Sujanaranjani
           
  కబుర్లు  
  సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 25
     
  మన మాతృభాష మృతభాషా?  
 

- రచన : సత్యం మందపాటి

 
 

ఈమధ్య కొన్నేళ్ళుగా తెలుగు భాషని మృతభాషగా యునైటెడ్ నేషన్స్ ప్రకటించిందనే మాట ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నది. కొన్ని వార్తా పత్రికల వార్తల్లోనూ, టీవీల్లోనూ, రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లోనూ మరీ ఎక్కువగా వినిపిస్తున్నది. రాజకీయం అనగానే అరాచకీయం కనుక, నేనూ అవి అంతగా పట్టించుకోలేదు. తర్వాత తెలుగు సాహిత్య మహాసభల్లోనూ, తెలుగు భాషా ప్రవీణుల ద్వారానూ, సాహితీ మిత్రుల ద్వారానూ కూడా విన్న తరువాత దీంట్లో నిజానిజాలు తెలుసుకోవాలనిపించిది. కొంత అంతర్జాల పరిశోధన, కొంత ప్రముఖ భాషావేత్తల అభిప్రాయ సేకరణ చేశాక, నాకూ ఎంతో కాకపోయినా కొంత సత్యం తెలిసినట్టుగా అనిపించి, ఆ నాలుగు మాటలూ మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసం వ్రాస్తున్నాను. నాకు అంతుపట్టని కొత్త విషయాలు మీకు తెలిసినా, నేను వ్రాస్తున్న సత్యాలు అంత మందపాటివి కాదు అనుకున్నా నాకు, నాతో పాటు మన మిత్రులకీ చెబితే సంతోషం.

అయితే ఏమిటయ్యా నువ్వు శోధించి, సాధించి కనుక్కున్నది. ఇంతకీ తెలుగు మృతభాషా? కాదా?’ అని అడుగుతున్నారు కదూ...

నేతి బీరకాయలో నెయ్యి ఎంతవుందో, దీనిలో నిజం అంతే వుంది అంటే నేను చాలావరకూ సత్యం పలుకుతున్నట్టే లెఖ్క. వెనకటికి ఎద్దు ఈనిందంటే దూడని కట్టేయమన్నాడుట ఒకడు. ఇది అంత నిజమూ కాదు. చూద్దాం అసలు విషయ మేమిటో.

వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు మృతభాష అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి అనేవి తెలుసు కోవటం ముఖ్యం. నేను చేసిన అంతర్జాల పరిశోధనలోనూ, కొందరు భాషావేత్తలతో మాట్లాడినప్పుడూ రకరకాల నిర్వచనాలు కనపడ్డాయి.

ఒకటి చాల సులభమైనది. మాట్లాడేవారెవరూ లేకపోవటం వల్ల భాష దానంతట అదే చచ్చిపోవటం. ఈమధ్యనే అంటే 2012లోనే ఉత్తర స్కాట్లాండ్లో మాట్లాడేక్రోమార్టీ స్కాటిష్అనే భాష, బాబీ హాగ్ అనే అయన చనిపోగానే ఆయనతోపాటూ అంతరించిపోయింది. అలాగే మన కేరళలోనే 2010లో పోర్చుగీస్ భాష ఆధారంగా మాట్లాడేక్రియోల్అనే భాష, విలియం రోజారియో అనే ఆయనతో పాటూ స్వర్గానికి వెళ్ళిపోయింది. అదే సంవత్సరంలో అండమాన్లోఆకబోఅనే భాష కూడా కొండెక్కింది. పెరూ దేశంలోతోషీరోఅనే భాష ఇప్పుడు ఒకాయన మాత్రమే మాట్లాడుతున్నాడుట. అలాగే బ్రెజిల్లోకైక్సానఅనే భాష. వారితో పాటే అంతరించి పోవటానికి ఇలాటివి ఇంకా కొన్ని భాషలు వున్నాయి. ప్రస్తుతానికి మన తెలుగు భాషకి ప్రమాదం మాత్రం లేదు.

ఇంకొక కారణం, భాషని చంపేయటం. దాన్నే ఆంగ్ల భాషలోలింగ్విసైడ్అంటున్నారు. అంటే ఒక జాతిని నాశనం చేసినప్పుడు, జాతితో పాటూ వారి జాతీయ భాష కూడా చరిత్ర పుటల్లో మిగిలిపోవటం. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాలలో ఎన్నో భాషలు ఇలా చనిపోయాయి.

ఒక భాష మాట్లాడేది ఒక మనిషే అయినప్పుడు, మనిషి బ్రతికే వున్నా, భాష మృతభాష అయే అవకాశం దగ్గరవుతున్నది కనుక, దాన్ని కూడా మృతభాష అని అంటున్నారు. అంతేకదా మరి, ఒక్క మనిషీ ఎవరితో మాట్లాడగలడు భాషని? మా అప్పారావు ఎప్పుడూ తనలో తనే మాట్లాడుకుంటూ వుంటాడనుకోండి, అదే వేరే సంగతి.

ఇలా అంటే నా ఆలోచన ఇంకో రకంగా వెడుతున్నది. ఒక భాష మృతభాష అయే అవకాశాలేమిటి అని. దానికీ నాలుగు కారణాలు చెబుతున్నారు.

ఒకటి: క్రింద నించీ పైకి భాషాభివృద్ధి లేకపోవటం. అంటే ఇళ్ళల్లోనూ, సమాజంలోనూ, ముఖ్యంగా తర్వాత తరాల పిల్లలు భాష మాట్లాడటం క్రమంగా తగ్గిపోవటం.

రెండు: పైనించీ క్రిందకి భాషాభివృద్ధి లేకపోవటం. అంటే మనవి స్వరాజ్యాలు కనుక, ప్రభుత్వం భాషాభివృద్ధి చేయకపోవటమే కాక, నిర్లక్ష్యం చేయటం.

మూడు: రెండు భాషలు మాట్లాడే చోట, ఒక భాషని ప్రముఖంగా మాట్లాడుతున్నప్పుడు, రెండవ భాషని చిన్న చూపు చూసే అవకాశం వల్ల రెండవ భాష క్రమేణా మాయమయి పోవటం. భాషలోని కొన్ని మాటలు ప్రముఖంగా మాట్లాడే భాషలో అంతర్లీనమవటం కూడా సాధారణంగా జరిగేదే!

నాలుగు: ఒక సంస్కృతి క్రమేణా అంతరించి పోతున్నప్పుడు, సంస్కృతిలో భాగమైన భాష కూడా అంతరించి పోయే అవకాశాలు వుంటాయి.

ఇహపోతే...

మరి ఐక్యరాజ్య సమితి వారేమంటున్నారో చూద్దాం.

భాషనయినా 30 శాతం జనాభా కానీ, అంతకన్నా తక్కువ కానీ మాట్లాడుతుంటే భాష మృతభాష అయే అవకాశం వుంది అంటున్నారు యుఎన్ వారు.

ఇక మన తెలుగు భాషకి ఏమవుతున్నదో, ఏమవుతుందో చూద్దాం.

మన ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో ఇప్పుడు తెలుగు మాట్లాడేవారి సంఖ్య 30 శాతం కన్నా తక్కువ అంటున్నారు. అదీకాక సంఖ్య చాల త్వరగా తగ్గిపోతున్నది కూడాను. (ఇక్కడ నేను అంధ్రా తెలుగు, తెలంగాణా తెలుగు, రాయలసీమ తెలుగు, హైదరాబాద్ తెలుగులన్నీ కలిపే చెబుతున్నాను). హైదరాబాద్ జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం మీద ఎంతో తక్కువ కనుక, మిగతా రాష్ట్రాలన్నీ కలిపితే ఎలా వుందో చూద్దాం. (ఇక్కడ నేను అంధ్రా, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలు మూడూ కలిపి చెబుతున్నాను)

మూడు ప్రాంతాల్లోనూ కలిసి, ప్రస్తుతం పూర్తిగా తెలుగు మాత్రమే (తెలుగులోకి వచ్చిన పోలీసు, రైలు, ఆఫీసు, రోడ్డులాటి మాటల్ని తెలుగులో కలిపేసుకుని) మాట్లాడేవారు అరవై శాతం పైదాకా వుంటే, తెలుగుని ఇంగ్లీష్, తమిళం, ఉరుదులాటి భాషలతో ఎక్కువగా కలిపి మాట్లాడేవారు ఎనభై శాతం దాకా వున్నారుట. (ఇక్కడ నేను సంగమమైన యాసల గురించి చెప్పటం లేదు, భాషల గురించి చెబుతున్నాను) కనుక ఐక్యరాజ్య సమితి వారు చెప్పిన దానికి మనం అంత అందోళన పడవలసిన అవసరం లేదు.

ఒక భాష మృతభాష అయే అవకాశాలేమిటి అని, పైన నాలుగు కారణాలు చెప్పుకున్నాం. వాటిని మన ప్రస్తుతం తెలుగు భాష మాట్లాడే వారిని దృష్టిలో పెట్టుకుని పరిశీలిద్దాం.

ఇప్పుడు పాతికేళ్ళ వయసు లోపల, ముఖ్యంగా నర్సరీ స్కూల్ నించీ హైస్కూల్, కాలేజీల్లో చదువున్న పిల్లల్ని చూస్తుంటే, నిజంగా భయమేస్తుంది. తెలుగులో చదవటం చాల చాల తగ్గిపోయింది. తల్లిదండ్రులే పిల్లల్ని తెలుగులో చదవనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. క్లాసులో పిల్లలు తెలుగులో మాట్లాడటమే పెద్ద తప్పుగా చూస్తున్నారు. అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా, అందోళనకరంగా తగ్గిపోయే అవకాశం వుంది.

అలాగే ప్రభుత్వం. తెలుగులో పాఠాలు చెప్పటం అనేది నిర్భంధ విద్యావిధానంలో భాగంగా పరిగణించటం లేదు. అంతేకాదు ప్రభుత్వంలోనూ, ప్రభుత్వాధికారుల్లోనూ తెలుగు భాషని హింసించి, కుదించి, ఆటలాడుకునే వారే కానీ, భాష మీద గౌరవం, భాషాభివృద్ధికై పట్టుదల వున్నవారే లేరు. తెలుగు భాషకి ప్రాచీన భాషగా గుర్తింపు కోసం పాకులాడింది, దానితోపాటూ వచ్చే నిధుల కోసమే కానీ వేరే ఉద్దేశ్యమేమీ లేదు అనేవారు కూడా వున్నారు.

తెలుగుదేశంలో ఉద్యోగావకాశాలు తక్కువగా వున్నాయని, అమెరికా, యూరప్ లాటి దేశాలకు వెళ్లిపోయి ఎంతో డబ్బు సంపాదించుకోవాలనీ, దానికి తెలుగు నేర్చుకున్నందువల్ల ఏమీ ఉపయోగం లేదనీ, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకే పంపిస్తున్నామని పిల్లల తల్లిదండ్రులంటున్నారు. అలా ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ అవటంతో, తెలుగు నేర్చుకోవటం వెనుకపడింది. ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం తెలుగు మానేయాలి అనేది నిజం కాదని అందరికీ తెలుసు. నాతో సహా, 1970 నించీ 1990 దాకా అమెరికానే కాక, ఇతర దేశాలకి వలస వచ్చినవారు ప్రీ యూనివర్సిటీ, జూనియర్ కాలేజ్, బియస్సీ దాకా తెలుగు మీడియంలోనే చదువుకుని, ఇంజనీరింగ్, మెడిసిన్ లాటి డిగ్రీలు ఇంగ్లీషులో చదువుకుని వచ్చిన వాళ్ళమే. రెండు భాషల మీదా మోజు పెంచుకుని, రెండిట్లోనూ చక్కటి వాగ్ధాటి సంపాదించుకున్న వాళ్ళమే! ఇక్కడ ఉద్యోగాల్లోనూ, సమాజంలోనూ ఎంతో విజయవంతంగా బ్రతుకుతున్నవాళ్ళమే! అంతేకాదు. తమిళులకీ, గుజరాతీలకీ, బెంగాలీలకీ, ఇతర భారతీయ భాషల జనాభాకి ఇదొక సమస్య కాదు. ఇది మనకే ఎందుకు వచ్చింది? కనుక వాదనలో నిజం లేదని తెలుస్తున్నది.

ఇక పైన చెప్పిన నాలుగవ కారణం చూస్తే, సాంస్కృతికంగా మనం ఎక్కడికి వెడుతున్నామో చూడాల్సిన అవసరం వుంది. హరికథలూ, బుర్రకథలూ, హరిదాసులూ, డూడూ బసవన్నలూ, పౌరాణిక నాటకాలూ అన్నీ మన తీపి గురుతులుగానే మిగిలిపోయాయి. తెలుగు సామెతలూ, శతకాలు చదివేవారు కానీ, చెప్పేవారు కానీ ఎంతోమంది లేరు. తెలుగు గౌరవం నిలబెట్టాడని చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి గ్రంధాలయాలకు ధన సహాయం ఆపేసి, చాల లైబ్రరీలు మూసేసి, తెలుగు పుస్తక ప్రచురణకీ, పుస్తక పతనానికీ కారకుడయ్యాడు. ఎంతోమంది ప్రచురణకర్తలు దివాలా తీయటానికీ, ఎన్నో పుస్తకాల షాపులు మూసేయటానికీ కారకుడయ్యాడు. మన సినిమాలు టీవీ కార్యక్రమాలు తెలుగు సాంస్కృతిక దారిద్యానికి ఎంతో దోహదం చేస్తున్నాయి. సెక్స్ వయొలెన్స్ ముడిసరుకు గా, సరుకు లేని కొడుకులు, తమ్ముళ్ళు హీరోలుగా మనవి కాని సినిమాలు మనకి చూపిస్తున్నారు. వాటి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇక పబ్ కల్చర్ గురించి చెప్పనక్కర్లేదు. వేషధారణలో కూడా తెలుగు సంస్కృతికి చిహ్నమైన ఓణీలు, పరికిణీలు, చీరలు ఎక్కడో కానీ కనపడటంలేదు. మనదే అయిన కూచిపూడి నృత్యం, త్యాగరాజు కీర్తనలు తెలుగునాట కన్నా, తమిళ దేశంలో ఎక్కువగా ఆదరించబడుతున్నాయి. ఇలా మన సంస్కృతికి మనం దూరం అవుతున్నాం. ఇవన్నీ నా ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకుని చెప్పటం లేదు. మనం అందరం చూస్తున్న, జరుగుతున్న విషయాలను మరోసారి గుర్తు చేయటం కోసమే!

వ్యాసానికి ముగింపుగా, తెలుగు మృతభాష అయిందా, అవుతుందా, అయే అవకాశాలు వున్నాయా, అలా అయే అవకాశం వుంటే మనం దాన్ని మార్చటం అవసరమా, అది మన బాధ్యతా, లేదా అది కూడా తరాల అంతరాల్లో ఒక భాగమేననుకుని ఏమీ చేయకుండా వూరుకోవాలా... వీటి గురించి నేను చెప్పటం నా ఉద్దేశ్యం కాదు.

భాష అయినా మృతభాష అయేందుకు దోహదం చేసే కారణాలు నాలుగూ పైన చెప్పుకున్నాం. వాటిని మళ్ళీ ఇంకొక్కసారి చదివి, మన తెలుగు భాషకి అన్వయించుకుని, మీరే ఆలోచించండి.

గోదావరి జిల్లాలో అంటుంటారు, భోంచేసి మాట్లాడండి అని.

అలాగే వ్యాసం చదివి, మీ భావాలు మనందరితో పంచుకోండి.

 


 
 
నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech