Sujanaranjani
           
  సారస్వతం  
   

సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (20వ భాగం)

 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil               

 

25.హంసక్షీర న్యాయం.

ఈ వ్యాసాల పరంపరలోని తొలి వ్యాసంలో ఈ న్యాయాన్ని కొద్దిగా తెలపడం జరిగింది. ఇప్పుడు దీనిని విపులంగా తెలియ జేస్తాను. ఈ న్యాయం హంసకి పాలని నీళ్ళని వేరుచేసి, పాలని మాత్రమే స్వీకరించె నైపుణ్యం ఉంది. అనే భావం తెలుపుతుంది.  

ముందుగా ఈ శ్లోకం చూడండి.

హంస శ్వేతః బకః శ్వేతః/ కోభేదః బకహంసయో:

నీరక్షీర వివాదేతు / హంసఃహంసః బకః బకః.  

అనగా :

హంస తెల్లగా ఉంటుంది, కొంగకూడా తెల్లగానే ఉంటుంది వాటిమధ్య ఏం బేధము ఉంది? అనే సందేహం వస్తే నీళ్ళని, పాలని వేరు చేసే నైపుణ్యంలో హంస హంసే, కొంగ కొంగే. హంసకి ఉన్న నైపుణ్యం కొంగకి లేదు అని అర్థం.

ఇట్టిదే ఇంకో ఉదాహరణ:

 కాకః కాలః పికః కాలః/ కోభేదః పిక కాకయో:

వసంతకాలే సంప్రాప్తే/ కాకఃకాకః పికఃపికః

 కాకినలుపు, కోకిలనలుపు వాటి మధ్య భేదమేమిటి? అంటే వసంతకాలం వచ్చినపుడు కాకి కాకే కోకిల కోకిలే! వసంత మాసంలో కోకిల పాడినట్లు కాకి పాడ లేదుకదా!

ఇదేభావాన్ని వేమన చక్కని పద్యంలో చెపుతాడు.

ఉప్పు కప్పురంబునొక్క పోలిక నుండు

చూడజూడ రుచులు జాడ వేరు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా

విశ్వదాభిరామ వినుర వేమ                                      

అల్పాక్షరముల అనల్పార్థ రచన అంటే యిదే కదా! చూడటానికి అందరు ఒక్కటిగానే కనబడతారు కాని వారి, వారి ప్రవర్తన విషయంలో మంచి చెడులు బైటపడతాయి. హంస కొంగ, కాకి కోకిల. ఉప్పు,కప్పురం. ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు. కనుక మంచి, చెడులను తెలుసుకొని మంచిని గ్రహించి చెడుని విడిచి పెట్టాలని ఈ హంసక్షీరన్యాయం తెలుపుతుంది.  

కవికులగురువు కాళిదాసు ఏమన్నాడో చూడండి

పురాణ మిత్యేవ నసాదు సర్వం/ నచాపి కావ్యం నవమిత్యవధ్యం సంతః

పరీక్షాన్యతరత్ భజంతే/ మూఢ: పరః ప్రత్యయనేయ బుద్ధి: 

అనగా సాహిత్యం కాని, మరే విషయమైన కాని ప్రాచీనమైనదంతా మంచిది, కొత్తదంతా చెడ్డది అనినిర్ణయంచక, పరిశీలించి దేనిలో మంచి ఉందో దానిని మాత్రమే విజ్ఞులు గ్రహిస్తారు. మూర్ఖులు పరిశీలించకుండానే నిర్ణయం తీసుకొంటారు. మంచి చెడు, కష్టం సుఖం, చీకటి వెలుగు, సత్యం అసత్యం, ధర్మం అధర్మం, పుట్టుక మరణం,  ఈ ద్వంద్వాలన్నీ ప్రపంచలో సహజమైనవి. వీటినుండి ఎవరు తప్పించుకోలేరు. అలాగే “కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే  ఆరుగురు శత్రువులు వీటినే అరిషడ్వర్గాలు  {అరి= శత్రువు. షట్= ఆరు} అంటారు. వీటిని అనుభవించి అదుపులో ఉంచుకోవాలి కాని, వీటికి దూరంగా ఉండలేము. 

వీటికి అతీతమైన వారు మహాత్ములు, ఋషులు. అట్టి మహానుభావులు దర్శించి, మనకి తెలిపిన అనేక మంచి విషయాలని తెలుసుకొని ఆచరించడం మన విధి. శృతి, స్మృతి పురాణాల నుండి, వేదోపనిషత్తుల నుండి, అనేక విషయాలు గ్రహించి సంగ్రహంగా ఈ వ్యాసాలలో చెప్పడం జరిగింది. వీటిలోని మంచిని హంసక్షీరన్యాయంగా గ్రహించాలని మనవి.

జంతూనాం నరజన్మ దుర్లభం అన్నిజన్మలలోకి మానవ జన్మ లభించడం కష్టం. అట్టి మానవ జన్మ లభించడం, అది కూడా కర్మభూమి, వేదభూమి, పవిత్ర భూమి అయిన జంబూద్వీపంగా పిలవబడే భారతావనిలో జన్మించడం మన అదృష్టం.  

సప్త ద్వీపా వసుంధర.. అని భూమి ఏడు ద్వీపాలుగా ( సెవెన్ కాంటినేంట్స్) విభజింపబడినట్లు మన పూర్వీకులు ఎప్పుడో వివరించిరి. అవి  జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర. అనే పేర్లతో పిలిచేవారు. వీటిలో క్రౌంచ ద్వీపమే నేటి అగ్ర రాజ్యం అమెరికా .(యు ఎస్ ఏ) అని పండితాభిప్రాయం. ఇక భారతదేశ ప్రశస్తి మత్స్య,బ్రహ్మాండ అగ్ని పురాణాలలో కలదు.

పృధివ్యాం భారతం వర్షం/ కర్మభూమిరుదాహృతా/

కర్మణంఫల భూమిశ్చ/ స్వర్గంచ నరకం తధా  ఇంకా

కృష్ణ సారస్తు చరతి/ మృగో యత్ర స్వభావతః

అనగా భక్తి, ముక్తి ప్రదమైనది, కర్మ ఫలానుసారము స్వర్గాదులను నిర్ణయించేది, లేళ్ళు గుంపులు గుంపులుగా భయరహితంగా సంచరించుటకు తగినది, ఎచట చాతుర్వర్ణ్య వ్యవస్ధ కలదో, స్వర్గముకంటే మిన్నగా ఏదిభావింపబడుతోందో అదే భారత భూమి. కనుకనే “ లంకా విజయానంతరం స్వర్ణ మయమైన లంకను చూసిన లక్ష్మణుడు రామునితో .. అన్నా ఈలంకానగారాన్ని నువ్వే ఎందుకు పాలించకూడదు, అని కొంచం ఆశ పడిఅడుగగా,

రాముడు ఆపి స్వర్ణ మయి లంకా/ నమే లక్ష్మణ రోచతే

జననీ జన్మ భూమిశ్చ/ స్వర్గాదపి గరీయసి అనగా  

ఓ లక్ష్మణా! బంగారు మయమైన లంక నాకు ఇష్టము లేదు.ఎందుకనగా జననీ, జన్మభూమి స్వర్గ ముకన్నాగొప్పవి. అని భారతావనిని కీర్తిస్తాడు. ఈ సుభాషితం సకల మానవాళికి శిరోధార్యం. అంతేకాదు యస్య నిశ్వసితం వేదాః వేదేభ్యోఖిలం జగత్ భగవంతుని ఉచ్చ్వాశ నిశ్వాసాలనుండి వేదాలు పుట్టాయి, వేదాల నుండి సమస్త విశ్వం పుట్టింది అనగా వేదాలు విశ్వసృష్టిని చక్కగా వివరించాయి.  ఇట్టి వేదభూమిలో పుట్టిన మనం ఎలా ఉండాలో,ఎలాఉండ కూడదో అంటే, ఉదయం లేచింది మొదలు మన అలవాట్లు, ఆచార వ్యవహారాలూ అన్ని చక్కగా పురాణ గ్రంధాలు వివరించాయి. 

చూడండి.

గౌతమ ధర్మ సూత్రాలలో ఇలాఉంది. ఆచారాత్ లభతే ధర్మం అచారాదేవహి సుఖం

పెద్దలుచేప్పిన ఆచారాలను పాటించడమే మన ధర్మం. అదే సుఖాన్ని కలిగిస్తుంది.

 కొన్ని పరిశీలిద్దాం.

బ్రాహ్మే ముహూర్తే ఉత్తిష్టేత్ రక్షార్థం ఆయుషః ఇతి

తెల్లవారు ఝామునే లేవాలి. అలా లేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.

శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అని కాళిదాసు చెప్పినట్లు (ఇది కుమారసంభవం అనేకావ్యంలో శివుడు పార్వతితో చెప్పినసూక్తి.)  శరీరం ఆరోగ్యంగా ఉంటే  కదా ఏపనైనా చేయడానికి. కనుక ఆరోగ్య సూత్రాలని తప్పకుండా పాటించాలి.

చరక సంహితలో కూడా  జీవన్భద్రాణి పశ్యతి అని, శత సంవత్సరం దీర్ఘమాయు: అని ఉంది .ఆచారాలు పాటిస్తే నూరేళ్ళు సుఖంగా జీవించవచ్చు. ఇన్ని ప్రమాణాలు ఉన్నందున సూర్యోదయాత్ పూర్వమే తప్పక నిద్ర లేవాలి. లేచి, 

1 ధ్యానం. శాంత మనసో వినిద్రస్సతి విరోధేతత్ త్యక్త్వానోచేత్ తత్ర సంస్ధితః

నిద్ర లేచిన వెంటనే పవిత్ర స్ధలంలో కూర్చొని ప్రశాంతమైన మనసుతో భగవంతుని ధ్యానించాలి. సూర్యుడు పద్మాలను వికసింప చేసినట్లు, మన హృదయ పద్మం వికసించే విధంగా ధ్యానం చేయాలి. ఎందుకంటే మన హృదయపద్మంలో భగవంతుడు ఉంటాడు.  నాభ్యముపరి తిష్టతి నాభికి  12 అంగుళాల పైన, కంఠం క్రింద హృదయం ఉంటుంది అని చెప్పి, పద్మకోశ ప్రతీకాశాగం హృదయంచాప్యధో ముఖం.. అట్టి హృదయ కుహరంలో స్వామి ఉంటాడు. నిద్ర లేచిన వెంటనే ఆ స్వామిని ధ్యానిస్తే ఆ రోజంతా హాయిగా ప్రశాంతంగా గడుస్తుంది. 

3. దంతధావనం. ఈ రోజుల్లో అనేకరకాల పేష్ట్ లువాడుతూ బ్రష్ చేసుకొంటున్నాము. అలాగే డెంటిష్టుల వద్దకి కూడా తరచూ వెళ్తున్నాము. పూర్వకాలం దంతాల విషయంలో కూడా ఎన్ని జాగర్తలు తీసుకోనేవారో గౌతమ ధర్మ సూత్రాలు వివరిస్తాయి. దంత కాష్టం సమంచ్చిన్నం తిక్తం, కషాయం, కటుం, సుగంధం, ప్రాజ్ఞ్ముఖో దంత ధావనం కుర్యాత్. కొంచెం చేదు, కొంచెంవగరు, కొంచెంగట్టిగా, సువాసన కలిగి, ఔషధయుక్తమైన చెట్టు పుల్లని గ్రహించి తూర్పు ముఖంగా ఉండి దంతధావనం చేస్తే దంతాలు గట్టిగా శాశ్వతముగా ఉంటాయి. (ఆయుర్వేద వన మూలికలతో తయారుచేసిన పేష్టుల, పౌడర్ల ప్రకటనలు చాల చూస్తున్నాము కదా!) పై నియమాల వల్ల మనతాతల, బామ్మల పళ్ళు ఇప్పటికి గట్టిగా ఉన్నాయి.

4. స్నానం.-- తొట్టి ( టబ్) స్నానం, ఆవిరిస్నానం, (స్టీం బాత్) నీటితుంపర్లస్నానం, (షవర్ బాత్ ) తలంటుస్నానం, (ఒంటికి,తలకి నూనె రాసుకొని, కుంకుడుకాయలు,లేదా శీకాయతో వారానికి ఒకసారి లేక పండుగారోజులలో చేసే స్నానం. (ఇదే ఆయిల్ బాత్.) ఇలా ఈరోజుల్లో అనేకరకాల స్నానాలు చేస్తున్నాం. మరి ప్రాచీన కాలస్నానాలు, వాటి ప్రయోజనాలు పరిశీలిద్దాం.---

                   “దీపనం కృష్యమాయుష్యం/ స్నాన మూర్జా బలప్రదం/

                   కండూమల స్వేద తన్ద్రా” ------- 

అనగా- “స్నానంవల్ల  మలినాలు కడుగబడి, దురదలు, చెమటవాసనా పోయి. శరీరం కాంతివంతమై బలం చేకూరి,ఆరోగ్యవంతముగా ఉండును.” అని స్నానానికి గల ప్రయోజనం వివరించి, రకరకాల స్నానాలనుగూర్చి “గౌతమ ధర్మ సూత్రాలు. పరాశర సంహిత”లలో ఇలా తెలుప బడింది.

                        “ నిత్యం,నైమిత్తికం, కామ్యం/ క్రియాంగం మలకర్షణం/

                          క్రియా స్నానం తధా షష్ఠం/ --- స్నానం ప్రకీర్తితం.”

అనగా ఆరు విధాలైన స్నానాలు వివరించిరి. అవి.----

 1) నిత్య స్నానం:--- పరిశుభ్రతకు, జపతపాదులకు, పూజాదికాలకు రోజూచేసే స్నానం. నిత్యస్నానం.

 2) నైమిత్తికం- తాక కూడనివి తాకినపుడు, శవవాహకత్వం చేసినపుడు, శ్మశానానికి వెళ్ళివచ్చినపిదప,

 పురిటిమైల, చావుమైల పోవడానికి చేసేస్నానం “నైమిత్తికం”

 3) కామ్యం---   పండుగ రోజులలో, విశేష పూజలు, వ్రతాలప్పుడు చేసేస్నానం “కామ్యం”

 4) క్రియాంగం--  యజ్ఞ, యాగాదులలో, వివాహాది శుభకార్యాలలో చేసే విశేష స్నానం “క్రియాంగం”

 5) మలాపకర్షణం--- ఒంటికి మట్టి,బురద లేదా మలినాలు అంటుకొన్నపుడు వాటిని పోగొట్టుకోందుకు చేసే స్నానం “మలాపకర్షణం”

 6) క్రియాస్నానం--- తీర్థ క్షేత్రాలందు, పుణ్య నదులలో చేసేస్నానం “క్రియాస్నానం”

చూసారా వివిధ స్నానాలనుగూర్చి “సంహితలు,సూత్రాలు” ఎంతబాగా వివరించాయో! ఇంక వస్త్ర ధారణ.

  వస్త్ర ధారణ—“పరాశర సంహిత”లో ఎట్టి వస్త్రాలు ధరించాలో, ఎట్టివి ధరించ కూడదో వివరించ బడింది.

“ శ్వేతం, ధౌతం వస్త్రం దారాయేత్. రక్తం, నీలం,మలినం వర్జయేత్”  స్నానానంతరం తెల్లని, పరిశుభ్రమైన

వస్త్రాలు ధరించాలి. నలుపువి, మలినమైనవి ధరించకూడదు. వస్త్ర ధారణ శరీరాచ్చాదన కోసమే కాక, మన వ్యక్తిత్వానికి, గౌరవ,మర్యాదలకు చిహ్నం. కనుక మంచి వస్త్రాలు ధరించాలి.

( ఇంకా ఉంది )

 
 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech