యుక్తికల్పతరువు మొదలైన ప్రామాణికగ్రంథాలలో సందర్భవశాన గరుడ పురాణం నుంచి ఉదాహరింపబడిన భాగాలన్నీ కొంచెం ఇంచుమించుగా ముద్రితప్రతులలో కనబడుతున్నాయి. వీటి తులనాత్మక పర్యాలోకనం ఉభయకుశలోపరిగా పరిణమిస్తుంది. వ్యాసవిస్తరభీతి వల్ల ఆ శ్లోకాలన్నింటిని ఇక్కడ ఉదాహరింపలేకపోతున్నాను. గదాధర రాజగురుని గదాధర పద్ధతి లోనిదే కాలసారం, హేమాద్రి చతుర్వర్గచింతామణిలోని “ఇతి గరుడః పురాణోక్తః సువర్ణ వృషదానవిధిః,ఇతి మృత్యుంజయ మంత్రన్యాసః,ఇతి గరుడపురాణోక్త మాయుర్వ్రతమ్” వంటి పెక్కు భాగాలు,కాంచన పరీవ్రతం” వంటి విధుల విపులోదాహరణలు ముద్రిత గరుడ పురాణం ప్రతులలో లేవు. విశ్వాసదేవి గంగా వాక్యావళి, మదనపాలుని మదన పారిజాతం, ఆనందతీర్థుల వారి బ్రహ్మసూత్రభాష్యం మొదలైన ఉద్గ్రంథాలలో “ఉక్తం చ గారుడే” అని ప్రస్తుతీకరింపబడిన శ్లోకాలు; మధ్వాచార్యుల భాగవత తాత్పర్యనిర్ణయం, మధుసూదన సరస్వతి సర్వదర్శనసంగ్రహ వ్యాఖ్య, బ్రహ్మానందయోగి హఠయోగప్రదీపికపై లభిస్తున్న సుప్రసిద్ధమైన జ్యోత్స్నావ్యాఖ్యలలో “గరుడ పురాణములోనివి” అని ప్రసక్తింపబడిన పాఠాలు, శ్లోకాలు ప్రస్తుతం ఉపలభ్యమైన గరుడ పురాణం లో లేవు. ఋగ్యజుస్సామాథర్వవేదాలు, వాజనేసయీ సంహిత, తైత్తిరీయ సంహిత, మైత్రాయణీ సంహిత, కాఠక సంహిత, ఆరణ్యక సంహిత మొదలైన సంహితలలోని మంత్రభాగాలు అనేకం గరుడ పురాణంలోకి తత్తత్ప్రసంగవశాన చేరి, అందులో ఇమిడిపోయాయి.

        గరుడ పురాణం లోని పూర్వఖండమంతా వివిధ వక్తృ-శ్రోతృసంవాదాత్మకం. విషయబాహుళ్యం వల్ల అడిగేవారూ, చెప్పేవారూ కూడా ఎక్కువయ్యారు. శాస్త్రచర్చలు వచ్చినప్పుడు ఆయా శాస్త్రాల అధిష్ఠానదైవతాలే ప్రసంగకర్తలు. అందువల్ల ఈ ఖండానికి చెప్పలేనంత గుర్తింపు, గౌరవం సిద్ధించాయి.

        ఉత్తరాఖండం ప్రధానంగా శ్రీకృష్ణ గరుత్మత్సంవాదాత్మకం. 1840లో విష్ణుపురాణం స్వీయానువాదానికి పీఠికను వ్రాస్తూ హోరేస్ విల్సన్ పండితుడు బ్రహ్మేంద్ర సంవాదాత్మకమైన వేఱొక గరుడ పురాణం ఉత్తర ఖండం ప్రతి ఏడువేల శ్లోకాలలో లండనులోని ఇండియా ఆఫీసు వారి సంస్కృత లిఖితప్రతుల సంచయంలో ఉన్నదని అన్నాడు. అందువల్ల గరుడ పురాణం ఒకదానికొకటి పొంతనలేని రెండు వేఱ్వేఱు పాఠాలలో ఉన్నదేమోనని అనుమానించాడు.

        నేను ప్రధానంగా సంప్రతించిన 1963 నాటి రామతేజ పాండేయ గారి గరుడ పురాణం ప్రతిలో 229 అధ్యాయాలతో పూర్వఖండంలో 6983 శ్లోకాలు; 35 అధ్యాయాలతో ఉత్తరఖండంలో 1319 శ్లోకాలు – మొత్తం 8302 శ్లోకాలున్నాయి. జాగ్రత్తగా లెక్కించి చూస్తే, తక్కిన ఏ రెండు ప్రతులలోని పూర్ణపాఠం సమరూపాన లేదు. ఏ రెండు ప్రతులలోని శ్లోకసంఖ్య ఒక్క తీరున లేదు.

        ఈ సమస్య ఈ నాటిది మాత్రమే కాదు. వాయు పురాణం

        “యథా చ గారుడే కల్పే వినతా గరుడోద్భవం,

        అధికృత్యాబ్రవీ ద్విష్ణు ర్గారుడం త ది హోచ్యతే.

        త దష్టాదశ చైకం చ సహస్రాణి పాపఠ్యతే.”

        అన్నది. ఇది ఈనాడు వేర్వేఱుగా ఉన్న రూపాలన్నింటిని సమీకరించికొన్న ఒకప్పటి బృహద్గ్రంథమై ఉంటుంది.

        గరుడ పురాణం కాశీ ప్రతిలో

        “అష్టాదశసహస్రాణి తథా చాష్టౌ శతాని చ,

        పురాణం గారుడం వ్యాసం పురాసౌ మాబ్రవీదిదమ్”

        అని కనబడుతుంది. ఆ లెక్కన అందులో ఐదు వందల శ్లోకాలు లేవన్న మాట.

        గరుడ పురాణం సుపరిష్కృతంగా వెలువడవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పడానికే ఈ వివరణను కూర్పవలసి వచ్చింది.

        మన సంస్కృతికి, కర్మాచరణకు, కృత్యాకృత్యవివేకానికి మూలకందమైన గ్రంథాన్నే సక్రమంగా అచ్చువేసుకోలేని దుఃస్థితిలో మనమున్నామా?

 

ఆంధ్రాదర్శాల సంక్షేపాదర్శం

       గరుడ పురాణం మూలపాఠంలో లేకపోయినా,గరుడ పురాణాంతర్గతము” లని సమస్తభిన్నాలుగా లభిస్తున్న విశేషాధ్యాయా లనేకం ఉన్నాయి. గరుడ పురాణంలో ఉన్నప్పటికీ, ప్రత్యేకగ్రంథాలుగా ముద్రితప్రకాశితా లైన భాగాలూ లేకపోలేదు. చౌఖాంబా వారి గరుడ పురాణం 63 – 65 అధ్యాయాలలోని 144 శ్లోకాల సంకలనమే విడిగా స్త్రీ లక్షణాధ్యాయం అన్న సాముద్రికశాస్త్రగ్రంథంగా అచ్చయింది. 146 – 201 అధ్యాయాలలోని ఆయుర్వేదభాగమే వైద్యక శాస్త్రము అన్న పేరిట విడిగా ముద్రితమైంది. ఇటువంటివి ఇంకా కొన్ని ఉన్నాయి.

        కాగా, గరుడ పురాణంలోని భాగాలుగా చెప్పబడుతూ, నిజానికి గరుడ పురాణంలో లేని రచనలు కూడా అనేకం కనబడుతున్నాయి. వీటిలో చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో తెలుగు లిపిలో ఉన్న గరుడ ద్వాదశ నామస్తోత్రం (D. 8822), గోవింద ద్వాదశీ వ్రతకల్పం (D. 17764), బ్రహ్మ-నారద సంవాదాత్మకమైన తులసీ వ్రతకల్పం (D. 8312), లక్షతులసీ వ్రతోద్యాపనం (D. 8441) వంటి విశిష్టకృతులు తెలుగు దేశంలోనే పురుడుపోసుకొన్నాయేమో చెప్పలేము. వీటిలో “గరుడ పురాణాంతర్గతము” అని ఉంటుంది కాని, ఈ కృతిభాగాలు గరుడ పురాణంలో లేవు. ఇంకా కారుణ్య స్తోత్రం, గీతా మాహాత్మ్యం, గోవిందరాజ స్తవం, జ్వరపారణ స్తోత్రం, పంచపర్వ మాహాత్మ్యం, ప్రైషాధ్యాయం, శతాపరాధ ప్రాయశ్చిత్తం, సూర్యస్తవకల్పం వంటి కృతులలో అవి “గరుడ పురాణాంతర్గతము” లని ఉంటుంది కాని, ఆ కృతిభాగాలు గరుడ పురాణంలో లేవు. అలాగే గండకీ మాహాత్మ్యం, తులసీ వ్రతకల్పం, ప్రేతమంజరి, శ్రీముష్ణక్షేత్ర మాహాత్మ్యం వంటివి “గరుడ పురాణాంతర్గతము” లన్న పేరుతో తెలుగులోకీ వచ్చాయి కాని, అవి గరుడ పురాణంలోనివి కావు. సుందరపుర మాహాత్మ్యము అన్న పేరుతో ఒక నందికేశ్వర సనత్కుమార సంవాదం “గరుడ పురాణాంతర్గతము” అని తమిళానువాదంతో అచ్చయిన పాఠం గరుడ పురాణము లోనిది కాదు. కాగా, విష్ణు షోడశనామ స్తోత్రం, వేంకటేశ మాహాత్మ్యం, షడధ్యాయచ్ఛందస్సు వంటివి “గరుడ పురాణాంతర్గతము” లని కన్నడ లిపిలో కర్ణాటక గ్రంథభాండాగారాలలో లభిస్తున్నవి కొంత కొంతగా గరుడ పురాణం లోని భాగాలే.

        ఇకపోతే, భైరవకవి శ్రీరంగ మహత్త్వములోనూ, కట్టా వరదరాజు శ్రీరంగ మాహాత్మ్యములోనూ తమ కావ్యాలకు గరుడ పురాణం మూలమనే పేర్కొన్నారు. భైరవుడు –

        శా.    వ్యాసప్రోక్తమహాపురాణములు ముయ్యాఱింటి యందున్ జగ

                ద్వాసుం డైన రమామనోహరు మహత్త్వవ్యక్తిమూలంబు లై

                భాసిల్లుం దగి నాలు; గండును బహూపాఖ్యానవిఖ్యాతమై

                యా సౌపర్ణ పురాణ మొప్పు బహువేదాంతార్థగంభీరమై.

          అని గరుడ పురాణాన్ని ప్రశంసించి, శ్రీరంగ మహత్త్వం శ్రవణమంగళమైన పురాణసారమని అభివర్ణించాడు. భైరవుని కంటె వరదరాజు కొంత స్పష్టీకరించి, శ్రీరంగ మహత్త్వములో “ఆమ్నాయ చతుష్కసారము, సనాతన గారుడ సంహితా శతాధ్యాయి” అని తన మూలాన్ని వివరించాడు. ఆయన ఆస్థానంలోని బుధవర్గం కూడా,గారుడ పురాణము తెనుంగుగా రచింపు మను టితోధికకామితార్థవృద్ధి” హేతు వని ప్రోత్సహించారట. భైరవుడు శ్రీరంగ మాహాత్మ్యము అనువాదానికి, కట్టా వరదరాజు తన శ్రీరంగ మహత్త్వము అనువాదానికి ముందుంచుకొన్న మూలమైన ఆ “గరుడ పురాణాంతర్గతము గరుడ పురాణంలో లేకపోయినా, గరుడోపపురాణం అన్న పేరుతో ఇరవై ఉపాఖ్యానాలతో, 108 అధ్యాయాలతో పలుమార్లు అచ్చయి ప్రచారంలో ఉన్నది. శంకరకవి అమోఘమైన తన హరిశ్చంద్రోపాఖ్యానములో తాను చేస్తున్నది అనువాదమని కావ్యంలో ఎక్కడా చెప్పకపోయినా, ఆయన రచనకు ఆధారకల్పమైన సంస్కృత హరిశ్చంద్రోపాఖ్యానంలో అది “గరుడ పురాణాంతర్గత” మని ఉన్నది. క్రీస్తుశకం 1706 – 32 సంవత్సరాల నడుమ విజయరంగ చొక్కనాథుడు వచనంగా తెలిగించిన శ్రీరంగ మాహాత్మ్యం యొక్క మూలం బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ప్రౌఢకవి మల్లన తన రుక్మాంగద చరిత్రముబ్రహ్మాండ పురాణాంతర్గతము” అని చెప్పాడు కాని, బ్రహ్మాండ పురాణంలోని రుక్మాంగద చరిత్ర మల్లన రచనకు మూలం కాదు. ఆయన రచనకు మూలమైన భాగం ఏకాదశీ మాహాత్మ్యము అన్న పేరుతో సంస్కృతంలో ఉన్నది. మల్లన దానినే “బ్రహ్మాండ పురాణాంతర్గతము” అని పొరబడి ఉండవచ్చును. ఆ ఏకాదశీ మాహాత్మ్యము వ్రాతప్రతిలో అది “తార్క్ష్య పురాణాంతర్గతము” అని ఉన్నది. తార్క్ష్య పురాణము అన్న పేరిట అచ్చయి ప్రస్తుతం దొరుకుతున్న ఉపపురాణం ప్రతిలో ఉన్న ఏకాదశీ మాహాత్మ్య కథ మల్లన చిత్రణకు మూలం కాదు. తెలుగు సాహిత్య చరిత్రకు ఉపయుక్తం కాగల ఎంతో విలువైన ఈ ఏకాదశీ మాహాత్మ్యము యొక్క ఒకే ఒక్క వ్రాతప్రతి బికనీరులోని ప్రభుత్వ ప్రజాగ్రంథాలయంలో ఉన్నదని వారి వర్ణనాత్మక సూచి (సం. V 85/1) లోని ఉదాహృతభాగాన్ని బట్టి గుర్తింపగలిగాను. దానిని పరిష్కరించి ముద్రింపగలిగితే ప్రౌఢకవి మల్లన కృతివిశేషాలు తెలుస్తాయి. గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణము, తార్క్ష్య పురాణములలో ఉన్న సామ్యభేదాలు వెల్లడవుతాయి.

        ఇవన్నీ గరుడ పురాణములోని భాగాలుగా చెప్పబడి, నేడు మనకు ఉపలబ్ధమైన గరుడ పురాణంలో లేని కథాంశాలు.

        మడికి సింగన తన సకలనీతిసమ్మతములో ఉదాహరించిన రుద్రదేవుని “నీతిసారము”నకు మూలమైన సంస్కృత నీతిసారం ప్రతి ఒకటి కలకత్తాలోని విశ్వభారతీ లిఖిత పుస్తక భాండాగారం వారి సంచయంలో (సంఖ్య: 892) ఉన్నది. ఇది సుప్రసిద్ధమైన  శుక్రనీతిసారము, చాణక్య నీతిసారముల కంటె వేఱైన గ్రంథం. దీని అవతరణికలో ఇది గరుడ పురాణం లోనిదని ఉన్నది.

        తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంస్కృతంలో “గరుడ పురాణాంతర్గత”మైన వేంకటాచల మాహాత్మ్యమును అచ్చువేశారు. దానికి మూలమైన వ్రాతప్రతి ఎక్కడిదో వారందులో పేర్కొనలేదు. ఉత్తదేశంలో అచ్చయిన గరుడ పురాణంలో ఆ భాగం లేదు. వేంకటేశ్వర ప్రెస్సు వారు అచ్చువేసిన ప్రతిలో కొంత దానిని సరిపోలిన ఖండం ఉన్నది.

        తెలుగు సాహిత్య చరిత్రకారులు గుర్తింపని మఱొక విశేషం: శ్రీరంగ మహత్త్వమును రచించిన భైరవుని కృత్యంతరమైన రత్న పరీక్ష కూడా గరుడ పురాణాంతర్గతమే. భైరవుడు అందులో

        “.. మున్ను మునీంద్రుల కగస్త్యముని చెప్పిన యా

        సన్నుత మణి లక్షణములు

        చెన్నుగ గ్రోడీకరించి చెప్పెద దెలియన్.”

        అని తన కృతి అగస్త్యమతానికి అనుగుణమని చెప్పాడు కాని, నిజానికి ఆయన అనుసరించినది గరుడ పురాణములోని రత్నపరీక్షాధ్యాయాన్నే. వారణాసిలో అచ్చయిన గరుడ పురాణంలోని 68 నుండి 80 వఱకు ఉన్న పదమూడు అధ్యాయాలలోని భాగం భైరవుని రచనకు మూలం. మూలంతో సరిపోలిస్తే తెలుగులో అచ్చయిన రత్న పరీక్ష ఎంత దురుద్ధరావస్థలో ఉన్నదో తెలుస్తుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇందులోని పదాలనే అర్థనిర్ణయానికి ప్రమాణీకరించుకొంది.

        ఇంకొక వింత: భైరవుని మఱొక కృతి కవిగజాంకుశము కూడా గరుడ పురాణములోని షడధ్యాయీ చ్ఛందోగ్రంథాధారితమేనని తెలుగు సాహిత్య చరిత్రకారులు ఇంతవఱకు గుర్తింపలేదు. మొత్తం మీద తన కృతులన్నింటిని గరుడ పురాణం నుంచే ఏకాశ్రయంగా ఇతివృత్తాలను స్వీకరించిన విశిష్టత ఒక్క భైరవకవికే దక్కింది.

        పోతరాజు భైరవకవి రచించిన గరుడ పురాణం చంపువు ఇంతవఱకు లభింపలేదు.                     

        కాగా, గరుడ పురాణం ఆంధ్రీకర్తనని చెప్పుకొన్నా మఱొక మహాకవి పింగళి సూరన. ఆయన తన ప్రభావతీ ప్రద్యుమ్నము (1-6) లో –

        మ.   జనముల్ మెచ్చఁగ మున్ రచించితి నుదంచద్వైఖరిం గారుడం

                బును శ్రీ రాఘవపాందవీయముఁ గళాపూర్ణోదయంబున్ మఱిం

                దెనుఁగుం గబ్బము లెన్నియేనియును ... "

        అని తన తొలిరచన అయిన గరుడ పురాణమును తలచుకొన్నాడు.

        అయితే, కవితారచనకు శ్రీకారం చుట్టిన వెంటనే, శుభమా అని ఈ గరుడ పురాణం ఏమిటి? అని పెద్దలనుకోకపోరు.

        ఆంధ్రపత్రిక కాళయుక్తి సంవత్సరాది సంచికలో పిఠాపుర సంస్థానాస్థానవిద్వాంసులు వేంకట రామకృష్ణకవులు “ఆంధ్రకవుల అపరాధములు” అనే కవితలో ఈ విధంగా నవ్వుకొన్నారు:

        గీ.     శ్లేషకావ్యంబుఁ జేసి విశేషయశముఁ

                గనిన పింగళి సూరన గడుసువాఁడె!

                కాని, ‘శుభమస్తని యదేమి - గారుడంబుఁ

                దెలుఁగుఁ జేసినవాఁడు వైదికుని పగిది.

        అని. అంతే కాదు, గరుడ పురాణం అనగానే, అదేదో ప్రేతకల్పమో, శ్రాద్ధక్రియాకలాపమో అనుకోనవసరం లేదు. పైని పేర్కొన్న కవులందరి వలెనే పింగళి సూరన గరుడ పురాణం నుంచి కళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యుమ్నాది కావ్యాల వలె తన అద్భుతావహమైన కల్పనాశిల్పాని కనువైన కథాంశాన్ని గ్రహించి, స్వీయప్రతిభతో దానికి మెఱుగులు తీర్చి ఉంటాడని ఊహించాలి. లేకుంటే,గరుడపురాణాంతర్గతము” అని పేర్కొన్న ఏ స్వతంత్రరచననైనా తెలుగు చేశాడేమో చెప్పలేము.

        ఇవన్నీ ఆంధ్రకవుల ఆదర్శకల్పనలు.             

 

గరుడ పురాణ సాంగ్రహికం

        శ్రీవైష్ణవులలోనే గాక స్మార్తులలోనూ గరుత్మంతుని నిత్యారాధనం ఆచారవిహితమై ఉన్నది. మంత్రకల్పసూత్రాల న్యాస - నిగ్రహాదులతో పరిచయం ఉన్నవారు వనౌకస గరుడకవచం, గరుడ పంచాక్షరీ మంత్రం, గరుడ మంత్రం, గరుడ మాలామంత్రం, గరుడ విద్యామంత్రం, గరుత్మన్మాలా మంత్రం మొదలైనవాటి అనుష్ఠాన - సంప్రయోగాది విధులను గూర్చి వినే ఉంటారు. గరుడ పంచాక్షరీకల్పము,  గరుడమాలామంత్రకల్పములలో గరుడయంత్ర నిర్మాణం, దాని ఔపయోగికీ  విహితవిధులు చెప్పబడ్డాయి. గరుడ సంధ్యావందనం కావించి, గారుడ  బ్రహ్మవిద్యా మంత్రోపాసకు లైన ముముక్షువుల అంతర్యాగదీక్షానిమిత్తం ఋషిప్రోక్తమైన బ్రహ్మవిద్యామంత్రకల్పం, గరుడ గాయత్రీ మంత్రకల్పం, గారుడమంత్రోద్ధారం మొదలైన శిక్షాప్రణీతాలనేకం ఉన్నాయి. గరుత్మంతుని పన్నెండు నామమంత్రాలపై వెలసిన గరుత్మద్ద్వాదశనామస్తోత్రగ్రంథం ప్రభావం నలుగురికీ తెలిసినదే. వేదాంతదేశికుల వారి గరుడ పంచాశత్ స్తోత్రం మంత్రాక్షరప్రోక్తమని వ్యాఖ్యలో వాధూల రామానుజాచార్యుడు వేనోళ్ళ ప్రస్తుతించాడు. గరుడోపనిషన్మంత్రశీర్షములోని ఉపాసనవిధానం కేరళదేశంలో ఈనాటికీ ప్రచారంలో ఉన్నది. స్వాహాదేవి ఋషిపత్నుల రూపుదాల్చి అగ్నివీర్యాన్ని సుపర్ణీరూపంలో శరవణానికి మోసుకొనివెళ్ళినప్పటినుంచి అగ్న్యారాధనంలో గారుడీ నామసంకీర్తనం విహితమైనట్లు కనుపిస్తుంది. సంస్కృత మహాభారతం ఆదిపర్వంలో ఈ కథానకం ప్రసక్తమైంది. గరుత్మంతుడు తల్లిని నాగదాస్యం నుంచి విడిపించిన కథాసంవిధానమంతా ప్రకృతిశక్తుల లీలాఖేలనమని స్వసంకేతితంగా విమర్శకులు చెప్పే ప్రతీకార్థం ఒకటున్నది.

        ఈ కథలోని విశ్వాంతరీయదృక్కోణాన్ని దర్శించి మహాకవి ధూర్జటి దానిని తన కాళహస్తిమాహాత్మ్యములో చంద్రోదయవర్ణనకు పరికరింపజేసుకొన్నాడు.

మ.   గరుడానీతసుధాఘటంబుఁ గొనిపోఁగా, నిర్జరశ్రేణి వెం

        ట రయం బాఱఁగఁ బాఱు నాగముల చూడారత్నసందోహ మం

        బరవీథిం బరఁగింపఁ జంద్రుఁ దుదయింపం, దోఁచెఁ దోడ్తో నుడూ

        త్కరముం; జిం దమృతంపు బిందువుల శంకం గ్రమ్మఁగం జేయుచున్.

అని.

        గరుడ మంత్రానుష్ఠాతలు పాము విషాన్ని దించివేసే ప్రాణోపకారతంత్రం గరుడపురాణంలో ప్రసక్తమైనదే, ఐంద్రజాలికవిద్యలలో ఒకటిగా పరిగణింపబడినప్పటి నుంచి తెలుగులో "గారుడీ" శబ్దవైకౄతరూపం "గారడీ"గా వచ్చి చేరింది. ఆ శబ్దం కుదుటనే "గారడీఁడు", "గారడీవాఁడు" మొదలైన తత్కర్తృవాచకాలు; "గారడీ పిడత" వంటి తత్సాధనసామగ్రి, "గారడీ సంసారం", "గారడీ విద్య" వంటి పదబంధాలు ఏర్పడ్డాయి. నిత్యోపయుక్తమైన ఈ తంత్రం ప్రజాజీవనంలో గరుడునికి గల విశ్వాన్ని, ఆరాధితమూర్తిమత్త్వాన్ని పరిచయం చేస్తుంది.

        "గరుడ పురాణం" అన్న నామకరణంలోని గర్భితార్థప్రకాశనకు పురోవచనిక ఇది. అధర్వణవేదంలో వలె వైదికమంత్రపురస్కృతాలుగా కాక గరుడ పురాణంలో కేవలం ఔపయోగికీ లౌకికతంత్రాలు మాత్రమే ఉన్నాయి.

బహుముఖీన విద్యావైదగ్ధి

        పౌరాణిక పంచలక్షణీ విషయాన్ని ముక్తాముక్తంగా ముగించివేసి గరుడ పురాణం బహుముఖీన శాస్త్రవివరణలకే ప్రాధాన్యం ఇచ్చింది. దేవతలు, మహర్షులు, రాజుల జీవితకథాసన్నివేశాల కంటె ఇందులో విశ్వ విశ్వాంతరాళ విజ్ఞానశాస్త్రచర్చలకే ఎక్కువ ప్రాధాన్యం కనుపిస్తుంది. సత్త్రయాగదీక్షితులైన వైరాగ్యసంపన్నులు ముక్కుమూసుకొని ఏ భగవద్విషయాలను గుఱించో మాట్లాడుకోక ఆముష్మికానికి నిర్నిమిత్తాలైన ఆయుర్వేదం, వ్యాకరణం, రత్నపరీక్ష మొదలైన లౌకికతంత్రాలను గుఱించి మాట్లాడుకోవటం భావ్యంగా లేదని భావించేవారు ఆ మహాత్ముల విశాలమైన విజ్ఞానపరిధి ఎంతటిదో తెలియని అకృతకృత్యు లనుకోవాలి. ప్రతివిషయంలోనూ భగవద్భావనమే కలవారు కాబట్టి ఆ పుణ్యధనులు లౌకికతంత్రాల అధ్యయనను సైతం భగవత్సేవగా భావించి, ఆ అధ్యయనఫలాన్ని శ్రద్ధతో సమాజంలో అనువర్తించి, ఇహపరాలలో మానవాభ్యుదయానికి తోడ్పడాలని ప్రయత్నించారు. వారి సేవాఫలంగానే లోకంలో విజ్ఞానశాస్త్రాలన్నీ అభివృద్ధి చెందాయని గుర్తుంచుకోవాలి.

        గరుడ పురాణంలో చతుర్దశ భువనాలను, భూమిపై వెలసిన పర్వతసముద్రాలను, ద్వీపాలను వర్ణిస్తూ చెప్పబడిన భాగమంతా కేవలం భౌతికమైన వర్ణనమని పొరబడకూడదు. అది చరాచరప్రపంచంలోనూ ఉన్న పరమాత్మ ఒక్కడేనని వివరించటంకోసం విరాట్పురుష తత్త్వావధారణకు గాను ఉద్దేశించిన ఉపన్యాసమే గాని చారిత్రక సత్యకథనైకదీక్షితం కాదని గుర్తుంచుకోవాలి.

        గరుడ పురాణంలోని సర్గాది వైకారిక సృష్టిక్రమం నాలుగధ్యాయాల లఘువివరణం. ఆ తర్వాతి రెండు అధ్యాయాలలోని ప్రతిసర్గనిరూపణం దీనిలోని అంతర్భాగమే. ఇందులో 138 నుంచి 145 వరకు వంశ వంశానుచరితాల కథనం, మన్వంతరాదిక ప్రస్తావం మరీ కొద్ది వాక్యాలలో ముగిసింది. గ్రంథోద్దేశం నిజానికి చెప్పాలంటే క్షేత్రమాహాత్మ్యాలు, వ్రతకల్పాదుల వివరణం. పురాణము అనగానే కనబడే కథాదులకంటె ఇందులో జీవన చావుపుట్టుకల స్వరూపనిరూపణం, జాతాశౌచం మొదలు అంత్యక్రియల వరకు మానవులు స్వధర్మాచరణగా చేయవలసిన కర్మకాండ ముఖ్యంగా ప్రతిపాదింపబడ్డాయి.

        గరుడ పురాణంలోని విషయస్వరూపాన్ని బట్టి ఈ కృతిని రచించినప్పటి తొలిపాఠం క్రీస్తుపూర్వం నాటికే పూర్తయి, ఆ సంపూర్ణపాఠానికి అదనపు చేర్పులు, కూర్పులు, మార్పులు, తీర్పులు క్రీస్తుశకం తొమ్మిదవ శతాబ్ది వఱకు జరుగుతూ వచ్చాయని హజ్రా వంటి ప్రామాణిక విద్వాంసులు నిర్ణయించారు. గుప్తరాజుల కాలంలో పునారచితమైన పాఠంలో దీని స్థితి ఏ విధంగా ఉండినదో మనకిప్పుడు స్పష్టంగా తెలియటం లేదు. క్రీస్తుశకం 12-వ శతాబ్ది నాటి హలాయుధుడు తన బ్రాహ్మణ సర్వస్వములో ఉదాహరించే సరికి ఇది చివఱి తీర్పును పొందిందని విద్వాంసులు నిర్ణయించారు.

        గరుడ పురాణం పూర్వఖండంలోని 203-4 అధ్యాయాలలో అగ్ని పురాణంలో వలె వ్యాకరణకథనం ఉన్నది. “అతో వ్యాకరణం వక్ష్యే కుమారోక్తం చ శౌనక!” అని సూతుడంటాడు.  ఇది శర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణమునకు పరిచాయకం.ఇందులోని “కాత్యాయన సమాసతః” అన్న మాట పాణినీయానికి పూర్వపు వ్యాకరణాల పరిచితిని సూచిస్తున్నది. వంగదేశపు ప్రతులలో – మఱీ ముఖ్యంగా 207 నుంచి 212 వఱకు ఉన్న ఛందోలక్షణభాగం “షడధ్యాయం” అన్న పేరుతో విడిగానూ అచ్చయి దొరుకుతున్నది. ఈ భాగం ప్రారంభంలో “వాసుదేవం గురుం నత్వా గణం శమ్భుం సరస్వతీమ్” అని ఉన్నందువల్ల ఇదంతా కాలాంతరప్రక్షిప్తమే అనిపిస్తుంది. మొత్తం మీద పింగళుని ఛందోవిచితి, ఆ పింగళాచార్యుడో మఱొక పింగళుడో రచించిన స్వయంభూచ్ఛందస్సులకు పర్యాయరూపం ఇది. కొన్ని కొన్ని వృత్తాల పేర్లు ఇందులో ప్రసిద్ధమైన లక్షణానికి భిన్నంగా ఉండటానికి కారణం లక్షణవైవిధ్యమో, వ్రాతప్రతుల లోపమో చెప్పలేము. రామాయణ మహాభారత హరివంశ పురాణముల కథాశరీరం ఇందులోని 146-వ అధ్యాయం నుంచి 202 వఱకు వ్యాపించి ఉన్నది. ఆ తర్వాతి అధ్యాయం నుంచి 73 అధ్యాయాలలో ఉన్నది సమగ్రమైన ఆయుర్వేద సంహిత. ప్రొ. హీర్న్లే ఈ భాగం 9-వ శతాబ్ది నాటిదని అనుమానించారు. మన్మథనాథ దత్తు గారు 1908లో చేసిన తమ ఆంగ్లానువాదంలో ఈ భాగానికి “ధన్వంతరి సంహిత” అని పేరుపెట్టారు. అయితే, ఈ భాగంలో క్రీ.శ. 2-వ శతాబ్ది నాటి సుశ్రుత సంహిత నుంచి, అంతకు మునుపటి బౌద్ధుల ఆయుర్వేద గ్రంథాలనుంచి పరిగ్రహించిన భావాలున్నాయి. వేంకటేశ్వర ప్రెస్సు వారి గరుడ పురాణం ప్రతిలో దీని తర్వాత రెండు అధ్యాయాలలో పశువైద్యం గుఱించి ఉన్నది. ఇదే తెలుగులో పశువైద్యచింతామణి అన్న పేరిట వెలసి, అభినవ సహదేవుని అనుభవ పశువైద్యచింతామణి అన్న పేర కొన్ని మార్పులతో అచ్చయి, అందుబాటులో ఉన్నది. వాత్స్యాయనుని (మల్లనాగ) కామసూత్రం, వరాహమిహిరుని బృహత్సంహితలోని కాందర్పికాధ్యాయం, మాహుకుని హరమేఖల, ప్రౌఢదేవరాయల రతిరత్నప్రదీపికలతో పరిచయం ఉన్నవారు ఇందులోని 176 – 177 అధ్యాయాలలోని వశీకరణవిద్యావిషయాన్ని చూడవచ్చును. 178-వ అధ్యాయం నిస్సంతుగా ఉన్నవారికోసం ఉద్దేశించిన వైద్యక కల్పం. ఆ పేరుతో అచ్చయిన పుస్తకానికి మూలం ఇదే. ఇందులోని ఆయుర్వేదభాగంలో పేర్కొనబడిన వందలకొద్దీ మూలికల ఉపయోగాదికం, వందలకొద్దీ వ్యాధులను గుర్తుపట్టవలసిన తీరుతెన్నుల వర్ణన చదువరులను తప్పక ఆకర్షిస్తుంది. ఇందులోని అక్షిపీలుకం, అగ్నివిడంగం, ఆస్కందం, అలక్ష్మీజ్వరం, అలజీ (? UTI), ఆర్శేయి, ఇడగజం, ఈశకాశి, ఊర్జ, కిరజీ, పీనస (? Pulmonary consumption) మొదలైన కొన్ని వ్యాధుల పేర్లు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి కాని వాటి లక్షణాలు గరుడ పురాణంలో చెప్పబడినవో కాదో పునఃపరిశోధన జరిగితే కాని తెలియదు. రాత్రిజం మనకు తెలిసిన టైఫాయిడ్ వ్యాధి వంటిదే కాబోలు. పెక్కు రక్తదోషాల చర్చ ఉన్నది. పెక్కు మూలికల గుణదోషాలు, దైనందినజీవితంలో వంటకు ఉపయోగించే ఉప్పు, కారము వంటి ద్రవ్యభేదాల ప్రసంగం ఉన్నది. కాచము, సైంధవము, సాముద్రము, విడము, సువర్చల మొదలైనవాటితోపాటు చెప్పిన కృష్ణ లవణము నేటి పాకిస్థానీ (కాబూలీ) ఉప్పు. నిఘంటువుల కెక్కని పదాలు, అర్థాలు ఇందులో అనేకం. 59-వ అధ్యాయం నుంచి 60 వరకు ఉన్నది జ్యోతిశ్శాస్త్రనిరూపణాధ్యాయం. 60-వ అధ్యాయంలో రవిచక్రం జ్యోతిశ్శాస్త్ర ఫలితాధ్యయనలకు మూలకందమైన తీరు ఆసక్తిదాయకం. 67-వ అధ్యాయంలోని స్వరోదయం కూడా తప్పక చూడదగినది. నాడీశాస్త్రాన్ని అభ్యసింపదలచినవారికి ఇది ప్రాథమికసూత్రాలను బోధిస్తుంది. ఈ భాగంపై వెలసిన రవిచంద్రుని ఆంధ్ర వ్యాఖ్య ఇంకా అచ్చుకాలేదు. క్రీస్తుశకం 13-వ శతాబ్ది నాటి గణపనారాధ్యుని స్వరశాస్త్రము దీనికి అనుసరణమే. ఆంధ్రసారస్వతపరిషత్తు (హైదరాబాదు) వారు 1967లో అచ్చువేసిన నేలటూరి వేంకటరమణయ్య గారి వాఙ్మయ వ్యాసమంజరిలో గణపనారాధ్యునిపై మంచి వ్యాసం (పు. 19 – 24లు) ఉన్నది కాని, వారు గణపనారాధ్యుని రచనపై గరుడ పురాణము ప్రభావాన్ని, రవిచంద్రుని వ్యాఖ్య ప్రభావాన్ని గుర్తించలేదు. ఆధునిక కాలంలో ఈ భాగమే సహజయోగము అన్న పేరిట దేశమంతటా వ్యాప్తిలోకి వచ్చింది.

        గరుడ పురాణంలో 243-వ అధ్యాయం నుంచి 244 వరకు ఉన్న భాగం సాముద్రిక శాస్త్ర విషయం. ఇదంతా వరాహమిహిరుని బృహత్సంహితకు రూపాంతరితం.

     68-వ అధ్యాయం నుంచి 80 వఱకు ఉన్నది రత్నపరీక్షాధ్యాయం. ఈ భాగం అగస్త్య సంహిత అన్న పేరుతో విడిగా అచ్చయి ప్రచారంలో ఉన్నది. బుధ బటుడు ఇందులోని విషయసంగ్రహాన్ని పునారచించి, రత్నపరీక్షగా సంకలనించాడు. యుక్తికల్పతరువు, మణిమాల, నవరత్నపరీక్ష, రత్న సంగ్రహం, శుక్రనీతి, అగ్ని పురాణం, బృహత్సంహితలలోని రత్నపరీక్షాధ్యాయభాగంతో దీనికి కొంత పోలిక ఉన్నది. అగస్తి మతము అన్న పేరుతో వేఱొక రత్నపరీక్షా గ్రంథం ప్రచారంలో ఉన్నది. 1896లో ప్రొ. ఫినోట్ ఈ గ్రంథాలన్నిటి తులనాత్మకపరిశీలన చేసి, తన అనర్ఘమైన మహాగ్రంథం Lapidaires Indiensలో ఈ అగస్తి మతము క్రీ.శ. 6-వ శతాబ్దికి అనంతరీయం, 11-వ శతాబ్ది కంటె పూర్వతరం అని నిశ్చయించారు. బుధబటుని రత్నపరీక్షను మల్లినాథసూరి తన వ్యాఖ్యానాలలో పలుమార్లు ప్రమాణీకరించాడు. తెలుగు కవి భైరవుడు ఈ గ్రంథాలన్నిటిని సంప్రతించి, ప్రధానంగా గరుడపురాణం నుంచి గ్రహించిన భాగంతో తన రత్నపరీక్ష పాఠాన్ని రూపొందించుకొన్నాడు. 
     గరుడ పురాణంలోని ఉత్తరఖండానికి ప్రేతకల్పమని పేరు. ఇది భారతీయుల ఆస్తిక్యదీక్షకు, ధర్మతత్పరతకు, కర్తవ్యపరాయణతకు, ప్రత్యేకించి మరణాంతవిధుల విధానదర్శితకు ఉద్దేశించిన నిబంధం. ఆ ఖండం ప్రారంభంలో 
     ధర్మదృఢబద్ధమూలో వేదస్కంధః పురాణశాఖాఢ్యః 
     క్రతుకుసుమో మోక్షఫలః స జయతి కల్పద్రుమో విష్ణుః. 
   

        అని ఉన్న కవితాత్మకమైన ప్రారంభం పోతన గారి భాగవత కల్పతరు వర్ణన పద్యానికి సన్నిహితంగా ఉన్నది.

        పూర్వఖండం చివఱ గీతాసారం ఉన్నది. ఇది పూర్వకల్పంలోని భగవద్గీతకు సంక్షేపమని పౌరాణికులంటారు. కాశీఖండములోని భగవద్గీతా ప్రస్తావం కూడా ఇటువంటిదే. ఇందులో ఔర్ధ్వదైహికాన్ని వర్ణించే అధ్యాయాలను గ్రీకుల ఆచారకల్పంతో సరిపోల్చి, విశ్వమానవుని ఆలోచనాసామ్యాన్ని గుఱించి పి.వి. కాణే మహోదయులు తమ History of Dharma Sastra (నాలుగవ సంపుటం)లో విపులమైన చర్చచేశారు.

        గరుడ పురాణం లోని విష్ణుపంజరస్తోత్రం, విష్ణుసహస్రనామస్తోత్రం ఉత్తరభారతదేశంలో ఈనాటికీ ప్రచురప్రచారంలో ఉన్నాయి. మహాభారతంలోని విష్ణుసహస్రనామావళితో ఇందులోని విష్ణుసహస్రనామస్తోత్రాన్ని సరిపోలుస్తూ వ్యాసాలనేకం వెలువడ్డాయి. ఇందులోని ప్రార్థనశ్లోకాలు ధర్మతత్పరుల నిత్యానుసంధానంలో నేటికీ వినిపిస్తుంటాయి. అవి స్మార్తకర్మలలోకీ అడుగుపెట్టాయి.

        అపవిత్రః పవిత్రో వా

        సర్వావస్థాం గతో౽పి వా

        యః స్మరేత్ పుణ్డరీకాక్షం

        స బాహ్యాభ్యన్తరః శుచిః.

        వంటివి.

        కర్తవ్యకర్మల ధర్మశాస్త్రసారాన్ని సాకల్యంగా నిరూపించిన తర్వాత,

        సర్వేషాం మఙ్గళం భూయాత్

        సర్వే సన్తు నిరామయాః

        సర్వే భద్రాణి పశ్యన్తు

        మా కశ్చిద్దుఃఖభాగ్భవేత్.      

        అన్న మంగళాశాసనంతో గరుడ పురాణం నిర్విఘ్న పరిసమాప్త మౌతుంది.

        ఇంతకంటె మానవాళికి వేఱే ఆకాంక్షితం ఏముంటుంది కనుక!            

                                  

     
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech