Sujanaranjani
           
  కబుర్లు  
  సెటైర్
          కడియం టు స్వర్గం- 2  
 

- రచన : మధు పెమ్మరాజు

 
 

-హలో నుండి అమెరికా చలో దాకా

"అమ్మా! ఈ మధ్య అత్తయగారిని చూడాలి, అత్తయగారిని చూడాలిఅని మీ కోడలు ఒకటే గొడవ, కల్లోకి వస్తున్నావుట....పోనీ పెట్టెలు పట్టుకుని ఫ్లైట్ ఎక్కేద్దామంటే చంటి పిల్లతో కదల్లేని పరిస్థితి

"నేను భార్గవిని తలుచుకోని రోజు లేదంటే నమ్ముఅది నా కోడలు కాదు కూతురు! నాన్నగారు సీరియస్ మొహం పెట్టుకుని బయటపడరు కానీ ఆయనకి లోపల మనవరాలిని ఎత్తుకోవాలని పీకుతూనే ఉంటుంది, మీరు మాత్రం హైరానా పడి వచ్చెయ్యకండి  ఏకంగా పుట్టు వెంట్రుకలకి రావొచ్చు..ఎంచక్కా పెద్ద తిరుపతి వెళ్దాం"

అప్పటిదాకా మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలం, మీరు వీలు చేసుకుని మా దగ్గరకి వస్తే చాలా బావుంటుంది, అంతా కలిసినట్టూ ఉంటుంది మీరు అమెరికా చూసినట్టూ ఉంటుంది.. ఏమంటావు?

ఏమోరా! అవన్నీనాకు తెలీదు..ఏదైనా అంటే నాన్నగారితో తిట్లు పడాలి, ఇదిగో ఆయనకి ఫోన్ ఇస్తున్నా మీరు మీరు మాట్లాడుకోండి” (ముసి, ముసిగా మురిసిపోతూ)

"నాన్నగారు! ఇప్పుడే అమ్మతో అంటున్నా మీరు ఇక్కడికి వస్తే బావుంటుంది, మావయ్యగారు వాళ్ళు వెళ్లిపోయాకా ఇల్లు చాలా వెలితిగా, బోసిపోయినట్టు ఉంది...మీరు వస్తే నిండుగా, ధీమాగా ఉంటుంది"

"ఉన్న పళాన కోట గుమ్మం (రాజమండ్రి మార్కెట్) కూడా వెళ్ళలేము, అమెరికా అంటావేమిట్రా..ఓ రెండు రోజులు అలోచించి ఏ విషయమో చెప్తా" (మావగారితో పోల్చగానే వచ్చిన కోపపు స్పందన )

"సరే నాన్నగారు!" అని వినయంగా ఫోన్ పెట్టాడు శ్రీనివాస మోహన్ ఎలియాస్ శీను 

(వరలక్ష్మిగారికి కలో, నిజమో అర్థం కాలే, కొడుకుని  తిట్టిన తిట్టు, తిట్టకుండా తిట్టి ఓ రోజు కాలేదు, పక్కింట్లోంచి విన్నట్టే ఫోన్ చేసి 'అమెరికా ప్రయాణం' అంటున్నాడు..తధాస్థు దేవతలు నిజంగానే ఉంటారని ఆవిడ నమ్మకం పెరిగింది ) 

 

-ఓ రెండో, మూడో రోజుల తర్వాత మన ఫేస్బుక్ జంట ఇంట్లో -

"ఊరికే బెట్టు చేస్తారు కానీ ఇక్కడికి రావాలని ఎప్పటినించో ఎదురు చూస్తున్నారని నాకు బాగా తెలుసు, అమెరికా రిటర్న్ అంటే వారి పరపతి రెట్టింపు అవుతుంది "

"నాకూ చాలా రిలీఫ్గా ఉందండి, మెటర్నిటీ లీవ్ అవ్వగానే దీన్ని డే-కేర్ లో జాయిన్ చేసి ఆఫీసుకి వెళ్ళాలని గిల్టీగా ఫీల్ అవుతున్నాను, అత్తయగారు వస్తే ఆ బాధ తప్పుతుంది"

"మనం పక్కాగా ప్లాన్ చేస్తే గురి తప్పే చాన్స్ లేదు-నెలలో వీసా రావడం, అమ్మావాళ్ళు ప్రయాణానికి రెడీ అయి ఇక్కడికి రావడం జరుగుతుంది.....టైం ఎక్కువ లేదు కాబట్టి టికెట్లకే ఎక్కువ డబ్బులు పెట్టాలి

(కంగారుగా) మరి ఎలాగ

"నువ్వేమీ కంగారు పడకు, నేను కాళ్ళున్న కాలిక్యులేటర్ ని - డే-కేర్ ఖర్చులు ఒక వైపు , టికెట్ ప్లస్ అమ్మావాళ్ళ షాపింగ్ ఖర్చులు ఇంకో వైపు బేరీజు వేసాను..మనకి రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు డాలర్ల లాభం ఇహ్హిహీ అని వికటంగా నవ్వాడు, (భర్త తెలివికి, నవ్వుకి భార్గవి మొహంలో ఆనందం తొణికిసలాడింది

-అతి ముఖ్యమైన ప్రక్రియ వీసా పేపర్ల తయారీ -

అమ్మా! నాన్నగారికి తెలీనివి చెప్పినా పర్సనల్గా తీసుకుని 'నాకు చెప్పేంత మొనగాడివా’ అంటారు అందుకే ముఖ్యమైన విషయాలు నీకు చెప్తున్నా, జాగ్రత్తగా విను.. వీలైతే రాసుకో పర్వాలేదు చెప్పు

"వీసా అన్నాకా చాలా పకడ్బందిగా ప్లాన్ చెయ్యాలి, ఇంట్లో ఉన్న చిత్తు కాగితాలు పోగు చేసి గోను సంచీలలో తీసుకెళ్ళు" తెలీక అడుగుతాను..అమెరికాలో చిత్తుకాగితాల కొరతా?"

"అలా కాదమ్మా వాళ్ళకి డాక్యుమెంట్ల పిచ్చి, కంప్యుటర్ని కూడా నమ్మరు అదే ఓ ప్రింటౌట్ తీసి ఇస్తే నమ్ముతారు....ఎన్ని డాక్యుమెంట్లు ఉంటే అంత పక్కా పార్టీ అని వాళ్ళ నమ్మకం"

"రెండు-ఆ వీసా ఆఫీసర్ అమెరికా ఎందుకు వెళుతున్నారు అని అలివేలుగారిలా అరా అడిగితే..కోడలు పురుడు, అబ్బాయి బెంగ, మా రెండో బావగారు ముప్పై ఏళ్ళనించీ ఉన్నారు తెలుసా? అని పేరంటం కబుర్లు చెప్పకు....అఫీషియల్గా ఒబామాతో పని ఉందనో, కేర్లెస్గా అమెరికా చూద్దామనో చెప్పు"

"అలా అబద్ధాలు ఎందుకురా?"

"వాళ్ళు నిజాలు నమ్మరు, వాళ్ళే కాదు ఎవ్వరూ నిజాలు నమ్మరు....ఇక అసలు విషయం, మీకు ఆస్థి ఉందా? అంటే ఓ వొంకర నవ్వు పడేసి, ఇరవై సెకండ్ల గ్యాప్ ఇచ్చి 'సగం కోనసీమ మాదే' అని గుక్క తిప్పకుండా వివరాలు చెప్పండి....కొబ్బరితోటలు, మామిడితోటలు, ఇళ్ళ స్థలాలు, మామూలు స్థలాలు, బ్యాంకులో మూలుగుతున్న కాష్, పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఎదురు చూసే అబ్బాయి, 90 ఏళ్ళ అమ్మ వగైరా, వగైరా..."

"ఇంత అతిగా చెప్తే నమ్మరేమోరా, వాళ్ళూ తెలివి మీరిపోయి తెలుగు మాట్లాడేవాళ్ళని పెడుతున్నారుట".

"ఏదో అనుకున్నాను కానీ నీ కాకినాడ కనెక్షన్తో బానే వాకబు చేసావు…అందుకే కష్టాలు, ఆస్థులు, పేపర్లు కలిపి కొట్టాలి, మా ఫ్రెండ్స్ అందరికి ఇలాగే వచ్చాయి వీసాలు"

- పొట్టలు పగిలేలా పెట్టెలు నింపడం మన జన్మహక్కు- 

ఫ్లైట్ కంపెనీలు లగేజీపై పరిమితులు, అదనపు చార్జీలు పెట్టడానికి ఘాటైన కారణం మన ఆవకాయ! 

"శీనుకి ఆవకాయ లేకపోతే ముద్ద దిగదు..ఇక మాగాయ, తొక్కుడు పచ్చడి, కందిపొడి అంటే మహా ప్రాణం..కాస్త కూరకారం, కొరివికారం, కారప్పొడి ....."

"జాగ్రత్త! పాకెట్ల నిండా ఎర్రటి పదార్దాలు చూస్తే కస్టమ్స్ వాళ్ళు మనల్ని అనుమానిస్తారు లేకపోతే లుంగ చుట్టి చెత్త డబ్బాలో పడేస్తారు"

-అమెరికా ప్రయాణం-

దారి పొడుగూతా ఆశ్చర్యాలే- కళ్ళు చెదిరే ఎయిర్పోర్ట్ హంగులు, ఆగని వరుస మర్యాదల నుండి తెరుకునేలోపు అబ్బాయి కారులో వయ్యారాల ఓవర్ బ్రిడ్జీలు దాటుకుంటూ, చికాగో డౌన్-టౌన్ మీదుగా వెళుతుంటే వరలక్ష్మిగారిని అనవసరంగా బాగా అతి అన్నందుకు విపరీతంగా బాధపడ్డారు, గేటెడ్ అపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టగానే తీర్చిదిద్దిన లాండ్-స్కేప్, వాటర్ ఫాల్స్ సాదరంగా ఆహ్వానించాయి.

-జెట్ లాగ్ నుండి తేరుకుని బ్రెడ్ టోస్ట్, ఓట్ మీల్ రొటిన్లో పడ్డాకా వారి ఇండియా ఫోన్ కాల్స్ –

"మూర్తిగారు! చక్కటి కాలుష్యం లేని వాతావరణం, రోడ్ల మీద డిసిప్లిన్, మన వాళ్ళలా కాదండీ..బాగా మర్యాద తెలిసిన మనుషులు, పరిచయం ఉన్నట్టే ఆగి పలుకరిస్తారు. తినే తిండి నుండి పడేసే చెత్త దాకా అంతా భలే పద్ధతి!! తినే పదార్థాలలో పోషక విలువలేమిటో మా కోడలికి బట్టీ, స్పూన్ నోట్లో పెట్టుకోవడం పాపం పొట్టలోకి ఎంత ప్రోటీనో, ఎంత కాల్సియమో ఎక్కడినించో దూకి మరి చెప్పేస్తుంది. ఇక చెత్త (ప్లాస్టిక్, పేపర్..) దేనికి దానికి వేరుగా పడెయ్యాలి..టూకీగా చెప్పాలంటే చెత్తని కూడా ప్రేమించే పర్యావరణ స్పృహ! నాకు, మీ వదినగారికి ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా, సరదాగా ఉన్నాయి. ఇక కంప్యూటర్లో తెలుగు వార్తలు, సీరియల్స్ రావడంతో మన విషయాలు ఏమీ మిస్ కావట్లేదు..ఇన్నేళ్ళూ ఎందుకు రాలేదా అని బాధ పడుతున్నాం!!

"ఏమోయ్ రమేష్, అంతా కులాసానా?...మేము బాగా సెట్ అయ్యాం, మా వాళ్ళు ఆఫీసులకి వెళ్లిపోయాకా చంటి పిల్లతో కబుర్లు, వాకింగ్, సాయంత్రాలు మా వాడు వాల్మార్ట్, దేశి దుకాణానికి, లైబ్రరీకి; వీకెండ్ గుడికి, స్నేహితుల ఇంటికి తీసుకెళతాడు, చాలా ప్రశాంతంగా, హాయిగా ఉండి దెబ్బకి నా బీ.పీ తగ్గిపోయి, సగం టాబ్లెట్లోకి వచ్చేసా.. వెనక్కి రావాలంటే భయంగా ఉంది.. అహ్హ హా !" (హాయి నవ్వు)

అమ్మా జానకిఇక్కడ గోంగూరతో సహా మన కూరగాయలన్నీ దొరుకుతున్నాయి, కానీ అదేమి విచిత్రమో ఆకారం తప్ప రుచి, పచి ఉండవు, ....ఇక కాలక్షేపం అంటావా..మీ అత్తయ్య వంట, చంటిపిల్లతో ఆయాలా రోజంతా చాకిరీ, నేను బాషా బేధం లేకుండా సినిమాలపై డాక్టరేట్ చేస్తున్నా, నిద్రలో కూడా రీళ్ళు తిరుగుతున్నాయి" (బలహీనమైన నవ్వు)

"ఒరేయ్ రావుడూ! 'అమెరికా ఎలా ఉందని సిగ్గులేని ప్రశ్నలు వెయ్యకు..ఊటీ జైల్లో పెట్టినట్టుంది- బయట ఆగకుండా మంచు, ఒంట్లోంచి ఎముకలు కొరికే చలి, రగ్గు కప్పుకుని సోఫాలో కూర్చోవడం లేకపోతే జూ బోనులో పులిలా అదే గదిలో నాలుగడుగులు వెనక్కీ, ముందుకీ వెయ్యడం..వేళకి భోజనం, నిద్ర, మా మనవరాలి ఏడుపు కాలక్షేపం..వీడు సాయంత్రం ఏదో ఘనకార్యం చేసొచ్చినట్టు వెర్రినవ్వు పడేస్తాడు...ఆరు నెల్లు ఎప్పుడు అవుతాయా అని నిముషాలు లేక్కెడుతున్నాం అంటే నమ్ము "

"నాయనా శ్రీనివాసూ! మేము ఇక ఉండలేము మా తిరుగు టికెట్ డేట్ మార్చేయి, ఇదేదో చిన్నప్పుడు నేను వేసిన దెబ్బలకి నువ్వు తియ్యగా కసి తీర్చుకున్నట్టుందిమీరు మీ ప్రపంచంలో బిసీగా ఉంటారుమెంటల్ ఆసుపత్రిలా మాకు మేమే మా కాలక్షేపం..అసలు నిన్ను కాదు ఆ వెర్రి వనజగారిని అనాలి.. పర్యావరణంపై ప్రేమ పేరెంట్స్ పై లేదు!!

భార్యతో సుబ్బరావుగారు "రైల్వే స్టేషన్లో మన వియ్యంకుడుగారు అతి వినయంగా నవ్వుతూ 'అమెరికాలో అల్ ది బెస్ట్' అన్నప్పుడే ఇదేదో 'అశ్వత్థామా హతః కుంజరః' అని పసికట్టేయల్సింది, మనకు అంత తెలివి ఏడిస్తేగా, అన్నీ దెబ్బలు తిని నేర్చుకోవాల్సిందే!"

-ఆఖరి నెల, ఓ అందమైన కల -

ప్రయాణం నెల్లోకి రాగానే ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది, స్కూల్ ఫైనల్ పరీక్షలు నరకమైనా ఆ తర్వాత వచ్చే సెలవులే ఊపిరిగా జీవించే ఆఖరి బెంచ్ విద్యార్థుల్లా...వరలక్ష్మిగారు ఇండియా షాపింగ్ అనగానే పాత తప్పులు పెద్ద మనసుతో క్షమించేసారు, ప్రతీ వారం కాళ్ళు, కీళ్లు శబ్దాలు చేసేలా తిరగడం, చాకచక్యంగా కూపన్లు వాడి తక్కువ ధరలో ఎలా కొన్నారో, ఎక్కడో దాక్కున్న ఆణిముత్యాన్ని ఎలా వెలికితీసారో లాంటి కబుర్లతో సందడిగా గడిచిపోయాయి, పెట్టెలు నిండాకా ఆవిడ అభద్రతాభావం మటుమాయమయ్యింది...ఇద్దరికీ మొదటి నెల, ఆఖరి నెల మధురమైన ఘట్టాలుగా మిగిలిపోయాయి.

అదేమి విచిత్రమో కలిసినపుడు, విడిపోతునప్పుడు పెల్లుబీకే ఎమోషన్స్, వాటి మధ్యలో అర్థం చేసుకోవాల్సిన బేసిక్ ఫీలింగ్స్ కూడా ఎవ్వరికీ ఉండవు. గాంధీ జన్మదినం నాడు క్షమాబిక్ష ఖైదిల్లా ఓ పక్క ఆనందం, ఇంకో పక్క అయ్యో మన జైలు సెల్ వదిలేస్తున్నామే అనే బాధతో ప్లేన్ ఎక్కారు... 

టాక్సీలో ఇల్లు చేరుతుంటే స్వర్గం ఎక్కడో లేదు- ముమ్మాటికీ కడియం వీరాంజనేయ నర్సరీ, కుడిపక్క సందు మూడో ఇంటిలో ఉందని బాగా అర్థం అయ్యింది. కాలుష్యం, కరెంట్ కోత, అదుపులేని జనాభా...ఎన్ని నచ్చని విషయాలున్నా సొంత ఊరుని, ఇల్లుని మించిన స్వర్గం లేదు!! సుబ్బారావుగారు రాజకీయ వార్తలతో, వరలక్ష్మిగారు అమెరికా ముచ్చట్లు, పేరంటాలతో బిసీ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలే!

ముగింప - అమెరికా వనజగారో, లండన్ గిరిజగారో చెప్పారని అంచనాలు (expectations) పెంచేసుకునే పెద్దలు నాణానికి ఒక వైపుఖర్చుకి తగ్గ విలువ రాబట్టాలనే వినియోగదారుని ధోరణి సొంతవాళ్ళపై వాడుతూ..దీంట్లో తప్పేముంది? అనుకునే పిల్లలు ఇంకో వైపు, ఈ వింత స్థితికి కారణం! అరుదైన కుటుంబ రీయూనియన్  తీపి అనుభూతిలా మిగలాలంటే ఇరుపక్షాలకి ఓ నిముషపు అంతర్దర్శనం (introspection) తప్పదు!!


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech