Sujanaranjani
           
  సారస్వతం  
 

                                                          రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ

 

శకుంతల (పద్యకావ్యం) - 12     ప్రథమాశ్వాసం          

 

 

పిదప అనసూయయును ప్రియంవదయు ముదిని 

సఖిని జూచుచు సోదరీ! సత్కృతిగొని

అతిథిచే ధన్యురాలవై యలరుచుండ

నీకు లభియించె ననుమతి నిష్క్రమణకు.             96 

వ్యాఖ్యానం: అప్పుడు అనసూయాప్రియంవదలు ఎంతో సంతోషంతో శకుంతలను చూచి-`ఓ సోదరీ! అతిథిగా వచ్చిన ఈ మాన్యుని చేత సత్కారాన్ని పొంది  నీవు ధన్యురాలవైనావు. ఇప్పుడు నీకు అనుమతి లభించింది కనుక ఇక ఇక్కడి నుండి నీవు వెళ్ళిపోవచ్చు ' అని పలికారు. 

పిదప ముందుకు కదలక మెదలకున్న

చెలిని పరికించి జాగేల? చేరుకొనుము

వేగముగ కుటీరమునకు ప్రీతిననుచు

పలుకు ప్రియవదతో శకుంతల వచించె.                97 

వ్యాఖ్యానం: అలా ఆ చెలులు పలికినప్పటికీ కదలక అక్కడే నిలబడి ఉన్న శకుంతలను చూచి ఓ చెలీ! ఇంకా ఆలస్యం ఎందుకు? వేగంగా వెళ్ళి కుటీరానికి చేరుకో! అని ఆ చెలులు పలికారు. 

చెలి! నా ఇచ్చకు వచ్చు తీరు నడువన్ చేరంగ నెంతున్ సదా

కులనై తావకశాసనోక్తి వినగా కొంతైన నిచ్చన్ వడన్

తెలుపన్ నేరకు మిట్లు నా గమనమున్ దీప్తామితోత్సాహతన్

చలియింతున్ సమభీప్సితస్థలములన్ సర్వస్వతంత్రాత్మనై           98 

వ్యాఖ్యానం: ఓ చెలీ! నా ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటానే గాని నీ ఆదేశాలను పాటించడానికి ఎప్పుడూ ఇష్టపడను. ఇలా నన్ను నీవు ఆదేశించడం తగదు. నా ఇచ్చకు వచ్చిన చోటికి సర్వస్వాతంత్ర్యురాలనై వెళ్ళగలను అని శకుంతల ఆ చెలులతో ఖండితంగా చెప్పింది.(ఇక్కడ ఇద్దరు చెలులను ఏకవచనంతో శకుంతల సంబోధించడం ఆ చెలులు ఇద్దరైనా వారి ఆత్మలు ఒక్కటే అని ధ్వనింపజేయడం కోసమె అని గుర్తించాలి).  

అనెడి పల్కుల విని రాజు నాత్మలోన

సంశయించెను మునికన్య సానురాగ

దృష్టి పరికించి ఈమె నన్నిష్టపడునొ?

లేక నిర్దయతోడ పరీక్షనిడునొ?                  99 

వ్యాఖ్యానం: అలా శకుంతల ఎంతో కటువుగా ఆ చెలులతో సమాధనం చెప్పగానే దుష్యంతుడు కొంత సందేహించాడు. ఈ శకుంతల నా పట్ల సుముఖంగా ఉందో లేదో తెలియదు ఈమె నన్ను ఇష్టపడుతుందో లేక తిరస్కరిస్తుందో ఊహించలేకున్నాను. నాకు ఈమె ఎలాంటి పరీక్ష పెడుతుందో? 

నా పరిభాషణమ్ములననారతమున్ శ్రవణించు ప్రీతితో

నోపిక తోడ నిల్చుచు వినోదమునొందును ప్రేమదృష్టితో

నా పరిముఖ్యయై నిలువ నా ముఖవీక్షణసేయ నోపదీ

ఖ్యాపితలజ్జితాత్మ సరిగాంచిన నా యెడ ప్రెమ తోచెడిన్.           100 

వ్యాఖ్యానం: ఈ శకుంతల నా సంభాషణలను నిరంతరం ప్రీతితో వింటోంది. ఓపికతో నిలబడి ప్రేమదృస్టితో నన్ను చూస్తూ నాపై అనురాగాన్ని ప్రకటిస్తోంది. నా ఎదురుగా నిలువడానికి గానీ, నా ముఖాన్ని నేరుగా చూడడానికి గానీ సిగ్గుపడుతోంది. ఈమె లోని లజ్జ ప్రకతితం అయింది.చక్కగా ఆలోచిస్తే ఈమెకు నా పట్ల ప్రేమ ఉన్నదని స్పష్టమౌతోంది. 

అనుచు పరవశమొందెడి యమలతేజు

రాజు సన్నిధి కేతెంచి రాజసైన్య

రక్షకులు పల్కిరిట్లు సంరక్షకనృప

పుంగవునితోడ గౌరవబుద్ధి నిలిచి.            101 

వ్యాఖ్యానం:  అలా ఆ దుష్యంతుడు శకుంతలావిషయంలో పారవశ్యాన్ని పొందుతూ ఆనందిస్తున్న సమయంలో కొందరు రాజసైనికులు అక్కడికి వచ్చి తమ రక్షకుడైన రాజుతో వినయంగా ఇలా విన్నవించుకున్నారు.

విక్రమసంహ! మత్తగజభీతిని యాశ్రమవాసులెల్ల యా

గక్రియలన్ విధానముగ గాంచగలేక యథేష్టదిక్కులన్

వక్రత బారుచుండిరి విపన్నుల వోలిక గాన నీదు శౌ

ర్యక్రమమున్ వెలార్చి జనితాశ్రమబాధను ద్రోల మేలగున్.           102 

వ్యాఖ్యానం: ఓ సింహసదృశపరాక్రమశాలీ! మహారాజా! ఈ కణ్వాశ్రమంలోనికి ఒక మదించిన యేనుగు ప్రవేశించి ఆశ్రమవాసులను వెంటాడుతూ భయ భ్రాంతులకు గురి చేస్తోంది. మునులు ఆ మదగజభయంతో యాగాలను  చేయడం మాని తలా ఒక దిక్కుకు పారిపోయారు.  కనుక మీరు ఆ మదగజాన్ని పారద్రోలి ఆపదలో ఉన్న ఈ మునివాటికను  రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని సైనికులు రాజుతో విన్నవించుకున్నారు.

అనిన సైనిక వాక్యములాలకించి

తత్క్షణంబున ధనువును దాల్చి చేత

నిష్క్రమించుచు పలికెను నిలిపి చెలుల

సాదరోచితవాజ్మయాసక్తి నిటుల .                     103 

వ్యాఖ్యానం: ఇలా ఆ సైనికులు విన్నవించగానే ఆ రాజు వెంటనే ధనుస్సును చేటబూని మదగజాన్ని తరిమికొట్టడానికి ఉద్యమించినవాడై, చెలులతో సాదరంగా ఇలా అన్నాడు. 

వరకన్యామణులార! మీకగును నా భద్రాత్మకాశాసముల్

త్వర నేబోయెద నాశ్రమవ్యధ గనన్ తాపమ్ము పోగొట్టగన్

చిరమిచ్చోటను నిల్వకుండ జనుడీ సిద్ధాశ్రమంబందు మీ

స్థిరవాసంబును లేనిచో విపదముల్ సిద్ధించు నిచ్చోటులన్.        104 

వ్యాఖ్యానం: ఓ మునికన్యలారా! మీకు నా శుభాభినందనలు. వెంటనే నేను వెళ్ళి ఆశ్రమానికి బాధను కలిగిస్తున్న ఆ మదగజాన్ని నిలువరిస్తాను. మునులకు కలిగిన బాధను దూరం చేస్తాను. మీరు కూడా ఇక్కడ ఉండడం క్షేమం కాదు. మీ సురక్షిత నివాసాలకు వెళ్ళిపోండి.  లేకుంటే ఆ మత్తేభం వల్ల మీకూ బాధలు కలుగవచ్చు అని రాజు ఆ చెలులతో అన్నాడు. 

అనిన దుష్యంతవాక్యము లమిత దీక్ష

వినిన యా కన్యకాతతి వేగవేగ

జనియె నావాసకుటులకు జాగులేక

రాజు వెడలుచు తలపోసె రక్తి నిటుల.               105 

వ్యాఖ్యానం: ఇలా దుష్యంతుడు హెచ్చరించగానే ఆ మాటలు విని ఆ చెలులు  వేగవేగంగా తమ నివాసాలకు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయారు.  అప్పుడు రాజు తానూ నిష్క్రమిస్తూ మనస్సులో ఇలా అనుకొన్నాడు. 

నేనును నిష్క్రమించెదను నిర్జనమౌనిట నుండి గాని కా

లూనదు రాజవాసమున కుత్సుకతన్ గమియింప నేడు నా

మౌనిసుతావిలాసమును మానసమందు దలంచుచుండగా

పూనదు దేనియందయిన బుద్ధి యొకింతయు కామనేచ్చతో!             106 

వ్యాఖ్యానం: అందరూ వెళ్ళిపోయారు. ఇక నేను కూడా ఈ నిర్జనవనం నుండి నిష్క్రమించి ఆ మదగజాన్ని ఎదుర్కొంటాను. కానీ ఈ వనం నుండి నా రాజభవనానికి వెళ్ళాలంటే ఎందుకో మనస్సు అంగీకరించడం లేదు. ముని సుత అయిన శకుంతలనూ, ఆమె రూపవిలాసాన్నీ తలచుకొంటూ ఉంటేనే నా మనస్సు దేనిలోనూ నిలవడం లేదు.మన్మథబాధతో నా  శరీరం నా మాట విండం లేదు. 

తనువు తరలుచు నున్నది ధరణి గాని

మనసు మరలుచు నున్నది వెనుక దిశకు

రథపతాకము వలె ప్రతిపథము వంక

తిరిగి రెపరెపలాడును పరవశమున.                  107. 

వ్యాఖ్యానం:  నా శరీరం భూమిపై ముందుకు సాగిపోతోంది గాని,మనస్సు మాత్రం శకుంతల కోసం వెనుకకే మరలిపోతోంది.రథం ముందుకు కదులుతుంటే ఆ రథంపై ఉన్న జెండాకు కట్టిన వస్త్రం రెపరెపలాడుతూ వెనుక వైపునకు చూచినట్లు నా మనస్సు వెనుదిరిగి చూస్తోంది.                    

 

అయాచితం నటేశ్వర శర్మ రచించిన శకుంతల పద్య కావ్యములో

ప్రథమాశ్వాసము సంపూర్ణము.

-(సశేషం)

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 
 



సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

   

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech