సుజననీయం  
 

 

కూచిపూడి మహా యజ్ఞము

 

                                                            రచన: రావు తల్లాప్రగడ

 
 

ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

సిలికానాంధ్రులకు కూచిపూడి నాట్యసమ్మేళన ఘన విజయయోత్సవ శుభాశీస్సులు!

 
 
 
 

"సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం"

అని  గురుకులాల్లో  గురువుల పరంపరను స్మరణము చేసుకుని శిక్షణ మొదలు పెట్టడము హైందవ సాంప్రదాయము. గురుశిష్య పరంపర అన్నది అధ్యాత్మిక సాధనకే కాదు అది ఏ సాధనకైనా అవసరమే. ఆ సంప్రదాయాన్ని ఈ నాటికి కూడా నిలుపుకుని కాపాడుకుంటూ గౌరవించుకుంటూ వస్తున్నది మన కూచిపూడి నాట్యకళ! "గురుదేవోభవ" అని పెద్దలు మనకు ఎంతచెప్పినా, ఆ గౌరవం తరుగుతున్న ఈ రోజుల్లో, గురువుని ఆరాధించే సత్సాంప్రదాయాన్ని నేటికీ సజీవంగా నిలిపి ప్రదర్శించేది మాత్రము కూచిపూడి శిష్యగణాలే. అందుచేత ఈ కళ కేవలం ఒక కళ కాదు. ఇది ఒక సత్సాంప్రదాయము, గురుశిష్యుల పరంపరకు ఒక కేతనము, ఒక దైవిక యజ్ఞము.  ఈ యజ్ఞము ఇలాగే కలకాలము కొనసాగి భావితరాలకు ఒక దిక్సూచిగా నిలవాలి, సనాతన ప్రవృత్తిని ప్రజ్వలింపజేసి తద్వారా ఆ కళామతల్లికి సదాచార హవిస్సులతో నివాళులు ఆర్పించాలి. ఇంతకీ ఈ కూచిపూడి కూడా ఒక యజ్ఞము ఎలా అవుతుంది? 

భూర్భువస్స్వస్తరు స్తార స్సవితా ప్రపితామహః ! యజ్ఞో యజ్ఞపతి ర్వజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః !!

యజ్ఞభ్రు ద్యజ్ఞకృ ద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః !  యజ్ఞాంతకృ ద్యజ్ఞగుహ్య మన్నమన్నాద ఏవచ !!  (విష్ణుసహస్రనామము)

మూడు వ్యాహృతులలోనూ, సంసార సవితను దాటించే ప్రపితామహుడునూ, యజ్ఞమునూ, యజ్ఞపితయునూ, యజ్ఞము చేసేవాడునూ, వాని అవయవాలునునూ, యజ్ఞము నడిపించేవాడునూ; యజ్ఞాలకు అధిపతియూ, యజ్ఞాలను ఆద్యంతాలలో చేయించేవాడునూ, యజ్ఞాలను ఆస్వాదించేవాడునూ, ఆస్వాదించబడేవాడునూ, సాధనమునూ, పూర్ణాహుతియూ, యజ్ఞఫలముయూ, సాధించబడినదియూ, అన్నమునూ, అది ఆరగించువాడునూ ఆ పరమేశ్వరుడే! 

కళారాధనలో ఒక కళాకారుడికి దొరికేది, తాను కోరుకునేది నిస్సంశయంగా ఆత్మానందమే. ఆత్మ ఆ పరమాత్మ స్వరూపమే. ఈ కళాయజ్ఞము చేసేవాడు, చేయించేవాడు, యజ్ఞఫలమూ, యజ్ఞాంగాలు, మున్నగునవి అన్నీ ఆ శ్రీబాలా త్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామియే అని కూచిపూడి కళాకారులు భావిస్తారు కనుక, మనము నిర్వహించుకున్న ఈ అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళము కూడా ఖచ్చితంగా ఒక యజ్ఞమే. పరోపకారార్థము మనము చేసే ఏ పనియైనా అది కూడా యజ్ఞమే అవుతుంది. ఈ కూచిపూడ మహాయజ్ఞములో 5794 మంది కళాకారులు కలసి చేసిన కూచిపూడ ినృత్యము గత గిన్నీసు రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశవిదేశాల నుంచీ ఎందరో కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు ఒక్కచోట పొగయ్యి, సిలికానాంధ్ర చేపట్టిన కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు, గిన్నీసు పురస్కారాన్ని మళ్ళీమళ్ళీ కీర్తించారు. కొత్త కొత్త పురస్కారాలను అందుకోవడం ఆనందదాయకమే కానీ, కేవలం పురస్కారాలని ఆశించి, లేక ఒక మెచ్చుకోలును కోరుకుని, కార్యక్రమాలను మనము నిర్వహించుకోవడం లేదన్నది గమనించాల్సి వుంటుంది. అనేకులని ఒక చోటికి చేరదీసేది వారిలో ఏదైనా గుర్తింపుని సాధించుకుందామని  అంతకన్నా కాదని కూడా మనం గుర్తుచేయవలసి వుంటుంది. 

మన సంకల్పం ఎంతో గొప్పది. పాశ్చాత్య సాంప్రదాయాలకు తలనొగ్గుతున్న మన వారిని జాగ్రుత పరచి, ఒక తట్టు తట్టి మన ఔన్నత్యాన్ని మన సాంప్రదాయలని, మన మేలిమి కళలను గుర్తుచేయడమే మనకున్న ఏకైక లక్ష్యము.   లక్ష్యార్జనలో, ఈ కళార్చనలో ... ...  గిన్నీసు పురస్కారము ఒక పువ్వుమాత్రమే; ఒక చెమికీమాత్రమే; అది ముఖ్యోద్దేశము కాదు. రాజకీయప్రముఖులను, వాణిజ్య ప్రముఖులను, పండిత శ్రేష్టులను, పెద్దలను ఆహ్వానించేది, వారి ఆశీర్వాదబలము కోసము, ప్రదర్శనకు వారు తెచ్చే వన్నె కోసమే తప్ప, వారి వద్ద మనము ఒక గుర్తింపును ఆశించి మాత్రము కాదు. గుర్తింపు కళకు వస్తే చాలు, సిలికానాంధ్ర ఆశించిన ఫలితము దక్కినట్టే, మన కోరిక నెరవేరినట్టే, మనకు మన ఆనందం చిక్కినట్టే!

----

ఈ కొత్త సంవత్సరపు జనవరి సంచికతో మరొక కొత్త నవలను  ధారావాహికంగా ప్రవేశపెడుతున్నాము. ఈ నెల నుంచీ, అభ్యుదయ రచయిత కొండగుంట వెంకటేశ్ గారి "ది డైరీ ఆఫ్ డాక్టర్ వనమాలి" అనే నవలను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి "అంతర్ముఖం" నవలతో పాటుగా అందుస్తున్నాము. ప్రసిద్ధ రచయితలనే కాకుండా, కొత్త రచయితలకు కూడా ప్రోత్సాహం కల్పించి, ఉత్తమ రచనలను రచయితలను పరిచయం చేయడం సుజనరంజని చేపట్టిన ఉద్దేశాలలో ఒకటి అని అందరికీ తెలిసినదే. 

అలాగే సాహిత్యానికి పెద్దపీట వేసే సుజనరంజని, "పద్యం హృద్యం" శీర్షికను గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ శీర్షికలో కేవలం సమస్యాపూరణే కాకుండా పద్యాభిమానులకు సరికొత్త సమాచారాన్ని, వ్యాసాలను  అందిచాలని చాల ారోజులుగా అనుకుంటూ వచ్చాము. ఈ కార్యాచరణలో భాగంగా  ప్రఖ్యాత పద్య రచయిత, విమర్శకుడు, సాహిత్య పరిశీలకుడు యైన భైరవభట్ల కామేశ్వర రావు గారి కలం నుంచీ "పద్యాలలో నవరసాలు - కానీవోయ్ రసనిర్దేశం!" అనే వ్యాస పరంపరను మీకు అందించనున్నాము. సాహిత్యాభిలాషులకు ఇదొక మహత్తర అవకాశము. అందరూ ఈ శీర్షికను ఎప్పటిలాగే అదరించి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాము.

మళ్ళీ అందరికీ నూతన సంవత్సరశుభాకాంక్షలు తెలుపుకుంటూ,

మీ

రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 
Sujanaranjani