Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 1

యాజ్ఞసేని

 

                                                                                 - సమీక్షకులు ; వడ్లమాని మణి

 

 

 
 

సాహితీ  అభిమానులందరికి నేను చదివిన ఒక గొప్ప అనువాద నవల యాజ్ఞసేనిని గురుంచి మీతో పంచుకోవాలనే ఒక చిన్న తాపత్రయంతో రాసిన నా ఈ పఠనానుభావం మీ ముందు ఆవిష్కరిస్తున్నాను.

తన మాతృభాష ఒరియాలో యాజ్ఞసేనిని రచించిన శ్రీమతి ప్రతిభ రాయ్  చాలా గొప్ప రచయత్రి. మనస్తత్వవేత్త కూడా అయిన శ్రీమతి ప్రతిభ రాయ్ ఈ నవలని 1984  లో రచించారు. దీనికిగాను ఆవిడ చాలా ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు.  యాజ్ఞసేనిని చాలా బాషలలోకి అనువదించారు కూడా.(Yajnaseni, 1984 (Moorti Devi Award,1991 and Sarala Award, 1990) Tr. to English, Hindi, Malayalam, Marathi, Assamese, Bengali, Gujarati, Hungerian).

ఒక స్త్రీ గురుంచి ఒక స్త్రీ రచించి ఇంకొక స్త్రీ అనువదించిన నవల అని ఈ నవల ని అనువదించిన శ్రీమతి జయశ్రీ మోహన్ రాజ్ తన ముందు మాటలో రాసారు. తెలుగులో ఈ నవల 2008 లో ఎమెస్కోబుక్స్ ద్వారా ప్రచురింపబడింది. శ్రీమతి ప్రతిభ రాయ్ మూలంలో ఎంత బాగా రాసారో అంతే స్థాయిలో నేను రాయడానికి ప్రయత్నం చేశాను అని అంటారు జయశ్రీమోహన్ రాజ్. నిజంగా ఒక అనువాదం ఇంత బాగుంటుందా అని అనుకోవడానికి ఈ నవలే ఒక తార్కాణం. ఆమె వాడిన భాష మరియు పదాల కూర్పు ఎంతో బాగుంది. మన తెలుగుబాష ఎంత సుందరముగావుందో యాజ్ఞసేనిని చదివితే అర్ధమవుతుంది. రచయత్రి నిజంగా అభినందనీయురాలు.

ఇంక కధలోకి వెళితే ఒక లేఖ ముగింపుతో ప్రారంభం అవుతుంది. అది కృష్ణ (ఈ నవల మొత్తం ద్రౌపది దేవిని ఈ పేరుతోనే సంబోధిస్తారు) శ్రీకృష్ణునికి రాసినది. అంటే ఒక జీవాత్మ పరమాత్మతో చెప్పుకున్నట్లుగా, తన జీవితచరిత్రను మృత్యుముఖంలో  కూర్చొని రాసినట్లుగా, నీవు  అంతర్యామివి  నీకు తెలిసినవే నా నోటితో నీకు విన్నవించుకుంటున్నాను అని యాజ్ఞసేని తన పుట్టుక అంటే  యజ్ఞకుండం నుంచి ఆవిర్భావించడం, తన స్వయంవరంలో అర్జునుడుని వరించడం, అంతకుముందే శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కలగడం, అప్పటినుంచే ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు అవడం, స్వయంవరంలో కర్ణుని కులప్రసక్తితో తన అన్నగారు అవమానపరచడం, దానికి ద్రౌపదిదేవి నోచ్చుకోవడం, ఒక మహానుభావుడుకి తన మూలంగా పరాభవం జరగడం ఆమెని కలచివేస్తుంది.

తరువాత పాండురాజు పుత్రుల ఐదుగురితో వివాహం, లోకంలో ఎక్కడా లేకపోయినా నీ విషయంలో అది ధర్మసమ్మతమే అని పెద్దలు చెప్పడంతో ఆమె విధికి, ధర్మానికి తలవంచడం జరుగుతుంది. ఒక రోజున ధర్మరాజుతో ఏకాంతంలో వున్నప్పడు ఏర్పరుచుకున్న నియమాన్ని అతిక్రమించి, అర్జునుడు వారి మధ్యకి అనివార్యపరిస్థితిలో వెళతాడు. ఆ అతిక్రమణ ఫలితం అనుభవించడం కోసం తీర్థయాత్రలుకు వెళ్లడం, తరువాత శ్రీకృష్ణుని సోదరి సుభద్రతో పరిణయం జరగి, ఆమెని ఇంటికి తోడ్కొనివచ్చినప్పుడు, ద్రౌపదిదేవి లోని ఆడమనసు రగిలి పోవడం, రాజసూయ యాగం జరిగిన తరువాత వెనువెంటనే హస్తినకివెళ్లడం, జూదంలో పతులు సర్వం కోల్పోవడం, ఆఖరికి తనని కూడా పణంగా పెట్టడం, ఆమె సహించలేక పోతుంది. నిండుసభలో అందరు చూస్తుండగా ఒక కులసతికి వస్త్రాపహరణం అవమానం జరుగుతుంటే ఒక్కరు కూడా నివారించలేరా అని దుఃఖిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడుని శరణు వేడుతుంది. అరణ్యవాసం సమయంలో ఇంటి ఆడపడుచు అయిన దుశ్శల భర్త (జయద్రధుడు) ఆమెని అవమానం చేయడం మరింత బాధను కలిగిస్తుంది. ఇంక అఙ్ఞాతవాసంలో కీచకుడి దురాగతం ఇలా ఆమె ప్రతిచోట అవమానాలును ఎదుర్కోవడం కృష్ణ కి అంతులేని వేదనను కలిగిస్తుంది.

తరువాత మహాసంగ్రామం జరుగుతుంది; కురువంశము నాశనం అవుతుంది. పాండవులు రాజ్యమేలుతారు. ద్రౌపదిదేవికి ఐదుగురు పుత్రులు కల్గుతారు. అక్కడ ద్వారకలో సాంబుడు మూలముగా మునిశాపము తగిలి యాదవవంశం నాశనమవుతుంది. కృష్ణుడు పరిత్యాగం చేస్తున్నాడని తెలిసి, ధర్మరాజు తమ్ములతో ద్రౌపదిదేవితో సహా మహాప్రస్థానం సాగిస్తాడు. ఆ స్వర్గారోహణ సమయం లో ఆమె అందరికన్నా ముందు పడిపోతుంది. అప్పడు మిగతావారు అయ్యో ద్రౌపది పడిపోయింది అంటే, యుధిష్టరుడు వెనుతిరగకుండా రండి అని తమ్ములను ఆదేశిస్తాడు. అదివిన్న యాజ్ఞసేని రోదిస్తుంది. ఇన్నిరోజులుగా వీరి సహచరినే ఇంత కూడా కనికరం లేదా నా పతులుకు అని ఆవేదనతో తనలాంటి జీవితం ప్రపంచంలో ఏ స్త్రీకి వుండరాదు అని తలచి, యజ్ఞకుండం నుంచి ఆవిర్భావించినప్పటి నుంచి మహాప్రస్థానం వరకు ఆమె అనుభవాలు, ఆమె అంతరంగం, ఆమె ఆవేదన, ఆమె కోపం ,ఆమె నిస్సయహత ఆమె వ్యధ  అన్ని వివరంగా  విపులంగా సఖునికి అంటే శ్రీకృష్ణుని ముందువుంచుతుంది

ఆమె లేఖలో ఇలా అంటుంది కృష్ణుడుతో నేను ఐదుగురు భర్తలు గల స్త్రీగా ద్వాపర యుగంలో కీర్తేగడించానో లేదా ఎన్నో అవమానల పాలే అయ్యానో గాని అంతకంటే ఘోరంగా రాబోయే కాలంలో అదే కలికాలం లో ఓహో ద్రౌపదా! అని అందరిచేత అపహాస్యం చేయబడి ఒక కళంకితలాగా, ఒక దోషిలాగా నిలిచిపోతాను. ఓ కృష్ణా నీవు భగవత్స్వరూపడవు. నీ ఇచ్చానుసారం జరిగిన కధలో ద్రౌపది అన్న పాత్ర నీవు సృష్టించినదే కదా, ఈ నిందా ప్రసంశలలో నీకు కూడా భాగం లేదా? అని, నా హృదయానికి తగిలిన గాయాలతో పవిత్రమైన ఈ హిమాలయాలలోంచి నా జీవితచరిత్ర రాస్తున్నాను. మళ్ళి నీవు ఎప్పుడో ఈ లోకకళ్యాణానికి ఇదే పవిత్రమైన హిమలయాలలో అవతరిస్తావు. ఆరోజున నువ్వు నా ఈ ద్రౌపది ఆత్మ కధను చదవాలి. ఔరా! ఇది కదా, నా భక్తురాలు, నా ప్రియ సఖి కృష్ణ. నా ఇష్టసఖుడయిన అర్జునడి భార్య యొక్క జీవితం అని నువ్వు అనాలని ఆశ. నాకు తెలుసు మాయ అదే నువ్వు నాకోసం పంపిన నా చెలి, నా వివాహం జరిగినప్పటినుంచి ఈ గంగద్వారం (మాయాపురి) చేరేవరకు నాతోనే గడిపిన మాయామోహిని నీ మాయే కదా. నాకు ఇప్పడు అర్ధమయింది. ఇన్ని రోజులు ఈ మాయ నన్ను బంధించి వుంచింది. శ్రీకృష్ణా ! నువ్వే నాకు దుఃఖాన్ని ప్రసాదిస్తున్నావు ఇది నీకు న్యాయమా? అని ప్రశ్నిస్తుంది.

ఆఖరిగా ద్రౌపదిదేవి, ఇలా అంటుంది సఖా పంచపతుల నాయకిని, పాంచాల దేశ రాజకన్యను, పంచపుత్రులకు తల్లిని, నేను పాంచాలిని, నా ఈ పాంచభౌతిక దేహాన్ని ఐదు కోరికలతో ముగిస్తాను.

మొదటిగా హే కృష్ణ! నాజీవితంలో జరిగినట్లు ప్రపంచంలో ఏ స్త్రీకి జరగకూడదు, ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కుమంది పతులను ఇవ్వద్దు.

రెండవది శత్రువులకు కూడా పుత్రశోకం కలుగనీయకు.

మూడవది నిండుసభలో నాకు జరిగిన అవమానం, పరాభవం ప్రపంచంలో ఎవరికి జరగనీయకు.

నాల్గవది ప్రపంచంలో ఎన్ని వైషమ్యాలు వున్నా యుద్ధాలు మాత్రం జరగనీయకు.

ఐదవ కోరిక నాకు పునర్జన్మను ప్రసాదించు. ఆశ్చర్యపోతున్నావా ? ఇదేమిటి మోక్షం గాని, ముక్తి గానీ కోరకుండా పునర్జన్మ అడుగుతునన్నాని. నువ్వు జన్మించిన ఈ పవిత్ర భారతదేశంలో ఇక్కడే నేను కూడా కృష్ణ ప్రేమికగా, విశ్వప్రేమికగా, కృష్ణభక్తురాలిగా జన్మించాలి. ఇదే నా ఆఖరి కోరిక .

నేను శూన్యంలో సంపూర్ణత చెందాను. శూన్యతే సంపూర్ణం అని తెలుసుకున్నాను.

శెలవు! అంతా మోహన వంశీరవం. అంతా కృష్ణమయం.

ఈ ఘట్టాన్ని రచయత్రి ఎంత చక్కగా వర్ణన చేసారో కదా అనిపించింది. అలాగే ద్రౌపదిదేవి చేత ఇలా అనిపిస్తారు నాకు తెలుసు కృష్ణా ఏదో ఒకరోజు ఈ విశ్వమంతా కృష్ణచైతన్యం వ్యాపించి ప్రపంచమంతా శాంతి మైత్రి మార్గాలను చూపుతుంది. నీ వేణుగానం, నీ వంశీరవం విశ్వమంతటా ప్రతిధ్వనిస్తుంది.

కృష్ణ! ద్రౌపదీదేవి! ద్వాపరయుగములో ఒక అసామాన్యమైన, శక్తివంతమైన స్త్రీ. ఒక మహారాజుపుత్రిక, ఐదుగురు మహావీరులకు భార్య అయిన ఆమెను గురుంచి అనాలోచిత వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం అనిఒక సాధరణ స్త్రీగా కృష్ణ (ద్రౌపది) మనోగతం ఎలావుంటుందో అని ప్రయత్నం చేసినట్లు రచయత్రి (శ్రీమతి ప్రతిభ రాయ్) అంటారు.

ఈ నవల  చదువుతూ వుంటే నిజంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి. ద్రౌపదిదేవి మానసికంగా ఎంత వేదన అనుభవించిదో, ఎన్ని అవమానాలును ఎదుర్కుందో కదా అని అనిపిస్తుంది. ఆ మహాదేవి యాజ్ఞసేని గురించి, ఆమె అంతిమ ప్రార్ధన గురించి ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు.

ఒక విదుషీమణి, ఒక మహాభక్తురాలి అంతరంగం గురుంచిన ఈ నవల అందరూ చదవతగ్గ మంచి పుస్తకం.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech